సత్యశోధన/నాల్గవభాగం/18. ఒక పుస్తకపు అద్భుత ప్రభావం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

18. ఒక పుస్తకపు అద్భుత ప్రభావం

ఈ ప్లేగు వ్యాధి బీదవారైన హిందూదేశస్థుల్ని గురించి నా పనిని, నా వృత్తిని, నా బాధ్యతను బాగా పెంచివేసింది. యూరోపియన్లతో నాకు పరిచయం బాగా పెరగడమే గాక వారి యెడ నా నైతిక బాధ్యత కూడా బాగా పెరిగింది. మాంసరహిత భోజనశాలలో వెస్ట్‌దొరతో నాకు పరిచయం అయినట్లే పోలక్‌తో కూడా పరిచయం అయింది. ఒకరోజు నేను బల్ల దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాను. దూరంగా వున్న ఒక బల్ల దగ్గర కూర్చొని ఒక యువకుడు భోజనం చేస్తున్నాడు. “మిమ్ము కలుసుకోవాలని అనుకుంటున్నాను, అనుమతి ఇస్తారా” అని చీటీ వ్రాసి పంపించాడు. ఆయనను నా బల్లదగ్గరకు రమ్మన్నాను. ఆయన వచ్చాడు.

“నేను క్రిటిక్ అను పత్రికకు ఉపసంపాదకుణ్ణి. ప్లేగును గురించి మీరు ప్రకటించిన జాబు చదివాను. అప్పటి నుండి మిమ్ము కలుసుకోవాలని అనుకుంటున్నాను. నా ఆ కోరిక ఈనాడు నెరవేరింది.” అని అన్నాడు.

మి. పోలక్ యొక్క నిష్కపట భావాలవల్ల నేను ఆయన యెడ ఆకర్షితుడనయ్యాను. ఆ రాత్రి మేమిద్దరం ఒకరికొకరం బాగా పరిచితులమయ్యాం. మా జీవిత విధానాల్లో సామ్యం కనబడింది. సాదా జీవనం వారికి ఇష్టం. బుద్ధి అంగీకరించిన విషయాల్ని వెంటనే అమలు పరచాలన్న తపన ఆయనలో అధికంగా కనబడింది. తన జీవనంలో చాలా మార్పులు వెంటనే చేసిన వ్యక్తి మి. పోలక్.

“ఇండియన్ ఒపీనియన్” ఖర్చు పెరిగిపోతున్నది. వెస్ట్ పంపిన మొదటి రిపోర్టు చదివి నివ్వెరపోయాను. “మీరు చెప్పినంత లాభం యిక్కడ కనబడలేదు. నష్టం కనబడుతున్న లెక్కలు కూడా అస్తవ్యస్తంగా వున్నాయి. పని అయితే బాగానే వున్నది. కాని దానికి తలా తోకా కనబడటం లేదు. మార్పు చేయవలసిన అవసరం ఎంతైనా వున్నది. ఈ రిపోర్టు చూచి గాబరా పడకండి. నాకు చేతనైనంత వరకు వ్యవస్థను సరిచేస్తాను. లాభం లేదని నేను పని మానను” అని జాబు వ్రాశాడు.

లాభం లేనందున వెస్ట్ తలుచుకుంటే పని మానివేసేవాడే. ఆయనను తప్పు పట్టడానికి కూడా వీలులేదు. సరియైన వివరాలు తెలుసుకోకుండా లాభం వస్తున్నదని చెప్పినందుకు నన్ను తప్పు పట్టవచ్చు కూడా. అయినా ఆయన నన్ను ఎన్నడూ ఒక కటువైన మాటకూడా అనలేదు. చెప్పుడు మాటలు నమ్మేవాడినని నన్ను గురించి వెస్ట్ భావించి వుంటాడని అనుకున్నాను. మదనజీత్ మాట ప్రకారం నేను లాభం వస్తున్నదని వెస్ట్‌కు చెప్పాను. సార్వజనిక పనులు చేసేవారు స్వయంగా పరిశీలించి చూడనిదే ఒకరిని నమ్మి వెంటనే నిర్ణయానికి రాకూడదని పాఠం నేర్చుకున్నాను. సత్యపూజారి ఇంకా జాగ్రత్తగా వుండాలి. పూర్తిగా నిర్ణయానికి రానిదే ఏదో మాట చెప్పి ఒకరి మనస్సును నమ్మేలా చేయడం సత్యాన్ని మరుగుపరచడమే. ఈ విషయం తెలిసియుండి కూడా త్వరగా నమ్మి పనిచేసే నా స్వభావాన్ని పూర్తిగా మార్చుకోజాలనందుకు విచారపడ్డాను. ఇందుకు కారణం శక్తి సామర్థ్యం కంటే మించి పని చేద్దామనే లోభమే. ఈ లోభం వల్ల నేను కష్టపడవలసి వచ్చింది. అంతేగాక నా సహచరులు ఎంతో ఇబ్బందులకు లోనుకావలసి వచ్చింది.

వెస్ట్ వ్రాసిన జాబు చూచి నేను నేటాలుకు బయలుదేరాను. పోలక్ నా విషయాలన్నీ గ్రహించాడు. నన్ను సాగనంపుటకు స్టేషనుకు వచ్చాడు. ఒక పుస్తకం నాకిచ్చి “ఈ పుస్తకం చదువతగింది. చదవండి. మీకు నచ్చుతుంది” అని అన్నాడు. పుస్తకం పేరు “అంటు దిస్ లాస్ట్” రస్కిన్ రాసిన పుస్తకం. ఆ పుస్తకం చదవడం ప్రారంభించాను. చివరివరకు దాన్ని వదలలేకపోయాను. నన్ను ఆ పుస్తకం ఆకట్టివేసింది. జోహన్సుబర్గు నుండి నేటాలుకు 24 గంటల ప్రయాణం. సాయంత్రం రైలు డర్బను చేరుకుంది. స్థావరం చేరిన తరువాత ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. పుస్తకంలో చదివిన విషయాల్ని ఆచరణలో పెట్టాలనే నిర్ణయానికి వచ్చాను.

ఇంతకు ముందు రస్కిన్ పుస్తకాలు ఏవీ నేను చదవలేదు. స్కూల్లో చదువుకునే రోజుల్లో పాఠ్య పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు నేను అసలు చదవలేదనే చెప్పవచ్చు. కర్మభూమి మీద అడుగు పెట్టిన తరువాత సమయం చిక్కలేదు. అందువల్ల ఈనాటి వరకు నాకుగల పుస్తక జ్ఞానం తక్కువేనని చెప్పక తప్పదు. అయాచితంగా తప్పనిసరి అయి ఏర్పడిన ఈ సంయమం వల్ల నష్టం కలగలేదని చెప్పలేను. కాని చదివిన కొద్ది పుస్తకాలను ఒంట పట్టించుకున్నానని మాత్రం చెప్పగలను. నా జీవితంలో చదివిన తక్షణం మహత్తరమైన నిర్మాణాత్మక మైన మార్పు తెచ్చిన పుస్తకం ఇదేనని మాత్రం చెప్పగలను. తరువాత దాన్ని నేను అనువదించాను. సర్వోదయం అను పేరట ఆ పుస్తకం అచ్చు అయింది.

నాలో లోతుగా పాతుకుపోయిన విషయాల ప్రతిబింబం స్పష్టంగా రస్కిన్ రచించిన ఈ గ్రంథరత్నంలో నాకు కనబడింది. అందువల్ల ఈ పుస్తక ప్రభావం నా హృదయం మీద అపరిమితంగా పడింది. ఆ పుస్తకమందలి విషయాల్ని ఆచరణలో పెట్టాలని ప్రేరణ కలిగింది. మనలో నిద్రావస్థలో వున్న మంచి భావాలను, గుణాలను మేల్కొలపగల శక్తి కలవాడే కవి. కవుల ప్రభావం సర్వుల మీద పడదు. సర్వులలో మంచి భావాలు సమాన పరిమాణంలో వుండకపోవడమే అందుకు కారణం. నేను తెలుసుకున్న సర్వోదయ సిద్ధాంతాలు ఇవి.

  1. సర్వుల మంచి యందే తన మంచి ఇమిడి ఉన్నది.
  2. వకీలు, క్షురకుడు ఇద్దరి వృత్తికి విలువ ఒకటిగానే ఉండాలి. జీవనోపాధి హక్కు అందరికీ సమానమే.
  3. నిరాడంబరంగా వుంటూ కష్టపడి పనిచేసే రైతు జీవనమే నిజమైన జీవనం.

మొదటి విషయం నాకు తెలును. రెండో విషయం కొంచెం తెలుసుకుంటున్నాను. మూడో విషయాన్ని నేను ఎన్నడూ ఊహించలేదు. మొదటి దానిలో మిగతా రెండూ ఇమిడి వున్నాయి. ఈ విషయం దీపం వలె వెలుగు ప్రసారం చేసి సర్వోదయాన్ని నాకు బోధ చేసింది. తెల్లవారింది. ఇక ఆచరణకు పూనుకున్నాను.