సత్యశోధన/నాల్గవభాగం/19. ఫినిక్సు స్థాపన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

19. ఫినిక్సు స్థాపన

మరునాడు ఉదయం నేను వెస్ట్‌తో మాట్లాడాను. సర్వోదయ వివరమంతా ఆయనకు తెలియజేశాను. ఇండియన్ ఒపీనియన్ పత్రికను ఏదైనా పొలానికి తీసుకుపోదామని చెప్పాను. అక్కడ అంతా కలిసి వుందాం. భోజనానికి అయ్యే ఖర్చు మాత్రం అంతా తీసుకుందాం. సంపాదన కోసం వ్యవసాయం చేద్దాం. మిగతా సమయంలో ఇండియన్ ఒపీనియన్ పని చేద్దాం అని చెప్పాను. వెస్ట్ అందుకు అంగీకరించాడు. ఒక్కొక్కరికి భోజనం ఖర్చు కనీసం మూడు పౌండ్లు అవుతుందని అంచనా వేశాం. తెల్లవారు నల్లవారు అని భేదం చూపలేదు.

అయితే ప్రెస్సులో ఇప్పుడు పదిమందిదాకా కార్యకర్తలు పని చేస్తున్నారు. అడవిలో వుండటానికి అంతా అంగీకరిస్తారా? అంతా సమానంగా భోజనానికి బట్టలకు అయ్యే ఖర్చు మాత్రమే తీసుకోవడానికి సిద్ధపడతారా! ఈ రెండు ప్రశ్నలు బయలుదేరాయి. ఈ విధంగా పని చేయడానికి అంగీకరించని వారు జీతం తీసుకోవచ్చు. కాని త్వరలోనే వారు కూడా సంస్థలో చేరిపోవాలి. ఈ ఆదర్శంతో అంతా పనిచేయాలి అని మేమిద్దరం నిర్ణయానికి వచ్చాం. ఈ దృష్టితో కార్యకర్తలను పిలిచి మాట్లాడాను. మదనజీత్‌కు మా నిర్ణయం మింగుడు పడలేదు. ఎంతో కాలం కష్టపడి తాను నెలకొల్పిన వ్యవస్థ నా మూర్ఖత్వం వల్ల మట్టిలో కలిసిపోతుందని, ఇండియన్ ఒపీనియన్ ఆగిపోతుందని, ప్రెస్సు నడవదని, పనిచేసేవాళ్ళంతా పారిపోతారని అభిప్రాయపడ్డాడు.

నా అన్నగారి కుమారుడు ఛగన్‌లాలు ప్రెస్సులో పనిచేస్తున్నాడు. అతనితో కూడా నేను వెస్ట్‌ను వెంటబెట్టుకునే మాట్లాడాను. అతనికి కుటుంబ భారం జాస్తి, అయితే బాల్యం నుండి అతడు నేను చెప్పిన ప్రకారం శిక్షణ పొందడానికి, నేను చెప్పిన ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు. నా మీద అతడికి అపరిమితమైన విశ్వాసం. మారు మాటాడకుండా మేము చెప్పిన ప్రకారం చేయడానికి అంగీకరించాడు. ఇప్పటివరకూ నా దగ్గరే ఉన్నాడు.

గోవిందసామి అని మెషిన్‌మెన్ వున్నాడు. అతడు కూడా సంస్థలో చేరిపోయాడు. మిగతావాళ్ళు సంస్థలో చేరేందుకు అంగీకరించలేదు. కాని ప్రెస్సును ఎక్కడికి తీసుకువెళితే అక్కడకు రావడానికి సిద్ధపడ్డారు.

ఈ విధంగా కార్యకర్తలతో మాట్లాడేందుకు రెండు రోజుల కంటే ఎక్కువ కాలం పట్టలేదని గుర్తు. వెంటనే నేను డర్బనుకు సమీపంలో స్టేషను దగ్గరగా భూమి కావాలని పత్రికల్లో ప్రకటన చేశాను. ఫినిక్స్ యందలి చోటు వున్నది ఇస్తామని సమాధానం వచ్చింది. నేను, వెస్ట్ ఇద్దరం ఆ చోటు చూచేందుకు వెళ్ళాం. ఏడు రోజుల్లోపల 20 ఎకరాలు భూమి కొన్నాం. అందు ఒక చిన్ని నీటి కాలువ ఉన్నది. నారింజ చెట్లు, మామిడిచెట్లు కూడా ఉన్నాయి. దాని ప్రక్కన మరో 80 ఎకరాల భూమి కూడా ఉన్నది. అందు పండ్ల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక కుటీరం కూడా ఉన్నది. దాన్ని కూడా కొద్ది రోజుల తరువాత కొనివేశాం. రెండిటికీ కలిపి 10 వేల పౌండ్లు ఇచ్చాం.

సేఠ్ పారసీరుస్తుంగారు నేను పూనుకొనే సాహసోపేతమైన కార్యక్రమాలన్నింటికీ అండగా వుండేవారు. నా ప్రణాళిక వారికి నచ్చింది. ఒక పెద్ద గొడౌనుకు చెందిన టిన్ను రేకులు మొదలుగాగలవి వారి దగ్గరపడి ఉన్నాయి. వాటినన్నింటినీ ఉచితంగా మాకు ఇచ్చివేశారు. వాటితో గృహ నిర్మాణం ప్రారంభించాం. కొంతమంది హిందూ దేశానికి సంబంధించిన వడ్రంగులు, తాపీవాళ్ళు దొరికారు. వారిలో చాలామంది యుద్ధరంగంలో నాతోబాటు పనిచేసినవారే. వారి సాయంతో కార్ఖానా నిర్మాణం ప్రారంభమైంది. ఒక మాసం రోజుల్లో 75 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుగల ఇంటి నిర్మాణం పూర్తి అయింది. వెస్ట్ మొదలగు వారు ప్రాణాలకు తెగించి వడ్రంగులు తాపీవాళ్ళతో బాటు పనిచేశారు. ఫినక్సులో గడ్డి ఎక్కువగా ఉంది. అక్కడ జనసంఖ్య బహు తక్కువ. పాములు మాత్రం ఎక్కువ. ఇదే అక్కడ ప్రమాదం. ప్రారంభంలో అంతా డేరాలు వేసుకొని వున్నారు. ఇంటి యందలి ముఖ్యభాగం తయారవగానే ఎద్దుల బండ్లలో సామాను అక్కడికి చేర్చాం. డర్బనుకు, ఫినిక్సు పదమూడు మైళ్ళ దూరాన ఉన్నది. స్టేషనుకు మా భూమి రెండున్నర మైళ్ళ దూరాన ఉన్నది. ఒక్క వారం మాత్రమే ఇండియన్ ఒపీనియన్ పత్రికను మర్క్యురీ ప్రెస్సులో ముద్రించవలసి వచ్చింది. నా వెంట మా బంధువులు చాలా మంది దక్షిణ ఆఫ్రికా వచ్చారు. వాళ్ళంతా వ్యాపారం చేసుకుంటున్నారు. వారిని అంగీకరింపచేసి ఫినిక్సులో చేరుద్దామని ప్రయత్నం చేశాను. డబ్బు సంపాదించుకోవాలనే తాపత్రయంతో వాళ్ళు దక్షిణ ఆఫ్రికా వచ్చారు. వారికి నచ్చచెప్పడం కష్టం. కొద్దిమంది మాత్రమే నా మాటల్ని అర్థం చేసుకున్నారు. అట్టివారిలో మగన్‌లాల్ గాంధీ పేరు ఎన్నిక చేసి మరీ పేర్కొంటున్నాను. నా మాటలు అర్థం చేసుకున్న వారిలో కొంతమంది కొద్దిరోజులు ఫినిక్సులో వుండి తరువాత డబ్బు సంపాదనలో పడిపోయాడు. కాని మగన్‌లాల్ గాంధీ మాత్రం అలా చేయలేదు. తన వ్యాపారం మానుకొని నా వెంట రావడమే గాక చివరవరకూ నాతోబాటు వుండిపోయాడు. తన బుద్ధిబలం, త్యాగనిరతి, అపరిమితమైన భక్తి భావంతో నేను ప్రారంభించిన శోధనా కార్యక్రమాలన్నింటిలో అండగా నిలబడి పనిచేశాడు. నా అనుచరుల్లో ఇప్పుడు మొదటిస్థానంలో మగన్‌లాల్ వున్నాడు. సుశిక్షుతుడైన పనివాడుగా సాటిలేని మేటిగా నా దృష్టిలో ఆదరం పొందాడు.

ఈ విధంగా 1904 లో ఫినిక్సు స్థాపన జరిగింది. ఎన్నో కష్టనష్టాల్ని ఎదుర్కోవలసివచ్చినా తట్టుకొని ఫినిక్సు సంస్థ, ఇండియన్ ఒపీనియన్ పత్రిక రెండూ ఇప్పటికీ జీవించి వున్నాయి. అయితే ఈ సంస్థను ప్రారంభించినప్పుడు మేము పొందిన సాఫల్యాలు, వైఫల్యాలు తెలుసుకోతగినవి. వాటిని గురించి మరో ప్రకరణంలో వ్రాస్తాను.