సత్యశోధన/నాల్గవభాగం/17. లొకేషను దగ్ధం

వికీసోర్స్ నుండి

17. లొకేషను దగ్ధం

ప్లేగుకు సంబంధించిన పనుల నుండి ముక్తి పొందామేకాని అందుకు సంబంధించిన మిగతా వ్యవహారాలు యింకా మమ్మల్ని వదలలేదు. లొకేషను పరిస్థితిని గురించి మునిసిపాలిటీ పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కాని తెల్లవారి ఆరోగ్యం విషయంలో మాత్రం పూర్తిగా పట్టించుకొని ఇరవైనాలుగు గంటలు జాగ్రత్త వహించింది. తెల్లవారి ప్రాంతాలకు వ్యాధి ప్రాకకుండా వుండేందుకు డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టింది. హిందూ దేశస్థులను గురించి గాని, వాళ్ల ఆరోగ్యాన్ని గురించి గాని పట్టించుకోని దోషాలు మునిసిపాలిటీ వారిలో చూచాను. అయితే తెల్లవారి ఆరోగ్యం విషయమై వారు చూపిన శ్రద్ధను అభినందించకుండా వుండలేకపోయాను. ఈ విషయమై చేయగలిగినంత సాయం నేను చేశాను. నేను ఆ సాయం చేసియుండకపోతే మునిసిపాలిటీ వారు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళే. గుండ్లవర్షం కురిపించో, తుపాకుల సాయం పొందో తమ నిర్ణయాలను అమలుచేసి యుండేవారు.

అయితే అలా జరగలేదు. హిందూదేశస్థులు వ్యవహరించిన తీరుకు వాళ్ళు ఎంతో సంతోషించారు. తత్ఫలితంగా తరువాత పనులు సవ్యంగా జరిగాయి. మునిసిపాలిటీ వారి పనులు హిందూ దేశస్థుల ద్వారా చేయించడానికి నా పలుకుబడి ఉపయోగపడింది. నా వత్తిడి లేకపోతే హిందూ దేశస్థులు ఆ పనులు చేసేవారు కాదు.

లొకేషనుకు నలువైపుల కాపలా పెట్టారు. అనుమతి లేకుండా లోపలికి ఎవ్వరూ పోగూడదు, బయటికి రాకూడదు. నాకు, నా అనుచరులకు లోపలికి వెళ్ళడానికి, బయటకు రావడానికి పర్మిట్ ఇచ్చారు. లొకేషనులో నివసిస్తున్న హిందూ దేశస్థులనందరినీ జోహన్సుబర్గుకు 13 మైళ్ళ దూరాన మైదానంలో డేరాలు వేసి వాటిలో వుంచాలని, ఆ తరువాత లొకేషనును దగ్ధం చేయాలని మునిసిపాలిటీవారు నిర్ణయించారు. అక్కడకు వెళ్ళి డేరాల్లో కుదుటపడటానికి కొంత సమయం పట్టింది. అందాకా కాపలా ఏర్పాటు అలాగే ఉంచారు.

జనం భయపడ్డారు. అయితే నేను వాళ్ళవెంట వున్నాననే ధైర్యం వాళ్ళకు వున్నది. చాలామంది తమ డబ్బు భూమిలో గుంట తవ్వి దాచుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బు బయటకి తీయవలసి వచ్చింది. వాళ్ళకు బ్యాంకుల విషయం తెలియదు. నేను వారికి బ్యాంకు అయ్యాను. నా దగ్గర వాళ్ళందరి సొమ్ము కుప్పలుగా చేరింది. ఆ సొమ్ములో నేను కమీషను తీసుకునే సమస్యే లేదు. వాళ్ళ డబ్బు సమస్యను పరిష్కరించాను. బ్యాంకు మేనేజరుతో నాకు పరిచయం ఉన్నది. మీ దగ్గర డబ్బు నిల్వ చేస్తానని ఆయనకు చెప్పాను. బ్యాంకు వెండి, రాగి వస్తువుల్ని తమ వద్ద ఉంచేందుకు అంగీకరించలేదు. ప్లేగు సోకిన ప్రదేశానికి సంబంధించిన వస్తువులని తెలిస్తే బ్యాంకులో పని చేస్తున్న వారు వాటిని తాకేందుకు కూడా సిద్ధపడేవారు కారు. అయితే బ్యాంకు మేనేజరు తెలిసినవాడు కావడం వల్ల అన్ని సౌకర్యాలు కల్పించాడు. డబ్బును క్రిమినాశక మందులచే కడిగి బ్యాంకులో వుంచడానికి నిర్ణయించాము. ఈ విధంగా 60 వేల పౌండ్లు బ్యాంకులో జమ చేసినట్లు గుర్తు.

కొంతకాలం పాటు ఫిక్సెడ్ డిపాజిటులో డబ్బు జమ చేసుకోమని బాగా డబ్బు గల కక్షిదారులకు చెప్పాను. ఆ విధంగా వారి డబ్బు బ్యాంకులో అమితంగా జమపడింది. దానితో బ్యాంకులో సొమ్ము జమ చేయడం, అవసరమైనప్పుడు తీసుకోవడం వాళ్ళకు తెలిసింది. లొకేషను వాసులందరినీ క్లిపస్పృట్ అను ఫారానికి ప్రత్యేక రైల్లో తీసుకువెళ్ళారు. వాళ్ళకు నీరు మునిసిపాలిటీ వారు తమ ఖర్చుతో అందజేశారు. ఆ పేటను చూస్తే సైనికుల బస్తీగా కనబడుతూ ఉన్నది. జనానికి అలా ఉండటం అలవాటు లేదు. వారికి మానసిక శ్రమ కలిగింది. అంతా క్రొత్తగా ఉన్నది. అయితే వాళ్ళకు ఇబ్బందులేమీ కలుగలేదు. నేను రోజూ సైకిలు మీద ఒకసారి వెళ్ళి అంతా తిరిగి చూచి వస్తూ వుండేవాణ్ణి. మూడు వారాలపాటు ఈ విధంగా తెరపగాలిలో వుండటo వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగు పడింది. మానసిక కష్టం మొదటి 24 గంటలు మాత్రమే ఉన్నది. తరువాత అంతా సంతోషంగా వుండసాగారు. నేను వెళ్ళినప్పుడు అంతా భజనలు చేస్తూ, కీర్తనలు పాడుతూ ఆటలు ఆడుతూ వుండేవారు.

లొకేషను ఖాళీ చేసిన తరువాత రెండవ రోజున లొకేషనును తగులబెట్టారు. అక్కడి వస్తువుల్లో ఒక్క దానిని కూడా మిగిల్చి వుంచాలనే కోరిక మునిసిపాలిటీ వారికి కలుగలేదు. ఈ నెపంతో తమ మార్కెట్టులో గల కలపనంతటినీ కూడా తగులబెట్టారు. అంతా కలిసి పదివేల పౌండ్ల సొమ్ము నష్టమైంది. మార్కెట్టులో చచ్చిన ఎలుకలు పడివున్నాయి. అందువల్లనే అంత భయంకరంగా లొకేషనును తగులబెట్టారు. ఖర్చు బాగా అయింది కాని వ్యాధి మాత్రం అంతటితో ఆగిపోయింది. నగర ప్రజల భయం తొలగిపోయింది.