Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరసవెల్లి

వికీసోర్స్ నుండి

అరసవెల్లి  :- భారత దేశముననున్న యొకటి రెండు సూర్యదేవాలయములలో పేరెన్నిక గన్నది అరసవెల్లి లోని సూర్యదేవాలయము, కోణార్కమున సూర్యదేవాలయ మొకటి కలదు. కాని ఆ యాలయము శిథిలమయినది. పూజా పురస్కారము లందు లేవు. ఇవికాక యెక్కడనో యుత్తర భారతమున నొక సూర్యదేవాలయము కలదట. అది యంత ప్రసిద్ధమైనదికాదు. పేరొందిన సూర్యదేవాలయము ఆంధ్రదేశములో నుండుట ఆంధ్రుల పుణ్యము. 'అరసవెల్లి' యొక చిన్న గ్రామము. ప్రస్తుతము శ్రీకాకుళ మండలములోనున్నది. శ్రీకాకుళమున కీ క్షేత్రము రెండు మైళ్ళు. ఇంగ్లీషు అక్షరములలో నీ గ్రామమునకు 'అరసవిల్లి'యని వర్ణక్రమము చెల్లుచున్నది. శాసనములలో 'అరిశవెల్లి' యనియు, 'అరిసవెల్లి' యనియు కలదు. దీనికే సంస్కృతమున "హర్షవిల్లి" యని వాడుక. బహుళః 'అరసవెల్లి' యే సంస్కృతీకరింపబడి యిట్లయినదేమో!

ఏడవ శతాబ్దపు టుత్తరభాగముననో, ఎనిమిదవ శతాబ్దపుప్రారంభముననో కళింగరాజయిన దేవేంద్రవర్మ' అరసవెల్లిలో సూర్య దేవాలయమును స్థాపించి యుండును. కాని ఆ దేవాలయమే యీ దేవాలయ మనుట కాధారములు లేవు. శాసనములలోని సరిహద్దు లీ దేవాలయపు టునికితో సరిపడకున్నవి. దేవాలయ నిర్మాణము కూడ అంత ప్రాచీన మైనదికాదు. నిజమునకు దేవాలయ గోపుర కుడ్యాదులందు శిల్పము లేనేలేదు. బోడిగోడలే యున్నవి. కాని గర్భగుడిలోని సూర్యదేవమూర్తి చెక్కబడిన శిలవంటి శిలకాని, అందలి శిల్పమువంటి శిల్పము కానీ దేవాలయ ప్రాంతములో నెచ్చటనులేదు. ఈదేవాలయము బహుశః తురకలు ధ్వంసము చేయగా తిరిగి నిర్మింప బడియుండును. మూలదేవత విగ్రహము మాత్రము దేవేంద్రవర్మ నిర్మింపజేసినదే యని విశ్వసింపవచ్చును. ఇప్పటి దేవాలయమును క్రీ.శ. 1778 లో శ్రీ ఎలమంచి పుల్లాజీ పంతులు నిర్మింపజేసినట్లొక శిలాశాసనము గర్భ గుడి ద్వారముపై నున్నది.

అరసవెల్లి సూర్యదేవాలయము తూర్పు ముఖముగా నున్నది. విశాలమయిన ప్రాంగణము కలదు. ముందుగా పెద్ద ద్వారముతో నొక గోపురము కలదు. తరువాత ధ్వజ స్తంభము కలదు. దాని ప్రక్కనే సంతాన గోపాలస్వామి యంత్రము గల ఒక కంబము, దానిపై గరుడ చిహ్నమును గలవు. తరువాత ముందునకుపోవ వేరొక గోపురము, ద్వారమును గలవు. దాని తరువాత విశాల మగు కల్యాణ మండపము కలదు. లోన గర్భగుడియు, గర్భగుడిలో సూర్యదేవుని విగ్రహమును కలవు.

సూర్య విగ్రహము సుమారు మూడడుగుల యెత్తున ఆకర్షణీయమైన శిల్పసౌందర్యముతో అలరారుచుండును, విగ్రహమున అడుగున సప్తాశ్వములు చెక్కబడినవి. తదుపరి రథము కలదు. కమలహస్తుడైన సూర్యదేవుడు నిలువబడియుండును. సూర్య విగ్రహమునకు ప్రక్కగా ఛాయ, ఉష, పద్మిని అను స్త్రీల మూర్తులు చెక్కబడినవి. వీరు ఆతని భార్యలు. సనకాది మహర్షులు వింజామరలు వీయుచున్నట్లును, మాతర పింగళకులు ద్వారపాలకులుగా నున్నట్లును చెక్కబడియున్నవి. ఈ దేవాలయమున ఆదిత్య, అంబిశా, విష్ణు, గణేశ, మహేశ్వరు లను పంచాయతనము కలదు.

అరుణములో జెప్పినట్లు సర్వహృద్రోగములు, నేత్ర రోగములు తగ్గుటకు, శరీరారోగ్యము కలుగుటకు ఎందరో భక్తులు ప్రతిదినమును వచ్చి సూర్యదర్శనము చేసికొని, తీర్థప్రసాదము లారగించిపోవుదురు. ఈ ప్రదేశమున మూడు చెరువులు గలవు. ప్రస్తుతము దేవాలయమునకు తూర్పుగా నొక పెద్ద కొలను గలదు. దీనిని సూర్య పుష్కరిణి యందురు. ఇందే స్నాన మాచరించి తైర్థికులు దేవదర్శన మొనరించెదరు. తైర్థికుల సౌకర్యము కొరకు ఉదారులు నిర్మించిన సత్రములు కలవు. ప్రత్యాది వారము పర్వదినము . మాఘమాసము సూర్యప్రీతి కరమయిన మాసము. రథసప్తమి సూర్యదేవుని పర్వదినములలో శ్రేష్ఠమైనది. దేవాలయమున నమక చమక సౌరత్రిచలతో సూర్య నమస్కారములు ప్రతిదినము జరుగును, ఇందు అర్చకులు సంప్రదాయబద్ధులు. అర్చనా విధానమున ఆరితేరినవారు, పరిశుద్ధులు నగుట ప్రశంసాపాత్రమైనది

అరసవెల్లిలోని సూర్యభగవానుని సందర్శించి హర్షము వెల్లువలు కాక యరిగిన వారు లేరు.

ది. రా.

[[వర్గం:]]