సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరిస్టాటిల్ - జీవిత సంగ్రహము-
అరిస్టాటిల్ (384 - 322 క్రీ. పూ.) (విద్యా విషయము):- జీవిత సంగ్రహము :- ప్రాచీన గ్రీకు విజ్ఞానమునకు మూలపురుషులు మువ్వురు. సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్. ఇదియొక అసాధారణ గురు శిష్య పరంపర. వీరిలో చివరివాడగు అరిస్టాటిల్ ప్రపంచ చరిత్ర యందు మొదటి మేటి శాస్త్రవేత్తయనియు, విజ్ఞానమును వ్యవస్థీకరించి శాస్త్రరూపము నిచ్చుటలో నద్వితీయు డనియు నెంచబడుచున్నాడు. ఈతని జీవితమునందు మూడు విస్పష్ట దశలు గమనింపదగును. ఈ దశలలో ఈతని మానసికాభివృద్ధియందుగూడ అంతరములు కనిపించును.
ప్రథమదశ :- (క్రీ. పూ. 384 నుండి 847 వరకు) మేసిడోనియా సరిహద్దులపైనున్న ధ్రేసు రాష్ట్రము నందలి "స్టాజిరా" యను నూర క్రీ. పూ. 384 లో అరిస్టాటిల్ జన్మించెను. ఈతని తండ్రియగు "నికోమాకస్" మేసిడోనియారాజగు "అమిస్టాను”నకు ఆస్థాన వైద్యుడుగను, ఆప్తమిత్రుడుగను ఉండెను. ఈతని తల్లి పేరు "ఫేస్టిసు". బాల్యముననే తలిదండ్రులను కోల్పోయి నందున నీతనిని, బంధువగు "ప్రోక్సినన్" పెంచి పెద్ద
వానిని జేసి, విద్యాబుద్ధులు చెప్పించెను. 17వ యేట ఏథెన్సు నగరములో ప్లేటో యొక్క పాఠశాలను (ఎకాడమీ) ప్రవేశించి, 61 సంవత్సరముల వయస్సుగల గురువు పాదముల యొద్ద సకలవిద్యల నభ్యసించెను. తుదకాపాఠశాల యందే సహా యోపాధ్యాయుడయ్యెను. కళలు, శాస్త్రములు, రాజకీయ,త త్త్వశాస్త్రములు మతగ్రంథములు మొదలగు నవన్నియుపఠించెను. క్రీ.పూ 347 సం.న ప్లేటో కాలధర్మము నొందుటచే అరిస్టాటిల్ ఆ పాఠశాలను వీడెను.
ద్వితీయదశ :- అటనుండి “జనోక్రేట్స్" అను ముఖ్య సహచరునితో గలిసి “ఏసస్" నగరమును జేరి, అందు పాఠశాల నొకదానిని నెలకొల్పెను. ఎకాడమీలో తన సహపాఠియగు "హెర్మియస్" యొక్క మేనకోడలు “పిథియస్" అను నామెను వివాహమాడెను.ఈతని సహాయమువలననే ఆరిస్టాటిల్ మేసిడోనియా రాజగు “ఫిలిప్” కుమారుడయిన “అలెగ్జాండరునకు పెల్లా నగర మందు దేశికుడయ్యెను. క్రీ. పూ. 335 వరకు ఈ పదవి నత్యంత సమర్థతతో నిర్వహించెను. ప్రపంచచరిత్రయందు ఇట్టిమహాప్రజ్ఞావంతులగు గురుశిష్యులు కానరారు. సహ పాఠియును, బంధువునకు హెర్మియస్ ను పర్షియనులు చంపిరను క్రోధమున నీతడు అలెగ్జాండరును తూర్పు దేశములపై దాడికై పురికొల్పెనని సందేహింపవచ్చును. క్రీ. పూ. 335 అలెగ్జాండరు సింహాసన మధిష్ఠింపగనే ఈతడు మరల ఏథెన్సు నగరమును చేరెను.
తృతీయదశ :- ఇప్పటినుండి ఏథెన్సునందలి సామాన్య పాఠశాల యగు "లై సియం" నందు అరిస్టాటిలు ఉపా ధ్యాయుడయ్యెను. ఈ కాలమందీతడు ఉదయమున వ్యాయామము, ఉన్నత శాస్త్ర విషయములు మొదలగు వాటినిగూర్చి కొద్దిమంది విద్యార్ధులకు ఉపన్యసించుటయు మధ్యాహ్నము సామాన్య విషయములపై ప్రజాబాహుళ్యమునకు ఉపన్యసించుటయు చేయుచుండెను. రెండవసారి ఏథెన్సు చేరినతరువాత పిథియస్ చనిపోయెను. తరువాత అతడు హెర్పిలిస్ ను వివాహమాడెను. వారికి 'నికోమాకస్' అను కుమారుడు కలిగెను.
ఈతడు మేసిడోనియానుండి వచ్చినవాడగుట చేత “ఏథెన్సు” నగరవాసు లీతనిని ద్వేషించుచుండిరి. కాని అలెగ్జాండరు జీవిత కాలమున నీతని కెట్టిహానియు సలుప జాలరయిరి. తూర్పు దండయాత్రలనుండి వచ్చుచు అలెగ్జాండరు క్రీ. పూ. 323 లో మరణించినట్లు తెలియగానే అసూయాపరు లీతని పై నాస్తికుడను నిందమోపిరి. ఏథెన్సు నగరవాసులకు సోక్రటీసు హత్యాపాపముతో పాటు ఇంకొక పాపకార్యాచరణమున కవకాశ మీయరాదని ఈతడే ఏథెన్సును వీడి "కాల్చిస్" అను ఊరు చేరెను. కొంతకాలము ఉదరరోగముతో బాధపడి క్రీ. పూ. 322 లో దేహము చాలించెను. పిదప నీతని అస్తికలను జన్మస్థాన మగు “స్టాజిరా"కు తీసికొనిపోయి, చిరస్మరణీయముగా నొక సమాధియందు నిక్షేపించి, ప్రజలు తమ భక్తి శ్రద్ధ అను చాటుకొనిరి.
అరిస్టాటిల్ బట్టతలను, పల్చని పాదములను, చిన్న కనులను కలిగియుండెడివాడని చెప్పబడుచున్నది. ఆతడెల్లప్పుడును ఆకర్షణీయమైన దుస్తులను ధరించెడివాడట. బంధువులకు బానిసలకు తన యాస్తి చెందవలెనని అరి స్టాటిల్ మరణశాసనమునుగూడ వ్రాసెను.
రచనలు : తండ్రి వైద్యుడగుటచేత ఇతనికి భౌతిక, జంతు, జీవశాస్త్రములందు సహజాభిమానము కలదు. అకాడమీయందున్నప్పుడు జంతుశాస్త్రమును గూర్చి నూతనములగు పరిశోధనములు కావించెను. తత్త్వశాస్త్రము నభ్యసించేను. అలెగ్జాండరునకు గురువుగానున్నప్పుడు రాజకీయశాస్త్రమునందును, సాహిత్యశాస్త్రమునందును విశేషముగా కృషి సాగించెను. ఇంక రెండవసారి ఏథెన్సు నందున్న కాలమున (క్రీ. పూ. 335-322) ఇతడు తన ముఖ్యరచనలు గావించెను. తర్క శాస్త్రము, తత్త్వ శాస్త్రము, నీతిశాస్త్రము, రాజకీయశాస్త్రము, సాహిత్య శాస్త్రము, జంతు భౌతిక శాస్త్రములు మున్నగు వాటి యందు నేటికిని ఈతని గ్రంథములే అగ్రస్థాన మలంక రించుచున్నవి. పెక్కు శాస్త్రములకు పేరును, రూపమును కల్పించి నేడు మన వాడుకలో నున్న పెక్కు పారిభాషిక పదములను సృష్టించినవాడు ఈ "విజ్ఞాన శాస్త్ర జనకుడే" అనదగును. ఈతడు రచించిన "ఆర్గనమ్” అను గ్రంథమును మించి, ప్రయోగ తర్క శాస్త్రము నేటి కిని పురోగమించ లేదు. ప్రతిస్థాపన తర్కశాస్త్రమును గూడ నీతడు సమగ్రముగా రచించి యుండవలెననుటకు ఆధారములు గలవు. కాని మానవజాతి దురదృష్టమువలన గ్రంథ మెటులో నశించినది. ఆశాస్త్రభాగమును మరల బేకను మహాశయుడు మనకు ప్రసాదించినాడు. వ్యక్తి, సంఘము, ప్రభుత్వము అను వాటి యొక్క పరస్పర బాధ్యతలను హక్కులను గురించి తన సిద్ధాంతములను, “నీతిశాస్త్రము” “రాజకీయశాస్త్రము" అను గ్రంథము లందు ఇతడు స్పష్టపరచెను. ఈతని “నీతిశాస్త్రము”నందు మానవుని మంచి లేక సుఖమును గురించిన చర్చయు,“రాజకీయశాస్త్రము" నందు దీనిని సాధించు విధానములునుగలవు. మధ్యయుగములం దీమహామహుని గ్రంథములు తక్క తక్కినవన్నియును మూలబడినవని చెప్పవచ్చును.
విద్యా విధానము : ఈతడు ప్రాచీన విద్యావేత్తలయందగ్రగణ్యుడు. విద్యావిధానమును శిశుదశనుండి విశ్వ విద్యాలయ దశవరకు చాలా వివరముగ నిర్ణయించెను. నేటి మన యభివృద్ధి సూచకములయిన శిశు పాఠశాలలు గూడ ఇతని యాదర్శమునకు వెనుక బడినవే యగును.
ప్రాథమిక విద్య : శిశువు యొక్క తలిదండ్రుల వివాహమునకు ముందునుండియు ఈతని ప్రణాళిక మొదలగును. ఆరోగ్యమును, బలమునుగల యువతీయువకులే వివాహమునకును, జాతిని వర్థిల జేయుటకును అర్హులు. స్త్రీకి 18 సం. లును, పురుషునకు 37 సం. లును, వివాహమునకు యుక్తవయస్సు. గర్భీణియగు యువతికి లఘుపరిశ్రమయు, లఘ్యాహారమును తగును. ఆకాలమున దేవతా దర్శనమును, పూజలును అవసరము. ఒక్కొక్క మిధునమునకు సంతానపరిమితిని ప్రభుత్వము నిర్ణయించవలెను. అనారోగ్యవంతులగు శిశువులను అంత మొందింపవలయునను నాటి యాచారము నీతడు సమర్థించెను. దేహదార్థ్యమునకై శిశువులు శీతవాశాతపము లకు గురికావలెనని ఈతని మతము, వారెంత యేడ్చిన నంత యారోగ్యకరము. 5 సం. వయస్సు వరకును కథలు, ఆటలు, సత్సహవాసము, వినోదములకు తగిన యవకాశము అవసరము. అవినీతికర శిల్పములు దేవళములందు తప్ప నింకెక్కడ నుండరాదు. తప్పుచేసిన బాలురను బహిరంగముగా శిక్షించవలెను. 5 సం. నుండి 7 సం. వయస్సుగల బాలబాలికలు వారు ముందు చేరబోవు పాఠశాలలను సందర్శించుచుండవలెను.
7 సం. నుండి 21 సం. వరకు దీనియందు రెండు అంతర్దశల నేర్పరచెను, యౌవన పూర్వదశ, యౌవనపర దశ. ఈ 14 సంవత్సరముల కాలములో చదువుట, వ్రాయుట వ్యాయామమును, గానమును, చిత్ర లేఖనమును, నాటక కథను బోధించుటవలన ఉద్రేకములకు తగిన శిక్షణ నొసంగవలెను. చిత్రలేఖనమును జీవనోపాధికి మాత్రమే యుద్దేశింపక, ఆనందోత్పాదనమునకును వ్యాయామమును పశుబల సంపాదనమునకుగాక దేహసౌష్ఠవమునకును ఆరోగ్యమునకును అవసరము. యౌవనమునకు పూర్వము తేలిక వ్యాయామమును, తరువాత ఆహార నియమములతోగూడిన కఠినమగు కసరత్తులను ఆదేశించెను. గానము ఆత్మకు తగిన కసరత్తు; అది విశ్రాంతిని సంస్కారయుతముగా గడపుటకు ఉపకరించును. గానమువలన సుఖదుఃఖముల యెడ సమభావము కలుగును. దేహమునకు ఔషధ మెట్టిదో, ఆత్మకు గాన మట్టిది. చిత్ర లేఖనముకంటిద్వారా దేహము పై మాత్రము ప్రభావము కల్గింపగా, గానము చెవిద్వారా యాత్మపై ప్రసరించును. చిత్రలేఖనముకన్న గానము ఉన్నతకళ. కనుక బాలబాలికలకు ప్రారంభమునందు చిత్రలేఖనము కన్న గానమే లాభదాయకము. వారికి నీతిదాయకములగు గీతములనే బోధింపదగును,
ఈతడు విద్యా విషయములను, ప్రయోగాత్మకములు, సృజనాత్మకములు, జ్ఞానాత్మకములని మూడు తరగతులుగా విభజించెను. మొదటిదానియందు నాట్యము, పరుగెత్తుట, దుముకుట, కసరత్తు చేయుట, కుస్తీ పట్టుట, కవాతు, స్వారి చేయుట, గురిజూచుట, బల్లెములను, చక్రములను విసరుట గలవు. రెండవదానియందు గానము చిత్రలేఖనము గలవు. మూడవదియగు జ్ఞానాత్మకము నందు వ్యాకరణము, తర్క, మీమాంసలు, సారస్వతము, గణితము, ఖగోళశాస్త్రములు గలవు.
21 సంవత్సరముల వయస్సు పిమ్మట దశ : శరీర సౌఖ్యమునకు ఆరోగ్య మవసరమైనట్లు, మానసిక సౌఖ్యమునకు సన్మానసికత్వము ఆవశ్యకము. ఈ దశ యందు యువకులు ప్రత్యక్షముగా చట్ట నిర్మాణ, నిర్వాహక కార్యములందు పాల్గొనుచు శిక్షణము బొంద వలయును. వారు సరిహద్దులపై కొంతకాలము సేవచేయుట అవసరము, అటుపిమ్మట ఆధ్యాత్మికాభిరుచిగల వారిని మతబోధనకార్యములలోనికి తీసికొనవచ్చును.
అరిస్టాటిల్ చెప్పిన యీ విద్యా ప్రణాళికయంతయు స్వతంత్ర పౌరులకై యుద్దేశించబడినదే. ఆనాటి బానిస ప్రజల కొరకుగాదు. తన గురువర్యుడగు ప్లేటో యథి మతమునకు భిన్నముగా నీతడు స్త్రీలకు ఉన్నత విద్య యనవసరమని తెలిపెను. ఇతని గ్రంథ మిచ్చట అకస్మాత్తుగా నిలచిపోయినది. కనుక ఉన్నతవిద్యా ప్రణాళిక యందలి వివరములు లేవు.
ఈతని ప్రభావము : ఆనాటి గ్రీసునందు అరిస్టాటిల్ ప్రభావ మంతగా కాన రాదు. ఈతని అనుయాయులు కొన్ని గ్రంథ భాగములపై విమర్శనలను, టీక లను వ్రాయుటకన్న ఇంకేమియు జేయరైరి. క్రీ.పూ. 287 లో నీతని గ్రంథములు ఆసియా మైనరుకు గొంపోబడినవి. అచట నివి రెండు శతాబ్దముల కాలము ఉపయోగ రహితముగ నుండెను. పిమ్మట ఆ గ్రంథములు అలెగ్జాండ్రియా కును, రోమునకును చేరినవి. అరబ్బీ భాషాంతరీకరణముల వలన బాగ్దాదులోను, వారి సామ్రాజ్య విస్తరణచే స్పెయిను నందును ఈతని రచనలు జ్ఞానము వ్యాప్తి చెందెను. మధ్య యుగములందు అన్ని పాఠశాలల యందును ఈతని రచనలే ప్రధాన పాఠ్య గ్రంథములుగా.నుండెను. 15 వ శతాబ్దము నందలి “రినై సాన్సు” అనబడు పూర్వ విద్యా పునరుద్ధరణము వరకును అరిస్టాటిలు పూర్వ విద్యావేత్తలందరిలో ప్రాధాన్యము వహించెను. నేటికిని సర్వశాస్త్రములందును అరిస్టాటిల్ చూపిన శాస్త్రీయ పరిశోధన మార్గము, హేతువాద విధానము అనునవే యనుసరింపబడుచున్నవని చెప్పక తప్పదు..
సో. రా.
[[వర్గం:]]