Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరవిందుడు

వికీసోర్స్ నుండి

అరవిందుడు  :- కొన్నగరు అనునది హుగ్లీ జిల్లా యందు ప్రజాబాహుళ్యముతో గూడిన ఒక చిన్న పట్టణము. ఇక్కడనే జగద్విఖ్యాతులయిన రామకృష్ణ పరమహంస, రాజారామమోహనరాయలు - ఉభయులు జన్మించిరి. అందుచే ఈ ప్రదేశము సుప్రసిద్ధి నందినది. ఆ కొన్నగరులో, ఒక సుప్రసిద్ధమగు "ఘోష్” కుటుంబములో, క్రీ. శ. 1840 సం.న కృష్ణధనఘోష్ అనునతడు జన్మించెను. అతడు ఋషి రాజనారాయణ బోసు యొక్క పెద్దకూతురగు శ్రీమతి స్వర్ణ లతాదేవిని వివాహమాడెను. కృష్ణధన ఘోష్ యం. బి. బి. యస్. డిగ్రీని పొందిన తరువాత ఉన్నతతర వైద్యవిద్యను సంపాదించు నిమిత్తమై ఇంగ్లాండునకు పోయి అచటి అబెర్డీన్ విశ్వవిద్యాలయమునందు యం. డి. డిగ్రీని సంపాదించుకొని భారతదేశమునకు తిరిగివచ్చెను. ఇతనికి పాశ్చాత్య నాగరకతయందు అత్యంతమయిన ఆదరము, భారతీయ సంస్కృతియందు అనాదరము ఏర్పడెను.

జననము  :- 1872 సం.రం ఆగస్టు 16 వ తేది గురువారం ఉదయం 5 గంటలకు కలకత్తాలో ఈ దంపతులకు మూడవ కుమారుడుగా అరవిందఘోషు జన్మించెను. కృష్ణధనఘోషు పాశ్చాత్య విద్యావిధానము నందు సంపూర్ణాభిమానము గలవాడు. అందుచే అతడు అరవిందుని, అతని సోదరులను డార్జిలింగులోని లో రెటో కాన్వెంటు పాఠశాలకు పంపించెను. అప్పటికి అరవిందుడు 5 సంవత్సరముల ప్రాయము కలవాడు. పాఠశాల యందును, భోజనశాలయందును ఘోషు సోదరుల యొక్క స్నేహితు లందరును ఆంగ్లబాలకులై యుండిరి. తన దేశములోనే ఒక విధముగా ప్రవాసియై అరవిందుడు 5 వ ఏట ఇంగ్లీషులోనే తొలిమాటలు ఉచ్చరింప మొదలిడెను.

విద్యార్థిదశ  :- 1879 సం. న కృష్ణధనుడును, అతని భార్యయు తమతో అరవిందుని, అతని సోదరులను ఇంగ్లండు దేశమునకు తీసికొనిపోయిరి. అచ్చట మాంచెష్టురునందు అరవిందుని, ఆతని సోదరులను డ్రైవెట్సు అను ఆంగ్ల దంపతుల సంరక్షణమునం దుంచిరి. అరవిందునికి ఆ దంపతుల వలన వ్యక్తిగత శిక్షణము లభించెను. డ్రైవేటు లాటిను భాషయందు గొప్ప విద్వాంసుడు. అందుచే అరవిందుని కాతడు లాటినునందు గట్టి పునాదిని నిర్మించేను.

డ్రైవేటు దంపతులు ఆస్ట్రేలియాకు పోయిన సందర్భమున అరవిందుడు లండనునందలి సెయింట్ పాల్ పాఠశాలకు పంపబడెను. అరవిందుని యోగ్యత, ప్రతిభ, అచ్చటి ప్రధానోపాధ్యాయుని ఆకర్షించెను. ప్రధానోపా ధ్యాయుడు అరవిందునికి స్వయముగా గ్రీకుభాషను బోధింప మొదలిడెను. సత్వరముగ ప్రధానోపాధ్యాయునిచే ఉన్నత తరగతులలో ఆరవిందునకు ప్రవేశము కల్పింపబడెను. ఇట్లు అరవిందుడు బాల్యముననే గ్రీకు, లాటిన్ భాషలలో పాండిత్యము సంపాదించుకొనేను. పిదప లండనునందలి కింగ్స్ కళాశాలలో ప్రవేశించెను. అచ్చట అతనికి సంవత్సరమునకు 80 పౌనుల చొప్పున విద్యార్థి వేతనము లభించేను.

ఆంగ్ల సారస్వత మండలి పద్యకవితను, కల్పనాత్మక వాఙ్మయమును, ఫ్రెంచి సారస్వతమును, ఐరోపా యొక్క ప్రాచీన - మధ్య - ఆధునిక యుగముల చరిత్రమును చదువుటయందు అరవిందుడు ప్రత్యేక శ్రద్ధను వహించెను. కింగ్స్ కళాశాలయందు గ్రీకు, లాటిను భాషలలో పద్య రచనా విషయమున సంవత్సరమునకుగల బహుమతుల నన్నింటిని అతడు పొందెను. 1895 సంవత్సరములో గ్రీకు, లాటిన్ భాషలలో ఉత్కర్షావధిక అంకములను కూడ అతడు పొందెను. పిదప ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షయందు ప్రతిష్ఠతో ఉత్తీర్ణుడయ్యెను. కాని, ఆ విషయమున అతనికి సహజమైన అభినివేశము లేదయ్యెను. అందుచే ఆ బంధనము నుండి విముక్తిని బొందదలచి స్వయముగ ఐ. సి. యస్. పరీక్షను నిరాకరింపక యుక్తి యుక్తముగ గుఱ్ఱపు స్వారియందు తనకు యోగ్యత లేదను విషయమును అధికారుల దృష్టికి తెచ్చెను.

అరవిందుడు ఇరువది సంవత్సరముల ప్రాయముననే అసాధారణమయిన విద్యాయోగ్యతలను గడించుకొనెను. జర్మను, ఇటాలియను మున్నగు ఇతరములయిన ఐరోపా భాషల యందు కూడ అతడు గొప్ప ప్రావీణ్యమును పొందెను. సంగ్రహముగా చెప్పవలయునన్న అసంఖ్యాకములయిన పాశ్చాత్య సంస్కృతి నిధానములను స్వవశ మొనర్చుకొనుటకు అవసరమయిన ఉత్తమ జ్ఞాన సాధనములను అతడు ఆర్జించెను.

తండ్రి యొక్క ఆర్థిక దౌర్బల్యమును బట్టి అరవిందుడు ఉద్యోగ సంపాదనము కొరకు యత్నింపవలసి వచ్చెను. ఇంతలో బరోడా మహారాజు ఐన స్వర్గీయ శ్రీ సాయాజీ రావు గాయక్వాడ్ ఇంగ్లండునకు వచ్చుట తటస్థించెను. అయ్యవకాశమును పురస్కరించుకొని జేమ్సుకాటను సహాయమున అరవిందుడు గాయక్వాడ్ తో పరిచయమును ఏర్పరచుకొనెను. ఇంగ్లండులో నుండగనే అరవిందునిచే ఆంగ్లములో రచింపబడిన పద్య సముదాయము అతడు భారత దేశమునకు వచ్చినతోడనే పుస్తకరూపమును ధరించెను. అరవిందుడు రచించిన కావ్యములలో మిర్లిటా గీతములు, విషాదాంత ప్రేమ అనునవి పేర్కొనదగినవై యున్నవి. బరోడాలో రాజకీయోద్యోగిగను, కళాశాలాచార్యుడుగను ఉన్నపుడు అరవిందుడు బహువిధములగు సారస్వత రచనలను కావించెను.

రాజకీయ జీవితము  : మొట్టమొదటి నుండియు వ్యక్తిగత మోక్షము గాని, వ్యక్తి సంపత్తిగాని, శ్రీ అరవిందునకు ఉన్నత లక్ష్యముగా తోచలేదు. మిక్కిలి అవమానకరమగు సేవా ధర్మమునుండియు, అజ్ఞానాంధకారము నుండియు, స్వదేశీయులను విముక్తులను ఒనర్చుటకై యత్నించుట తన ముఖ్య కర్తవ్యముగా అతడు గుర్తించెను. తన పేరు వెల్లడించకుండ ప్రజాపత్రికలలో రాజకీయ విషయములను గురించి అతడు వ్రాయుచువచ్చెను. 1902 మొదలుకొని శ్రీ అరవిందుడు రాజకీయాందోళనములలో ప్రవేశించుటకై యత్నించెను. రాజకీయ చర్యలకై సంఘములను నిర్మించుటకు ఉద్యుక్తులైయున్న పురోగాములగు నాయకులతో అతడు చేతులు కలిపెను. బహిరంగముగా ఆతడు చేయగలిగినది తక్కువగా నుండెను. ఈ రహస్య రాజకీయ సంస్థ యొక్క కార్యక్రమమునందు స్వరాజ్య సంపాదనము, విదేశవస్తు బహిష్కరణము, స్వదేశోద్యమము అనునవి ప్రధానలక్ష్యములై యుండెను. స్వరాజ్యమనగా శ్రీ అరవిందుని దృష్టిలో మితవాదుల భిక్షుక విధానము కాదు. సంపూర్ణ స్వాతంత్య్రమే జాతీయ సంస్థ యొక్క ప్రధానలక్షము కావలయు నని అతడు విశ్వసించెను.

లార్డుకర్జను యొక్క వంగవిభజన రూపమైన దురహంకార చర్య వంగదేశము నంతటిని ఏక ముఖముగ కలవరపరచెను. ఈ వంగదేశ విభజన విషయకమైన శాసనము రద్దగువరకు పోరాటమును సాగించుటకై నిశ్చయింపబడెను. 1905 వ సం॥రం అక్టోబరు 16 వ తేది ఉపవాసములతోను, శోకములతోను, ప్రతీకార సూచకమగు దినముగా జరుపబడెను. శ్రీ అరవిందుడు 1904 - 1906 సం॥లలో జరిగిన కాంగ్రేసు సభలకు హాజరయి, అతివాద పక్షముయొక్క చర్చలయందును, చతుస్సూత్ర ప్రణాళికా నిర్మాణము నందును ప్రముఖమైన పాత్రను వహించెను. స్వరాజ్యము, జాతీయ విద్య, స్వదేశీయత, విదేశవస్తు బహిష్కరణము అనునవి చతుస్సూత్రములు.

1906 వ సం౹౹ లో శ్రీ అరవిందుడు బరోడాయందలి ఉద్యోగమునుండి విరమించుకొని కలకత్తాకు వచ్చి “వందే మాతరం" అను పత్రిక యొక్క సహాయకత్వమును స్వీకరించి, జాతీయపక్షమునందు సభ్యుడుగా ప్రవేశించెను. ఆత్మవిశ్వాసములేక చెల్లాచెదరై యున్న కాంగ్రెసు పక్షములలో ఆతడు తన ఉజ్జ్వలాదర్శములను, సంధిషరతుల నంగీకరింపని తన జాతీయ భావములను, కొంతవరకు రగుల్కొలిపెను. జాతీయ నాయకులను సమావేశపరచి దేశమునకు ఆతడు ఒక విప్లవాత్మక కార్యక్రమమును సిద్ధపరచెను. శ్రీ అరవిందు డిట్లు ఆకస్మికముగా అతివాద జాతీయత యొక్క మహా తత్త్వవేత్త అయ్యెను. వంగ విభజనము యొక్క ప్రతి ఘటనమునకు చిహ్నముగా ఏర్పడిన జాతీయ కళాశాల కతడు తొలి ప్రధానాచార్యుడా యెను. కాని త్వరలో ఈ కళాశాలను వదలి సంపూర్ణముగ రాజకీయములలో నిమగ్నుడయ్యెను.

తెరమరుగునుండి 'వందే మాతరమ్' అను గీతము బయలు వెడలి ఒక్కుమ్మడిగా వ్యాపించి ప్రతి భారతీయుని జిహ్వాగ్రమున నాట్యమాడ దొడగెను. నిజమునకు 'వందే మాతరమ్' అను పత్రికకు వెనుకనున్న శక్తి శ్రీ అరవిందునిదే. ఇతని సంపాదకీయములును, ఇతర రచనలును ప్రజల ప్రశంసల నందుకొనెను. ఆంగ్లో-ఇండియన్ పత్రికలకు నైరాశ్యమును కల్పించెను. కాని ప్రభుత్వమిక 'వందేమాతరమ్' అను పత్రికను ఉపేక్షింపజాలక పోయెను. అందుచే న్యాయవిచారణ సభలో అరవిందునిపై నేరారోపణము (Prosecution) ప్రారంభమయ్యెను. క్షణకాలములో శ్రీ అరవిందుని పేరు సమస్తజాతి యొక్క పెదవులపైనను నడయాడ దొడగెను, భరత ఖండము యొక్క నలుదెసలనుండియు ప్రశంసలు, అభినందనములు ప్రతిధ్వనింప సాగెను. స్వర్గీయ టాగూరు కవియు అతని కభినందనములు వెల్లడించెను. రాష్ట్రీయ ప్రధాన దండనాధికారి శ్రీ అరవిందుని నిర్దోషిగా నిర్ణయించుచు తీర్పు చెప్పెను.

1907 లో, లోకమాన్య బాలగంగాధర తిలకు యొక్కయు, శ్రీ అరవిందుని యొక్కయు నాయకత్వములో నడచు జాతీయ పురోగాములకును, మితవాదులకును మధ్యగల ఆదర్శ విషయకములయిన భేదములు అంతకంతకు ప్రస్ఫుటములు కాసాగెను. 1907లో సూరతు కాంగ్రెసులో, తుదకీ వైషమ్యములు ఒక పరిణతరూపము నొందెను. సూరతు కాంగ్రెసునుండి అరవిందుడు వాస్తవమునకు యావద్భారత నాయకుడుగా వెలువడెను. అప్పటినుండియు ఇతనియందు జనతకు శ్రద్ధాభక్తులు. లక్ష్య గౌరవములు, నమభావము ఇనుమడించెను. వెడలిన చోట నెల్ల ఇతడు మహారాజొచితమయిన గౌరవ ప్రపత్తులను పొందుచుండెను. తిలకు,లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాలు మున్నగు మహనీయులతో సరాసరిగా చేతులు కలిపి ఇతడు పనిచేయదొడగెను,

రాజకీయ సిద్ధాంతములు  :- శ్రీ అరవిందుడు వంగదేశములో తేజోవంతమును, ఆత్మశక్తి సంపన్నమును అగు ప్రయత్నముయొక్క జ్వాలను రగుల్కొలిపి దానిని విద్యుదుజ్జ్వలితము గావించెను. చాలావర కతడు గాంధీ మహాత్ముని రాజకీయ చర్యా విధానములను, ముఖ్యముగా సాత్విక నిరోధమును, అతనికంటె ముందుగనే ప్రవేశ పెట్టెను. దేశములో నిద్రాణములై యున్న ఆధ్యాత్మిక శక్తులను మేలుకొల్పెను. కాని, గత్యంతరము లేనిచో "దౌర్జన్యమును ప్రయోగించికూడ స్వేచ్ఛనుపొందు హక్కు జాతికి కలదను స్వాభిప్రాయమును ఆతడెన్నడును దాచియుంచలేదు. శ్రీ అరవిందుని ఈ భావము లోకమాన్యతిలకు యొక్క భావముతో తుల్యమైనదిగా నుండెను. "అత్యున్న తాదర్శములో 'శాంతి' ఒక భాగము; కాని, అది ఆధ్యాత్మికముగాని, కనీసము మానసికము గాని అయిన మూలము పై ఆధారపడియుండవలెను. మానవ స్వభావము మారనిచో శాంతిమార్గ మేమాత్రము ఫలప్రదము కాజాలదు. జనులు శాంతిమార్గమును ఒక మానసిక సూత్రముగాగాని, అహింసాతత్త్వముగాగాని అనుష్ఠింప బూచిననాడు అది అపజయమును పొందును. అపుడు పూర్వమునందుకంటెను గురుతరమయిన అనర్థ మేర్పడవచ్చును" అని అరవిందుడు వాదించెను. సామరస్య సంపాదనమునందుగూడ అరవిందుడు వెనుదీసి యుండలేదు. కాంగ్రెసునందలి రెండు పక్షములను మరల ఒకే సామాన్య నాయకత్వము క్రిందికి దెచ్చుటకు ఆతడు సర్వశక్తులను వినియోగించుటకు సంసిద్ధుడై యుండెను. గ్రామ సమితుల నేర్పరచి స్వరాజ్య సిద్ధాంతమును వాటి ద్వారమున దేశమున వ్యాపింపజేయుటయందుగల ప్రాముఖ్యమును ఆతడు గ్రహించెను. "స్వరాజ్యసాధన మందు మనము గ్రామమును పునాదిగా జేయవలెను.'గ్రామమును నిర్లక్ష్యము చేయుట' అను పాత పొరపాటును మనము తిరిగి పడకూడదు. గ్రామమును మనము పరిసరభాగముల జీవనముతో అనుబంధింపచేయవలెను. ఐకమత్యము స్వరాజ్యసౌధ నిర్మితికి మూలము" శ్రీ అరవిందుడు నొక్కి వక్కాణించెను.

సంఘటన లిప్పుడు పూర్వ నిర్ణిత సిద్ధాంతములకు అనుగుణముగా శీఘ్రముగా చలింపనారంభించెను. రాజద్రోహము హద్దుమించి చెలరేగ నారంభించెను. దీనితో అధికారులు, భయభ్రాంతులై 1908 మే, 5 వ తేది ఉదయము 5 గం. లకు శ్రీ అరవిందుని బంధించి మిత్రవర్గముతో ఆతని ఆలిపూరునకు పంపి అక్కడ నున్న చెరసాలలో నుంచిరి. సుప్రసిద్ధుడును, క్రిమినల్ న్యాయవాదియునగు స్వర్గీయ ఎర్ డ్లీ నార్టన్ ప్రభుత్వపక్షపు న్యాయవాదిగా నియమింపబడెను. జిల్లా మేజిస్ట్రేటు స్థానములో పనిచేయుచున్న బర్లీ నేరారోపణములను ధ్రువపరచి, సెషన్సుకు శ్రీ అరవిందుని, తదితరులను విచారణకై పంపించెను. సెషన్సు న్యాయాధికారియగు బీచ్ క్రాఫ్టు నెదుట విచారణ జరిగెను. “దేశ బంధు" అని తరువాత సుప్రసిద్ధినొందిన చిత్తరంజన్ దాసు అరవిందునికి కారాగార విముక్తి సంపాదనమున మిగుల తోడ్పడెను. అలిపూరు కారాగారమున గడచిన సంవత్సర పరిమిత కాలము శ్రీ అరవిందుని జీవితము నందు మిక్కిలి ప్రధానమైనది. ఇచట అతని జీవితము అంతర్ముఖమై అనంతరీతుల ఆధ్యాత్మిక జీవితము యొక్క సంపూర్ణ వికాసమునకు దోహద మొసగినది. ఇచ్చట వీరికి లభించిన దివ్యానుభవములు వీరి భవిష్యజ్జీవిత మార్గమును నిర్ణయించినవి. ఈతడు వీటిని "కర్మ యోగి” పత్రిక ద్వారమున లోకమునకు అందిచ్చెను.

ఆధ్యాత్మిక జీవితము  : ప్రభుత్వము అరవిందు నేదోవ్యాజమును పురస్కరించుకొని నిర్బంధింపవలయునని పట్టుపట్టి యుండుట స్పష్టమైనప్పటి నుండియు అతడు ఎచటనో అజ్ఞాత వాసమునందుండియే తన కార్యములను నిర్వహించుచుండెను. కడకు ఒకటి రెండు మాసములు చంద్రనగరునం దుండి, 1910 ఏప్రిల్ 4వ తేదినాడు అతడు పుదుచ్చేరి యందు ప్రవేశించెను. ఇచటనే నిర్యాణ పర్యంతము అతడు తన యోగసాధనమునుకొనసాగించెను.

పుదుచ్చేరిలో శ్రీ అరవిందుడు గడిపిన కాలమందు బాహ్య ఘటనలుగా లోకమునకు తెలుపదగిన అంశములు మిక్కిలి స్వల్ప సంఖ్యాకములు. 1914 వ సంవత్సరమున ప్రారంభింపబడిన 'ఆర్య' అను మాసపత్రిక ద్వారమున అరవిందుడు తన తత్త్వదర్శన యోగమార్గములను గూర్చి లోకమున కెరిగించెను.

శ్రీ అరవిందుల తత్త్వ దర్శనము ప్రాచీన కాలము నుండియు మనకు సంక్రమించిన ఆధ్యాత్మిక సత్యములపై ఆధారపడి యున్నది. అరవిందుని తత్త్వదర్శన మిది : ఈ సకలసృష్టికిని కారణమైన మూలతత్త్వ మొక్కటియే. ఏకం సత్ - దీనిని సచ్చిదానందమని వర్ణింపవచ్చును. ఇదియే అద్వితీయమైన చైతన్యము లేక బ్రహ్మము. అనంతప్రకారమై సతత పరిణామములకు లోనై, కొంత జడమై, కొంత సప్రాణమై, అజ్ఞానము, శోకము, మోహము మున్నగు అశుభములకు క్షేత్రమై తోచు ఈ సర్వమును, అద్వైతమును, నిత్యము, అనంతమును ఐన చైతన్యమే. 'బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం'. ఇంత అనుభవ విరుద్ధమైన మాట యొక్క సత్యమును గ్రహించుట, చేరుట, మానవుని చేతన ద్వారముననే జరుగవలయును. (ఏషో౽ ణురాత్మా చేతసా వేదితవ్యః). మానవుడు తన ఉనికి యొక్క సత్యమును తాను గ్రహించినయెడల అనగా, తన యాత్మను తాను గ్రహించిన యెడల ఒక యద్భుత మతనికి యథార్థమై గోచరించు చున్నది. తన యందలి ఈ యాత్మయే, సర్వభూతములందును గల యాత్మ ;అనగా తన ఆత్మనే సర్వభూతముల యందును అతడు చూచుచున్నాడు. అట్లే సర్వభూతములను తన ఆత్మ

యందే చూచుచున్నాడు. సర్వమునకును తా నాత్మయై తాను సర్వమును అగుచున్నాడు. సర్వాత్మభావమును లేక సర్వభావాపత్తిని చేరుచున్నాడు. మరియు ఈ ఆత్మయే బ్రహ్మము (అయ మాత్మా బ్రహ్మ). మనుజుడు తన యాత్మను సమగ్రముగా నెరిగినవాడై, బ్రహ్మమును తెలిసికొనుచున్నాడు; బ్రహ్మమే యగుచున్నాడు.(సయోహవై పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి). పరబ్రహ్మము నెరుగుటయన, బ్రహ్మమును తనయందును విశ్వమందును తెలిసికొనుటయేగాక అద్దానిని విశ్వాతీత మైన దానినిగా తెలిసికొనుట (పాదో౽స్య విశ్వాభూతాని త్రిపాదస్యా ౽మృతం దివి). ఆ బ్రహ్మము అచింత్యము, అవ్యపదేశ్యము, ఏ కాత్మప్రత్యయ సారము, ప్రపంచోపశమము, శాంతము, శివము, అద్వైతము అని తెలియనగును.

ఈ భూమిపై మనకు గోచరించు భౌతిక ప్రాణ మనోధాతువులు మూడు. పరిణామ క్రమమున ఇచట యోగ్యమైన భౌతికాధారము నిష్పన్నమై అందు ప్రాణము వెలువడుచున్నది. యోగ్యమైన ప్రాణాధారము వెలువడిన పిమ్మట అందు మనోధాతువు వ్యక్తమగుచున్నది. ఆవిర్భావమున పూర్వావశ్యకమైన స్థితి అంతర్హితముగా నున్నది. భౌతిక ధాతువునందు ప్రాణ మనో ధాతువులు అంతర్హితములై యున్న కారణముచేతనే పరిణామక్రమమున వాటి ఆవిర్భావము సాధ్యపడు చున్నది. శ్రీ అరవిందులచే ఈ ధాతువు అచేతనమైన జడముగా గాక అంతర్నిమగ్నమైన చేతన కలదిగా గ్రహింపబడు చున్నది. శ్రీ అరవిందుల ఈ పరిణామదృష్టికి పాశ్చాత్య విజ్ఞానముల అనురోధమున్నను లేకపోయినను, ప్రాచీన ఋషి జ్ఞానము యొక్క అవలంబము సంపూర్ణముగా కలదు.

"తపసా చీయతే బ్రహ్మ తతో౽న్న మభిజాయతే !
అన్నా త్ప్రాణో మనఃసత్యం లోకాః కర్మసుచామృతం "

అతి దీర్ఘకాల పర్యాప్తమైన ఈ పరిణామమునందు గోచరించెడు ప్రధాన లక్షణము చేతనా విర్భావము యొక్క క్రమాతిశయము. మనుష్యుడిపుడు భౌతిక శరీర మాధారముగా గల మనోమయప్రాణి. ఇప్పుడొక ప్రశ్న సహజముగా ఉత్ధితమగుచున్నది. అది 'ఇక నిచట ఈ పరిణామ కార్యము మానవునియందు మానసిక చేతన యొక్క ఆవిర్భావముతో ముగిసినట్లే తలపవలయునా? లేక దీనికంటే అధికతరమైన అభివ్యక్తి యేదేని భవితవ్యమునందు గలదా?' అనునది. ఈ ప్రశ్న కొసగదగిన సమాధాన విషయముననే అరవింద దర్శనము పూర్వమతములకంటె భిన్నమై గోచరించుచున్నది.

మనస్తత్త్వమున కూర్ధ్వ ము నందున్నది విజ్ఞాన తత్త్వము. (Super mind). విజ్ఞానశబ్ద మిచట ప్రత్యేకార్థముతో, తాను వివరించిన లక్షణములు గల భూమికను తెలుపుటకై, శ్రీ అరవిందునిచే వాడబడుచున్నది. ఇది మానవునియందభి వ్యక్తము కావలసియున్నది. ఈ అభివ్య క్తిని సాధించుటయే మానవజీవితము యొక్క పరమోద్దేశము, మరియు ఇచటి ఈ పరిణామగతియొక్క చరితార్థత. మనోభూమికను పూర్తిగా దాటినగాని ఆత్మ యొక్క సమగ్రజ్ఞానము సాధింపబడదు. సచ్చిదానందముల యాసంత్యమును మనోభూమిక పై నొక విధమైన ప్రతిబింబముగా గాని, లేక చైతన్యము నందు మనోమయసత్త తన్ను దాగోల్పో యెడు నిమజ్జనముగా గాని యెరుగ వీలుపడును. కాని ఈ జ్ఞానము క్రియాసమర్థము కానేరదు. దివ్యకర్మలను బ్రవర్తింప జేయలేదు. మనోమయ సత్తయందలి ఉనికికి కేంద్రమై ఇచటి కర్మలకు ప్రవర్తక మగుచున్న 'అహంత' పృథక్త్వమును అవలంబించి యుండుటచే, పూర్వోక్తములయిన అనుబంధము లందు విలీనమగుచున్నది. దివ్యస త్తతోడి ఐక్యమునందుండి దివ్యకర్మల నాచరింపగల సామర్థ్యము విజ్ఞాన సత్తయందలి దివ్యవ్యక్తికి గలదు. మన 'అహంత' దాని మలిన ప్రతిబింబము. ఈ ప్రతిబింబము తన స్వరూపములోనికి పరిణమింపవలయును. విజ్ఞాన భూమికలోని దివ్య వ్యక్తి యందు తన వ్యక్తిత్వానుభవముతో పాటు సర్వాతీతత్వ-సర్వాత్మ్యానుభవములు ఏకకాలికములై సామంజస్యము నొందగలవు. విజ్ఞానమయుడైన పురుషుడు అనంత సచ్చిదా నందములను అనుభవించుటయే గాక వాటి శక్తి చే తన మనః ప్రాణ శరీరముల ధర్మమును మార్పగలడు. వీటిని గూడ దివ్యసత్తయొక్క ప్రకారములనుగా పరిణమింపజేయగలడు. నిత్యముక్తమును, నిత్య శుద్ధమును, అనంతమును, అమృతమును అగు ఆత్మ యొక్క స్వరాట్త్వ సంరాట్ట్వ ములను బడయ గలడు. మానవజాతి యందు విజ్ఞానమయసత్త యొక్క అవతరణమునకు మార్గము నేర్పరుపగలడు.ఇదియే అమృతత్వము ; ఇదియే దివ్యత్వము; ఇదియే ముక్తత్వము, ఇదియే మానవుడు సాధింపవలసిన లక్ష్యముగా శ్రీ అరవిందునిచే నిరూపింపబడినది.

అరవిందుని యోగము  : శ్రీశ్రీ అరవిందుని యోగ సాధనయు ఈ లక్ష్యము కలదగుటచేతనే పూర్వ మార్గముల కంటె విశిష్టమగుచున్నది. సత్త యొక్క అపరార్థము నందు మనః ప్రాణ శరీరములును, పరార్థమున విజ్ఞాన సచ్చిదా నందములును కాననగును. మనుష్యుడు విజ్ఞాన భూమిక కారోహించి, తన మనోమయ సత్తను విజ్ఞానమయ సత్తగా పరిణమింప జేయగలడు. అపుడు తన వ్యష్టి చేతనతోపాటు విశ్వచేతన తోడను విశ్వాతీతత్వము తోడను యుగ సత్సంబంధమున నిలువగలడు. విజ్ఞాన భూమిక యందలి జ్యోతిశ్శక్తులను క్రింది మూడు భూమికలలోనికి అవతరింపజేసి అచట వాటిని నెలకొల్పగలడు. ఈవిధమున వాటి స్వభావమును, శరీరము యొక్క భౌతిక ధర్మమును గూడ సంపూర్ణముగా మార్చివేయగలడు. మనుష్యుడపుడు దివ్యుడై మానుష్యక మునందు దివ్యత్వ ప్రతిష్ఠాపనమునకు కేంద్రమై, దివ్యకర్మల నాచరింపగలడు. ఇదియే శ్రీ అరవిందుని విజ్ఞానయోగము.

శ్రీ అరవిందుడు పూర్వమార్గముల ప్రత్యేక లక్ష్యములను గూర్చియు, సాధనలను గూర్చియు వివరించి, వాటి నుండి ఏయే సాధనల నేదృష్టితో స్వీకరింపదగునో తనపూర్ణయోగమున దెలిపియున్నాడు. చిత్తమందు శాంతిని నెలకొల్పుటకై రాజయోగమును స్వల్పముగా నవలంబించి అటుపై కర్మ, జ్ఞాన, భక్తి మార్గములను చక్కని సంయోజనము నందు భగవద్గీత సమీకరించినది. కాని ఇందలి ఏదో ఒక మార్గము యొక్క ఉత్తమత్వమును, మిగిలినవాని యొక్క అవరత్వమును స్థాపింపబూనుకొనిన మతాఖిని వేశములచే ఈమూడు మార్గములును తిరిగి విడిచి వేయబడినవి. భగవద్గీత చే ఉద్దేశింపబడిన సంయోజనము మరల శ్రీ అరవిందుల యోగమునందు ఉద్ధరింపబడినది. ఆత్మ సమర్పణము అన్ని యోగములకును ప్రథమమును, అంత్యమును అగు సోపానము; యోగశక్తి నావాహింప నేర్చుటకు పూర్వావశ్యకమైన స్థితి చిత్తస్థిర శాంతియై యున్నది. ఇది సాధింపబడిన పిమ్మట యోగము తనను తానే నడుపుకొని ముందునకు బోవుననవచ్చును. "యోగో యోగస్య ప్రవర్తక".

నిర్యాణము  : శ్రీ అరవింద యోగీంద్రులు 1950 డిసెంబరు 4 రాత్రి 1-30 గంటల సమయము న (5-12-1950 మంగళవారము) మహాసమాధి ప్రవిష్టులయిరి. పరాసు దేశీయురాలును శ్రీ అరవిందాశ్రమమున కధిష్ఠాత్రియునగు మాత శ్రీ గురుదేవుని నిర్యాణమును గూర్చి ఇట్లు చెప్పెను :- "శ్రీ అరవిందుడు తన శరీరమును విడిచి పెట్టుటలో మహనీయమగు స్వార్థ త్యాగమును ప్రదర్శించెను. సాముదాయకమగు అనుభవ సిద్ధికాలమును త్వరపరచుటకుగాను ఆయన తన శరీర ములో పొందిన అనుభవ సిద్ధిని పరిత్యాగముచేసెను. "

శ్రీ అరవిందుల నిర్యాణ విధానము సామాన్య మానవ దుర్లభముగనుండి అద్భుతము గొల్పెను. అతని భౌతిక శరీరము ఎట్టి వికారములకు లోనుగాకుండా ప్రశాంతముగా నుండి, దివ్యకాంతిని వెదజల్లుచుండెను. ఇట్టి పరిస్థితి 78 గంటల వరకును ఉండెను. మృతకాయ మిట్లు జ్యోతిఃప్లుతముగా ఇంత దీర్ఘకాలము నిత్య నూతనముగా కనిపించుట అద్భుత విషయముగదా! ఆయన మహ మూర్తి శయ్యపై నిద్రపోవుచున్నట్లుగానో, సమాధిలో నున్నట్లుగానో కనబడుచుండెను. ఎటువంటి వికారములను చెందని ఆయన శరీరమునుండి హంస లేచిపోయినదో లేదో తెలియరాని పరిస్థితి యేర్పడెను.

పుదుచ్చేరిలోని ఫ్రెంచి ప్రభుత్వ శాసనముల ప్రకారము ఏ మృతకళేబరము 47 గంటలకు మించి ఆవాసస్థలములో నుండగూడదు. పుదుచ్చేరి ప్రధాన వైద్యాధికారి 8-12-1950 నాడు వచ్చి శ్రీ అరవిందులను పరీక్షించి విభ్రాంతు డయ్యెను. అరవిందయోగి భౌతికావశేషాలకు ఎప్పుడు ఎట్లు అంత్యక్రియలు జరుపవలె నను విషయములో ఆశ్రమమున పరిపూర్ణ మౌనము అవలంభింపబడెను. వాతావరణము పవిత్రముగా నుండెను.

శ్రీ అరవిందులవారు భారత దేశానికిచెందిన మహావ్యక్తి అగుటచే భారత పార్లమెంటులో అరవిందుని యెడ గౌరవ సూచకముగా ఒక నిమిషము సభ్యులందరు లేచి మౌన ప్రార్థనలు గావించిరి. లోక సభాసభ్యులు కాని వారి కిట్టి గౌరవము కలుగుట కవకాశము లేదు. అయినను శ్రీ ఆరవింద యోగీంద్రుని ఘనతను పురస్కరించుకొని ఆ నియమమున కపవాదముగా లోకసభాధ్యక్షులు ప్రవర్తించిరి.

1908 లో శ్రీ బాబు అరవిందఘోషు రాజద్రోహ నేరముక్రింద విచారింపబడియుండెను గదా! ఆ విచారణాంతమున శ్రీ అరవిందుల పక్షమున న్యాయవాదిగా నుండిన దేశబంధు బాబు చిత్తరంజన దాసుగారు ఈ క్రింది విధముగా తమ వాదోపన్యాసమును ముగించిరి :-

"ఈ వివాదము సద్దుమణిగిన తరువాత, ఈ సంక్షొభము, ఆందోళనము ఆగిపోయిన తరువాత, ఈయన మరణము పాలయి, అదృశ్యుడయిన తరువాత, ఈతడు దేశభక్తి కవితామూర్తి యనియు, జాతీయతా ప్రవక్తయనియు, మానవతా ప్రేమపూరితు డనియు పరిగణింపబడును. ఆతని ప్రవచనములు ఇండియాలోనే కాదు దూరదూరాననున్న సముద్రాలలోను, దూరదూరాననున్న భూములలోను ధ్వనించుచు, ప్రతిధ్వనించుచు ఉండగలవు.

వి. భ. - వే. చం.

[[వర్గం:]]