సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరబ్బీ భాషాసాహిత్యములు
అరబ్బీ భాషాసాహిత్యములు :- అరబ్బీ భాష సెమెటికు భాషా కుటుంబమునకు సంబంధించినది. ఇందు హీబ్రు, ఫినీషియన్, అరమెయిక్, అస్సీరియన్ మున్నగు ఉత్తర, దక్షిణ ప్రాంతములు భాషా సమూహములు చేరి యున్నవి. పురాతత్త్వశాఖవారి పరిశోధనల ఫలితముగా క్రీ. పూ. 4000 సం.ల నుండియు అరబ్బుల నాగరికతా చరిత్ర కనబడుచున్నది. హిమ్యరిటిక్ అనబడు దక్షిణ అరేబియా ప్రాంతమునందలి శాసనములు క్రీస్తు పూర్వము నుండి మొదలుకొని క్రీస్తు తరువాత 6 వ శతాబ్ది వరకును లభించుచున్నవి. ఇవి అత్యంత వికాసవంతమయిన వారి సంస్కృతిని, వారి ఆర్థిక సంపదను, హిందూ దేశమువరకు వ్యాపించిన వారి విశాల వాణిజ్య సంబంధములనుగూర్చి తెలుపుచున్నవి. ఈ శాసనములు, వారుపయోగించు చుండిన భాష ఉత్తమ సంస్కార భూయిష్ఠమైనదనియు, క్రీ. పూ. 1500 ప్రాంతమునందే లేఖనకళ వారిలో పరిపూర్ణ వికాసము చెందినదనియు, రుజువు చేయుచున్నవి. అదే విధముగా ఉత్తర అరబ్బీ భాష నగర సంస్కృతిని (Urban culture) పెంపొందించెను. అజ్ఞాత కాలము నుండియు మక్కా పట్టణము వాణిజ్యమునకును, మతములకును కేంద్రముగా నుండెను. దక్షిణ అరబ్బీ తెగలవారి యొక్కయు, మెసపుటేమియాలోని పారసీక ప్రభావితు లయిన అరబ్బుల యొక్కయు ప్రభావము, ఉత్తర అరబ్బీభాషలో భాషాభివృద్ధికిని, ఉన్నతమైన నాగరకతకును దోహద మొసగినది. అరబ్బీ భాషలో ఇప్పుడు వాడబడుచున్న అరబ్బీ అక్షరములు క్రీ. శ. 6 వ శతాబ్దపు శాసనములందు మాత్రమే కనబడుచున్నవి.
ఏడవ శతాబ్దము మొదలుకొని, ఇస్లాం మత వ్యాప్తితో బాటు ఉత్తర అరబ్బీ భాష ప్రజాజీవనమునందును, నాగరకత యందును ప్రగాఢముగ నెలకొనెను. ఇట్లిది అరేబియా ద్వీపకల్పమునందేకాక ఆసియా దేశములలోను, ఆఫ్రికాలోని ప్రొగుత్తర ప్రాంతములలోమ, స్పెయిన్, సిసిలీ మున్నగు పాశ్చాత్య దేశములలోను కూడ వ్యాప్తి చెందెను. ఈ ప్రాంతములలో అరబ్బీ భాష వాడుక భాషగా నుండుటయేగాక అది ఈజిప్టు, మాల్టా, ఈరాన్, జావా మొదలగు దేశములందును, ఏదో విధమున స్థానిక భాషలను కూడ త్రోసి రాజని పైకి వచ్చెను. దూర దూరములందున్న విశాల ప్రాంతములయందు వ్యాప్తి చెందినందున ఆయా స్థానిక ప్రభావములు కారణముగా అరబ్బీ భాషయందు పెక్కు మాండలిక భేదములు (dialects) రూపొందెను. కాని ఈ దేశము లన్నింటిలోను గ్రంథ భాష ఒకేవిధముగా నిలచియుండెను. పదమూడు శతాబ్దముల వెనుకనుండియు అది ఖురాను శైలిని, రచనా క్రమమును ఆధారముగా గొనుటయే యిందులకు కారణము. ఇది మధ్యప్రాచ్య దేశములలో పెక్కింటికి మాతృభాషగా నుండుటయేగాక ముస్లిం ప్రపంచములోని మత వ్యవహారములకును ప్రకృతి శాస్త్ర విజ్ఞాన ప్రసారమునకును వాడబడుచుండెను.
అరబ్బీ వాఙ్మయోత్పత్తి వికాసము (క్రీ.శ. 500-750):- ప్రపంచములోని మహావాఙ్మయము లన్నింటి యందు వలెనే ఇస్లాము మత ప్రారంభమునకు పూర్వపు అరబ్బుల విజ్ఞానవిలసితజీవితము పద్యరచనలలో ప్రత్యక్షమయ్యెను. అరబ్బీ పద్యములు అంత్యానుప్రాసాత్మకమగు గద్యగా ప్రారంభించెను. ఈ గద్య విధానమునే విమతారాధకులగు (Pagans) గణాచారులు (సోదెచెప్పు వారు. Oracles) తమ మంత్రోచ్చాటనా సందర్భములందు ఉపయోగించు చుండిరి. రానురాను అదియే అధికముగ లయానుబద్ధమైన రూపమును పొందెను. తరువాత నిది పదునారు ఛందస్సులుగా విభక్తమయ్యెను. ఈ ఛందస్సుల మారు రూపము లీ పరిగణనలో చేరలేదు. ప్రాచీన కాలములో ఉకాజు పట్టణము నందును, మక్కా పట్టణమునందును జాతరలు జరుగుచుండెను. అప్పుడు కవులు సమావేశమయి ఒకరినొకరు మించునట్లుగా కవిత లల్లి పోటీపడుచుండిరి.
వారు అల్లిన పద్యకవిత్వమును ఖసీదా (గేయగీతిక) అందురు. ఈ గేయగీతికలు ఆంగ్లభాషలోని ఓడ్స్ (Odes) వంటివి. ఇందు 60 నుండి 100 వరకు పంక్తు లుండ వచ్చును.
ఇస్లాము మతమునకు పూర్వయుగమున రెండు రాజా స్థానములు అరబ్బులకుండెను. “ఇందొకటి "ఘస్సనీడ్ "
(ghassanid) వంశ పరిపాలితము. ఈ రాజ్యము అరేబియా యొక్క ఈశాన్య భాగమున వ్యాపించియుండెను. మరియొకటి “లఖ్మిద్” వంశ పరిపాలితము. ఈ రాజ్యము యూఫ్రటిస్ నదికి పడమటి దిశయందు వ్యాపించియుండెను. ఘస్సనీదుల సంస్కృతీ సభ్యతలు రోమను ప్రభావముల తాకిడికి గురియైయుండగా, లఖ్మిదులు పారసీక(సస్సేనియ౯) సంస్కృతిచే ప్రభావితులయిరి. ఈ రెండు రాజ్యములు పెర్సియా, రోము దేశముల మధ్య జరిగిన యుద్ధములందు ఘనమైన పాత్రను వహించెను. తమ రాజాస్థానములకు ఏతెంచు కవులను, ఈ రెండు రాజ్యముల ప్రభువులును సత్కరించుచుండిరి.
ఇస్లాం పూర్వయుగ కవితనుబట్టి, ఈ ఎడారి ప్రజలు తమతమ విశ్రమస్థానముల (encampment) కనువగు గడ్డి మైదానములను, సారవంతములగు భూములను వెదకుచు దేశద్రిమ్మరులుగా తిరుగుచుండెడివారని తెలియుచున్నది. వీరు ప్రకృతి పరీక్షయందు నిపుణులై వాస్తవిక దృష్టిగల వారై యుండిరి.
ఇస్లాం పూర్వయుగ కవితలో వేదాంతధోరణి గాని, గంభీర ధార్మిక చింతనగాని లేదు. బిదూయీ౯ అరబ్బులు నీతిప్రవర్తన యందును, సాంఘికజీవనము నందును తమ తెగసంప్రదాయములనే గౌరవించిరి. శౌర్యము, ప్రేమ, ఇష్టజన వియోగముచే నైన దుఃఖము, అవమానము, ఘనత, ఆతిథ్యము అనునవి వారికవితకు వర్ణనాంశములు. ఇవి ప్రజారంజకములగు విషయములై యుండెను. వీటిని గూర్చియే వారెక్కుడుశ్రద్ధ గనుపరచుచుండిరి.
అయినను, ఇస్లాం పూర్వయుగకవితలో యుద్ధములు; సాహసకార్యములు, ఆతిథ్యనిరతులగు దాతల సంకీర్తనములు, పిసినిగొట్టుల యొక్కయు, పిరికిపందల యొక్కయు నిందాపూర్వక వర్ణన లేయున్నవి. ఈ విధముగా ఈ కవిత్వము అప్పటి సాంఘిక పరిస్థితులను స్పష్టము చేయు మూల సాధనముగను, అరబ్బుల జాతిలోని తెగల చరిత్రను జాటు నదిగాను ఉపకరించుచున్నది.
కొన్ని ఉపన్యాసక్రమములును, సోదెకాండ్రు వచించు అనుప్రాసయుక్తములగు మాటల ధోరణులును తప్ప ఇస్లాము పూర్వయుగమున వచన వాఙ్మయమున్న జూడ కనుపించదు. ఖగోళశాస్త్రము, శీతోష్ణస్థితిశాస్త్రము (climatology) ముఖలక్షణ (సాముద్రిక శాస్త్రము (physiognamy), వంశానుచరితము (geneology) ఈ శాస్త్రములతో అరబ్బులకు పరిచయమున్నట్లు తోచుచున్నది. ఏమైన నేమి ? అరబ్బీ వాఙ్మయములో మొదటి గ్రంథముగా మనకు కనబడునది ఖురాను గ్రంధమే. ఈ గ్రంథములో న్యాయ్యముగను, దైవచింతనముతోను జీవితము గడపుటకు వలయు ధార్మిక నీతిసూత్రములును, సాంఘిక నియమములును ప్రవచింపబడినవి. సాహిత్యదృష్టిలో ఉదాత్త గ్రంథముగా ఖురా౯ విశిష్టతను కలిగియున్నది.
మహమ్మదు ప్రవక్త జీవించియున్న కాలములో ఇస్లాం పవిత్రగ్రంథము నిర్మితమైనప్పుడు అరబ్బీ లిపి దోషభూయిష్ఠముగా నుండెను. గ్రంథ విషయములు భ్రష్టము కాకుండ కాపాడటకు తగు లిపిని, వ్యాకరణ సూత్రములను వినిర్మించుట అత్యవసర కార్యమయ్యెను. ఖురాను వాక్యార్థనిర్ణయమునకు వ్యాకరణశాస్త్ర పఠనము, శబ్దరాశి జ్ఞానము అవసరమయ్యెను. పదముల యొక్క సరియైన అర్ధము ఇస్లాం పూర్వయుగ కవుల రచనల నమసరించి నిర్వచింపబడుచువచ్చెను. ఇందుమూలమున ఇస్లాం పూర్వయుగ కవుల రచనలను సరిదిద్దుట అవసరమయ్యెను.ఈ విధముగా శబ్దతత్వశాస్త్రము (philology), నిఘంటు నిర్మాణము ఆవిర్భవించెను. మహమ్మదు ప్రవక్త యొక్క ఉపదేశములు, కృత్యములు మనస్సునకు తెచ్చుకొని, తదనుసారముగా ఖురాను సిద్ధాంతముల ఆచరణ విధానము నిర్ణయింపబడెను. తత్ఫలితముగా "పవిత్ర సంప్రదాయ" మనబడు శాస్త్రము (Hadith) ప్రచలిత మయ్యెను.
మొదటి నలుగురు ఖలీఫాల కాలముముగిసిన తరువాత ఇస్లామీ విజ్ఞాన ప్రబోధ కేంద్రము ధర్మనిష్టాపరులైన ఖలీఫాల రాజధాని అగు మదీనానుండి డమాస్కసు పట్టణమునకు మారెను. అప్పుడు డమాస్కసునందు, లౌకిక భావ సమన్వితులును, మక్కా కుటుంబము వారును అయిన "ఉమ్మయ్యీదు"లు, అంతకుముందున్న ప్రజారాజ్య విధానమును నెట్టివైచి, ఆస్థానమున రాజవంశ పరిపాలనా విధానమును నెలకొల్పిరి. ఉమ్మయ్యీదులు రాజ్యాధికారము వహించినప్పటి నుండియు ఇస్లాం పూర్వ యుగ ఆచారములు, ఆదర్శములు తిరిగి తలలెత్తి వ్యాపింపసాగెను. అంతకు ముందుండిన ధర్మతత్పరత్వము యొక్క స్థానమును స్వేచ్ఛావిలాస జీవితము _ ఆక్రమించెను. గ్రామీణ రాజకీయ పక్షములలో అంతర్యుద్ధములు పొడసూపెను. ఈ అంతర్యుద్ధములు బిడూయి౯ అరబ్బులకు పట్టణ జనులతో సంపర్కము కలిగించినవి. వీరిద్వారా బిడూయి౯ కవిత యొక్క ప్రాచీన రీతులు పట్టణములలో ప్రవేశించెను. ఈ కవిత సామాన్యముగా ఉద్రేశాత్మకము, ప్రకోపనాత్మకము అగుటచేత అచ్చట వర్ధమానమగుటకు దానికి అనుకూల వాతావరణము లభించెను. కాని, విమతస్థుల ఆక్షేప కావ్యములును (Satire=Hija), స్తోత్ర కావ్యములును (Eulogy =Fakhr) ఇప్పుడు రాజకీయ వాసనకలవియై రాజకీయ కవిత్వము, రాజకీయ ఆక్షేప కావ్యములు ప్రత్యక్షము కాజొచ్చెను.
విలాస జీవితవిధానము ప్రేమభావ పుష్టమై శృంగారాత్మక మైన, కావ్యములు ప్రభవించుటకు కారణమయ్యెను. విశుద్ధ ప్రేమాత్మక కావ్యములు ముఖ్యముగా ఎడారి జనపదములందు వర్థిల్లుచుండెను. నగరవాసుల ప్రేమ కవిత్వమునకు విరుద్ధమైన ప్రేమానుభవములను ఎడారికవి వర్ణించుచుండెను. బుఠానియా ప్రేమికుడగు జమిత్బుసూమరు “ (Jamit-b-Ma'mar. d. 82 A. H.), లు బ్నా ప్రియు డగు ఖైస్భుజారిహ్ (Qais-b-Jarih) ; లైలా వలపుకాడగు మజ్ను - వీరు పవిత్రప్రేమ కవిత్వము నందు నాయకులు. విమతస్థుల కాలములో 'గజల్' అను ఛందస్సు, ఓడ్ అను ఛందస్సునం దంతర్భాగముగ నుండెను. దానికి స్వతంత్ర అస్తిత్వము లేకుండెను. కాని ఉమ్మాయ్యీదుల కాలములో అది యొక స్వతంత్ర ఛందస్సుగా రూపొందెను.
ఇస్లాం మతము సాహితీ సంస్కృతులయొక్క అభివృద్ధిని పురికొల్పేను. అది క్రమముగా బలపడెను, అప్పుడు విద్వాంసులు ప్రాచీన కవితా గ్రంథముల సేకరణ ప్రయత్నమునకు పూనుకొనిరి. “రావిస్" (Rawis) అనువారు ప్రాచీన కవితాగాయకులు. వీరు ఆ గీతములను వల్లెవేసి గానము చేయుచుండెడివారు. ఈ రావిసులు ప్రాచీన కావ్యసేకరణ భారమును వహించిరి.
అరబ్బీ వాఙ్మయ లక్షణములు :- (750-1258) క్రీ.శ.750లో అబ్బాసిదులు రాజ్యారోహణ మొనరించిన నాటి నుండి అరబ్బుల రాజకీయ, సంస్కృతి జీవితములందు ప్రధానమయిన మార్పులు వచ్చెను. ఖలీఫాల రాజధాని డమస్కసునుండి బాగ్దాదుకు మార్చబడెను. బాగ్దాదులో రాజకీయ, పరిపాలన, సంస్కృతి, జీవితరంగములందు పారసీక ప్రభావము ప్రాబల్యమునొందెను. ఈ విధముగా నూతన విధమైన వాఙ్మయసృష్టికి రంగము సిద్ధమయ్యెను. అరబ్బుల ప్రాచీన రాజకీయ సంప్రదాయముల నభివృద్ధి పరచుటకు బదులుగా "అబ్బాసిదులు" పద్య గద్యములను ఆదరించుచు, అపార భౌతికశాస్త్ర వాఙ్మయమునుగూడ అభివృద్ధిపరచి "సంస్కృతి" ఆశయమును విశాల పరచిరి. ఈ యుగమందలి వాఙ్మయమును మతము, భాషాతత్త్వము, గద్యము, పద్యము, చరిత్ర, భూగోళ శాస్త్రము, వేదాంతము, భౌతిక శాస్త్రములు - అను శాఖలుగా విభజింపవచ్చును.
ముస్లిముల ప్రథమ కర్తవ్యము ఖురానుతోపాటు మహమ్మదు ప్రవక్త యొక్క ఉపదేశములు, చర్యలు సంపాదించుటయై యుండెను. ఎందుచేతనన ఈ సంప్రదాయములు మత విశ్వాసముల సంబంధమునను, మత విధుల ఆచరణము నందును ఏది ప్రామాణికమో, ఏది తప్పక యాచరింపదగినదో తెలుపునవిగా నుండెను. నిత్యజీవితమునందు ఖురాను సిద్ధాంతములను ఆచరణలో పెట్టు విధానమును ఈ సంప్రదాయములు మాత్రమే నిరూపించును. రానురాను హాడిత్తుల (సంప్రదాయముల) సంచయములు పెరుగసాగెను. అల్ప ప్రామాణికములయిన కొన్ని విషయములుకూడ వాటియందు ప్రవేశించెను. కాబట్టి వాటి నన్నిటిని పరిశీలన పూర్వకముగ విచారణ సల్పి, గాలించి, ఏవి ప్రామాణికములో, ఏవి కల్పితములో నిశ్చయించిరి. ఇట్టి విమర్శనాత్మక పరిశోధనము మూలమున, ఈ సంప్రదాయములను పరంపరగా అందిచ్చుచు వచ్చిన వారి జీవితచరిత్రలు తెలిసికొని, వారిలో ఎవ్వరు నమ్మదగినవారో, ఎవ్వరు నిరాకరింపదగినవారో గుర్తింపవలసి వచ్చెను. మత ధర్మ వాఙ్మయమునకు సంబంధించిన ఈ వర్గమునకే ఖురాను వ్యాఖ్యానము (భాష్యము) చెందియున్నది. మూల గ్రంథము యొక్క చారిత్రక సమాలోచనలు, దాని వ్యాకరణ భాష్యములు, దాని సాహిత్యాలం కార గుణ గ్రహణము, దాని నిబంధనల యొక్కయు, న్యాయసూత్రముల యొక్కయు ప్రాముఖ్యము, సిద్ధాంతముల మత ధర్మ నిరూపణము ఇవియే ముఖ్య పఠనాంశములయి యుండెను. ప్రారంభమున నిది హాడితు (పవిత్ర సంప్రదాయ) వాఙ్మయ భాగముగా నుండెను. తరువాత నిది స్వతంత్రము, క్రమబద్ధము నగు శాస్త్రముగా పెంపొందెను. గత పరిశోధన ఫలితముల నన్నింటిని సమీ కరించి, ఒక మహాసంపుటములో క్రోడీకరించిన సుప్రసిద్ధ పండితుడు ఇబ్నుజారిక్ ఆల్ తహరీ అనునతడు. ఖురాను నుండియే విధ్యాత్మకములగు నియమములు ఏర్పరుపబడెను. అవియే ధర్మశాస్త్రముగా పరిణతిచెందెను. ధర్మశాస్త్ర విధులను గూర్చి షఫాయి; హనఫీ శాఖలవారు పెక్కు గ్రంథములను నిర్మించిరి.
భాషా తత్వశాస్త్రము (philology) : అరబ్బులు కానివారు ఇస్లాంమత ప్రవిష్టులగుట, అరబ్బులు దూరదూర మందున్న ముస్లిందేశ ప్రాంతములలో స్థిరనివాస మేర్పరచుకొనుట కారణములుగ నిర్దుష్టమైన ఖురాను గ్రంథపఠన క్రమమును ఏర్పరచుట అవసరమయ్యెను.
ఖలీఫా ఆలీ యాజ్ఞను పురస్కరించుకొని అబుల్ ఆస్వాద్ ఆద్ దుఆలి (Abdul Aswad ad Duali 685) అనునాతడు మొట్టమొదట వ్యాకరణ పద్ధతుల గూర్చి చర్చించినట్లు తెలియుచున్నది. అరబ్బీ భాషా వ్యాకరణమును గూర్చిన విచారణము ఇరాకులోని కూఫా, బాస్రా అను రెండు పట్టణములలో సాగినది. ఈ చోటులందే భాషా నియమములను గూర్చియు, అరబ్బీజాతీయములను గూర్చియు పండితులకు గల పరస్పర విరుద్ధ భావములను పురస్కరించుకొని వ్యాకరణ విషయములో రెండు వాదములు ఏర్పడెను.
భాషా శాస్త్ర విషయములను, నిఘంటు సామగ్రిని సేకరించు పని బెడూయినులు గావించిరి. వన్య మృగములను గూర్చి యొక గ్రంథము, ఆశ్చర్యములను గూర్చి యొక గ్రంథము, ఒంటెలను గూర్చి యొక గ్రంథము, వర్షమును గూర్చి యొక గ్రంథము, మానవుని నైజమును గూర్చి యొక గ్రంథము రచితములయ్యెను. ఇవి తొలుతటి గ్రంథములు. తరువాత కొంత కాలమునకు క్రమబద్ధమైన విస్తృత నిఘంటువులలోనికి ఈ గ్రంథములు చేర్చబడెను. బాస్రా మతాచార్యుడైన అబూబకర్ ఇబ్ను దురాయిదు (Abu Bakar ibn Duraid) అనునతడు జం హరా, కితాబ్ ఆల్ ఇష్తఖాఖ్ అను బృహత్కోశమును సంకలనము చేసి అందు శబ్దముల మూలములను, వాటి నుండి ఏర్పడిన అవాంతర రూపములను వివరించెను. ఈ వర్గమునకు చెందిన వాడే అల్ ముబార్ రాదు (al-mubarrad 898). ఈతని రచన యగు కితాబు అల్ కామిల్ (Kitab al Kamil) అను గ్రంథము అరబ్బీ భాషా, సాహిత్యములను గురించియే గాక, ప్రాచీన చరిత్ర, సంప్రదాయములను గురించి కూడ వివరించు నొక విజ్ఞాన సర్వస్వము.
గద్యపద్యములు : అబ్బాసీదులు విజ్ఞానాత్మక కృతుల యెడ తమ ఆదరాభిమానములను జూపుచుండుటయేగాక పద్యవాఙ్మయాభివృద్ధికిని తగు ప్రోత్సాహము కల్పించిరి. ఒకవంక పూర్వ ధోరణిలో ఖసీదా ప్రక్రియలతో విమతాను సారములగు రచనలు సాగుచుండగా, మరియొక వంక పద్యరచనలలో క్రొత్త ఫక్కీ కవనము తలయెత్త సాగెను, ఈరాను ప్రభావమున మారిన పరిస్థితుల కనుగుణముగా మృదుత్వమలవడినను కవితారీతిమాత్రము పూర్వ ప్రమాణమునే యనుసరించెను. విదేశ ప్రభావము వలన ప్రబలిన మతవ్యతి రేకోద్యమములు కవుల నెక్కుడుగ ప్రభావితులగావించెను. ఇట్టివారిలో కొందరు జిండిక్కులు (నాస్తికులు) అని పిలువబడిరి. ఈరానులు అద్వైతసంప్రదాయముచే ప్రభావితులయిన కవులు బాషా షారు ఇబ్ను బుర్డు (783), సాలీ ఇబ్నె అబ్దిల్ ఖుద్దును (813) అను వారలు. పూర్వకవులు కొందరు మాత్రమే గాక, ఈ యుగమున అత్యంత ప్రసిద్ధికి చెందిన కవులు అబునవాస్, ఆబుల్ అతాహియా, ఆబూతమ్మమ్, ఆల్ బహుతూరి అనువారలు. ఆబుల్ నవాస్ (810) రచించిన “దివా౯" అను గ్రంథమునందలి జుహుదియాత్ (పవిత్ర) ప్రకరణమునుబట్టి వృద్ధాప్యములో నీతడు గభీరవిషయ తత్త్వాన్వేషి యైయుండినట్లు కనబడుచున్నను, ఈతడు విశృంఖలు డగు కవి. అయినను, ఈతని త్రాగుబోతు పాటలు,శృంగార పద్యములు గొప్పకీర్తిని గడించినవి. ఇక అబుల్ అతాహియా (828) కవి జుహుద్ (పవిత్రత), పవిత్ర వర్తనములను గూర్చిన రచనల యెడ ఎక్కుడు అభినివేశముకలవాడై నీతిబోధక పద్యములను సరళ భాషలో ప్రబోధాత్మకముగ రచించెను. పద్యకవిత్వముతో సరిసమానముగ సంగీత విద్యయును వృద్ధిచెందెను. సంగీత శాస్త్రము మీద, వాద్యసాధనములమీద గ్రంథములు రచింపబడెను. సంగీత పాఠకులు ప్రత్యేక రాగఫణుతులు, వారి జీవచరిత్రలు సుప్రసిద్ధమైన కితాబై-అల్ అఘాని యందు నిక్షిప్తములైనవి.
అబ్బాసీదు ఖలీపాల ఆధిపత్యము ఛిన్నాభిన్నమయిన తరువాత ఇస్లామీ సామ్రాజ్యమున నెలకొనియున్న అల్ప రాజ్య సభాస్థలులు విద్యావ్యాసంగములకు కేంద్రములయి వెలసెను. అలెప్పోయందలి సైపుద్దౌలా యొక్క హందానిద్ సభాస్థానము అరబ్బీ వాఙ్మయ కేంద్ర రాజములలో నొక్కటిగా విలసిల్లెను. ఇచ్చటనే అల్ ముతా సబ్బీ (985) అను కవిపుంగవుడు వర్ధిల్లెను. ఈతని కవితకు ప్రజలు ముగ్ధులయి, దానిని పఠించుచు, వ్యాఖ్యానించు చుండెడివారు. పండిత మండలిలో దానికెక్కుడుగ మాన్యతలభించుచుండెను. సైఫుద్దౌలా అలెప్పో రాజ్యాధిపతిగా గ్రీకులతో నలుబది యుద్ధములు సల్పినవాడు. ఈ సైపుద్దౌలా దండయాత్రలనుగూర్చి అల్ ముతానబ్బీ, తన సమకాలిక కవియగు అబు ఫిరాస్ ఆల్ హందానితో గలిసి కవితాగానము చేయుచుండెడువాడు. పూర్వ సంప్రదాయసిద్ధమయిన కవిత్వ విధానము "అల్ మా అర్రి" (1054) అను అంధకవితో అంతమొందెను. ఈ అంధకవి ఇస్లామీ శాస్త్రములందును, గ్రీకు, హిందూ తత్వశాస్త్రములందును విశేష జ్ఞానపంపన్నుడై సిరియా, బాగ్దాదులందు గణుతికెక్కెను. సారస్వత పత్రలేఖనము చేత నేగాక, “సఖత్ అల్ జందు; లుజుం మా లాయల్జూం" అనెడు రెండు పద్యకావ్య రచనల చేగూడ నీతడు ప్రసిద్ధి కెక్కినాడు. ఈ కావ్యములందు అల్మా అర్రి. సమకాలికుల భావములను, సంఘజీవనమును, ప్రభుత్వమును, మతమును మొగమోటము లేకుండ, ధైర్యముగా ఖండించినాడు, జుహదునందు (పవిత్రతా సూత్రములు) ప్రతిపాదించిన ఆదర్శములను అల్ మా అర్రి తన జీవితము నందు కార్యరూపమున ప్రవేశ పెట్టినాడు. ప్రవేశ పెట్టినాడు. మాంసా హారమును, వివాహమును వ్యతిరేకించుటకుగూడ నితడు పూనెను. అతని భావములందు బౌద్ధమత ప్రభావము కూడ కనబడెను.
అరబ్బీ వాఙ్మయమున రమణీయ వచన రచనా ప్రారంభమునకు అబ్బాసీదు, ఖలీఫాలే ముఖ్యకారకులు. వీరు పెర్షియన్, గ్రీకు, సిరియా భాషలనుండి అరబ్బీ లోనికి అనువాదములను చేయుటను మిగుల ప్రోత్సహించిరి. పారసీనుండి కాల క్షేప వాఙయము ను,(Light Literature), గ్రీకు నుండి తత్త్వశాస్త్ర గ్రంథములను, భౌతికశాస్త్ర గ్రంథములను, ఇండియానుండి గణిత శాస్త్రమును అనువాదము చేయు నుద్యమము ముమ్మరముగ సాగెను. సంస్కృత గ్రంథమగు పంచతంత్రము అరబ్బీలోనికి అనువదింపబడెను. దీనికి అరబ్బీలో "కలిలా వ దిమ్మా" అని పేరు. ఈ అరబ్బీ అనువాదము పరిష్కృత పహ్లవీ గ్రంథమునుండి చేయబడినది. అనువాదకుడు ఇస్లాము మత ప్రవిష్టుడును, పర్షియా దేశీయుడు నగు “ఇబ్నె అల్ ముఖప్పా" (757) అను నాతడు. ఇతడు పారసీక చరిత్ర గ్రంథమగు “ఖుదాయినామా" అను దానినిగూడ అరబ్బీ భాషలోనికి అనువదించినాడు,
ఇట్లు వివిధ విషయములను గూర్చి కళాత్మకమైన వచన శై లిలో రచింపబడిన పెద్ద గ్రంథములేగాక, ప్రజలలో సామాన్య విజ్ఞాన ప్రసారమున కుపయోగించెడు విజ్ఞానకోశ (సర్వస్వ) గ్రంథములుకూడ ప్రచారము లోనికి వచ్చెను. ఇట్టి వానిలో “ఇబ్దు అల్ వరీద్" అను గ్రంథమొక్కటియై యున్నది. దీనిని "ఇబ్నె అబ్దు రబ్బీ" (939) అను స్పెయిన్ దేశీయుడు రచించెను. ఇందు 25 అధ్యాయములు కలవు. ఈ అధ్యాయములలో ప్రాగిస్లామిక చరిత్రము, ఇస్లామిక చరిత్రము, కవిత్వము (Poetry), ఛంద శ్శాస్త్రము, సామెతలు, సారస్వత, ఐతిహాసిక గాధలు మున్నగునవి కూర్పబడినవి. ఇట్టి రచనా విధానము కలవియై తరువాతి కాలమునకు చెందినవి రఘిబ్ అల్ ఇఫహాని (1108) రచించిన “ముహదరాత్, అవ్ ఉదబా", అజ్ జమక్షరి (1143) రచించిన “రబీ అల్ అబరుహొ" అను గ్రంథములు.
పరిపాలకుల రాజకీయ వ్యవహారపత్రములు, రాజ్య విషయక లేఖావళులు పెరిగిన కొలది, అందమయిన వచన రచన యొక్క ఆవశ్యకత అధికము కాజొచ్చెను. ప్రాత కాలపు నిరాడంబరమైన శైలి స్థానమున అలంకార యుక్తమైన శైలి ప్రభుత్వ వ్యవహారములందు ప్రవేశించెను. ఈ ఆలంకారిక గద్యరచనలలో ఛందోచిత్రములు, సాజా, (అనుప్రాస యుక్త గద్యము) విరివిగా నుపయోగమునకు వచ్చెను.
అలంకారయుక్త రచనలు మఖమా (Maqama) అను పేరుగల విచిత్ర వాఙ్మయ సృష్టికి దారితీసెను. ఇది ఒక ఏకాంకిక నాటకమువలె నుండును. ఇందులో కథానాయకుడు ప్రచ్ఛన్న వేషముతో రంగమును ప్రవేశించును. ఈ వేషధారినిగూర్చి సూత్రధారుడు వివరించును.
"మఖమా" అనునది కథాకథన కళయందు అభివృద్ధి విధానముగా గనబడుచున్నది. ఈ విధానము అరబ్బీ మాటాడు దేశములలో అభిమానాత్మకమై యొప్పుచుండెను. పలుతెగలవారి యుద్ధములను గూర్చిన ప్రాగిస్లామిక పురావృత్తముల వలెనే, అంతారా (Antara's) యొక్క సాహస కార్యములు, దక్షిణ అరేబియా రాజగు సెయుఫ్ ఇబ్నెయాజన్ యొక్క శృంగార విహారములు, బానుహిలాల్ అనువాని శృంగార కథలు- ఇట్టి కథావాఙ్కయము నలుమూలలక, ప్రాకెను. వీటిని ప్రజ లుత్సాహముతో పఠింపసాగిరి. ఈ వర్గమునకు చెందినది, అరేబియా వాఙ్మయములో నేగాక ప్రపంచ వాఙ్మయము నందును సుప్రసిద్ధమైన “వేయిన్నొక్కటిరాత్రుల" కథాగ్రంథము. ఈ కథలు భారతీయ వస్తుమూలకములై "హజారు అఫసానా' అను శీర్షికతో వ్రాయబడిన పారసీక కథలని తెలియుచున్నది.
తత్వశాస్త్రము … భౌతికశాస్త్రములు :- అరబ్బీ గద్యవలెనే భౌతికశాస్త్ర వాఙ్మయము కూడ గ్రీకు గ్రంథముల అను వాదములతో ప్రారంభమయ్యెను. ఖలీపాహరూన్ ఆల్-రషీదుచే స్థాపితమై, ఆతని పుత్రుడగు ఆల్-మామున్ చే విస్తరింపబడిన " బెయిత్ అల్ హిక్మా అను పేరుగల విద్యా సంస్థ ఏర్పడినప్పుడు అనువాద కార్యక్రమములు మరింత వృద్ధిచెందెను. ఖుస్తా.బ్- లుఖా (835) అనువాడు అరిస్టాటిల్ రచనలనేగాక గణిత, ఖగోళశాస్త్ర గ్రంథములను ముఖ్యముగా "యూక్లిడు" గ్రంథమును (క్షేత్రగణితము) అనువదించెను. హునైన్ ఇబ్నె ఇషాభ్(973) వైద్య గ్రంథములతో పాటు ప్లేటో రచనలకు అనువాదము చేసెను. హుబై అనువాడు వృక్ష, వైద్యశాస్త్ర గ్రంథములను అనువదించెను. ఈ యుగములో పుట్టిన భౌతికశాస్త్ర గ్రంథ సంపద ఎట్టిదియో ఇబ్నెనదీం (995) సంకలితము చేసిన కితాబు అల్-ఫిహరిస్తు (గ్రంథముల పట్టిక) అను గ్రంథమును చదివినచో తెలిసికొన వచ్చును. ఇతడు సాహిత్య, భౌతిక శాస్త్ర గ్రంథములను గూర్చిన విశేషాంశములను దొరకినంతవరకు సమకూర్చి, విషయ దర్పణముగా నుపకరించుటకు ఈ గొప్ప గ్రంథమును సిద్ధముచేసెను. అరిస్టాటిలు గ్రంథములేగాక ప్లేటో గ్రంథములు పెక్కు గూడ భాషాంతరితములయ్యెను. ఇస్లామీ తత్త్వవేత్తలపయి ప్లేటోమతము ఎక్కుడు ప్రభావము కలిగించెను. వారి భావాదర్శము (Ideology) నాలుగవ శతాబ్దములోని ఇఖవా౯-ఎస్-సఫా అనువాని సాహచర్యమున విశేష క్రమానిత్వమయిన పద్ధతిగా వృద్ధి చెందెను. ఈ ప్రతిష్ఠాపనము యొక్క ఉద్దేశము నవ ప్లేటోనిక దర్శనము ననుసరించి ఇస్లామిక తత్త్వభావములను రూపింప జేయుటయే. వారు తమ తత్త్వభావములను సంగ్రహపరిచి, రసైల్ "ఇఖ్వానాస్ సఫా" అను గ్రంథములో పొందుపరచిరి, ఈ గ్రంథ సంపాదకుని పేరు తెలియదు.
తత్త్వశాస్త్రమును గూర్చి మొట్టమొదట గ్రంథ రచన గావించిన వాడు “ఆబు యూసుఫ్ యాకూబు అల్ కిండి" (862). ఇతడు తత్త్వశాస్త్రము, వైద్యము, ఖగోళ శాస్త్రము, గణితము, గానము మున్నగువాని మీద రెండువందల గ్రంథములు వ్రాసినాడు. ఆ కాలవు ప్రసిద్ధ తత్త్వవేత్తలలో నొకడగు " అబునసర్ అల్ ఫరాబి "(950) అను వాడు అరిస్టాటిల్ మీద, గణిత, గాన గ్రంథముల మీద వ్యాఖ్యానములు వ్రాసెను. ఆబు అలి ఇబ్నె సీనా అనువాడు వేదాంతము, తత్త్వజ్ఞానము, వైద్యము, ఖగోళశాస్త్రము, భౌతిక శాస్త్రము మున్నగు సమస్త విజ్ఞానశాఖల మీద గ్రంథములు రచించెను. తత్త్వ విషయ ప్రతిపాదకమగు కితాబె అష్ షిఫా, వైద్యవిషయ వివరణాత్మకమగు అల్ ఖనూ౯ పిట్ టిబ్ అను నీ గ్రంథములు మిగుల ప్రసిద్ధి చెందినట్టివి. ఇవి లాటి౯ భాషలోనికి అనువదింపబడినప్పుడు ఆ యనువాదములు మధ్యయుగ మున యూరపుఖండములో కూడ అత్యంత ప్రామాణికమైనవిగా పరిగణింపబడెను.
ఇబ్రహీం అల్ ఫజారి అనువాడు ఖగోళశాస్త్ర విషయక కోష్ఠములను (Tables) సిద్ధముచేసెను. ఖలీఫా అల్ మన్సూరు ఆజ్ఞ ప్రకారము భారతీయగణితశాస్త్ర సంబంధములగు ‘సిద్ధాంత' గ్రంథములు అరబ్బీ భాషలోనికి అనువదింపబడెను. అల్ "ఖవారిజ్మి" అనువాడు ఈ గ్రంథముల సారములను రచించెను. అలెగ్జాండ్రియా పట్టణ వాసియు గణిత, జ్యోతిష శాస్త్రవేత్తయునగు 'టాలెమీ' అను గ్రీకు పండితుడు రచించిన అల్ "మెజెస్టు" (al majest) అను గ్రంథమును ఇబ్నె మేటరు (829) అనునతడు అరబ్బీలోనికి భాషాంతరీక రణముచేయగా, జ్యోతిశ్శాస్త్రవాఙ్మయము వెన్నులు వేసి మరింత వృద్ధిచెందెను. అరబ్బీ జ్యోతిశ్శాస్త్రజ్ఞులలో గణనీయులు అల్ ఫరఘాని, అల్బాధాని, ఇబ్నె యూనుసు, ఇబ్నె అల్ హైధాం, జేబరు ఇబ్నె అఫ్గా అను వారలు, బాగ్దాదు, డమాస్కను, కైరోలందు నక్షత్ర శాలలు నిర్మాణము నొందుటచే ఈ విద్యకు మిక్కిలి ప్రోత్సాహము కలిగెను.
ఇతర భౌతిక శాస్త్రముల వలెనే అరబ్బుల వైద్యశాస్త్రము గూడ అనువాదములతోను గ్రీకు భీషఙ్మణుల పద్ధతి నవగాహన చేసికొనుటతోను ప్రారంభమయ్యెను. కాని, అరబ్ విద్వాంసులు ప్రత్యక్షావలోకనము, స్వానుభవము, వైద్యవిజ్ఞానమునకు ఎంతయు తోడ్పడి, అది విశాలము, స్వతంత్రము అగు శాఖగా పుష్టినొందెను. అరబ్ వైద్యశిఖామణులు ఓషధీతంత్ర శాస్త్రమునందును (Pharmocology), రోగలక్షణ శాస్త్రమునందును (Symptomatology) గొప్ప ప్రావీణ్యమును బొందిరి. వారి వైద్యశాలలు, వైద్యవిద్యాశాలలు పాశ్చాత్యులకు మార్గదర్శకములుగా నెగడెను. జేబర్ అబ్నె హయ్యా౯ అనునతడు రసాయనశాస్త్రమునకు పునాదివేసెను. అది క్రమక్రమముగా వృద్ధిచెంది క్రొంగ్రొత్త విషయములను కనుగొనుటకు మార్గమేర్పడెను. ఇప్పటి రసాయన శాస్త్రమునకు గల పరికరములును, పరిభాషయు అరబ్బీయ రసాయనపండితులు పెట్టిన భిక్షయే. భౌతిక చరిత్ర యందు (Natural History), వృక్షశాస్త్రమునందు, వ్యవసాయ శాస్త్రమునందు అదేవిధముగ ప్రవృద్ధికలిగెను. తత్త్వవేత్తల యొక్కయు, వైద్యవేత్తల యొక్కయు జీవితచరిత్రలు నిర్మితము లయ్యెను. ఖిప్తి రచించిన “తారీఖ్-అల్-హుకమా” అను గ్రంథమును, “ఇబ్నె అబి ఉసై బి ఆ" రచించిన కితాబె అల్- ఉయూన్- అల్-అంబా" అను గ్రంథమును తత్సంబంధము అయినవే. . భూగోళము_చరిత్ర : ఖలీఫాల యొక్క తపాలాశాఖా వ్యవస్థ, సమర్థమగు ప్రభుత్వవిధానమును భౌగోళికాంశములను గ్రంథస్థముచేయుటకు పురికొల్పెను. ఇక పుణ్య స్థల సందర్శనాభిలాషులకు తాము పోయెడి దేశములకు సంబంధించిన విజ్ఞానము అవసరము కాజొచ్చెను. ఈ భౌగోళిక లేఖనములు రహదారులు, వర్తక వాణిజ్య ములు, తత్ ప్రతిష్ఠాపనములనుగూర్చి మాత్రమే వర్ణించుటతొ తృప్తి పడలేదు. అచ్చటి ప్రజల ధార్మిక, సాంఘిక, సంస్కృతీ జీవిత విషయములనుగూర్చిన యథార్థ విషయములను గూడ వర్ణించుచుండెను. ఇబ్ను ఫాడ్ల౯, అబుదు లాఫ్, ఖాస్రాజి, ఇబ్ను జబీరు, ఇబ్ను బతూతావంటి దేశ పర్యటనపరులు వ్రాసిన గ్రంథములు అరబ్బుల ధార్మిక, సాంఘిక విషయ పరిస్థితులనుగూర్చి వివరణాత్మకములయి యుండుటయే గాక, తాము పర్యటించిన దేశముల ఆచారములు, సంప్రదాయములు, వ్యవస్థలు మున్నగునవి తెలుపుచుండెను. భూగోళశాస్త్ర పదజాలమును అకారాదిగ వ్రాసి వివరించిన కోశములు, నిర్మితము లయ్యెను. బక్రి రచియించిన "మూజం మాస్తాజం" అను గ్రంథమును, యాఖుత్ రచించిన “ము జాం అల్ బుల్గాన్” అను గ్రంథమును ఇట్టి తరగతిలోనివే.
ప్రాచీనయుగ కవిత్వమును గూర్చిన గాథలు, ఆయా తెగల వంశావళి నివేదికలు చరిత్ర పఠన పాఠనములకు దారితీసెను. ఇస్లాం ప్రారంభచరిత్ర జ్ఞానమునకు ప్రవక్త యొక్క జీవిత చరిత్రమును, ఇస్లాం యుద్ధములను(Maghazi) గూర్చిన సామగ్రిని సమకూర్చవలసిన అగత్య మేర్పడెను. ప్రవక్త యొక్క జీవితచరిత్రను మహమ్మదు ఇబ్ను ఇపాఖ్ అను నతడు రచించెను. ఇది విషయ క్రమబద్ధమయిన గ్రంథము. అరబ్బీయుల చరిత్ర- భూగోళ రచనలు ఒక అపూర్వ శాస్త్రప్రాయముగా రూపొందెను. చరిత్రకారులు తమ కథనమునందు వేర్వేరు పద్దతుల నవలంబించిరి. ఐతిహాసికుల పరంపర చెప్పినది చెప్పి నట్లుగనే లిఖించుట ఒక విధముగాను, స్థానిక విషయములు, మహాపురుషుల జీవిత పరిశీలనములు మొదలుకొని ప్రపంచ చరిత్రలవరకు కాలక్రమానుసారముగా కధనము చేయుట మరియొక పద్ధతిగా నుండెను.
మంగోలుల దండయాత్రల ఫలితముగ 1258 లో బాగ్దాదు పతనము చెందిన తరువాత, సంస్కృతీ కేంద్రము తిరిగి సిరియా, ఈజిప్టులకు మారెను.ఆ కారణమున వాఙ్మయ స్వరూప స్వభావములునుమార్పులనుబొందెను. రాజకీయ కల్లోలములు, అశాంతికర పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికిని విద్వాంసులయినవారు పూర్వకవి ప్రణీత గ్రంథములను పరిశీలించుచు, వాటిపయి వ్యాఖ్యానములను రచించుచునే యుండిరి. ఈ యుగము నూతన రచనాసృష్టికిగాక క్రోడీకరణమునకు ఎక్కువగ ప్రఖ్యాతిచెందియున్నది. హిజరి 8 వ శతాబ్దములో నూత్న భావములను, నూతన విధానమును అరబ్బీయ చరిత్ర - భూగోళ రచయితలకు చూపిన చరిత్ర కళానిపుణుడు ఇబ్ను ఖాల్డూన్ (1406) అనునతడు. చరిత్ర సంఘటనలను ఎట్లు పరిశీలించవలెనో ఇతడు కొన్ని నిబంధనలను ఏర్పరచెను. సాంఘికశాస్త్ర విషయ సిద్ధాంతములను ప్రతిపాదించెను. ఈ సిద్ధాంతముల ననుసరించి ప్రాచ్యులెగాక పాశ్చాత్యులును ఇప్పటికిని నడచుచున్నారు. . ఇండియాలో ప్రభవించిన అరబ్బీ సాహిత్య స్వభావము :- ప్రాగిస్లామిక కాలమందును, ఐస్లామిక కాలమందును ఇండియా దక్షిణ తీరములు అరేబియాతో వ్యాపార సంబంధములను కలిగియున్నను, సింధు, ముల్తాన్, బెలూచిస్థానము తప్ప, ఇతర భాగములు అరబ్బీ భాష మాట్లాడువారి ప్రభుత్వములో ప్రత్యక్షముగ లేకుండెను. కావున పారసీ మాతృ భాషగా గల ప్రభువుల పోషణ భాగ్యము అరబ్బీ భాషకు లభించలేదు. ఏడవ శతాబ్దమునాటికే అరబ్ సామ్రాజ్యమునకు చేర్చబడిన ఇండియా ఉత్తర భాగములుకూడ ఎంతో కాలము వారి రాజకీయాధిపత్యమున నుండలేదు. ఈ కారణమునను, దక్షిణ భారతములోని అరబ్బుల వా స స్థానములును వ్యాపారములును వర్తక వాణిజ్యములవరకే పరిమితములగుటచేత, ఆనాటివారి విద్యావివేక పరిశ్రమములను గూర్చి ఏమియు తెలియదు. కాని స్థానిక భాషలలో నుండి తీసికొనబడి అరబ్బీ భాషలో చేరిపోయిన కొన్ని పదములు మాత్రము కనబడుచున్నవి. భౌగోళిక, రాజకీయ అవరోధము లెన్నియున్నను, భారతీయ ముస్లిములలో మత సంస్థల యొక్కయు, మతాధ్యయనము యొక్కయు భాషగా అరబ్బీ భాషయే వాడుకలో నుండెను. ఉమయ్యీద్ అబ్బాసీదుల కాలములో కొందరు భారతీయ మహమ్మదీయులు అల్-హిజాజుకును, ఇరాకురును పోయి అచ్చట స్థిరనివాస మేర్పరచుకొని కవులుగా, గద్య రచయితలుగా ప్రసిద్ధికెక్కిరి. ఇట్టి వారిలో అబు అతా అల్ సింధి యను నతడు కవి; హస౯ అల్ సఘాని (1252) అను నతడు శబ్దశాస్త్రవేత్త (Philologist); సఫీ యుద్దీన్ అల్ హింది (1315) అను నతడు న్యాయశాస్త్ర పారగుడు. అట్లే అరబ్బు విద్వాంసులును ఇండియాకు ఏతెంచి, అరబ్బీ భాషలో అమూల్య గ్రంథములనురచించిరి. అల్బెరూని హిందువుల సంస్కృతిని, విద్వత్తును, గ్రహించుటకును, తాను వ్రాయదలచిన కితాధె- అల్- హింద్ అను పుస్తకమునకు విషయసేకరణార్ధము ఇండియాకు వచ్చెను. ఇండియాలో హాడిత్ ప్రవచనములను వ్యాప్తికి దెచ్చుటకు షంసుద్దీ౯ అనువాడు ఈజిప్టు నుండి ముల్తానుకు వచ్చెను. అయినను, ఘజన వీడ్ (988 క్రీ.శ.) మొదలుకొని మొగలు వంశము (1539) వరకును ఇండియాలోని ముస్లిం ప్రభుత్వముల కాలములో భారతీయ ముస్లిములు అరబ్బీ వాఙ్మయములో ఎట్టి ఉపఖాయుతములయిన గ్రంథములను రచింపలేదు. వచనము, పద్యము, త త్త్వశాస్త్రము, భౌతికశాస్త్రములు మున్నగువానికి సంబంధించిన అరబ్బీ వాఙ్మయ శాఖలలో హైందవ ముస్లిములు ప్రసిద్ధిపొందలేదు. ఈ వాఙ్మయ శాఖా గ్రంథములమీది వ్యాఖ్యానములను సమీకరణ చేయుటయే తమ కర్తవ్యముగా వీరు పరిగణించుకొనిరి. భారతీయ ముస్లింల హృదయమునకు తర్కశాస్త్రము నచ్చినది. ముహిబుల్లా బిహారి (1707) సుల్లం అల్ ఉలూం అను గ్రంథమును వ్రాసెను. ఇది యిప్పటికిని తర్క శాస్త్రమున ప్రామాణిక గ్రంథముగా పరిగణింపబడు చున్నది.
సద్ బె సాలమ౯ నిజాముద్దీ౯, ఆలియా, నాసిరుద్దీ౯ చిరాగ్ దిహిలెవి, షిహాబుద్దీన్, అమీరు ఖుస్రు అనువారి అరబ్బీ పద్యఖండములు మనదనుక వచ్చియున్నవి. వీరే గాక, అరబ్బీలో తమ కావ్యముల యొక్క దివానులను (కూర్పులను) సంతరించి పెట్టిన కవులును గలరు. మొహమ్మదు బి అబ్దుల్ అజీజు, (మలబారు, 10 వ శతాబ్దము), సయ్యదు. ఆలీఖా౯ ఇజ్ను మాసం (1705), సయ్యదు అబుదుల్ జలీల్ బిల్గామి (1715) సయ్యదు గులాం ఆలీ ఆజాదు (1785) అనువారు అట్టి కవులు. ఈ కవులందరును పార్శీ కవిత్వము వలన ప్రభావితులయి యుండిరి. వీరి కందరకును, శబ్దార్థాలంకారముల యందును, పార్శీ పద్య విన్యాస వైఖరి యందును ప్రీతి మెండు. మలబారు కవియగు మొహమ్మదు అరబ్బీ భాషలో ఒక మత్ నవి (ఇందు 500 పద్యములు గలవు) అను కావ్యమును రచించెను. ఈ కావ్యమునందు కాలికట్ జామొరి౯ బుడతకీచులతో జరిపిన పోరాటములును, అతనికి ఇస్లాంమతము నెడగల ప్రీతియు వర్ణితములైనవి. ఇబ్నెమాసం కవియొక్క “ఆల్ బదీయాల్" అను కావ్యమునందు, అలంకార చిత్ర కల్పనలకు ఉదాహరణములు సంకలితము చేయ బడినవి. ఇతర కవుల వలెనే ఆజాదు కూడ అలంకార గర్భితముగా వ్రాయుట యందు అమితేచ్ఛ గలవాడు. ఈతడు హిందీ భాషలోను, సంస్కృత భాషలోను గల ఉపమానములను,అలంకారములను తన అరబ్బీ కవిత్వములో ప్రవేశ పెట్టినాడు. భారతీయ ముసల్మానులు ధార్మిక గ్రంథ పఠన, పరిశీలనములకు కలిగించినదోహదము మిగుల విలువగలది.
నూత్న భావోదయము (1798-1955): 1798లో అరబ్బులకు పాశ్చాత్య సంస్కృతీసంసర్గము మరల కలిగిన నాటినుండియు అరబ్బీ వాఙ్మయమునందు ఆధునిక విధానముల కనుగుణములయిన మార్పులు ప్రారంభమయ్యెను. ఈ నవీనత ఇప్పుడిప్పుడే ఈజిప్టు రంగమందు ప్రారంభమయినది. యూరోపియ పద్ధతులు ప్రకారము పాఠశాలలు స్థాపించుట, వార్తా పత్రికలు వేగముగా వ్యాప్తి చెందుట, ఆధునిక ఐరోపీయ గ్రంథరాజములను అరబ్బీభాషలోనికి అనువదించుట ఇవియే నవీనతావ్యాప్తికి కారణభూతములు, అనుప్రాసాలంకార భూయిష్ఠమైన ప్రాచీన గద్య రచనా విధానము విడువబడినది. ఇప్పటి పారిశ్రామిక యుగమునకు తగినట్లుగా సులభ, సరళ రచనలు ఆ స్థానము నాక్రమించినవి.. షేకు మహమ్మదు అబ్దుల్ అఝరు నందు గావించిన ప్రబోధ ఫలితముగా కురా౯, న్యాయ శాస్త్రము, ఐస్లామిక తత్త్వశాస్త్రములపై వ్రాయబడిన భాష్యములు, నూత్నపద్ధతిలో సమన్వయము పొందసాగెను. ప్రవక్తల యొక్కయు, కవుల యొక్కయు, పండితుల యొక్కయు రచనలను తులనాత్మకముగను, పరిశీలనాత్మకముగను, పఠించుటచే శాస్త్రీయ పరిశోధనకును, ఆధునిక విమర్శన విధానమునకును, అంకురార్పణము జరిగెను. కాల్పనిక కథా (fiction) రంగమునందు అరబ్బీ సాహిత్యము మీద యూరోపియను ప్రభావము స్పష్టముగా కానిపించు చున్నది. కళాత్మకముగ కథావిరచనము చారిత్రక నవలలతో ప్రారంభమైనది. ఐరోపా దేశములలో విద్యార్థనము చేసిన అరబ్బు పండితులు ఫ్రెంచి, ఇంగ్లీషు, జర్మన్, ఇటాలియన్ భాషలలోని గ్రంథములను అరబ్బీ భాషలోనికి అనువాదము చేయసాగిరి. అల్మాన్ ఫాలూటి, అజ్జయ్యాత్, అల్ మాజిని అనువారలు యూరోపియ అద్భుత కథాసాహిత్యమును (Romance) తమ అభిరుచుల కనుగుణముగా అనువదించుటకు మార్గదర్శకులయిరి. తరువాత తౌఫిఖ్ అల్ హాకీం, అల్ మాజిని, అహమదు తైమూరు అనువారు కేవలము ఈజిప్టు దేశమునకు చెందిన స్వతంత్ర కల్పనాకథలను నిర్మించిరి. ఈజిప్టులో నాటకశాల ఏర్పాటయినతరువాత, ఫిల్ము కంపెనీలు, రేడియో కేంద్రములు, నాటక సాహిత్య పరంపర, నాటక కథలు, పిల్ముకథలు బయలు వెడలినవి.
గద్యవలెనే ఆధునిక పద్యరచనయు ఫ్రెంచికవుల రచనలను పల్లెటూరి పాటలుగా (zagal) అరబ్బీకరణము చేయుటతో ప్రారంభమయినది. సంప్రదాయ సిద్ధముగా వచ్చుచున్న ఖసీదాపద్ధతిని అదే ఛందోలంకారములతో సాగించుచుండినను, ఆధునిక భావ విశేషములును, ఐస్లామిక యూరోపీయ తత్త్వసమ్మేళనమును పద్య కవిత్వములోనికి గొని తేబడెను. ప్రాత పద్ధతుల ప్రకారము గేయగీతికలు (Odes), శోకరసాత్మక గీతికలు (Elegy), స్తోత్రములు (Panegyrics), గీతమాలికలు (Sonnets) యథాతథముగా రచితము లగుచున్నను, వాటితోపాటు దేశభక్తి, భౌతిక, రాజకీయ, సామాజిక విషయములు కావ్యవస్తువులుగా నుండుట హర్షణీయము. అల్- బరూది (1889-1904) హఫీజు, షోఖి (1868-1932) వంటి ఈ యుగపు కవి శిరోమణులు అరబ్ జాతీయతను గూర్చిన గీతములను గానముచేసి, అరబ్బులకు వారి నాగరికత యొక్క గత వైభవోదంతమును స్మరణమునకు తెచ్చిరి. ఆధునిక కవులు ఛందోరహితమయిన (Blank) కవితను అనుసరించుటకు ప్రయత్నించుచున్నారు. శబ్దాలంకారములకు గణములకు సంబంధించిన కట్టుబాట్లను త్రెంచి వేయుటకు ఉద్యమించుచున్నారు. ఈ ప్రయత్నములు సఫలమగునా యనునది ఊహకు వదలవలసిన విషయము. కాని అరబ్బీపద్యములకు (ఛందస్సుకు) గల ప్రత్యేక లక్షణములు మాసిపోకుండ నిలుపుట, అరబ్బీలోనికి యూరోపియన్ విధానములను ఎక్కువగా ప్రవేశ పెట్టుట ఆధునికో ద్దేశము అయి యున్నవి.
డా. ఎం. అ. ఎం.
[[వర్గం:]]