Jump to content

వీరభద్ర విజయము/ద్వితీయాశ్వాసము/శంకరుండు బ్రహ్మచారి యై వనమునకు వచ్చుట

వికీసోర్స్ నుండి

శంకరుండు బ్రహ్మచారి యై వనమునకు వచ్చుట

252-ఉ.
గ్రక్కున భూతియు న్నొసలి కన్నును బెబ్బులి తోలుచీరయున్
చుక్కలరేని జూటమును జొక్కపు గంగయు మేనఁ బాములున్
చిక్కని శూలలాతముల చేతులు రెండును పుఱ్ఱెకుండ దా
జక్కఁగ దాఁచి వచ్చె నెఱజాణుఁడు శంభుఁడు సంభ్రమంబునన్.
253-సీ.
తనర ముమ్మాఱు చుట్టిన దర్భముంజితోఁగ్రొమ్మెఱుంగువలంతి గోఁచితోడ
మొల నున్న ధవళంపు ముద్దు పేలికతోడనిమ్మైన కృష్ణాజినమ్ముతోడ
వెలపలఁ బెట్టిన వెలి జన్నిదముతోడరమ్య భస్మ త్రిపుండ్రములతోడ
నక్షమాలికతోడ నా చిన్ని కూకటిజుట్టుతో మేథావి బొట్టుతోడ
ఆ. నెడమ కేలఁ దనదు పొడవు దండము వ్రేల
నుంగరమును దర్భయును వెలుంగ
గొడుగు వట్టి వటువుకుఱ్ఱఁ డై చనియెను
శూలి మంచుకొండచూలి కడకున్.
254-ఆ.
అట్లు పోవు నప్పు డ మ్మహాతేజంబు
వేడ్కతోడ నెట్టి విధము నైన
పాయ దమృతకోటి భానుబింబంబుల
ప్రభల గ్రేణిసేయు భరిత మగుచు.
255-వ.
అంత న య్యవసరంబున.
256-చ.
సదమల మైన వాఁడు కడు చక్కని రూపము వాఁడు కాంతిచేఁ
బొదలిన మోము వాఁడు మెయి భూతి నలందిన వాఁడు దివ్య మై
యొదవిన బ్రహ్మచారి గతి నొప్పిన వాఁ డిటు వచ్చుచున్నవాఁ
డదె యొక గుజ్జు తాపసుఁ డహా వనితామణులార! కంటిరే.
257-వ.
అని యి వ్వింధంబున.
258-మత్త.
కాంత లవ్వలనం గనుంగొని గట్టుకూఁతురి నెచ్చెలుల్
వింత లీలల న వ్వనంబున వే చరించుట మాని యు
న్నంత నూతన యౌవనాంచిత యద్రికన్నియఁ జేరఁగా
సంతసంబునఁ బోయి ర య్యెడ జగ్గున న్వటు వేషితోన్.
259-ఉ.
అల్లనఁ జేర వచ్చి సతు లర్చన చేసెద మన్న నన్నియుం
జెల్లును చాలు చాలు నని చేతుల సన్నలు చేసి నిక్క మే
సల్లలితంపుఁ దాపసుని చాడ్పున నిల్చి శివుండు లోల సం
పుల్లసరోజనేత్రి యగు పొల్తుక నంబికఁ జూచి యిట్లనున్.
260-ఉ.
“నీ తల్లిదండ్రు లెవ్వరొకొ నీరజలోచన! యెవ్వ? రీవు నీ
వీ తప మేల? చేసెద వ దెవ్వడొకొ? నిను నేలువాఁడు దా
నో తరుణీలలామ! భునోన్నత మోహనమూర్తి రాజ సం
కేతము మాని యీ యడవి కేఁగి తపం బిట్లు సేయ నేటికిన్.”
261-వ.
అనిన న మ్మాయావటునకు నబల చెలు లి ట్లనిరి.
262-మత్త.
“తల్లి మేనక పుణ్యకామిని తండ్రి కొండలరాజు యీ
మొల్లగంధికి గౌరి నామము మూఁడుకన్నుల దేవరన్
వల్లభుం డని కోరి సేయును వారిజాక్షి తపంబు మే
మెల్ల దాసుల మై చరించెద మింతికిన్ మునివల్లభా!”
263-వ.
అనవుడు న క్కపట తాపసుం డి ట్లనియె.
264-ఉ.
“ఈ నగు మోము లీ యలక లీ తెలికన్నులు నీ సుధాధరం
బీ నునుమేని కాంతియును నీ చనుకట్టును నీ కరాంబుజం
బీ నడు మీ నితంబమును నీ తొడ లీ పదపల్లవంబు లే
మానిని యందుఁ గానము సమగ్ర మనోహర రూపసంపదన్.
265-ఉ.
ఈ పువుబోఁడి నీ మగువ నీ తరలాయతచారులోచనన్
దాపసి జేసి పొ మ్మనుచు ధైర్యము నిల్పి వనాంతరంబునన్
చాపలనేత్రలార సతి జవ్వన మారడి బుచ్చ జెల్లరే
తాపసవృత్తి నుంచు నల దైవము నే మన నేర్తు నక్కటా.
266-వ.
అదియునుం గాక.
267-సీ.
పొలుచు మైఁ దీగెతోఁ బొల్చు టింతియ కాకయీ వన్నెగల రేఖ యెందుఁ గలదు
యింతి పాలిండ్లతో నీడుసేయుట గాక యీ చక్క నైన బా గెందుఁ గలదు
పూఁబోఁడి మోముతోఁ బురుడుసేయుట గాక యీ నిర్మలపుఁ గాంతి యెందుఁ గలదు
సతి కనుదోయితో సాటిసేయుట గాకయీ మోహరుచిజాల మెందుఁ గలదు
ఆ. కలిగె నేని తెగని కాముబాణము లందుఁ
గందు లేని యిందు నందుఁ బసిడి
గరిశిరంబు లందచిరముండు మెఱుపుల
యందుఁ గాక తక్కు నెందుఁ గలదె.
268-ఉ.
చూచితి నాగ కన్నియలఁ జూచితి దానవ దైత్య కన్యలన్
జూచితి దేవ కన్నియలఁ జూచితి ఖేచర సిద్ధ కన్యలన్
జూచితి మర్త్య కన్నియలఁ జూచితి సాధ్య మునీంద్ర కన్యలన్
జూచితిఁ గాని యే యెడలఁ జూడ గిరీంద్రజఁ బోలు కన్యలన్.”
269-వ.
అని పలికి గౌరీదేవి నుపలక్షించి యల్లనల్లన యి ట్లనియె.
270-ఉ.
“కొండలరాజు గారపుఁ గూతుఁర వై నవయౌవనాంగి వై
నిండిన లక్ష్మితోఁ జెలులు నిచ్చలు గొల్వఁగఁ గేలిమై సుఖం
బుండుట మాని సౌఖ్యముల నొల్లని జంగమువానిఁ గోరి యీ
కొండకు వత్తురే వనఁటఁ గుందుదురే యిచటం దలోదరీ!
271-
అదియును గాక యీ జగము లన్నియుఁ జూచితిఁ గాని యెయ్యెడన్
బదపడి నాథులన్ వెదక బాలలు వోయిన చోటు లేదు లే
దిది విను వద్దు శంభుఁ డన నెంతటివాఁడు యతండు వల్లులం
బొదలు కెలకు లందుఁ బలు భూతము లందు వసించు బాలికా!
272-ఉ.
ఎక్కడ భర్గుఁ డుంట యిట నెక్కడ నీ తప ముంట కన్యకా
చుక్కలరాజమౌళిఁ దొలి చూచినదానవొ కాక యూరకే
యెక్కడ నాతనిన్ వలచి యేఁగినభామలఁ గానఁ జెల్లరే
నిక్కము చెప్పితిన్ మగువ నేరుపుఁ దప్పితి వీవు జాణవే!
273-సీ.
తరళాక్షీ! యాతండు ధనవంతుఁ డందమా కోరి వేడిన గానిఁ గూడు లేదు
చిన్నారి! వయసున చిన్నవాఁ డందమాయెన్నటివాఁడొకొ యెఱుఁగరాదు
ఆకార సంపద నతి మేటి యందమాయాకార మెట్టిదో యరయరాదు
కులగోత్రములు రెండుఁ దెలియుద మందమాతలిదండ్రు లెవ్వరు ధరణిలేరు
ఆ. తిరిప రొంటిగాఁడు దేవుండు చూడఁడే
మాయ మందు కపట మంత్రములను
మగువ! నిన్ను మరగించుకొన్నాఁడొ
కాని తగినవాఁడు కాఁడు కాఁడు.
279-వ.
అని మఱియు ని ట్లనియె.
275-క.
అంటినఁ గందెడు యొడ లీ
వెంటన్ గుదియింప వలదు విను మాతని నీ
వంటెద నని తలఁచెద వతఁ
డంటడు నిను సర్వభంగు లందుఁ గుమారీ!
276-మత్త.
ఓ లతాంగి! యెఱుంగ వాతఁడు నొక్క జాలరి కన్యకున్
లోలుఁ డై జడ లిచ్చి నాఁ డట లోక మెల్ల యెఱుంగ నీ
వేల చింతన సేయ వక్కట యీతఁ డొక్కఁడె కాని నీ
లాలకా కనలేరె దేశము నందులోన మగ ల్మఱిన్.
277-సీ.
చీనాంబరంబులు చెలువొప్పఁ గట్టఁడుమదసింధురేంద్ర చర్మంబుఁ గాని
రత్నకంకణములు రమణ మైఁ దొడగఁడుఫణిలోకరాజకంకణము గాని
చందన గంధంబు జాణఁ డై పూయఁడుమదపంచబాణ భస్మంబుఁ గాని
పువ్వులు దండలు భోగి యై తురుమఁడువెలయింత లేని రేవెలుఁగు గాని
ఆ. యూర నుండ నొల్లఁ డొలుకులలోఁ గాని
యెనసి హయము నెక్కఁ డెద్దు గాని
చెలువ! యేమి చెప్ప సిగ్గయ్యెడిని వెఱ్ఱి
యనఁగ నెపుడు శివుని వినవె చెపుమ.
278-మత్త.
కంతుఁ జంపినవాఁడు వెండియు కంతు కెయ్యెడ లోఁబడం
డింత సిద్ధము గామ్య మొల్లఁడు యేల యీ యడియాస నీ
వంత కంతకు నిష్ఠ మై నవయంగ నేల మహాటవిన్
సంతసంబునఁ గొంచుఁ బోయెదఁ జక్క రమ్ము కుమారికా!
279-చ.
ఇరవుగ సర్వలోకముల నేలెడువాఁడ మహేంద్ర నిర్జ రే
శ్వర తతిలోనఁ బేరు గలవాఁడ జగంబులఁ బెద్దవాఁడ ఖే
చర గతి నొప్పువాఁడ సహచారిణి దుఃఖములేనివాఁడ శ్రీ
వరునకు బ్రహ్మకు న్మొదలివాఁడఁ జుమీ యలినీలకుంతలా!
280-ఆ.
ముదిమి లేనివాఁడ మోహనాకారుండఁ
దరుణి నిన్ను నేలఁ దగినవాఁడ
నన్నుఁ దగిలి నీవు నా వెంటఁ జనుదెమ్ము
వనటఁ గుంద నేల వనజనేత్ర!”
281-క.
అనుడు “వినఁ దగని మాటలు
గొనకొని వీఁ డాడె నేని కూకటి వేగం
బునఁ బట్టి వనము వెడలఁగ
ననుపుం” డని చెలుల కంత యానతి యిచ్చెన్.
282-క.
అని పలికిన చెలు లందఱు
తనుఁ బట్టెద రని తలంచి తత్తరపడఁగాఁ
గనుఁగొని దండము ద్రిప్పుచు
వనితలతో బ్రహ్మచారి వటుఁ డి ట్లనియెన్.
283-శా.
´నన్నున్ బట్టెడువారె మీ వశమె యన్యాయంబుగా నిప్పుడున్
నన్నున్ జిన్నగఁ జూడవద్దు వినుఁ డా నారాయణ బ్రహ్మలున్
నన్నున్ బట్టఁగ లేరు చిక్కఁ బడునే నా బోఁటి మీచేత మీ
సన్నం బైన తలంపు వోవిడువుఁ డో చంద్రాస్య లిం కియ్యడన్.
284-ఉ.
ఇచ్చఁ గులంబు గోత్రమును నించుక లేని లతాంగికిన్ శిరం
బిచ్చి వరించినాఁడ నిపు డియ్యెడ నీ యువతీలలామ నా
కిచ్చినఁ జాలుఁ గాని సతి కిప్పుడ మీరలు చూడ దేహ మే
నిచ్చెదఁ గాంతలార! వరియింపఁగఁ గన్యకు బుద్ది సెప్పరే.
285-ఉ.
మాటలు వేయు నేమిటికి మానినులార! వినుండు చెప్పెదన్
పాటలగంధి నాకుఁ దగు భామిని కేఁ దగుదున్ వరింప ని
చ్చోటనె పెండ్లియాడెదను సుందరి యేరీతి నాస సేయునో
వాటము గాఁగ నా రతుల వారక తేల్చెద నంచు బల్కగన్.”
286-వ.
విని య మ్మహాదేవి యి ట్లనియె.
287-ఉ.
“వీఁ డఁట; బ్రహ్మచారి యఁట; వీనుల బెట్టఁగరాని మాటలే
యాడుచు నున్నవాఁడు; మదనాంధుఁడు వీఁడు నమశ్శివాయ యొం
డాడఁగ వద్దు వీనిఁ గపటాత్ముని నిచ్చట నుండ నీక పం
డ్లూడఁగ వేసి ద్రొబ్బుఁ” డని యుగ్రతఁ బల్కినఁ గాంత లందఱున్
288-సీ.
దండంబు విసరినఁ దప్పించుకొని పోయిపొలఁతులు కొందఱు పొదివి పట్టి
బాహుదండంబునఁ బట్టిన గొడుగునుబలిమిమై నల్లంతఁ బాఱవైచి
కరము బిగ్గనఁ బట్టి కట్టిన యొల్లియనొడిసి వ్రాలినఁ గొఁచి విడిచిపుచ్చి
కూకటిఁ బలుమాఱుఁ గుదియించి కుదియించిచేడియల్ నవ్వుచు శిరము వంపఁ
ఆ. బిన్నవాఁడు పోలె పెనఁగులాడుచు నుండి
బాలుఁ డైన కపట బ్రహ్మచారి
మాయమయ్యె దోఁచె మగువకు ముందటఁ
మహిత మైన చిత్ర మహిమతోడ.