వీరభద్ర విజయము/ద్వితీయాశ్వాసము/పార్వతి తపముసేయ వనమునకు నేగుట

వికీసోర్స్ నుండి

పార్వతి తపముసేయ వనమునకు నేగుట

237-సీ.
హరినీలములఁ బోని యలకల జడ లల్లిమహిత రుద్రాక్ష దామములు చుట్టి
బాలచంద్రురుఁ బోని ఫాలస్థలంబునభస్మత్రిపుండ్రంబు పరఁగఁ దీర్చి
తరుణ వల్లియుఁ బోని తనువల్లి నిండారఁబద నిచ్చి పలుచని భస్మ మలఁది
కాముచక్రముఁ బోలు కటిచక్ర తలములఁదనరు కాషాయ వస్త్రంబుఁ గట్టి
ఆ. బిసము బోలి కేల నెసగఁ గమండలు
దండ పుండరీక తను కళాస
ములు ధరించి భువనమోహన శ్రీ యగు
గౌరి తపసి వేషధారి యయ్యే.
238-వ.
ఇట్లు వివిధ విలసిత విచిత్ర తపో వేషధారి యై తన సఖీజనంబులు దానును తలిదండ్రుల మనంబులు సంతసిల్ల వీడ్కొని వనవాస ప్రయాణం బై పోయి; కతిపయి దూరంబున నకాల పల్లవ ఫల భరిత శాఖాలోక విరాజిత మందార మాతలుంగ చందన పున్నాగ తిలక కేసర కదళీ జంబీర కదంబ నింబ తమాల రసాల హింతాళ ప్రముఖ నానా భూజాత సంఘాత విలసితంబును; నిర్మల సరోవర జనిత ఫుల్ల సల్లలిత కమల ప్రసూన బంధుర గంధవాహ ధూత బలపరాగ ధూళి పటల దశ ది శాలంకృతంబును; ననంత లతా సిత సంఫుల్ల పరిమళ మోద మారుత సమ్మిళిత దూరదేశంబును; మరాళ శారికా కీర మధుకర కోకి లాది నానా విహంగ మృదు మధుర వచన ప్రమోదితంబును నై సకల తపోవన రాజ్యలక్ష్మీ శోభిత వైభవం బనం బొల్చు నొక్క వనంబుఁ గాంచి సంతసించి దరియం జొచ్చి సంభ్రమంబున.
239-ఉ.
“ఈ వన ధారుణీరుహము లెంతయు వింతఁ దనర్చి యుండునే
యీ వన పుష్ప వల్లికల కింత సుగంధ విభూతి యొప్పునే
యీ వనజాంతరాన్వితము నేమని చెప్పఁగ వచ్చు బాపురే
యీ వన శోభితంబు దివి నింద్రువనంబున కైన గల్గునే.
240-క.
అంగజుఁ డివ్వనమునఁ గల
భృంగంబులఁ గూడుకొనిన బిరు దై కడిమిన్
భంగించుఁ గాక మదమరి
గంగాధరు కంటిమంటఁ గ్రాఁగునె తలఁపన్.
241- ఆ.
ఈ వనంబులోని యేపారు పుష్పంబు
లేయ మఱచెఁ గాక యేసె నేని
కాముచేత నాఁడు కామారి చిక్కేఁడే
సకలమైనవారు సంతసిల్ల.”
242-వ.
అని మఱియు ననేక ప్రకారంబుల నవ్వనలక్మిఁ గీర్తించి చెలుల నందఱి నాలోకించి వారి వారిం దగులాగున వర్తింప నియోగించి స్థలశోధనంబు లాచరించి సర్వాంగ విభూతి స్నాత యై చెలువు మిగుల తపంబు సేయం దొణంగె నిరుపమ నిర్మలత్వంబున.
243-ఆ.
బాలచంద్ర మౌళి పాదాంబుజంబుల
విమల హృదయ కమల వీథి నిల్పి
నీరజాతనేత్ర నిష్కళంకాత్మ యై
చెలువు మిగిలి తపము సేయఁ దొడఁగె.
244-క.
నాలుగు దిక్కుల మంటలు
గ్రాలఁగ వినువీథి నున్న గ్రహపతి కెదు రై
ఱాల పయి నిలిచి వేసవి
కాలము తు మాచరించెఁ గన్నియ ప్రీతిన్.
245-క.
పిడుగులు మెఱుపులు నురుములు
నడరఁగ మేఘములు జలము లనిశము గురియ
 న్గడుఁ దొడగి వానాకాలము
తడియుచుఁ బెనుకాలముఁ జేసె దారుణ తపమున్.
246-క.
నీట మెడ మునుఁగు బంటిని
జాటరితల మంచు గురియఁ జలికాలము మి
న్నేటి దరిఁ దలఁచు వెచ్చని
చోటును సుఖ మున్న భంగి సుందరి గడఁకన్.
247-క.
ఇది పగ లని యిది రే యని
యిది చలి యిది యెండ వాన యిది యని సతి దా
మదిఁ దలపోయక యీ క్రియఁ
బదపడి కాలంబు సలిపె పరమ తపంబున్.
248-వ.
అంతఁ దదీయ దివ్య తపో మహత్వంబు లన్నియు నవలంభించి ఆవరణ ఘోరం బై.
249-శా.
లంఘించెం గమలోద్భవుండు మదిఁ దా లక్షించి త ద్దేవతా
సంఘం బెల్లఁ గలంగె మేలుకొనియెం జక్రాయుధుం డంత వే
గం ఘీంకారము లిచ్చె దిగ్గజములుం గైలాస శైలంబు దు
ర్లంఘ్యం బైన గణాళితోఁ గదలి దొర్లంబాఱె నల్లాడుచున్.
250-ఆ.
ఆ కైలాసముమీఁదను
శ్రీకరముగ నున్న యట్టి శ్రీకంఠుఁడు దా
నాకతముఁ దెలిసి తనలోఁ
బ్రాకటముగ నుబ్బి చెలఁగెఁ బరిణామముతోన్.
251-సీ.
తపము సేయక కాని తన్ను వరింపనేశృంగారి తపము సేయంగ నేల
తనుఁ గవయఁగఁ గోరి తపము సేయుచు నున్నననుఁ గూర్చి యీ నిష్ట తనకు నేల
తన్నుఁ బాయని ప్రేమఁ దలపోసి యలరంగఁదపమున డయ్యంగఁ దనక నేల
యే నొక్క వింతయే యే నొక్క బ్రాఁతియేయిందీవరాక్షికి నింత యేల
ఆ. అని శశాంకజూటుఁ డానంద చిత్తుఁ డై
కరుణ తోయరాశి కరము మెఱయ
చిన్ననగవు లేఁత చెక్కులఁ దొలఁకాఁడ
నీశ్వరుండు పార్వతీశ్వరుండు.