Jump to content

వీరభద్ర విజయము/ద్వితీయాశ్వాసము/శంకరుఁడు ప్రత్యక్షం బగుట

వికీసోర్స్ నుండి

శంకరుఁడు ప్రత్యక్షం బగుట

289-క.
వనములు కొలఁకులు గిరులును
వినువీథియు ధరయు నొక్క వెలుఁగై వెలుఁగన్
మునుమిడి పువ్వుల వానలు
గొనకొని కురియంగ సురలు కోర్కులఁ దేలన్.
290-సీ.
పై నొప్పఁ బెట్టిన భద్రదంతావళతోలుతో మొల పులితోలుతోడ
కమనీయ మై నట్టి కంబుకంఠముతోడబొలుపారు నెఱపూత భూతితోడఁ
ఘనతరం బగు నాగ కంకణంబులతోడఁదనరారు శూలాయుధంబుతోడఁ
బటుజటావలిలోని బాలచంద్రునితోడదయతోడ నభయ హస్తంబుతోడ
ఆ. లీల నంది నెక్కి లేనవ్వు దొలుకాడఁ
బడతిఁ కభయ మీయఁ బల్లవించి
భక్తబాంధవుండు భవుఁడు ప్రత్యక్షమై
శైలరాజపుత్రి మ్రోల నిలచె
291-క.
నిలచినఁ గనుఁగొని భయమునఁ
జెలు లందఱు నన్ని దిశలఁ జేరి వేగం
దలపోయ వడుగు శివుఁ డై
వెలుఁగుటకును జాల బెగడి విస్మయమతు లై.
292-వ.
ఆ సమయంబున.
293-మత్త.
దేవి దేవరఁ జూచె దేవర దేవిఁ జూచెను నంతలో
భావజన్ముఁడు దోఁచి యేసెను భావబంధము లొందఁగా
నేవమైఁ దొలి ఫాలలోచను నేయఁ జంకిన పుష్పబా
ణావళుల్ జత గూర్చి భర్గుని నప్పు డేసెఁ జెలంగుచున్.
294-క.
తను వలచు శివుఁడు ముందటఁ
దనకుఁ బ్రత్యక్ష మైనఁ దద్దయు వేడ్కన్
దనుమధ్య చూచుచుండెను
తనువునఁ బులకాంకురములు దళుకొత్తంగన్.
295-చ.
చుఱుకులు దట్టముల్ మెఱపుచుక్కలు తిరుగు చెక్కు లుగ్రముల్
మెఱుపులు కాము బాణములు మించుల తీవెలు చంచలావళుల్
కఱకులు మోహబంధములు కాము శరంబుల పుట్టినిళ్ళు కి
న్నెరులు వెడంద లందములు నీరజలోచన చూపుచందముల్.
296-ఉ.
కామిని చూచు చూపులకుఁ గాక కలంగి శివుండు పాంథుఁ డై
కామునిఁ దొల్లి గెల్చిన మగంటిమి యెల్లఁ దలంక లోలతన్
గామినిఁ జూచుచుండె మఱి కామినియున్ మదనాస్త్రపాత యై
కామవిరోధి చూపులకుఁ గాక తలంకె మనఃకళంక యై.
297-వ.
మఱియును.
298-మత్త.
చూచుఁ జింతన సేయు నోరగఁ జూచు వర్ణన సేయఁగా
జూచుచుం దమకించు సిగ్గునఁ జొక్కుఁ బ్రార్థన సేయఁగా
జూచు నంతన డయ్యుఁ ద న్మఱచున్ ముదంబున వెండియున్
జూచుఁ జేష్టలు లేక యంబిక సోమశేఖరు నీశ్వరున్.
299-వ.
ఇ వ్విధంబున.
300-ఉ.
ఒండొరు సుందరాంబువుల నోలి మునింగియుఁ దేలి తెప్ప లై
యొండొరుఁ బాయ లే కునికి నున్మాదు లై నిజ బోధ వీథి నొం
డొండన దెప్ప లై గుణగణోన్నతి కూటమిఁ జేర్చి శంభుఁ డా
కొండలరాజుకూఁతునకుఁ గూరిమి ని ట్లనియెన్ బ్రసన్నుఁ డై.
301-శా.
“ఓ వామేక్షణ! యో కురంగనయనా! యో కాంత! నీ యిష్టమై
నీవా నన్నును నేలుకొంటివి సతీ నీ వాఁడ నే నైతి ని
చ్చో వద్దింకను నంది నెక్కి గడఁకన్ శోభిల్లగాఁ బ్రీతితో
రావే పోదము వెండికొండకు మనోరాగంబుతోఁ గన్యకా!”
302-చ.
అనవుఁడు సంతసిల్లి తరలాయతలోచన బోంట్లు నేర్పుతో
వినయము లొప్ప మ్రొక్కఁగను విశ్వవిభుండు కృపాకటాక్షుఁ డై
కనుఁగొని యుంటఁ జూచి కరకంజము లంజలి చేసి “దైవమా!
తనరిన విన్నపంబు లవధారు ప్రసన్నతి నాదరింపవే.
303-ఉ.
వేద పురాణ శాస్త్రములు విస్తుతి నిన్నును జేయలేవు బ్ర
హ్మాదులుఁ గానలేరు సనకాదులుఁ గానఁగలేరు నిర్జరేం
ద్రాదులుఁ గానలేరు ధనదాదులుఁ గానఁగలేరు లక్ష్మినా
థాదుల కైన నీదు మహిమాతిశయంబుఁ దలఁప శక్యమే.
30-చ.
ఇతరులు నీ మహిమ యింతని చెప్పఁగ నెంతవారు మా
నితతర మైన నీ మహిమ నీవె యెఱుంగుదు వట్టి నీవు మా
సతికి దయాపరుండవును సన్నిధి వైతి విదేమి పుణ్యమో
సతతము శైలవల్లభుఁడ సల్పిన నిష్ఠ ఫలించె శంకరా!
305-క.
జయ జయ కరుణాంభోనిధి!
జయ జయ దేవాధిదేవ! జయ చంద్రధరా!
జయ జయ భక్తమనోహర!
జయ జయ శ్రీనీలకంఠ! జయ పురవైరీ!
306-క.
పన్నగకంకణ! నీ కయి
చెన్నుగ ధరణీధ్రవిభుఁడు చేసిన తపముల్
సన్నుతిఁ దలఁపఁగ వలదే
మన్నింతురు గాక యేలి మన్నన నతనిన్.
307-మత్త.
పంకజాననఁ బుట్టినింటికిఁ బంపి యీ కృపఁ జూచి మా
వంక మేలు దలంచుచున్ హిమవంతు నింటికి మీర లే
ణాంకశేఖర! కొందఱన్ విమలాత్ములన్ గమలాక్షి కై
యుంకు వీ దగు వారిఁ బంపుట యొప్పు నయ్య మహేశ్వరా!”
308-వ.
అనిన విని య ప్పరమేశ్వరుండు చెలుల విన్నపం బవధరించి శైలకన్యకా తిలకంబు నవలోకించి యి ట్లనియె.
309-క.
“మీ తండ్రి యున్న చోటికిఁ
బ్రీతిగ నిన్నడుగఁ దగిన పెద్దల వేగం
బాతతిగతిఁ బుత్తెంతుఁ జు
మీ తలపోయ వల దింక మీననిభాక్షీ!
310-ఆ.
నిన్నుఁ బాసి నిలువనేర్తునే నేర్చిన
తలఁపు లెట్లు నిలుచుఁ దరలనయన
తలఁపు నిలిచెనేని తను మధ్య యొంటరిమై
ప్రాణ మెట్లు నిల్చుఁ బంకజాక్షి!”
311-వ.
అని మఱియు తగిన లాగున న మ్మహాదేవిని మన్నించి రజత ధరణీధరంబునకు నీశ్వరుండు వేంచేసె ననంతరంబ య క్కాంతా తిలకం బగు గౌరీదేవియుఁ దన్ను మహేశ్వరుండు మన్నించిన మన్ననలకు నత్యంత ప్రమోదంబు నొంది తన సఖీజనంబులుం దానును దపోవనవాసంబు చాలించి తుహినాచల శిఖరంబుఁ బ్రయాణంబు చేసె నని చెప్పి.