వీరభద్ర విజయము/ద్వితీయాశ్వాసము/ఆశ్వాసాంతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆశ్వాసాంతము

312-ఉ.
రాజిత రాజరాజ దినరాజ భుజంగమరాజ భారతీ
రాజ నిలింపరాజ మునిరాజ పయోనిధిరాజ రాజ గో
రాజ విహంగరాజ యమరాజ సరోజనివాసవాసినీ
రాజ సురాధిరాజ గిరిరాజ నిరంతర వంద్య శంకరా!
313-క.
మద సామజా జినాంబర!
యుదయార్క సహస్రకోటి సూజ్జ్వల తేజా!
మదనోన్మదహరలోచన!
సదమల యోగీంద్ర హృదయ శరనిధిచంద్రా!
314-మా.
ధవళవృషభవాహా! తారశైలేంద్రగేహా!
భవహరణగరిష్ఠా! పద్మజాండప్రతిష్ఠా!
దివిజరిపువిదారా! దేవదైత్యాస్థిహారా!
దివిజవినుతమూర్తీ దేవతాచక్రవర్తీ.
315-గ.
ఇతి శ్రీ మన్మహా మహేశ్వర యివటూరి సోమనారాధ్య దివ్య శ్రీపాద పద్మారాధక కేసనామాత్య పుత్ర పోతయ నామధేయ ప్రణీతం బైన శ్రీ వీరభద్రవిజయం బను మహా పురాణ కథ యందుఁ దారకాసుర సంగ్రామంబును; దేవతల పరాజయంబును; దేవేంద్ర బ్రహ్మ సంవాదంబును; అమరుల యమరావతీ ప్రవేశంబును; మరుండు సుర నగరంబునకుఁ బ్రయాణంబు సేయుటయు; మన్మథ పురందర సంవాదంబును; మదన రతీ సంవాదంబును; జిత్తజుండు పరమేశ్వరునిపై దండెత్తి పోవుటయుఁ గామ దహనంబును రతీ విలాపంబును; గపటదైవజ్ఞ వృత్తాంతంబును గౌరీదేవి తపంబు సేయిచుండ శివుండు బ్రహ్మచారి వేషంబున వచ్చుటయుఁ బార్వతీదేవి తపఁ ప్రయాసంబునకు నీశ్వరుండు మెచ్చి ప్రత్యక్షం బగుటయు నన్న ద్వితీయాశ్వాసము.