వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/హిమవంతుఁడు పార్వతిఁ జూచి పలుకుట

వికీసోర్స్ నుండి


హిమవంతుఁడు పార్వతిఁ జూచి పలుకుట

1-క.
శ్రీ గౌరీఘనసుస్తన
భాగాంకితగంధసారభాసుర వక్షో
భాగ! నిశానాథాజటా
భాగా! లోకాధినాథ! పార్వతినాథా!
2-వ.
పరమజ్ఞానభావుం డగు వాయుదేవుం డమ్మహామునుల కిట్లనియె; నవ్విధంబునఁ దనకు బరమేశ్వరుండు ప్రత్యక్షం భై యాదరించిన నోషధిప్రస్థానపురంబున కరుగుదెంచి సుందరీజనంబులుం దానును వినయవినత లై నిలిచినఁ బార్వతీదేవిని గనుంగొని ధరాధరేంద్రుండు నిజసుందరీ సహితుం డై సవినయంబున గౌగిలించుకొని దీవించి యమహాదేవిచిహ్నంబు లవలోకించి యిట్లనియె.
3-మ.
“లలనా నీముఖపద్మ మెంతయు మహాలంకార మై కాంతి ని
శ్చల మై యున్నది నేడు నీ నయనము ల్సంపుల్లనీలోత్పలం
బుల సత్కాంతికి నీడు దోఁచినవి నీ బోట్లందఱున్ సొంపు మై
గలుగం బొంగినవార లేమి చెపుమా? కాంతామణీ! ధీమణీ!
4-మ.
ఉవిదా! నీ తప మీశ్వరుం డెఱిఁగినట్లొప్పారెనే మించెనే
భవదూరుండును సన్నిధై నిలచెనే పాటించి మన్నించెనే
తివుటం గన్నియ సన్నిధిన్నిలచెనే తెల్లంబుగా నొండొరుల్
తవులన్నిల్చితిరే యభీష్టములు సంధానంబులై యుండునే!”
5-వ.
అని పలుమాఱుఁ గుమారిని గీర్తించుచు దేవీ నీకు పరమేశ్వరుండు ప్రత్యక్ష మైన తెఱంగు తేటపడ వినం గుతూహలం బై యున్నది; వినిపింపు మని యడిగిన దుహినాచలేంద్రునకుఁ బార్వతీదేవిచెలు లగు జయవిజయ లిట్లనిరి.