Jump to content

వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/పార్వతి చెలులు హిమవంతునకు జరిగిన వృత్తాంతంబు చెప్పుట

వికీసోర్స్ నుండి


పార్వతి చెలులు హిమవంతునకు జరిగిన వృత్తాంతంబు చెప్పుట

6¬-చ.
వినుము, గిరీంద్ర! నీ తనయ వేగ తపోవనభూమిలోనికిన్
జని విమలాత్మ యై తగిలి సంతతమున్ హృదయంబులోన శం
భుని పదపూజనల్ సలిపి భూరివిచిత్రతపంబు చేసె నీ
వనజదళాక్షి మంచుకును వానకు నెండకు నోర్చి ధీరతన్.
7-వ.
ఇవ్విధంబున నశ్రాంతంబును నత్యంతఘోరంబును నగు తపంబు సేయుచుండ, నొక్కనాఁడు గిరీంద్రా! నీ కేమి చెప్ప నప్పరమేశ్వరుండు లీలావినోదంబున బాలుం డై వటువేషంబు దాల్చికొని, యేము చరించుచున్న వనంబునకుఁ జనుదెంచి, మమ్ము డగ్గరి “యీ బాల యెవ్వరిబాల?” యని యడిగిన; నేమును సముచితభాషణంబుల “మునీంద్రా! యీ కన్నె హిమనగేంద్రుని కన్నియ” యని పలికిన నతండును మాతో మఱియు ని ట్లనియె.
8-క.
“ముదితలు మీరందఱు స
మ్మదమున సేవింప రాజమందిరములలోఁ
గదలక వర్తింపఁగ సతి
యిది యేలా సేయఁ దొడఁగె నీ తప” మనియెన్.
9-క.
అని పలుక నంత నెఱుఁగక

మునినాయకుఁ డొక్కఁ డనుచు ముక్కంటి శివు
న్వనజాక్షి కోరి చేసెడి
ఘనతప మని పలఁకుటయును గాంతామణియున్.
10-వ.
నగేంద్రా! యా వటుకకుమారుఁ డైన శివుండు దాని కి ట్లనియె.
11-సీ.
“ చెల్లరే! యీజాడ శివుఁడు నీ సాటియే
  దేశంబు దిరిగెడు తిరిపె కాఁడె
ఆహారవాంఛమై నడుగ నింటింటికి
  సొరిది భిక్షముఁ దెచ్చు జోగి గాఁడె
ఎక్క గుఱ్ఱము లేక యెద్దు నెక్కుచునుండు
  తొలుత నెంతయు దరిద్రుండుగాఁడె
కట్టఁ జీరెలు లేక ఘనగజచర్మంబు
  గట్టిన పెద్దజంగంబు గాఁడె
ఆ.
ఒంటిగాఁడు గాఁడె యొలుకులలో భూత
తతియుఁ దాను నుండు తపసిగాఁడె
యేల కోరె దతని నెత్తి కొంపోయెద
నన్నుఁ దగిలి రమ్ము; నలిననేత్ర!”
12-వ.
అని మఱియు నతండు తన నిజ గుణంబులు చెప్పుటయును బార్వతీదేవికి నింద్యంబు లై తోఁచిన నక్కపటతాపసిం జూచి “వీని వనంబు వెడలఁ ద్రోయుం” డని పంచిన నేమునుం గదసి పెనంగెడు సమయంబున; నంతర్హితుం డై ప్రసన్నత్వంబు నొంది యీశ్వరుండు నిజదివ్యాకారశోభితుం డై నిలిచి తరుణియుం దానును కైలాసంబునకుం బోవ గమకించిన భవదీయ భక్తివశంబున మావిన్నపం బవధరించినవాఁ డై గౌరీదేవి నుపలాలించి నిజమందిరంబునకుం దానే చనియె మేమును జనుదెంచితిమి కతిపయ దివసంబుల లోపల మన యింటికి నీ కుమారీతిలకంబు నడుగ దగువారలం బుత్తేరంగలవాఁ” డని యేర్పడఁ జెప్పిన.
13-క.
త్రిభువనపతికిని శివునకు
నభినవకీర్తులను మామ నయ్యెద ననుచున్
విభవంబున సంతతమును
రభసంబున శైలవిభుఁడు రంజిలుచుండెన్.
14-క.
తనుమధ్య నిమిత్తంబున
ఘనకీర్తులు గలిగె ననుచు గౌరీకాంతన్
తనుఁ జేర దగిచి గారవ
మున నలకలు దువ్వి శిరము మూర్కొని ప్రీతిన్.
15-త.
వనజలోచనతోడ నా హిమవంతు డి ట్లనె “బాలికా
యనిమిషుల్ నుతియింపఁ గంటి ననంతరాజ్యముఁ గంటి శం
భునికి మామ హిమాచలుం డను పుణ్యకీర్తులు గంటి నా
తనయ వై నను గారవించినదానఁ జేసి తలోదరీ!
16-క.
అని పలుమాఱును బొగడుచు
వినయంబున సతియుఁ దాను విమలేందుముఖిన్
జనని యని సేవ సేయుచు
ననురాగముఁ బొందె శీతలాచలపతియున్