వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/శంకరుఁడు సప్తమహర్షులను బిలుచుట

వికీసోర్స్ నుండి


శంకరుఁడు సప్తమహర్షులను బిలుచుట

17-మత్త.
వాసుకీకరకంకణుం డగు వామదేవుఁడు గౌరిఁ గై
లాసశైలముమీఁద నుండి తలంచి యా చలికొండకున్
భాసురంబుగఁ బోయి యుంకున బాలకిచ్చి నిజంబుగాఁ
జేసి రాఁగలవార లెవ్వరు శిష్టనైపుణమానసుల్.
18-క.
బలము గలవారు నిపుణత
గలవారును బుద్ధినీతి గలవారును ని
ర్మలత గలవారు సంపద
గలవారు వివాహతతికిఁ గావలయు ధరన్.
19-వ.
అంత నక్కడ మహేశ్వరుండు “మునీంద్రులారా! దేవకార్యంబుఁ దీర్ప నెల్లరు నిచ్చోటికి విచ్చేయుదురు గాక.”
20-క.
అని సప్తర్షులఁ దలఁచినఁ
జనుదెంచిరి తలపులోనఁ జయ్యన వారుం
జనుదెంచి నిలిచి నిజకర
వనజంబులు మొగిచి మ్రొక్కి వలనొప్పారన్.
21-వ.
ఇట్లు స్తుతియింపఁ దొడంగిరి.
22-క.
“శంకర! పాపభయంకర!
కంకాళకపాలహ స్త! గంగాధిపతీ!
ఓంకార మంత్రమందిర!
కంకణభుజగాధినాధ! కారుణ్యనిధీ!
23-సీ.
శరణార్ధి కలధౌతశైలేంద్ర మందిర!
  శరణార్ధి దిననాథచంద్రనయన!
శరణార్ధి పరమేశ! సర్వజ్ఞశేఖర!
  శరణార్ధి గణనాథచక్రవర్తి!
శరణార్ది దేవేంద్ర సంతతార్పితపాద!
  శరణార్ధి నిర్మలచారువదన!
శరణార్ది యోగీంద్రసంతానభూజాత!
  శరణార్ధి గజదైత్యచర్మధార!
ఆ.
వరద! దేవదేవ! వాసుదేవప్రియ!
నకలలోకనాథ! శైలనాథ!
కనకశైలచాప ఖడ్గమూల స్తంభ
దేవ! సత్ప్రతాప దివ్వరూప!
24-క.
పంచశరాంతకలోచన!
పంచానన పంచరూప భాసురకీ ర్తీ!
పంచేంద్రియాది నిర్జిత
పంచాక్షర దివ్యరూప! ప్రమథాధిపతీ!
25-శా.
ఏ వేదంబులకైన గూఢతరమై యేపారు నీ రూపమున్
దేవా! కంటిమి యెంత పుణ్యలమొకో దేవేశ! మీ రాత్మలో
భావింపం బనియేమి? మీ తలఁపు మా భాగ్యంబు సిద్ధించెనో
కైవల్యాధిప! యానతిమ్ము కరుణన్ గర్జంబు సర్వేశ్వరా.”