వీరభద్ర విజయము/ద్వితీయాశ్వాసము/రతీదేవి శివునిపైఁ బోవల దని మన్మథుని మందలించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రతీదేవి శివునిపైఁ బోవల దని మన్మథుని మందలించుట

71-వ.
అనవుడు నక్కాంతాతిలకంబు విస్మయాకుల చిత్త యై మూర్ఛిల్లి తెలువొంది నగవును గోపంబును దైన్యంబును సుడివడుచుండ ని ట్లనియె.
72-శా.
“ఏలా మన్మథ! యిట్లు పల్కఁ దగవా? యీ చందముల్ మేలె? నీ
వేలా మూఢుఁడ వైతి? నీదు మది దా నెచ్చోటికిం బోయె? మి
థ్యాలాపంబులఁ బల్క నీకుఁ దగ భవ్యంబౌ రతి క్రీడయే
కాలారిఁ ద్రిపురారిఁ జేర వశమే? కందర్ప! నీ బోటికిన్.
73-వ.
అదియునుం గాక.
74-సీ.
నిఖిల ప్రపంచంబు నిర్మించి శోభిల్లుపరమేష్ణి కంటె నీ బలము బలమె?
మూఁడు వేల్పులఁ బట్టి మూలకుఁ జొనిపినకరివైరికంటె నీ వెరవు వెరవె?
ఘన భీకరాటోపకలితుఁడై వర్తిల్లులయకాలుకంటె నీ లావు లావె?
ఖలదైవములనెల్ల ఖండించి మించినయంతకంటె నీ యరుదు యరుదె?
ఆ. యెట్టి ఘనులఁ బట్టి యెనయంగఁ దలకొని
తెచ్చి విఱిచి త్రుంచి వచ్చినాఁడు
వలదు శంభుతోడ వైరంబు మన్మథ!
యూరకుండి చచ్చువారు గలరె.
75-చ.
కలువలరాజు పువ్వు, కడికంచము బ్రహ్మకపాల, మన్ను వ
న్నెల పులితోలు చీర, పదనిర్మల పద్మము, విష్ణువమ్ము, వే
దలలవిభుండు కంకణము, తప్పని లెంకలు దేవ సంఘనుల్,
సలలిత మ మ్మహామహిమ సర్వము వాని గణింపవచ్చునే.
76-శా.
పుట్టించున్ భువనంబు నల్మొగములన్ బొల్పారఁగా ధాత యై
పట్టై రక్షణ సేయుచుండును సుధాపర్యంకుఁ డై రుద్రుఁ డై
కట్టల్కం దెగటార్చు నిట్లు మఱియు గర్వించి లీలాగతిం
గట్టా యిట్లు మహేశు మీఁద నరుగంగాఁ బాడియే? మన్మథా!
77-ఉ.
ఏమని చెప్పవచ్చు నతఁ డెంతటివాఁ డని పల్కవచ్చు నీ
భూమియు నాకసంబు జలపూరము నాత్మయు నగ్ని గాలియున్
సోముఁడు చండభానుఁ డగు సూర్యుఁడు నాతఁడు దాను బ్రహ్మయుం
దామరసాక్షుఁడు న్నతని తత్త్వముఁ గానరు నీకు శక్యమే?
78-మ.
చదువుల్ మంత్రములుం బురాణ చయముల్ శాస్త్రంబులుం గూడి య
మ్ముదుకం గానఁగ లేక తోఁచినగతిం మోదించి వర్ణించు నా
చదువుల్ పూర్వులు కన్న విన్న తపస్సుల్ స్రష్ట్రండముల్ కుక్షిలో
నుదయం బైనవి గాన న మ్మహిమ దా నూహింప రా దేరికిన్.
79-శా.
కల్లోల ధ్వని మంత్ర జాలములున్, గాయంబు బాఠీనముల్,
సల్లాలిత్య తతి ద్విజుల్, మణులు నక్షత్రావళుల్ ఫేనముల్,
తెల్లం బైన త్రిమూర్తు లూర్ములు గతుల్, దివ్యప్రభావంబు రం
జిల్లంగా జలపూర సంకుల మహాశ్రీకంఠవారాశికిన్.”
80-వ.
మఱియు ని ట్లనియె.
81-సీ.
“భూకాంత తేరును బూవులతేరును;నిర్ఝరసుభటులు న్గీరభటులు;
కనకాచలము నిల్లు కడు తియ్య నగు విల్లు;మేటి నంది పడగ మీనుపడగ;
బహుమంత్రవాజులు పచ్చని వాజులు;పెక్కు దలల నారి భృంగనారి;
నలుమొగంబుల యంత నవవసంతుఁడు యంతపురుషోత్తముం డమ్ము పూవు టమ్ము;
ఆ. వెలయ రేయుఁ బగలు వెలిఁగించు కన్నులు
తమ్మి కండ్లు; త్రిపురదైత్యకోటి
గురి విట వ్రజంబు గురి; యతనికి నీకు
నేమి సెప్పవచ్చు? నెంత కెంత.
82-క.
నిరుపమ నిర్మల నిశ్చల
పరమ మహాదివ్య యోగభరిత నిజాంతః
కరణుఁడు శివునిం గెల్చుట
విరహులఁ బొరిగొంట కాదు విరహారాతీ!
83-సీ.
ఖద్యోత బృందంబు గర్వింప వచ్చునే పరఁగ దేజః ప్రదీపంబుమీఁద;
పరఁగఁ దేజః ప్రదీపంబు శోభిల్లునే యాభీల ఘోర దావాగ్నిమీఁద;
ఆభీల ఘోర దావాగ్ని పెంపేర్చునేపవలింటి భానుబింబంబుమీఁద;
పవలింటి భానుబింబంబు వెలుంగనేప్రళయకాలానల ప్రభలమీఁద;
తే. ప్రళయకాలగ్ని కోటిచేఁ బ్రజ్వరిల్లు
మంటఁ గలకంఠఁ బరఁగు ముక్కంటిమీఁద;
వ్రాల నేరదు నీ పెంపు దూలుఁ గాని
జితజగజ్జనసంఘాత చిత్తజాత!”
84-క.
అని నేర్పు మెఱసి పలుమరుఁ
దనకుం గడు బద్ధిచెప్పు దామరసాక్షిం
గన కర్మపాశ హతఁ డై
తన సతికి మనోభవుఁడు దా ని ట్లనియె.
85-మ.
“బలభేద్యాది సురాళితోఁ బలుకు నా పంతంబు చెల్లింప ను
త్పలగంధి తలఁపొందె గాని యతఁ డీ బ్రహ్మాండభాడావళల్
కలఁగం జేయు సదాశివుం డని యెఱుంగం జాలుదుం జాలునే
కలకంఠీరవ! కంబుకంఠి! శివు వక్కాణింప నిం కేటికిన్.”
86-వ.
అని పల్కి మరుండు మదాంధ సింధురంబునుం బోలె నతులిత మదోద్రేక్రమానసుం డై త దవసరంబున.
87-క.
ఖండేందుధరునిమీఁదను
దండెత్తఁగవలయ ననుచుఁ దన బలములఁ బి
ల్వుం డని కాలరి తమ్మెద
తండములన్ మరుఁడు పంపెఁ దద్దయు వేడ్కన్.
88-ఉ.
పంపినఁ గాలరు ల్గదలి పంకజరేణువు రేగునట్లు గా
వింపుచుఁ బోయి జు మ్మరని పిల్చినఁ ద ద్బలముల్ చెలంగఁగాఁ
గంపితులై పతిం గొలువ గ్రక్కున నప్పుడు వచ్చి రోలి మైఁ
దెంపును సొంపు గ్రాలఁ గడు దీవ్ర గతిం రతినాథుఁ గానగన్.
89-క.
వనములఁ గొలఁకులఁ దిరిగెడి
ఘన కోకిల కీర భృంగ కాదంబ తతుల్
చనుదెంచి కొల్చె పశ్చిమ
ఘనతర శైలార్కతేజుఁ గామనిఁ గడఁకన్.
90-వ.
అ య్యవసరంబున.
91- సీ.
బలము నేర్పులతోడఁ బన్నించి తెం డని; పడవాలు కోకిల పంక్తిఁ బంపె;
భేరీ మృదం గాది చారు నాదంబులు; నెనయఁ దుమ్మెదల మ్రోయింపఁ బంపె;
రాకీరములఁ గట్టి రథ మాయితము సేయ; సంగడికాని వసంతుఁ బంపె;
మహనీస మగుచున్న మన బలంబుల నెల్ల; గమనింపు మని కమ్మ గాలిఁ బంపె;
ఆ. మేలు బలమువాఁడు మీనుటెక్కమువాఁడు
నిఖిల మెల్లఁ గలఁచు నేర్చువాఁడు
పచ్చవింటివాఁడు పరగఁ బల్పువుటమ్ము
గలుగువాఁడు ప్రౌఢగతులవాఁడు.
92-క.
తన తేజము తన బలమును
తన గర్వము తన మదంబు దన సంపదయున్
ఘనతరముగ నచ్చెరువుగఁ
పనిగొని పరమేశుమీఁదఁ బైనంబయ్యెన్.
93-వ.
అంత
94-సీ.
కమలషండము నున్నఁగాఁ జేసి యిరుసుగాఁగావించి కెందమ్మికండ్లఁ గూర్చి;
తగ నించు మోసుల నొగలుగాఁ గావించికర మొప్పఁ గేదెఁగికాడి వెట్టి;
సంపెంగమొగ్గల చనుగొయ్య లొనరించిపల్లవంబులు మీఁదఁ బఱపుఁ జేసి;
చెలువైన పొగడదండలచేత బిగియించియెలదీఁగె పలుపులు లీలఁ జొనిపి;
ఆ. తెఱఁగు లరసి పువ్వుతేనెఁ గందెన వెట్టి;
గండురాజకీరగములఁ గట్టి;
మెఱయ చిగురుగొడుగు మీనుటెక్కము గ్రాలఁ
దేరు బన్ని సురభి తెచ్చె నపుడు.
95-వ.
ఇట్లు మహిమాతిశయం బగు సుమరథం బాయత్తంబు చేసి వసంతుఁ డనంత వైభవంబున నంగసంభవుం గాంచి “దేవర యానతిచ్చిన విధంబునఁ దే రాయత్తంబు చేసి తెచ్చితి; నదియునుం గాక పిక మధుర మరాళ సేనా నాయకుల దండు గండు మొనలై రతీంద్రా! నీ రాక గోరుచు మొగసాల నున్నవా” రని విన్నవించిన నవధరించి పురారాతిమీఁద దండు గమకించి మెయి వెంచి విజృంభించి సమంచిత పుష్ప బా ణానన తూణీర సమేతుండును; ద్రిభువన భవ నాభినవ సుందరుండును; రంగద్భృంగ మంగళ సంగీత పాఠ కానేక నిర్మల మహనీయ నాద మోదిత మానసుండును; భూరి కీర కైవార నిజ గు ణాలంకారుండును; కలహంస నాద గణ పరివృతుండును; నగణ్య పుష్ప రథారూఢుండును; జగన్మోహనుండును; నగోచర చారు శృంగారుండును; హార కేయూర మణిమకు టాభిరాముండును; రమణీయ రతిరామా సంయుతుండును; కలకంఠ కీర సే నాధిష్ఠితుండును; బల్లవ ఛత్ర చామర కేత నాలంకృతుండు నై నభోభాగంబునం బోవు చుండె న య్యవసరంబున.
96-మ.
కనియెం గాముఁడు మాతులుంగ కదళీ ఖర్జూర పున్నాగ చం
దన జంబీర కదంబ రంభ ఫలినీ దాడీమ మందార కాం
చన నాగార్జున బింబ కంటక ఫ లానంత ప్రవాళావళీ
వన సంరంభము శీతవంతమును శర్వాణీ ప్రియోపాంతమున్.
97-వ.
కని య మ్మా వనంబు దరింయ జొచ్చి.
98-సీ.
తన మనోవీథి పై దర్పంబు రెట్టించి;చెన్నొంద వెడవిల్లుఁ జేతఁ బట్టి;
దట్టపు మొల్లలు తలజొమ్మికము వెట్టి;సొంపారఁ బూవులజోడుఁ దొడిగి;
తన బలంబుల నెల్ల మొనలుగాఁ గావించి;కలువలు తూణీరములు ధరించి;
యక్కజముగ మీన టెక్కె మెత్తించి; రాచిల్కల తేరెక్కి; చివురు గొడుగు
ఆ. బాలకోకిలంబు బట్టంగఁ గడువేడ్క
గీర చయము తన్నుఁ గీర్తి సేయ
గమ్మగాలితోడఁ గదన సన్నద్ధుఁ డై
కాముఁ డేగె సోమజూటు కడకు.
99-వ.
ఇ వ్విధంబున నత్యంక సమ్మదంబున సకల సన్నాహ బల పరి వృతుం డై నిదురబోయిన పంచాననంబు నందంద మేలుకొలుపు మదగజంబు చందంబున నిందిరానందనుండు నిరుపమ నిర్వాణ నిర్వంచక నిర్విషయ నిరానంద మానసుండును; సకల బ్రహ్మాండ భాండ సందోహ విలంబిత నిర్మల పరమ భద్రాసీన దివ్య యోగ ధ్యాన సంతత భరి తాతంరంగుండును; నిర్గుణుండును; నిర్వికారుండును నై తన్నుం దాన తలపోయుచు నశ్రాంత సచ్చిదానంద హృదయుం డగు న మ్మహేశ్వరుం గాంచి యల్ల నల్లన డాయం బోయి తదీ యాభిముఖుం డై మనోభవుండు.
100.లగ్రా
ఇంచువిలుకాఁడు వెస నించువిలుఁ జూచి మెయిఁ; బెంచి తమక మ్మినుమడించి గుణముల్మ్రో
యించి దివిజారి నలయించి విట చిత్తములు; చించి పువుటమ్ము మెఱయించి కడిమిన్ సం
ధించి శివు నేయఁ గమకించి తన చిత్తమునఁ; బంచముఖు మానస సమంచితము నాలో
కించి వెఱఁగంది గుఱి యించుకయుఁ గానక చ;లించి నిలిచెన్ గళవళించి భయవృత్తిన్.
101-మ.
విలు జూచున్ వెలి జూచుఁ జూచు సురలన్ విశ్వేశ్వరుం జూచుఁ గొం
దల మందుం దలపోయఁజొచ్చుఁ గడిమిన్ దర్వీకరాలంకృ తో
జ్జ్వల విభ్రాజిత నిత్య నిర్గుణ తపోవారాన్నిధం జెచ్చెరం
గలపం జూచుఁ గలంపలేక తలకుం గామండు నిశ్చేష్టుఁడై.
102-క
అంత శివార్చన సేయగఁ
గాంతాతిలకంబు శైలకన్నియ వచ్చెన్
కంతునిదీపమొ యనఁగా
నెంతయు లావణ్యమున మహేశ్వరుకడకున్.
103-క.
గిరినందన డాయం జని
యరుదుగ మఱి పూజసేయ న త్తఱి మౌళిన్
గిరిజ కరంబులు సోఁకినఁ
బరమేశుని చిత్త మెల్లఁ బరవశ మయ్యెన్.
104-వ.
ఆ సమయంబున.
105-శా.
టంకార ధ్వని నింగి నిండ వెడవింటం పుష్పబాణంబు ని
శ్శంకం బూని సురేంద్రు కిచ్చిన ప్రతిఙ్ఝా సిద్ధి గాఁ జేసి తాఁ
గింక న్వి ల్లెగఁ దీసి గౌరి శివునిం గేలెత్తి పూజించుచో
హుంకరించుచు నీశు నేసె మదనుం డుజ్జృంభ సంరంభుఁడై.
106-క.
మదనుం డేసిన బాణము
హృదయంబునఁ గాడి పార నీశుఁడు దన్నున్
చెదరించె నెవ్వఁ డక్కడ
మదచిత్తుఁడు ఘోరకర్మమానసుఁ డనుచున్.
107-క.
ఏసియు నంతటఁ దనియక
భాసిలి వెండియును బుష్పబాణము నారిం
బోసిన మానససంభవు
నీశుఁడు గను విచ్చి చూచె నెవ్వఁ డొ యనుచున్.
108-వ.
ఇట్లు చూచిన.
109-మ.
కులశైలంబులు భేదిలన్ జల నిధుల్ కోలాహలంబై వెసం
గలఁగన్ దిక్కులు ఘూర్ణిలన్ జగము లాకంపింప విశంభరా
స్థల మల్లాడ నభస్థలిం గరుడ గంధ ర్వామ రాధీశ్వరుల్
పలుమాఱుం బెగడొందఁ జుక్క లురలన్ బ్రహ్మాదులున్ భీతిలన్.
110-క.
భుగభుగ యను పెను మంటలు
భగభగ మని మండ నంత బ్రహ్మాండంబున్
దిగుదిగులు దిగులుదిగు లనఁ
దెగి మరుపైఁ జిచ్చుకన్ను దేవుఁడు విచ్చెన్.
111-క.
దిక్కు లెఱ మంటఁ గప్పెను
మిక్కిలిగా మింట నెగయు మిడుఁగురు గములున్
గ్రక్కదలి రాల వడిగాఁ
జుక్కలు ధరఁ బడఁగ మింట సురలుం గలఁగన్.
112-వ.
అంత.
113-సీ.
కలహంసములతోడ గండుగోయిలలతో;మేలైన కమ్మ దెమ్మెరల తోడ;
చిలుకల గములతో నలరుల తేరుతో;శరము పూన్చిన శరాసనముతోడ;
పుష్పహారములతోఁ బుష్పవస్త్రములతోఁదనరారు మకరకేతనముతోడ;
పువ్వులజోడుతోఁ బువ్వులదొనలతోఁగొమరారు చిగురాకుగొడుగుతోడ;
ఆ. మఱియుఁ దగినయట్టి మహితశృంగారంబు
తోడఁ గూడి వేగఁ దూలి తూలి
శివుని నుదుటికంటి చిచ్చుచే సుడివడి
పంచవింటిజోదు భస్మమయ్యె.
114-క.
“ఓహో దారుణతమ మిది
యాహో మరుఁ డీల్గె నీల్గె” నని శివమదనో
గ్రాహవము చూచి మింటను
హాహానాదంబు లిచ్చి రమరేంద్రాదుల్.
115-వ.
మఱియు న య్యవసరంబున ఫాలలోచనాభీలపావక కరాళజ్వాలావళీ పాత భస్మీభూతుం డై చేతోజాతుండు దెగుటఁ గనుంగొని విస్మ యాకుల చిత్త యై యతని సతి యైన రతీదేవి జల్లని యుల్లంబు పల్లటిల్ల నొల్లంబోయి మూర్ఛిల్లి యల్లన తెలివొంది శోకంపు వెల్లి మునింగి కలంగుచుఁ దొలంగరాని బలు వగల పాలై తూలుచు వదనంబును శిరంబును వదనగహ్వరంబు నందంద మోదుకొనుచు మదనుండు వొలిసిన చోటికి డాయం బోయి యిట్లని విలపింపం దొడంగె.
116-ఉ.
“హా వలరాజా! హా మదన! హా మథురాయత చారులోచనా!
హా విటలోక మానస నిరంతర తాప లసత్ప్రతాప!
హా వనజాతనేత్ర తనయా! యెట డాఁగితి? నాకుఁ జెప్పుమా
సేవిత మైన నీ బలము చెల్వము మంటలలోన దాఁగెనో?
117-శా.
కట్టా దేవర కంటి మంటలు నినుం గారించుచో మన్మథా!
చుట్టాలం దలిదండ్రులం దలఁచితో శోకంబునుం బొందితో
పట్టంజాలని శోకవార్థిఁ బడి నీ ప్రాణేశ్వరిం బిల్చితో?
యెట్టుం బోవఁగ లేక మంటలకు నై యేమంటివో? మన్మథా!
118-ఉ.
గ్రక్కున రావె నా మదన! కావవె నా వలరాజ! నన్ను నీ
చక్కఁదనంబు మోహమును శౌర్యము నేఁగతిఁ దూలిపోయె నీ
వెక్కడఁ బోయి తింక నది యెక్కడ నున్నది బాపదైవమా!
అక్కట! చెల్లఁబో! కటకటా! యిది వ్రాఁత ఫలంబు తప్పునే?
119-సీ.
పొరిఁబొరిఁ బుంఖానుపుంఖంబు లై తాఁకుపుష్పబాణము లెందుఁ బోయె నేఁడు;
ఈరేడు జగము నేపుమైఁ గరగించుకడిఁది యెచ్చట దూలిగ్రాఁగె నేఁడు;
కాముక వ్రాతంబు గర్వంబు గబళించుటంకార రవ మెందు డాఁగె నేఁడు;
విటుల గుండెలలోన విదళించు చిగురాకుసంపెటవ్రే టెందు సమసె నేఁడు;
ఆ. నిన్నుఁ గాన నిపుడు నీ వెందుఁ బోయితీ
ప్రాణనాథ! నన్ బాయఁ దగునె
విరహి చిత్త చోర! విఖ్యాత సుకుమార!
అమర శైలధీర! హరికుమార!
120-క.
వారక నిఖిల జనంబుల
నీరసమున సతులఁ బతుల నేచి కలంపన్
నేరిచి శివునిఁ గలంపఁగ
నేరువలే వైతి మదన నిన్నే మందున్.
121-శా.
తల్లిందండ్రియుఁ దాతయుం గురుడునుం దైవంబు నా ప్రాణమున్
ఉల్లం బందున నీవె కాఁ దలఁచి నే నొప్పారగాఁ ని య్యెడన్
జెల్లంబో నిను నమ్మి యుండఁగను వే శ్రీకంఠుపై వచ్చి నీ
పొల్లై పోవుట నే నెఱుంగుదునె నీ పుణ్యంబు లి ట్లయ్యెనే.
122-ఉ.
తల్లులు పుణ్యగేహినులు దండ్రులు పుణ్యజనంబు లంచు నా
యుల్లము నందు నేఁ దలతు నో సురగేహినులార! మీరు నా
తల్లులు నేను గూఁతురను ధర్మపునోములదానఁ గాన మీ
యల్లుని నిచ్చి న న్మరల నైదువఁ జేయరె మీకు మ్రొక్కెదన్.
123-ఉ.
దేవతలార! మీ కొఱకు ధీరగతిం వెడవింటిజోదు దా
దేవరచేతఁ జచ్చె వనదేవత లెల్లను సాక్షి నాకు నా
దేవర మీకు నీఁదగవు తెల్లముగా శివుఁ గొల్చి యిచ్చి నన్
గావరె ప్రోవరె వగపు గ్రక్కునఁ బాపరె మీకు మ్రొక్కెదన్
124-ఉ.
ఏ వలరాజు భార్యను, నుపేంద్రుని కోడల శంభుచేత నా
దేవరఁ గోలుపోయి కడు దీనత నొందుచున్నదానఁ రం
డో వనవీథి నున్న ఖచరోత్తములార! దిగీంద్రులార రం
డో వనవాసులార వినరో మునులార! యనాథవాక్యముల్.
125-సీ.
పురుష బిక్షము వెట్టి పుణ్యంబు సేయరేతపము సేయుచునున్న తపసులార!
ధర్మ మెంతయు భర్తృదానంబు సేయరేదివి నున్న యింద్రాది దివిజులార!
నా వల్లభుని నిచ్చి నన్ను రక్షింపరేతలలెత్తి చూచి గంధర్వులార!
దిక్కుమాలినదాన దిక్కయి కావరేధర్మమానసు లగు తండ్రులార!
తే. అమర శరణంబు వేడెద నన్నలార!
అధిపుఁ గోల్పడి కడుదీన నైనదానఁ
గరుణఁ గావంగ నింక నెవ్వరును లేరు
పుణ్య మౌను మొరాలించి ప్రోవరయ్య.
126-శా.
రారే; యేడుపు మాన్పరే; మధురిపున్ రప్పింపరే; కావరే;
పోరే కు య్యెరిగింపరే సిరికి నా పుణ్యంబు విన్పింపరే;
తేరే దేవర వేడి నా పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా
నీరే మంగళసూత్ర బంధనము మీ కెంతేని పుణ్యం బగున్.
127-సీ.
పరమేశుఁ డనియెడి పడమటి కొండపైఁగసుమబా ణార్కుండు గ్రుంకె నేఁడు
గౌరీశుఁ డనియెడు గంభీర వార్థిలోనరిగి మన్మథ కలం బవిసె నేఁడు
ఫాలాక్షుఁ డనియెడి బడబానలములోనఁగంధర్ప కాంభోధి గ్రాఁగె నేఁడు
మలహరుఁ డనియెడు మహిత మార్తాండుచేమద నాంధకారము మ్రగ్గె నేఁడు
ఆ. నేఁడు మునుల తపము నిష్కళంకత నొందె
నేఁడు యతుల మనసు నిండి యుండె
నేఁడు జగము లెల్ల నిర్మలాత్మక మయ్యె
నేమి సేయ నేర్తు నెందుఁ జొత్తు.
128-చ.
అఱిముఱిఁ జిన్ననాఁడు చెలులందఱు గొల్వగఁ గూడియాడ నీ
చిఱుతది పుణ్యకాంత యని చేతుల వ్రాఁతలు చూచి పెద్ద లే
మెఱుగుదు మంచు చెప్పుటలు యెంతయు తథ్యము గాకపోవునే
యెఱుకలు మాలి పోఁ బిదప నే విలపించుట తెల్లమయ్యెఁ బో.
129-సీ.
ఉచిత మార్గంబున నుపలాలనము జేసియెలమి రక్షించువా రెవ్వ రింక
అటవారు నిటవారు న య్యేడుగడయు నైయెలమి నన్నేలువా రెవ్వ రింక
లీల నర్థించిన లే దని పలుకకయిష్టంబు లిచ్చువా రెవ్వ రింక
కర్ణంబులకు నింపు గా నిష్ట వాక్యంబులేపారఁ బల్కువా రెవ్వ రింక
ఆ. నేఁడు నాథ! నీవు నీ ఱైన పిమ్మట
తివిరి నన్నుఁ గావ దిక్కు లేమి
తలఁపులోనఁ దలఁపఁ దగ దయ్యె చెల్లబో
వీరమాకళత్ర విష్ణుపుత్ర!
130-క.
అంగజ! నే నను మాటలు
వెంగలి యై వినవె కాక వేగమ నీకుం
సంగరరంగములోపల
గంగాధరుఁ గవయఁ దరము గాదంటిఁ గదే.
131-మ.
కొలదిన్ మీఱిన శంభు యోగ శరధిం గుప్పింప రాదంటిఁగాఁ
గలలో నైనను నొప్పనంటి భవుఁ దాఁకన్ వద్దు వద్దంటి దు
ర్భల మై యూరక వచ్చి శూలి రుషకుం బాలైతివే యక్కటా
తొలి నే నోచిన నోము లిప్పుడు భవద్దూరంబు గావించెనే.
132-సీ.
ఎప్పుడు గోపించి యెనయంగ యోగంబుమానునో యీయంగ మాయ గొంత
యెప్పడు మరుని దా నీక్షించి తెలిసెనోధృతిఁ బుట్టువులు లేని తిరిపజోగి
యెప్డు విజృంభించి యెఱమంట లెగయంగముక్కన్ను దెఱచెనో ముదుకతపసి
యెప్పుడు గృపమాలి యెప్పడు గాల్చెనోకులగోత్రములు లేని గూఢబలుఁడు
ఆ. అనుచు నెంత వైర మనుచు నెద్దియుఁ జూడ
డనుచు మదనువనిత యవనిమీఁద
మూర్చవోయి తెలిసి మోమెత్తి బిట్టేడ్చెఁ
గడఁగి శోకవార్థి గడలుకొనఁగ.
133-వ.
మఱియు నత్యంత దురంత సంతాప చింతాక్రాంత యై అంత కంతకు న క్కాంతాతిలకంబు మహాశోకవేగంబున.
134-సీ.
మెఱుఁగుఁదీఁగెయుఁ బోలు మైదీఁగె నులియంగపదపడి వలికి లోఁ బొదలువెట్టు
కోకద్వయముఁలోని కుచకుంభములు గందనలినాక్షి కరతాడనంబు సేయు
నీలాలగతిఁ బోలు నీలంపు టలకలుముడివడ యూచి మ మ్ముదిత యేడ్చు
కల్హారములఁ బోలు కన్నులు గతిచెడఁగమలాక్షి కడు నశ్రుకణము లొలుక
తే. ఇంతి విలపించు నత్యంత మేడ్చుఁ బొక్కు
నధిప చనుదెంచి కావవె యనుచుఁ జివుకు
స్రుక్కు మూర్ఛిల్లు దెలివొందు సురలఁ దిట్టు
మగువ యెంతయు సంతాప మగ్న యగుచు.
135-వ.
తన మనంబున ని ట్లనియె.
136-మ.
నిను వే భంగుల బాయఁ జాల వనితా! నిర్భేద మం దేమియు
న్మన ప్రాణంబులు రెండు నొక్కటి సుమీ నారీమణి! నమ్ముమీ
యని కావలించిన బాస లన్నియు గల్లయ్యెం గదా లక్ష్మినం
దన! యెవ్వారికి నైన దైవఘటనల్ తప్పింపఁగా వచ్చునే.
137-క.
అని విలపించుచుఁ గుందుచుఁ
దన చేరువ నున్న యట్టి తాపసవర్యున్
ధననాథమిత్రు నీశ్వరుఁ
గనుఁగొని శోకాతురమునఁ గన్నియ పలికెన్.
138-క.
“తగు నంబిక శంభునిఁ గని
తగ మి మ్మిద్ధఱను గూర్పఁ దగు న మ్మరుపైఁ
బగమీఱఁ గృపఁ దలంపఁక
తెగఁ జిచ్చెరకన్ను మీకుఁ దెరువం దగునె.
139-క.
తొలి నీవు దుష్టజనులం
బొలియింతువు లోకపతులఁ బోషింతువు నిం
దలఁ బొందవు మరు నిట్టులఁ
బొలియించుట నాదు నోము పుణ్యము రుద్రా!
140-క.
యేచిన మన్మథు దశశత
లోచనుఁ డిటు దెచ్చి నీదు లోచన వహ్నిం
ద్రోచెనె యిటుగా నోచితి
యీ చందము లైన నోము లిప్పుడు రుద్రా!”
141-క.
అను మాటలు విని శంభుఁడు
తన మది నీ వనిత శోకతాపాకుల యై
తను నే మని యాడునొ యని
చనియెన్ శీఘ్రమున రజతశైలముకడకున్.
142-వ.
అంతఁ గంతు చెలికాఁడు వసంతుం డి ట్లని విలపింప దొణంగె.
143-ఉ.
“సంగతితోడ నా వలచుజాణఁడు పాంథజనాపహారి నా
సంగడికాఁడు న న్వలచు చల్లని యేలిక దేవతార్థ మీ
జంగముమీఁద వచ్చి బలసంపద నాతని కంటి మంటలన్
సంగరభూమిలో మడిసె జయ్యన దేహముఁ బాసి దైవమా!
144-ఉ.
శంకర జోగిఁ దెచ్చి సమసార నివాసునిఁ జేయ కున్నచో
నంకిలిగల్లు నీ జగము లన్నియు నిర్జర కోటితోడ నే
వంకకు వ్రాలు నంచు సురవల్లభుఁ డక్కట తన్నుఁ బంప మీ
నాంకుఁడు వచ్చి నేఁడు త్రిపురాంతకుచే దెగటారెఁ జెల్లఁబో.
145-క.
మానిని మదనుని యుద్ధము
గానంగా నేర నైతి కాముఁడు రాఁగన్
దా నేల పాసిపోయితి
భూనుతగుణహారుఁ గోలుపోయితి నకటా.”
146-క.
అని యామని విలపింపఁగ
గని తూలుచు మోదికొనుచుఁ గడు వగతోడన్
మనసిజవల్లభ మఱి దా
విను మని యామినికిఁ బలికె విపు లాతుర యై.
147-క.
“అన్నా నీ చెలికాఁ డిటు
వెన్నెలధరుమీఁద వచ్చి వేఁగుట నీకున్
బన్నుగ నెవ్వరు చెప్పిరి
కన్నారఁగ నట్టివేళ గాంచికొ లేదో.
148-క.
తారకు తపో మహత్వము
నారయ దేవతలు నతని యానందంబున్
గౌరీనాయకు కోపము
కోరిక మరుఁ బట్టి భుక్తిఁ గొనియెం జుమ్మీ.
149-ఆ.
ప్రాణనాథుఁ బాసి ప్రాణంబు నిలువదు
పోవవలయు నాకుఁ బోవకున్న
సురభి! యింక నీవు సొదఁ బేర్చుఁ వేవేగఁ
జిచ్చుఁ జొత్తు గాముఁ జేరవలసి.
150-క.
అనల ముఖంబున సతులకు
ననుగమనము చేసి దివికి నధిపుఁడు దానుం
జనుట మహాధర్మం బని
వినిపించెడి బుధుల మాట వినవే చెపుమా.
151-వ.
అనిన వసంతుండు ప్రలాపించు తదీయ ప్రకారంబుల విచారించి సముచిత ప్రకారంబున ని ట్లనియె.
152-సీ.
“యేల ని ట్లాడెద వేకచిత్తంబున నా మాట విన వమ్మ నలిననేత్ర!
గౌరినాయకుఁ డింక గౌరీ సమేతుఁ డై సుఖ మున్న నింద్రాది సురలు వచ్చి
నీ ప్రాణనాథుండు నిష్పాపుఁ డని చెప్ప మరలను బడయు దీ వరుదుగాఁగ
అదిగాక మన్మథుం డమరుల పంపునజెడినవాఁడును గానఁ జెప్పి బలిమి
ఆ. విబుధు లెల్ల విన్నవించిన పరమేశ్వ
రుండు భక్తవత్సలుండు గాన
పంచబాణు నిచ్చు భావింపు మి మ్మాట
వెలఁది! నమ్ము నీవు వేయు నేల.”
153-క.
అని పలికిన పలుకులకును
ననుగుణ మై యీ ప్రకార మగు నిజ మనుచున్
వినువీథి నొక్క నినదము
ననుగుణముగ మ్రోసె జనుల కాశ్చర్యముగన్.
154-వ.
ఇట్లు పలికిన గగనవాణి పలుకులును వసంతు పలుకులును నాలించి రతీదేవి యి ట్లనియె,
155-ఉ.
“ఎచ్చటి నుండి యిందుధరుఁ డిప్పుడు పార్వతిఁ గూఁడుఁ గూఁడెఁబో
యిచ్చునె మన్మథుం దివిజు లెప్పుడు చెప్పుదు రిట్టి వాక్యముల్
మెచ్చునె లోకముల్ వినిన మేదినిఁ జచ్చిన వారు వత్తురే
చెచ్చెర నిప్పు డీ బయలు చెప్పిన మాటలు నమ్మవచ్చునే.
156-ఉ.
ఏల దురాశ పో విడువు మెన్ని తెఱంగపల నైన శోక
సంకుల చిత్త నై విధవ నై గతిమాలిన దీనురాల నై
తూలుచుఁ గాలుచు న్వగల దుస్థితిఁ బొందఁగం జాలఁ బావక
జ్వాలలఁ జొచ్చి నా హృదయవల్లభు మన్మథుఁ గానఁ బోయెదన్.”
157-వ.
అని బహుప్రకారంబుల రతియును వసంతుండును దమలో నుచి తాలాపంబులు పలుకుచున్న సమయంబున.
158-ఉ.
“ఏల? మృగాక్షీ! నా పలుకు లేటికి? నమ్మవు శూలి కొండరా
చూలి వివాహ మైన యెడ శోభన మంగళ వృత్తి నున్నచో
వేలుపు లెల్ల నంగజుఁడు వేఁగుటఁ జెప్పినఁ గాముని నిచ్చు నా
నీలగళాంకుఁ డీ విధము నిక్క మటంచు నభంబు మ్రోయుఁడున్.
159-క.
మింట నశరీరవాణియుఁ
దొంటి విధంబునను బలికెఁ దోయజనేత్రీ!
వింటివె నీ నాయకుఁ డే
వెంట న్మరలంగ వచ్చు వికచాబ్జమఖీ!
160-వ.
అని మఱియు ననేక విధంబుల నూరడించి వసంతుని పలుకు లగుం గాక యని నత్యంత విహ్వల చిత్తంబున.
161-క.
సతతంబు నతుల వేదన
మతి బొందుచు హృదయకమల మధ్యము నందున్
బతిఁ దలఁచి చింత సేయుచు
రతి దా వర్తించె నొండు రతి లేని గతిన్.
162-ఉ.
కాముని బిల్చి పెద్దయును గౌరవ మొప్పఁగ బుజ్జగించి సు
త్రాముఁడు శంభుపై బనుప దర్పకుఁడుం జనుదెంచి యేయుచో
సోమకళా వతంసుఁడును స్రుక్క మూఁడవ కంటి చూపునన్
గాముని నీఱు సేయుట జగంబుల మ్రోయుటయు న్నఖండమై.