వీరభద్ర విజయము/ద్వితీయాశ్వాసము/బృహస్పతి బ్రహ్మకుఁ దారకాసురుఁడు చేయు బాధలం దెలుపుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


బృహస్పతి బ్రహ్మకుఁ దారకాసురుఁడు చేయు బాధలం దెలుపుట

7-వ.
సురాచార్యుండు బ్రహ్మదేవున కి ట్లనియె.
8-లగ్రా.
“ఆఁకొని కరాళగతి భీకరపుఁ జూపులను; భేకముల మూఁకలను వీఁకఁ గని యాద
ర్వీకము మ్రింగు క్రియ నాకపులతో నిఖిల; లోకములు దారకుఁడు చేకొని హరింపన్
బ్రాకటపుఁ గామినుల వీఁకఁ జెఱవట్టి మఱి; నాకముఖపట్టణము లాఁకగొని యుండన్
డాకకును గాక యిటు నీకు వినిపింప ఘన; శోకమున వచ్చితిమి గైకొను విరించీ!
9-క.
తాపసుల నెల్లఁ జంపెను
కోపంబున సురలఁ జెఱలుగొని వర్తిల్లెన్
పాపపు రక్కసునకు మీ
రేపారఁ ద్రిలోకవిజయ మిత్తురె? చెపుఁడా.”
10-వ.
అనవుఁడు దరహసిత వదనుం డై రాజీవభవుం డి ట్లనియె.
11-క.
“ఏను వర మీక యుండిన
వాని తపోవహ్ని జగము వలగొని కాల్పున్
నే నేల వెఱ్ఱి నయ్యెదఁ
గాన సురాధీశులార! కలఁగకుఁ డింకన్.”
12-వ.
అని మఱియును.
13-ఉ.
“శూలికి శీతలాచలముచూలికిఁ గూరిమితోడఁ బుట్టు న
బ్బాలుఁడు గాని దానవునిఁ బట్టి మహోగ్రతఁ గీటడంపఁగాఁ
జాలఁడు సిద్ద మీ పలుకు సర్వ యుపాయము లందు భావజున్
ఫాలతలాక్షు నీక్షణమె బర్వతికన్యకఁ గూర్పఁ బంపుఁడా.”
14-వ.
అని కమలసంభవుండు విచారించి కార్యంబు తేటవడం బలికిన నగుఁ గాక యని మహా మోదంబున.
15-క.
నిర్ఝరలోకము గొలువఁగ
నిర్ఝరనాథుండు చిత్తనిర్జరుఁ డగుచున్
నిర్ఝరగేహిను లలరగఁ
నిర్ఝరపురి కేఁగెఁ దాను నిర్ఝరమతియై.
16-వ.
అ ట్లేఁగి నాకంబు నందు.
17-శా.
మందా రోన్నత పారిజాత కదళీ మాకంద పుష్పవలీ
మందాలోల సుగంధమారుత మనోమాన్నిత్య సమ్మోదియై
నందాత్ముల్ సుర సిద్ధ సాధ్య విలసన్నాగేంద్ర బృదంబు లిం
పొందం గొల్వ ననంత రాజ్యసిరిఁ గొల్వుండెన్ సురేంద్రుం డొగిన్.
18-సీ.
భాసిల్లు పువ్వుల బాణపఙ్క్తులవానిఁగొమరారు కెందమ్మిగొడుగువానిఁ
గలహంస శారికా కలకంఠములవానివెలుగొందు తియ్యని వింటివాని
మందానిలలలామ మదభృంగములవానిదెఱగొప్పు పువ్వుల తేరువాని
బలు మీనుటెక్కంబు పడగ నొప్పెడువానినామనిసారథి యైనవాని
తే. అందమైనవాని నకలంక శృంగార
విభవలక్ష్మిచేత వెలయువాని
మోదవృత్తివాని మోహనాకృతివానిఁ
గాముఁ దలఁచె నాకధాముఁ డపుఁడు.
20-వ.
అ య్యవసరంబున.
21-లగ్రా.
తన్ను మదిలోన వెయికన్నుల పురందరుఁడు; సన్నుతగతిం దలఁప వెన్నునిసుతుండున్
చెన్నులు వెసం దలకి యున్నఁ గని తా నతనిఁ; దిన్నఁగనుఁ గౌఁగిటను నున్న రతికాముం
“జిన్నతన మేల వెరగన్నియలన న్వలచి; నన్ను మరువం దగునె” యన్న మదనుండున్
“నిన్ను వెలిగా సతుల నన్యులఁ దలంతునె ప్ర; సన్నమతి తోటి విను నన్ని యెఱిఁగింతున్.
22-క.
నను దేవేంద్రుఁడు దలఁచెను
పనిగొని నేఁ డేల దలఁచె పంకజనేత్రీ!
తన కే కార్యము గలిగెనొ
పనిలేక తలంపఁ డతఁడు భామిని నన్నున్.
23-మ.
లలనా! పంపుము త న్నిమిత్త మరయన్ లక్షింప నీ ప్రొద్దె పో
వలయున్ వజ్రి దలంచు చోట రమణీ వర్ణింపఁగాఁ గార్యముల్
గల వెన్నేనియు” నన్న “నా పను లెఱుంగం జెప్పుఁ డాలించెదన్”
“వెలఁదీ! ముగ్ధవు గాన రాచపను లుర్విన్ జెప్పఁగా వచ్చునే.”
24-చ.
“ఎనయఁగ సర్వలోకములు నేలెడు రాజులరాజు గాఁడె యా
తని దెస భ్రాంతియే పనులు తప్పక పోయిన బుద్ధి నావుడున్
పెనుపుగ నింద్రు వీటికిని వేర్కొని పోయెద వేని నేను నీ
వెనుకను వత్తు” నంచు సతి వేడుకఁ బల్కిన నల్ల నవ్వుచున్.
25-వ.
ఆ యువతికి సుమసాయకుం డి ట్లనియె.
26-శా.
“ఇల్లాం డ్రైన కులాంగనల్ మగలతో నేతెంతురా తొల్లి శో
భిల్లంగాఁ దగనొప్ప రాట్సభలకు న్మీనాక్షి మున్నెన్న మా
యిల్లాం డ్రెవ్వరు ప్రాణవల్లభులతో ని ట్లాడఁగా నేర్తురే
సల్లాలిత్యమే దేవతాసభ లనన్ సంకేతశైలంబులే.
27-క.
వేలుపుల రాచసభకును
బోలదు నీ రాక వినుము పొసఁగదు నీ వి
ల్లాలవు సురేంద్రుసభకును
నే” లని రతి నూరడించె నేచిన వేడ్కన్.
28-సీ.
పాటించి మృగనాభిపంకంబు మైఁ బూసికప్పురంబునఁ దిలకంబుఁ దీర్చి
కమ్మని పువ్వుల సొమ్ములు ధరియించిలాలిత మణికుండలములు వెట్టి
వెన్నెల నిగ్గులై వెలుఁగు చీరలు గట్టిపసిడి హంసావళి పట్టుఁ గట్టి
మాధవీ మల్లికా మాలతీ నవకుందదామంబు లింపార తలను దురిమి
తే. పాంథజనముల గుండెలు నిగుడ
మెరయు నందియ డాకాల మ్రోయుచుండ
మగల మగువలఁ గరగించు మాయలాఁడు
లలిత శృంగార వైభవ లక్ష్మి మెఱసి.
29-లగ్రా.
తుమ్మెదలు పెక్కు మురిపెమ్ముల వెస న్ముసరి; జుమ్ము రని పద్మముకుళమ్ముల మహా శం
ఖమ్ములు భ్రమింప రసికమ్ము వెలయం బొగడు; సమ్మదపుఁ జిల్కల రవమ్ములు చెలంగన్
గ్రమ్మి కలకంఠములు నిమ్ముల మరాళములు; గ్రమ్మగను గాలి గడుఁ గమ్మనయి వీవన్
కమ్మ నగు విల్లుఁ బువుటమ్ములను బట్టి వెల; య మ్మరుఁడు పువ్వులరథమ్ము వెస నెక్కెన్.
30-వ.
ఇ ట్లగణ్యశృంగారవైభవాడంబరుం డై రతీదేవి దీవెనలు గైకొని వీడ్కొని కదలి య క్కంధరుం డమరేంద్రపురంబునకుం బ్రయాణంబు చేసి గగనంబున వచ్చుచు.