వీరభద్ర విజయము/ద్వితీయాశ్వాసము/తారకుఁడు దండై పోవుట
తారకుఁడు దండై పోవుట
1-క.
శ్రీ కైలాస నగేంద్ర
ప్రాకటసానుప్రదేశ బహువనరాజి
వాకరగంధ సమేత
శ్రీకరవిభవాభిరామ! శ్రీగిరిధామ!
2-వ.
పరమఙ్ఞానభావుం డగు వాయుదేవుం డ మ్మహామునుల కి ట్లనియె.
3-మ.
“ రమణన్ ఘోరతపంబు చేసి చెలువారం బ్రహ్మ మెప్పించి లో
కము లెల్లం బరిమార్చి నట్టి వెఱపుం దర్పంబుఁ దేజంబు వి
క్రమసైన్యంబును లక్ష్మియుం బడసి సంగ్రామంబులోఁ దారకుం
డమరేంద్రాదులు గెల్చి వత్తు” నని దండై పోయె న త్యుగ్రుఁడై.
4-వ.
ఇట్లు పోయి.
5-సీ.
ఆలంబులో నింద్రు నాలంబు గావించి; వహ్నికిఁ దన కోపవహ్ని చూపి
యంతకుఁ దాను నంతకమూర్తి యై; యసురకు నసుర యై యలవు మెఱసి
నీరధీశ్వరు పెంపు నీఱుగా నలయించి; గాలి బలం బెల్లఁ గాలి చేసి
నెఱయంగ ధననాథు నిర్ధనుఁ గావించి; హరుని బలం బెల్ల హతముఁ జేసి
తే. యమర గంధర్వ యక్ష రాక్షస పిశాచ
గరుడ పన్నగ మానవ గ్రహ మునీంద్ర
చయము నెల్లను బలుమాఱు చంపి శౌర్య
భాసురుం డగు న త్తారకాసురుండు.
6-చ.
తమతమ రాజ్య సంపదలు తద్దయుఁ జేకొని పోక వెండియున్
దముఁ బలుమాఱుఁ దారకుఁడు తల్లడపెట్టిన నింద్రుఁ డాదిగా
నమరులు లోకపాలురును నాపదఁ బొంది కలంగి బ్రహ్మలో
కమునకుఁ బోయి పద్మభవుఁ గాంచి ప్రణామము లాచరించుచున్.