వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/హిమవంతుఁడు మునులం బూజించుట

వికీసోర్స్ నుండి


హిమవంతుఁడు మునులం బూజించుట

38-వ.
అత్యంత సంభ్రమంబునఁ దన యనుంగు మొగపాలకుఁ బఱతెంచి వారలం గని, వినయంబునఁ బ్రణామంబులు చేసి, యమ్మహత్ములఁ దన యంతఃపురంబునకుం గొనిపోయి ప్రియ వూర్వకంబుగా నర్ఘ్య పాద్యాది విధులం బూజించి కనకరత్న పీఠంబుల నుండ నియోగించి నిజకరంబులు మొగిడ్చి మంద మధురాలాపంబుల ని ట్లనియె.
39-శా.
“నన్నున్ బెద్ధరికంబు చేసి కరుణన్ నా యింటికిన్ మీర లి
ట్లెన్నం డేనియు రానివారలు ప్రియం బేపార వేంచేసి నేఁ
డున్నా రిచ్చట నెంత పుణ్యుఁడ నొకో యో మౌనులారా! మిమున్
గన్నారం గనుఁగొంటి మంటి విలసత్కల్యాణలోలుండ నై.
40-వ.
మునీంద్రులారా! మీరు వేంచేయుటకుఁ గారణం బేమి యానతిత్తురు గాక” యనవుఁడు నద్దివ్యసంయము లి ట్లనిరి.
41-క.
ఉడురాజధరుఁడు శంభుఁడు
మృడుఁడు మహేశ్వరుఁడు శివుడు మీ యింటికిఁ బెం
పడరఁగ నీ సుతఁ బార్వతి
నడుగఁగ బుత్తెంచె మమ్ము నచలాధిపతీ!
42-వ.
అనిన విని సర్వాంగ పులకాంకితుం డై భక్తిసంభ్రమ పరమానంద చిత్తుం డై కైలాసపర్వతంబు దెసం గనుంగొని కరంబులు మొగిడ్చి తన మనంబునఁ బరమేశ్వరునకుఁ బ్రణామంబు చేసి యిట్లనియె.
43-ఆ.
“శివుఁడు మునులచేత శీతాచలముకూఁతు
నడుగఁ బంపె ననఁగ నవనిలోన
నన్నుఁ బెద్దచేసి మన్ననసేయంగఁ
దలఁచెఁ గాక యేను దనకు నెంత.
44-వ.
అదియునుం గాక.
45-క.
ఎవ్వరిసొమ్ము తలోదరి
యెవ్వరి దాసుండ నేను నెల్లప్పుడు మా
కెవ్వఁడు దైవము శంభుఁడు
సర్వేశుఁడు దానె కాదె సకలవిధములన్.
46-వ.
మమ్ము నే ప్రకారంబుల నైనఁ గారుణ్యభావంబున రక్షించు గాక” యని పలికినఁ దుహినశైలేంద్రు నకు నమ్మునీంద్రు లి ట్లనిరి.
47-మ.
“అరయంగన్ శివభక్తి యింత వలదే యౌనౌ జగన్మాత నీ
చరితం బిట్టిది గానఁ గాక యిచటన్ జన్మించునే తొల్లి త
త్పురజిత్తుండును మమ్ము నొండెడలకున్ బుత్తెంచునే ధారుణీ
ధరమాత్రంబుల కింత కీర్తి గలదే? ధాత్రీధరేంద్రోత్తమా!
48-ఆ.
నిన్నుఁ బోల వశమె నీ యంత పుణ్యుండు
అఖిల జగము లందు నరయఁ గలఁడె?
యీశ్వరేశుపంపు నింతఁ బాటింతువె?
యిట్టిభక్తి గలదె? హిమనగేంద్ర!
49-క.
శంకర దేవుఁడు మాతో
నుంకు వడిగి నంత పెట్టు మువిదకు నన్నాఁ
డింకిట నెయ్యది గొనియెదు
కొంకక మాతోడఁ జెప్పు కుధరాధిపతీ!”
50-వ.
అనవుఁ డి ట్లనియె “మిమ్ముఁ బార్వతీదేవికి నుంకువ యిచ్చి రండని యానతిచ్చె నేని, మునీంద్రులారా! వీఁడు నా వాఁడని యెల్ల భంగు లందును నిరంతర కరుణాయత్తచిత్తుం డై నన్ను మన్నించుటయ నాకు నా కుఁతురకును పదివే లుంకువలు పెట్టుట యగు మీ యానసుండీ మీకుం దగినపని చేయుదు బాలిక నాలోకింపవలయు” నని కుమారీతిలకంబు నలంకరించిన.
51-క.
వనితామణి రూపమునకుఁ
గనుచాటుగఁ జేర్చి కప్పు గప్పినభంగిన్
ఘనకుసుమగంధ నవమణి
కనకాంబరములను చాలఁ గైసేసి రొగిన్.
52-క.
మానిను లిరుదెసఁ గొల్వఁగ
జానుగ నల్లల్ల శైలజను దోకొనుచున్
మేనక చనుదెంచుటయును
మౌనులతో శైలవిభుఁడు మఱి యిట్లనియెన్.
53-క.
“అదె మా బాలిక వచ్చెను
సదమలతరహృదయులార! సర్వేశునకున్
ముందితకు నీడుగఁ జూడుఁడు
పదపడి శుభలక్షణములు పరికింపుఁ డొగిన్.”
54-వ.
అనిన విని మునీంద్రులు కుమారి నాలోకించి జగదభినవ కల్యాణరూపంబునకు నాశ్చర్యామోఘహృదయు లై యిట్లనిరి.
55-క.
“ఆదియు నంత్యము దవ్వగు
వేదాతీతుండు శివుఁడు విభుఁడుగఁ బడసెన్
బైదలి శుభలక్షణములు
వేదంబులకైనఁ దరమె వివరింపంగన్.
56-వ.
గిరీంద్రా! యమ్మహదేవి శివదేవునకుఁ బరిణయంబు గాఁ దగు; నిద్ధఱికి నీడయి యున్నది; కార్యంబును గొలికికి వచ్చినది “శుభస్య శీఘ్ర” మ్మని పెద్దలు పలుకుదురు గావున దీనికిఁ దడయనేల సంఘటింపు” మని మునీంద్రులు‍‍ వాంఛితకోమల భావాంకురంబులు వెలుంగ మంగళంబు లగు నాకాశగంగాతరంగిణీ జలంబులును, సల్లలితంబు లగు నళ్వత్ధ పల్లవంబులును తాంబూల కనకకలశ కుసుమ గంధాక్షతంబులును మఱియుఁ దక్కిన మంగళ ద్రవ్యంబులు దెప్పించి; సువర్ణపీఠంబున శుభముహూర్తంబున నక్కాంతాతిలకంబు నుండ నియోగించి; విధ్యుక్త ప్రకారంబున నర్చించి; అధికపుణ్యాహంబు చేసి; పుణ్యాహజలంబులు శిరంబునం బ్రోక్షించుకొని కళ్యాణ వాద్యంబులు చెలంగ ముదితకు ముద్రారోపణంబు చేసి గిరీంద్రునకు నుంకువ ముడుపిచ్చి సంయమీంద్రులు పరమానందంబున.
57-ఆ.
పాలకూళ్లు గుడిచి శైలాధిపుని యింట
రమణతోడ నాఁటి రాత్రి యుండి
గౌరితండ్రి తమకుఁ గట్టంగ నిచ్చిన
సత్ప్రియంబుతోడ సమ్మతించి.
58-వ.
మఱునాఁ డమ్మహామునీంద్రులు మనంబార వీడ్కొని రజతధరణీధర శిఖరంబునకుఁ బ్రయాణంబు చేసి సర్వేశ్వరుం గాంచి సాష్టాంగదండ ప్రణామంబు లాచరించి “దేవా! దేవర యానతిచ్చిన పను లెల్లను శుభకరంబు లై సిద్ధించె” నని తత్ప్రకారంబు తెలియ విన్నవించినవారై యిట్లనిరి.