వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/హిమవద్గిరి వర్ణనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


హిమవద్గిరి వర్ణనము

31-సీ.
మింటిచుక్కలతోడ మేలమాడుచు నున్న
  ఘన మేఘసంఘంబు గలుగు దాని
భూరి తపోవన భూమీరుహంబులు
  కమలాకరంబులు గలుగు దాని
గంధర్వ ఖేచర గణ విమానంబులు
  గప్పిన రత్నశృంగముల దాని
శుక పిక శారీకానికర ధ్వనులచేత
  నతి రమణీయమై యలరు దాని
ఆ.
సిద్ధ దంపతులు వశీకృతకాములై
సానుతలము లందు సరస మాడఁ
జెలువుమిగులుదాని శీతాచలేంద్రంబుఁ
గరము వేడ్కతోడఁ గనిరి మునులు.
32-వ.
మఱియును.
33-చ.
సలలిత కామధేనువులఁ జందన కల్పమహీరుహంబులన్
లలిత తరంగిణీతటములం గరుడామరసిద్ధకన్యలన్
విలసిత సూర్యకాంతముల విస్పురితేందుశిలాతలంబులన్
చెలువగు భూధరేంద్రమును శీతనగేంద్రముఁ గాంచి సంయముల్.
34-వ.
తమలో ని ట్లని తలంచిరి.
35-సీ.
వేదంబు లాతని వెదకి కానఁగ లేని
  గంగాధరుండు తాఁ గరుణ మెఱసి
మనల నాఢ్యుల జగన్మాన్యులఁ బూజ్యుల
  నాత్మలో రప్పింప యర్ధితోడ
నగవల్లభుని యింటి కరిగి యాతఁడు కన్న
  కూఁతురు పార్వతీకోమలాంగి
తనకుఁ గా నడిగి రండని ప్రీతిఁ బుత్తెంచు
  చున్నాఁడు యీ భూధరోత్తముండు
ఆ.
ఎంత పుణ్యుఁ డగునొ యిట్లొప్పునే యీతఁ
డెంత ధన్యుఁ డగునొ యెంతభక్తి
చేసినాఁడొ తొల్లి శివునకు బాపురే
యనుచుఁ గీర్తి చేసి రాదిమునులు.
36-వ.
అని మఱిమఱి కీర్తించు నమ్మహామునులు ప్రాలేయాచలంబు డాయంబోయి మహీధ్రవల్లభు మందిరంబు వీక్షించి ఖేచరత మాని భూచరులై యతని పెద్దమొగసాల నిలచి యున్న సమయంబున.
37-చ.
అనఘులు, దీర్ఘదేహు, లుదయార్కనిభుల్, విమలాత్మకుల్, మృగా
జినధరు, లగ్నితేజులు, విశిష్టతరాకృతు, లార్యు, లంబుజా
సన సము, లాదిసంయములు, సప్తఋషుల్ చనుదెంచి యున్నవా,
రని హిమశైలభర్త ఫణిహారులచే విని నిత్య భక్తి తోన్.