వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/మునులు దాము జరిగించిన కార్యమును శంకరునకు దెలుపుట

వికీసోర్స్ నుండి


మునులు దాము జరిగించిన కార్యమును శంకరునకు దెలుపుట

59-సీ.
దేవేశ! మీ రానతిచ్చిన పనిఁ బూని
  యిరవొప్పఁ బయనమై యేము బోయి
తన యింటి కరిగినతఱి మము బొడఁగని
  యెంతయు దవ్వు మా కెదురు వచ్చి
యతిభక్తితో మ్రొక్కి యర్ఘ్య పాద్యాదుల
  నమరఁ బూజించి పీఠములు వెట్టి
క్షేమంబు లరసి తాఁ జేతులు మొగిడించి
  “యేతేరఁ గారణం బేమి” యనిన
ఆ.
“నీలకంధరుండు నీ కూఁతు పార్వతి
భామఁ దనకు నడుగఁ బంపె” ననుడు
భక్తితోడ మ్రొక్కి పలుదెఱంగుల నిట్లు
గారవించి పలికెఁ గామవైరి!
60-క.
“సరి మీ మన్ననలకుఁ దగు
నరుదా యిటువంటి భక్తి వలదే మనకున్
గిరిరాజు సేయు భక్తికి
సరి యెన్నఁగఁ గలదె భక్తి చంద్రాభరణా!
61-క.
పలుమరు ముల్లోకంబులఁ
జెలులం జూచితిమి గాని చింతింపఁగ నా
లలనకుఁ గల లక్షణములు
కలయఁగ నే చెలుల యందుఁ గానము దేవా!
62-క.
ఆ కన్నులు నా చన్నులు
నా కురు లా ముద్దుమోము నా నెరు లా ర
మ్యాకారము నా మధ్యము
నే కాంతల యందు నెఱుఁగ మిభచర్మధరా!
63-క.
నీలాహి మేనికంటెను
నీలాళులకంటె నింద్రనీలముకంటెన్
నీలరుచిఁ బోలు నంబిక
నీలాలక లేమి చెప్ప; నీలగ్రీవా!
64-క.
బాలేందుఁడు చంద్రానన
ఫాలముతో సాటి యనఁగఁ బలుకుదురు కవుల్
బాలిక ఫాలరుచులపై
బాలేందుం డెంతవాఁడు బాలేందుధరా!
65-క.
సుదతీలలామబొమలకు
వదలక సరిసేయ నొకటి వచ్చునె నీ చేఁ
గదనమునఁ దెగడ యేనియు
మదనున కది విల్లుగాదె మదనారాతీ!
66-ఉ.
సోమునిఁ దోడుతెచ్చుకొని స్రుక్కక చిల్కలుఁ దేంట్లు గొల్వఁగాఁ
గాముఁడు విల్లునమ్ములు నఖండతఁ బట్టినయట్లు దోఁచు నా
భామముఖాబ్జరేఖయును బల్కును గొప్పును భ్రూలతాంగమున్
గాముఁడు నీవు చంపుటయుఁ గల్లనిపించె శశాంకశేఖరా!
67-క.
సుందరి మృగలోచనముల
యందము లందందుఁ గల్గు టది నూనము దా
నిందీవరముల యందును
గందర్పుని శరము లందుఁ గంజము లందున్.
68-సీ.
జలజాక్షి నెమ్మోముఁ జందురుఁ బోల్తమా
  చందురు నందునఁ గందు గలదు
కన్నియ వదనంబుఁ గమలంబుఁ బోల్తమా
  కమలంబు పుట్టుచోఁ గసటు గలదు
మోహనాంగి ముఖంబు ముకురంబుఁ బోల్తమా
  ముకురంబు నందున మృదువు లేదు
మానిన రదనంబు మణిపంక్తిఁ బోల్తమా
  మణులెల్ల రా లనుమాట గలదు
ఆ.
ఇంక నేమి బోల్త మింతి యాననముతో
సృష్టి నేమిసాటి సేయవచ్చు
మగువ మొగము కాంతి మలహర! నీ యాన
త్రిభువనంబు లందు నభినవంబు.
69-క.
చిలుకల కోయిల పలుకుల
వెలయంగా టొంకు గలదు వీణెయుఁ దానై
పలుకఁగ నేరదు కన్నియ
పలుకులతో సాటి యేమి పలుకుదుము శివా!
70-ఆ.
చెలువ కరము కెంపు చిరతరారుణ కోమ
లంబు లైన పల్లవంబు లందు
నందమైనయట్టి చెందామరల యందుఁ
గలుగనోపుఁ గాని గలుగ దెందు.
71-సీ.
తరుణి చన్నులు భద్రదంతికుంభము లన్న
  దంతికుంభుములకుఁ గాంతి లేదు
కొమరాలి కుచములు కోకద్వయము లన్నఁ
  గోకంబు లొకచోటఁ గూడకుండు
కన్నియ చనుదోయి కనకకుంభము లన్నఁ
  గనకకుంభము లవి గరఁగఁబడును
పొలఁతుక పాలిండ్లు వూబంతు లందమా
  వూబంతు లంటినఁ బ్రోది మణఁగు.
ఆ.
గానఁ బోల్పఁ దగదు కాంత పయోధర
యుగళమునకు నింక జగములోన
నేమి పోల్పవచ్చు నీశాన! చెప్పవే
పణఁతిఁ బొగడవశమె బ్రహ్మకైన.
72-క.
తెఱవకుఁ జన్నులవ్రేఁగున
మఱి యల్లల నాడుచున్న మధ్యము వ్రేఁగై
విఱుగునది విఱుగకుండుట
వెఱఁగయ్యెను మాకుఁ జూడ విశ్వాధిపతీ!
73-క.
చెలువకుఁ గేకిసములకును
కలహంసాధీశునకును గజరాజునకున్
వెలఁది నడుచుక్రియ లట్లను
నలి నడవం దరము గాదు నాగేంద్రధరా!
74-క.
లలనామణి యగు పార్వతి
విలసితకల్యాణరూపవిభవము చెప్పన్
మలహర! నీయాన సుమీ
జలజాసను కైనఁ జనదు చంద్రాభరణా!
75-ఆ.
అతివ యిట్టి దట్టి దని చెప్పరా దెందు
దేవదేవుఁ డైన దేవ! నిన్ను
నధిపుఁ గాఁగఁ బడసె నంతయ చాలదే
వెలఁదిలక్షణములు వేయు నేల?
76-వ.
దేవా! మానేర్చు ప్రకారంబున నీ యనుగ్రహంబున మీకుఁ బరిణయంబుగా నిశ్చయించి పార్వతీదేవికి ముద్రారోహణంబు చేసి వచ్చితిమి; యింకఁ దడయ నేల? వివాహలగ్నంబు నిర్ణయించి హిమనగేంద్రుఁ డున్న చోటికి లేఖలు పంపుదురు గాక; మహత్మా! గరళకంధరా! మీ కల్యాణమహిమాభిరామంబు చూడ వచ్చెదము; సోమశేఖరా! శరణం” బని విన్నవించిన మునినాథుల ననుకంప సొంపు మిగుల నానంద రసంబుల నోలలార్చి యమ్మహేశ్వరుండు.