Jump to content

వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/పార్వతీపరిణయమునకు బ్రహ్మది దేవతలు వచ్చుట

వికీసోర్స్ నుండి


పార్వతీపరిణయమునకు బ్రహ్మది దేవతలు వచ్చుట

77-ఆ.
దేవిఁ బెండ్లియాడ దిన మేది లెస్స యో
యెఱుఁగవలయు నంచు నీశ్వరుండు
భారతీశుఁ దలఁచె బాలేందుజూఁటుని
తలఁపుతోనఁ గూడ ధాత వచ్చె.
78-వ.
ఇట్లు చనుదెంచి బ్రహ్మ తనకుం బ్రణామంబు చేసి నిలచినఁ గనుంగొని; సముచిత ప్రకారంబుల గారవించి; యతని నప్పరమేశ్వరుండు విధ్యుక్త ప్రకారంబుల వివాహ లగ్నంబు నిర్ణయించి తన పెండ్లికి రమ్మని చతుర్దశభువనంబు లందుఁ జాటింపం బంచిన.
79-ఉ.
దేవర పెండ్లి నేఁ డనుచుఁ దేజము సొంపున భోగరాయఁడై
దేవత లందఱుం గొలువ దేవమునుల్ నుతి సేయఁగా శచీ
దేవియుఁ దాను గూడి చనుదెంచె మహేంద్రుఁడు పెంపు తోడ నై
రావణదంతి నెక్కి మునిరంజనుకొండకు వెండికొండకున్.
80-ఉ.
నాలుగుశృంగముల్ మెఱయ నాలుక లేడు వెలుంగఁ గోర్కులన్
దేలుచు మూఁడు పాదములు తేటపడన్ నిజ వైభవోన్నతిన్
వ్రాలుచు నేగుదెంచె నజవాహన మెక్కి ధనంజయుండు ని
ల్లాలును దానుఁ గూడి త్రిపురాంతకు కొండకు వెండికొండకున్.
81-ఉ.
దండధరుల్ మహాఘను లుదగ్రులు కింకరు లోలిఁ గొల్వ ను
ద్దండ లులాయవాహుఁ డయి దర్బముతో మణిభూషణాంగుఁ డై
దండధరుండు వచ్చె ఘనదండము కేల వెలుంగఁ గామినీ
మండితుఁ డై మనోజమదమర్దనుకొండకు వెండికొండకున్.
82-ఉ.
మానవు నెక్కి రాక్షసులు మన్నన నేయఁగ నభ్రవీధి పై
మానవకేతనం బడర మానినియున్ దనతోఁడ రాఁగ స
న్మానిత వస్త్రభూషణరమానధరుం డయి వచ్చెఁ బ్రీతితో
దానవనాయకుండు జితదైత్యునికొండకు వెండికొండకున్.
83-ఉ.
మోదత సప్తసంద్రములు ముంగలఁ గొల్వఁ గెలంకులందు గం
గాది మహనదుల్ సముదయంబుగ రా ఝషకాంత వాహుఁ డై
శ్రీ దనరార నేఁగె రుచిఁ జెన్నగు కానుక లెల్లఁ గొంచుఁ దాఁ
బైదలిఁ గూడి వార్ధిపతి భర్గునికొండకు వెండికొండకున్.
84-చ.
ముని నికరంబులుం గొలువ మోదము నొందుచు మానసంబులన్
జనములు పల్లవింపఁ గడుఁ జల్లని కమ్మని గాడ్పు వీచుచున్
వనజదళాక్షితో హరిణవల్లభు నెక్కి జగజ్జనానురం
జనమున నేఁగె నమ్మదనసంహరుకొండకు వెండికొండకున్.
85-ఉ.
సంగడికాని పెండ్లి యని సంతస మందుచు మేలురాజ్యల
క్ష్మిం గడుఁ దేజరిల్లుచును జెల్వయుఁ దాను దుకూలరత్నమా
తంగ తురంగ కాంచన కదంబముఁ గొంచుఁ దురంగవాహుఁడై
సంగతి నేఁగె విత్తపతి శంకరుకొండకు వెండికొండకున్.
86-చ.
నొసల విభూతిఁ బూసి కడునున్నని యేనుఁగుతోలుఁ గప్పి రా
జసమున పాములం దొడిగి చారుత్రిశూలపినాకహస్తుఁ డై
యెసఁగిన వేడ్కతోఁ దనదు నింతియుఁ దానును వచ్చె శూలి దా
బసవని నెక్కి జూటహిమభానునికొండకు వెండికొండకున్.
87-మ.
ఘనశృంగారముతో మహామహిమతోఁ గళ్యాణియుం దాను స
జ్జనితోల్లాసులు పుణ్యభాగవతులున్ సంసారదూరాత్మకుల్
సనకాదుల్ కడుఁగొల్వ మింట నరిగెన్ సంప్రీతితో మాధవుం
డనఘుం డాఢ్యుఁడు వెండికొండకు ఖగేంద్రారూఢుఁ డై రూఢితోన్.
88-క.
వలనొప్ప మునులు గొలువఁగఁ
గలహంసాధీశు నెక్కి గ్రక్కున వాణీ
లలనయుఁ దానును వచ్చెను
జలజాతభవుండు రజతశైలము కడకున్.
89-క.
తారాగ్రహములు గొలువఁగఁ
దారాహితకమలహితులు తద్దయు వేడ్కన్
దీరొప్ప నేగు దెంచిరి
తారాచలశిఖరమునకు ధన్యాత్మకులై.
90-క.
నర కిన్నర గరుడోరగ
సుర దనుజేంద్రాది సిద్ధ సురముని విద్యా
ధర గంధర్వాధీశులు
వరుసం గైలాసమునకు వచ్చిరి ప్రీతిన్.
91-వ.
ఇట్లు గౌరీకళ్యణవిలోకనకాంక్షు లై సకలమైన వారును కలధౌతధరణిశిఖరంబుఁ బ్రవేశించి పరమేశ్వరుం గాంచి వినతులై వినుతించుచున్న సమయంబున వారలఁ గరుణతోడం గనుంగొని యమ్మహేశ్వరుం డిట్లనియె.