Jump to content

వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/దేవతల క్షేమము నీశ్వరుం డడగుట

వికీసోర్స్ నుండి


దేవతల క్షేమము నీశ్వరుం డడగుట

92-మ.
“ లలితానందమె? పాకశానన! మనోల్లాసంబె? సప్తార్చి! మంగళమే? భానుజ! లెస్సలే? దనుజ! సౌఖ్యంబే? జలాధీశ! సంజలమే? మారుతి! మోదమే? ధనద! విశ్రామంబె? యీశాన! శ్రీపొలుపే? మాధవ!” యంచు నేమ మరసెన్ భూతేశుఁ డింద్రాదులన్.
93-వ.
ఇ ట్లడిగిన నంత నమ్మహదేవునకు దేవత లి ట్లనిరి.
94-క.
“ శరణార్ధి భక్తవత్సల!
శరణార్ధి పురాణయోగిజనమందారా!
శరణార్ధి దురిత సంహర!
శరణార్ధి మహేశ! రుద్ర! జలజాక్షనుతా!
95-క.
దేవా! మీ కృప గలుగఁగ
భావింపఁగ మాకు నెపుడు భద్రము సుమ్మీ
దేవేశ! మిమ్ముఁ గంటిమి
కావున ధన్యులమఁ గామె గంగాధిపతీ!”
96-వ.
అని మఱియు బహుప్రకారంబుల వినుతింప నద్దేవ సమూహంబుల ముందఱ నిల్చి విరించి యిట్లనియె.
97-మ.
“గమనింపం గడు లెస్స నేఁడు శుభలగ్నం బెల్లి బృందారకుల్
కమలాక్షాదులు వచ్చినారు తడయంగా నేల వేంచేయుఁ డీ
హిమశైలేంద్రుని వీటినుండి వినయం బేపార నిచ్చోటికిన్
రమణన్ లేఖలు వచ్చెఁ బెండ్లికి మిమున్ రమ్మంచు సర్వేశ్వరా!”
98-వ.
అని విన్నవించిన విరించి వచనంబులకుఁ బంచాననుండు రంజిల్లి లౌకికాచారంబు విచారించి తన మనంబున.
99-గీ.
గౌరి తాన పోయి కలయంగ నిటమీఁద
భువన మెల్ల శైలపుత్రి యనఁగ
సవతితల్లి యనుచు జాలి బొందెడు నని
ప్రీతి నేకదంతుఁ బిల్వఁ బంచె.