వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/గజాననుని పార్వతీపరిణయమునకుఁ దీసికొని పోవుట
స్వరూపం
గజాననుని పార్వతీపరిణయమునకుఁ దీసికొని పోవుట
100-శా.
రావో కుఱ్ఱఁడ! యంచుఁ గౌఁగిటికిఁ జేరం బిల్చి యూరార్చి య
ద్దేవుం డేనుఁగుతుండముం బుణికి మూర్ధఘ్రాణముం జేసి స
ద్భావుం డంకతలంబుపై నునిచి సంభావించి ప్రేమాబ్ధిఁ దా
దైవారం దన ముద్దుపట్టికిని గందర్పాంతకుం డిట్లనెన్.
101-శా.
లెమ్మా! శీతనగేంద్ర పట్టణమునన్ లీలార్ధ మై యున్న మీ
యమ్మం దేవలె నుండనీ దగవు నీ వాయత్త మై తోడితే
రమ్మా! నీవును నీ గణంబులును సంరంభమ్ముతో ముందఱం
బొమ్మా! మేమును గూడ వచ్చెదము సమ్మోదంబుతోఁ బుత్త్రకా.
102-వ.
అని గణనాధ చక్రవర్తిని గై సేసి.