వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/శివుండు పార్వతీ సహితుఁడై మంగళస్నానాదుల చేయుట
శివుండు పార్వతీ సహితుఁడై మంగళస్నానాదుల చేయుట.
165-వ.
ఇట్లు పరమేశ్వరుండు పురంబుఁ బ్రవేశించి యందుఁ దుహినాచలేంద్రుండు తనకు నియమించిన విడిదికి నెయ్యంబు తోడ నిట్లు వచ్చిన.
166-సీ.
అతివలు కస్తూరి నలికించి ముత్యాల
ముగ్గులు దీరిచి ముదముతోడ
రత్నపీఠమునకు రాజాస్య మేనక
తోఁ బార్వతీదేవిఁ దోడి తెచ్చి
పసుపుటక్షింతలు పరఁగంగ దీవించి
పెట్టి వాద్యంబులు బెరసి మ్రోయ
తల్లి దలంటంగఁ దగు మజ్జనము లార్చి
యొప్పారఁ దడియొత్తు లోలిఁ దాల్చి.
ఆ.
బహుళ రత్న చయము బడిసి పొందుగ వైచి
పట్టుపుట్టములను గట్ట నిచ్చి
పేరఁటాండ్రు చూడ పెండ్లికుమారిఁ గై
సేయఁ దలఁచి గడగి చెలువు మిగుల.
167-ఆ.
దేవిరూపమునకు దృష్టిదాఁకెడు నంచు
మాటుసేయుభంగి మణిసువర్ణ
పుష్పవస్త్రగంధముల నలంకారించి
రెలమితోడ గౌరి నిందుముఖులు.
168-వ.
ఇట్లు శృంగారించి శైలవల్లభు పెండ్లింటిలోనికిఁ దోడి తెప్పించి రంత; నప్పరమేశ్వరుం డంతఁ దన యున్న మందిరంబున శ్రౌత పుణ్యాహవాచనంబులు బ్రహ్మచేతం జేయించి వివాహ కౌతూహలంబున.
169-ఉ.
పొందుగఁ బుష్ప మేఘములు పువ్వులవానలు జల్లుజల్లునన్
దుందుభి కాహళ ధ్వనులు తూర్వరవంబులతో గణాధిపుల్
సందడిచేయ దేవతలు సంభ్రమతం జయవెట్ట బ్రహ్మ గో
వింద పురందరుల్ గదిసి వేడ్క గెలంకుల యందుఁ గొల్వఁగన్.
170-చ.
చెలువ పులోమనందనయు శ్రీయు నరుంధతియున్ సరస్వతీ
లలనయుఁ బెక్కువస్తువులు లాలితవృత్తిఁ బసిండిపళ్లెరం
బుల నమరించి దేవ ముని పుణ్యవధూ జనకోటితోడఁ గ్రం
తలుగొని పాడుచున్ నడువ ధన్యులు దిక్పతు లెల్లగొల్వఁగన్.
171-క.
వేదంబులు గీర్తింపఁగ
నాదట సన్మునులు గొల్వ హర్షముతోడన్
ఆదిగిరీంద్రుని యింటికి
వేదాంతవిదుండు శివుఁడు వేంచేసె నొగిన్.
172-ఆ.
వామదేవు వైభవంబుతోడనె వైభ
వంబు మెఱసి యప్పురంబు వెలసె
చందురుండు వొడమ నందంద ఘూర్ణిల్లు
పాలవెల్లిభంగిఁ బ్రజ్వరిల్లి.
173-వ.
అమ్మహాదేవుండు తుహినాచలమందిరంబుఁ బ్రవేశించి నందికేశ్వరుండు డిగ్గునవసరంబున నంతట సుందరీజనంబులు పసిండిపళ్లెరంబులతోడ మణి మరకత వజ్ర వైడూర్య పుష్యరాగ గోమేధిక నీల ముక్తాఫలంబు లమరించి నివాళించి రంత.
174-క.
ఎదురుగ సేసలు చల్లుచుఁ
బదపడి సింహాసనంబు పైఁ బరమేశున్
ముదమార నునిచి దేవర
పదకమలము లద్రిరాజు భక్తిం గడిగెన్.
175-క.
మెఱయంగా మధుపర్కము
కఱకంఠుని కిచ్చి వెనుక కమనీయముగా
మఱిఁ గట్ట నిచ్చి కన్యకు
మఱువుగఁ దెరవారఁ బంచె మహితాత్మకుఁడై.
176-వ.
ఇట్లు తెరవారం బంచిన.
177-క.
కరుణాపాంగుఁడు శంభుఁడు
సురపతి కైదండఁ గొనుచు సురుచిరగతులన్
దెర మ్రోల వచ్చి నిలిచెను
దెరమీఁదను గోటిచంద్రదీప్తులు వాఱన్.
178-క.
ఇరువురు దమ రొండొరువుల
వరవదనాబ్జములు చూడ వాంఛితమతు లై
తెర యెప్పుడు వాయునొ యని
సరి నువ్విళ్లూరి రపుడు సతియుం బతియున్.