వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/అంగనాజనంబు లీశ్వరునిఁ జూడవచ్చుట

వికీసోర్స్ నుండి


అంగనాజనంబు లీశ్వరునిఁ జూడవచ్చుట.

143-ఉ.
“కాలునిఁ గెల్చి లీలమెయిఁ గాముఁ బరాజితుఁ జేసి కొండరా
చూలికిఁ జిక్కి జూటమున చుక్కలరేని ధరించి జాణఁ డై
వేలుపుటేటిమిండఁ డొగి వేడుక వచ్చుచు నున్నవాఁడు నీ
లాలకలార! రండు మనమారఁగఁ జూతము కోర్కి దీరఁగన్.
144-చ.
పురహరుఁ జూడ రండు శివుఁ బూర్ణమనోరధుఁ జూడ రండు ని
ర్జరనుతుఁ జూడ రండు నెఱజాణనిఁ జూడఁగ రండు యిందుశే
ఖరు మదిఁ జూడ రండు విషకంధరుఁ జూడఁగ రండు దేవశే
ఖరు శివుఁ జూడ రం” డనుచుఁ గాంత లనంతమనోరథంబులన్.
145-చ.
కనకలతాసమూహములొ కాఱుమెఱుంగులొ కాముదీములో
మనసిజబాణజాలములొ మన్మథరాజిత లక్ష్ములో యనం
సనవగుమోహజాలములొ చక్కనిచుక్కలొ చంద్రరేఖలో
యనఁగఁ దలోదరుల్ త్రిభువనాభినవప్రభ లుల్లసిల్లఁగన్.
146-ఉ.
బాలలు వూర్ణ యౌవనలుఁ బ్రౌఢలు లోలలుఁ బుణ్యపణ్య నీ
లాలక లంబుజాత విమలానన లోలి నలంకరించుచో
వేలుపురేని దా వెలయ వీనులఁ బూజలు సేయుచాడ్పునన్
గ్రాలినహేమపత్రములు గర్లములం దిడి వచ్చె నోర్తుదాన్.
146-మ.
తిరమై తుమ్మెద మొత్తముల్ కమలపంక్తిం గప్పు భావంబునన్
హరినీలాంచిత మేఖలావళులు దా మందంద శీఘ్రంబుగన్
హరుఁ జూడన్ బఱతెఁచు వేగమునఁ బాదాంభోజ యుగ్మంబులన్
బరఁగన్ బాఱుచు మ్రోల నేఁగిరి సతుల్ ఫాలాక్షు నీక్షింపఁగన్.
148-క.
మృడుఁ జూచు లోచనంబులఁ
దొడరి మదాంధముల నెల్లఁ దొలఁగఁగ నిడి తా
వెడలించిన క్రియ నొక్కతె
కడకంటం బారఁ దీర్చెఁ గాటుక రేఖల్.
149-క.
అత్తఱి నొక్కతె పదముల
లత్తుక హత్తించి క్రొత్తలత్తుకతో న
చ్చొత్తిన కమలంబులగతి
జొత్తిల్లన్ జంద్రమౌళిఁ జూడఁగ వచ్చెన్.
150-చ.
అడుగుల నశ్వవేగ మిభయానకు నంచుఁ జెలంగు పోలికన్
గడుకొని పాదపద్మముల ఘల్లని యందెలు మ్రోయఁ జెచ్చెరన్
తొడవులు వేడుకం దొడిగి తొయ్యలి యొక్కతె పుష్పమాల క్రొ
మ్ముడిపయిఁ గానరాఁ జెదిరి ముందట వచ్చె మహేశుఁ జూడఁగన్.
151-మ.
పరమేశుం బరికించు సంభ్రమగతుల్ భావంబు లో నెంతయున్
స్ధిరమై యొప్పిన లోలతం గదియఁ దా శృంగారమున్ జేయఁగాఁ
గర మర్ధిన్ మఱపొంది యెంతయును శృంగారంబుగా వచ్చె స
త్వరయై మోదముఁ బొంది యొక్క సతి కైవల్యాధిపుం జూడఁగన్.
152-క.
ఉడురాజధరల కెల్లను
దొడవయ్యెడు నాకుఁ దొడవుఁ దొడుగఁగ నేలా
తొడవులు దొడిగినఁ గొఱఁతని
యుడురాజోత్తమునిఁ జూడ నొక్కతె వచ్చెన్.
153-క.
మారారికిఁ దిలకం బగు
తారాపతి గేలిసేయఁ దలఁచిన భంగిన్
నీరజలోచన తిలకము
చారుగతిని గప్పుర మిడి సయ్యన వచ్చెన్.
154-సీ.
పన్నీట మృగమదపంకంబు మేదించి
నిపుణత మైదీఁగె నిండ నలఁది
చతురలై కొప్పుల జడచొళ్లెములు వెట్టి
లీలమైఁ బుష్పమాలికలు చేర్చి
బహువస్త్రములు గట్టి పాలిండ్లకవలకు
నల్లల్ల మాటుపయ్యదలు దిగిచి
వివిధభూషణములు వెఱవొప్ప ధరియించి
ఘనపారములఁ దిలకములు వెట్టి
ఆ.
యఖిలభువనమోహనాకారములు గ్రాలఁ
బూర్ణచంద్రుఁ బోలు మోము లమర
విశ్వనాధుఁ జూడ వేడుక దళుకొత్త
సంతనమునఁ బురముకాంత లెల్ల.
155-వ.
ఇట్లు విలసితాలంకారంబున.
156-ఉ.
చంచలనేత్రి దాను “దన చన్నులుఁ గన్నులు ముద్దుమోములున్
బంచశరాపహారికిని భాతిగ నల్లనఁ జూపి చూడ్కి నా
టించెద నేర్పు లెల్లఁ బ్రకటించెద లోలత నన్ను డాయ ర
ప్పించెద మన్మధుం గెలుచు బీర మణంచెద చూడు బాలికా!
157-ఉ.
ఒక్కటి చెప్పెదన్ వినుమ యొయ్యన రమ్ము లతాంగి! నేఁడు నా
చక్కదనంబు చూచి మదసామజచర్మధరుండు శూలి దా
చిక్కునొ చిక్కఁడో నిజము చెప్పుము నాకుఁ గురంగలోచనా!
చిక్కినఁ జిక్కకున్న మఱి చెల్వలతో వినుపింపకుండుమీ.”
158-శా.
“ లోలాక్షి! తగు నీదు విభ్రమము నాలోకించి కామార్ధియై
వాలాయంబుగఁ జిక్కుఁ జంద్రధరుఁ డో వామేక్షణా! నేఁడు శ్రీ కైలాసాద్రివిభుండు పొందు ఘనగంగావాహినీమౌళి నా
శూలిం గన్నియ చూడ్కి లోఁబఱచు” నంచున్ దారు గీ ర్తించుచున్.
159-వ.
ఇట్లు బహుప్రకారంబులఁ దమలో నొండొరులు నుపశమించుచు మన్మధాలాపంబులు పలుకుచున్న మన్మధోత్సాహమానసు లై సంభ్రమంబున.
160-సీ.
కుంభికుంభముఁ బోలు కుచకుంభభరమున
వెడవెడనడుములు వీఁగియాడ;
బాలేందుఁడునుబోలు ఫాలస్థలంబున
నీలకుంతలములు దూలుచుండఁ;
జారుచక్రముఁ బోలు జఘనచక్రంబుల
నమరఁ గట్టిన మేఖలములు వీడఁ;
బంకజంబులఁబోలు పాదయుగ్మంబుల
వడివడి నడుఁగులు తడఁబడంగ
ఆ.
గోపతీశుఁ జూచు కోర్కులు ముడివడఁ;
జేడె లొకతొకర్తుఁ గూడఁ బాఱి
“యల్లవాఁడె వచ్చె నమరులతోఁ బంచ
వదనుఁ డల్లవాఁడె; వాఁడె” యనుచు.
161-మత్త.
వేడుకం బురకన్యకల్ దమ వీధులం బొడ వైన యా
మేడమాడువు లెక్కి చూచుచు మేలిజాలక పంక్తులన్
గూడి చూచుచు శంభుఁ జూచుచు గోపవాహఁ నుతించుచున్
బాడుచుం దమలోన ని ట్లని పల్కి రప్పుడు ప్రీతితోన్.
162-సీ.
“ కమాలాక్షి! యీతఁడే కళ్యాణమూ ర్తి యై
సమ్మోదమున వచ్చు జాణమగఁడు
కామిని! యీతఁడే ఘనజటావలిలోన
మిన్నేరుఁ దాఁచిన మిండగీఁడు
వెలఁదిరో! యీతఁడే వెన్నెలపాపని
పువ్వుగాఁ దురిమిన పుట్టుభోగి
మగువరో! యీతఁడే మన గౌరి నలరింప
మాయపు వటు వైన మాయలాఁడు
ఆ.
ఉ త్తమాంగి! యితఁడె విత్తేశు చెలికాఁడు
విమలనేత్రి! యితఁడె వేల్పుఱేఁడు
యిందువదన! యితఁడె మందిరకైలాస
కంధరుండు నీలకంధరుండు.”
163-వ.
అని మఱియు.
164-సీ.
గోరాజగమనునిఁ గొనియాడువారును
శంభువై సేనలు చల్లువారు
పరమేశు నాత్మలో భావించువారును
గిరిరాజునల్లు నగ్గించువారు
లోకైకనాథు నాలోకించువారును
శివదేవుకై కూర్మి సేయువారు
తరుణేందుధరుఁ బొందఁ దమకించువారును
మృడునకుఁ గేలెత్తి మ్రొక్కువారు
ఆ.
భూధరేంద్రుఁ జాల భూషించువారును
సొరిది నమరకోటిఁ జూచువారు
కొమరుమిగుల నీకుఁ గొనియాడువారును
మెలఁగి రప్పురంబు మెలఁత లెల్ల.