వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/శంకరుని దేవతలు స్తుతించుట
శంకరుని దేవతలు స్తుతించుట.
234-క.
“ అవధారు చంద్రశేఖర!
యవధారు గజేంద్ర దానవాంతకమూర్తీ!
యవధారు భువననాయక!
యవధా రొక విన్నపంబు నాలింపఁగదే.
235-చ.
ఎఱుఁగక మేము మందరమహీధ్రముఁ గవ్వము చేసి వాసుకిన్
నెరయగఁ జేరు చేసి మఱి నీరధి నీరజనాభుఁ గూడి యం
దఱమును ద్రచ్చుచో నొక యుదగ్ర విషాగ్ని జనించె లోకముల్
దరికొని కాల్పఁగాఁ దొడఁగె దాని నడించి మహేశ! కావవే.
236-ఉ.
కాయజసంహరాయ! శశిఖండధరాయ! నమశ్శివాయ! కా
లాయ! హరాయ! భీషణబలాయ! కపాలధరాయ! దేవదే
వాయ! యమాంతకాయ! దృఢవజ్ర పినాక త్రిశూలదండ హ
స్తాయ! మునీంద్ర యోగివరదాయ! సురాధిపతే! నమోస్తుతే.
237-ఉ.
ఆయతమంగళాయ! భుజగాధిప రమ్య కరాయ! రోహిణీ
నాయక భాను వహ్ని నయనాయ! మహేశ్వర! బ్రహ్మ విష్ణు రూ
పాయ! పురాంతకాయ! పరిపంథి సురారి హరాయ! సాంఖ్య యో
గాయ! త్రిలోచనాయ! సుభగాయ! శివాయ! నమో! నమోస్తుతే.
238-ఉ.
కారణకారణాయ! భుజగర్వమదాంధక సంహరాయ! సం
సారమహార్ణవ జ్వలిత చండ మహాదహనాయ! దేవతా
స్ఫార కిరీటకూట మణిబంధుర పాదపయోరుహాయ! యోం
కార మయాయ! భక్తజన కల్పకుజాయ! నమో! నమోస్తుతే.
239-మ.
ఋతు సంవత్సర మాస పక్ష జనితారూఢాయ! నానాధ్వర
వ్రత రూపాయ! రవీందు యజ్వ జల భూ వైశ్వానర వ్యోమ మా
రుత రూపాయ! శిఖండక ధ్వజ యశోరూపాయ! యోగీశ్వర
స్తుత రూపాయ! నమో! నమో! శివ! నమో! సోమార్ధ చూడామణే!
240-క.
వ్యక్తము లై నీ గుణములు
భక్తులకుం గానవచ్చు భవమతులకు న
వ్యక్తం బై చరియించును
భక్తజనాధార! యభవ! భయసంహారా!
241-క.
భావించి జగము లన్నియుఁ
గావింపఁగ వాని నన్ని ఖండింపఁగ బ్ర
హ్మా విష్ణు మహేశ్వరు లన
నీ వైతివి కాదె; దేవ! నిఖిలాధిపతీ!
242-క.
చింతింపరాదు నీ క్రియఁ
జింతింపఁగ రాదు నీవు చేసిన పనులం
జింతింపరాదు భక్తుల
చింత్యాచింత్యములు రుద్ర! శ్రీగౌరీశా!
243-క.
నిత్యము నీ గంభీరత
నిత్యము కరుణాబ్ధి యైన నీ చిత్తంబున్
నిత్యము నీ కృత్యంబులు
నిత్యము నిను గొలువనిమ్ము నిర్మలమూర్తీ!
244-క.
వదలక సమయము లాఱును
చదువులు నాలుగును గూడి సంతతనియతిన్
వెదకియుఁ బొడఁగన నేరవు
పదపడి నినుఁ జొగడవశమె ప్రమథాధిపతీ!
245-క.
నింగియు నేలయుఁ దానై
పొంగిన హాలాహలంబు బొరిమార్చి రహిన్
వెంగలుల మమ్ముఁ గావుము
గంగారంగత్తరంగ! కలితజటాంగా!”
246-వ.
అని మఱియు ననేక ప్రకారంబుల నుపేంద్ర దేవేంద్ర భారతీంద్ర ప్రముఖ లైన దేవగణంబులు ననన్యశరణంబు లై వేఁడినం గనుంగొని కరుణాయత్త చిత్తుండ నై యి ట్లంటి.
247-ఉ.
“ఎప్పుడు మీరు నేఁ గలుగ నేల తలంక దిగంతరాళముల్
గప్పిన యీ హలాహలము గర్వ మడంచి ధరిత్రి మించి యే
నొప్పు వహింతు నేఁడు దివిజోత్తములార భయంబు మానుఁ డీ
చొప్పున నెన్నఁ డైన మిముఁ జెందిన యాపద బాపి కాచెదన్.”