వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/ఈశ్వరుఁడు హాలాహలమును మ్రింగుట

వికీసోర్స్ నుండి


ఈశ్వరుఁడు హాలాహలమును మ్రింగుట.'

248-వ.
అని పలికి సకల దేవతా సమేతుండ నై యేగుదెంచి; తదవసరంబున.
249-సీ.
ప్రళయకాలము నాఁటి భానుమండలముల
వెలుఁగులపొది వోలె వెల్గివెల్గి
విలయాగ్నియును బోలి విస్ఫురత్కణముల
గగనంబు నేలయుఁ గప్పికప్పి
కాలాగ్ని రుద్రుని ఫాలాగ్నియును బోలెఁ
గడు నమోఘార్చులఁ గ్రాలిక్రాలి
బడబాగ్నియును బోలె జడధులు దరికొని
కడు భయంకరవృత్తిఁ గ్రాచిగ్రాచి
ఆ.
వెన్నుఁ డాది గాఁగ వేల్పుల నెల్లను
సల్లఁ జేసి తరులు నదులు గిరులు
జీవులనక కాల్చు శితహలాహలమను
వహ్నిఁ గాంచి కోపవహ్నితోడ.
250-వ.
మఱియు నత్యంత విజృంభిత సంరంభమానసుండ నై కరాళించి; హాలాహలకీలంబుఁ గనుంగొని యెదురుకొని; గౌఁగిలింపం గలయు చందంబున బొమలు ముడివడ; నైదు ముఖంబుల నగణితంబులై భుగులుభుగుల్లని మంటలు మిడుఁగురులు నెగయ; సర్వాంగంబులు గుడుసువడ భుజాదండంబులు చాచి బ్రహ్మాండంబులు లోనుగాఁ గల మదీయ దివ్యాకారంబు విడంబించి దుర్నిరీక్షం బై వెలుంగుచున్న కాలకూటంబు నీక్షించి “నిలునిలు. పోకుపోకు” మని యదల్చుచు సమంచిత శీతలాలోకనంబుల నతిశీతలంబుఁ గావించి త్రిజగద్భయంకరంబుగా హుంకరించిన సమయంబున.
251-ఉ.
ఎల్ల సురేంద్రులున్ బొగడ నెంతయుఁ దేజము దూలిపోయి నా
చల్లనిచూడ్కి జల్లనగ సత్వరతం జనుదెంచి నూత్నసం
పుల్లపయోజపత్రమును బోలు మదీయ కరాంబుజంబుపై
నల్లన వచ్చి నిల్చె విష మప్పుడు నేరెడుపండు నాకృతిన్.
252-వ.
ఇట్లు నిలచిన విషానలంబుఁ గనుంగొని.
253-క.
జలరుహగర్భుఁడు మొదలుగఁ
గల దేవత లెల్ల మ్రొక్కఁ గడు నద్బుతమై
వెలిఁగెడు తద్విషవహ్నుల
గళమున నే నిలుపుకొంటిఁ గంజాతముఖీ!
254-వ.
ఇట్లు గరళభక్షణంబు చేసిన సమయంబున; సకలలోకంబుల వారును జయజయ శబ్దంబుల నతిబల! త్రిజగదభినవ భుజబలాభిరామ! అహోబల బ్రహ్మ విష్ణు మహేశ్వర రూప !అహోబల సోమ సూర్యాగ్ని నేత్ర! అహోబల సకలబ్రహ్మాండ నాటక తంత్రావధాన! అహోబల దేవాది దేవ! యని కీర్తించుచు; నూర్ధ్వబాహులై పాష్టాంగదండ ప్రణామంబు లాచరించి; సంభ్రమంబును సంతసంబును నాశ్పర్యంబును భయంబును భక్తియు సందడింప నిట్లని స్తుతియింపఁ దొణంగిరి.
255-క.
శరణము వేఁడిన మమ్మును
గరుణన్ రక్షించి విషము గ్రహియించుటయుం
గర మాశ్చర్యము చేనెను
శరణాగతపారిజాత సర్వజ్ఞ నిధీ!
256-క.
భక్తుల నుపలాలింపంగ
భక్తుల నిగ్రహము లెల్ల భంజింప దయన్
భక్తజనపారిజాతా!
భక్తజనాధార! నీకుఁ బరఁగు మహేశా!
257-క.
దిక్కులు నేలయు నింగియుఁ
జుక్కలు ననలుండు హరియు సూర్యుఁడు యముఁడున్
చుక్కలరాయుఁడు పవనుఁడు
నిక్కువముగ నీవె కావె నిర్మలమూర్తీ!
258-క.
యుగములు సంధ్యలు రాత్రులు
జగములు ఋతువులు నెలలు సంవత్సరముల్
నగములు దరువులు దినములు
పగళ్లు పక్షములు నీవె బాలేందుధరా!
259-క.
వేదాంతనిమి త్తంబులు
వేదంబులు ధర్మములును విమలాత్మకముల్
వాదంబులు తంత్రంబులు
మోదంబులు నీవె కావె మునిరాజనుతా!
260-క.
కలిమియు లేమియు బుద్ధియు
బలునీతులు శూరగుణము భాగ్యంబును బం
ధులు దానంబులు దాతయుఁ
దలిదండ్రులు నీవెకాద తరుణేందుధరా!
261-వ.
మహాత్మా నిన్ను వేఱువేఱ నెన్న నేల సకలభూతాంతర్యామి వని వినంబడుచుండు వేదంబులవలన నీ మహిమ కొలఁది వినుతి సేయ వశమే పరమేశ్వరా! పరమభట్టారకా! సచ్చిదానందస్వరూపా!” యని బహుప్రకారంబుల వర్ణించుచున్న కమలసంభవప్రముఖ లైన దేవగణంబులం జరియింప నియోగించి నాటఁగోలె సమస్త జగత్పరిపాలనంబు సేయుచున్నవాఁడ” నని మఱియు నమ్మహాదేవుం డిట్లనియె.
262-క.
“గరళము మ్రింగినకతమున
గరళగళుం డండ్రు జనులు గజపతిగమనా
గరళము మ్రింగినచందము
తరుణీ వినుపింపవలసెఁ దద్దయు నీకున్.
263-సీ.
కరమొప్ప నీ నీలకంఠ స్తవంబులో
నబల యేకశ్లోక మైనఁ జాలుఁ
గరమొప్ప నీ నీలకంఠ స్తవంబులో
నబల యర్ధశ్లోక మైనఁ జాలుఁ
గరమొప్ప నీ నీలకంఠ స్తవంబులో
నబల పాదశ్లోక మైనఁ జాలుఁ
గరమొప్ప నీ నీలకంఠ స్తవంబులో
నబల కించిన్మాత్ర మైనఁ జాలుఁ
ఆ.
విమలభక్తితోడ వినినఁ బఠించిన
సజ్జనుండు సకలసంపదలును
గలిగి భవము లేక కైలాసవాసుఁ డై
నన్నుఁ జేరియుండు నలిననేత్ర!”
264-వ.
అని మహాదేవుండు దేవికిం జెప్ప నని చెప్పి తదనంతరంబ.