వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/దేవతలు బ్రహ్మను వేఁడుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


దేవతలు బ్రహ్మను వేఁడుట.

229-వ.
ఇట్లు విన్నవించిరి.
230-శా.
“దుగ్ధాంభోనిధిశాయి దోడుగ భుజాదుర్వారదర్పోన్నతిన్
దుగ్ధాంభోధి మథించుచో విషశిఖల్ తోరంబులై పుట్టి ని
ర్ధగ్ధున్ జేసె రమేశ్వరున్ వెనుకొనెన్ దైత్యామరశ్రేణి సం
దిగ్ధం బయ్యె జగంబు లింక నణఁచున్ దెల్లంబు వాణిపతీ!”
231-వ.
అనిన బ్రహ్మదేవుం డిట్లనియె.
232-మ.
“ఇది నాచేత నణంగ నేరదు వినుం డీరేడులోకంబులన్
త్రిదశుం డెవ్వఁడు వాఁడు దీని నణఁచున్ దేవాసురవ్రాతమా!
త్రిదశారాధ్యుని భక్తవత్సలు మహాదేవున్ శివుం గాంచి యా
పిదపన్ రం” డని బ్రహ్మ యొయ్య నరుగన్ బృందారక వ్రాతమున్.
233-వ.
కైలాసకంధరంబునకు నరిగి వార లందఱు నమ్మహేశ్వరుం గాంచి పాష్టాంగదండ ప్రణామంబులు గావించి వినయంబునఁ గరకమలంబులు నిటలతటంబులం గదియించి యిట్లని విన్నవించిరి.