వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/శివుండు వీరభద్రునకుఁ బట్టంబు గట్టుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


శివుండు వీరభద్రునకుఁ బట్టంబు గట్టుట.

221-వ.
అని పలికి.
222-మ.
“బలభిద్వహ్ని కుబేరభానుజహరి బ్రహ్మాదులం బిల్చి యీ
బలియుం డాఢ్యుఁడు వీరభద్రుఁ డఖిల బ్రహ్మాండ భేద్యుండు స
ల్లలితానందుఁడు ముజ్జగంబులకు నెల్లన్ దాన కర్తారుఁడై
వెలుఁగం దైవము మీఁకు నీతఁ డనియెన్ విశ్వేశుఁడత్యున్నతిన్.”
223-క.
గిరిజాధీశ్వరు నానతి
పరఁగఁగఁ జేపట్టి భువనభరదక్షుకుఁ డై
కరుణన్ జగంబులన్ని యుఁ
బరిపాలన సేయు వీరభద్రుం డెలమిన్.”
224-వ.
అనిన విని వీరభద్రవిజయ ప్రకారంబుఁ దెలియ విన్నవించిన వాయుదేవున కమ్మహామును లిట్లినిరి.
225-క.
“వాయుపురాణాంభోనిధి
నాయక! శీతాంశుభంగి నానందకరం
బై యున్ననీప్రసంగము
ధీయుత నీచేత నేఁడు దెలిసితి మనఘా!
226-క.
శ్రీరమ్య మైన యీకథ
వారక వినువారు చదువువారును లిఖిత
ప్రారంభు లైన వారును
వారు గదా శంభు కొల్వువారు సమీరా!
227-క.
పంచాననచరితము ని
శ్చంచల భక్తిమెయి విన్నఁ జదివినఁ జాలున్
కించిన్మాత్రంబై నను
పంచమహాపాతకములు పాయు మహాత్మా!”
228-వ.
అని పలికి సఫలమనోరథు లై వాయుదేవుని స్తుతియించి” రని యివ్విధంబున.
229-క.
నాకుం దోఁచిన విధమున
నీకథఁ గైకొంటిఁ గాక నీలగ్రీవా
నీ కథమహిమాతిశయము
వాక్రువ్వఁగ నిందువశమె వనజజువశమే.
230-క.
నాకలిగిన నేరుపులును
నాకలిగిన నేరములును నాగేంద్రధరా!
నీకు సమర్పణ సుమ్మీ
లోకేశ్వర! భక్తజనకలోకాధారా!
231-మ.
ఇల యెందాఁక; సురేంద్ర పర్వతవిభుం డెందాఁక; బృందారకా
వలి యెందాఁక; రవీందుమండలములున్ వారాసు లెందాఁక; ని
చ్చలు నానందకరంబు లై త్రిజగతిం సంధిల్లు నందాఁక; ని
ర్మల మై యీకథ సర్వలోకనుతమై మానిత్యమై యుండెడున్.