Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-4/మణిప్రవాళము/నవ్వు

వికీసోర్స్ నుండి

నవ్వు

'నవ్వు నాలుగందములఁ జేటు’ ఈ వాక్య మేనాఁడు పుట్టినదో! ఏ సందర్భమునఁ బుట్టినదో!! దీనివలన నవ్వవలదని మన వారి యనుశాసనము కాదు. 'బాలసఖత్వమ కారణ హాస్యం స్త్రీషువివాద మసజ్జన సేనా... షట్సు వరోలఘుతా ముపయాతి' అనిన నీతి వాక్యము వలన నకారణ హాస్యము ప్రమాదకరమైనదని యార్యులు పరిగణించిన ట్లర్థమగుచున్నది. బాలురతోఁ జెలిమి, కారణము లేని నవ్వు, స్త్రీలతో వాదులాడుట, జనసేవ, గార్దభయానము, సంస్కారవిరహితమైన భాష - యీ యారును మానవుని, జులుకనఁ జేయునఁట!

ఇతరములైన యైదింటి మాట యెట్లున్న నవ్వుమాట నమ్మఁదగినది. ప్రాకృతులు కొందఱు పెద్దపెట్టునఁ గారణవిరహితముగ నవ్వుచుండ వారిపై నర్థముగాని జాలిగలుగుట సహజము. దాని పర్యవసానమొక చిఱునవ్వు. భరింపరాని దుఃఖము ప్రౌఢమైన హాస్యముగ మారునని తాత్త్వికుల యభ్యూహము. ఈ కారణముననే మహాకవి బైరను 'నేనే ప్రాణిని గూర్చియైన నవ్వితినన నది యేడువలేక' యని యొక సందర్భమునఁ బలికినాడు.

జంతుకోటి దుఃఖ సమయముల నేడ్వగలవు; కాని సంతోష సమయముల నవ్వఁ జాలవు. సమస్త చరాచర ప్రకృతియందును నవ్వఁగలిగినది మానవుఁడొక్కడే. ఇతఁడొక్కఁడే యేల నవ్వఁగలుగుచున్నాఁడని ప్రశ్నించుకొని నీచే యను జర్మను తాత్త్వికుడు "లోకమున నతనివలె బాధపడు ప్రాణి మఱియొకటి లేదు కనుక" అని సమాధానము చెప్పుకొనినాఁడు.

ఇతర ప్రాణి లోకముకంటె మానవుని యాధిక్యమును నిరూపించు నుపపత్తులలో నవ్వు గణనీయము. ఇది మానవజాతికి సర్వసామాన్య మయ్యును దీని తత్త్వము నొక జాతివారు గమనించినట్లు మఱియొక జాతివారు గుర్తింపలేరు. చైనా జాతివారు చెడువార్త వినినపుడు చింతించుటకుఁ బ్రతిగ నవ్వెదరఁట! మరణవార్తలు వినినపుడు మిథ్యావిషాదమునైన బ్రకటింప వలసియుండ బంధువర్గములకు శవపేటికల నిచ్చి బహూకరించుచు విలాసములఁ దేలి యాడెదరఁట!! రష్యను జాతివారు తమ్ముఁ

దాము పరిహాసమొనర్చుకొనఁ గలరఁట!!


వ్యక్తిపరముగ నాలోచింపఁ గొందఱు స్వల్పమునకైన నవ్వెదరు. కొందరెట్టి విశేషము గోచరించినను నవ్వలేరు. కొందఱు నవ్వుట తమ ప్రౌఢిమ కొక లోపమని భావింతురు. అట్టివారినిఁ గనినపుడు "అయ్యో! వీరు దుఃఖమును నిర్లక్ష్యము చేయఁగల హాస్యము నవగత మొనర్చుకొనుట లేదే!" యని కరుణ కలుగును. అతిగ నవ్విన వారిని గనినను, నవ్వనిచ్చగింపనివారు గనినను నిరువురకు దాని తత్త్వము బోధపడలేదని యర్థమగును.

నవ్వు హృదయ దుర్గమునకు ద్వారము. తన్మూలమున వ్యక్తి హృదయ మెట్టిదో తేటపడఁగలదు. ఈ కారణముననే మహాకవి గోథె “యెవ్వరినైన నవ్వదగ్గ వస్తువు లెవ్వియని ప్రశ్నించి యతఁడిచ్చు సమాధానములఁ బట్టి యతఁడెట్టి వాఁడో నిశ్చయింపవచ్చును. మానవ స్వభావ నిరూపణమునకు నవ్వుకంటె మఱియొక నమ్మకమైన సాధనము లే” దనినాఁడు.

ఈ సందర్భమునఁ 'బసిపిల్లల గులాబి లేనవ్వుల భరింపలేని వాని గుఱించి భద్ర' మనిన యొక తాత్త్వికుని ప్రవచనము విశేషముగ గమనింప యోగ్యమైనది. అట్టి మానసిక ప్రవృత్తిగల వాఁడెట్టి క్రౌర్య, నైచ్యములకైనఁ బాల్పడఁ గలఁడని యతని అభిప్రాయము.

నవ్వుకు విలువ కట్టుట కష్టము. అందుకుఁ గల కారణమది యనంతమగుటయే. ఈ విలువ నవ్వు వాని శక్తిని బట్టియు, సమయమును బట్టియు, స్వీకరించు రసికుని హృదయ సౌశీల్యమును బట్టియు మాటిమాటికి మారిపోవుచుండును. నవ్వునకుఁ జరిత్ర పుట్టియున్న నెంత బాగుండెడిది! ఆ చరిత్ర నించుక యూహించిన నెందఱు 147[1] క్లియోపాత్రల నవ్వులు స్నిగ్ధహృదయులైన సమ్రాట్టులఁ బ్రేమపాశబద్ధులఁ గావించినవో! ఎందఱు గురుదేవుల చిన్మయ హాసములు విజ్ఞానాభిలాషుల మనోంబుజముల వికసింపఁ జేసి యనంత జ్ఞానోపదేశ మొనర్చినవో!! ఒక న వ్వూషర క్షేత్రమును నుజ్జ్వలోజ్జ్వల మహా సామ్రాజ్యముగ దిద్దియుండును! ఒక నవ్వు మహిమోపేతోద్యానమును మరుభూమిగ మార్చియుండును!! ఒక దేవత శరదిందు వికాస మందహాస! మఱియొక దేవత కరాళ దంష్ట్రావికటాట్టహాస!! చిఱునవ్వు చిన్మయమైనది. హాస మసహ్యకరమైనది. అట్టహాసము భయంకరమైనది. వికటాట్టహాసము ప్రళయభీకరమైనది. నవ్వున షడ్విధ విభేదముల

భారతీయులు గమనించినారు. 'స్మిత మిహ వికసిత నయనం, కించి ల్లక్ష్యద్విజంతు


హసితం స్యాత్, మధుర స్వరం విహసితం సశిరః కంపస్మిత ముపహసితం, అపహసితం సాక్షం విక్షిప్తంగమ్' అని సాహిత్య దర్పణకారుఁడు. అతని మతమున మొదటి రెండును నుత్తమములు, కడపటి రెండు నధమములు. బౌద్ధులు వీనికి మఱి రెంటిని చేర్చి నవ్వెనిమిదివిధము లనినారు.

వయస్సునుబట్టి, వారి సాంఘిక స్థితిగతులను బట్టి నవ్వు నెన్ని రీతులనైన విభజింపవచ్చును. స్థూలముగ నవ్వు సర్వసామాన్య మానవ సంఘమున నుదాత్తానుదాత్తములనెడి ద్వివిధ విభేదములతో నొప్పుచున్నది. సంభాషణ సందర్భముల నుదాత్త వర్గములం దుత్తమహాస్య మనుదాత్తమును జయించినట్లు కన్పించును. కాని సర్వసామాన్యముగ దీనికి వైపరీత్యమే లక్షణము. ఇందువలన నుత్తమ హాస్యము కరుణాత్మకమై యుండుననియును, నీచహాస్య మల్పత్వము వలన జన్మించు ననియు నొక తాత్త్వికుఁడభిప్రాయమి చ్చినాఁడు.

మంద యర్థము లేని నవ్వు నవ్వును, ఉదాత్తవ్యక్తి యుత్తమ హాస్యమునకే దీర్ఘముగ నిశ్శ్వసించును. ఘనహాసములకు నిశ్శ్వాసము తోఁబుట్టువు. ఆనందకరమగు హాసమా భావుకుఁ డూహించినరీతి దయార్ద్రహృదయము నుండిగాని బహిర్గతము కాదు. ప్రపంచమున నిత్యమును నవ్వు నవ్వులలో నుత్తమమైన జాతికిఁ జేరినవి మిక్కిలి యరుదుగ నుండును. ఇట్టి వైచిత్రి నెఱిఁగినవాఁ డగుట వలననే థాకరీమహాశయుఁడు 'ఒక మంచినవ్వు గృహమునకు భానూదయ' మని యనవలసి వచ్చినది. బుద్ధిని గిలిగింతలు పెట్టఁగలిగిన నవ్వుకంటె రమణీయమైన వస్తు వే లోకమున నున్నది? 'లలితమైన హాస్యము జాతి కుపనిషత్తు వంటిది' ఇది సూత్రప్రాయముగ సునిశితముగ విజ్ఞానమును బ్రసాదింపఁగలదు. దీనియందే జాతి మానమర్యాదలు నుచ్చనీచలు హావభావములు ప్రతిఫలించుచుండును. ఒక జాతి హయహేషితమును బోలి నవ్విన దాని హృదయకాఠిన్యమును గూర్చి, ప్రాకృతస్థితిని గూర్చి వేఱుగఁ బలుక నగత్యము లేదు. నవ్వలేక జంతుకోటివలెఁ గేవల మేడ్వఁగలిగిన నా జాతి మరణస్థితి ననుభవించుచున్నదన్న మాట!

నవ్వునకు శబ్దమున్నది; రూపమున్నది. అందుచే నది కనుపించును; వినిపించును. నవ్వులలో మధురమైనది విమలమైనది కన్యకల ముగ్ధహాసము. ఇట్టి కమనీయహాసమును గని మనమునఁ జొక్కి డిక్విన్సీ యొకమాఱు 'సృష్టిలో నున్న

మధుర కలధ్వనులలో మంజులమైనది కన్యకల కమనీయహాస' మనినాఁడు.


కనుపించు నవ్వులలో 'నానందసూత్రార్థముల నన్వయించు తపస్వి' పసిపాప చారుస్మితహాస ముత్తమోత్తమమైనది. విందు సందర్భముల హాస్యచతురుల సంభాషణ నైపుణ్యమువలన వినిపించుచుఁ గనుపించు హాస్యములు కేవల 'స్వరమేళలు'. అన్నిటికి నేకాన్వయము గోచరించును.

నవ్వు వలనఁ గలుగు ప్రయోజనముల గుర్తించిన వ్యక్తి నవ్వుటకుఁగాని నవ్వించుటకుఁ గాని వెనుదీయఁడు; హాసమును దృణీకరించి శిలాప్రతిమయై 'శిష్ఠుఁడ' ననుకొనఁడు. జగత్తత్త్వము నవగత మొనర్చుకొని యాలోచించువానికి విషాదాంత రూపకముగ ననుభవించువానికి నది యొక హాస్యనాటకముగ నెసఁగును.

మానసిక శాస్త్రవేత్తలు నవ్వునకు మూలకారణము సంతోషమనిరి. అగుచో మనకు నవ్వు గల్గించు నంశము లన్నియు సంతోషప్రదములు కావు. వికార వేషములు, విపరీత చేష్టలు, విరుద్ధభాషలు మనకు నవ్వు పుట్టించుట లోకానుభవము. నాటక రచయితలు విరూపములగు పాత్రల సృజించి వారి రూప చేష్టాదికముల మూలమునఁ బ్రేక్షకుల నవ్వింతురు. పరిహాసకులు నీ మార్గమునే యనుసరించి యన్యులకుఁ బ్రమోదము కల్గింతురు. కావున నవ్వు కలుగవలెనన్న నాంగి కాహార్య వాచి కాభినయముల నెటనో యొకట 'వికార' ముండి తీరవలయును. అందువలన సాహిత్యదర్పణకారుఁడు 'వికృతాకార వాగ్వేష చేష్టాదే ర్నర్తకాభవేత్ హాస్య' మని హాస్యస్వరూపమును నిరూపించినాఁడు. వాగంగాది వికారాదులను జూపుటవలనఁ బ్రేక్షకులలోఁ బుట్టిన చిత్తవికారరూపమైన వృత్తివిశేషమే హాసమని 148[2]పండిత జగన్నాథరాయలు 'వాగంగాది వికార దర్శన జన్మా వికాసాఖ్యోహాసః' అనుచోట వ్యక్త మొనర్చినాడు.

కొందఱు మానసిక శాస్త్రవేత్తలు దీనికి భిన్నముగ వికృత వస్తువులను జూచుట వలనఁ గలుగు హృదయవేదనను వెలికి రానీయకుండుటకో, లేక మఱచుటకో నవ్వు పుట్టుచున్నదని నమ్ముచున్నారు.

మనస్సు క్లేశమునొంది యున్నవేళ నే చమత్కృతినో యొనర్చి నవ్వించెడి వ్యక్తి యెవరైన వచ్చిన నెంత బాగుండుననిపించును. అట్టిస్థితియందు నవ్వు పుట్టించు వస్తువులు కన్పించిన నొక్కించుక శాంతి చేకూరినట్లు తోఁచును. దీనినిబట్టి యొక విధమగు శారీరక మానసిక వ్యథలనుండి యుద్ధరింపగల శక్తి నవ్వునకున్నట్లు ద్యోతకమగుచున్నది. వాయుకోశములఁ బరిశుభ్ర మొనర్చుట, క్రమముగ

రక్తప్రసరణము సాగునట్లు చూచుట, నవ్వునకుఁ దెలియునని వైద్యశిఖామణుల


యభిప్రాయము. నవ్యత్యద్భుతము నత్యావశ్యకమునైన వ్యాయామము. జీర్ణశక్తి నభివృద్ధినొందించు హరీతకి. 'మౌనేన భోక్తవ్యమ్' - అను సిద్ధాంతము ననుసరించి శిష్టులుకాని యితర సంపన్న గృహస్థు లీ కారణముననే భోజన వేళల హాస్యచతురులను బంక్తిపావనులు కిచ్చునంతటి గౌరవమిచ్చి ప్రక్కనఁ గూర్చుండబెట్టుకొనుచున్నారు. ఇట్టి యాచార మాంగ్లదేశము నందునున్నది. ఇది వైద్యశాస్త్ర సమ్మతమైనదని యొక యాంగ్లరచయిత యనినాఁడు. మౌనమున భోజనమొనర్చు శిష్టులితర వేళల విదూషక విప్రవినోద వికటకవుల హాస్యచతురోక్తుల నోలలాడి శరీరారోగ్య మును గాపాడుకొనెదరు.

హృదయపూర్వకముగఁ గొంతకాలము నవ్విన పిమ్మట నెంతటి తీక్ష్ణభారమునైన వహించుటకు శరీరముగాని, మనస్సుగాని వెనుదీయకుండుట యనుభవపూర్వకమైన యంశము. ఇందుకు మూలకారణము నవ్వునకుఁగల యప్రతిమాన శక్తి సామర్థ్యములగుట యనామృష్టమగు నభిప్రాయము.

శిశువులు భీతిని గుప్తమొనర్చుటకు నవ్వుదురఁట! ఇతఃపూర్వము వారనుభవింపని యనుభూతిని బొందుట వలనఁ గలుగు నవ్వు భయమూలక మని మానసికవేత్త లూహింతురు. బిడ్డలఁ దొలుత నిశ్రేణిక నెక్కించినను, బిల్లిమొగ్గల వేయించినను గలుగు నవ్విట్టిది. ఎట్టి యెడుదొడుకులు లేక జీవయాత్రలో మధుసాంయాత్రికుఁడై వ్యవహరించు వ్యక్తి ముఖము సర్వకాల సర్వావస్థలయందును వికసిత పుష్పాకృతిని విలసిల్లును ప్రాప్యయోగ్య వస్తువులఁ బొందువేళఁ బడు నుత్కంఠయు నొక్కొక్కవేళ హసనకారణమగును. అల్పపరాభవముల, నల్పాపజయముల జితునకు, జేతకు నవ్వు కలుగుట సహజలక్షణము, ఒక పదమునకుఁ బ్రయోక్త యనుకొనిన యర్థముగాక భిన్నార్థము గోచరించినను, గౌణవృత్తిచేఁ శబ్దప్రయోగ మొనర్చినను నవ్వు గలుగుట కొన్ని సందర్భముల మనము గమనించుచుంటిమి. బాల్యచేష్టలు జ్ఞప్తికి వచ్చినయెడ నర్థరహితము లగు కృత్యములని నాని నవజ్ఞ యొనర్చుచుఁ బ్రౌఢవ్యక్తి యేకాంతమున మందస్మిత మొనర్చును. 'పిచ్చియద్దము'లఁ జిత్రవిచిత్రములైన నిజరూపములఁ దిలకించినపు డెంతటివానికైన హాసముద యింపకపోదు. విచిత్ర ధ్వనులు వినఁబడుటవలనను నవ్వు పుట్టును. అలవాటుపడిన యాకారప్రకారములు నలవాటులు కనిపించునపు డాశ్చర్యముతోఁబాటు మందహాసములు జన్మించుటయుఁ బరిపాటి.

పండితపరిషత్తులఁ బ్రసక్తి లేక ప్రవేశించిన వ్యక్తి 'బదరీఫలతరువు క్రిందఁ

గూర్చొనిన యంధునివలె' నవ్వును. ఇట్టినవ్వు తన లోపమును గప్పిపుచ్చుకొను


యత్నమని మానసికవేత్తలందురు. మనను మనము గీరుకొనినపుడు హాస్య ముద్భవింపదు; ఇతరులు గీరిన నవ్వు పుట్టును. ఇది మానసికమైనది. శారీరకమైన సర్వకాల సర్వావస్థల నిది యుండితీరవలయును గదా!

నవ్వును గూర్చి నానాసిద్ధాంతములు బయలుదేరినవి. మానవుఁడు నిత్యజీవితమునకుఁ గొంతశక్తిని వినియోగించును. అంతకంటే మిక్కుటమైన శక్తి యతనియందు నిగూఢమై యున్నది. అట్టిశక్తి కొన్ని కారణముల వలనఁ బొంగిపొరలుటచే నవ్వు కలుగుచున్నదని 149[3]హెర్బర్టు స్పెన్సరను తాత్త్వికుని యభిప్రాయము. ఒక పట్టుపై వ్యవహరించు మనస్సునకుఁ గొంతగ శ్రమ తగ్గించుటయే దీని ప్రయోజనమని యతని యూహ. అన్న స్నాయువుల నించుక సడలించుటయే దీని ప్రాధాన్యమన్నమాట!

బాలబాలికలు స్వేచ్ఛానుభవములతోఁ గ్రీడించుచుఁగిలకిల నవ్వుచుందురు. ఇట్టి నవ్వుపై తాత్త్వికుని యభిప్రాయము ననుసరించి యధికశక్తిని బహిర్గత మొనర్చుట యనుట పొసఁగదు. మానవుడు కేవలము యంత్రమువలె శ్రమించు కాలమునను నవ్వు కలుగుచున్నది. ఇటువంటి నవ్వులవలన నొకనియమము, సాంఘికనీతి కలుగుచున్నదని 150[4]బెర్గసన్ అభిప్రాయము. ఇతని యభిప్రాయమును గ్రహణ యోగ్యమైనది కాదు. నవ్వు కేవల మధికశక్తి నిరూపకమనిగాని, సంఘనియమమని గాని, యంగీకరించిన దానిని సహజావబోధముగ గమనించుచున్నామన్నమాట!

నవ్వు సహజావబోధము కాదు. దీనికి సాంఘికమైన సమ్మతి యవసరము. ఒక సంఘము నవ్వినట్టు మరియొక సంఘము నవ్వదు. ఒక సంఘము చూచిన నవ్వువచ్చు వస్తువుల నాచారములఁ జూచి మఱియొక సంఘము నవ్వదు. పరిహాస యోగ్యములైన వస్తువులను, పాత్రలను నవ్వు బహుకాలానుభవమును బట్టి నిర్ణయించును. ఇందుకు జనశ్రుతి యాధారము. జనశ్రుతి మూలమున నర్థమొనర్చుకొనిన హాస యోగ్యమైన పాత్రలు వస్తువులు కనుపించి నపుడు పూర్వవిజ్ఞాన మూలమున నవ్వు కలుగును. హాస్యమును గూర్చి యెట్టి సిద్ధాంతమొనర్పవలసినను నాద్యముగ గమనింపవలసిన దీ సాంఘికాంగీకారము.

ఇతరుల యసభ్యతావ్యక్తతలఁ జూచిన మనకు హాస్యముదయించుటచే నవ్వు మన యాధిక్యమును నిరూపించునొక సాధనమని కొందఱి యభిప్రాయము. కొందఱు సామాన్య జనులకంటె నున్నతులమని నిశ్చయ మొనర్చుకొనినవారును, సత్యమున

కధికులైనవారును బ్రాకృతజనముతోఁ బాటు సమస్త సందర్భముల శ్రుతిగలిపి


నవ్వలేరు. అట్టివారిని జూచి సామాన్యజనము భయపడుట, యసహ్యించుకొనుటయు సహజము.

శరీరమునకును నవ్వునకును సన్నిహిత సంబంధమున్నది. నవ్వు శారీరకమని నమ్మిన శాస్త్రజ్ఞులు నున్నారు. సాంఘికాంగీకార మననేమో యెఱుఁగని పసికందులు కపోలముల ముట్టినంతనే పెద్దపెట్టున నవ్వుదురు. ఇది నవ్వు శారీరకమని వాదించు వారికిఁ బ్రబలబలము. సంఘమువలనఁ గలుగు బాధలనుగాని, తదితరములైన వ్యక్తిగతబాధలనుగాని యపనయించుట నవ్వు సహజముగఁ జేయు పనికాదని వీరి వాదము.

అయిన వారు మానవుఁడు బాధను బోగొట్టుకొనుట కొకసాధనముగ నవ్వు నుపయోగించుకొనుచున్నాఁడను నంశమున నితరులతో నేకీభవింతురు. మానవుఁడు నవ్వను సాధనమునకు సురమ్యమగు రూపమును సృష్టించి దానికిఁ గళాత్మకమగు జీవనమును బోసి వివిధరీతులలో నుపయోగించు చున్నాఁడు. అందువలనఁ బ్రపంచమున వివిధదేశముల వివిధ సాంస్కృతిక ప్రవృత్తులలో నున్న మానవునకు సాధనమైన నవ్వును ననంతరూపముల నొందినది. ఒక్కొక్క విభేదమొక్కొక్క జాతికిఁ బ్రాణము పోయుచున్నది. నవ్వు ప్రాణినుండి ప్రాణికిఁ బ్రాకు నంటువ్యాధియైనను నా విభేదము నచ్చకున్న వ్యక్తి నవ్వఁడు.

ఇతరులు నవ్వుట వినినను, కనినను సామాన్యవ్యక్తి యా ప్రవాహమునఁ బడి యందు బాల్గొనును. ఉత్తముఁడు, సుఖి పెద్దపెట్టున నవ్వడు; చిఱునవ్వులఁ జిలుకరించును; అందముగ నధరాస్ఫాలన మొనర్చును. కనీనికల మిలమిలలతోఁ దనకుఁ గలిగిన కమనీయానందమును వెల్లడిచేయును.

అందఱు గాఢముగనో లేక గూఢముగనో నవ్వగలరు. కాని యందఱును నవ్వింపఁజాలరు. ఇందుకుఁ జతురులు కాని వారు నిష్ప్రయోజకులు. తాను నవ్వులపాలగుచు నితరుల నవ్వింపఁగల నేర్పు హాస్యరసప్రియున కున్నది. ఉత్తమహాస్యరసజ్ఞుఁడు వికారరూపముల ధరించి వికృత చేష్టలనొనర్చి యితరులు నవ్వింప యత్నింపఁడు. వికారముల వలనఁ గలుగునవ్వు నవ్వుకాదు. కేవల వికారములసహ్యకరములు. సరసోక్తి, నర్మోక్తి, ఛలోక్తి - ఇత్యాది విశేషోక్తుల నుత్తమరసికుఁడై హాస్యరసప్రియుఁడితరుల కానందామృతమును బంచిపెట్ట

యత్నించును. సంఘమునందలి లోపముల శక్తిమంతమైన తన చతురహాస్యములతో


విమర్శించి, సంస్కరించి నీతి నుపదేశింపఁ బూనుకొను హాస్యజ్ఞులును నుందురు. హాస్యప్రియులకుఁ బ్రతివస్తువును, బ్రత్యంశమును, హాస్యరసాంతర్భూతమై దర్శన మొసగును. అతని చమత్కార ప్రియమైన దృష్టిపడిన ప్రతి వస్తువును బ్రత్యంశమును హాస్యరసోత్కరమై యెప్పును.

ఉత్తమమైన హాస్యమున కుత్తమమైన సంఘ ముండితీరవలయును. సంఘమునందలి సంస్కృతి ననుసరించి హాస్యరసజ్ఞులుత్తమ మధ్యమాధమ హాస్యములతో సంతృప్తిఁ బొందించుచుందురు. తిట్టుకవితల, వికటకవిత్వములఁ బ్రాకృతమునఁ బరిభాషలఁ జెప్పుకొని యానందించు జాతు లనాగరకము లనుట యనుచితము కాదు.

వెక్కిరింపు నవ్వు కాఁజాలదు. 'లలితమైన హాస్యము జాతికి వ్యాఖ్యాన' మని యొక తాత్త్వికుఁ డూహించినాఁడు. నిజము. అది సంఘమునందలి సుఖదుఃఖముల మానమర్యాదల నాచారవ్యవహారముల సున్నితముగ విమర్శించును గదా! సరసోక్తి చతురుఁడైన హాస్యజ్ఞుఁడతని యుక్తి నెవనిపైఁ బ్రయోగించునో యతనిఁ బైకి నవ్వించినను హృదయమున గిలిగింతలు పెట్టి మార్పఁగల శక్తి సంపన్నుఁడై యుండును. 'హాస్య-గంధోళిగాఁ' డట్లుగాదు. ఎదుటివాని కెట్టి ప్రయోజనమును జేకూర్చ లేకుండుటయే గాక తనపైఁ గ్రోధము నసహ్యమును గల్పించుకొని యపకీర్తి పాలగును.

151[5]భరతాచార్యుడు 'శృంగారానుకృతి ర్హాస్యం' అని ప్రవచించినాఁడు. శృంగారము ననుకరించుటయే హాస్యము. ఇట ననుకృతియన్న సాదృశ్యము కాదు; సాదృశ్యము ననుకరించుట వలన నేర్పడిన వైరూప్యము. సంస్కృతనాటకము లందు సర్వసామాన్యముగ శృంగారనాయకులైన ధీరలలితుల ననుకరింపఁబోయి విదూషకులు వైరూప్యమును బొంది ప్రేక్షకులకు నవ్వుఁ బుట్టించు చుందురు. 'విశేషేణ దూషయతీతి విదూషకః' అను వ్యుత్పత్తి మూలముననే వీరనుకృతులు గారనియు వైరూప్యులనియు వ్యక్తమగుచున్నది. వికృత వేషభాషా చేష్టాదుల వలన వీరు హాస్యరసపోషణమును జేయుచు నాయకులకుఁ బ్రతియోగవ్యక్తులై బ్రవర్తిల్లుచుందురు. సంస్కృత నాటకములలోని విదూషకులు సర్వసామాన్యముగ నాలస్యావహిత్థ నిద్రాదుల వలన నవ్వుబుట్టింప యత్నింతురు గాని, హృదయమును గిలిగింతలు పెట్టింపఁగల

చిన్మయహాసముల సృజింపశక్తి గలవారు కారు.


కొందఱు సుప్రసిద్ధనాటక రచయితలు తమ విదూషకులకు విపరీతమగు మేధను బ్రసాదించినారు. ఇందుకుఁ బ్రథమ కారణము వారు సంఘవిమర్శకు లగుటయే యనవచ్చును. మహాకవి కాళిదాసు శాకుంతలములోని విదూషకునిచే 'నేను మృత్పిండ బుద్ధి' నని యనిపించినాఁడు. ఇట్టి యాత్మవిమర్శ విదూషకులకు సహజము. అందుమూలముననే వీరు తమ్ముఁదాము విమర్శించుకొని యవహేళనఁ జేసికొనఁ గలుగుట తటస్థించుచున్నది. ఈ కారణమున విదూషకులు లోక సామాన్యమైన భ్రమప్రమాదములకు లోనుగాని జిజ్ఞాసువులు. సత్యాన్వేషణపరులైన విజ్ఞానభిక్షార్థులు. విజ్ఞానాధి దేవతయైన విఘ్న రాజు హాస్యరసప్రియుఁడు. హాస్యరసాధి దేవత. సిద్ధి బుద్ధియను భార్యలఁ గలిగియు నస్థలిత బ్రహ్మచారి. తన తల్లిదండ్రుల వివాహ వేళయందును విఘ్న నాయకుఁడు తన్నుఁ గొల్పించుకొనిన విచిత్ర దైవతము!

జిజ్ఞాసువు నిత్య జీవితమున కించుక దూరమునఁ గూర్చుండి యోచనానిమగ్నుఁడై కనుఁగొనిన నది యొక హాస్యరూపకముగఁ గన్పించును. అందవహేళనలు నతనికి గోచరించును. అతనికి జీవయాత్ర సమస్తమును మందబుద్ధు లొనర్చుకొనునొక విందుగఁ గన్పట్టును. అతఁడు దీనిని బరిహరింపనుంకించును.

పరిహాసకుడందే యుండి విమర్శించుచు సత్యనిరూపణ మొనర్చుటకు శాయశక్తుల యత్నించును. ఈ మహత్తర కార్యమున నతనికి మనోజ్ఞ సాధనము లాశాభంగము నొందిన వ్యక్తులు, ప్రాణులు. వారి జీవితములు అనుకొనినట్లు జరుగక పోవుటయందును హాస్యముత్పన్న మగుచున్నది. జగమునఁ 'దానొకటి దలచిన దైవ మొకటి తలఁపకున్న’ విమర్శనకు స్థానమెక్కడిది? హాస్యమున కాధార మెక్కడిది?

అనేక జాతులయందుఁ బుట్టిన హాస్యరూపకములలో నాయాజాతుల యాచారవ్యవహారములలోని కాఠిన్యము, నిర్దయ, నిష్ప్రయోజకత, వైరూప్యములు విదూషకుల మూలమునఁ బరిహాసపాత్రములగుచుండును. సత్యమునకు దూరదూరముగ గమించు వ్యక్తులిట్టి రూపకములఁ బాత్రలగుచుందురు.

'మొట్టమొదటి నాగరిక స్త్రీ ప్రియుని భుజబంధమున నొదిగి పిమ్మట తెలివి నొంది నా దుస్తులు నలి' గిపోయిన వనుకొనుటలో సాంఘిక హాస్యరూపకములు జన్మించియుండునని యొక నాటకసాహిత్యవేత్త పలికినాఁడు. ఇట హాస్యము శృంగార రసము నంటిపెట్టుకొని యుండుటచేఁ బుట్టినది.

భరతాచార్యుఁ డీ కారణముననే 'శృంగా రాద్ధి భవేద్ధాస్యం' అని ప్రవచించినారు.

మిగిలిన రసములను హాస్యమంటిపెట్టుకొని యున్నట్లుఁ జూపుట కష్టము కాదు.


కాని హాస్యమునకు శృంగారముతో నున్నంత సన్నిహితసంబంధము తక్కిన రసములతో నున్నట్లు కన్పింపదు. శృంగారము రసరాట్టు. ఇది సమస్తవస్తు సమన్వయ మొనర్పఁ గలిగినది. ప్రకృతి పురుషుల యేకత్వము నీ రసమే నిరూపింపఁ గలుగుచున్నది. హాస్యము దానికి వైరూప్యము. పృథగ్భావము నాశ్రయించి యీ రసము సచ్చిదానందునైన విమర్శింపఁగలదు. 'హాస్యరస దృష్టితోఁ బరికించిన నుత్తమ విజ్ఞాననిలయములైన యుపనిషద్వాక్యములు సహితము పరిహాసపాత్రములు కావచ్చును. విమర్శ హాస్యమునకు జన్మభూమి. అందువలననే మహాకవి మిల్టన్ హాస్యము 'జ్ఞానప్రదాత్రి' యనినాఁడు.



అనుబంధము

పుష్పలోకము



1. అతని సరస - కవిర్హి మధుహస్తయః అని శ్రుతి.

2. సత్యరథమునకు - కవి ఋతస్య పద్మభిః అని ప్రమాణము, బుద్ధత్వము
    బౌద్ధులకు నిర్యాణము చరమసిద్ధి. ఇదియే బుద్ధత్వము.

3. సాత్మ్యములు : సహజలక్షణములు; శతపత్రములపై కాళిదాసు మేఘ. సం.
    1, శ్లో. 22.

4. నిఋతి దిగ్వాయువతి - శ్రీ విశ్వనాథ ఋతుసంహారము బ్రహ్మ విష్ణు
   మహేశ్వరులు - మహాకవి భర్తృహరి శతకత్రయిలోని శృంగార శతకమును
   "శంభు స్వయంభు హరయో హరిణేక్షణానాం, యేనా క్రియంత సతతం గృహ
   కుంభదాసాః, వాచామగోచర చరిత్ర విచిత్రితాయ తస్మై నమో భగవతే
   కుసుమాయుధాయ” అను శ్లోకముతో నారంభించినాఁడు.

5. శంకరపూజ్యపాదులు : అద్వైతమతస్థాపనాచార్యుఁడైన యాదిశంకరుఁడు

6. నిర్భిర్త్సిత - కాళిదాసు కుమార, సం. 3, శ్లో. 53

7. ప్రౌఢభావ ప్రపూర్ణలౌ' - ఒకకూరా కాకుజా (జపాన్ రచయిత) Book of Tea
   నుండి గృహీతము

8. వినఁబడెను సంగీతము : Heard Melodies are sweet and those unheard off
   are sweeter still - Keats 'ode to a Grecian Urn' ఒక యాంగ్లకవి - వర్డ్సు వర్తు
   (క్రీ.శ. 1770-1850). సుప్రసిద్ధాంగ్ల ప్రకృతి కవి; త్సిన్ చక్రవర్తి: చైనా
   సార్వభౌముఁడు

9. పరిపూఁదోటలు : వసుచరిత్ర ఆ.1, ప. 108

  1. 147. క్లియోపాత్రా అంటోనీనిఁ బ్రేమపాశబద్ధునిఁ గావించిన సుందరి
  2. 148. పండిత రాయలు - రసగంగాధరాది గ్రంథకర్త; క్రీ.శ. 15వ శతాబ్ది సుప్రసిద్ధ పండితుడు
  3. 149. హెర్బర్టు స్పెన్సర్ - (క్రీ.శ. 1820-1903) ఇకానమిస్టు సంపాదకుడు, ప్రత్యేకతత్త్వ నిరూపకుఁడు. His system of philosophy is based upon the principle that all organic development is a change from homogeneity to heterogeneity.'
  4. 150. బెర్గసన్ - ఒకానొక యాధునిక యూరప్ దేశ తాత్త్వికుఁడు:
  5. 151. భరతాచార్యుఁడు - నాట్యశాస్త్ర కర్త.