వావిలాల సోమయాజులు సాహిత్యం-4/మణిప్రవాళము
విషయసూచిక
17 |
26 |
39 |
47 |
58 |
70 |
79 |
88 |
నవమణి
మాతృశ్రీ మాణిక్యాంబిక పవిత్ర స్మృతికి
తే. ఏడుపే నీకు నేనాఁడు తోడు కాఁగఁ
బదియు నార్నెల లేనియుఁ బైనఁబడని
నన్ను నీ చేత నిడి చనినాఁడు నాన్న
సాకినావు శిక్షించి ప్రశస్తగతిని.
తే. అకట! దారిద్య్ర మొక్కట, వ్యాధి యొకట
బాధ వెట్టఁగ నెట్టులో పడుచు నన్నుఁ
గనుచు జీవించినావు రాక్షసపుఁదమిని
ననుభవించిన దణుమాత్రమేని లేక.
తే. నేనె యన్నను, దమ్ముఁడ నేనె, చెల్లి
యలును నక్కయు నైన నా కైతి వమ్మ
విందరను జూచుకొన్నాఁడ యేను నీలో;
ఈవు లేకున్న నాకు వీ రేరు లేరు.
తే.శబ్దములయర్థ మొక్కింత, చదువనేర్తు
నైన నప్పుడు తల్లిప్రేమనిన నేమొ
యెఱుకపడనిది నేఁటి యా రేండ్లలోన
నెన్ని రూపాలతోఁ దోఁచి నన్నుఁ గలఁచె.
తే.లోకమున కేమి కాకులమూఁక కాదె?
ప్రథలఁ గల్పించే మఱచె నిన్ పరమచరిత !
యెఱుఁగు దేగతి భక్తి సేవించినామొ
యీవు లేని లోపాన మా కెంత దిగులొ!
తే. ఎవరిఁ గనుఁగొన్న నేమిటో యెఱుఁగ నమ్మ!
యేను ఋణపడి నట్లుగా నెంతు రేల ?
రక్తమును బిండి యిచ్చిన రక్తిఁ గొనని
చెడుగు సాహుల కడ నప్పుఁ జేసినామె!
తే. అమ్మ! అపుడు నీ వేఁగినయంతనుండి
చిన్ని మనతోఁటలోనఁ దోఁచినవి మూఁడు
లేగులాబీలు; ఏ రేయొ యేఁగుదెంచి
విరిసి వాసనలలమ దీవించి పొమ్ము!
తే. అప్పు డప్పుడు స్వప్నాల నవతరిల్లి
మనసుపడి నీదు మనుమల మనుమరాండ్ర
నెత్తి ముద్దాడి శీలమ్ము నింతనేర్పి
యరుగు మోతల్లి ! యదియె మా కౌను మేలు.
తే. సప్త సంతానములఁ గృతి శాశ్వతంబు
స్వర్గసౌఖ్యప్రదం బన్నపలుకు నమ్మి
యమ్మ! నీ కిచ్చుచున్నాఁడ నంకితమును
జెప్పి స్వర్గనిత్యనివాససిద్ధి కొఱకు.
కృత్యాది
ఛందోబద్ధములైన కావ్యము లవతరించిన పిమ్మటనే సాహిత్య లోకమున గద్యకృతు లుత్పన్నములైనవి. ఈ వాక్యము ప్రపంచము నందలి సర్వసాహిత్యముల పట్ల నన్వయించు నొక సుసత్యము. దీనినిబట్టి నిత్యవ్యవహారమున గద్యము లేదని కాదు. కళా విన్యాసాత్మకములైన రసవద్రచన లీసాహిత్యవిభాగము నందుఁ బద్యమయ కృతులకంటెఁ బూర్వము పుట్టలేదని యభిప్రాయము.
“గద్యం కవీనాం నికషం వదంతి” - ఇది దేవభాషాగద్యను గూర్చిన యొక సూక్తి. ప్రాచీన భారతమున గీర్వాణవాణి యందు గద్యము బహువిధగతుల విలసిల్లినది. అలంకార శాస్త్ర గ్రంథముల వలన నాఖ్యాయి కాది పంచవిధ గద్యములుఁ బ్రవర్తిల్లి నట్లవగత మగుచున్నది. 'బాణోచ్చిష్ట మిదం జగ త్తను నాభాణకమునకు స్టానమై కాదంబరీ, హర్షచరిత్రల విశేషవిఖ్యాతి గడించుకొనిన మహాకవి బాణభట్టారకుఁ డన్యకవి పాంథగమ్యములు కాని మనోహర మార్గముల విలసిల్లి గద్యప్రపంచ స్వర్ణసింహాసన మధిష్టించియున్నాండు.
నన్నయ భట్టారక మహాకవిముఖమున నాంధ్రభాషయందాది కావ్యము చంపువుగ జన్మించినది. చంపూసరణినే పురాణ, ప్రబంధకవు లభిమానించిరి. అందుచే బహుకాలమునకుం బిమ్మటం గాని ప్రత్యేక గద్య కావ్యములు పుట్టుటకు వీలు కలుగలేదు. నేఁటికిని మహాకావ్య లక్షణములు కలిగి ప్రాచీన ప్రబంధ సరణి ననుసరించుచు శ్రవణ బెళగొళలోని గోమరేశ్వరునివలె గుండె లవియం గన్పించుఁ గద్యప్రబంధము జన్మింపలేదనుట సాహసోక్తి కాదేమో! అట్టి కృతి వినిర్మింప నొక బాణ భట్టారకుం డాంధ్రసాహిత్యావని కే నాఁ డవతరిల్లునో!!
ఆంగ్లసాహిత్యమున గద్యము బహువిధ వస్తు విన్యాస వైభవములతో విలసిల్లి విస్తరిల్లినది. దేశీయ సాహిత్యముల కా సాహిత్యముతో సన్నిహితసంబంధ మేర్పడిన పిమ్మట వీని యందును గద్యము బహువిధగతులు నొప్పుచున్నది. ఒకనాఁటి యాంధ్రగద్యకావ్యతరువు నేఁడు వివిధ శాఖోపశాఖలతో విస్తృతమై మహావృక్షరూపము నొందుచున్నది. నవలాశాఖయందు జన్మించిన 'చెలియలికట్ట' 'వేయిపడగలు' 'ఏకవీర' 'హిమ బిందు' ‘నారాయణభట్టు' 'రుద్రమదేవి' విశ్వసాహిత్యమున విశిష్టస్థాన మాక్రమింపదగిన యుత్కృష్టకృతులు. అనతికాలమున నిందుఁ గథాశాఖికను బుట్టిన పూవు ప్రపంచ ప్రథమ గణ్యమగుట యాంధ్రుల కతిముదావహమైన యంశము, విమర్శ, వ్యాస శాఖలు బహుముఖవ్యాప్తములై వర్ధిల్లుచుండుట గన నచిర కాలమున నిం దమోఘరచన లుద్భవిల్లఁగల వనుట యత్యుక్తి కాఁజాలదు.
కొలఁది కాలమునుండి నా లేఖిని గద్య మహావృక్షము నందలి
వ్యాసశాఖపై నభిమానము వహించినది. అది యా శాఖ యందలి
సర్వసామాన్యవిలాసముతోఁబాటు వినూతనము లైన విన్నాణముల
వెదకుచున్నది. ఆ యన్వేషణఫలితములఁ దొలుదొల్తఁ బత్రికా
ముఖమునఁ బ్రకటించి యాంధ్ర రసజ్ఞలోక మొనఁగిన
యపూర్వప్రోత్సాహ దోహదమున నేఁడు 'మణిప్రవాళ' రూపమునఁ
బ్రకటించుచున్నాఁడను.
నామకరణము కృత్యాద్యవస్థలలో నాద్యము. తొలుత
నప్పుడప్పుడు నీ వ్యాసముల నొక సమాహారముగఁ బ్రకటించు కోర్కెలు
వొడమి నపుడు 'శక్రచాపము', 'పుష్పలోకము', 'మణిమేఖల' మొదలగు
విచిత్ర నామములు తోఁచినవి. ఈ సమాహృతి యందుఁ గొన్ని
వ్యాసములలోఁ గిమ్మీర కాంతులు కన్పింపక పోవుటచే ‘శక్రచాపము”ను
గ్రహింపలేదు. పుష్పలోకమున నిర్గంధకుసుమము లుండుట పరిపాటి
యైనను గొన్ని వ్యాసము లట్టివగుట 'పుష్పలోకము'పై బుద్ధి పోలేదు.
మణులు కొన్ని మాత్రమగుట వలనను, మేఖలలు మోటగుట వలనను
నది తృప్తి యొసఁగలేదు. తుదకు బహుకారణముల వలన
‘మణిప్రవాళము’పై మనసు పడితిని. నా కావ్య నేపథ్య గృహభాగము నీ రీతి మీ ముందుఁ బ్రదర్శించుచున్నందుకు రసికలోకము మన్నించుఁ గాక!
గ్రంథచౌర్యబుద్ధితోఁ గాక మధ్యమమణిన్యాయము ననుసరించి
ప్రాచీనార్వాచీన భావుకుల మనోహరభావములను మనోజ్ఞచిత్రముల
నెడనెడ గ్రహించి పొదిగి స్వాయత్త మొనర్చుకొనుట యీ
సమాహారమునందుఁ గన్పించును. అవి యన్నియును మణులు, నా
యల్పబుద్ధికిఁ దోఁచినవి ప్రవాళములు. ఈ కారణమునను నీ
సమాహృతి మణిప్రవాళము.
మణిప్రవాళము ప్రాచీనమలయాళ భాషయందు మహాకవుల
నాకర్షించిన మనోహర రచనా మార్గము, సంస్కృతపద ఘటిత
సమాసభూయిష్ఠమై తుదిని దేశీయ ప్రత్యయములఁ జేర్చుట దీనికి
లక్షణము. ఇట్టి కలఁగలపు మెలపులతోఁ గర్ణాటక సంగీతమున
‘మణిప్రవాళ' మను నొక శైలియున్నది. ఇట్టి భాషాశైలీ విశేషములను
గొన్ని వ్యాసముల నిరూపించుటకు యత్నించితిని.
అలంకార శాస్త్రముల సమాసబహుళమగు నుత్కళికాప్రాయము,
నల్పసమాస యుతమైన చూర్ణిక, ఛందోనిబద్ధ వృత్తవాసనలు గల
వృత్తగంధి, సమాసరహితమైన ముక్తకము గద్యశయ్యావిభేదములుగఁ
జెప్పఁబడినవి. ప్రకరణానుకూలముగ నీ మణిప్రవాళమున నీ
చతుర్విధ గద్యరచనావిచ్ఛిత్తిని జూపించుటయే నా సంకల్పము.
మణిప్రవాళమున గొన్ని వ్యాసములు లూతాతంతు సద్మ
సదృశములు, కొన్ని 'బహులోద్యాన సంచారణ చణ షట్చరణసమానీత
పుష్పాసవ సంభృత మధుకోశ సదృశములు.' కొన్ని స్వర్ణకార సామర్థ్య
నిరూపణములు. ఈ యూర్ణనాభ, సారంగ, కళాదులకుఁ గల
ప్రతిభావ్యుత్పన్నతలలో నే సహస్రాంశము లీ రచనయందున్నట్లు
రసజ్ఞలోకము గుర్తించినచో నేను ధన్యుఁడను!
ప్రాచీనములకుఁ బ్రతిబింబములను గాని, యాధార
రహితములైన కేవలోత్పాద్యములను గాని యామోదింపని బుద్ధి యిట్టి
మిశ్రరచనామార్గనూత్నతలకు వేడుక పడినది. ఇందుఁబురాత
నాధునాతన భావుకుల రచనా స్వీకారమునఁ బ్రకరణానుకూలముగ
నేనొనర్చిన చేర్పు కూర్పులకు, మార్పులకు విజ్ఞులు మన్నించెదరుగాక!
నిద్రాళువునై యున్న నన్ను మేల్కొల్పి యిట్టి రచనలకుఁ
బురికొల్పి నాచే నీ మణిప్రవాళమును బ్రకటింపఁజేయుటకు
బహురీతుల దోహద మొసఁగిన గురువర్యులకు, నాప్తమిత్రులకు నా
ప్రణామములు, నమోవాకములు!!
వావిలాల సోమయాజులు
ఆంధ్రభాషా పండితుఁడు