వావిలాల సోమయాజులు సాహిత్యం-4/మణిప్రవాళము/చంద్రుడు - చంద్రిక
చంద్రుఁడు - చంద్రిక
సీ. [1]25"తిమిరభూతము సోఁకు దెలియ జగత్త్రయీ
లలన దాల్చిన రక్తతిలక మనఁగ
సఖ్యంబునకు నిశాశబరి యిచ్చినఁ బ్రాచి
పాటించు గురివెందబంతి యనఁగఁ
దోయధి వెడ గ్రుంకఁ దోఁచు పురందర
కుంభినీసింధూరకుంభ మనఁగఁ
గులిశాయుధుని పెద్దకొలువునఁ జెన్నొంద
దీపించు మాణిక్యదీప మనఁగఁ
తే. గుముదినీ రాగరససిద్ధగుళిక యనఁగఁ
గామజనరంజనౌషధికబళ మనఁగఁ
బొడుపుఁ గెంపున బింబంబు పొలుపు మిగులఁ
జంద్రుఁ డుదయించెఁ గాంతినిస్తంద్రుఁ డగుచు.”
ప్రాచీనకవీంద్రుని ప్రౌఢభావనాబలమున కువ్విళ్ళూరుచు బై పద్యమును మఱల మఱలఁ జదువుకొనుచుండ నొకనాఁటి వెన్నెలరేయి నా మానసమునఁ సాహిత్యవీథులఁ జంద్రాన్వేషణ మొనర్పఁ గోర్కె వొడమినది. మున్ముందనాది మానవులకుఁ బ్రతినిధులై యొప్పు జాతులలోని చంద్రకథనములు ప్రతిఫలించినవి.
"లోకమునకు నే ననినఁ బ్రాకట ప్రణయము. చంద్రికాప్రదాత్రినని జనులు నన్ను వేనోళ్ళఁ బొగడుదురు. వెన్నెల రేల 'సూత్రయజ్ఞ' మొనర్చుచు నే నొనర్చు విశ్వశ్రేయస్సును వారు వినుతింతురు. కౌముదీమహోత్సవముల విశృంఖలవిహారము లొనర్చుచుఁ బ్రజలు నా నిత్యాభ్యుదయము నాకాంక్షింతురు.”
"నా తేజమును బంచి యీకున్న నీ కీ కీర్తి యెక్కడిది? నీ స్థితికి జ్యోతిర్మ యుండ నగు నేను కారకుఁడను. నేను జగత్కారణుఁడను; జగజ్జెతను. అకారణముగ గర్వించి నా యాగ్రహమునకుఁ బాత్రురాలవు కాఁబోకుము.” ఆకాశనదీ సైకతవేదికల
యౌవనప్రాదుర్భావముచేఁ జంద్రసూర్యు లిరువును బరస్పరాధిక్యములఁ గూర్చి
వాదోపవాదము లొనర్చుకొని తుదకుఁ గలహించిరి. స్త్రీ జనసహజమగు రోషోద్రేకము హెచ్చి చంద్రాదేవి యంజలితో నెత్తి యాదిత్యుని ముఖముపై వాలుకాకణములఁ జల్లినది. సహస్రకరుఁడు దానిని భరింపఁజాలక వేయి చేతులతో సైకతమును గ్రహించి యామెపై మహత్తరశక్తితోఁ గొట్టినాఁడు. చంద్రముఖమున నీ నాఁటికి నవి నీలాంకములై నిలచియున్నవి.
చంద్రసూర్యుల కలహము తుదకెట్లో సమసి యిరువురకును సంధి జరిగినది. పరస్పర పాణిగ్రహణానంతర మా నూతనవధూవరులు గాఢానురాగముతోఁ గొంత కాలము కాఁపుర మొనర్చిరి. మఱల మనఃస్పర్ధ లేర్పడఁ జంద్ర సౌందర్య గర్వగా వునఁ దీక్ష్ణుమయూఖుని మైత్రి నసహ్యించుకొని యాతనికి విడాకులిచ్చినది. సూర్యుని వలనఁ దనకుఁ గలిన సంతానము జూడఁజాలక యామె ఖడ్గముతో ఖండించి యా ముక్కలను గగనవీథి కెగురవైచెను. అందాకసమున నిల్చినవి నక్షత్రములై భాసించు చున్నవి. నేలపైఁ బడినవి జలచరములై జీవించుచున్నవి. ఇది 25[2]ఫిలిప్పైన్ జాతివారి చంద్రసూర్య కథనము.
నీగ్రోజాతి పుక్కిటి పురాణములందు సూర్యచంద్రలిరువురును స్త్రీమూర్తులు. వారొకరి సంతానము నొకరు చంపుకొని తినుటకు సంధి జేసికొనిరి. ఇందుకు విరుద్ధముగ మాతృహృదయము గల చంద్ర మమకారముతోఁ దన సంతానమును సూర్యదేవి కంటఁ బడకుండునట్లు పవలెల్ల దాచియుంచి రేలు వారితో ముద్దుముచ్చటలు తీర్చుకొనుచున్నది. రాత్రులం దాకాశమున మిలమిలలాడు నక్షత్రములే యాచంద్రాదేవి సంతానము. ఆదిమయుగముల రవి భూమి మీఁద నివసించెడివాఁడు. 'టిట్రిరే' యను నాఖేటశ్వానమొం డతని నొకనాఁడు వెంబడించి పట్టుకొని మ్రింగివేసినది. అతని శల్యమొకటి వాయుపథమున కెగసి యట నేఁడు లవిత్రాకారమున గగ నాంగణమునందు మొఱయు చున్నది. ఇదియే వున్నమినాఁడు షోడశ కళాపరిపూర్ణుఁడైన చంద్రునివలెఁ బ్రకాశించుచున్నదనియు [3]రెడ్ యిండియన్ జాతివారి నమ్మకము. వారి నాయకుని డాలు పైఁ జిత్రితమైన చంద్రరూపమే నిశాసమయముల నభోవీథి కెగసి చంద్రికాప్రసార మొనర్చునని యొప్పోజా జాతివారి గ్రామ వృద్ధులు జానపద సాహిత్యమునఁ జంద్రునిఁ గీర్తించు చున్నారు.
[4]షింటోల చంద్రదేవతకు 'త్సుకియోమి' యని పేరు. అతఁడు వారి పరమాత్మ
యగు 'ఇజానగి' దక్షిణనేత్రము నుండి యుద్భవిల్లినాఁడని వారి నిశ్చితాభిప్రాయము.
హైంగోయనుల (చైనీయులలో నొక జాతి) చంద్రుఁడు వారి సహస్రమయూఖుని
వలె నమృతపాన మొనర్చుటయందు సమర్థుఁడు కాకపోవుటచే స్వర్గమున కేఁగుచు
మార్గమధ్యమున నిలచిన త్రిశంకువు. రాత్రులందు మాత్రమే కాంతినొసఁగు క్షపాకరుని
బట్టి కట్టి, సర్వకాల సర్వావస్థలఁ కౌముదీప్రదాన మొనర్పుమని నిర్బంధించుటకై
'త్సిన్' జాతివారి పూర్వులు మిన్నందుకొను సౌధముల నిర్మింప, నది గని యా
'త్సుకియోమి' యుగ్రుఁడై యొక ప్రళయకాలవర్షమును గల్పించి యవ్వానిని
నేలమట్టము గావించె నఁట!
'షాహూర్' మహమ్మదీయుల చంద్రదైవతము, జారచోర గూఢచారుల కితఁ డిష్టప్రదాత. గ్రీకుల చంద్రుఁడు హెలియస్ (సూర్యుఁడు), ఇవోయస్ (ఉషస్సు) లకుఁ దోఁబుట్టువు.
సీ. [5]ఒక వేయి తలలతో నుండ జగన్నాథు
బొడ్డుదమ్మిని బ్రహ్మ పుట్టె మొదట
నతని గుణమ్ముల నతనిఁ బోలిన దక్షుఁ
డగు నత్రి సంజాతుఁ డయ్యె నత్రి
కడగంటి చూడ్కులఁ గలువల సంగడీఁ
డుదయించి విప్రుల కోషధులకు
నమర ధరాతతి కజుని పన్పున నాథుఁ
డై యుండి రాజసూయంబు సేసి’ -
మూఁడులోకముల జయించినట్లు మన భాగవత పురాణము పల్కుచున్నది. చంద్రుని యసమానాభిజాత్యసౌభాగ్యములఁ బరికించి దక్షప్రజాపతి తన కుమార్తెల నిర్వది యేడ్వురఁ దారకల నతని కిచ్చి యుద్వాహము గావించెను. కాని క్షపాకరుఁడందు రోహిణీదేవి యెడ గాఢానురాగము గలవాఁడై మెలంగ మొదలిడినాఁడు. అట్టి సమయమున మిగిలినవారు తండ్రికడకేఁగి తమ దుఃస్థితిని విన్నవింప దక్షుఁడు రోహిణీప్రియుని [6]రాజక్షయవ్యాధిగ్రస్తుండవు కమ్మని శపించినాఁ డఁట!
భారతీయుల యాచారవ్యవహారము లనేకములు చంద్రునిపై నాధారపడి యున్నవి. చాంద్రమానము కర్మిష్ఠుల క్రతుదీక్షల కాధారము. కృచ్ఛచాంద్రాయణాది వ్రతవిధానముల యోగిపుంగవులు మహత్తర శక్తిసామర్థ్యముల సంపాదింతురు. సంక్రాంతిద్వయమధ్యమున గౌణచంద్రుఁడు, ముఖ్యచంద్రుఁడు నిరువురును గన్పట్టిన
శుభకర్మల కెన్నింటికో హంసపాదులు. కుముదాప్తు కొమ్ము తఱిఁగినఁ గాటకము
తప్పదని గదా కర్షకలోకపు గాఢవిశ్వాసము! విద్యారంభ, వివాహాదికముల జ్యోతిష
శాస్త్రాభిజ్ఞులు చంద్రలగ్నమున కత్యధిక ప్రాముఖ్యము నిచ్చుచున్నారు. రాజవైద్యులకు
శ్రుతిమించిన హృద్రోగముల భూతవైద్యులు చంద్రదేవతకు జపమొనర్చి
నవోదనదానమున నా గ్రహదుర్వీక్షఁ దొలఁగించుచున్నారు.
చంద్రలోకము పితృలోకము. సప్తసంతానాదికముల యథావిధిఁ దీర్చిన పుణ్యపురుషులు చంద్రలోకమును జేరుదురు. [7]ఉత్క్రాంతి వేళ జీవుఁడు రజనిని జేరునఁట! రాత్రి యాతనిఁ గృష్ణపక్షము కడకును గృష్ణపక్షము దక్షిణాయనము కడకును దీసికొని పోవునఁట!! అటనుండి భౌతికాకాశమునకుఁ బిమ్మట జంద్రలోకమునకుఁ జేరి పూర్వసంచిత పుణ్యవిశేషమున నా లోకమునం దుదకశరీరము నొంది జీవి కర్మక్షయ మగువఱ కటనుండు నఁట!! తఱువాత నా జలశరీరధారి గగనమార్గమున వాయుపథమును జేరుకొని వారిదద్వారమున వర్షాకృతితో మఱల నవని జన్మించు నఁట!!
ప్రణయవిహ్వలులైన నాయికానాయకులు ప్రణయవార్తావహులుగఁ బ్రవర్తింపఁ జేతనాచేతనముల నర్థించుటలు కవిలోక ప్రసిద్ధములు. మేఘశుకపికాదుల కనంతవాక్ప్రౌఢిమను బ్రసాదించి దూతకృత్యములఁ దీర్చుటచే సమస్త చరాచరప్రకృతి నేకసూత్రమున బంధించి దర్శించిన మహాకవులు ద్రష్టలు, రసజ్ఞశేఖరులు. కవికులగురువు కాళిదాసుని మేఘసందేశము జగద్విదితము కదా! దమయంతికై దౌత్యము నెఱపిన సురజ్యేష్ఠు వాహనమగు జాలపాదమును మఱచుటెట్లు? చిలుక రాయబారము లాంధ్రసీమంతినీ సాహిత్యమున సుప్రసిద్ధములు. సీతారామచంద్రులకు దౌత్యమును శ్రీకృష్ణచంద్రతర్కాలంకారుఁడునుం జంద్రుని మూలమున నడపినాఁడు. శ్రీ విశ్వనాథ మానినీపరాఙ్ముఖతను మాన్పి ప్రసన్నను జేయుమని [8]శశి నర్థించినాఁడు. మహాకవి కాళిదాసుని మేఘ సందేశమున మేఘసౌభాగ్య సమస్తమును గన్పట్టునట్లు వీరి శశిదూతమున చంద్రసర్వస్వము గోచరించును.
చంద్రునిపైఁగల యనంతాభిముఖ్యముచే శాస్త్ర కర్తలు తమ గ్రంథములకుఁ జంద్రిక, కౌముది, చంద్రాలోకాది స్నిగ్ధ నామములఁ బ్రసాదించినారు. [9]మేఘవిజయ కవి హైమ కౌముది, భట్టోజి దీక్షితుని కౌముది, జయదేవుని చంద్రాలోక మిందుకు నిదర్శనములు.
నక్షత్రములు తమస్వినుల భాసించుటయుఁ గౌముదీ రాత్రులఁ గన్పింపక
పోవుటయుఁ జూచి కాలమను కళాదుఁడు గగనమూషిక నుడురౌప్య ఖండములఁ
గరఁగించి చంద్రుఁడను వెండిదిమ్మను బోయుటతో నిట్లైనదని వర్ణించుటచే మురారి 'ఇందుమురారి' యైనాఁడు.
ఇందుఁ డనిన భారతీయశబ్దవేత్తల కెంత యభిమానము! శశి సహజశీత లత్వమును గమనించి వారు చంద్రుఁడని (ఆహ్లాదనకరుఁడు) నామకరణమొనర్చినారు. అబ్జ శబ్ద మిచ్చి యతనిని నీటఁ బుట్టించియు, జైవాతృకుని గావించి యతనిచేఁ బైరుపచ్చలఁ బ్రతికింపఁ జేసియు నానందించినారు. మంత్రద్రష్టలైన వేదకాల మహర్షు లమృతతుల్యమగు సోమరస ప్రదానగుణముచేఁ జంద్రుని సోమునిగ దర్శించినారు. ‘సూర్యాచంద్రమసు’లను దేవతా ద్వంద్వమున శశినొకనిగ నిల్పి యతని తర్పణమునకై సోమయాగమును గల్పించిరి. అందు వారు వాగ్దేవతకై స్థూలశరీరమైన పశువు నుపయోగించి ప్రాణపంచకమును వరుణునకును, మనస్సు చంద్రునకు, శ్రోత్రముల దిక్కులకు, జీవాత్మను బ్రజాపతికి నీయవలయునని శాసించినారు. చంద్రుఁడు గంధర్వుఁడు, [10]సుషుమ్నః సూర్యరశ్మి శ్చంద్రమా గంధర్వః' యని శ్రుతి. 'గాం’ ధరిత్రేతి గంధర్వః.' రవికిరణ మీట గోవు. సుషుమ్న యను సూర్యకిరణమును ధరించుటచేఁ జంద్రుఁడు గంధర్వుఁడు. నక్షత్రము లప్సరసలు. అట్టి నక్షత్రములతో మిథునభావము నొంది చంద్రుఁడు క్రీడించు చున్నట్లొక [11]శతపథబ్రాహ్మణ మహర్షి దర్శించినాడు.
సూర్యచంద్రు లిరువురు నశ్వినీదేవతలు. ఇట నశ్వ శబ్దమునకు జలము, కిరణము, కాంతి యనువానిలో నే యర్థము నైన గ్రహింపవచ్చును.
లోకము చంద్రునికిఁ దారాజారత్వ మాపాదించినది. జారశబ్దమునకు లయించువాఁడని సంప్రదాయజ్ఞు లెఱిఁగిన యర్థము; యాస్కుని నిర్వచనము. సూర్యునకుఁ దల్లి రజని. రాత్రి యందు జన్మించి రవి రాత్రి యందు లయించు చున్నాఁడు. నక్షత్రాధీశుని తారాజారత్వము నిట్టిదే. ఇట్టి వైదిక సాహితీహృదయ సౌశీల్య మూహింపఁజాలని కవులు కొంద ఱిట్టి మార్మిక కల్పనలఁ గైకొని, పరకీయాప్రణయరస నిషణ్ణచిత్తులైన ప్రభువుల ప్రార్థనల సంగీకరించి యసభ్య శృంగార కావ్యరచనకుఁ బూనుకొనిరి. ఇట్టి యసత్యకల్పనలు కన్పట్టుట వలననే సుమేధులు “నా నృషిః కురుతే కావ్య" మ్మని యనుశాసింపవలసివచ్చినది.
చంద్రోదయాదికము ప్రకృతి పుస్తకమున నొక రమణీయ ప్రపాఠకము. దార్శనికులు తత్సౌందర్య రసవత్సన్నివేశములఁ దిలకించి యనేకాద్భుత విషయములఁ బ్రకటించిరి. యామవతీకళత్రు నుదయమునకుఁ బూర్వమతని కిరణము
లుదయించుటఁ గని యొక మహాకవి
సీ. [12]కెరలి చీఁకటిమ్రాను గెడపంగ నిక్కిన
సమయగజంబుదంతము లనంగఁ
జదలు గేదఁగి తూర్పుతుదకొమ్మ నరవిరి
యై కానిపించు పూరేకు లనఁగఁ
బొడుపుగుబ్బలి నెలపురిటింటి యిడుపునఁ
జఱచిన గందంపుఁ జట్ట లనఁగ
మరుని ముందఱ బరాబరిసేయు కంచుకి
కులముచేతుల వెండిగుదె లనంగఁ
తే. గైరవములకు వెన్నెల నీరు వఱపఁ
బూని చేర్చిన పటికంపు దోను లనఁగఁ
గ్రమముతో శీతకరమయూఖములు గగన
భాగమునఁ గొన్ని యల్లనఁ బ్రాకుదెంచె.'
నని వర్ణించియున్నాఁడు.
మఱియొక మహాకవి యుదయకాల చంద్రకాంతిని 'యభినవ ఖరయోషి త్కషాయకంఠకాంతి' తో నుపమించినాఁడు. బాలచంద్రునిఁ బ్రాక్సతీలలాటతిలకముగ నొకరు, నభస్సీమంతినీ సిందూరరేఖగ నొకరు దర్శింప, నొక రప్సరఃప్రణయినీ కరసరోజచషకముగను, మఱియొకరు కబరీచ్యుత మాలగను జూచినారు. ఒక రత్రిమునిలోచన భూషికగా భావించినారు. ఒకరు త్రినయన జటావల్లీ పుష్పముగ నూహించినారు.
శుక్లపక్ష క్షపాకరుఁడొక సురుచిరుని మనోవీథి -
సీ. [13]"మన్మథదివ్యాగమమున కోంకారంబు
భూ తేశు నౌదల పువ్వుదండ
యల్పశృంగార రేఖార్గళకుంచిక
యధికతమోదంతి కంకుశంబు
విరహిణీజనమర్మవిచ్ఛేదకర్తరి
యంబర క్రీడ దంష్ట్రాంకురంబు
తారకామౌక్తిక తతికినంచితశుక్తి
దగు నంబునిధికి ముత్యాలజోగు
తే. మారుపట్టాభిషేకాఖ్య వారికుంభి
చిత్తజుని కోట లగ్గ దంచనపు గుండు”
అనఁగ కాంతి నిస్తంద్రుఁ డగుచు నానాఁటి కభివృద్ధి నారుకొనుచుఁ గన్పట్టినాఁడు. [14]'విరహుల కెల్ల సంధ్యవతి వేడుక జోతము సెప్పవచ్చుచో నిరతము తోడ నక్షతలు నించి తగన్ గరపంకజంబునన్ మురియుచుఁ బట్టు నా మెఱుఁగు ముత్తెఁపుఁ జిప్పన' నొప్పు విదియచంద్రు నొక కవిరాజు గమనించినాఁడు. జాబిల్లి యొకానొక [15]యద్యతనాంధ్ర కవి కుమారున 'కాకాశపు టెడారిలోఁ గాళ్లు తెగిన యొంటరి యొంటె' వలెఁ గన్పించినాఁడు. మిన్నువ్రాకు శీతరోచినిఁ జూచియొక భావుకుఁ డమృతసముద్రములోని పీయూషమును జేదుకొనుచున్న దివ్యాంగన లుపయోగించు వెండి చేరులకుఁ (కిరణములు) గట్టఁబడిన స్పటికకుంభముగఁ గనుఁగొనినాఁడు.
ఒక మహాకవి చూచుచుండ :
చ. [16]దిన పరిణామ లక్ష్మికిఁ బ్రతీచి తగం గయి సేయు వేడుక
స్వనరుహమిత్రబింబ మను వర్తులలాక్షికపట్టికం బయో
ధి నడుమఁదోఁచి సాంధ్యనవ దీప్తిరసంబు హరించి పాఱవై
చిన వెలిదూదియో యనఁగ శీతకరుం డుదయించె నత్తఱిన్.”
[17]కాలమనియెడు విలాసి కెంపులతోను ముత్యములతోను నొక సరమును గ్రుచ్చుచుండ సాంధ్యకిరణవిశిష్టుఁడైన సూర్యుఁడు సూత్రమునఁ గ్రుచ్చఁబడిన కెంపు వలె నుండ వరుస తప్పుటచేఁ ద్రోచి పిఱుందఁ జేర్చు ముత్తెము క్రియ లాంఛన రంధ్రసంగతిచే నయ్యమృతదీధితి యా మహనీయునకు మఱల నొకమాఱు దర్శన మొసఁగెను.
భక్తశిఖామణి యగు నొక మహాకవిప్రౌఢునకు -
మ. [18]ఉదయ గ్రావము పానవట్ట మభిషే కోదప్రవాహంబు వా
ర్ధి దరద్ధ్వాంతము ధూపధూమముజ్వ లద్దీపప్రభారాశి కౌ
ముది తారానివహంబు లర్చిత సుమంబుల్గాఁ దమోదూరసౌ
ఖ్యదమై శీతగభస్తి బింబ శివలింగం బొప్పెఁ బ్రాచీదిశన్.”
మ. [19]"కడఁక న్రేచలిగట్టుపట్టిఁ దను వేడ్కం గూర్ప నే తెంచి పై
జడిగాఁ జుక్కలతూపు లేయ గినుక న్జాబిల్లిముక్కంటి దాఁ
బొడుపుం గెంపను వేఁడికంట నిరులు న్పూవిల్తు మే నేర్చి చొ
ప్పడఁ దద్భూతి యలందెనా నపుడు బింబం బొప్పెఁ బాండు ద్యుతిన్.”
అని ప్రహర్షహృదయముతోఁ బలికినాఁడు.
శశికిని, శివునకు సన్నిహిత సంబంధము. అది యతఁ [20]“డనలాక్షు ఘనజటా వనవాటికి వన్నె వెట్టు ననార్తవంపుఁ బూ" వగుటయే యనుట నిస్సంశయము!
పరిపూర్ణ చంద్రబింబమును గని ప్రౌఢభావుకులు పరిపరివిధముల నూహించిరి. అందు శకునజ్ఞుఁడు దేశసుభిక్షార్థియు నగు నొక మహాకవి :
ఉ. [21]"పొందుగఁ పశ్చిమాబ్ధి తటభూస్థలి నంశుమదంశుమత్ఫలా
కందము వాసరాంతహలికప్రవరుం డిడ సాంధ్యవారిభృ
త్కందళము ల్తమోదళ యుతంబులునై గెల పండి వ్రాలెఁ బూ
ర్ణేందుని పేరఁ బ్రాచి నది హేతువు వెన్నెల కల్మి కల్మికిన్.”
అని సప్రమాణముగఁ బల్కినాఁడు.
చ. [22]"పనుపడ వేణునాళములఁ బగ్గములం బలెఁ గ్రిందఁ బర్వు శో
భన కిరణ ప్రకాండములు భాసిలఁ జందురుఁ (డొప్పి యెం) తయు
న్మనసిజుఁ డెల్ల ప్రాణుల మనంబులు చేలుగ రాగబీజముల్
పెను జతనంబుతోడ వెదఁ బెట్టెడు రౌప్యపు జడ్డిగం బనన్.'
గనుపట్టిన నొక మహాకవి చూచి సంతోషభరితాంతఃకరణుఁ డైనాఁడు.
[23]తుహినకరమండలంబునం గురియు నప్పండు వెన్నెలలు సాయంతననటన చటుల మహానట వికటాట్టహాసంబుల కను ప్రాసంబులు. పూర్వపారావార పులినతల విహర ణైరావణ కరపుష్కరోద్ధూత వాలుకాధూళికలకుం బ్రత్యా దేశంబులు. అంధకార బలీంద్ర నిర్బంధన ధురంధర సమయ మధుమథన చరణాంగుష్ఠ నిష్ఠ్యూత గగనసరి దంబుపూర్వంబులు కనుబింబంబులు.’
'శరత్తు చంద్రికలది' [24]'ఋణ మపరిహార్యమైన పాపము గనుక నట్టి పాపము చేత విముక్తుఁడైన మనుజునిమాడ్కిఁ జంద్ర గర్భితములైన మేఘము లీ శరత్తున
నొప్పారును.'
సీ. [25]పొల పొల విరిసి పోవుచు నల్పు విఱుఁగుచు
మొల్లమ్ము చెడిన మొగిళ్ల వలన
పసి పసరేదు మవ్వఁపు సన్నజాజి మొ
గ్గల తొలివిప్పు నా వెలఁదు లగుచు
నెడ పడ్డ వానల జడులచేఁ జెమ్మ లా
రిన లేఁత పొరగాలి పనల వలన
మరు సెలకట్టె మాదిరి దూసి చను కమ్మ
గేదఁగి తావులై స్వాదులగుచు
తే. చివర తెలిదారముల నూఁగు జిలుఁగులొలయ
పొట్లపూవలెఁ బెరఁటిలోఁ బొలుపు లగుచు
నలరు నేడాకులనఁటి మొవ్వాకు జిగికి
నెలవులు శరత్తు తలిరు వెన్నెలలు ...'
[26]సాంద్రచంద్రికలు 'నెలయను వెండికుండఁ గడు నించి నిశాచకోరనేత్ర యంబరాహ్వయ మహానటమూర్తి మహాభిషేక మొనర్పఁగ నెల్లదిక్కులఁ బ్రవహించెడు పాలవెల్లి' యననొప్పును. అంతియ కాదు. కొన్ని సమయముల :
మ. [27]"అమృతం బాసవ మంగ రాగ ముదయో ద్యత్కాంతిచేలంబు చి
హ్నమునుంగా శశిరేవతీరమణుఁ డున్మాదంబు మీఱం దమో
యమున నృంగము నొంది పాఱఁ గరసీరాలోడితం జేయ వ
చ్చె మరుద్వాహిని దాని దేర్పనన మించెం జంద్రికాపూరముల్.'
చంద్రికావిశిష్టములైన రాత్రులందు చకోరలీలలు చిత్రాతిచిత్రములైనవి. ఈ పులుఁగుల చేష్టలఁగని మహాకవులు మనోహరవర్ణన లొనర్చినారు. వాని భోజన ప్రియత్వమును గన్నులారఁ గాంచిన యొక కవిచంద్రుఁడు:
సీ. [28]నునులేఁత వెన్నెల కొనలు మెల్లనఁ ద్రుంచి
పిల్లతండులకుఁ బెట్టు నవియుఁ
జవియైన వెన్నెల చంచులఁ గబళించి
యింపారఁ బ్రియుల కందిచ్చు నవియుఁ
గడఁగి యింతటఁగాని వడఁదేర దనుభంగిఁ
దనర వెన్నెలవెల్లి మునుఁగు నవియుఁ
బగలింటి యాఁకలి పాయఁ బైపైఁబడి
ముదురు వెన్నెలఁ గ్రోలి పొదలు నవియు
తే. గడుపునిండినఁ గసికాటు కఱచునవియు
గూడి యొండొంటితోఁ జెఱలాడు నవియు
నగుచు వెన్నెల తమ సొమ్మె యనిన యట్లు
కోరి చరియించెఁ జదలఁ జకోరచయము
అని యందలి విభేదముల వీనులలర వినిపించినాఁడు. కౌముదీమహోత్సవములతోఁ బాటు మదనోత్సవములును జరుగుచుండుట భారత రసిక లోక మెఱిఁగినదే. 'కొలము సాముల నందఱఁ గూడఁ బెట్టి చిగురు విలుకాని జాతర సేయువేళఁ జకోరపుఁ బేరటాండ్రు :
సీ. [29]విరహుల మైసోకి వేడియౌ వెన్నెల
బచ్చి వెన్నెల నులివెచ్చఁ జేసి
కలువ పుప్పొళ్లచేఁ గసటైన వెన్నెల
వలిపవెన్నెలలోన వడిచి తేర్చి
చంద్రకాంతపు నీట జాలైన వెన్నెల
ముదురు వెన్నెల జుట్టఁ బదును చేసి
సతుల మైపూఁతం బిసాళించు వెన్నెలఁ
దనుపు వెన్నెల రసాయనము గూర్చి
వంతుగలియఁగ బువ్వంపుబంతివిందుఁ బెట్టుట లొక మహాకవి దర్శించి చకోరకులముల యన్నరసాస్వాదనా శేముషికి జోహారు లర్పించినాఁడు.
ఒక మహాకవి కౌముదీ మహోత్సవమున కాదంబరీ పాన మదఘూర్ణిత నేత్రయై గోత్రమునం దున్న యొక యుజ్జ్వలవిలాసిని యున్మతయై పల్కిన “చంద్రా! ఏల యీ సురాచషకమునఁ బ్రతిఫలింతువు? రోహిణీదేవి ధమ్మిల్లముతోఁ బాటు విరుల నెత్తానికి వీడ్కోలు సుమా! ద్విజరాజువై యుండి యీ మధువుతో నీకేమి పని? మద్యముతోఁ బాటె నిన్నును ద్రాగి వైచెదను. మా యందెవ్వరినో కామించి యిట్లు తట్టాడు చున్నట్లున్నావు. ఇది నిజము. లేకున్న నీపై నీ తారకల కనుమానమెందులకు? వారు నిన్నేల యనుసరింతురు? పశ్చిమ దిశను నీకెవరో ప్రణయిని యున్నట్లున్నది; కాదేని నిశాంతమున నీ నా దెస కేల పయనింతువు?" అను ప్రలాపముల వీనులలర విని రసానందానుభూతి నొందినాఁడు.
చంద్రునకు నూలుపో గర్పించు వేళ నొక భావుకుఁడిట్లు దర్శించి
మ. [30]చరమక్ష్మాధరసింహచారుము ఖదంష్ట్రాకోటియో నాఁగ నం
బరశార్దూలనఖంబు నాఁగఁ దిమిరేభ ప్రస్ఫురద్గర్వసం
హరణక్రూరతరాంకుశం బనఁగ నుద్యల్లీల మీ రేఖ ని
త్యరుచిన్ బోల్పఁగఁ బెంపగున్ విదియచంద్రా! రోహిణీవల్లభా!!"
యని యా దైవతమును గృతాంజలియై బ్రార్థించినాఁడు.
జంద్రుని యందలి నైల్యమునకు భావుకలోకము బహువిధ కారణములఁ బలికినది. ఒకరు తిమిరచయమును మ్రింగ నది జీర్ణింపక యిట్లు కడుపున గడ్డకట్టిన దనినారు. తమ యమృతంపు బావి యగు శీతకరమండలము నుండి దేవతలు పీయూషమును జేదుకొన నది యడుగు దగులుటచే నందలి ప్రౌఢపంక మీ రీతిగఁ గన్పించుచున్నదని యొకరు భావించినారు.
మ. [31]రతినాథుం డను మాయజోగి చదలం త్రైలోక్యవశ్యాంజనం
బతియత్నంబునఁ గూర్చి మౌక్తికమయం బైయున్న పాత్రంబునన్
మతకం బేర్పడఁ బెట్టి దాఁచె నన నీ మధ్యంబునన్ మచ్చ సం
తతమున్ గన్నుల పండువై వెలయుఁ జంద్రా! రోహిణీవల్లభా!!"
యని నీలాంకమున నింగిఁదోఁచి వెలుఁగు వెలుఁగురాయని గీర్తించినాఁడు. ఇది చంద్రుని యందలి కృష్ణసారమని కొందఱి నమ్మకము. అందుచేతనే యతఁడు కురగలాంఛఁ డైనాఁడని వారి యభ్యూహము. ఈ కారణముననే యొక కవి 'చంద్రునిలో నిట్టి నేల చంగలి మేసెన్" అను సమస్యను బూరింప నొక ప్రాచీనాష్టావధాని కొసఁగ నతఁడు పాశుపతాస్త్ర ప్రదాన సమయమున ఫాలాక్ష ఫల్గును లొకరితో నొకరు పోరాడువేళ నర్జునుని తపోభూమిఁ బుట్టిన పచ్చికను గ్రిందైన చంద్రశేఖరుని శిరమందున్న శశిఖండ మందలి మృగశాబకము భక్షించె ననుభావము వచ్చునట్లు పూరించినాఁడు. ఈ మచ్చ రోహిణీవల్లభునకుఁ దారాజారత్వమున వచ్చిన దుష్కీర్తియని కొందఱ యభిమతము. అది దోషమైన నగుఁగాక! మహాకవి కాళిదాసు వంటివాఁడే [32]అనంతరత్న ప్రభవుఁడగు నా శైలాధిపునకు హిమము సౌభాగ్యవిలోపి కాదు, లోకములో ననేక గుణములలో నొకదోషము లెక్కకు రాదు. చంద్రుని కిరణములందు నీలాంకము వలె మునిఁగి పోవును" అని ప్రవచించినాఁడు.
పద్మినీ కమలాప్తుల బాంధవమును బోలినదే కుముదినీ కైరవమిత్త్రుల మైత్రి. తారకాధీశు కిరణకదంబకము చిలుకు పలుచని వలిపంపు జిలుఁగుమంచు గైరవశ్రీ
వధూకరగ్రహణ వేళ వెలికిఁ గ్రమ్మిన సాత్విక స్వేదము.
కావ్యలోకమున నాయికానాయకు లీ మైత్రి నాధారముగ గ్రహించి గర్భితోక్తుల సంభాషింతురు. ఒక [33]“నాయకుఁడు నాయిక నుద్దేశించి 'తుహినాంశు బింబమును గనని నళినీ జన్మము నిరర్థకము గదా!' యన నాయికయు 'నళినీ సౌభాగ్యావలోకన మొనర్పని చంద్రోత్పత్తియు నిష్ఫల' మని సాభిప్రాయయై సమాధాన మొసఁగినది. ఆకసముననున్న చంద్రుఁడు కేవల [34]పరోపకార బుద్ధితోఁ గుముదావబోధన మొనర్చుచున్నాఁడని చెప్పుచు నీ మైత్రి లక్షణము నెఱుఁగని యొక కవిశేఖరుఁ డున్నత చేతసులు పరోపకారవ్యసనజీవితు లను నర్థాంతరమును నిరూపించినాఁడు.
కుముదినీప్రణయముతోఁబాటు శశాంకునకుఁ బద్మవైరమును గవి లోకసిద్ధము. దీనిని గ్రహించిన యొక మహాకవి -
తే. [35]తామరసలక్ష్ము లాచందమామ రాకఁ
గలఁగుచును గుముదాలికై తొలఁగు నపుడు
తొలఁగు బావయె కాఁడె తమ్ముల వరించు
నట్టి సతులకు నతఁడు మున్నెట్టిఁ డైన
యని పల్కినాఁడు. ఈ యంశమునే సమ్మోహనముగ మఱియొక మహాకవి:
శా. [36]ఈ వబ్జుండవు నీటఁ బుట్టితి సుమీ యే నంచు మోమోటపుం
ద్రోవ ల్సెప్పఁగ సిగ్గుగాదె మఱి నీ తోఁబుట్టు శ్రీదేవి లీ
లావాసంబుసిరుల్ హరింతు వనుచో నయ్యో కళాదుండు చే
తోవీథిన్ సహజాధనాపహరణోద్యోగంబు నెగ్గించునే!”
యని నిరూపించినాఁడు.
విరహిణులకు విధుమండలమునకుఁ జుక్కెదురు. తాపాపనోదనమునకై తరిపి వెన్నెలల సుధాంశుని శైత్యమును నమ్మి విహరింప శీతకరుఁడుఁ ఘృతకోశాతకి యగుట పరిపాటి. ఈ విషమ ప్రకృతిని భరింపలేక ప్రతిప్రబంధ నాయికయును జంద్రోపాలంభనకుఁ గడంగినది. ఒక యింతి చంద్రుని 'నింతుల నేఁచు పాతకము నీకజహత్కళంక' మని పల్కినది.
సీ. [37]"శ్యామకంఠలలాటసామీప్యపరితప్త
మౌనంబులుగఁ గళల్ మార్చి మార్చి
సింధూదకాంత స్సమింధన బడబాన
లోగ్రకీలల సెగ నూని యూని
ప్రత్యమావాస్య సంభవ దర్మసంయోగ
కలితాధికోష్టిమఁ గ్రాఁగి క్రాఁగి
విప్రయోగోష్ణ పాంథ ప్రాణపరిపాన
భూమజంబగు కాఁక పొంది పొంది
తే. కాలకూటాహ్వయభ్రాత పాలుపట్టి
పుచ్చుకొను దాహకత్వంబు ప్రోచి ప్రోచి
యింత వేఁడిమి సాధించి తేమొ చంద్ర!
నన్ను నేఁచుటకే ప్రయత్నంబుతోడ!”
యని యొక విరహిణి నిశాకరుని 'వేండ్రపుం బ్రకృతికి' వింత వింత కారణముల వెదకి చెప్పినది. చంద్రికాతాపమును సహింపఁ జాలక [38]కురంగము నీయందున్నను శక్రచాపమునకుఁ గుఱికాకుండుట, విద్యుదుష్ణమునకు వెఱచి పర్వులెత్తకుండుట లెంత విచిత్రము'లని మఱియొక విరహిణి వాపోయినది. విసిగివేసారిన యొక గడుసరియైన విప్రయోగిని చంద్రుని చేతనైనంతగ నుపాలంభించి తుదకు :
తే. [39]త్రిపురసంహార మొనరించు నపుడు హరుఁడు
బండి కల్లుగ నీ మేను గండి సేసె
నదియు సెలవారి తెగటార వైతి చంద్ర!
యకట! రోహిణియెడ నపథ్యమునఁ జేసి”
యని చంద్రక్షయము నాకాంక్షించినది.
చంద్రునియెడ నిట్టికోర్కె యెంతటి పాతకము! కాముకులకు విచక్షణజ్ఞాన మెక్కడిది? ప్రియులు చేకూరిన వేళ నీ చంద్రుఁడే ప్రియదర్శనుఁడు కాఁడా? అమరుల బోనపుట్టిక, సహస్రమయూఖుని జోడుకోడె, సంతమసము వేరువిత్తు, పుంశ్చలీసమితికిఁ జుక్క వాలునగు నమృతకరుని యనామయము లోకక్షేమమే కదా! వలరాజు మేనమామ, మధుకైటభారి మఱఁది వంటి మనోహారదైవత మెటనున్నాడు? ఓ చంద్రా!
ఉ. [40]ఈ వెన్నెల పేరిదారముల వెండి హొరంగు పటంబు నల్లి మ
ధ్యన్నెఱిగూడు కట్టుకొని యాపెనుదారపు చిక్కులందు
పున్నమదీప్తిచే నిరులపుర్వులుపట్టి పలార్చుచున్న నీ
యన్నువ వెన్నెలల్ చలువ లై మరి మాకుఁ బ్రసన్న మయ్యెడున్.”
వావిలాల సోమయాజులు సాహిత్యం-4
- ↑ తిమిరభూతము సోకు - ప్రబంధ రత్నావళి -557
- ↑ ఫిలిప్పైన్ జాతి : ఫిలిప్పైన్ ద్వీపముల నివసించు నాదిమవాసులు
- ↑ రెడ్ ఇండియనులు - కొలంబస్ ఇండియా యను భ్రాంతితోఁ గనుగొన్న యమెరికా ద్వీపములందలి యాదిమనివాసులు
- ↑ షింటోలు - జపానీయులు 'Shintoism is the pure land school of Japan in its extreme form of Salvation by pure faith'
- ↑ ఒక వేయి తలలతో - పోతన భాగవతము
- ↑ రాజయక్ష్మము - కుమార్తెల మొఱవిని క్రుద్ధుఁడైన దక్షునకుఁ జంద్రునకు సంధికుదిర్చి శివుఁడర్ధభాగమును శిరముపై ధరించినట్లు బ్రహ్మవైవర్తపురాణము
- ↑ ఉత్క్రాంతివేళ : మరణవేళ
- ↑ శశినర్ధించినాఁడు'; శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 'శశిదూతము' కావ్యమున జెప్పినారు.
- ↑ మేఘవిజయకవి (క్రీ.శ. 1660 ప్రాంతము) హైమకౌముది యనునితని వ్యాకరణ గ్రంథమును భట్టోజి దీక్షితు లనుకరించినారని కొందఱు, భట్టోజి (క్రీ.శ. 1640 ప్రాంతము) అద్వైతాగమ, తంత్రధర్మజ్యోతిషాదికములు ముప్పది రెండు గ్రంథములు రచించిన మహాపండితుఁడు.) సిద్ధాంత కౌముది సంస్కృత వ్యాకరణమును శబ్దరూప నిష్పత్తి క్రమమున మార్చి వ్రాసిన పన్నెండువేల గ్రంథము.
- ↑ సుషుమ్న- సూర్యుని సప్తకిరణముల నొకటియని శ్రుతి
- ↑ శతపథ బ్రాహ్మణము - యజుర్వేదీయ గ్రంథము
- ↑ కెరలి చీఁకటిమ్రాను - తిమ్మన పారిజా. ఆ. 2, ప. 36
- ↑ మన్మథ దివ్యాగమమున – మహాకవి పెద్దపాఁటి యెఱ్ఱన కుమార నైషధములోనిది
(ప్రబంధ రత్నా. 84). - ↑ విరహుల కెల్ల సంధ్యవతి - ప్రబంధ రత్నా. 581
- ↑ అద్యతనాంధ్ర కవి కుమారుఁడు - శ్రీ శ్రీ
- ↑ దినపరిణామలక్ష్మి - పారిజా. ఆ. 2, ప. 44
- ↑ కాల మనియెడి పారిజా. ఆ. 2. ప. 43
- ↑ ఉదయగ్రావము - ధూర్జటి కాళహస్తీ... ఆ. 2. ప. 232
- ↑ కడక న్రేచలి గట్టుపట్టి - పారిజా. ఆ. 2. ప. 45
- ↑ అనలాక్షు - మనుచరిత్ర వంశావతార వర్ణనమున 'కలశపాథోరాశి' నుండి
- ↑ పొందుగఁ బశ్చిమాబ్దితట - పారిజా. ఆ. 2, ప. 42
- ↑ పనుపడ వేణునా - సూరన ప్రభా. ప్రద్యు. ఆ. 4. 124
- ↑ . తుహినకర మండ - పారిజా. ఆ. 2, ప. 53
- ↑ ఋణ మపరిహార్యమైన - శ్రీకృష్ణరాయలు ఆముక్త ఆ. 4. ప. 158
- ↑ పొలపాల - విశ్వనాథ ఋతుసంహారము
- ↑ సాంద్రచంద్రికలు - మూలము - ప్రభావతీ ప్రద్యు, ఆ. 4, ప. 125
- ↑ అమృతం బాసవ - పారిజా. ఆ. 2, ప. 47
- ↑ . నునులేఁత - అనంతామాత్యుని భోజరాజీయము
- ↑ 53. విరహుల మైసోకి - పారిజా. ఆ. 2. ప. 49
- ↑ చరమక్ష్మాధర - శ్రీనాథ యుగమందలి మఱియొక కవిసార్వభౌముఁడు రావిపాటి
త్రిపురాంతకుని 'చంద్రతారావళి' నుండి (ప్రబంధరత్నాకరము 173) - ↑ రతి నాథుండను - పూర్వోదాహృతము 175
- ↑ 56. అనంత రత్న ప్రభవుఁడు కాళిదాసు కుమార సం. సర్గ 1, శ్లో 3
- ↑ ఒక నాయకుఁడు - బిల్హణయామినీపూర్ణతిలకల సంభాషణము
- ↑ కేవల పరోపకార బుద్ధితో - భవభూతి కృతమైనట్లు గదాధరభట్టు రసిక జీవనమున నుదాహరించిన “కిం చంద్రమాః ప్రత్యుపకార లిప్సయా, కరోతి గోభిః కుముదావ బోధనమ్, స్వభావ ఏవోన్నతచేతసాం సతాం, పరోపకార వ్యసనం హి జీవితమ్"
- ↑ తామరసలక్ష్ము - ప్రభావతీ ప్రద్యు. ఆ. 4, ప. 123
- ↑ ఈ వబ్జుండవు - వసు చరిత్ర ఆ. 4, ప. 34
- ↑ శ్యామకంఠ - ప్రభా. ప్రద్యు. ఆ. 4, ప. 153
- ↑ కురంగము నీయందు, - మనుచరిత్ర
- ↑ త్రిపురసంహార - మనుచరిత్ర
- ↑ వెన్నెల పేరిదారముల - శ్రీ విశ్వనాథ 'శశిదూతము' నుండి.
మలయానిలుఁడు