వావిలాల సోమయాజులు సాహిత్యం-4/మణిప్రవాళము/శత్రువులు - శత్రుత్వము
శత్రువులు - శత్రుత్వము
శత్రువులా! అయిన నేమి? ఇంత భయమేల? శత్రువు లనినను, శత్రుత్వ
మనినను నింత భయపడ నగత్యమేమున్నది? సత్త్వచిత్తముతో నాలోచించిన శాత్రవు
లన నంతగ భయ మొందఁ బనిలేదని నానిశ్చయము.
'శత్రువుల వలన నెన్ని ప్రయోజనము లున్నవి! పాశ్చాత్యవిజ్ఞానమునకు మూలపీఠమగు 138[1]ఫ్లూటార్కు మహాశయుఁడు శత్రువులఁ గూర్చియు శత్రుత్వమును గూర్చియు మేధాసుసంపన్నత నభివ్యక్త మొనర్పఁగల యొక సుందర జిజ్ఞాసను బ్రకటించినాఁడు. దానిని బఠింపుము. నీ విభ్రాంతి సమస్తమును నశించు'నని యొక యనుభవజ్ఞుఁడు సందర్భవశమున నాతోఁ బలికినాఁడు. నాఁటినుండి నాలో 'శాత్రవమథనము' జరిగినది.
లోకమునఁ బ్రతివ్యక్తియు శత్రువనిన జంకుచున్నాఁడు వలదన్నను మైత్రి నాశించుచున్నాఁడు. ఈ మార్గమునే కుటుంబములును, సంఘములు, దేశములు ననుసరించుచున్నవి. సర్వసామాన్యముగ శత్రువులు కావలయునని కోరుకొను వ్యక్తియును, కుటుంబమును, సంఘమును, దేశమును గన్పించుట లేదు. ఇందుకు భిన్నముగఁ బరిపంథు లేర్పడినఁ జతుర్విధోపాయముల జయించి 'జితశత్రుల' మని 'యజాతశత్రుల'మని 'సర్వలోక మిత్రుల'మని యును బ్రకటించుట ప్రస్ఫుటమగు చున్నది.
ఉ. "కంటికి నిద్ర వచ్చునె, సుఖంబగునే రతికేళి, జిహ్వకున్
వంటక మిందునే, యితర వైభవముల్ పదివేలు మానసం
బంటునె, మానుషంబు గలయట్టి మనుష్యున కెన్నఁ డేనియున్
గంటకుఁడైన శాత్రవుఁ డొకండు దనంతటినాఁడు గల్గినన్”
అని కవిసార్వభౌముడు శ్రీనాథుడు తపనీయనగదర్పోద్ధతిని సహింపక మాత్సర్యము వహించిన వింధ్యముచేఁ బల్కించినాఁడు. ఈ కావ్యమునం దా మహాకవి యాత్మీయత నిక్షేపితమై యున్నదని యెల్ల రంగీకరించినారు. మేరువు లేక వింధ్యకుఁ గీర్తి యెక్కడిది?
దేవరాయల యాస్థానమునఁ గనకాభిషేక సన్మానము నొందుటకుఁ గారణభూతులైన
డిండిమ భట్టారకాది కవీంద్రులు లేకున్న శ్రీనాథుని కీర్తి మేఘములా నాఁటి యాంధ్రలోక విమానవీథుల విహరింప వీలెక్కడిది?
శత్రువును గూర్చి యంతరంగమునఁ దీవ్రవ్యథాప్రాచుర్యము వహింప నవసరము లేదు. అనుగుణమైన మానసిక ప్రబోధమొందిన శత్రుత్వ మే నాఁడును హృదయమునఁ బ్రవేశించి యతిఘోరదవానలముగఁ బరిణమించి పరశురామప్రీతి గావింపలేదు. మహాకవి శ్రీనాథుని మాట నమ్మిన కొందఱుండ వచ్చును. సుఖనిద్ర కలుగుట మానినదగుటచేఁ గంటికి నిదుర రాకపోయినను, మద్యపానము నిషేధితమగుట మధుకేళులు తప్పుటచేతను, బ్రమాదము లేదు. అయినను 'ఋణంకృత్వా ఘృతం పిబేత్' నేఁడు కాలలక్షణ మగుట వంటకము లిందకున్న నెట్లను భయముచే నట్టివారు శత్రువులతో సంధి గావించుకొన వచ్చును.
శత్రువును గూర్చిన యాలోచనామార్గమే ప్రాచ్యదేశముల విచిత్రగతి నడచినది. వారికి సపత్ను లని భారతీయులు నామకరణ మొనర్చినారు. వారు సవతుల వలె దుఃఖహేతువులఁట! బహుభార్యాత్వమును జట్టమూలమున నిషేధింప బద్ధకంకణమైన భారతదేశమున సపత్నులు సౌఖ్యహేతువులని వాదించువారును నుండరు. వాదించిన నంగీకరించువారును నుండరు. అయ్యుఁ బ్రపంచమున నేఁడును, సపత్నులు సౌఖ్య హేతువులని యంగీకరించు లలనాజనముగల జాతులు లేకపోలేదు. 'తిరిపెమున కిద్దరాండ్రా పరమేశా! గంగవిడువు పార్వతి చాలున్' అని యడిగించుకొనుటకైన నంగీకరించినాఁడు కాని యా యాదిభిక్షువు శిరముపై నెక్కించుకొనిన గంగను దించుట కిష్టపడలేదు. గంగాగౌరుల కీర్తి యన్యోన్యము సపత్నులై యుండుటచే విశ్వవిఖ్యాత మైనదనుటలో విప్రతిపత్తి లేదు. అందువలన శత్రువులు సపత్ను లనుమాట యంగీకరింపవచ్చును కాని వారు దుఃఖహేతువు లని యొప్పుకొనుట వలను పడదు.
ప్రాచీనార్యరాజన్యులు 'శత్రురాయ వేశ్యాభుజంగ బిరుదాంకితులు.' ఈ భుజంగమత్వమును బరిపాటిగ సాగవలయునను గోర్కెతో నిరంతరమును రణ వీధివిహారమొనర్చినారు. వారి శిరముల ఖండించి బల్లెపుఁ గొనలకెత్తి యూరేగించి యుజ్జ్వల కీర్తిధ్వజములుగ వీరుపయోగించినారు తుదకు వారి కపాల పాళికలఁ దమ్మపడిగలఁబొదిగించి తృప్తిఁజెందినారు. రాజన్యులా శత్రువిజయములఁ దెల్పు కీర్తి స్తంభముల నాటించి శత్రువిచ్ఛేదనా కథల భావియుగ శుభ్రచరిత్రల కెక్కించినారు. వారి యాస్థానకవులలో నగ్రగణ్యులును నా పూర్వరాజన్యులకు 'శత్రుశోణితమున
శాత్రవకామినీ చారునయన బాష్పసలిలముల నవనిఁదడుపఁడేని యా రాజు లావును,
జీవనంబు వేఱఁజెప్పనేల?' యని సెలవిచ్చి పోషకులయందు శత్రుత్వాభిమానమునకు
దోహదసేవఁ జేసినారు. శత్రునిరాసక్రియానంతరము వారి కీర్తి వ్యాపింపఁ
బెద్దనార్యుఁడు 'అభిరతి కృష్ణరాయఁడు జయాంకముల న్లిఖియించి తాళసన్నిభముగఁ
బొట్టునూరి కడనిల్పిన కంబము సింహభూధర ప్రభు తిరునాళ్లకుం దిగు సురప్రకరంబు
కళింగ మేదినీవిభు నపకీర్తికజ్జలము వేమఱుబెట్టి పఠింతురిచ్చలున్' అని పలికినట్లు
మధుర కావ్యములఁ జెప్పి శాశ్వతకీర్తి నాపాదించినారు. అట్టి కృత్యములే జరుగకున్న
మహత్తర సామ్రాజ్యము లేర్పడియెడివి కావు. ఆటవిక జీవితమున నున్న యొకనాఁటి
సంఘము నేఁటి నాగరకరూపమున రూపొందెడిది కాదు. సామ్రాజ్యముల స్థాపించినది
శత్రుత్వము. సామ్రాజ్యములు భంగ్యంతరముగ సంఘవిస్తృతికి, సాంస్కృతిక
పరివ్యాప్తికిఁ దోడుపడినవి.
'శక్తివిహీనుఁడై నీ శత్రువు తాత్కాలికముగ లొంగినను నమ్మవలదు. కుటిల మైన బాణాసనము వంగిన కొలఁదిని బలీయము కదా!'యని 139[2]జబున్నీసా కవయిత్రి యనినది. ఇట్టి శత్రువుల వలనఁ బ్రయోజన మేమైనఁ గలదాయని ప్రశ్నింప నౌననియే సమాధానము. నిద్రాళువులమై యున్న మనలో నిద్రించు శక్తిని బ్రబోధించువాఁ డిట్టి శత్రువే! ఇట్టి వైతాళికుని మఱచు టెట్లు?
'నీ శత్రువులతోఁ దిరిగెడి మిత్రునకు దూరముగనుండు' మని 140[3]సౌదీకవి యుద్బోధించినాఁడు. శత్రురహస్యముల గుర్తించి మనకుఁ దెలియఁ జెప్పుటకు వారితోఁ జెలిమిఁ జేయు సఖుని గూర్చి భయమొంద నవసరము లేదు. అట్టివానిని మానసికముగఁ దూరముగ నుంచుట మర్యాదకాదు; అయిన దూరముగ నుంచుచున్నట్లు నటించుట యవసరము. అందువలన నతనిని మనము తమమూలమున నొక విరోధిగా భావించుచున్నామని భ్రమపడి వారాత్మ మైత్రినిఁ బ్రకటింపవచ్చును. వారు మనసు విప్పి చెప్పిన మాటలు నతఁడు మన చెవి వేయవచ్చును. ఒకవేళ శత్రువులతో వర్తించు సఖుడిట్టివాఁడు కాకున్న నతనిని మిత్రుఁడని వ్యవహరించుటయే యనుచితము.
అల్పుడైన శత్రువు నెల్లవేళల నవజ్ఞఁ జేసి యూరుకొనవచ్చును. వియ్యమునకుఁ గయ్యమునకు సాటి కావలయునని పెద్దలనినారు. అందుచే సాటిశత్రువును గూర్చి విశేషముగ నాలోచింప వలయును. ఇట్టి శత్రువే భంగ్యంతరముగ మనకు మిత్రుఁడు!
మిత్రులకంటె ననేక రీతుల సత్యమగు మిత్రుఁడు!! అట్టివానికిఁ బ్రాణభయము
సంభవించిన నాప్త బంధువునకుఁ బోలె సాయపడుట రాజనీతి. ఇట్టి తోడ్పాటతని
కొఱకై కాదు; మన కొఱకు!
ఈ ధర్మసూక్ష్మమును గమనించినాఁడు 'మెత్తని పులి' ధర్మరాజు, అజాతశత్రువు. ఘోషయాత్రాసందర్భము 'నారలు కట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులో విపద్భారము నొంది వందురిన (వారల) నుజ్జ్వలరాజ్య వైభవోదారులరై కనుం గొను ముదంబున’ కర్ణసచివుని మంతనమునకు లొంగి దుర్యోధనుఁడు పాండవులఁ బరాభవింప వచ్చినాఁడు. గంధర్వులచేఁతఁ విజితుడై చిక్కిపోయినాఁడు. 'సద్యస్కంధ' యజ్ఞదీక్షితుఁడై యున్న ధర్మజుని కడకు ప్రజలు వచ్చి తమ రారాజును విడిపింపుమని ప్రార్థించినారు. పూర్వవైరస్మరణ కలుషితుఁడు, ధీరోద్ధతుఁడు నైన భీముఁడు 'మనకుఁ జులుక నయ్యె మన చేయుపని గంధర్వవరులు కూడి తగ నొనర్చి రింతలెస్సయగునె యేభారమును లేక యూరకుండ నొందె మనల జయము' అని యన్నతోఁ బల్కినాఁడు. ఇది శత్రువులగూర్చి సర్వసామాన్యవ్యక్తి యొనర్చు నూహ. ధర్మజ్ఞుఁడిట్టి ప్రబల శత్రువునంత చులకనగఁ బోఁగొట్టుకొనఁ దలఁపలేదు. వారివలన నతని కీర్తి సకలలోక పరివ్యాప్తము కావలసియున్నది. అదియును గాక ప్రతిజ్ఞాపాలనానంతర మే ప్రజల నతఁ డేలుకొన వలయునో యట్టివారు వచ్చి ప్రభువును విడిపింపుఁడని ప్రాధేయపడినారు. ఇట్టి యపూర్వము, విశిష్టమునగు నవకాశమును బోఁగొట్టుకొనుటెట్లు? ఈ స్థితిలో దుర్యోధన శత్రువును విడిపించిన లోకమున, నందును ముఖ్యముగ, కురుసభయందు, నందును కురువృద్ధుల బుద్ధులందు నతనికి నీతిమంతుఁడని శౌర్యవంతుఁడని యెంతటి ప్రచారము జరుగును! పైకిఁ బలుకలేదు. కాని సర్వమును గమనించి తమ్ముల నందఱను, కాదు, ముఖ్యముగ భీముని - బలవంతపెట్టియైన నొప్పించి గంధర్వుల పైకిఁ బంపి గెల్పించి దుర్యోధనాదులు విడిపించి వారిని మఱియొక సుసమయమునకై నిలుపుకొనినాఁడు.
సాటిశత్రువుల యెడ నిట్టిమార్గమే యార్యనీతి. శత్రువుల యెడ వహింపవలసిన యుత్తమమార్గమును సూచించుచు నొక యజ్ఞాత రాజనీతిజ్ఞుఁ డిట్లు పలికినాఁడు.
141[4]మయూరంబ పోలెఁ బ్రియోక్తుల బలుకుచు శత్రుసర్పముల నడంపవలయు; జలంబులఁబోలె భూభృద్విభేదనంబుసేయ నోపియు మృదువు గావలయు; కాలుపఁ దెచ్చు కాష్ఠంబులు దలమోచినట్లు వైరులయెడ నోరుపుగలిగి జయింపవలయు నదీప్రవాహంబు విడఁద్రోవవలయు తీరద్రుమతృణంబులకుఁ బాద ప్రక్షాళనంబు
సేయునట్లు చెఱుచునంతకు శత్రునెడ సామంబులే పలుకవలయు'.
ప్రాచీనరాజన్యులకు శత్రుసంహారమొక మహాకృత్యము; కార్యసాధక
నీతిశాస్త్రములు వారికిఁ గొన్ని గుణపాఠములు చెప్పినవి. అందొక యజ్ఞాతనీతిజ్ఞుడు
పలికిన క్రిందివాక్యము లరినిషూదనక్రియల యందును నర్థవంతము లైనవి.
'రాజులకు సర్వకార్యంబులు మంత్రపూతంబులు కావున బుద్ధిసహాయులఁ గూడుకొని యుండవలయును. బుద్ధిసహాయులు ధనార్జకులు రణశూరులు నాదియగు కార్యపురుషులు కార్యకాలంబ కూర్తుమనుట గృహదాహం బగువేళ నూతి కుపక్రమించుట. వారికి వలయు ధనంబు లిచ్చుట సుక్షేత్రంబున విత్తనంబు బడినయట్లు. విభవం బెంతగల్గినను భోజన సహాయులు కల్గుదురుగాక కార్యసహాయులు కల్గనేర్తురే? మఱియు మూర్ఖుండు కార్యసహాయుఁడగుట యంధుం డంధునకుఁ దెరువు చూపిన యట్లు. వారివలన నొక కార్యంబు గల్గిన నది కాకతాళంబు, ఘుణాక్షర న్యాయంబును నగుగాని యథార్థంబు గాదు. రాజు చేపట్టిన మూర్ఖుడైనఁ గార్యవేది యగు ననందగదు. శివుండు గళంబున ధరియించిన కాలకూటం బమృత మగునె? మూర్ఖునందు కార్యంబిడుట తన్నుఁ జంపు రక్కసునిఁ దాన సృజియించుకొనుట. విఘ్న భయంబునఁ గార్యంబు విడచుట తొడుగు గలుగునని యారంభంబు విడచుట యజీర్ణంబగునని యాహారం బుజ్జగించుటయును...”
మన భారతీయ విజ్ఞాను లిట్టి సామాన్యధర్మములు గాక శత్రువుల యెడఁ బ్రయోగింపఁదగిన షాడ్గుణ్యములను, కూటప్రకాశ యుద్ధస్వరూపములను వ్యూహవిధానమును మిత్రనీతుల మూలమున నిరూపించి ప్రాచీన రాజన్యులకు శత్రుమారణతంత్రమున మహనీయ ప్రబోధమును కావించిరి.
142[5]ఎరిస్టోఫాని సను గ్రీకుతత్త్వవేత్త శత్రుభయము మూలమున మానవజాతియం దంతియ కాదు సమస్త ప్రాణికోటియందును సృజనాశక్తి యభివృద్ధి నొందినదని ప్రవచించినాఁడు. ఈ ప్రవచనమున ననంతసత్య మభివ్యక్తమగుచున్నది. శత్రువుల మూలమున సముద్ర గర్భమునఁ జరించు జంతువులఁ గొన్ని ఖడ్గములవంటి దంతములఁ బెంపొందించుకొనినవి. 'సన్ ఫిష్' శత్రుభయమువలన నెంతయో బరువెక్కుచున్నది. క్రిమికీటకములు వాతావరణమును బట్టి వర్ణమును మార్చు కొనుటయును, వాయుపథాంచలముల కెగసిపో రెక్కలఁ బెంచుకొనుటయును, నూతనకంఠధ్వనులఁ గల్పించి మోసగించుటయును నేర్చుకొనినవి. సూక్ష్మదృష్టితోఁ బరిశీలించిన నేఁటి నాగరకతలో బహుళాంశము రిపుభయ మూలమున రూపొందినదని
విస్పష్టముగఁ జెప్పవచ్చును. చైనావారికి శత్రుభయము లేకున్న జగద్విఖ్యాతి నొందిన
చైనాఘనకుడ్యము నిర్మితమై యుండెడిది కాదు. బౌద్ధాదిమతములు మనోహర
శిల్పములతో మానవ హృదయముల నాకర్షించుటకు శత్రుభయమే కారణము.
ఆంగ్లేయులు నౌకాయానమున నగ్రగణ్యులగుటకు వీలు కలిగెడిది కాదు. రాక్షసులు
లేక దేవతలు భాసింపనట్లు శత్రువులు లేక శక్తిసంపన్నులు భాసింపరు. ఒకనికి
శత్రువు లధికమనిన నతఁడు శక్తిమంతుఁడని వెల్లడి యగుచున్నది. దేశములు జాతులు
నైనట్లే.
'నీ కేఁబదిమంది మిత్రులున్నను జాలదు. ఒక శత్రువునైఁన దప్పకఁ జూచుకొను' మని యిటలీ దేశమునందొక నీతి. మన దేశమున శత్రుశేషములు ఋణశేషమును మిగుల్పరాదని మఱియొక నీతి. ఋణమొనర్చుటయె తగనిపని. అయినను ఋణశేషము వలన నొక ప్రయోజనమున్నది. వీనిని బూర్తిగఁ జెల్లించిన, బుట్టని ఋణము ఋణ శేషమువలనఁ బుట్టుచున్నది. దీని నివ్వకున్న మొదటి దాని కేమి మొప్పము కలుగునోయను భయమే యిట్టి ఋణము పుట్టుటకుఁ గారణమై యుండవచ్చును. శత్రుశేషము వలన నిట్టి విశిష్ట ప్రయోజనములు సూక్ష్మముగ నాలోచించినఁ గన్పింపకపోవు.
సాటిశత్రువుల విషయమున 'బ్రతికి బ్రతుక' నిమ్మనునది యత్యుత్తమ నీతి. అయిన నతని విషయమున నతిజాగరూకత వహింపవలసిన మాట సత్యము. కనులు మూసికొనిన నెంతటి చతురుఁడైన 'నష్టవిధ నిరయములు' లోని కష్టములకుఁ బాలగుట తప్పదు. శత్రుగుణముల మెచ్చుకొనుట యుదాత్తుని లక్షణములు, 'శత్రోరపి గుణా వాచ్యా వాచ్యా దోషా గుణోరపి' అనునది దేవభాషాసూక్తి. ఇట్టియుదాత్తతకుఁ బురుషోత్తముఁడొక యుత్తమోదాహరణము. అనేకములతోఁబాటు శత్రుగుణముల మెచ్చుకొనఁగల 'సహస్రాక్షుఁ' డను సాహసముననే పూర్వము ముజ్జన్మల లభించు మోక్షమాసించి జయవిజయులు 'వైరభక్తు' లైనారు.
'సంశయాత్మా వినశ్యతి' యని భగవానుఁడు గీతలోఁ బ్రవచించినను సంశయించుట మానవజాతికి నైజమైనది. శత్రువు గర్షణయోగ్యుఁడు కాఁడని యెన్ని ప్రబోధముల వినినను మానవులొకరీతి 'మాయావరణము' నుండి బయటపడ లేకున్నారు. శత్రువును గూర్చి జిజ్ఞాస యొనర్చి 'నేతి నేతి' విధానమునఁ దర్శించిన
శత్రువెవఁడు?
ఈర్యాపరుఁడైన శత్రు వర్థరహితుఁడైన మిత్రుని కంటె నధికుఁ' డని షిల్లరు మహాకవి సెలవిచ్చినాఁడు. ఇందలి మహార్థము సామాన్యదృష్టికి సహజముగ గోచరించకపోవచ్చును. శత్రుత్వమున కీర్ష్య మూలబీజము. ఇది జ్ఞాతముగ నైన నజ్ఞాతముగనైన వృద్ధిపొందుచున్న కొలఁది సుభయపక్షముల సృజనాశక్తి వృద్ధియగును కదా! ఏ యుగమునందైన నత్యుత్తమ కళాసృష్టి జరిగినదన్నను, శాస్త్రార్థవివేచన విజృంభించినదన్నను వాని కభివ్యక్తముకాని యీర్ష్య మూలాధారమై యుండును. 143[6]'ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్వి న్బురాణావళుల్ దెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తా నెట్టిదో తెనుఁగుం జేయరు మున్ను భాగవతము న్దీని న్దెనింగించి నాజననంబు న్సఫలంబు సేసెదఁ బునర్జన్మంబు లేకుండగన్" అని నిగర్వశిరోమణిగఁ బలికిన సహజ శేముషీ ధురంధరుఁడగు పోతనామాత్యుని యందైన యుదయించి యుండక పోదు. ప్రయోజనకరమగు నీర్ష్యకొక చరిత్ర పుట్టిన నెన్ని వైచిత్య్రములున్నచో, దానివలనఁ బ్రపంచ మెట్టి ప్రయోజనములఁ బొందినదో వ్యక్తమైయుండెడిది. అయిన నట్టి చరిత్ర పుట్టుట కవకాశము లేదు. 144[7]'సత్యముతోఁ దాఁ జేసిన పరిశోధనలఁ' జెప్పఁగల ధైర్యసాహసములు మహాత్మునకు దప్ప మఱి యెవ్వరికిఁ గలవు! అర్థరహితుఁడైన మిత్రుఁడు మనకే రీతి నుపయోగకారి కాఁడు. అతని యర్థరహిత నిత్యసాంగత్యము వలన మనపైఁ బ్రభావము నెఱపఁబూనిన నిరుపమానమైన ప్రమాదము సంభవింప వచ్చును; మన యుదాత్తాశయములకు 'స్వస్తిఁ' జెప్పుట తటస్థింప వచ్చును. ఈ కారణములచే నర్థరహితుఁడైన మిత్రునికంటె నీర్యాపరుఁడైన శత్రు వత్యధికుఁడను నంశము నిర్ధారితమగుచున్నది.
మిత్రు లెల్లవేళల మనలోని మంచి నాలోచించెదరు. శత్రువులు నిత్యమును లోపముల వెదకి లోకముఖమున బహిర్గత మొనర్చెదరు. భంగ్యంతరముగ దోషముల గ్రహించి సవరించుకొన నవకాశము కల్పించునది మన శత్రువులు. మనలో 'నేకలవ్యత్వ' మున్న శత్రువును 'ద్రోణగురువుగ' స్వీకరించి వారిమూర్తుల ధ్యానవరద ముద్రలతో 145[8] దక్షిణామూర్తి స్వరూపులుగ 'పర్యంకాసన' మున నిల్పి, పూజించి, శిరము మోడ్చి 'శక్తిపాతము' ను బొందుట చతురత, రసికత, యుదాత్తత, యుచితజ్ఞత!
'బలవంతుఁడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా!' యని
నాఁడొక శతకకర్త. ఈ రీతిగ వ్యవహరించి యర్థరహితమైన శత్రుత్వములఁ గల్పించు
కొనుట యభ్యుదయ పరంపరలఁ జేకూర్చునని యెవఁడు చెప్పఁగలడు? ఇట్టి
శత్రుత్వములును బ్రయోజనరహితములు. శక్తిసంపన్నుఁడైన శత్రువే ప్రయోజనకారి.
అతఁడె మన 'మూలశక్తి'. అతఁడె మన కెత్తని కీర్తిధ్వజము! అతఁడె మన కీర్తిలతల
'నేడు వారాశుల కడపటి కొండపైఁ గలయఁ బ్రాకించు' దోహదకారుఁడు!!
తాత్కాలిక శత్రుత్వ మిత్రత్వములు గ్రహములకె కాక మనకు నున్నవి. ఇట్టి స్థితులలో సహజశత్రువును, సహజ మిత్రమును గమనించుట కష్టము. ఈ సంధిసమయములఁ గొన్ని సందర్భములలో మన 146[9] కస్తంగతత్వము పట్టుటయుఁ గలదు. 'అన్యోన్యవీక్షల' వలన లోకమున కనామయమగుటయుఁ గలదు; ప్రళయ మగుటయు కలదు.
'నీచేత నపకారమును బొందిన శత్రువుకంటె నీకపకారము చేసిన శత్రువు బలవత్తరమైనవాఁ' డని యొక తత్త్వవేత్త పలికినాఁడు. ఈ యిరువురి యందును మొదటివాని కట శత్రుత్వము స్వతస్సిద్ధ మైనది కాదు. అతని హృదయక్షేత్రమున నా బీజమును నాటినవాఁడవు నీవు. అది యటుపిమ్మటఁ బెఱిఁగి యుండవచ్చును. రెండవాని యందు శత్రుత్వము దానియంత నది పడి మొలకెత్తి పెరుగుచున్నది. అట్టి శత్రువును గూర్చి శ్రద్ధాళువునై యున్న నీకెట్టి ప్రమాదమును లేదని పై తాత్వికుని భావము.
ఒకానొక యాంగ్లకవిపుంగవుఁడు 'శత్రువులు మన బాహ్యాత్మ' లని భావించి నాఁడు. ప్రేమార్ద్రతవలననో లేక స్వతస్సిద్ధముగ లోపముల గుర్తింప నశక్తులగుట వలననో మిత్రులు మేలుచేయలేక పోవుచుందురు. శత్రువులు వానిని బట్టబయలు గావించి విజయగర్వమునఁ బట్టము గట్టుకొనుచుందురు. అందుచే వారు మన గుణముల గ్రహించుటకు యత్న మొనర్పరని కాదు. ఈ విషయమున 'నీ గుణములఁ బైకి మెచ్చుకొనునది నీ మిత్రులు అంతఃకరణమున మెచ్చుకొనువారు నీ శత్రువులు' - అను రవీంద్రగురుదేవుని వాక్యమున ననంతసత్య మంతర్భూతమైయున్నది.
కావున శత్రువును గూర్చి జంక నగత్యము లేకుండుటట్లుండఁ గీర్తిప్రతిష్ఠలు గోరువా రరివర్గము నర్థమొనర్చుటకు యత్నింపవలయు ననియు, నాశన మొనర్చుతఱి నానారీతు లవలంబింప వలయుననియు, నొక శత్రువైన లేనివాఁ డతని వలనఁ గలుగు ప్రయోజనములు గమనించి యెంత విలువనైన నిచ్చి విలిచికొన వలయు
ననియు వ్యక్తమగుచున్నది.
శత్రువు మానవమానసరత్నాకరమున లభించు నొక యమూల్యరత్నము. సానఁబెట్టిన పిమ్మట నందుఁ దోఁచు ననంత కోణకాంతిచ్ఛటల దర్శించి యర్థ మొనర్చుకొనఁ గలిగినవాని కాశ్చర్యము గాని, యావేదన గాని కలుగదు. దాని నొక యమూల్యవస్తువుగా గ్రహించి నిజమానస వస్తుప్రదర్శనశాల యందు భద్రపఱచి పరిశీలించుచుఁ బరమ ప్రయోజనమును బరమానందమును బొందు నతఁడొక మహత్తర సాధకుఁడగుట శంకాశూన్యమైన సత్యము.
- ↑ 138. ప్లూటార్కు - (క్రీ.శ. 48-122) గ్రీకు జీవిత చరిత్రకారుఁడు (Biographer) అతని 'Lives’ ప్రముఖ గ్రంథము
- ↑ 139. జేబున్నీసా - ఉరుదు భాషలో కవయిత్రి
- ↑ 140. సౌదీ - పర్షియను కవి
- ↑ 141. మయూరంబవోలె - మడికి సింగన సకల నీతి సమ్మతము
- ↑ 142. ఎరిస్టోఫానిస్ - క్రీ.పూ. 445-385) ఏఁబదినాలుగు సుఖాంతనాటకముల రచించిన గ్రీకు నాటకకర్త - The World's Greatest Comic dramatist;
- ↑ 143. ఒనరన్ - పోతన భాగవతకృత్యాదినిఁ జెప్పిన పద్యము
- ↑ 144. సత్యముతో - మహాత్ముఁడు తన యాత్మకథకు 'My experiments with truth’ అని నామకరణము చేసినాడు.
- ↑ 145.దక్షిణామూర్తి - శ్రుతి శాస్త్రార్థ వ్యాఖ్యాన మొనర్చు శివమూర్తి విభేదము
- ↑ 146. అస్తంగతత్వము - రవితోఁ జేరిన గ్రహముల కస్తంగతత్వదోషము కలుగుట జ్యోతిషశాస్త్ర ప్రసిద్ధము.