Jump to content

బాల వ్యాకరణము/సంధి పరిచ్ఛేదము

వికీసోర్స్ నుండి


  బాల వ్యాకరణము - సంధి పరిచ్ఛేదము

1. ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు.

2. ప్రథమేతర విభక్తి శత్రర్థ చువర్ణంబులందున యుకారమునకు సంది వైకల్పితముగా నగును.

3. సంధి లేనిచోట స్వరంబుకంటెం బరంబయిన స్వరంబునకు యడాగమంబగు.

4. అత్తునకు సంధి బహుళముగానగు.

5. ఏమ్యాదులయిత్తునకు సంధి వైకల్పికముగా నగు.

6. క్రియాపదంబులం దిత్తునకు సంధి వైకల్పికముగా నగు.

7. మధ్యమ పురుష క్రియలయం దిత్తునకు సంధి యగును.

8. క్తార్థంబైన యిత్తునకు సంధి లేదు.

9. ఇఁకాదులకుఁ దప్ప ద్రుతప్రకృతికములకు సంధి లేదు.

10. అచ్చున కాంరేడితంబు పరంబగునపుడు సంధి తఱుచుగనగు.

11. అంద్వవగాగ మంబులందప్ప నపదాదిస్వరంబు పరంబగునపు డచ్చునకు సంధియగు.

12. కుఱు చిఱు కడు నడు నిడు శబ్దముల ఱడల కచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు.

13. ప్రథమమీఁది పరుషములకు గ స డ ద వ లు బహుళముగా నగు.

14. తెనుఁగుల మీది సాంస్కృతిక పరుషములకు గ స డ ద వ లు రావు.

15. ద్వంద్వంబునం బదంబుపయి పరుషములకు గ స డ ద వ లగు.

16. ద్రుత ప్రకృతికముమీఁది పరుషములకు సరళములగు.

17. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాషనంబగు.

18. ద్రుతంబునకు సరళ స్థిరంబులు పరంబులగునపుడు లోప సంశ్లేషంబులు విభాషనగు.

19. వర్గయుక్సరళములు పరము లగునపుడు డొకానొకచో ద్రుతమునకు బూర్ణ బిందువును గానంబడియెడి.

20. అవసానంబునందు ద్రుతస్వరంబునకేని, ద్రుతంబుకేని లోపంబు బహుళంబు గానగు.

21. కొన్ని యెడల ద్రుతంబుమీఁద నకారంబు గానంబడియెడి.

22. అఁట యిఁక చుఁడు శబ్దంబులం దప్ప సుడి తొలి హ్రస్వంబు మీఁద ఖండబిందువును ద్రుతంబునకు లోపంబును లేవు.

23. తాను నేను పదంబుల ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు.

24. సమాసంబునందు ద్రుతంబునకు లోపంబగు.

25. సమాసంబుల నుదంతంబులగు స్త్రీ సమంబులకుం, బుంపులకుం, బరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.

26. సమాసంబులందు ద్రుతంబునకు స్వత్వంబు లేదు.

27. తలఁబ్రాలు మొదలగు సమాసంబుల ద్రుతమునకు లోపము లేదు.

28. కర్మధారయంబులం దుత్తున కచ్చు పరంబగునపుడు టుగాగమంబగు.

29. కర్మధారయంబునందుఁ బేర్వాది శబ్దముల కచ్చు పరంబగునపుడు టుగాగమంబు విభాషనగు.

30. పేదాది శబ్దంబుల కాలుశబ్దము పరంబగునపుడు కర్మధారయంబునందు రుగాగమంబగు.

31. కర్మధారయంబునం దత్సమంబుల కాలుశబ్దము పరంబగునపుడు డత్వంబున కుత్వంబును రుగాగమంబునగు.

32. కర్మధారయంబులందు మువర్ణకంబు కుం బుంపులగు.

33. ఉదంతమగు తద్ధర్మార్థ విశేషణమున కచ్చు పరమగునపుడు నుగాగమంబగు.

34. షష్ఠీ సమాసమునం దుకార ఋకారముల కచ్చు పరమగునపుడు నుగాగమంబగు.

35. ఉదంత స్త్రీ సమంబులకును, బుంపులగు నదంత గుణవాచకంబులకును, దనంబు పరంబగునపుడు నుగాగమంబగు.

36. సమాసంబునఁ బ్రాఁతాదుల తొలియచ్చు మీఁది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగానగు.

37. లుప్తశేషంబుకుం బరుషములు పరములగునపుడు నుగాగమంబగు.

38. కొత్త శబ్దమున కాద్యక్షర శేషంబునకుం గొన్నియెడల నుగాగమంబునుం గొన్నియెడల మీది హల్లునకు ద్విత్వంబునగు.

39. అన్యంబులకుసహిత మిక్కార్యంబులు కొండొకచోఁ గానంబడియెడి.

40. ఆంరేడితంబు పరంబగునపుడు కడాదులం దొలియచ్చు మీఁది వర్ణంబు కెల్ల నదంతంబగు ద్విరుక్తటకారంబగు.

41. ఆంరేడితంబు పరంబగునపుడు విభక్తి లోపంబు బహుళంబుగా నగు.

42. అందదుకు ప్రభృతులు యథాప్రయోగంబుగ గ్రాహ్యంబులు.

43. చేత తోడ వలనల కిత్వంబు సమానంబుల దగు.

44. అంద్వాదుల కలిగాగమంబు సమాసంబునం దగు.

45. అది యవి శబ్దంబుల యత్తునకు వృత్తిని లోపంబు బహుళంబుగ నగు.

46. పడ్వాదులు పరంబులగునపుడు మువర్ణకంబునకు లోపపూర్ణబిందువులు విభాషనగు.

47. మధ్యమ పురుష మువర్ణకంబునకు హలవ సానంబులు పరంబులగునపుడు లోపము విభాషనగు.

48. వ్యతిరేక మధ్యమ మువర్ణకంబున కెల్లయెడల లోపంబు విభాషనగు.

49. ఆంరేడితంబు పరంబగునపుడు మధ్యమముడుఙఙ లోపంబు విభాషనగు.

50. విసర్గంబున కనుకరణంబున లోపంబగు.

51. అనుకృతిని నమశ్శబ్దము తుది యత్తున కోత్వము విభాషనగు.

52. అనుకరణంబునం దుదిహల్లునకు ద్విత్వచనంబగు.

53. అనుకరణంబునం దహమాదుల మకారంబునకు ద్విరుక్తి విభాషనగు.

54. ఉదందనామంబున కనుకరణంబునందు వుగాగమంబగు.

55. వాక్యావసానంబున సంధిలేమి దోషంబు గాదని యార్యులండ్రు.

పెద్దలు వ్యవహరించిన మాట గ్రామ్యంబయిన గ్రహింపఁదగునని తాత్పర్యము. కఱకంఠుఁడు, ప్రాణగొడ్డము, జీవగఱ్ఱ, కపిలకన్నులు, కపిల గడ్డము, కపిలజడలు.

ఇది సంజ్ఞాపరిచ్ఛేదము.


సంధి పరిచ్ఛేదము.


1. ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధి యగు.

పూర్వపరస్వరంబులకుం బరస్వరం బేకాదేశంబగుట సంధి యనఁబడు.

రాముఁడు ... అతఁడు ... రాముఁడతఁడు.

సోముఁడు ... ఇతఁడు ... సోముఁడితఁడు.

మనము ... ఉంటిమి ... మనముంటిమి.

అతఁడు ... ఎక్కడ ... అతఁడెక్కడ.

ఇతఁడు ... ఒకఁడు ...ఇతఁడొకఁడు.


2. ప్రధమేతర విభక్తి శత్రర్థ చువర్ణంబు లందున్న యుకారమునకు సంధి వైకల్పికముగా నగును.

నన్ను + అడిగె = నన్నడగె, నన్నునడిగె.

నాకొఱకున్‌ + ఇచ్చె = నాకొఱకిచ్చె, నాకొఱకునిచ్చె. నాకున్‌ ... ఆదరువు ... నాకాదరువు, నాకునాదరువు.

నాయందున్‌ ... ఆశ ... నాయందాశ, నాయందునాశ.

ఇందున్‌ ... ఉన్నాఁడు ... ఇందున్నాఁడు, ఇందునున్నాఁడు.

ఎందున్‌ ... ఉంటివి ... ఎందుంటివి, ఎందునుంటివి.

వచ్చుచున్‌ ... ఉండెను ... వచ్చుచుండెను, వచ్చుచునుండెను.

చూచుచున్‌ ... ఏగును ... చూచుచేగెను, చూచుచునేగెను.

3. సంధి లేని చోట స్వరంబుకంటెం బరంబయిన స్వరంబునకు యడాగమంబగు. ఆగమం బనఁగా వర్ణాధిక్యంబు.

మా ... అమ్మ ... మాయమ్మ.

మీ ... ఇల్లు ... మీయిల్లు.

మా ... ఊరు ... మాయూరు.

4. అత్తునకు సంధి బహుళముగా నగు.

మేన ... అల్లుడు ... మేనల్లుడు, మేనయల్లుడు.

పుట్టిన ... ఇల్లు ... పుట్టినిల్లు, పుట్టినయిల్లు. చూడక ... ఉండెను ... చూడకుండెను, చూడకయుండెను.

బహుళ గ్రహణముచేత స్త్రీవాచక తత్సమ సంబోధనాంతంబులకు సంధిలేదు.

అమ్మ ... ఇచ్చెను ... అమ్మయిచ్చెను.

దూత ... అతఁడు ... దూతయితఁడు.

చెలువుఁడ ... ఇందము ... చెలువుఁడయిందము.

సంస్కృతీయంబునకు సంధి యగునని యధర్వణాచార్యులు చెప్పిరిగాని దానికిం బూర్వకావ్యంబులందుఁ బ్రయోగంబు మృగ్యంబు. ఆధునిక కృతులం దొకానొకచోట స్త్రీవాచక తత్సమంబులకు సంధి గానం బడియెడు. గంగనుకాసె - నెలఁతిచ్చెను. వెలయాల్వాదుల సంధిలేమి బాహుళకముచేతనే యని యూహించునది.

5. ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగా నగు.

ఏమి - మఱి - కిషష్టి - అది - అవి - ఇది - ఇవి - ఏది - ఏవి. ఇది యాకృతి గణంబు.

ఏమి ... అంటివి ... ఏమంటివి, ఏమియంటివి.

మఱి ... ఏమి ... మఱేమి, మఱియేమి.

హరికిన్‌ ... ఇచ్చె ... హరికిచ్చె, హరికినిచ్చె. 6. క్రియాపదంబులం దిత్తునకు సంధి వైకల్పికముగా నగు.

వచ్చిరి ... అప్పుడు ... వచ్చిరప్పుడు, వచ్చిరియప్పుడు.

వచ్చితిమి ... ఇప్పుడు ... వచ్చితిమిప్పుడు, వచ్చితిమియిప్పుడు.


7. మధ్యమపురుష క్రియలయం దిత్తునకు సంధి యగును.


ఏలితివి ... అపుడు ... ఏలితివపుడు.

ఏలితి ... ఇపుడు ... ఏలితిపుడు.

ఏలితిరి ... ఇపుడు ... ఏలితిరిపుడు.


8. క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు.


వచ్చి ... ఇచ్చెను ... వచ్చియిచ్చెను.


9. ఇఁకాదులకుఁ దప్ప ద్రుతప్రకృతికములకు సంధి లేదు. ప్రథమేతర విభక్తివిధి నిరవకాశంబుగావున దీనిని బాధించెడిని.


వచ్చున్‌ ... ఇపుడు ... వచ్చునిపుడు

చూడన్‌ ... అయితి ... చూడనయితి.

ఉండెడిన్‌ ... అతఁడు ... ఉండెడినతఁడు.

ఇఁక - ఇఁగ - ఎట్టకేలకు - ఎట్టకేని - ఈయవి - యికాదులని యెఱుంగునది; వీనికి సంధి వైకల్పికము. 10. అచ్చున కామ్రేడితంబు పరంబగునపుడు సంధి తఱుచుగ నగు.

ద్విరుక్తము యొక్క పరరూప మామ్రేడిత మనంబడు. తఱచుగ ననుటచేత నొకానొకచోట వైకల్పిక సంధియుం గలదని తాత్పర్యము.

ఔర ... ఔర ... ఔరౌర.

ఆహా ... ఆహా ... అహాహా.

ఎట్టూ ... ఎట్టూ ... ఎట్టెట్టూ.

ఓహో ... ఓహో ... ఓహోహో.

ఏమి ... ఏమి ... ఏమేమి, ఏమియేమి.

ఎగి యేగి యనుచోఁ గ్త్వార్థంబగుట సంధిలేదు.

11. అంద్వవగాగమంబులం దప్ప నపదాదిస్వరంబు పరంబగునపు డచ్చునకు సంధి యగు.

మూర ... ఎఁడు ... మూరెఁడు

వీసె ... ఎఁడు ... వీసెఁడు

అర్థ ... ఇంచు ... అర్థించు

నిర్జి ... ఇంచు ... నిర్జించు

అంద్వవగాగమంబులు పరంబగునపుడు యథాసంభవముగా గ్రహించునది. రాములందు - రాములయందు - హరియందు - ఎనిమిదవది - ఎనిమిదియవది. 12. కుఱు చిఱు కడు నడు నిడు శబ్దముల ఱ డ ల కచ్చు పరంబగునపుడు ద్విరుక్తటకారం బగు.

కుఱు ... ఉసురు ... కుట్టుసురు

చిఱు ... ఎలుక ... చిట్టెలుక

కడు ... ఎదురు ... కట్టెదురు

నడు ... ఇల్లు ... నట్టిల్లు

నిడు ... ఊరుపు ... నిట్టూరుపు

13. ప్రథమమీఁది పరుషములకు గ స డ ద వ లు బహుళముగా నగు.

వాఁడు ... కొట్టె ... వాఁడు గొట్టె, వాఁడు కొట్టె

అపుడు ... చనియె ... అపుడు సనియె, అపుడు చనియె

నీవు ... టక్కరివి ... నీవు డక్కరివి, నీవు టక్కరివి

మీరు ... తలఁడు ... మీరు దలఁడు, మీరు తలఁడు

వారు ... పోరు ... వారు వోరు, వారు పోరు

అపు డిప్పు డెప్పు డను శబ్దములు నిత్యైక వచనాంతములు. వాగనుశాసనులు యదాతదా యని గ్రహించుట ప్రపంచార్థ మని యెఱుఁగునది. ఈ కార్యము కళలగు క్రియా పదముల మీఁద సహితము కానంబడియెడి.

రారు ... కదా ... రారు గదా, రారు కదా

వత్తురు ... పోదురు ... వత్తురు వోదురు, వత్తురు పోరుదు

14. తెనుఁగుల మీఁది సాంస్కృతిక పరుషములకు గ స డ ద వ లు రావు.

వాఁడు ... కంసారి ... వాఁడు కంసారి

వీఁడు ... చక్రపాణి ... వీఁడు చక్రపాణి

ఆయది ... టంకృతి ... ఆయది టంకృతి

అది ... తథ్యము ... అది తథ్యము

ఇది + పథ్యము = ఇది పథ్యము

15. ద్వంద్వంబునం బదంబు పయి పరుషములకు గ స డ ద వ లగు.

కూర ... కాయ ... కూరగాయలు

కాలు ... చేయి ... కాలుసేతులు

టక్కు ... టెక్కు ... టక్కు డెక్కులు

తల్లి ... తండ్రి ... తల్లిదండ్రులు

ఊరు ... పల్లె ... ఊరువల్లెలు

16. ద్రుతప్రకృతికము మీఁది పరుషములకు సరళములగు. పూచెను ... కలువలు ... పూచెను గలువలు

తోఁచెను ... చుక్కలు ... తోఁచెను జుక్కలు

చేసెను ... టక్కులు ... చేసెను డక్కులు

నెగడెను ... తమములు ... నెగడెను దమములు

మొగిడెను ... పద్మము ... మొగిడెను బద్మము

17. ఆదేశసరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాష నగు.

సంశ్లేషం బనగా మీఁది హల్లుతోఁ గూడికొనుట.

పూచెను గలువలు .... పూచెంగలువలు, పూచెఁగలువలు, పూచెన్గలువలు

తోఁచెను జుక్కలు .... తోఁచెంజుక్కలు, తోఁచెఁజుక్కలు, తోఁచెన్జుక్కలు

చేసెను డక్కులు .... చేసెండక్కులు, చేసెఁడక్కులు, చేసెన్డక్కులు

నెగడెను దమములు ... నెగడెందమములు, నెగడెఁదమములు, నెగడెన్దమములు

మొగిడెను బద్మము ... మొగిడెంబద్మము, మొగిడెఁబద్మము, మొగిడెన్బద్మము పక్షంబున స్వత్వంబగు. స్వత్వంబనఁగా ద్రుతంబునకుఁ బ్రకృతి భావము.

18. ద్రుతంబునకు సరళస్థిరంబులు పరంబు లగునపుడు లోపసంశ్లేషంబులు విభాష నగు.

వచ్చెను ... గోవులు ... వచ్చె గోవులు, వచ్చెన్గోవులు, వచ్చెను గోవులు

మెఱసెను ... ఖడ్గము ... మెఱసెఖడ్గము, మెఱసెన్ఖడ్గము, మెఱసెను ఖడ్గము

19. వర్గయుక్సరళములు పరములగునపు డొకానొకచో ద్రుతమునకుఁ బూర్ణబిందువును గానంబడియెడి.

వచ్చెను ... ధాత్రీపతి ... వచ్చెంధాత్రీపతి

పాడెను ... గంధర్వుఁడు ... పాడెంగంధర్వుఁడు

కన్‌ ... దోయి ... కందోయి

20. అవసానంబునందు ద్రుతస్వరంబునకేని ద్రుతంబున కేని లోపంబు బహుళంబుగా నగు.

వాఁడువచ్చెన్‌ - వాఁడువచ్చె - వాఁడువచ్చెను. ఈలోపంబు పద్యాంతములయందు గణానుసారంబుగ వ్యవస్థితంబయియుండు గుర్వవసాయియగు పద్యంబుతుదను స్వత్వంబులేదు. అతిశయముగ బుద్ధిమంతుఁడగు బుధసేవన్‌.

21. కొన్నియెడల ద్రుతంబుమీఁద నకారంబు గానంబడియెడి.

అదియునున్గాక, దివంబునుంబోలె.

22. అఁట యిఁక చుఁడు శబ్దంబులం దప్ప నుడి తొలి హ్రస్వంబుమీఁద ఖండబిందువును ద్రుతంబునకు లోపంబును లేవు.

ముంగొంగు, క్రొంబసిఁడి, కన్దోయి.

23. తాను నేను పదంబుల ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు.

తాను ... ౘదివె ... తాఁ ౙదివె, తాను ౙదివె

తాను ... వినె ... తా వినె, తాను వినె

దీర్ఘంబు మీఁదిది గాన దీనికి నెఱసున్న లేదు.

24. సమాసంబునందు ద్రుతంబునకు లోపంబగు.

ఎల్లయర్థములు, ఎల్లకలుషములు. సర్వపర్యాయంబయిన యెల్ల శబ్దంబు ద్రుతాంతంబయిన యవ్యయంబు. దీని కసమాసంబున విశేష్యంబునకు ముందు ప్రయోగంబు లేదు.

25. సమాసంబుల నుదంతంబులగు స్త్రీసమంబులకుం, బుంపులకుం బరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.

ఇచటం బరుషంబులు పరంబులగునపుడు ద్రుతంబునకు బిందు సంశ్లేషంబులచే మూఁడురూపంబులు. సరళంబులు పరంబులగునపుడు లోప సంశ్లేష పూర్ణబిందువులచేత మూఁడు రూపములు. విధాన సామర్థ్యము వలన దీనికి లోపము లేదు. వక్ష్యమాణవిధిచే స్వత్వములేదు.

చిగురు ... కయిదువు ... చిగురుంగయిదువు, చిగురుఁగయిదువు, చిగురున్గయిదువు

తళుకు ... గజ్జెలు ... తళుకుంగజ్జెలు, తళుకుగజ్జెలు, తళుకున్గజ్జెలు

సింగపు ... కొదమ ... సింగపుంగొదమ, సింగపుఁగొదమ, సింగపున్గొదమ

ఉన్నతంపు ... గొడుగు ... ఉన్నతంపుంగొడుగు, ఉన్నతంపుగొడుగు, ఉన్నతంపున్గొడుగు నలుఁగడాదులు నీ యాగమంబు లేదండ్రు. ఈ యాగమంబొకా నొకచోట స్థిరంబు పరంబగుచోఁ గానంబడియెడి. గఱునపున్మురువు.

26. సమాసంబులందు ద్రుతంబునకు స్వత్వంబు లేదు.

27. తలఁబ్రాలు మొదలగు సమాసంబుల ద్రుతమునకు లోపము లేదు.

తలఁబ్రాలు - ఒడిఁబ్రాలు - సేసఁబ్రాలు - ఊరఁబంది - ఊరఁబిచ్చిక - తోడఁబుట్టువు - తోఁబుట్టువు - ఒల్లన్‌బాటు - ఒడఁబాటు ఇత్యాదులు.

28. కర్మధారయంబులం దుత్తున కచ్చు పరంబగునపుడు టుగాగమం బగు.

కఱకు ... అమ్ము ... కఱకుటమ్ము

నిగ్గు ... అద్దము ... నిగ్గుటద్దము

సరసపు ... అలుక ... సరసపుటలుక

29. కర్మధారయంబునందుఁ బేర్వాదిశబ్దముల కచ్చు పరంబగునపుడు టుగాగమంబు విభాషనగు.

పేరు ... ఉరము ... పేరటురము, పేరురము చిగురు ... ఆకు ... చిగురుటాకు, చిగురాకు

పొదరు ... ఇల్లు ... పొదరుటిల్లు, పొదరిల్లు

30. పేదాది శబ్దంబుల కాలుశబ్దము పరంబగునపుడు కర్మధారయంబునందు రుగాగమం బగు.

పేద ... ఆలు ... పేదరాలు

బీద ... ఆలు ... బీదరాలు

పేద - బీద - ముద్ద - బాలింత - కొమ్మ - జవ - అయిదవ - మనుమ - గొడ్డు ఇట్టివి పేదాదులు. ఇందు జవ్వని శబ్దంబునకు జవాదేశంబని యెఱుంగునది. "ఏకాంతమునందు నున్న జవరాండ్ర" నని ప్రయోగము.

31. కర్మధారయంబునం దత్సమంబుల కాలుశబ్దము పరంబగునపు డత్వంబున కుత్వంబును రుగాగమంబు నగు.

ధీర ... ఆలు ... ధీరురాలు

గుణవంత ... ఆలు ... గుణవంతురాలు

ఇచట వృత్తియం దాలుశబ్దము స్త్రీమాత్రపరము.

32. కర్మధారయంబులందు మువర్ణకంబునకుం బుంపు లగు. సరసము ... మాట ... సరసపుమాట, సరసంపుమాట

విరసము ... వచనము ... విరసపువచనము, విరసంపువచనము

33. ఉదంతమగు తద్ధర్మార్థవిశేషణమున కచ్చు పరమగు నపుడు నుగాగమం బగు.

చేయు ... అతఁడు ... చేయునతఁడు

చేసెడు ... అతఁడు ... చేసెడునతఁడు

34. షష్ఠీసమాసమునం దుకార ఋకారముల కచ్చు పరమగునపుడు నుగాగమం బగు.

విధాతృయొక్క ... ఆనతి ... విధాతృనానతి

రాజుయొక్క ... ఆజ్ఞ ... రాజునాజ్ఞ

35. ఉదంత స్త్రీసమంబులకును, బుంపులగు నదంతగుణవాచకంబులకును దనంబు పరంబగునపుడు నుగాగమంబగు.

సొగసు ... తనము ... సొగసుందనము, సొగసుఁదనము, సొగసున్దనము

సరసపు ... తనము ... సరసపుందనము, సరసపుఁదనము, సరసపున్దనము తెల్ల ... తనము ... తెల్లందనము, తెల్లఁదనము, తెల్లన్దనము

36. సమాసంబునఁ బ్రాఁతాదుల తొలియచ్చుమీఁది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగా నగు.

ప్రాఁత ... ఇల్లు ... ప్రాయిల్లు, ప్రాఁతయిల్లు

లేఁత ... దూడ ... లేదూడ, లేఁతదూడ

పూవు ... రెమ్మ ... పూరెమ్మ, పూవురెమ్మ

37. లుప్త శేషంబుకుం బరుషములు పరములగునపుడు నుగాగమం బగు.

ప్రాఁత ... కెంపు ... ప్రాఁగెంపు

లేఁత ... కొమ్మ ... లేఁగొమ్మ

పూపు ... తోఁట ... పూఁదోఁట

మీఁదు ... కడ ... మీఁగడ

కెంపు ... తామర ... కెందామర

చెన్ను ... తోవ ... చెందోవ

చెన్ను శబ్దము వృత్తిని శోణార్థకంబు. బహుళ గ్రహణముచే మీఁదు ప్రభృతులం నిట లోపంబు నిత్యంబు. వ్యవస్థిత విభాషచే నీ ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు. 38. క్రొత్తశబ్దమున కాద్యక్షరశేషంబునకుం గొన్ని యెడల నుగాగమంబునుం గొన్ని యెడల మీఁదిహల్లునకు ద్విత్వంబు నగు.

క్రొత్త ... చాయ ... క్రొంజాయ

క్రొత్త ... చెమట ... క్రొంజెమట

క్రొత్త ... పసిఁడి ... క్రొంబసిఁడి

క్రొత్త ... కారు ... క్రొక్కారు

క్రొత్త ... తావి ... క్రొత్తావి

పరుషేతరంబులు పరంబులగునపుడు నుగాగము ప్రాప్తి లేమిఁ జేసి వానికి ద్విత్వంబగు.

క్రొత్త ... గండి ... క్రొగ్గండి

క్రొత్త ... నన ... క్రొన్నన

క్రొత్త ... మావి ... క్రొమ్మావి

కెంధూళి కెంజడలని ప్రయోగంబులు కానంబడియెడి. బహుళ గ్రహణముచేతఁ గ్రొత్తకుండ లిత్యాదుల లోపంబులేదు. క్రీఁగడుపు, క్రీఁగాలు, క్రీఁదొడ ఇత్యాదులం గ్రిందుశబ్దమునకు లుప్తశేషంబునకు దీర్ఘంబు బహుళ గ్రహణముచేత నని యెఱుఁగునది.

39. అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొకచోఁ గానంబడియెడి. ఒకానొక శబ్దంబున నొకానొక శబ్దము పరంబగునపుడు తొంటియటు లోపనుగాగమంబును, గొండొక శబ్దమున కొకానొక శబ్దము పరంబగునపుడు లోపద్విత్వంబులును ప్రయోగంబులందుఁ జూపట్టెడునని తాత్పర్యము.

పది ... తొమ్మిది ... పందొమ్మిది

తొమ్మిది ... పది ... తొంబది

వంక ... చెఱఁగు ... వంజెఱఁగు

సగము ... కోరు ... సంగోరు

నిండు ... వెఱ ... నివ్వెఱ

నిండు ... వెఱఁగు ... నివ్వెఱఁగు

నెఱ ... తఱి ... నెత్తఱి

నెఱ ... నడుము ... నెన్నడుము

నెఱ ... మది ... నెమ్మది

నెఱ ... వడి ... నెవ్వడి

ఇత్యాదులు ప్రయోగంబుల వలనం దెలియునది.

40. ఆమ్రేడితంబు పరంబగునపుడు కడాదులం దొలి యచ్చు మీఁది వర్ణంబుకెల్ల నదంతం బగు ద్విరుక్త టకారం బగు. ఈ సూత్రమునకు భృశార్థంబునందు ద్విరుక్తంబు విషయంబని యెఱుంగునది.

కడ ... కడ ... కట్టకడ

ఎదురు ... ఎదురు ... ఎట్టఎదురు కడ, ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, తెరువు, నడుమ, పగలు, పిడుగు, బయలు, మొదలు ఇత్యాదులు కడాదులు.

41. ఆమ్రేడితంబు పరంబగునపుడు విభక్తిలోపంబు బహుళంబుగా నగు.

అప్పటికిన్‌. ... అప్పటికిన్‌ ... అప్పటప్పటికిన్‌, అప్పటికప్పటికిన్‌

అక్కడన్‌ ... అక్కడన్‌ ... అక్కడక్కడన్‌, అక్కడనక్కడన్‌

ఇంటన్‌ ... ఇంటన్‌ ... ఇంటింటన్‌, ఇంటనింటన్‌

ఊరన్‌ ... ఊరన్‌ ... ఊరూరన్‌, ఊరనూరన్‌

ఇంచుక నాఁ డిత్యాదులందు బహుళగ్రహణముచేత నంతిమాక్షర లోపంబు నగు.

ఇంచుక ... ఇంచుక ... ఇంచించుక. ఇంచుకించుక

నాఁడు ... నాఁడు ... నానాఁడు, నాఁడునాఁడు

42. అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగ గ్రాహ్యంబులు.

అందదుకు, ఇఱ్ఱింకులు, ఇల్లిగ్గులు, చెల్లచెదరు, చెల్లాచెదరు, తుత్తుమురు, తుత్తునియలు, మిఱుమిట్లు ఇత్యాదులెఱుంగునది.

43. చేత తోడ వలనల కిత్వంబు సమాసంబులం దగు.

నీచేతన్‌ ... ప్రోపు ... నీచేతిప్రోపు

నాతోడన్‌ ... చెలిమి ... నాతోడిచెలిమి

నీవలనన్‌ ... భయము ... నీవలనిభయము

44. అంద్వాదుల కలిగాగమంబు సమాసంబునం దగు.

నాయందున్‌ ... కరుణ ... నాయందలి కరుణ

ఇందున్‌ ... జనులు ... ఇందలిజనులు

ఎందున్‌ ... వారు ... ఎందలివారు

ఎందు శబ్దమున కలిగాగమము కొందఱు లేదండ్రు.

45. అది యవి శబ్దంబుల యత్తునకు వృత్తిని లోపంబు బహుళంబుగ నగు.

నా ... అది ... నాది, నాయది

నా ... అవి ... నావి, నాయవి

ఉదంతములగు తద్ధర్మ విశేషణంబులకు మీఁద లోపంబు లేదనియు నిదంతంబులగు తద్ధర్మ విశేషంబులకు మీఁద నిత్యంబనియు బహుళగ్రహణముచే నెఱుంగునది.

వచ్చునది - వచ్చునని, వచ్చెడిది - వచ్చెడివి. 46. పడ్వాదులు పరంబులగునపుడు మువర్ణకంబునకు లోపపూర్ణబిందువులు విభాష నగు.

భయము ... పడె ... భయపడె, భయంపడె, భయముపడెను

సూత్రము ... పట్టె ... సూత్రపట్టె, సూత్రంపట్టె, సూత్రముపట్టె

ఈ కార్యము కర్తృవాచి మువర్ణకమునకుఁ గలగదు. గజము పడియె, అశ్వము పడియె.

47. మధ్యమపురుష మువర్ణకంబునకు హలవసానంబులు పరంబులగునపుడు లోపము విభాష నగు.

చూడుము ... నన్ను ... చూడునన్ను, చూడుము నన్ను

ఇటు ... చూడుము ... ఇటుచూడు, ఇటు చూడుము

చూడుమనియె, వినుమనియె. ఇచ్చట నచ్చు పరంబయినది. కాబట్టి లోపములేదు.

48. వ్యతిరేక మధ్యమ మువర్ణకంబున కెల్లయెడల లోపంబు విభాష నగు. నమ్మకము ... ఇట ... నమ్మకిట, నమ్మకు మిట

49. ఆమ్రేడితంబు పరంబగునపుడు మధ్యమ ముడుఙ్ఙు లోపంబు విభాష నగు.

ఉండుము ... ఉండుము. ... ఉండుండుము ,ఉండుముండుము

కొట్టుఁడు ... కొట్టుఁడు. ... కొట్టు కొట్టుఁడు, కొట్టుఁడు కొట్టుఁడు

50. విసర్గంబున కనుకరణంబున లోపం బగు.

వర్ధతాం శ్రీః ... అనియె ... వర్ధయాం శ్రీ యనియె.

51. అనుకృతిని నమశ్శబ్దము తుది యత్తున కోత్వము విభాష నగు.

తుభ్యంనమః ... అనె ... తుభ్యంనమో అనె, తుభ్యం నమ యనె

ఈ కార్యము లాఁతిచో సహితము గనంబడియెడి. గతాను గతికో లోకో యటంచున్‌.

52. అనుకరణంబునం దుదిహల్లునకు ద్విర్వచనం బగు.

కింతత్‌ ...అనియె ... కింతత్తనియె

కస్త్వమ్‌ ... అనియె ... కస్త్వమ్మనియె 53. అనుకరణంబునం దహమాదుల మకారంబునకు ద్విరుక్తి విభాషనగు.

దాసోహమ్‌ ... అనె ... దాసోహమ్మనె, దాసోహమనె

తత్కర్తవ్యమ్‌ ... అనె ...తత్కర్తవ్యమ్మనె, తత్కర్తవ్యమనె

54. ఉదంతనామంబున కనుకరణంబునందు వుగాగమం బగు.

ఇయంధేనుః ... అనె ... ఇయంధేనువనె

అనుకృతిని నిడుదకుం గుఱుచ యగునని యొకండు పలికెనది నిరాకరంబు. దుర్బలస్య బలం రాజా యన వినవే.

55. వాక్యావసానంబున సంధిలేమి దోషంబు కాదని యార్యు లండ్రు.

సత్యము సర్వశ్రేయము - అదిలేనిచో సర్వధర్మములు వ్యర్థములు. ఇట్లు సంధి విరహంబు కావ్యంబులం బాదాంతమంద చూపట్టెడు.

ఇది సంధి పరిచ్ఛేదము.