Jump to content

బాల వ్యాకరణము/తత్సమ పరిచ్ఛేదము

వికీసోర్స్ నుండి


   బాల వ్యాకరణము - తత్సమ పరిచ్ఛేదము

1. డు - ము - వు - లు - ప్రథమ.

2. నువర్ణంబు - ద్వితీయ.

3. చేత - తోడ - తృతియ.

4. కొఱకు - కయి - చతుర్థి.

5. వలన - కంటె - పట్టి - పంచమి.

6. కు - యొక్క - లోపల - షష్ఠి.

7. అందు - సప్తమి.

8. తృతీయాదులకు నుగాగమంబగు.

9. కయి, పట్టి, యొక్కలకు నుగాగమంబు లేదు.

10. చేత, తోడ, లోపల వర్ణకంబుల ప్రథమాక్షరంబులు వైకల్పికంబుగా శేషించు.

11. ప్రత్యయంబు వర్ణకంబని ప్రాచీనులు వ్యవహరింతురు.

12. లువర్ణంబు బహువచనంబు.

13. తక్కినవి యుభయంబులు.

14. ఓ యామంత్రణంబునందగు.

15. ఓ శబ్దంబునకుం బురుష నీచ స్త్రీ పురుషామంత్రణంబులందు యి - సి - రి వర్ణంబులు విబాష సంతాగమంబులగు.

16. ఓరి యోసి మైత్రియందుం గలవు.

17. స్త్రీ తిర్వగ్జడ బిన్నంబులును వాని విశేషణంబులును మహత్తులనంబడు.

18. క్లీబంబులు మిత్రాదులు మహద్వాచకంబులు విభాషంబుంలింగ తుల్యంబులగు.

19. ఙఇ త్తు బిందు పూర్వంబగు.

20. డుఙవర్ణకంబునకుం బ్రకృతియయినది డుమంతంబనంబడు.

21. పుంలింగంబయి మహద్వాచకంబయిన నామంబు తుది యత్వంబుల కుత్వంబగు.

22. పుంలింగమగు మద్వాచకమునకు దుఙఙగు.

23. డుమంతంబునకు ద్వితీయా ద్యేక వచనంబడు పరంబగునపుడు నిగాగమంబు సర్వత్ర విభాషనగు.

24. అనుదంత మగు తెనుఁగు డుమంతమునకు నిగాగమము నిత్యముగా నగును.

25. డుమంతంబు మీఁది నవర్ణకంబు నుత్వంబున కిత్వంబగు.

26. ఇకారంబు మీఁది కు - ను - వు క్రియావిభక్తుల యుత్వంబున కిత్వంబు రాదు.

27. ఈ ధాతుయుష్మదర్థంబుల మీఁది వాని యుత్వంబున కిత్వంబు రాదు.

28. కువర్ణకంబు పరంబగునపు డుకార ఋకారంబులకు నగాగమంబగు.

29. ఉకార ఋకారంబుల కందు వర్ణకము పరంబగునపుడు నుగాగమంబగు.

30. ఆగమ ము - వు వర్ణంబుల కందు వర్ణకము పరంబగునపుడు నుగాగమంబు విభాషనగు.

31. బహుత్వంబున, ద్వితియాది విభక్తులకు లడాగమంబగు.

32. సంబోధనంబునం దేకార్థంబయిన పదంబు తుది యుకారంబున కకారంబగు.

33. సంబోధనంబునందుఁ బదంబు తుది యకారేకారంబులకు దీర్థంబు విభాషనగు.

34. కృతొత్కంబగు సంస్కృతనామంబు సంబుద్ధిడుఙఞనకు లోపంబు విభాషనగు.

35. ఉదంత సంస్కృత నామంబు మీఁది సంబుద్ధిఙఞనకు నుకారంబు ప్లుతం బాదేశంబు విభాషనగు.

36. సంబోధనంబు నందు బహువచనంబున కారగాగమంబగు.

37. మధ్యమ పురుషయోగంబునం దారగాగమంబు విభాషనగు.

38. అదంతంబు దీర్ఘపూర్వ లోపధంబయిన మహత్తుమీఁది విభక్తి లకారంబునకు రేఫంబగు.

39. అమహన్న పుంసకముల కదంతములకు మువర్ణకంబగు.

40. వానికి మువర్ణ కేతరం బయిన విభక్తి పరంబగునపుడు ముగాగమంబగు.

41. మువర్ణకంబునకు విధించు కార్యము ముగాగమంబు నకునగు.

42. మువర్ణకంబునకు మా ముడి యెనింపూర్ణబిందు పూర్వక బువర్ణంబేని విభాషనగు.

43. లు-ల-న-లు పరంబులగు నపుడొకానొకచో ముగాగమంబునకు లోపంబును దత్పూర్వ స్వరంబునకు దీర్ఘంబును విభాషనగు.

44. ఇగ్లౌరాయుగంతంబుల ప్రథమైక వచనంబునగు లోపంబగు.

45. ఇత్తునకు బహువచనంబు పరంబగునపుడుత్వంబగు.

46. వికృతియం దికారాంతముల యుపోత్త మేత్వంబునకు బహువచనము పరంబగునపుడుత్వంబగు.

47. రలడోపధ వవార్ధాదుల యుపోత్తమే త్వంబున కుత్వంబు గలుగదు.

48. ఉకారాంత గోశబ్దంబుల కంతట పువర్ణకంబగు.

49. పువర్ణకేతర విభక్తి పరమగుచో నుకారాంతంబులకు బహుళంబుగా గోశబ్దంబునకు నిత్యంబుగా పుగాగమంబగు.

50. ఉకారాంతంబగు మహత్తునకు వు వర్ణకము బహుళముగా నగు.

51. కద్రువ - నాగమాత.

52. ఋకారాంతంబున కత్వంబును స్త్రీ వద్భావంబునగు.

53. విధాతృ ధాతృదాతృ సవితృ నేతృ శబ్దంబులకు మహత్తుల కత్వ స్త్రీ వద్భావంబులు విభాషనగు.

54. నామంబుల తుది దీర్ఘంబులనకు హ్రస్వంబగు.

55. ఏకాక్షరంబులకు హ్రస్వంబు లేదు.

56. వృద్ధాదుల డఙఞౌనకు లోపము విభాషనగు.

57. స్త్రీలింగంబుల ప్రథమైక వచనంబునకు లోపంబునగు.

58. చరిత్రాదుల మువర్ణకంబునకు లోపంబు బహుళంబుగా నగు.

59. స్వర్గివాచి దేవసురశబ్దంబు లేకత్వ బహుత్వంబులఁ బ్రయోగింబంబడు.

60. సుర శబ్దంబు నిత్యంబుగా నసుర శబ్దము వైకల్పికముగా స్త్రీ తుల్యంబులగు; సంస్కృత సమాసంబునఁ గావు.