పోతన తెలుగు భాగవతము/సప్తమ స్కంధము/ప్రహ్లాద చరిత్రము

వికీసోర్స్ నుండి

ప్రహ్లాద చరిత్రము


తెభా-7-115-సీ.
న యందు నఖిల భూము లందు నొకభంగి-
మహితత్వంబున రుగువాఁడు;
పెద్దలఁ బొడగన్న భృత్యునికైవడిఁ-
జేరి నమస్కృతుల్ చేయువాఁడు;
న్నుదోయికి నన్యకాంత లడ్డం బైన-
మాతృభావము జేసి రలువాఁడు;
ల్లిదండ్రుల భంగి ర్మవత్సలతను-
దీనులఁ గావఁ జింతించువాఁడు;

తెభా-7-115.1-తే.
ఖుల యెడ సోదరస్థితి రుపువాఁడు;
దైవతము లంచు గురువులఁ లఁచువాఁడు
లీల లందును బొంకులు లేనివాఁడు;
లితమర్యాదుఁ డైన ప్రహ్లాదుఁ డధిప!

టీక:- తన = తన; అందున్ = ఎడల; అఖిల = ఎల్ల; భూతముల్ = ప్రాణుల; అందున్ = ఎడల; ఒక = ఒకే; భంగిన్ = విధముగ; సమహిత = సమత్వ; తత్వంబునన్ = భావముతో; జరుగు = మెలగు; వాడు = వాడు; పెద్దలన్ = పెద్దలను; పొడగన్న = గమనించినచో; భృత్యుని = సేవకుని; కైవడి = వలె; చేరి = దగ్గరకు వెళ్ళి; నమస్కృతుల్ = నమస్కారములు; చేయు = చేసెడి; వాడు = వాడు; కన్నుదోయి = రెండుకళ్ళ; కిన్ = కి; అన్య = ఇతర; కాంతలు = స్త్రీలు; అడ్డంబు = ఎదురుపడుట; ఐన = జరిగిన; మాతృ = తల్లి యనెడి; భావము = భావము; చేసి = వలన; మరలు = మెలిగెడి; వాడు = వాడు; తల్లిదండ్రుల = తల్లిదండ్రుల; భంగిన్ = వలె; ధర్మవత్సలతన్ = న్యాయబుద్ధితో; దీనులన్ = బీదలను; కావన్ = కాపాడుటకు; చింతించు = భావించు; వాడు = వాడు.
సఖుల = స్నేహితుల; యెడ = అందు; సోదర = తోడబుట్టినవాడి; స్థితిన్ = వలె; జరుపు = నడపు; వాడు = వాడు; దైవతములు = దేవుళ్ళు; అంచున్ = అనుచు; గురువులన్ = గురువులను; తలచు = భావించెడి; వాడు = వాడు; లీలలు = ఆటలు; అందును = లోనయినను; బొంకులు = అబద్ధములు; లేని = చెప్పనేచెప్పని; వాడు = వాడు; లలిత = చక్కటి; మర్యాదుడు = మర్యాద గలవాడు; ఐన = అయిన; ప్రహ్లాదుడు = ప్రహ్లాదుడు; అధిప = రాజా.
భావము:- ఓ ధర్మరాజా! ఆ నలుగురిలో చక్కటి వివేకము కలిగిన వాడూ; సకల ప్రాణులను తనతో సమానులుగా చూచు వాడూ; సజ్జనులు కనబడితే సేవకుడిలా దగ్గరకెళ్ళి మ్రొక్కు వాడూ; పరస్త్రీలు కనబడితే తల్లిలా భావించి ప్రక్కకు తప్పుకొను వాడూ; దిక్కులేని వారిని చూస్తే వారిని సొంత బిడ్డలలా కాపాడు వాడూ; మిత్రులతో అన్నదమ్ములులా మెలగు వాడూ; దేవుళ్ళు అంటూ గురువులను భావించే వాడూ; ఆటలలో కూడా అబద్దాలు ఆడని వాడూ; చక్కటి మర్యాద గల వాడూ ప్రహ్లాదుడు అను కొడుకు.

తెభా-7-116-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- ఇంతే కాకుండా

తెభా-7-117-సీ.
కార జన్మ విద్యార్థవరిష్ఠుఁ డై-
ర్వసంస్తంభ సంతుఁడు గాఁడు
వివిధ మహానేక విషయ సంపన్నుఁడై-
పంచేంద్రియములచేఁ ట్టుబడఁడు
వ్య వయో బల ప్రాభవోపేతుఁడై-
కామరోషాదులఁ గ్రందుకొనఁడు
కామినీ ప్రముఖ భోము లెన్ని గలిగిన-
వ్యసన సంసక్తి నావంకఁ బోఁడు

తెభా-7-117.1-ఆ.
విశ్వమందుఁ గన్న విన్న యర్థము లందు
స్తుదృష్టిఁ జేసి వాంఛ యిడఁడు
రణినాథ! దైత్యనయుండు హరి పర
తంత్రుఁ డై హతాన్యతంత్రుఁ డగుచు.

టీక:- ఆకార = అందము నందు; జన్మ = వంశము నందు; విద్య = చదువు నందు; అర్థ = సంపద లందు; వరిష్ఠుడు = గొప్పవాడు; ఐ = అయ్యి; గర్వ = గర్వము యొక్క; సంస్తంభ = ఘనీభవించుటను; సంగతుడు = కలవాడు; కాడు = కాదు; వివిధ = పలురకముల; మహా = గొప్ప; అనేక = అనేకమైన; విషయ = విషయపరిజ్ఞానము లనెడి; సంపన్నుడు = సంపదలు గలవాడు; ఐ = అయ్యి; పంచేంద్రియముల్ = పంచేంద్రియములు {పంచేంద్రియములు - త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణము లనెడి యైదింద్రియములు}; చేన్ = వలన; పట్టుబడడు = లొంగిపోడు; భవ్య = మంచి; వయః = ప్రాయము; బల = బలము; ప్రాభవము = ప్రభుత్వాధికారము; ఉపేతుడు = కూడినవాడు; ఐ = అయ్యి; కామరోషాదులన్ = కామక్రోధాదు లందు {కామక్రోధాదులు - 1కామ 2లోభ 3క్రోధ 4మోహ 5మద 6మాత్సర్యము లనెడి అరిషడ్వర్గములు}; క్రందుకొనడు = చొరడు; కామినీ = కాంత; ప్రముఖ = ఆదులైన; భోగములు = భోగములు; ఎన్ని = ఎన్ని; కలిగినన్ = ఉన్నప్పటికిని; వ్యసన = వ్యసనము లందు; సంసక్తిన్ = తగులముతో; ఆ = అటు; వంకన్ = వైపు; పోడు = వెళ్ళడు.
విశ్వము = జగత్తు; అందున్ = లోన; కన్న = చూసినట్టి; విన్న = వినినట్టి; అర్థములు = వస్తువుల; అందున్ = ఎడల; వస్తుదృష్టిన్ = బ్రహ్మేతరమే లేదన్న దృష్టితో; చేసి = చూసి; వాంఛ = కోరిక; ఇడడు = పెట్టుకొనడు; ధరణీనాధ = రాజా {ధరణీనాధ - ధరణీ (భూమికి) నాథుడు (ప్రభువు), రాజు}; దైత్యతనయుండు = ప్రహ్లాదుడు {దైత్యతనయుడు - దైత్య (రాక్షసుడైన హిరణ్యకశిపుని) పుత్రుడు, ప్రహ్లాదుడు}; హరి = నారాయణుని యందు; పరతంత్రుడు = పరాధీనుడు; ఐ = అయ్యి; హత = అణచివేయబడిన; అన్య = ఇతరమైన; తంత్రుడు = ప్రవృత్తులు గలవాడు; అగుచు = అగుచు.
భావము:- ఇంకా ఆ ప్రహ్లాదుడు ఎల్లప్పుడు విష్ణువును తన చిత్తము నందు చేర్చుకుని ఇతర ఆలోచనలు అన్నీ వదిలేస్తాడు. సౌందర్యము, కులము, చదువు, ధనము సమృద్ధిగా ఉన్నా కూడా గర్వపడడు. గొప్ప వస్తువులు ఎన్నో అందుబాటులో ఉన్నా ఇంద్రియ లోలుడు కాడు. దివ్యమైన యౌవనమూ బలమూ అధికారములు అన్నీ ఉన్నా కామము, క్రోధము మొదలగు అరిషడ్వర్గానికి లొంగడు. స్త్రీలు మున్నగు చాపల్య భోగము లెన్ని ఉన్నా ఆ వ్యసనాలలో తగులుకోడు. లోకంలో కనబడేవీ, వినబడేవీ అయిన వస్తువులను వేటినీ కావాలని వాంఛించడు.

తెభా-7-118-ఆ.
ద్గుణంబు లెల్ల సంఘంబు లై వచ్చి
సురరాజ తనయు నందు నిలిచి
పాసి చనవు విష్ణుఁ బాయని విధమున
నేఁడుఁ దగిలి యుండు నిర్మలాత్మ!

టీక:- సద్గుణంబులు = సుగుణములు; ఎల్లన్ = సర్వమును; సంఘంబులు = గుంపులు కట్టినవి; ఐ = అయ్యి; వచ్చి = వచ్చి; అసురరాజతనయన్ = ప్రహ్లాదుని {అసురరాజతనయడు - అసుర (రాక్షస) రాజ (రాజు యైన హిరణ్యకశిపుని) తనయుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు}; అందున్ = అందు; నిలిచి = స్థిరపడి; పాసి = వదలి; చనవు = పోవు; విష్ణున్ = విష్ణుమూర్తిని; పాయని = వదలిపోని; విధమునన్ = విధముగ; నేడు = ఇప్పుడు; తగిలి = లగ్నమై; ఉండున్ = ఉండును; నిర్మలాత్మా = శుద్ద చిత్తము గలవాడా.
భావము:- నిర్మలమైన మనసు గల ధర్మరాజా! ఆ రాక్షస రాకుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఎప్పటికీ వదలిపెట్టడు. అలాగే సుగుణాలు అన్నీ, ఎప్పటికీ విడిచిపెట్టకుండా, అతనిలో ప్రోగుపడి ఉంటాయి.

తెభా-7-119-మ.
వారైన సురేంద్రులున్ సభలలోఁ బ్రహ్లాద సంకాశులన్
సుగుణోపేతుల నెందు నే మెఱుఁగ మంచున్ వృత్తబంధంబులం
బొడం జొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ! మీబోఁటి స
ద్భవద్భక్తులు దైత్యరాజ తనయుం బాటించి కీర్తింపరే?

టీక:- పగవారు = శత్రువులు; ఐన = అయిన; సుర = దేవతా; ఇంద్రులున్ = ప్రభువులు కూడ; సభల్ = సభలు; లోన్ = అందు; ప్రహ్లాద = ప్రహ్లాదునికి; సంకాశులన్ = సమానమైనవారిని; సుగుణ = మంచిగుణములు; ఉపేతులన్ = కలవారిని; ఎందున్ = ఎక్కడను; నేము = మేము; ఎఱుంగము = తెలియము; అంచున్ = అనుచు; వృత్త = పద్యవృత్తము లందు; బంధంబులన్ = కూర్చబడినవానిలో; పొగడన్ = స్తుతించ; చొత్తురు = ప్రారంభించిరి; సత్ = మంచి; కవీంద్రుల = కవుల; క్రియన్ = వలె; భూనాథ = రాజా {భూనాథుడు - భూ (రాజ్యమునకు) నాథుడు (ప్రభువు), రాజు}; మీ = మీ; పోటి = వంటి; సత్ = నిజమైన; భగవత్ = భగవంతుని; భక్తులు = భక్తులు; దైత్యరాజతనయున్ = ప్రహ్లాదుని; పాటించి = లక్షించి; కీర్తింపరే = స్తుతింపరా ఏమి.
భావము:- ఓ నరేంద్రా! రాక్షసకులంలో పుట్టిన అతని ఆజన్మ శత్రువులైన ఇంద్రుడు మొదలైన దేవతాశ్రేష్ఠులు సైతం, “ప్రహ్లాదుని వంటి మహాత్ములు సుగుణశీలురు ఎక్కడా ఉండరు” అంటూ గొప్ప పండితులు సభలలో చదివినట్లు రకరకాల వృత్తాలలో పద్యాలల్లి మరీ పొగుడుతుంటారు. ఇక మీలాంటి భాగవతోత్తములు అతనిని పొగడకుండా ఉంటారా?

తెభా-7-120-క.
గునిధి యగు ప్రహ్లాదుని
గుము లనేకములు గలవు గురుకాలమునన్
ణుతింప నశక్యంబులు
ణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్.

టీక:- గుణ = సుగుణములకు; నిధి = నిక్షేపము వంటివాడు; అగు = అయిన; ప్రహ్లాదునిన్ = ప్రహ్లాదుని; గుణముల్ = సుగుణములు; అనేకములు = చాలా ఎక్కువ; కలవు = ఉన్నవి; గురు = పెద్ద; కాలమునన్ = కాలములో నైనను; గణుతింపన్ = వర్ణించుటకు; అశక్యంబులు = సాధ్యములు కావు; ఫణిపతి = ఆదిశేషుని {ఫణిపతి - ఫణి (సర్పములకు) పతి (రాజు), ఆదిశేషుడు}; కిన్ = కి; బృహస్పతి = బృహస్పతి; కిని = కిని; భాషాపతి = బ్రహ్మదేవుని {భాషాపతి - భాషా (భాషకి దేవత సరస్వతి) యొక్క పతి (భర్త), బ్రహ్మ}; కిన్ = కి.
భావము:- ఆ సుగుణాలగని అయిన ప్రహ్లాదుడి గుణములు వివరించి చెప్ప నలవికాదు. అతని అనంత సుగుణాలను ఎన్నాళ్ళు వర్ణించినా ఆదిశేషుడు, బృహస్పతి, బ్రహ్మ మొదలగువారు కూడ వర్ణించలేరు.

తెభా-7-121-వ.
ఇట్లు సద్గుణగరిష్ఠుం డయిన ప్రహ్లాదుండు భగవంతుం డయిన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సద్గణ = సుగుణములచే; గరిష్ఠుండు = గొప్పవాడు; అయిన = ఐన; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; భగవంతుండు = మహిమాన్వితుండు; అయిన = ఐన; వాసుదేవుని = నారాయణుని {వాసుదేవుని - సకల ఆత్మ లందు వసించు వాడు, విష్ణువు}; అందున్ = ఎడల; సహజ = తనంతతనే; సంవర్ధమాన = చక్కగా పెరిగిన; నిరంతర = ఎడతెగని; ధ్యాన = ధ్యానము నందు; రతుండు = తగిలినవాడు; ఐ = అయ్యి.
భావము:- ఇలా గొప్ప సద్గుణాలు కల ప్రహ్లాదుడు ఎప్పుడు సహజసిద్ధంగా భక్తితో భగవంతుడూ, ఆత్మలో వసించేవాడూ అయిన విష్ణుని ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉండేవాడు. అతని హరి భక్తి నానాటికి అతిశయిస్తూ ఉండేది.

తెభా-7-122-సీ.
శ్రీవల్లభుఁడు దన్నుఁ జేరిన యట్లైనఁ,-
జెలికాండ్ర నెవ్వరిఁ జేర మఱచు;
సురారి దన మ్రోల నాడిన యట్లైన,-
సురబాలురతోడ నాడ మఱచు;
క్తవత్సలుఁడు సంభాషించి నట్లైనఁ,-
రభాషలకు మాఱులుక మఱచు;
సురవంద్యుఁ దనలోనఁ జూచిన యట్లైనఁ,-
జొక్కి సమస్తంబుఁ జూడ మఱచు;

తెభా-7-122.1-తే.
రిపదాంభోజయుగ చింతనామృతమున
నంతరంగంబు నిండినట్లైన, నతఁడు
నిత్య పరిపూర్ణుఁ డగుచు నన్నియును మఱచి
డత లేకయు నుండును డుని భంగి.

టీక:- శ్రీవల్లభుడు = హరి {శ్రీవల్లభుడు - శ్రీ (లక్ష్మీదేవి) యొక్క వల్లభుడు (భర్త), విష్ణువు}; తన్నున్ = తనను; చేరిన = వద్దకు వచ్చిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; చెలికాండ్రన్ = స్నేహితులను; ఎవ్వరిన్ = ఎవరినికూడ; చేరన్ = కలియుటను; మఱచున్ = మరచిపోవును; అసురారి = హరి {అసురారి - అసుర (రాక్షసుల) అరి (శత్రువు), విష్ణువు}; తన = తన యొక్క; మ్రోలన్ = ఎదుట; ఆడిన = మెలగిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; అసుర = రాక్షస; బాలుర = పిల్లలు; తోడన్ = తోటి; ఆడన్ = క్రీడించుట; మఱచున్ = మరచిపోవును; భక్తవత్సలుడు = హరి {భక్తవత్సలుడు - భక్తుల యెడల వాత్సల్యము గలవాడు, విష్ణువు}; సంభాషించిన = మాట్లాడిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; పర = ఇతరమైన; భాషల్ = మాటల; కున్ = కు; మాఱు = బదులు; పలుకన్ = చెప్పుట; మఱచున్ = మరచిపోవును; సురవంద్యున్ = హరిని {సురవంద్యుడు - సుర (దేవతలచే) వంద్యుడు (మొక్కబడినవాడు), విష్ణువు}; తన = తన; లోనన్ = అందు; చూచిన = కాంచిన; అట్లు = విధముగా; ఐనన్ = అయినచో; చొక్కి = సోలిపోయి; సమస్తంబున్ = అఖిలమును; చూడన్ = చూచుట; మఱచున్ = మరచిపోవును.
హరి = హరి; పద = పాదములు యనెడి; అంభోజ = పద్మముల; యుగ = జంటను; చింతన = స్మరించుట యనెడి; అమృతమున్ = అమృతముతో; అంతరంగంబు = హృదయము; నిండిన = నిండిపోయిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; అతడు = అతడు; నిత్య = నిత్య; పరిపూర్ణుడు = సంతృప్తి చెందినవాడు; అగుచున్ = అగుచు; అన్నియున్ = సర్వమును; మఱచి = మరచిపోయి; జడత = చేష్ట లుడుగుట; లేకయున్ = లేకుండగ; ఉండును = ఉండును; జడుని = వెఱ్ఱివాని; భంగిన్ = వలె.
భావము:- మహారాజా! ఆ ప్రహ్లాదుడు విష్ణువు తనను చెంది ఉన్నప్పుడు స్నేహితులతో చేరడు. శ్రీహరి తన ఎదురుగా మెదలుతూ ఉన్నప్పుడు తోటి రాక్షసుల పిల్లలతో ఆటలాడడు. ఆయన తనతో మాట్లాడుతున్నప్పుడు ఇతరులతో మాట్లాడడు. ఆయనను తనలో ధ్యానించుకునే సమయంలో మరింక దేనిని చూడడు. హరిధ్యానముతో మనసు నిండి ఉన్నప్పుడు అతడు ఆనందపూర్ణుడై అన్ని వదిలేసి, మోహము లేకపోయినా, పిచ్చివాడి లాగ కనబడతాడు.

తెభా-7-123-శా.
పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాస లీ
లా నిద్రాదులు చేయుచుం దిరుగుచున్ క్షించుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృ తాస్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుఁ డే ద్విశ్వమున్ భూవరా!

టీక:- పానీయంబులున్ = పానీయములను {పానీయము - పానము (తాగుట)కు అనుకూలమైన ద్రవపదార్థములు}; త్రావుచున్ = తాగుతూ; కుడుచుచున్ = తినుచు (ఆహారాదులు); భాషించుచు = మాటలాడుచు; హాస = సంతోషించుట; లీల = ఆటలాడుట; నిద్ర = నిద్రించుట; ఆదులు = మొదలగువానిని; చేయుచున్ = చేస్తూ; తిరుగుచున్ = తిరుగుతూ; లక్షించున్ = గురిపెట్టి; సంతత = ఎడతెగని; శ్రీనారాయణు = శ్రీహరి యొక్క; పాద = పాదములు యనెడి; పద్మ = పద్మముల; యుగళీ = జంటను; చింతన = ధ్యానము యనెడి; అమృత = అమృతమును; ఆస్వాదన్ = ఆస్వాదించుట యందు; సంధానుండు = లగ్నమైనవాడు; ఐ = అయ్యి; మఱచెన్ = మరచిపోయెను; సురారితనయుడు = ప్రహ్లాదుడు {సురారితనయుడు - సురారి (రాక్షసు, హిరణ్యకశిపు)ని తనయుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు}; ఏతద్విశ్వమున్ = బాహ్యప్రపంచమును; భూవరా = రాజా {భూవరుడు - భూమికి వరుడు (భర్త), రాజు}.
భావము:- రాజా! ప్రహ్లాదుడు అన్నము తింటూ నీళ్ళు త్రాగుతూ మాట్లాడుతూ నవ్వుతూ వినోదిస్తూ నిద్రపోతూ కాని ఎపుడైనా సరే ఏమరుపాటు లేకుండా శ్రీ హరి ధ్యానంలోనే నిమగ్నమైన చిత్తము కలిగి, ఈ ప్రపంచమును మరచిపోయి ఉంటాడు.

తెభా-7-124-సీ.
వైకుంఠ చింతా విర్జిత చేష్టుఁ డై-
యొక్కఁడు నేడుచు నొక్కచోట;
శ్రాంత హరిభావనారూఢచిత్తుఁ డై-
యుద్ధతుఁ డై పాడు నొక్కచోట;
విష్ణుఁ డింతియ కాని వేఱొండు లేదని-
యొత్తిలి నగుచుండు నొక్కచోట;
ళినాక్షుఁ డను నిధాముఁ గంటి నే నని-
యుబ్బి గంతులువైచు నొక్కచోటఁ;

తెభా-7-124.1-ఆ.
లుకు నొక్కచోటఁ రమేశుఁ గేశవుఁ
బ్రణయహర్ష జనిత బాష్పసలిల
మిళితపులకుఁ డై నిమీలితనేత్రుఁ డై
యొక్కచోట నిలిచి యూరకుండు.

టీక:- వైకుంఠ = నారాయణుని; చింతా = ధ్యానముచేత; వివర్జిత = వదలివేసిన; చేష్టుడు = వ్యాపారములు గలవాడు; ఒక్కడున్ = ఒంటరిగా; ఏడుచున్ = విలపించును; ఒక్కచోట = ఒకమాటు; అశ్రాంత = ఎడతెగని; హరి = నారాయణుని; భావనా = ధ్యానము నందు; ఆరూఢ = నిలుపబడిన; చిత్తుడు = మనసు గలవాడు; ఐ = అయ్యి; ఉద్ధతుడు = లగ్నమైనవాడు; ఐ = అయ్యి; పాడున్ = పాడును; ఒక్కచోట = ఒకమాటు; విష్ణుడు = విష్ణుమూర్తే; ఇంతయున్ = ఇదంతా; కాని = అంతేకాని; వేఱొండు = మరితరమైనది; లేదు = ఏమియు లేదు; అని = అని; ఒత్తిలి = గట్టిగా; నగుచున్ = నవ్వుతూ; ఉండున్ = ఉండును; ఒక్కచోట = ఒకమాటు; నళినాక్షుడు = హరి {నళినాక్షుడు - నళినము (పద్మము) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; అను = అనెడి; నిధానమున్ = నిధిని; కంటిన్ = కనుగొంటిని; నేను = నేను; అని = అని; ఉబ్బి = పొంగిపోయి; గంతులు = ఉత్సాహముతో ఉరకలు; వైచున్ = వేయును; ఒక్కచోట = ఒకమాటు; పలుకున్ = మాట్లాడుచుండును; ఒక్కచోట = ఒకమాటు; పరమేశున్ = నారాయణుని; కేశవున్ = నారాయణుని; ప్రణయ = మిక్కిలి భక్తిచే గలిగిన; హర్ష = సంతోషమువలన; జనిత = పుట్టిన; సలిల = కన్నీటితో; మిళిత = కలగలిసిన; పులకుడు = గగుర్పాటు గలవాడు; ఐ = అయ్య.
నిమీలిత = మూసిన; నేత్రుడు = కన్నులు గలవాడు; ఐ = అయ్యి; ఒక్కచోట = ఒక ప్రదేశములో; నిలిచి = ఆగిపోయి; ఊరకన్ = ఉత్తినే; ఉండున్ = ఉండును.
భావము:- ధర్మరాజా! ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి హరిస్మరణలో మునిగి మైమరచిపోయి "విష్ణుధ్యానములో విరామం కలిగిం"దని ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు; ఒక్కక్క చోట విష్ణువు మీద మనసు నిలిపి, ఆనందం అతిశయించగా గొంతెత్తి గానం చేస్తూ ఉంటాడు; ఒక్కోసారి "విష్ణువు తప్ప ఇతరం ఏమీ లేదు లే"దని గట్టిగా అంటూ పకపక నవ్వుతూ ఉంటాడు; ఒక్కోచోట "నలినాక్షుడు (విష్ణువు) అనే పెన్నిధి కన్నులారా కన్నా"అంటూ గంతులేస్తాడు; ఇంకోచోట భక్తిపారవశ్యంతో ఆనందభాష్పాలు రాలుస్తూ "పరమేశ్వరా! కేశవా!"అని పిలుస్తూ ఉంటాడు; మరింకోచోట భక్తి తాత్పర్యాదులతో ఒడలు గగుర్పొడుస్తుండగా కనులు మూసికొని నిర్లిప్తంగా ఉంటాడు.

తెభా-7-125-వ.
ఇట్లు పూర్వజన్మ పరమభాగవత సంసర్గ సమాగతం బైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున నఖర్వ నిర్వాణ భావంబున విస్తరించుచు నప్పటప్పటికి దుర్జన సంసర్గ నిమిత్తంబునం దన చిత్తం బన్యాయత్తంబు గానీక నిజాయత్తంబు చేయుచు నప్రమత్తుండును, సంసార నివృత్తుండును, బుధజన విధేయుండును, మహాభాగధేయుండును, సుగుణమణిగణ గరిష్ఠుండును, పరమభాగవత శ్రేష్ఠుండును, కర్మబంధ లతా లవిత్రుండును, పవిత్రుండును నైన పుత్రుని యందు విరోధించి సురవిరోధి యనుకంపలేక చంపం బంపె"నని పలికిన నారదునకు ధర్మజుం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; పూర్వజన్మ = పూర్వపు పుట్టువు లందలి; పరమ = ఉత్తమ; భాగవత = భాగవతులతోటి; సంసర్గ = చేరికవలన; సమాగతంబు = లభించినది; ఐన = అయిన; ముకుంద = నారాయణుని; చరణ = పాదము లనెడి; అరవింద = పద్మములను; సేవా = సేవించుట యొక్క; అతిరేకంబునన్ = అతిశయమువలన; అఖర్వ = అధికమైన; నిర్వాణ = ఆనంద; భావంబు = అనుభూతి; విస్తరించున్ = పెరుగుతు; ఉన్నప్పటికిని = ఉన్నప్పటికిని; దుర్జన = చెడ్డవారితోటి; సంసర్గ = కలియకల; నిమిత్తంబునన్ = వలన; తన = తన యొక్క; చిత్తంబు = మనసు; అన్యా = ఇతరుల (పర); ఆయత్తంబు = అధీనమైనది; కానీక = అవ్వనియ్యకుండగ; నిజ = తన యొక్క; ఆయత్తంబు = అధీనములో నున్నదిగా; చేయుచున్ = చేయుచు; అప్రమత్తుండును = ఏమరిక లేనివాడు; సంసార = సంసారమును; నివృత్తుండును = విడిచినవాడు; బుధ = జ్ఞానులైన; జన = వారికి; విధేయుండును = స్వాధీనుడు; మహా = గొప్ప; భాగదేయుండును = (విష్ణుభక్తి) సంపన్నుడు; సుగుణ = మంచి గుణములు యనెడి; మణి = రత్నముల; గణ = సమూహములచే; గరిష్ఠుండును = గొప్పవాడు; పరమ = అత్యుత్తమ; భాగవత = భాగవతులలో; శ్రేష్ఠుండును = ఉత్తముడు; కర్మబంధ = కర్మబంధము లనెడి; లతా = తీగలకు; లవిత్రుండును = కొడవలివంటివాడు; పవిత్రుండు = పావనుడు; ఐన = అయినట్టి; పుత్రుని = కుమారుని; అందున్ = ఎడల; విరోధించి = శత్రుత్వము వహించి; సురవిరోధి = హిరణ్యకశిపుడు {సురవిరోధి - సుర (దేవత)లకు విరోధి (శత్రువు), హిరణ్యకశిపుడు}; అనుకంప = దయ; లేక = లేకుండగ; చంపన్ = చంపుటకు; పంపెను = పంపించెను; అని = అని; పలికిన = చెప్పిన; నారదున్ = నారదుని; కున్ = కి; ధర్మజుండు = ధర్మరాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా ప్రహ్లాదుడికి పూర్వజన్మలో పరమ భాగవతులతో చేసిన సత్సంగం వలన గొప్ప విష్ణు పాద భక్తి లభించింది. అతను అఖర్వ నిర్వాణ భావం విస్తరిస్తున్నప్పటికి, దుర్జనులతో సాంగత్యం కలిగి తన మనసు అన్యాయత్తంబు కానివ్వటం లేదు. అతడు ఆత్మావలోకనం చేసుకుంటూ అప్రమత్తుడై ఉంటాడు. సాంసారిక వృత్తులన్నీ వదిలేశాడు. అతను విజ్ఞులకు విధేయుడిగా ఉంటాడు. రత్నాలలాంటి సర్వ సుగుణాల రాశితో గొప్ప భాగ్యవంతుడు. పరమ భాగవతులలో ఉత్తముడు. కర్మబంధలన్నీ వదుల్చుకున్నవాడు. అటువంటి పవిత్రుడైన పుత్రుడితో విరోధించి జాలి లేకుండా చంపమని తండ్రి అయిన హిరణ్యకశిపుడు పంపాడు” అని పలికిన నారదుడితో ధర్మరాజు ఇలా అన్నాడు.

తెభా-7-126-శా.
"పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతు రెల్లప్పుడున్
మిత్రత్త్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతు రే
త్రుత్వంబుఁ దలంప రెట్టియెడ నా సౌజన్యరత్నాకరుం
బుత్రున్ లోకపవిత్రుఁ దండ్రి నెగులుం బొందింప నెట్లోర్చెనో?

టీక:- పుత్రుల్ = కొడుకులు; నేర్చినన్ = నేర్చుకొన్నను; నేరకున్నన్ = నేర్చుకొనకపోయినను; జనకుల్ = తండ్రులు; పోషింతురు = పోషించెదరు; ఎల్లప్పుడున్ = ఎప్పుడైనను; మిత్రత్వంబునన్ = చనువుతో; బుద్ధి = మంచిబుద్ధులు; చెప్పి = చెప్పి; దురిత = పాపములు; ఉన్మేషంబునన్ = అభివృద్ధి అగుటను; వారింతురు = అడ్డుకొనెదరు; ఏ = ఎటువంటి; శత్రుత్వంబున్ = విరోధమును; తలపరున్ = తలపెట్టరు; ఎట్టి = ఎటువంటి; ఎడన్ = పరిస్థితులలోను; సౌజన్య = మంచివారి లక్షణములకు; రత్నాకరున్ = సముద్రమువంటివానిని; పుత్రున్ = కుమారుని; లోక = సర్వలోకములను; పవిత్రున్ = పావనము చేసెడివానిని; తండ్రి = తండ్రి; నెగులున్ = కష్టములను; పొందింపన్ = పెట్టించుటకు; ఎట్లు = ఏవిధముగ; ఓర్చెనో = ఓర్చుకొనగలిగెనో కదా.
భావము:- “నారదమహర్షీ! లోకంలో తల్లిదండ్రులు కొడుకులు తెలిసినవాళ్ళైనా తెలియనివాళ్ళైనా రక్షిస్తూ ఉంటారు. తెలియకపోతే బుద్ధిచెప్పి సరిదిద్దుతారు. ఎప్పుడు పిల్లలను ప్రేమతో పెంచుతారు. అంతేగాని శత్రుత్వము చూపించరు కదా. ఇలా ఎక్కడా జరగదు వినం కూడా. అలాంటిది బహు సౌమ్యుడు లోకాన్ని పావనం చేసేవాడు అయిన కొడుకును ఏ తండ్రి మాత్రం బాధిస్తాడు? అలాంటి వాడిని హింసించటానికి వాడికి మనసెలా ఒప్పింది.

తెభా-7-127-ఉ.
బాలుఁ బ్రభావిశాలు హరిపాదపయోరుహ చింతనక్రియా
లోలుఁ గృపాళు సాధు గురు లోక పదానత ఫాలు నిర్మల
శ్రీలు సమస్త సభ్య నుతశీలు విఖండిత మోహవల్లికా
జాలు న దేల? తండ్రి వడిఁ జంపఁగఁ బంపె మునీంద్ర! చెప్పవే.

టీక:- బాలున్ = చిన్నపిల్లవానిని; ప్రభా = తేజస్సు; విశాలున్ = అధికముగా గలవానిని; హరి = నారాయణుని; పాద = పాదములనెడి; పయోరుహ = పద్మములందు; చింతన = ధ్యానించెడి; క్రియా = పనిలో; లోలున్ = తగిలి యుండెడివానిని; కృపాళున్ = తదయ గలవానిని; సాధు = సజ్జనులు; గురు = పెద్దలు; లోక = అందరి; పద = పాదముల యందు; ఆనత = మోపిన; ఫాలున్ = నొసలు గలవానిని; నిర్మల = స్వచ్ఛమైన; శ్రీలున్ = శోభ గలవానిని; సమస్త = అఖిలమైన; సభ్య = సంస్కారవంతులచేత; నుత = స్తుతింపబడెడి; శీలున్ = నడవడిక గలవానిని; విఖండిత = మిక్కిలి తెంపబడిన; మోహ = అజ్ఞానము యనెడి; వల్లికా = తీగల; చాలునన్ = రాశి కలవానిని; అది = అలా; ఏల = ఎందుకు; తండ్రి = (కన్న) తండ్రి; వడిన్ = శ్రీఘ్రముగ; చంపగన్ = చంపుబడుటకు; పంపెన్ = పంపించెను; ముని = మునులలో; ఇంద్ర = ఉత్తముడా; చెప్పవే = చెప్పుము.
భావము:- నారదా! ప్రహ్లాదుడు చిన్నపిల్లాడూ, (కుఱ్ఱాడు తప్పు చేస్తే తెలియక చేసి ఉండవచ్చు, కనుక మన్నించటం న్యాయం అంతే తప్ప దండించడం తగదు) తేజోవంతుడూ, విష్ణుభక్తి గలవాడూ, సాధువుల గురువుల సేవ చేసేవాడూ, మంగళ స్వభావము కలవాడూ, సాధువులు పొగిడే ప్రవర్తన కల వాడూ, మోహపాశాలను త్రెంపుకున్న వాడూ. అలాంటి కొడుకును కరుణ లేకుండా తండ్రి చంపాలని ఎందుకు అనుకున్నాడు చెప్పండి.” అని ధర్మరాజు నారదుడిని అడిగాడు.

తెభా-7-128-వ.
అనిన నారదుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా అడిగిన ధర్మరాజుతో నారదుడు ఇలా అన్నాడు.

తెభా-7-129-శా.
"భ్యం బైన సురాధిరాజపదమున్ క్షింపఁ డశ్రాంతమున్
భ్యత్వంబున నున్నవాఁ డబలుఁడై జాడ్యంబుతో వీఁడు వి
ద్యాభ్యాసంబునఁ గాని తీవ్రమతి గాఁ డంచున్ విచారించి దై
త్యేభ్యుం డొక్క దినంబునం బ్రియసుతున్ వీక్షించి సోత్కంఠుఁడై.

టీక:- లభ్యంబున్ = పొందదగినది; ఐన = అయిన; సురాధిరాజ = దేవేంద్రుని; పదమున్ = అధికారమును కూడ; లక్షింపడు = లెక్కచేయడు; అశ్రాంతమున్ = ఎల్లప్పుడును; సభ్యత్వంబునన్ = సాధుస్వభావముతో; ఉన్న = ఉన్నట్టి; వాడు = వాడు; అబలుడు = బలము లేనివాడు; ఐ = అయ్యి; జాడ్యంబు = మందత్వము; తోన్ = తోటి; వీడు = ఇతడు; విద్య = చదువు; అభ్యాసంబునన్ = చెప్పబడుటచే; కాని = కాని; తీవ్ర = చురుకైన; మతి = బుద్ధి గలవాడు; కాడు = అవ్వడు; అంచున్ = అనుచు; విచారించి = భావించి; దైత్యేభ్యుండు = హిరణ్యకశిపుడు {దైత్యేభ్యుడు - దైత్య (రాక్షసు)లను ఇభ్యుడు (పాలించువాడు), హిరణ్యకశిపుడు}; ఒక్క = ఒక; దినంబునన్ = రోజు; ప్రియసుతున్ = ముద్దుల కొడుకును; వీక్షించి = చూసి; సోత్కంఠుడు = ఉత్కంఠ గలవాడు; ఐ = అయ్యి.
భావము:- “హిరణ్యకశిపుడు తన కొడుకు నడవడి చూసి “వీడు దేవేంద్ర పదవి దొరికినా లెక్కచేయడు. ఎప్పుడు చూసినా సోమరిలా అవివేకంతో తిరుగుతున్నాడు. బలహీను డయి జాడ్యంతో చెడిపోవుచున్నాడు. వీడిని చదువులు చదివిస్తే కాని చురుకైనవాడు కా” డని తలచి, ఒకరోజు కొడుకును చూసి ఉత్కంఠ కలవాడై.

తెభా-7-130-క.
"చదువనివాఁ డజ్ఞుం డగు
దివిన సదసద్వివేక తురత గలుగుం
దువఁగ వలయును జనులకుఁ
దివించెద నార్యులొద్ధఁ దువుము తండ్రీ!"

టీక:- చదువని = విద్య నేర్వని; వాడు = వాడు; అజ్ఞుండు = జ్ఞానము లేనివాడు; అగున్ = అగును; చదివినన్ = విద్యనేర్చినచో; సత్ = మంచి; అసత్ = చెడుల; వివేక = విచక్షణ యందు; చతురత = నేర్పు; కలుగున్ = కలుగును; చదువగవలయునున్ = విద్య నేర్చితీరవలెను; జనుల = ప్రజల; కున్ = కు; చదివించెదన్ = విద్య నేర్పించెదను; ఆర్యులు = జ్ఞానుల; ఒద్దన్ = వద్ద; చదువుము = విద్యలు చదువుకొనుము; తండ్రీ = నాయనా.
భావము:- ఒకనాడు హిరణ్యకశిపుడు ముద్దుల కొడుకు ప్రహ్లాదుని పిలిచి
“బాబూ! చదువుకోని వాడు అజ్ఞానిగా ఉండిపోతాడు. చదువుకుంటే మంచిచెడు తెలుస్తుంది వివేకం కలుగుతుంది. మనిషి అన్నవాడు తప్పకుండ చదువుకోవాలి. కనుక నిన్ను మంచిగురువుల దగ్గర చదివిస్తాను. చక్కగా చదువుకో నాయనా!.”

తెభా-7-131-వ.
అని పలికి యసురలోకపురోహితుండును భగవంతుండును నయిన శుక్రాచార్యుకొడుకులఁ బ్రచండవితర్కులఁ జండామార్కుల రావించి సత్కరించి యిట్లనియె.
టీక:- అని = అని; పలికి = చెప్పి; అసుర = రాక్షసులు; లోక = అందరకును; పురోహితుండును = పురోహితుడు, గురువు; భగవంతుడునున్ = మహిమాన్వితుడు; అయిన = ఐనట్టి; శుక్ర = శుక్రుడు యనెడి; ఆచార్య = గురువు యొక్క; కొడుకులన్ = పుత్రులను; ప్రచండ = తీవ్రముగా; వితర్కులన్ = తర్కించు వారలను; చండామార్కులన్ = చండామార్కులను; రావించి = పిలిపించి; సత్కరించి = గౌరవించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని పలికి రాక్షస లోకపు పురోహితుడూ, భగవంతుడూ అయిన శుక్రాచార్యుడి కొడుకులు చండమార్కులను పిలిపించాడు. వారు ప్రచండంగా వితర్కం చేసే నేర్పు కలవారు. వారిని సత్కరించి ఇలా అన్నాడు.

తెభా-7-132-శా.
"అంప్రక్రియ నున్నవాఁడు, పలుకం స్మత్ప్రతాపక్రియా
గంధం బించుక లేదు, మీరు గురువుల్ కారుణ్యచిత్తుల్ మనో
బంధుల్ మాన్యులు మాకుఁ బెద్దలు, మముం బాటించి యీబాలకున్
గ్రంథంబుల్ చదివించి నీతికుశలుం గావించి రక్షింపరే."

టీక:- అంధ = గుడ్డివాని; ప్రక్రియన్ = వలె; ఉన్నవాడు = ఉన్నాడు; పలుకండు = స్తుతింపడు; అస్మత్ = నా యొక్క; ప్రతాప = పరాక్రమపు; క్రియా = కార్యముల యొక్క; గంధంబున్ = అగరు, వాసన; ఇంచుకన్ = కొంచెము కూడ; లేదు = లేదు; మీరు = మీరు; గురువుల్ = గురువులు; కారుణ్య = దయ గల; చిత్తుల్ = మనసు గలవారు; మనః = మానసికముగా; బంధుల్ = బంధువులు; మాన్యులు = మన్నింప దగినవారు; మా = మా; కున్ = కు; పెద్దలు = గౌరవించ దగినవారు; మమున్ = మమ్ములను; పాటించి = అనుగ్రహించి; ఈ = ఈ; బాలకున్ = పిల్లవానిని; గ్రంథంబుల్ = మంచి పుస్తకములను; చదివించి = చదివించి; నీతి = నీతిశాస్త్రము నందు; కుశలున్ = నేర్పు గలవానినిగా; కావించి = చేసి; రక్షింపరే = కాపాడండి.
భావము:- “అయ్యా! మా అబ్బాయి అజ్ఞానంతో అంధుడిలా ఉన్నాడు. ఏదడిగినా పలుకడు. నా పరాక్రమాలు, ఘనకార్యాలు వాసన మాత్రంగా నైనా వీనికి రాలేదు. మీరు మాకు అన్ని విధాల గురువులు, పెద్దలు, పూజ్యులు. మీరు దయామయ స్వభావము గలవారు, ఆత్మ బంధువులు. మ మ్మనుగ్రహంచి యీ చిన్నవాడికి చదువు చెప్పి పండితుడిని చేసి నన్ను కృతార్థుడిని చేయండి.” అని హిరణ్యకశిపుడు చదువు చెప్పే బాధ్యత అప్పజెప్పాడు.

తెభా-7-133-వ.
అని పలికి వారలకుం బ్రహ్లాదు నప్పగించి "తోడ్కొని పొం"డనిన వారును దనుజరాజకుమారునిం గొనిపోయి యతనికి సవయస్కులగు సహశ్రోతల నసురకుమారులం గొందఱం గూర్చి.
టీక:- అని = అని; పలికి = చెప్పి; వారల్ = వారి; కున్ = కి; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; అప్పగించి = అప్పచెప్పి; తోడ్కొని = కూడతీసుకొని; పొండు = వెళ్ళండి; అనినన్ = అనగా; వారును = వారు; దనుజరాజకుమారునినన్ = ప్రహ్లాదుని {దనుజరాజకుమారుడు - దనుజు (రాక్షసు)ల రాజ (రాజు యొక్క) కుమారుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు}; కొని = తీసుకొని; పోయి = వెళ్ళి; అతని = అతని; కిన్ = కి; స = సమానమైన; వయస్కులు = వయస్సు గలవారు; అగున్ = అయిన; సహ = కూడ, కలిసి; శ్రోతలన్ = పఠించువారు {శ్రోతలు - (చదువులను) వినెడివారు, చదువుకొనువారు}; అసుర = రాక్షస వంశపు; కుమారులన్ = పిల్లలను; కొందఱన్ = కొంతమందిని; కూర్చి = జతచేసి.
భావము:- అలా పలికి వారికి ప్రహ్లాదుడిని అప్పగించి “మీ కూడా తీసుకు వెళ్లం” డని చెప్పాడు. వారు ఆ హిరణ్యకశిపుడి కొడుకును తీసుకు వెళ్లి అతని సమవయస్కులు అయిన సహాధ్యాయులను రాక్షసుల పిల్లలను కొంత మందిని సమకూర్చారు.

తెభా-7-134-ఉ.
అంచితభక్తితోడ దనుజాధిపు గేహసమీపముం బ్రవే
శించి సురారి రాజసుతుఁ జేకొని శుక్రకుమారకుల్ పఠిం
పించిరి పాఠయోగ్యములు పెక్కులు శాస్త్రము లా కుమారుఁ డా
లించి పఠించె నన్నియుఁ జలింపని వైష్ణవభక్తి పూర్ణుఁడై.

టీక:- అంచిత = చక్కటి; భక్తి = భక్తి; తోడన్ = తోటి; దనుజాధిపు = హిరణ్యకశిపుని {దనుజాధిపుడు - దనుజు (రాక్షసు)లకు అధిపుడు (రాజు), హిరణ్యకశిపుడు}; గేహ = ఇంటి; సమీపమున్ = వద్దకు; ప్రవేశించి = చేరి; సురారిరాజసుతున్ = ప్రహ్లాదుని {సురారిరాజసుతుడు - సురారి (రాక్షసరాజు యొక్క) సుతుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు}; చేకొని = చేరదీసుకొని; శుక్రకుమారకుల్ = చండామార్కులు {శుక్రకుమారకులు - శుక్రాచార్యుని కుమారులు, చండామార్కులు}; పఠింపించిరి = చదివింపించిరి; పాఠ = చదువ; యోగ్యములున్ = తగినట్టి; పెక్కులు = అనేకమైన; శాస్త్రములు = శాస్త్రములను; ఆ = ఆ; కుమారుడున్ = బాలుడు; ఆలించి = విని; పఠించెన్ = చదివెను; అన్నియున్ = అన్నిటిని; చలింపని = చెదరని; వైష్ణవ = విష్ణుని యెడలి; భక్తి = భక్తితో; పూర్ణుడు = నిండినవాడు; ఐ = అయ్యి.
భావము:- ఇలా చండమార్కులు శ్రద్ధగా ఆ రాక్షసరాజు ఇంటికి పోయి ప్రహ్లాదుడిని పిలుచుకొని వచ్చి, అతనికి నేర్పాల్సిన సమస్త శాస్త్రాలు చదివించారు. అతడు కూడా విష్ణుభక్తిని మాత్రము వీడకుండా వారు చెప్పిన ఆ విద్యలన్నీ చదివాడు.

తెభా-7-135-క.
గిది వారు చెప్పిన
నా గిదిం జదువుఁ గాని ట్టిట్టని యా
క్షేపింపఁడు తా నన్నియు
రూపించిన మిథ్య లని నిరూఢమనీషన్.

టీక:- ఏ = ఏ; పగిదిన్ = విధముగ; వారున్ = వారు; చెప్పినన్ = చెప్పిరో; ఆ = ఆ; పగిదిన్ = విధముగనే; చదువున్ = పఠించున్; కాని = కాని; అట్టిట్టు = అలాకాదు ఇలాకాదు; అని = అని; ఆక్షేపింపడు = అడ్డుచెప్పడు, వెక్కిరించడు; తాను = తను; అన్నియున్ = సర్వమును; రూపించిన = నిరూపించినట్టి; మిథ్యలు = అసత్యములు; అని = అని; నిరూఢ = దృఢమైన; మనీషన్ = ప్రజ్ఞతో.
భావము:- ప్రహ్లాదుడు వారు చెప్పినవి అన్నీ చక్కగా తాను విచారించి అనిత్యాలని తెలుసుకున్న వాడు అయినా, వారు చెప్పినట్లు విని చదివేవాడు తప్ప, అలా కాదని తప్పుపట్టేవాడు కాదు, గురువులకు ఎదురు చెప్పి ఆక్షేపించేవాడు కాదు.

తెభా-7-136-శా.
అంతం గొన్నిదినంబు లేఁగిన సురేంద్రారాతి శంకాన్విత
స్వాంతుండై నిజనందనున్ గురువు లే జాడం బఠింపించిరో
భ్రాంతుం డేమి పఠించెనో పిలిచి సంభాషించి విద్యాపరి
శ్రాంతిం జూచెదఁ గాక నేఁ డని మహాసౌధాంతరాసీనుఁడై.

టీక:- అంతన్ = అంతట; కొన్ని = కొన్ని; దినంబులున్ = రోజులు; ఏగినన్ = గడవగా; సురేంద్రారాతి = హిరణ్యకశిపుడు {సురేంద్రారాతి - సురేంద్ర (దేవేంద్రుని) ఆరాతి (శత్రువు), హిరణ్యకశిపుడు}; శంక = అనుమానము; ఆన్విత = కలిగిన; స్వాంతుండు = మనసు గలవాడు; ఐ = అయ్యి; నిజ = తన; నందనున్ = పుత్రుని; గురువులు = గురువులు; ఏ = ఏ; జాడన్ = విధముగ; పఠింపించిరో = చదివించిరో; భ్రాంతుండు = వెఱ్ఱివాడు; ఏమి = ఏమి; పఠించెనో = చదివినాడో; పిలిచి = పిలిచి; సంభాషించి = మాట్లాడి; విద్యా = విద్యలందు; పరిశ్రాంతిన్ = నిలుకడ; చూచెదగాక = పరిశీలించెదనుగాక; నేడు = ఈ దినమున; అని = అని; మహా = పెద్ద; సౌధ = మేడ; అంతర = లో; ఆసీనుడు = కూర్చున్నవాడు; ఐ = అయ్యి.
భావము:- తరువాత కొన్నాళ్ళకి, హిరణ్యకశిపుడు పెద్ద రాజగృహంలో కూర్చుని “నా కొడుకు, ప్రహ్లాదుడు వెఱ్ఱిబాగుల పిల్లాడు; ఏం చదువుతున్నాడో; వాళ్ళేం చెప్తున్నారో యేమో? ఇవాళ కొడుకును గురువులను పిలిచి పలకరిద్దాం. ఎంత బాగా చదువుతున్నాడో చూద్దాం” అని అనుకున్నాడు..

తెభా-7-137-ఉ.
మోముతోడ దైత్యకులముఖ్యుడు రమ్మని చీరఁ బంచె బ్ర
హ్లాకుమారకున్ భవమహార్ణవతారకుఁ గామ రోష లో
భాది విరోధివర్గ పరిహారకుఁ గేశవచింతనామృతా
స్వా కఠోరకుం గలుషజాల మహోగ్రవనీకుఠారకున్.

టీక:- మోదము = సంతోషము; తోడన్ = తోటి; దైత్యకులముఖ్యుడు = హిరణ్యకశిపుడు {దైత్యకులముఖ్యుడు - దైత్య (రాక్షస) కుల (వంశమునకు) ముఖ్యుడు, హిరణ్యకశిపుడు}; రమ్ము = రావలసినది; అని = అని; చీరన్ = పిలువ; పంచెన్ = పంపించెను; ప్రహ్లాద = ప్రహ్లాదుడు యనెడి; కుమారకున్ = పిల్లవానిని; భవ = సంసార; మహార్ణవ = సాగరమును; తారకున్ = తరించినవానిని; కామ = కామము; రోష = కోపము; లోభ = లోభము; ఆది = మొదలగు; విరోధివర్గ = శత్రుసమూహమును; పరిహారకున్ = అణచినవానిని; కేశవ = నారాయణుని; చింతనా = ధ్యానించుట యనెడి; అమృత = అమృతమును; ఆస్వాద = తాగుటచే; కఠోరకున్ = గట్టిపడినవానిని; కలుష = పాపపు; జాల = పుంజము లనెడి; మహా = గొప్ప; ఉగ్ర = భయంకరమైన; అవనీ = అడవులకు; కుఠారకున్ = గొడ్డలి వంటి వానిని.
భావము:- ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు అమందానందముతో తన కొడుకు ప్రహ్లాదుడిని తీసుకురమ్మని కబురు పంపాడు. సంసార సముద్రం తరించినవాడూ, కామ క్రోధాది అరిషడ్వర్గాలను అణచినవాడూ, శ్రీహరి చింత తప్ప వేరెరుగని వాడూ, పాపాలనే ఘోరమైన అడవుల పాలిటి గొడ్డలి వంటి వాడూ అయిన ఆ ప్రహ్లాదకుమారుని పిలుచుకు రమ్మని పంపాడు.

తెభా-7-138-వ.
ఇట్లు చారులచేత నాహూయమానుం డై ప్రహ్లాదుండు చనుదెంచిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; చారులు = సేవకుల; చేతన్ = ద్వారా; ఆహూయమానుండు = పిలువబడినవాడు; ఐ = అయ్యి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; చనుదెంచిన = రాగా.
భావము:- అలా భటులు తీసుకురాగా, ప్రహ్లాదుడు వచ్చాడు.

తెభా-7-139-శా.
"త్సాహ ప్రభుమంత్రశక్తి యుతమే యుద్యోగ? మారూఢ సం
విత్సంపన్నుఁడ వైతివే? చదివితే వేదంబులున్ శాస్త్రముల్?
త్సా! ర"మ్మని చేరఁ జీరి కొడుకున్ వాత్సల్య సంపూర్ణుఁ డై
యుత్సంగాగ్రముఁ జేర్చి దానవవిభుం డుత్కంఠ దీపింపగన్.

టీక:- ఉత్సాహ = పూనిక; ప్రభుమంత్ర = రాజకీయ జ్ఞాన; శక్తి = బలములతో; యుతమే = కూడినదియేకదా; ఉద్యోగము = పూనిక; ఆరూఢ = పొందిన; సంవిత్ = తెలివి యనెడి; సంపన్నుండవు = సంపద గలవాడవు; ఐతివే = అయితివా; చదివితే = చదువుకొంటివా; వేదంబుల్ = వేదములను; శాస్త్రముల్ = శాస్త్రములను; వత్సా = పుత్రుడా; రమ్ము = రా; అని = అని; చేరన్ = వద్దకు; చీరి = పిలిచి; కొడుకున్ = పుత్రుని; వాత్సల్య = ప్రేమతో; సంపూర్ణుడు = నిండినవాడు; ఐ = అయ్యి; ఉత్సంగాగ్రమున్ = ఒడిలోకి, తొడమీదకు; చేర్చి = తీసుకొని; దానవవిభుండు = హిరణ్యకశిపుడు {దానవవిభుడు - దానవ (రాక్షస) విభుడు (రాజు), హిరణ్యకశిపుడు}; ఉత్కంఠ = ఆసక్తి; దీపింపగన్ = విలసిల్లగా.
భావము:- "హిరణ్యకశిపుడికి పుత్ర వాత్సల్యంతో ఉత్సాహం వెల్లివిరిసింది. “నాయనా! రావోయీ” అని చేరదీసి తొడపై కూర్చోబెట్టుకుని “నాయనా! నీవు చేసే కృషి క్షాత్ర శక్తి సామర్థ్యాలతో కూడినదే కదా? బాగా చదువుకొని జ్ఞానము సంపాదించావా? వేదాలు, శాస్త్రాలు పూర్తిగా చదివావా?

తెభా-7-140-క.
"అనుదిన సంతోషణములు,
నితశ్రమతాపదుఃఖ సంశోషణముల్,
యుల సంభాషణములు,
కులకుం గర్ణయుగళ ద్భూషణముల్."

టీక:- అనుదిన = ప్రతిదిన; సంతోషణములు = సంతోషము కలిగించెడివి; జనిత = కలిగిన; శ్రమ = శ్రమను; తాప = బాధను; దుఃఖ = శోకమును; సంశోషణముల్ = బాగుగా ఆవిరి చేయునవి; తనయుల = పుత్రుల; సంభాషణములున్ = మాటలు; జనకుల్ = తండ్రుల; కున్ = కు; కర్ణ = చెవుల; యుగళ = జంటకు; సత్ = మంచి; భూషణముల్ = అలంకారములు.
భావము:- కొడుకుల ముద్దుమాటలు తల్లిదండ్రులకు ప్రతి రోజూ వింటున్నా విసుగు కలిగించవు, పైగా ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఎంతటి అలసట, తాపం, దుఃఖం కలిగినా తొలగిస్తాయి. కొడుకుల పలుకులు అంటే తల్లిదండ్రుల రెండు చెవులకు చక్కటి పండుగలు.”

తెభా-7-141-వ.
అని మఱియుఁ "బుత్రా! నీ కెయ్యది భద్రంబై యున్నది; చెప్పు"మనినఁ గన్నతండ్రికిఁ బ్రియనందనుం డిట్లనియె.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; నీ = నీ; కున్ = కు; ఎయ్యది = ఏది; భద్రంబు = చక్కగావచ్చి, శుభమై; ఉన్నది = ఉన్నది; చెప్పుము = చెప్పుము; అనినన్ = అనగా; కన్న = జన్మనిచ్చిన; తండ్రి = తండ్రి; కిన్ = కి; ప్రియనందనుడు = ఇష్టసుతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
భావము:- ఇలా అని పిమ్మట హిరణ్యకశిపుడు “కుమారా! గురువులు చెప్పిన వాటిలో నీకు బాగా నచ్చిన వాటిలో బాగా వచ్చినది చెప్పు.” అన్నాడు. తండ్రి హిరణ్యకశిపుడి మాటలు వినిన చిన్నారి కొడుకు ఇలా అన్నాడు.

తెభా-7-142-ఉ.
"ల్ల శరీరధారులకు నిల్లను చీఁకటినూతిలోపలం
ద్రెళ్ళక వీరు నే మను మతిభ్రమణంబున భిన్ను లై ప్రవ
ర్తిల్లక సర్వము న్నతని దివ్యకళామయ మంచు విష్ణునం
దుల్లముఁ జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ!"

టీక:- ఎల్ల = సర్వ; శరీరధారుల్ = మానవుల {శరీరధారులు - దేహము ధరించినవారు, మానవులు}; కున్ = కు; ఇల్లు = నివాసము; అను = అనెడి; చీకటి = చీకటి; నూతి = నుయ్యికి; లోపలన్ = లోపలందు; త్రెళ్ళక = పడకుండగ; వీరున్ = వీళ్ళు; ఏమున్ = మేము; అను = అనెడి; మతిన్ = చిత్త; భ్రమణంబునన్ = వైకల్యముతో; భిన్నులు = భేదభావము గలవారు; ఐ = అయ్యి; ప్రవర్తిల్లక = తిరుగకుండగ; సర్వమున్ = అఖిలము; అతని = అతని యొక్క; దివ్య = అతిగొప్ప; కళా = అంశతో, మాయావిలాసముతో; మయము = నిండినది; అంచున్ = అనుచు; విష్ణున్ = నారాయణుని; అందున్ = అందు; ఉల్లమున్ = హృదయము; చేర్చి = చేర్చి; తారు = తాము; అడవిన్ = అడవిలో; ఉండుట = ఉండుట; మేలు = ఉత్తమము; నిశాచర = రాక్షసులలో; అగ్రణీ = గొప్పవాడ.
భావము:- “ఓ రాక్షసేశ్వరా! లోకులు అందరు అజ్ఞానంతో, ఇల్లనే చీకటిగోతిలో పడి తల్లడిల్లుతూ ఉంటారు; “నేను వేరు, ఇతరులు వేరు” అనే చిత్త భ్రమ భేద భావంతో ఉంటారు. అట్టి భేద భావంతో మెలగకుండా; విశ్వం అంతా విష్ణు దేవుని లీలా విశేషాలతో నిండి ఉంది అని గ్రహించాలి; అలా గ్రహించి ఆ విష్ణుదేవుని మనసులో నిలుపుకొని, తాము అడవులలో నివసించినా ఉత్తమమే.”

తెభా-7-143-వ.
అని కుమారకుం డాడిన ప్రతిపక్షానురూపంబు లయిన సల్లాపంబులు విని దానవేంద్రుండు నగుచు నిట్లనియె.
టీక:- అని = అని; కుమారకుండు = పుత్రుడు; ఆడిన = పలికిన; ప్రతిపక్ష = విరోధులకు; అనురూపంబులు = అనుకూలమైనవి; అయిన = ఐన; సల్లాపంబులున్ = మాటలను; విని = విని; దానవేంద్రుడు = హిరణ్యకశిపుడు; నగుచున్ = నవ్వుతూ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా శత్రు పక్షానికి అనుకూలమైన మాటలు మాట్లాడుతున్న కొడుకు సల్లాపాలు విని, ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు నవ్వుతూ ఇలా అన్నాడు.

తెభా-7-144-క.
"ఎట్టాడిన న ట్టాడుదు
రిట్టిట్టని పలుక నెఱుఁగ రితరుల శిశువుల్
ట్టించి యెవ్వ రేమని
ట్టించిరొ బాలకునకుఁ రపక్షంబుల్

టీక:- ఎట్టు = ఏ విధముగ; ఆడిన = చెప్పినచో; అట్టు = ఆ విధముగనే; ఆడుదురు = పలికెదరు; అట్టిట్టు = అలా ఇలా; అని = అని; పలుకన్ = చెప్ప; ఎఱుగరు = లేరు; ఇతరుల = ఇతరుల యొక్క; శిశువుల్ = పిల్లలు; దట్టించి = ఎక్కించి; ఎవ్వరు = ఎవరు; ఏమి = ఏమి; అని = అని; పట్టించిరో = నేర్పిరో; బాలకున్ = పిల్లవాని; కున్ = కి; పర = శత్రువు; పక్షంబుల్ = పక్క వైనట్టివానిని.
భావము:- “మిగతా వాళ్ళందరి పిల్లలు ఎలా చెప్తే అలా వింటారు. ఎదురు చెప్పనే చెప్పరు. చిన్న పిల్లాడికి శత్రు పక్షానికి అనుకూలమైన వాదాలు ఎవరు ఇంత గట్టిగా ఎక్కించారో ఏమిటో?

తెభా-7-145-శా.
నాకుం జూడఁగఁ జోద్య మయ్యెడిఁ గదా నా తండ్రి! యీ బుద్ధి దా
నీకున్ లోపలఁ దోఁచెనో? పరులు దుర్నీతుల్ పఠింపించిరో?
యేకాంతంబున భార్గవుల్ పలికిరో? యీ దానవశ్రేణికిన్
వైకుంఠుండు గృతాపరాధుఁ డతనిన్ ర్ణింప నీ కేటికిన్?

టీక:- నా = నా; కున్ = కు; చూడగన్ = చూచుటకు; చోద్యము = చిత్రము; అయ్యెడిగదా = కలుగుతున్నది; నా = నా యొక్క; తండ్రి = నాయనా; ఈ = ఇట్టి; బుద్ధి = భావము; తాన్ = దానంతటదే; నీ = నీ; కున్ = కు; లోపలన్ = మనసు నందు; తోచెనో = కలిగినదా లేక; పరులు = ఇతరులు; దుర్నీతుల్ = చెడ్డవారు; పఠింపించిరో = చదివించిరా లేక; ఏకాంతమునన్ = రహస్యమున; భార్గవుల్ = చండామార్కులు {భార్గవులు - భర్గుని (శుక్రుని) కొడుకులు, చండామార్కులు}; పలికిరో = చెప్పిరా ఏమి; ఈ = ఈ; దానవ = రాక్షసుల; శ్రేణి = కులమున; కిన్ = కు; వైకుంఠుడు = నారాయణుడు {వైకుంఠుడు - వైకుంఠమున ఉండువాడు, విష్ణువు}; కృత = ఒనర్చిన; అపరాధుడు = ద్రోహము గలవాడు; అతనిన్ = అతనిని; వర్ణింపన్ = స్తుతించుట; నీ = నీ; కున్ = కు; ఏటికిన్ = ఎందులకు.
భావము:- ఓ నా కుమారా! ప్రహ్లాదా! చూస్తుంటే ఇదంతా నాకు వింతగా ఉంది. ఇలాంటి బుద్ధి నీ అంతట నీకే కలిగిందా? లేక పరాయి వాళ్ళు ఎవరైనా ఎక్కించారా? లేక నీ గురువులు రహస్యంగా నేర్పారా? విష్ణువు మన రాక్షసులకు ఎంతో ద్రోహం చేసినవాడు. అతనిని కీర్తించకు, అతని పేరు కూడా తలచుకోకు.

తెభా-7-146-మ.
సులం దోలుటయో, సురాధిపతులన్ స్రుక్కించుటో, సిద్ధులం
రివేధించుటయో, మునిప్రవరులన్ బాధించుటో, యక్ష కి
న్న గంధర్వ విహంగ నాగపతులన్ నాశంబు నొందించుటో,
రి యంచున్ గిరి యంచు నేల చెడ మోహాంధుండవై పుత్రకా!

టీక:- సురలన్ = దేవతలను; తోలుటయో = తరుముట సరికాని; సురా = దేవతల యొక్క; అధిపతులన్ = ప్రభువులను; స్రుక్కించుటో = భయపెట్టుట సరికాని; సిద్ధులన్ = సిద్ధులను; పరివేధించుటయో = పీడించుట సరికాని; ముని = మునులలో; ప్రవరులన్ = శ్రేష్ఠులను; బాధించుటో = బాధపెట్టుట సరికాని; యక్ష = యక్షులు; కిన్నర = కిన్నరలు; గంధర్వ = గంధర్వులు; విహంగ = పక్షులు; నాగ = నాగవాసుల; పతులన్ = ప్రభువులను; నాశంబున్ = నాశనము; ఒందించుటో = చేయుట సరికాని; హరిన్ = హరి; అంచున్ = అనుచు; గిరి = గిరి; అంచున్ = అనుచు; ఏల = ఎందులకు; చెడన్ = చెడిపోవుట; మోహ = మోహముచే; అంధుడవు = గుడ్డివాడవు; ఐ = అయ్యి; పుత్రకా = కుమారుడా.
భావము:- కుమారా! ప్రహ్లాదా! దేవతలను పారదోలవయ్యా. లేకపోతే దేవతా విభులను పట్టి చావబాదటం కాని, సిద్ధులను బాగా వేధించటం కాని మునీశ్వరులను బాధించటం కాని, లేదా యక్షులు, కిన్నరులు, గంధర్వులు, పక్షి రాజులు, నాగరాజులను చంపటం కాని చెయ్యాలి. ఇలా చేయటం మన ధర్మం. అది మానేసి, హరి అంటూ గిరి అంటూ అజ్ఞానం అనే అంధకారంతో ఎందుకు మూర్ఖుడిలా చెడిపోతున్నావు.”

తెభా-7-147-వ.
అనినఁ దండ్రిమాటలకుఁ బురోహితు నిరీక్షించి ప్రహ్లాదుం డిట్లనియె "మోహ నిర్మూలనంబు జేసి యెవ్వని యందుఁ దత్పరులయిన యెఱుకగల పురుషులకుం బరులు దా మనియెడు మాయాకృతం బయిన యసద్గ్రాహ్యంబగు భేదంబు గానంబడ దట్టి పరమేశ్వరునకు నమస్కరించెద.
టీక:- అనినన్ = అనగా; తండ్రి = తండ్రి యొక్క; మాటలు = పలుకుల; కున్ = కు; పురోహితుని = గురువును; నిరీక్షించి = ఉద్ధేశించి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మోహ = మోహమును; నిర్మూలనంబున్ = పూర్తిగా పోగొట్టబడినదిగా; చేసి = చేసి; ఎవ్వని = ఎవని; అందున్ = ఎడల; తత్పరులు = తగిలి యుండువారు; అయిన = ఐన; ఎఱుక = తెలివి; కల = కలిగిన; పురుషుల్ = మానవుల; కున్ = కు; పరులు = ఇతరులు; తాము = తాము; అనియెడు = అనెడి; మాయా = మాయచేత; కృతంబు = కలిగించబడినది; అయిన = ఐన; అసత్ = అసత్తుచేత, మిథ్యాగా; గ్రాహ్యంబు = తెలియునది; అగు = అయిన; భేదంబు = భేదభావము; కానంబడదు = కనబడదు; అట్టి = అటువంటి; పరమేశ్వరున్ = నారయణుని {పరమేశ్వరుడు - పరమ (అత్యున్నత మైన) ఈశ్వరుడు, విష్ణువు}; కున్ = కి; నమస్కరించెద = నమస్కారము చేసెదను.
భావము:- ఇలా చెప్పిన తండ్రి మాటలు విని ప్రహ్లాదుడు గురువు చండామార్కులను చూసి ఇలా అన్నాడు “జ్ఞానులు మోహం తొలగించుకొని భగవంతుని అందు ఏకాగ్ర భక్తి ప్రపత్తులతో ఉంటారు. అట్టి వారికి తమ పర భేదం అనే మాయా మోహం అంటదు. ఆ భగవంతుడు విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను.

తెభా-7-148-శా.
జ్ఞుల్ కొందఱు నేము దా మనుచు మాయం జెంది సర్వాత్మకుం
బ్రజ్ఞాలభ్యు దురన్వయక్రమణునిన్ భాషింపఁగా నేర రా
జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వే
జ్ఞుల్ తత్పరమాత్ము విష్ణు నితరుల్ ర్శింపఁగా నేర్తురే?

టీక:- అజ్ఞుల్ = జ్ఞానము లేనివారు; కొందఱు = కొంతమంది; నేము = మేము; తాము = వారు; అనుచున్ = అనుచు; మాయన్ = మోహమును; చెంది = పొంది; సర్వాత్మకున్ = నారాయణుని {సర్వాత్మకుడు - సర్వము తానైనవాడు, విష్ణువు}; ప్రజ్ఞాలభ్యున్ = నారాయణుని {ప్రజ్ఞాలభ్యుడు - బుద్ధిబలముచేత అందని వాడు, విష్ణువు}; దురన్వయక్రమణునిన్ = నారాయణుని {దురన్వయక్రమణుడు - అన్వయ (ఘటింప) రాని (శక్యముగాని) క్రమణుడు (ప్రవర్తన గలవాడు), విష్ణువు}; భాషింపగాన్ = పలుకుటను; నేరరు = చేయలేరు; ఆ = ఆ; జిజ్ఞాసా = తెలిసికొనెడి; పథము = విధానము; అందున్ = లో; మూఢులు = మూర్ఖులు; కదా = కదా; చింతింపన్ = భావించుట; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగువారు; వేదజ్ఞులు = వేదము తెలిసినవారు; తత్ = అట్టి; పరమాత్మున్ = నారాయణుని; విష్ణున్ = నారాయణుని; ఇతరుల్ = ఇతరులు; దర్శింపగాన్ = దర్శించుటను; నేర్తురే = చేయగలరా ఏమి.
భావము:- కొందరు అజ్ఞానంలో పడి తాము వేరు, పరులు వేరు అనే మాయ అనే భ్రాంతిలో ఉంటారు. సర్వాత్మకుడు అయిన భగవంతుడిని ఎంత తెలివితేటలూ, పాండిత్యం ఉపయోగించినా కూడా తెలుసుకోలేరు. ఆ విష్ణుమూర్తిని పరమాత్ముడిని బ్రహ్మ వంటి వేద విజ్ఞాన మూర్తులు కూడా తెలుసుకోలేని వారే. ఇక ఇతరులు సామాన్యులు ఆ పరాత్పరుడు అయిన విష్ణుమూర్తిని ఎలా దర్శించగలరు!

తెభా-7-149-తే.
ను మయస్కాంతసన్నిధి నెట్లు భ్రాంత
గు హృషీకేశు సన్నిధి నా విధమునఁ
రఁగుచున్నది దైవయోమునఁ జేసి
బ్రాహ్మణోత్తమ! చిత్తంబు భ్రాంత మగుచు.

టీక:- ఇనుము = ఇనుము; అయస్కాంత = అయస్కాంతమునకు; సన్నిధిని = వద్ద; ఎట్లు = ఏ విధముగ; భ్రాంతము = లోలము, లోనైనది; అగు = అగునో; హృషీకేశు = నారాయణుని {హృషీకేశుడు - హృషీకము (ఇంద్రియము) లకు ఈశుడు (ప్రభువు), విష్ణువు}; సన్నిధిన్ = సన్నిధానము నందు; ఆ = అట్టి; విధమునన్ = విధముగనే; కరగుచున్నది = కరిగిపోవుచున్నది; దైవయోగమునన్ = దైవగతి; చేసి = వలన; బ్రాహ్మణ = బ్రాహ్మణులలో; ఉత్తమ = ఉత్తముడా; చిత్తంబు = మనసు; భ్రాంతము = చలించునది; అగుచున్ = అగుచు.
భావము:- ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా! చండామార్కుల వారూ! అయస్కాంతం వైపుకు ఇనుము ఆకర్షించబడు విధంగా, దైవ నిర్ణయానుసారం, నా మనసు సర్వేంద్రియాలకు అధిపతి అయిన విష్ణుమూర్తి సన్నిధిలో ఆకర్షింపబడుతోంది, ఇంకే విషయంలోనూ నా మనసు నిలవటం లేదు.

తెభా-7-150-సీ.
మందార మకరంద మాధుర్యమునఁ దేలు-
ధుపంబు వోవునే దనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు-
రాయంచ సనునె తరంగిణులకు?
లిత రసాలపల్లవ ఖాదియై చొక్కు-
కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక-
రుగునే సాంద్ర నీహారములకు?

తెభా-7-150.1-తే.
నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?"

టీక:- మందార = మందారము యొక్క; మకరంద = పూతేనె యొక్క; మాధుర్యమునన్ = తీయదనము నందు; తేలు = ఓలలాడెడి; మధుపంబు = తుమ్మెద; పోవునే = వెళుతుందా; మదనముల = ఉమ్మెత్తపూల; కున్ = కు; నిర్మల = స్వచ్ఛమైన; మందాకినీ = గంగానది యొక్క; వీచికలన్ = తరంగము లందు; తూగు = ఊగెడి; రాయంచ = రాజ హంస; చనునె = పోవునా; తరంగిణుల్ = (సాధారణ) ఏరుల; కున్ = కు; లలిత = చక్కటి; రసాల = మామిడి; పల్లవ = చిగుర్లను; ఖాది = తినునది; ఐ = అయ్యుండి; చొక్కు = మైమరచెడి; కోయిల = కోయిల; చేరునే = దగ్గరకు వచ్చునా ఏమి; కుటజముల = కొండమల్లె, కొడిసెచెట్ల; కున్ = కు; పూర్ణేందు = నిండుజాబిల్లి; చంద్రికా = వెన్నల; స్పురిత = స్పందించెడి; చకోరకము = వెన్నెలపులుగు; అరుగునే = వెళ్లునా ఏమి; సాంద్ర = దట్టమైన; నీహారముల్ = మంచుతెరల; కున్ = కు; అంబుజోదర = నారాయణుని {అంబుజోదరుడు - అంబుజము (పద్మము) ఉదరుడు (పొట్టన గలవాడు), విష్ణువు}.
దివ్య = దివ్యమైన; పాద = పాదము లనెడి; అరవింద = పద్మముల; చింతనా = ధ్యానము యనెడి; అమృత = అమృతమును; పాన = తాగుటచే; విశేష = మిక్కిలిగా; మత్త = మత్తెక్కిన; చిత్తము = మనసు; ఏ = ఏ; రీతిన్ = విధముగ; ఇతరము = వేరొంటిని; చేరన్ = చేరుటను; నేర్చున్ = చేయగలదా ఏమి; వినుత = స్తుతింపదగిన; గుణ = సుగుణములు గల; శీల = వర్తన గలవాడ; మాటలు = మాటలు చెప్పుట; వేయున్ = అనేకము; ఏలన్ = ఎందులకు.
భావము:- సుగుణాలతో సంచరించే ఓ గురూత్తమా! మందార పూలలోని మకరందం త్రాగి మాధుర్యం అనుభవించే తుమ్మెద, ఉమ్మెత్త పూల కేసి పోతుందా? రాజహంస స్వచ్ఛమైన ఆకాశగంగా నదీ తరంగాలపై విహరిస్తుంది కాని వాగులు వంకలు దగ్గరకు వెళ్ళదు కదా? తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తిని పులకించిన కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా? చకోర పక్షి నిండు పున్నమి పండువెన్నెలలో విహరిస్తుంది కాని దట్టమైన మంచు తెరల వైపునకు వెళ్తుందా? చెప్పండి. అలాగే పద్మనాభస్వామి విష్ణుమూర్తి దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. వెయ్యి మాటలు ఎందుకు లెండి, హరిపాదాయత్త మైన నా చిత్తం ఇతర విషయాల పైకి ఏమాత్రం పోవటం లేదు.”
(ఈ పద్య రత్నం అమూలకం; సహజ కవి స్వకీయం; అంటే మూల వ్యాస భాగవతంలో లేనిది; పోతన స్వంత కృతి మరియు పరమ భాగవతులు ప్రహ్లాదుని, పోతన కవీంద్రుని మనోభావాల్ని, నమ్మిన భక్తి సిద్ధాంతాల్ని కలగలిపిన పద్యరత్నమిది. ఇలా ఈ ఘట్టంలో అనేక సందర్భాలలో, బమ్మెర వారు అమృతాన్ని సీసాల నిండా నింపి తెలుగులకు అందించారు.)

తెభా-7-151-వ.
అనిన విని రోషించి రాజసేవకుండైన పురోహితుండు ప్రహ్లాదుం జూచి తిరస్కరించి యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; విని = విని; రోషించి = కోపించి; రాజ = హిరణ్యకశిపుని యొక్క; సేవకుండు = సేవకుడు; ఐన = అయిన; పురోహితుండు = చండామార్కులు; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; చూచి = చూసి; తిరస్కరించి = తెగడి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా ప్రహ్లాదుడు చెప్పగా విని అతని గురువు, హిరణ్యకశిప మహారాజు సేవకుడు అయిన ఆ బ్రాహ్మణుడు కోపించి అతనితో ఇలా అన్నాడు.

తెభా-7-152-ఉ.
"పంశర ద్వయస్కుఁడవు బాలుఁడ వించుక గాని లేవు భా
షించెదు తర్కవాక్యములు, చెప్పిన శాస్త్రములోని యర్థ మొ
క్కించుక యైనఁ జెప్ప వసురేంద్రుని ముందట, మాకు నౌఁదలల్
వంచుకొనంగఁ జేసితివి వైరివిభూషణ! వంశదూషణా!

టీక:- పంచ = ఐదు (5); శరత్ = సంవత్సరముల; వయస్కుడవు = వయస్సు గలవాడవు; బాలుడవు = పిల్లవాడవు; ఇంచుక = కొంచెము; కాని = అయినను; లేవు = లేవు; భాషించెదు = చెప్పుతుంటివి; తర్క = వాదన పూర్వక; వాక్యములున్ = మాటలను; చెప్పిన = నేర్పినట్టి; శాస్త్రము = శాస్త్రము; లోని = అందలి; అర్థమున్ = విషయములను; ఒక్కించుకన్ = బాగా కొంచెము, కొద్దిగా; ఐనన్ = అయినను; చెప్పవు = పలుకవు; అసురేంద్రుని = హిరణ్యకశిపుని; ముందటన్ = ఎదురుగ; మా = మా; కున్ = కు; ఔదలల = శిరస్సులను; వంచుకొనంగ = వంచుకొనునట్లు; చేసితివి = చేసితివి; వైరి = శత్రువులను; భూషణ = మెచ్చుకొను వాడ; వంశ = స్వంత వంశమును; దూషణ = తెగడువాడ.
భావము:- “ఓరీ! రాక్షస కులానికి మచ్చ తెచ్చే వాడా! శత్రువులను మెచ్చుకునే వాడా! ప్రహ్లాదా! నిండా అయిదేళ్లు లేవు. చిన్న పిల్లాడివి. ఇంత కూడా లేవు. ఊరికే వాదిస్తున్నావు. మేము కష్టపడి బోధించిన శాస్త్రాలలోని ఒక్క విషయం కూడా చెప్పటం లేదు. రాజుగారి ఎదుట మాకు అవమానము తెస్తావా?

తెభా-7-153-చ.
యుఁడు గాఁడు శాత్రవుఁడు దానవభర్తకు వీఁడు దైత్య చం
వనమందుఁ గంటక యు క్షితిజాతము భంగిఁ బుట్టినాఁ
వరతంబు రాక్షసకులాంతకుఁ బ్రస్తుతి చేయుచుండు, దం
మునఁ గాని శిక్షలకు డాయఁడు పట్టుఁడు కొట్టుఁ డుద్ధతిన్."

టీక:- తనయుడు = పుత్రుడు; కాడు = కాడు; శాత్రవుడు = విరోధి; దానవభర్త = హిరణ్యకశిపుని; కున్ = కి; వీడు = ఇతడు; దైత్య = రాక్షస (వంశము) యనెడి; చందన = గంధపుచెట్ల; వనము = అడవి; అందున్ = లో; కంటక = ముళ్లుతో; యుత = కూడిన; క్షితిజాతము = చెట్టు {క్షితిజాతము - క్షితి (నేల)లో జాతము (పుట్టినది), చెట్టు}; భంగిన్ = వలె; పుట్టినాడు = జన్మించెను; అనవరతంబున్ = ఎల్లప్పుడు; రాక్షసకులాంతకున్ = నారాయణుని {రాక్షసకులాంతకుడు - రాక్షస కుల (వంశమును) అంతకుడు (నాశనముచేయువాడు), విష్ణువు}; ప్రస్తుతిన్ = మిక్కిలి కీర్తించుటను; చేయుచుండున్ = చేయుచుండును; దండనమునన్ = కొట్టుటవలన; కాని = తప్పించి; శిక్షల్ = చదువుచెప్పు పద్ధతుల; కున్ = కు; డాయడు = చేరడు; పట్టుడు = పట్టుకొనండి; కొట్టుడు = కొట్టండి; ఉద్ధతిన్ = మిక్కిలిగా.
భావము:- హిరణ్యకశిప మహారాజుకు శత్రువు తప్పించి వీడు కొడుకు కాడు. నిర్మలమైన రాక్షస కులం అను గంధపు తోటలో ఈ దుర్మాత్ముడు ముళ్ళ చెట్టులా పుట్టాడు. ఎప్పుడూ రాక్షస కులాన్ని నాశనం చేస్తున్న విష్ణువును నుతిస్తాడు. వీడిని కఠినంగా దండిస్తే గాని చదువుల దారికి రాడు. పట్టుకొని గట్టిగా కొట్టండి.”
అని గురువు చండామార్కులు హిరణ్యకశిపుడితో మళ్ళీ ఇలా అన్నారు.

తెభా-7-154-క.
పాపనిఁ జదివింతుము
నీ పాదము లాన యింక నిపుణతతోడం
గోపింతుము దండింతుము
కోపింపకు మయ్య దనుజకుంజర! వింటే."

టీక:- ఈ = ఈ; పాపని = పిల్లవానిని; చదివింతుము = చదివించెదము; నీ = నీ యొక్క; పాదములు = పాదములు; ఆన = ఒట్టు; ఇంకన్ = ఇంకను; నిపుణత = నేర్పు; తోడన్ = తోటి; కోపింతుము = దెబ్బలాడెదము; దండింతుము = కొట్టెదము; కోపింపకము = కోపించకుము; అయ్య = తండ్రి; దనుజకుంజర = హిరణ్యకశిపుడు {దనుజకుంజరుడు - దనుజ (రాక్షసులలో) కుంజరుడ (ఏనుగువలె గొప్పవాడు), హిరణ్యకశిపుడు}; వింటే = వింటివే.
భావము:- ఓ రాక్షసేంద్రా! వినవయ్యా! కోప్పడ కయ్యా! మీ పాదాలమీద ఒట్టు. ఇకపై ఈ బాలుణ్ణి గట్టిగా కోప్పడి దండించి ఎలాగైనా సరే బాగా చదివిస్తాం. మా నైపుణ్యం చూపిస్తాం”

తెభా-7-155-వ.
అని మఱియు నారాచపాపనికి వివిధోపాయంబులం బురోహితుండు వెఱపుఁజూపుచు రాజసన్నిధిం బాపి తోడికొనిపోయి యేకాంతంబున.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; రాచ = రాజవంశపు; పాపని = పిల్లవాని; కిన్ = కి; వివిధ = రకరకముల; ఉపాయంబులన్ = ఉపయములతో; పురోహితుండు = గురువు; వెఱపు = భయము; చూపుచున్ = పెట్టుచూ; రాజ = రాజు యొక్క; సన్నిధిన్ = సాన్నిధ్యమునుండి; పాపి = దూరముచేసి; తోడికొనిపోయి = కూడా తీసుకు వెళ్లి; ఏకాంతంబునన్ = రహస్య మందు;
భావము:- అని పలికి ఆ రాకుమారుడు ప్రహ్లాదుడికి రకరకాలుగా భయం చెప్తూ, గురువు అతనిని రాక్షస రాజు దగ్గర నుండి బయటకు తీసుకు వెళ్లారు. ఒంటరిగా కూర్చోబెట్టి ఏకాంతంగా

తెభా-7-156-క.
భార్గవనందనుఁ డతనికి
మార్గము చెడకుండఁ బెక్కు మాఱులు నిచ్చల్
ర్గత్రితయము చెప్పె న
ర్గళ మగు మతివిశేష మర నరేంద్రా!

టీక:- భార్గవనందనుడు = శుక్రుని కొడుకు; అతని = అతని; కిన్ = కి; మార్గము = దారి; చెడకుండగ = తప్పిపోకుండగ; పెక్కు = అనేక; మాఱులు = పర్యాయములు; నిచ్చల్ = ప్రతిదినము; వర్గత్రితయమున్ = ధర్మార్థకామములను; చెప్పెన్ = చెప్పెను; అనర్గళము = అడ్డులేనిది; అగు = అయిన; మతి = బుద్ధి; విశేష = విశిష్టత; అమరన్ = ఒప్పునట్లు; నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నర( మానవులకు) ఇంద్రుడు (ప్రభువు), రాజు}.
భావము:- ధర్మరాజా! అలా శుక్రాచార్యుడి కొడుకు ఆ గురువు తన చాతుర్యం అంతా చూపి, ప్రహ్లాదుడికి వాళ్ళ సంప్రదాయం ప్రకారం అనేక విద్యలు ఏకాంతంగా చెప్పారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామ శాస్త్రం అనే త్రితయాలను ఎడ తెగకుండా బోధించాడు. అనర్గళమైన తెలివితేటలు అమరేలా ఆయా విషయాలను అనేక సార్లు వల్లింప జేశాడు.

తెభా-7-157-వ.
మఱియు గురుండు శిష్యునకు సామ దాన భేద దండోపాయంబు లన్నియు నెఱింగించి నీతికోవిదుండయ్యె నని నమ్మి నిశ్చయించి తల్లికి నెఱింగించి తల్లిచేత నలంకృతుం డయిన కులదీపకు నవలోకించి.
టీక:- మఱియున్ = ఇంకను; గురుండు = గురువు; శిష్యున్ = శిష్యుని; కున్ = కి; సామ = సామము; దాన = దానము; భేద = భేదము; దండ = దండము యనెడి; ఉపాయంబులన్ = ఉపాయములను; అన్నియున్ = సమస్తమును; ఎఱింగించి = తెలిపి; నీతి = రాజనీతిశాస్త్రము నందు; కోవిదుండు = ప్రవీణుడు; అయ్యెన్ = అయ్యెను; అని = అని; నమ్మి = నమ్మి; నిశ్చయించి = నిర్ణయించి; తల్లి = తల్లి; కిన్ = కి; ఎఱింగించి = తెలిపి; తల్లి = తల్లి; చేతన్ = వలన; అలంకృతుండు = అలంకరింపబడినవాడు; అయిన = ఐన; కులదీపకున్ = ప్రహ్లాదుని {కులదీపకుడు - కుల (వంశమును) దీపకుండు (ప్రకాశింప జేయువాడు), ప్రహ్లాదుడు}; అవలోకించి = చూసి.
భావము:- అంతే కాకుండా, చండామార్కులు శిష్యుడు ప్రహ్లాదుడికి ఉపాయాలు నాలుగు రకాలు అంటే మంచిమాటలతో మచ్చిక చేసుకోడమనే "సామము", కొన్ని వస్తువులు ఇచ్చి మంచి చేసుకోడం "దానము", కలహాలు పెట్టి బెదిరించి సానుకూలం చేసుకోడం అనే "భేదము". దండించి దారిలో పెట్టడం అనే "దండము". అలా చతురోపాయులు అన్నీ చెప్పారు. ఈ సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించే సమయాలూ విధానాలు బాగా వివరించి చెప్పారు. “మంచి నీతిమంతుడు అయ్యాడు” అనుకున్నారు. అదే అతని తల్లికి చెప్పారు. ఆమె చాలా సంతోషించి వంశవర్ధనుడు అయిన కొడుకును చక్కగా అలంకరించి తండ్రి వద్దకు వెళ్ళమంది. అప్పుడు గురువు శిష్యుడితో ఇలా అన్నారు.

తెభా-7-158-ఉ.
"త్రిప్పకు మన్న మా మతము, దీర్ఘములైన త్రివర్గపాఠముల్
ప్పకు మన్న, నేఁడు మన దైత్యవరేణ్యుని మ్రోల నేము మున్
చెప్పినరీతి గాని మఱి చెప్పకు మన్న విరోధిశాస్త్రముల్,
విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థ జాలముల్."

టీక:- త్రిప్పకుము = మార్చేయకుము; అన్న = నాయనా; మా = మా యొక్క; మతమున్ = విధానమును; దీర్ఘములు = పెద్దవి; ఐన = అయినట్టి; త్రివర్గ = ధర్మార్థ కామముల గురించిన; పాఠముల్ = చదువులను; తప్పకుము = వదలివేయకుము; అన్న = నాయనా; నేడు = ఈ దినమున; మన = మన యొక్క; దైత్యవరేణ్యుని = హిరణ్యకశిపుని {దైత్యవరేణ్యుడు - దైత్య (రాక్షసులలో) వరేణ్యుడు (శ్రేష్ఠుడు), హిరణ్యకశిపుడు}; మ్రోలన్ = ముందట; నేము = మేము; మున్ = ఇంతకుముందు; చెప్పిన = నేర్పిన; రీతిన్ = విధముగ; కాని = తప్పించి; మఱి = మరి యితరమైనవి; చెప్పకుము = చెప్పకుము; అన్న = నాయనా; విరోధి = శత్రువుల యొక్క; శాస్త్రముల్ = శాస్త్రములను; విప్పకుము = తెఱువకుము, చెప్పకుము; దుష్టము = చెడ్డది; అగు = అయిన; విష్ణు = నారాయణుని; చరిత్ర = వర్తనలు; కథ = గాథలు; అర్థ = విషయముల; జాలమున్ = సమూహములను.
భావము:- “నాయనా! ప్రహ్లాదా! ఇవాళ మీ తండ్రిగారి దగ్గర మేం చెప్పిన చదువులకు వ్యతిరేకంగా చెప్పకు. గొప్పవైన ధర్మశాస్త్రం అర్ధశాస్త్రం కామశాస్త్రం అనే త్రితయాల పాఠాలు అడిగినవి జాగ్రత్తగా మరచిపోకుండా చెప్పు. మేం చెప్పిన నీతిపాఠాలు తప్పించి వేరేవి మాట్లాడకు. మన విరోధి విష్ణుమూర్తి మాటమాత్రం ఎత్తకు. దుష్టమైన ఆ విష్ణుని నడవడికలు, కథలను గురించి అసలు మాట్లాడనే మాట్లాడ వద్దు. మరచిపోకు నాయనా!”

తెభా-7-159-వ.
అని బుజ్జగించి దానవేశ్వరుని సన్నిధికిం దోడితెచ్చిన.
టీక:- అని = అని; బుజ్జగించి = నచ్చచెప్పి; దానవేశ్వరుని = హిరణ్యకశిపుని; సన్నిధి = దగ్గర; కున్ = కు; తోడి = కూడా; తెచ్చి = తీసుకు వచ్చి.
భావము:- అలా గురువులు ప్రహ్లాదుడిని బుజ్జగించి, హిరణ్యకశిప మహారాజు ఆస్థానానికి తీసుకు వచ్చారు.

తెభా-7-160-సీ.
డుగడ్గునకు మాధవానుచింతన సుధా-
మాధుర్యమున మేను ఱచువాని;
నంభోజగర్భాదు భ్యసింపఁగ లేని-
రిభక్తిపుంభావ మైనవాని;
మాతృగర్భము జొచ్చి న్నది మొదలుగాఁ-
జిత్త మచ్యుతుమీఁదఁ జేర్చువాని;
నంకించి తనలోన ఖిల ప్రపంచంబు-
శ్రీవిష్ణుమయ మని చెలఁగువాని;

తెభా-7-160.1-తే.
వినయ కారుణ్య బుద్ధి వివేక లక్ష
ణాదిగుణముల కాటపట్టయిన వాని;
శిష్యు బుధలోక సంభావ్యుఁ జీరి గురుఁడు
ముందఱికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కు మనుచు.

టీక:- అడగడ్గున = ప్రతిక్షణము; కున్ = నందును; మాధవ = నారాయణుని; అనుచింతనా = ధ్యానించుట యనెడి; సుధా = అమృతము యొక్క; మాధుర్యమున్ = తీయదనముచే; మేను = శరీరమును; మఱచు = మరిచిపోవు; వానిన్ = వానిని; అంభోజగర్భ = బ్రహ్మదేవుడు {అంభోజగర్భుడు - అంభోజము (పద్మము)నందు గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; ఆదుల్ = మొదలగువారుకూడ; అభ్యసింపగలేని = నేర్చుకొనలేని; హరి = నారాయణుని; భక్తి = భక్తి; పుంభావము = మిక్కిలి నేర్పు గల; వానిన్ = వానిని; మాతృ = తల్లి యొక్క; గర్భమున్ = గర్భములో; చొచ్చి = ప్రవేశించి; మన్నది = జీవంపోసుకున్ననాటి; మొదలుగాన్ = నుండి మొదలు పెట్టి; చిత్తమున్ = మనసును; అచ్యుతు = నారాయణుని {అచ్యుతుడు - చ్యుతము (జారిపోవుట) లేనివాడు, విష్ణువు}; మీదన్ = పైన; చేర్చు = లగ్నము చేయు; వానిన్ = వానిని; అంకించి = భావించి; తన = తన; లోనన్ = అందే; అఖిల = సమస్తమైన; ప్రపంచంబున్ = విశ్వమును; శ్రీ = సంపత్కర మైన; విష్ణు = నారాయణునితో; మయము = నిండినది; అని = అని; చెలగు = చెలరేగెడి; వానిన్ = వానిని.
వినయ = అణకువ; కారుణ్య = దయ; బుద్ధి = మంచిబుద్ధులు; వివేకలక్షణ = వివేచనాశక్తి; ఆది = మొదలగు; గుణముల్ = సుగుణముల; కున్ = కు; ఆటపట్టు = విహారస్థానము; అయిన = ఐన; వానిన్ = వానిని; శిష్యున్ = శిష్యుని (ప్రహ్లాదుని); బుధ = జ్ఞానులు; లోక = అందరిచేతను; సంభావ్యున్ = గౌరవింపదగినవానిని; చీరి = పిలిచి; గురుడు = గురువు; ముందఱి = ముందరి; కిన్ = కి; ద్రొబ్బి = తోసి, గెంటి; తండ్రి = తండ్రి; కిన్ = కి; మ్రొక్కుము = నమస్కరించుము; అనుచున్ = అనుచు.
భావము:- ప్రహ్లాదుడు ప్రతిక్షణమూ, అడుగడుక్కీ విష్ణువును ధ్యానిస్తూ ఆ ధ్యానామృత మాధుర్యంలో తన్ను తాను మైమఱుస్తూ ఉంటాడు. అతను బ్రహ్మ వంటి వారికైనా కూడా అలవి కాని “హరి భక్తి రూపందాల్చిన బాలకుని”లా ఉంటాడు. తల్లి కడుపులో ప్రవేశించి నప్పటి నుంచీ కూడా అతని మనస్సు అచ్యుతుడు విష్ణువు మీదే లగ్నం చేసి ఉంటోంది. అతడు చక్కగా విచారించి “ఈ లోకములు అన్నీ విష్ణుమయములే” అని తన మనస్సు లో ధృఢంగా నమ్మేవాడు. అతడు అణకువ, దయ మొదలగు సర్వ సుగుణములు నిండుగా ఉన్న వాడు. జ్ఞానులుచే చక్కగా గౌరవంతో తలచబడేవాడు. అంతటి ఉత్తముడైన తన శిష్యుడు ప్రహ్లాదుడిని పిలిచి, తండ్రి ముందుకు నెట్టి, నమస్కారం చెయ్యమని చెప్తూ, హిరణ్యకళిపుడితో ఇలా అన్నారు.

తెభా-7-161-క.
"శిక్షించితి మన్యము లగు
క్షంబులు మాని నీతిపారగుఁ డయ్యెన్
క్షోవంశాధీశ్వర!
వీక్షింపుము; నీ కుమారు విద్యాబలమున్."

టీక:- శిక్షింతిమి = చక్కగా బోధించితిమి; అన్యములు = శత్రువులవి; అగు = అయిన; పక్షంబులు = త్రోవలు; మాని = విడిచి; నీతి = నీతిశాస్త్రమును; పారగుడు = తుదిముట్టినవాడు; అయ్యెన్ = అయ్యెను; రక్షోవంశాధీశ్వర = హిరణ్యకశిపుడ {రక్షోవంశాధీశ్వరుడు - రక్షః (రాక్షస) వంశా (కులమునకు) అధీశ్వరుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు}; వీక్షింపుము = పరిశీలించుము; నీ = నీ యొక్క; కుమారు = పుత్రుని; విద్యా = చదువు లందలి; బలమున్ = శక్తిని.
భావము:- “ఓ రాక్షస రాజా! హిరణ్యకశిపా! నీ కుమారుడిని చక్కగా శిక్షించి చదివించాము. శత్రుపక్షముల పైనుండి మనసు మళ్ళించాం. నీ కుమారుడిని నీతికోవిదుణ్ణి చేశాం. అన్ని విద్యలలో గొప్ప పండితు డయ్యాడు. మీ కుమారుడి విద్యను పరీక్షించవచ్చు.”
అన్నారు చండామార్కులు

తెభా-7-162-వ.
అని పలికిన శుక్రకుమారకు వచనంబు లాకర్ణించి, దానవేంద్రుండు దనకు దండప్రణామంబు చేసి నిలుచున్న కొడుకును దీవించి, బాహుదండంబులు చాచి దిగ్గనన్ డగ్గఱం దిగిచి గాఢాలింగనంబు చేసి, తన తొడలమీఁద నిడుకొని, చుంచు దువ్వి, చిబుకంబుఁ బుడికి, చెక్కిలి ముద్దుగొని, శిరంబు మూర్కొని, ప్రేమాతిరేక సంజనిత బాష్ప సలిలబిందు సందోహంబుల నతని వదనారవిందంబుఁ దడుపుచు, మంద మధురాలాపంబుల నిట్లనియె.
టీక:- అని = అని; పలికిన = పలుకగా; శుక్రకుమారకు = శుక్రుని పుత్రుని, చండామార్కుల; వచనంబులు = మాటలు; ఆకర్ణించి = విని; దానవేంద్రుండు = హిరణ్యకశిపుడ; తన = తన; కున్ = కు; దండప్రణామంబు = సాష్టాంగనమస్కారములు {దండప్రణామము - కఱ్ఱవలె సాగి నమస్కరించుట, సాష్టాంగనమస్కారము}; చేసి = చేసి; నిలుచున్న = నిలబడినట్టి; కొడుకునున్ = పుత్రుని; దీవించి = దీవించి; బాహుదండంబులున్ = చేతులను; చాచి = చాపి; దిగ్గనన్ = శ్రీఘ్రమే; డగ్గఱన్ = దగ్గరకు; దిగిచి = తీసుకొని; గాఢ = బిగి; ఆలింగనంబు = కౌగలింత; చేసి = చేసి; తన = తన యొక్క; తొడలమీదన్ = ఒడిలో; ఇడుకొని = ఉంచుకొని; చుంచున్ = ముంగురులు; దువ్వి = దువ్వి; చిబుకంబున్ = గడ్డమును; పుడికి = పుణికిపుచ్చుకొని; చెక్కిలిన్ = చెంపను; ముద్దుగొని = ముద్దుపెట్టి; శిరంబున్ = తలను; మూర్కొని = వాసనచూసి; ప్రేమ = ప్రేమ యొక్క; అతిరేక = అతిశయముచే; సంజనిత = పుట్టిన; బాష్పసలిల = కన్నీటి; బిందు = బొట్ల; సందోహంబులన్ = ధారలచే; అతని = అతని; వదన = మోము యనెడి; అరవిందంబున్ = పద్మమును; తడుపుచున్ = తడుపుతూ; మంద = మెల్లని; మధుర = తీయని; ఆలాపంబులన్ = పలుకులతో; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా చెప్పిన శుక్రుని కుమారుని మాటలు హిరణ్యకశిపుడు విన్నాడు. ఆ రాక్షస రాజు దనకు వినయంగా తనకు నమస్కరిస్తున్న కొడుకుని చూసి చాలా ఆనందించాడు. తనయుడిని దీవించి చటుక్కున చేతులు చాచి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. అతనిని కౌగలించుకుని, ముద్దుచేస్తూ తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. ప్రేమతో ముంగురులు సవరించాడు. గడ్డం పుణికి పట్టుకుని, బుగ్గలు ముద్దాడాడు. తల మూర్కొని దగ్గరకు తీసుకున్నాడు. అమితమైన పుత్ర ప్రేమ వలన కన్నతండ్రి ఆనందభాష్పాలు కార్చాడు. వాటితో బాలకుడు ప్రహ్లాదుని మోము తడిసింది. అపుడు కొడుకుతో మెల్లగా, తియ్యగా ఇలా పలికాడు.

తెభా-7-163-శా.
"చోద్యం బయ్యెడి నింతకాల మరిగెన్ శోధించి యేమేమి సం
వేద్యాంశంబులు చెప్పిరో? గురువు లే వెంటం బఠింపించిరో?
విద్యాసార మెఱుంగఁ గోరెద భవ ద్విజ్ఞాత శాస్త్రంబులోఁ
ద్యం బొక్కటి చెప్పి సార్థముగఁ దాత్పర్యంబు భాషింపుమా.

టీక:- చోద్యము = ఆశ్చర్యము; అయ్యెడిన్ = అగుతున్నది; ఇంతకాలము = ఇన్నిదినములు; అరిగెన్ = గడచిపోయినవి; శోధించి = పరిశీలించి; ఏమేమి = ఎటువంటి; సంవేద్య = తెలిసికొనదగిన; అంశంబులు = సంగతులు; చెప్పిరో = నేర్పినారో; గురువులు = గురువులు; ఏ = ఏ; వెంటన్ = విధముగ; పఠింపించిరో = చదివించినారో; విద్యా = విద్యల యొక్క; సారమున్ = సారాంశమును; ఎఱుంగన్ = తెలిసికొన; కోరెదన్ = కోరుచున్నాను; భవత్ = నీకు; విజ్ఞాత = తెలుసుకొన్న; శాస్త్రంబు = చదువుల; లోన్ = లోని; పద్యంబున్ = పద్యమును; ఒక్కటి = ఒక దానిని; చెప్పి = చెప్పి; సార్థముగాన్ = అర్థముతో కూడ; తాత్పర్యంబున్ = తాత్పర్యమును; భాషింపుమా = చదువుము.
భావము:- “నాయనా! ఎంతకాలం అయిందో నువ్వు చదువులకు వెళ్ళి? వచ్చావు కదా. చాలా చిత్రంగా ఉంది. మీ గురువులు ఏమేం క్రొత్త క్రొత్త విషయాలు చెప్పారు? నిన్ను ఎలా చదివించారు? నువ్వు చదువుకున్న చదువుల సారం తెలుసుకోవాలని ఉంది. నువ్వు నేర్చుకున్న వాటిలో నీకు ఇష్టమైన ఏ శాస్త్రంలోది అయినా సరే ఒక పద్యం చెప్పి, దానికి అర్థం తాత్పర్యం వివరించు వింటాను.

తెభా-7-164-శా.
నిన్నున్ మెచ్చరు నీతిపాఠ మహిమన్ నీతోటి దైత్యార్భకుల్
న్నా రన్నియుఁ జెప్ప నేర్తురు గదా గ్రంథార్థముల్ దక్షులై
న్నా! యెన్నఁడు నీవు నీతివిదుఁ డౌ దంచున్ మహావాంఛతో
నున్నాడన్ ననుఁ గన్నతండ్రి భవదీయోత్కర్షముం జూపవే."

టీక:- నిన్నున్ = నిన్ను; మెచ్చరు = మెచ్చుకొనరు; నీతి = నీతిశాస్త్రమును; పాఠ = చదివిన; మహిమన్ = గొప్పదనమును; నీ = నీ; తోటి = సహపాఠకులైన; దైత్య = రాక్షస; అర్భకుల్ = బాలకులు; కన్నారు = నేర్చుకొన్నారు; అన్నియున్ = అన్నిటిని; చెప్పన్ = చెప్పుట; నేర్తురు = నేర్చుకొంటిరి; కదా = కదా; గ్రంథ = గ్రంథముల; అర్థముల్ = అర్థములను; దక్షులు = నేర్పరులు; ఐ = అయ్యి; అన్నా = నాయనా; ఎన్నడున్ = ఎప్పుడు; నీవు = నీవు; నీతి = నీతిశాస్త్రమున; కోవిదుడవు = విద్వాంసుడవు; ఔదు = అయ్యెదవు; అంచున్ = అనుచు; మహా = మిక్కిలి; వాంఛ = కోరిక; తోన్ = తో; ఉన్నాడను = ఉన్నాను; నను = నను; కన్నతండ్రి = కన్నతండ్రి; భవదీయ = నీ యొక్క; ఉత్కర్షమున్ = గొప్పదనమును; చూపవే = చూపించుము.
భావము:- కుమారా! నా కన్న తండ్రీ! నీ తోడి దైత్య విద్యార్థులు నీతిశాస్త్రం నీకంటే బాగా చదువుతున్నారట కదా! అందుచేత నిన్ను లెక్కచేయటం లేదట కదా! మరి నువ్వెప్పుడు గొప్ప నీతికోవిదుడవు అవుతావు? నేను ఎంతో కోరికతో ఎదురుచూస్తున్నాను. ఏదీ చదువులో నీ ప్రతిభాపాటవాలు నా కొకసారి చూపించు.”

తెభా-7-165-వ.
అనినం గన్నతండ్రికిఁ బ్రియనందనుం డయిన ప్రహ్లాదుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; కన్న = తనకు జన్మనిచ్చిన; తండ్రి = తండ్రి; కిన్ = కి; ప్రియ = ఇష్ట; నందనుండు = సుతుడు; అయిన = ఐన; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; అనియె = పలికెను.
భావము:- అలా అన్న తండ్రి హిరణ్యకశిపుడితో ప్రియ పుత్రుడైన ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.

తెభా-7-166-క.
"చదివించిరి నను గురువులు
దివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ
దివినవి గలవు పెక్కులు
దువులలో మర్మ మెల్లఁ దివితిఁ దండ్రీ!

టీక:- చదివించిరి = చదివించిరి; ననున్ = నన్ను; గురువులు = గురువులు; చదివితి = చదివితిని; ధర్మార్థముఖ్య = ధర్మార్థకామ; శాస్త్రంబులున్ = శాస్త్రములను; నేన్ = నేను; చదివినవి = చదివినట్టివి; కలవు = ఉన్నవి; పెక్కులు = అనేకమైనవి; చదువుల = చదువుల; లోన్ = అందలి; మర్మములు = రహస్యములు; ఎల్లన్ = అన్నిటిని; చదివితిన్ = చదివితిని; తండ్రీ = నాన్నగారూ.
భావము:- “నాన్నగారు! నన్ను గురువులు చక్కగా చదివించారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం మున్నగు ముఖ్య శాస్త్రములు అన్నీ చదివి, అన్ని చదువులలోని సారమూ, రహస్యమూ సంపూర్ణంగా గ్రహించాను.

తెభా-7-167-మ.
నుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
ను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్ త్యంబు దైత్యోత్తమా!

టీక:- తనుహృద్భాషల = మనోవాక్కాయముల; సఖ్యమున్ = చెలిమి; శ్రవణమున్ = వినుటలు; దాసత్వమున్ = సేవించుటలు; వందన = నమస్కరించుటలు; అర్చనముల్ = పూజించుటలు; సేవయున్ = పరిచర్యలుచేయుట; ఆత్మ = మనసు; లోన్ = అందు; ఎఱుకయున్ = తెలివిడి; సంకీర్తనల్ = కీర్తనలు పాడుట; చింతనంబున్ = ధ్యానము; అను = అనెడి; ఈ = ఈ; తొమ్మిది = తొమ్మిది(9) {నవవిధభక్తి - 1సఖ్యము 2శ్రవణము 3దాసత్వము 4వందనము 5అర్చనము 6సేవ 7ఆత్మలోననెరుక 8సంకీర్తనము 9చింతనము}; భక్తి = భక్తి యొక్క; మార్గములన్ = విధానములతో; సర్వాత్మున్ = నారాయణుని {సర్వాత్ముడు - సర్వస్వరూపి, విష్ణువు}; హరిన్ = నారాయణుని; నమ్మి = నమ్మి; సజ్జనుడు = సాధుస్వభావి; ఐ = అయ్యి; ఉండుట = ఉండుట; భద్రము = శ్రేయము; అంచున్ = అనుచు; తలతున్ = తలచెదను; సత్యంబు = నిజముగ; దైత్యోత్తమా = రాక్షసులలో ఉత్తముడా.
భావము:- రాక్షసరాజా! భక్తి మార్గాలు తొమ్మిది; అవి సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం; ఈ నవ విధ భక్తులు అనే తొమ్మిది భక్తి మార్గాలను మనోవాక్కాయకర్మల (మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ, త్రికరణశుద్ధిగా) సర్వాంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి ఉత్తముడుగా జీవించుట మానవులకు ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. ఇది కాక మరొక సత్యం నాకు కనబడుట లేదు.

తెభా-7-168-శా.
అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక స
ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ
బంధుత్వంబులు భస్మ హవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ స
ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్.

టీక:- అంధ = గుడ్డివాని పాలిటి; ఇందు = చంద్రుని; ఉదయముల్ = ఉదయించుటలు; మహా = మిక్కిలి; బధిర = చెవిటివాని చెంత; శంఖ = శంఖము యొక్క; ఆరావముల్ = శబ్దములు; మూక = మూగవానిచేత; సత్ = మంచి; గ్రంథ = గ్రంథములను; ఆఖ్యాపనముల్ = చెప్పించుటలు; నపుంసక = మగతనము లేని వాని; వధూకాంక్షల్ = మగువల పొందు కోరుటలు; కృతఘ్నా = మేలు మరచెడి; ఆవళీ = సమూహముతోటి; బంధుత్వంబులు = చుట్టరికములు; భస్మ = బూడిదలో పోసిన; హవ్యములు = హోమములు; లుబ్ధ = లోభి యొక్క; ద్రవ్యముల్ = సంపదలు; క్రోడ = పందికైన; సద్గంధంబుల్ = సువాసనలు; హరి = నారాయణుని; భక్తి = భక్తిని; వర్జితుల = వదలిన వారి; రిక్త = శూన్యములైన; వ్యర్థ = ప్రయోజన హీనములైన; సంసారముల్ = సంసారములు.
భావము:- లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం; చెవిటివాడికి శంఖ ధ్వని వినబడదు; మూగవాడికి గ్రంథపఠనం సాధ్యపడదు; నపుంసకుడికి కాంత మీద కోరిక ఫలించదు; కృతఘ్నులతో బంధుత్వం కుదరదు; బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగమైనవి; పిసినిగొట్టు వాడికి సంపద పనికి వచ్చేది కాదు; పందికి పన్నీరు వంటి సువాసనలు తెలియనే తెలియవు; అలాగే విష్ణు భక్తి లేని వారి జీవితాలు నిస్సారములైనవి, వ్యర్థములైనవి. అని భావిస్తాను.

తెభా-7-169-సీ.
మలాక్షు నర్చించు రములు కరములు-
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు-
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు-
ధువైరిఁ దవిలిన నము మనము;
గవంతు వలగొను దములు పదములు-
పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;

తెభా-7-169.1-తే.
దేవదేవుని చింతించు దినము దినము;
క్రహస్తునిఁ బ్రకటించు దువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.

టీక:- కమలాక్షున్ = నారాయణుని {కమలాక్షుడు - కమలముల వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; అర్చించు = పూజించెడి; కరములు = చేతులే; కరములు = చేతులు; శ్రీనాథున్ = నారాయణుని {శ్రీనాథుడు - శ్రీ (లక్ష్మీదేవికి) నాథుడు (భర్త), విష్ణువు}; వర్ణించు = స్తోత్రము చేసెడి; జిహ్వ = నాలుకే; జిహ్వ = నాలుక; సురరక్షకునిన్ = నారాయణుని {సురరక్షకుడు - సుర (దేవతలకు) రక్షకుడు, విష్ణువు}; చూచు = చూచెడి; చూడ్కులు = చూపులే; చూడ్కులు = చూపులు; శేషశాయి = నారాయణుని {శేషశాయి - శేష (ఆదిశేషుని)పై శాయి (శయనించువాడు), విష్ణువు}; కిన్ = కి; మ్రొక్కు = నమస్కరించెడి; శిరము = తలయే; శిరము = తల; విష్ణున్ = నారాయణుని {విష్ణువు - సర్వము నందు వ్యాపించువాడు, హరి}; ఆకర్ణించు = వినెడి; వీనులు = చెవులే; వీనులు = చెవులు; మధువైరిన్ = నారాయణుని {మధువైరి - మధు యనెడి రాక్షసుని వైరి (శత్రువు), విష్ణువు}; తవిలిన = లగ్నమైన; మనము = చిత్తమే; మనము = చిత్తము; భగవంతున్ = నారాయణుని; వలగొను = ప్రదక్షిణలు చేసెడి; పదములు = అడుగులే; పదములు = అడుగులు; పురుషోత్తముని = నారాయణుని {పురుషోత్తముడు - పురుషులందరిలోను ఉత్తముడు, విష్ణువు}; మీది = మీద గల; బుద్ధి = తలపే; బుద్ధి = తలపు.
దేవదేవుని = నారాయణుని {దేవదేవుడు - దేవుళ్ళకే దేవుడు, విష్ణువు}; చింతించు = ధ్యానించు; దినము = రోజే; దినము = రోజు; చక్రహస్తుని = నారాయణుని {చక్రహస్తుడు - చక్రాయుధము హస్తుడు (చేతిలో గలవాడు), విష్ణువు}; చదువు = చదువే; చదువు = చదువు; కుంభినీధవున్ = నారాయణుని {కుంభునీధనువు - కుంభినీ (భూదేవి కి) (వరాహాతారమున) ధవుడు (భర్త), విష్ణువు}; చెప్పెడి = చెప్పెడి; గురుడు = గురువే; గురుడు = గురువు; తండ్రి = తండ్రి; హరిన్ = నారాయణుని; చేరుము = చేరుము; అనియెడి = అనెడి; తండ్రి = తండ్రియే; తండ్రి = తండ్రి.
భావము:- నాన్న గారు! కమలాల వంటి కన్నులు కల ఆ విష్ణుమూర్తిని పూజిస్తేనే అవి చేతులు; లేకపోతే చేతులు, చేతులు కావు; శ్రీపతి అయిన విష్ణుదేవుని స్తోత్రము చేస్తేనే నాలుక అనుటకు అర్హమైనది; కాకపోతే ఆ నాలుకకు సార్థకత లేదు; దేవతలను కాపాడే ఆ హరిని చూసేవి మాత్రమే చూపులు; ఇతరమైన చూపులకు విలువ లేదు; ఆదిశేషుని పానుపుగా కల ఆ నారాయణునకు మ్రొక్కేది మాత్రమే శిరస్సు; మిగిలిన శిరస్సులకు విలువ లేదు; విష్ణు కథలు వినే చెవులే చెవులు; మధు అనే రాక్షసుని చంపిన హరి యందు లగ్నమైతేనే చిత్త మనవలెను; పరమ భగవంతుడైన ఆయనకు ప్రదక్షిణము చేసేవి మాత్రమే పాదాలు; మిగతావి పాదాలా? కాదు. పురుషోత్తము డైన ఆయనను భావించే బుద్ధే బుద్ధి; లేకపోతే అది సద్భుద్ధి కాదు; ఆ దేవుళ్లకే దేవుడైన విష్ణుమూర్తిని తలచు దినమే సుదినము; చక్రాయుధం ధరించు ఆ నారాయణుని గాథలు విశదపరుచు చదువు మాత్రమే సరైన చదువు; భూదేవి భర్త అయిన గోవిందుని గురించి బోధించే వాడే గురువు; విష్ణుమూర్తిని సేవించ మని చెప్పే తండ్రే తండ్రి కాని ఇతరులు తండ్రులా? కాదు; నాన్నగారు! దేహి శరీరంలోని చేతులు, నాలుక, కళ్ళు, శిరస్సు, చెవులు, చిత్తం, పాదాలు, బుద్ధి ఒకటేమిటి? సమస్తమైన అవయవాలు విష్ణు భక్తిలో పరవశమై పవిత్రం కావలసిందే. లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతఘ్నుడే. ప్రతి రోజూ, ప్రతి చదువూ శ్రీ హరి స్మరణలతో పునీతం కావలసిందే. ప్రతి గురువూ, ప్రతి తండ్రీ నారాయణ భక్తిని బోధించాల్సిందే. అవును లోకైకరక్షాకరు డైన విష్ణుమూర్తికి అంకితం గాని దేనికి సార్థకత లేదు.

తెభా-7-170-సీ.
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే?-
వన గుంఫిత చర్మస్త్రి గాక;
వైకుంఠుఁ బొగడని క్త్రంబు వక్త్రమే?-
మఢమ ధ్వనితోడి క్క గాక;
రిపూజనము లేని స్తంబు హస్తమే?-
రుశాఖ నిర్మిత ర్వి గాక?
మలేశుఁ జూడని న్నులు కన్నులే?-
నుకుడ్యజాల రంధ్రములు గాక;

తెభా-7-170.1-ఆ.
క్రిచింత లేని న్మంబు జన్మమే?
రళ సలిల బుద్బుదంబు గాక;
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే?
పాదయుగముతోడి శువు గాక.

టీక:- కంజాక్షున్ = నారాయణుని {కంజాక్షుడు - కంజము (కమలము)ల బోలు అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; కున్ = కి; కాని = ఉపయోగించని; కాయంబు = దేహము; కాయమే = దేహమా ఏమి; పవన = గాలిచే; గుంఫిత = కూర్చ బడి నట్టి; చర్మభస్త్రి = తోలుతిత్తి; కాక = కాకుండగ; వైకుంఠున్ = నారాయణుని {వైకుంఠుడు - వైకుంఠమున నుండు వాడు, విష్ణువు}; పొగడని = కీర్తించని; వక్త్రంబున్ = నోరు; వక్త్రమే = నోరా ఏమి; ఢమఢమ = ఢమఢమ యనెడి; ధ్వని = శబ్దముల; తోడి = తోకూడిన; ఢక్క = ఢంకా; కాక = కాకుండగ; హరి = నారాయణుని; పూజనమున్ = పూజలను చేయుట; లేని = లేని; హస్తంబు = చేయి; హస్తమే = చేయేనా ఏమి; తరు = చెట్టు; శాఖ = కొమ్మచే; నిర్మిత = చేయబడిన; దర్వి = తెడ్డు, గరిటె; కాక = కాకుండగ; కమలేశున్ = నారాయణుని {కమలేశుడు - కమల (లక్ష్మీదేవి) యొక్క ఈశుడు (భర్త), విష్ణువు}; చూడని = చూడనట్టి; కన్నులు = కళ్లు; కన్నులే = కళ్లేనా ఏమి; తను = దేహము యనెడి; కుడ్య = గోడ యందలి; జాలరంధ్రములు = కిటికీలు; కాక = కాకుండగ.
చక్రి = నారాయణుని {చక్రి - చక్రాయుధము గలవాడు, విష్ణువు}; చింత = తలపు, ధ్యానము; లేని = లేనట్టి; జన్మంబు = పుట్టుకకూడ; జన్మమే = పుట్టుక యేనా ఏమి; తరళ = కదలుచున్న; సలిల = నీటి; బుద్భుదంబు = బుడగ; కాక = కాకుండగ; విష్ణుభక్తి = విష్ణుభక్తి; లేని = లేనట్టి; విబుధుండు = విద్వాంసుడు; విబుధుండే = విద్వాంసుడా ఏమి; పాద = కాళ్ళు; యుగము = రెంటి; తోడి = తోటి; పశువు = పశువు; కాక = కాకుండగ.
భావము:- పద్మాలవంటి కన్నులు కలిగిన విష్ణుమూర్తికి పనికి రాని శరీరం కూడా ఒక శరీరమేనా? కాదు. అది గాలితో నిండిన, కొలిమిలో గాలి కొట్టుటకు ఉపయోగపడు, ఒక తోలు తిత్తి మాత్రమే. వైకుంఠవాసు డైన ఆ హరి నామం కీర్తించని అది నోరా? కాదు కాదు ఢమ ఢమ అని మ్రోగు వాద్యం. హరిని పూజించని అది చేయి అవుతుందా? కాదు అది ఒక కొయ్య తెడ్డు (చెక్క గరిటె). శ్రీపతిని చూడని కన్నులు కన్నులా? అవి ఈ శరీరం అనే గోడకి ఉన్న కిటికీలు మాత్రమే. చక్రాయుధుడు విష్ణుమూర్తిని ధ్యానించని ఆ జన్మ కూడా ఒక జన్మమేనా? అది క్షణికమైన నీటి బుడగ. వైష్ణవ భక్తి లేని పండితుడు రెండు కాళ్ళ జంతువు తప్ప వాడు పండితుడు కానేకాదు.
(ఈ పద్య రత్నాలు అమూలకం పోతన స్వకీయం. “మూల వ్యాస భాగవతంలో లేనివి కనుక అమూలకం; పోతన స్వంత కృతి కనుక స్వకీయం; అంతేకాదు, పరమ భాగవతులు ప్రహ్లాదుని మానసిక స్థితితో పాటు, సహజ కవి మనోభావాలను కలగలిసినవి కనుక స్వకీయం కూడా” అని నా భావన. తన మనోభావాన్ని, తను నమ్మిన భక్తి సిద్ధాంతాన్ని, ఇక్కడ “అంధేదూదయముల్”, “కమలాక్షు నర్చించు”, “కంజాక్షునకు గాని”, “సంసార జీమూత” అనే నాలుగు పద్యాలలో వరసగా ప్రహ్లాదుని నోట పలికించా రనుకుంటాను.)

తెభా-7-171-సీ.
సంసారజీమూత సంఘంబు విచ్చునే?-
క్రిదాస్యప్రభంనము లేక;
తాపత్రయాభీల దావాగ్ను లాఱునే?-
విష్ణుసేవామృతవృష్టి లేక;
ర్వంకషాఘౌఘ లరాసు లింకునే?-
రిమనీషా బడబాగ్ని లేక;
నవిప ద్గాఢాంధకారంబు లడగునే?-
ద్మాక్షునుతి రవిప్రభలు లేక;

తెభా-7-171.1-తే.
నిరుపమాపునరావృత్తి నిష్కళంక
ముక్తినిధిఁ గానవచ్చునే? ముఖ్యమైన
శార్ఙ్గకోదండచింతనాంనము లేక
తామరసగర్భునకు నైన దానవేంద్ర!"

టీక:- సంసార = సంసారము యనెడి; జీమూత = మబ్బుల; సంఘంబు = సమూహము; విచ్చునే = విడిపోవునా ఏమి; చక్రి = నారాయణుని; దాస్య = కైంకర్యము యనెడి; ప్రభంజనము = పెనుగాలి; లేక = లేకుండగ; తాపత్రయ = తాపత్రయములు యనెడి {తాపత్రయము - 1ఆధ్యాత్మికము 2ఆదిభౌతికము 3అధిదైవికము అనెడి బాధలు}; ఆభీల = భయంకరమైన; దావాగ్నులు = కారుచిచ్చులు; ఆఱునే = ఆరిపోవునా ఏమి; విష్ణు = నారాయణుని; సేవా = సేవ యనెడి; అమృత = అమృతపు; వృష్టి = వర్షము; లేక = లేకుండగ; సర్వంకష = మిక్కిలి శక్తివంతమైనట్టి; అఘ = పాపముల; ఓఘ = సమూహయము లనెడి; జలరాసులు = సముద్రములు; ఇంకునే = ఇంకిపోవునా ఏమి; హరి = నారాయణుని; మనీషా = ప్రజ్ఞ యనెడి; బడబాగ్ని = బడబాగ్ని; లేక = లేకుండగ; ఘన = గొప్ప; విపత్ = ఆపద లనెడి; గాఢ = చిమ్మ; అంధకారంబుల్ = చీకటులు; అడగునే = నశించునా ఏమి; పద్మాక్షున్ = నారాయణుని {పద్మాక్షుడు - పద్మములను పోలెడి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; నుతి = స్తోత్రము యనెడి; రవి = సూర్యుని; ప్రభలు = కాంతులు; లేక = లేకుండగ.
నిరుపమ = సాటిలేని; అపునరావృత్తిన్ = తిరిగిరాని విధమైన; నిష్కళంక = నిర్మలమైన; ముక్తినిధిన్ = మోక్షపదవిని; కానన్ = చూచుటకు; వచ్చునే = అలవియా ఏమి; ముఖ్యము = ముఖ్యము; ఐన = అయిన; సార్ఙ్గకోదండ = నారాయణుని {సార్ఙ్గకోదండడు - సార్ఙ్గ్యము యనెడి ఖడ్గము కోదండము యనెడి విల్లు మొదలగు ఆయుధములు గలవాడు, విష్ణువు}; చింతన = ధ్యానము యనెడి; అంజనము = కాటుక; లేక = లేకుండగ; తామరసగర్భున = బ్రహ్మదేవుని {తామరసగర్భుడు - పద్మము నందు పుట్టినవాడు, బ్రహ్మ}; కున్ = కు; ఐనన్ = అయినను; దానవేంద్ర = రాక్షసరాజా.
భావము:- రాక్షసేశ్వరా! పెద్ద గాలి ప్రభంజనంలా విసరక పోతే, గుంపులు కట్టిన కారు మబ్బులు విడిపోవు కదా. అలాగే చక్రధారి అయిన విష్ణుమూర్తి సేవ లేకుండా సంసార బంధాలు తొలగిపోవు. శ్రీహరి కైంకర్యం అనే అమృతపు వాన జల్లు కురవక పోతే, సంసారాటవిలో చెలరేగే తాపత్రయాలు అనే భయంకరమైన దావాగ్ని చల్లారదు. బడబాగ్ని ప్రజ్వల్లితే సముద్రాలు కూడా ఇంకిపోతాయి. అలాగే శ్రీపతి చింతన ఉత్తేజమైతే ఎంత శక్తిమంతమైన పాపాలైనా పటాపంచలైపోతాయి. సూర్యుని కిరణాలు తాకితే ఎంతటి చీకటి తెరలైనా విడిపోతాయి. అలాగే కేశవ కీర్తనతో ఎంతటి విపత్తులు చుట్టుముట్టినా విరిగిపోతాయి. మహా నిధులు గుప్తంగా ఉంటాయి. విష్ణుధ్యానము అనే అంజనం ఉంటే వాటిని కనుగొనగలం. (శార్ఙ్గం అనే ఖడ్గం కోదండం అనే విల్లు ధరిస్తాడు విష్ణువు.) విష్ణుభక్తి అనే అంజనం ఉంటే కాని నిర్మలమైన, నిరుపమానమైన, పునర్జన్మ లేని ముక్తి అనే పెన్నిధి అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. నాన్నగారూ! ఆఖరుకి ఆ బహ్మదేవుడికి అయినా సరే ఇది తప్ప మార్గాంతరం లేదు.2

తెభా-7-172-వ.
అని యివ్విధంబున వెఱపు మఱపు నెఱుంగక యులుకుచెడి పలికెడు కొడుకు నుడువులు చెవులకు ములుకుల క్రియ నొదవినఁ గటము లదరఁ బెదవులం గఱచుచు నదిరిపడి గురుసుతునిం గనుంగొని "విమత కథనంబులు గఱపినాఁడ"వని దానవేంద్రుం డిట్లనియె.
టీక:- అని = అని; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; వెఱపు = భయము; మఱపు = మరచిపోవుటలు; ఎఱుంగక = తెలియక; ఉలుకుచెడి = లెక్కజేయక; పలికెడు = మాట్లాడెడి; కొడుకు = పుత్రుని; నుడువులు = మాటలు; చెవుల్ = చెవుల; కున్ = కు; ములుకుల = ముళ్లు; క్రియన్ = వంటివి; ఒదవినన్ = కాగా; కటములు = కణతలు; అదరన్ = అదురుతుండగ; పెదవులన్ = పెదవులను; కఱచుచున్ = కొరుకుచు; అదిరిపడి = ఉలికిపడి; గురుసుతునిన్ = శుక్రుని పుత్రుని; కనుంగొని = చూసి; విమత = పగవారి; కథనంబులున్ = కథలను; కఱపినాడవు = నేర్చినావు; అని = అని; దానవేంద్రుండు = హిరణ్యకశిపుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా విష్ణుభక్తి ఒకటే తరుణోపాయం అంటూ ప్రహ్లాదుడు నదురు బెదురు లేకుండా చెప్తున్న పలుకులు తండ్రి హిరణ్యకశిపుడికి వాడి ములుగులు లాగ నాటుకున్నాయి. అతను కోపంతో ఉలిక్కిపడ్డాడు. కణతలు అదిరాయి. పళ్ళతో పెదవులు కొరుకుతూ, ప్రహ్లాదుడికి చదువు చెప్తున్న శుక్రాచార్యుని కొడుకుతో “శత్రు పక్షం విషయాలు నేర్పావన్న మాట” అని ఇంకా ఇలా హుంకరించాడు.

తెభా-7-173-చ.
"టుతర నీతిశాస్త్రచయ పారగుఁ జేసెద నంచు బాలు నీ
టు గొనిపోయి వానికి నర్హము లైన విరోధిశాస్త్రముల్
కుటిలతఁ జెప్పినాఁడవు భృగుప్రవరుండ వటంచు నమ్మితిన్
కట! బ్రాహ్మణాకృతివి గాక యథార్థపు బ్రాహ్మణుండవే?

టీక:- పటుతర = మిక్కిలి దృఢమైన {పటు - పటుతరము - పటుతమము}; నీతి = నీతి; శాస్త్ర = శాస్త్రముల; చయ = సమూహము నందు; పారగున్ = నేర్పరునిగా, చివరదాక చదివిన వానినిగా; చేసెదన్ = చేసెదను; అంచున్ = అనుచు; బాలున్ = పిల్లవానిని; నీవు = నీవు; అటు = అలా; కొనిపోయి = తీసుకు వెళ్ళి; వాని = వాని; కిన్ = కి; అనర్హములు = తగనట్టివి; ఐన = అయిన; విరోధి = పగవాని; శాస్త్రముల్ = చదువులు; కుటిలతన్ = కపటత్వముతో; చెప్పినాడవు = చెప్పితివి; భృగు = భృగువు వంశపు; ప్రవరుండవు = శ్రేష్ఠుడవు; అటంచున్ = అనుచు; నమ్మితిని = నమ్మితిని; కటకట = అయ్యో; బ్రాహ్మణ = బ్రాహ్మణుని; ఆకృతివి = రూపు ధరించిన వాడవు; కాక = అంతేకాని; యథార్థపు = నిజమైన; బ్రాహ్మణుండవే = బ్రాహ్మణుడవేనా.
భావము:- “నా కొడుకుని తీసుకు వెళ్లి నీతి పాఠాలు బాగా నేర్పుతాను అన్నావు. ద్రోహబుద్ధితో అతనికి శత్రువు విష్ణుమూర్తి కథలు నూరిపోశావా. అయ్యయ్యో! పవిత్రమైన భృగువంశంలో పుట్టిన గొప్ప వాడివి అని నమ్మి నా కొడుకును నీకు అప్పజెప్పాను కదయ్యా. బ్రాహ్మణ ఆకారంలో ఉన్నావు కాని నువ్వు నిజమైన బ్రాహ్మణుడవు కాదు. నిజమైన బ్రాహ్మణుడవు అయితే సరైన చదువు చెప్తానని ఇలా మోసం చేస్తావా?

తెభా-7-174-క.
ర్మేతరవర్తనులును
దుర్మంత్రులు నైన జనుల దురితము లొందున్
ర్మములు గలఁచి కల్మష
ర్ముల రోగములు పొందు కైవడి విప్రా!"

టీక:- ధర్మ = ధర్మమార్గమునకు; ఇతర = అన్యమైన; వర్తనులును = నడత కలవారు; దుర్మంత్రులును = చెడు తలపులు గలవారును; ఐన = అయిన; జనులన్ = ప్రజలను; దురితములు = పాపములు; ఒందున్ = పొందును; మర్మములు = ఆయువు పట్టులను; కలచి = పీడించి; కల్మష = చెడు; కర్ములన్ = పనులు చేయు వానిని; రోగములు = రోగములు; పొందు = పొందెడి; కైవడిన్ = వలె; విప్రా = బ్రాహ్మణుడా.
భావము:- ఓయీ బ్రాహ్మణుడా! చెడు నడతలు తిరిగే వారిని రోగాలు పట్టి పీడిస్తాయి. అలాగే ధర్మ మార్గం తప్పిన వాళ్ళకూ, కుటిలమైన ఆలోచనలు చేసే వాళ్ళకూ పాపాలు చుట్టుకుంటాయి. ఆ పాపాలు వాళ్లను నానా బాధలు పెడతాయి తెలుసా!”

తెభా-7-175-వ.
అనిన రాజునకుఁ బురోహితుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; రాజున్ = రాజున; కున్ = కు; పురోహితుండు = గురువు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా మండిపడుతున్న హిరణ్యకశిప మహారాజుతో ప్రహ్లాదుని గురువు అయిన ఆ పురోహితుడు వినయంగా ఇలా చెప్పాడు.

తెభా-7-176-ఉ.
"ప్పులు లేవు మావలన దానవనాథ! విరోధిశాస్త్రముల్
చెప్పము క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులాన సు
మ్మెప్పుడు మీ కుమారునకు నింతయు నైజమనీష యెవ్వరుం
జెప్పెడిపాటి గాదు ప్రతిచింతఁ దలంపుము నేర్పుకైవడిన్.

టీక:- తప్పులు = తప్పులు; లేవు = చేయబడలేదు; మా = మా; వలన = చేత; దానవనాథ = రాక్షసరాజా; విరోధి = శత్రువుల; శాస్త్రముల్ = చదువులు; చెప్పము = చెప్పలేదు; క్రూరులు = క్రూరమైనవారు; ఐ = అయ్యి; పరులు = ఇతరులు ఎవరును; చెప్పరు = చెప్పలేదు; మీ = మీ యొక్క; చరణంబులు = పాదముల; ఆన = మీద ఒట్టు; సుమ్ము = సుమా; ఎప్పుడున్ = ఎప్పుడును; మీ = మీ; కుమారున్ = పుత్రుని; కున్ = కి; నైజ = సహజసిద్ధమైన; మనీష = ప్రజ్ఞ, బుద్ధి; ఎవ్వరున్ = ఎవరు కూడ; చెప్పెడిపాటి = చెప్పగలంతవారు; కాదు = కాదు; ప్రతి = విరుగుడు; చింతన్ = ఆలోచన; తలంపుము = విచారింపుము; నేర్పు = మంచి నేర్పైన; కై = కోసము; వడిన్ = శ్రీఘ్రమే.
భావము:- “ఓ రాక్షసరాజా! మా వల్ల ఏ తప్పు జరగలేదు. నీకు వ్యతిరేకంగా మేము ఎప్పుడూ ప్రవర్తించము. నీ పుత్రుడికి మేము విరోధి కథలు చెప్పము, చెప్పలేదు. మరి ఎవరూ అంత సాహసం చేసి చెప్పలేదు. నీ పాదాల మీద ఒట్టు. మీ వాడికి సహజంగా అబ్బిన బుద్ధే తప్ప ఒకరు చెప్తే వచ్చింది కాదు. కాబట్టి ప్రస్తుతం దీనికి ప్రతిక్రియ జాగ్రత్తగా శీఘ్రమే ఆలోచించు.

తెభా-7-177-క.
మిత్రులము పురోహితులము
పాత్రుల మే మదియుఁ గాక భార్గవులము నీ
పుత్రుని నిటువలెఁ జేయఁగ
త్రులమే? దైత్యజలధిచంద్రమ! వింటే."

టీక:- మిత్రులము = స్నేహితులము; పురోహితులము = ఆచార్యులము; పాత్రులము = తగినవారము; అదియుగాక = అంతేకాకుండగ; భార్గవులము = భృగువు వంశపు వారము; నీ = నీ యొక్క; పుత్రుని = కుమారుని; ఇటు = ఈ; వలెన్ = విధముగ; చేయగన్ = చేయుటకు; శత్రువులమే = విరోధులమా ఏమి; దైత్యజలనిధిచంద్రమ = హిరణ్యకశిపుడ {దైత్యజలనిధిచంద్రమ - దైత్య (రాక్షస) కుల మనెడి జలనిధి (సముద్రమునకు) చంద్రమ (చంద్రుని వంటివాడు), హిరణ్యకశిపుడు}; వింటే = వింటివా.
భావము:- ఓ రాక్షసరాజా! నువ్వు రాక్షస కులం అనే సముద్రానికి చంద్రుని వంటి వాడవు. వినవయ్యా! మేము నీకు ముందు నుండి స్నేహితులము, పురోహితులము, మంచి యోగ్యులము. అంతే కాదు భృగువంశంలో పుట్టినవాళ్ళం. మేము నీకు మేలు కోరే వాళ్ళము తప్ప, నీ కుమారుడికి ఇలా బోధించడానికి మేము శత్రువులము కాదయ్యా!”

తెభా-7-178-వ.
అనిన గురునందనుం గోపింపక దైత్యవల్లభుండు గొడుకు నవలోకించి యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; గురునందనున్ = ఆచార్యుని పుత్రులను; కోపింపకన్ = కోప్పడక; దైత్యవల్లభుండు = హిరణ్యకశిపుడు {దైత్యవల్లభుడు - దైత్యులకు వల్లభుడు (భర్త), హిరణ్యకశిపుడు}; కొడుకున్ = పుత్రుని; అవలోకించి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా శుక్రాచార్యుని పుత్రులు చండామార్కులు అనేటప్పటికి, ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు వారిపై కోపం విడిచి పెట్టాడు. తన కొడుకుతో ఇలా అన్నాడు.

తెభా-7-179-క.
"ఒజ్జలు చెప్పని యీ మతి
జ్జాతుఁడ వైన నీకు ఱి యెవ్వరిచే
నుజ్జాత మయ్యె బాలక!
జ్జనులం బేరుకొనుము గ నా మ్రోలన్."

టీక:- ఒజ్జలు = గురువులు; చెప్పని = చెప్పనట్టి; ఈ = ఇట్టి; మతి = బుద్ధి; మత్ = నాకు; జాతుడవు = పుట్టినవాడవు; ఐన = అయిన; నీ = నీ; కున్ = కు; మఱి = ఇంక; ఎవ్వరి = ఎవరి; చేన్ = వలన; ఉజ్జాతము = పుట్టుట; అయ్యెన్ = జరిగెను; బాలక = పిల్లవాడ; తత్ = అట్టి; జనులన్ = వారిని; పేరుకొనుము = చెప్పుము; తగన్ = సరిగా; నా = నా; మ్రోలన్ = ఎదుట.
భావము:- “ప్రహ్లాదా! నువ్వేమో చిన్న పిల్లాడివి. ఈ విషయాలు మీ ఉపాధ్యాయులు చెప్ప లేదు. మరి నా కడుపున పుట్టిన నీకు ఇలాంటి బుద్ధులు ఎలా వచ్చాయి? నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? వాళ్లెవరో నాకు చెప్పు.”

తెభా-7-180-వ.
అనినఁ దండ్రికిఁ బ్రహ్లాదుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; తండ్రి = తండ్రి; కిన్ = కి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా అడుగుతున్న తండ్రితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.

తెభా-7-181-ఉ.
"చ్చపుఁ జీకటింబడి గృవ్రతులై విషయప్రవిష్టులై
చ్చుచుఁ బుట్టుచున్ మరలఁ ర్వితచర్వణు లైన వారికిం
జెచ్చరఁ బుట్టునే పరులు చెప్పిన నైన నిజేచ్ఛ నైన నే
మిచ్చిన నైనఁ గానలకు నేఁగిన నైన హరిప్రబోధముల్.

టీక:- అచ్చపుజీకటిన్ = గాఢాంధకారము నందు; పడి = పడిపోయి; గృహవ్రతులు = గృహస్థులు; ఐన = అయినట్టి; విషయ = ఇంద్రియార్థములలో; ప్రవిష్టులు = లోలురు; ఐ = అయ్యి; చచ్చుచున్ = చనిపోతూ; పుట్టుచున్ = పుడుతూ; మరల = మరల; చర్వితచర్వణులు = తిరిగిచేయువారు {చర్వితచర్వణము - తిన్నదే మరల తినుట}; ఐన = అయిన; వారి = వారి; కిన్ = కి; చెచ్చెఱన్ = శ్రీఘ్రమే; పుట్టునే = కలుగునా ఏమి, కలుగదు; పరులు = ఇతరులు; చెప్పినన్ = చెప్పిన; ఐనన్ = ఐనప్పటికి; నిజేచ్ఛన్ = తనంతట తను; ఐనన్ = అయినను; ఏమి = ఏది; ఇచ్చినన్ = ఇచ్చిన; ఐనన్ = అయినను; కానల = అడవుల; కున్ = కి; ఏగినన్ = వెళ్ళిన; ఐనన్ = అప్పటికిని; హరి = నారాయణుని; ప్రభోదముల్ = జ్ఞానములు.
భావము:- “అజ్ఞానం అనేది అసలైన కారు చీకటి, దాని మాయకు చిక్కి సంసారులు అనేకులు, కోరికల వలలో పడి సంసారం సాగిస్తూ ఉంటారు. చస్తూ, పుడుతూ, మరల చస్తూ, పుడుతూ ఇలా ఈ సంసారచక్రంలో తిరుగుతూనే ఉంటారు. అలాంటి వారికి విష్ణుభక్తి అంత సులువుగా పుట్టదు. ఇంకొకరు బోధించినా కలగదు; ఏమి ఆశ చూపించినా, ఎంతటి దానాలు చేసినా అంటదు; ఆఖరుకి అడవులలోకి పోయినా ఫలితం ఉండదు; అంత తొందరగా శ్రీహరి మీదికి మనసు పోతుందా? చెప్పు. హరిభక్తి లభించాలి అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలాలు ఫలించాలి.

తెభా-7-182-ఉ.
కానివాని నూఁతగొని కాననివాఁడు విశిష్టవస్తువుల్
గాని భంగిఁ గర్మములు గైకొని కొందఱు కర్మబద్ధులై
కారు విష్ణుఁ, గొంద ఱటఁ గందుఁ రకించన వైష్ణవాంఘ్రిసం
స్థా రజోభిషిక్తు లగు సంహృతకర్ములు దానవేశ్వరా!

టీక:- కానని = చూడలేని; వానిన్ = వానిని; ఊతన్ = ఊతముగ; కొని = తీసుకొని; కానని = గుడ్డి; వాడు = వాడు; విశిష్ట = శ్రేష్ఠమైన; వస్తువుల్ = వస్తువులను; కానని = చూడలేని; భంగిన్ = వలె; కర్మములున్ = కర్మలను; కైకొని = చేపట్టి; కొందఱు = కొంతమంది; కర్మ = కర్మలకు; బద్ధులు = లోబడినవారు; ఐ = అయ్యి; కానరు = చూడజాలరు; విష్ణున్ = నారాయణుని; కొందఱు = కొంతమంది; అటన్ = అక్కడ; కందురు = పొందెదరు; అకించన = కేవలమైన; వైష్ణవ = విష్ణుభక్తుల; అంఘ్రి = పాదము లందు; సంస్థాన = ఉండెడి; రజః = ధూళిచేత; అభిషిక్తులు = అభిషేకింపబడినవారు; అగు = అయిన; సంహృత = విడిచిపెట్టిన; కర్ములు = కర్మములు గలవారు; దానవేశ్వరా = హిరణ్యకశిపుడ.
భావము:- తండ్రీ! రాక్షసేశ్వరా! గుడ్డివాడు మరొక గుడ్డివాడి సాయం తీసుకొని ఏ వస్తువును విశేషంగా తెలుసుకోలేడు కదా! అదే విధంగా విషయాసక్తులై కర్మబంధాలలో చిక్కుకున్నవారు శ్రీహరిని చూడలేరు. కొందరు పుణ్యాత్ములు మాత్రం గొప్ప విష్ణుభక్తుల పాద ధూళి తమ తలమీద ధరించి కర్మలను త్యజించి పూత చిత్తులు అవుతారు; అంతట వారు వైకుంఠవాసుని వీక్షించగలుగుతారు.

తెభా-7-183-శా.
శోధింపంబడె సర్వశాస్త్రములు రక్షోనాథ! వే యేటికిన్
గాథల్ మాధవశేముషీతరణి సాంత్యంబునం గాక దు
ర్మేధన్ దాఁటఁగ వచ్చునే సుతవధూమీనోగ్ర వాంఛా మద
క్రోధోల్లోల విశాల సంసృతి మహా ఘోరామితాంభోనిధిన్."

టీక:- శోధింపంబడె = పరిశోధింపబడినవి; సర్వ = సమస్తమైన; శాస్త్రములున్ = చదువులును; రక్షోనాథ = రాక్షసరాజా; వేయి = అనేక మాటలు; ఏటికిన్ = ఎందులకు; గాథల్ = కథలు; మాధవ = నారాయణుని; శేముషి = చింత యనెడి; తరణి = నావ; సాంగత్యంబునన్ = సంబంధమువలన; కాక = కాకుండగ; దుర్మేధన్ = దుష్టబుద్ధితో; దాటగన్ = తరించుటకు; వచ్చునే = అలవి యగునా యేమి; సుత = పిల్లలు; వధూ = పెండ్లాము యనెడి; మీన = జలజంతువులు; ఉగ్ర = తీవ్రమైన; వాంఛ = కోరికలు; మద = గర్వము; క్రోధ = కోపము యనెడి; ఉల్లోల = పెద్ద తరంగములు గల; విశాల = విస్తారమైన ; సంసృతి = సంసారము యనెడి; మహా = గొప్ప; ఘోర = ఘోరమైన; అమిత = కడలేని; అంభోనిధిన్ = సముద్రమును;
భావము:- ఓ తండ్రీ! దానవేంద్రా! శాస్త్రాలు, కథలూ, గాథలూ అన్ని చదివి మధించాను. ఈ సంసారం ఒక భయంకరమైన మహా సముద్రం వంటిది; ఈ సంసార సాగరంలో భార్యా పుత్రులు తిమింగలాలు; కామం, క్రోధం మొదలైనవి ఉగ్రమైన కెరటాలు. ఇలాంటి ఘోరమైన సముద్రాన్ని దాటాలంటే అతి తెలివి, అనవసరమైన వాదప్రతివాదాలు తోటి సాధ్యం కాదు; ఈ చదువు సంధ్యలు ఏవీ, ఎందుకూ పనికి రావు; ఒక్క హరిభక్తి అనే నౌక మాత్రమే తరింపజేయగలదు.”

తెభా-7-184-వ.
అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువచేయక రక్కసుల ఱేఁడు దన తొడలపై నుండనీక గొబ్బున దిగద్రొబ్బి నిబ్బరంబగు కోపంబు దీపింప వేఁడిచూపుల మింట మంట లెగయ మంత్రులం జూచి యిట్లనియె.
టీక:- అని = అని; పలికిన = అనుచున్న; కొడుకును = పుత్రుని; ధిక్కరించి = తిరస్కరించి; మక్కువ = గారాబము; చేయక = చేయకుండగ; రక్కసులఱేడు = రాక్షసరాజు; తన = తన యొక్క; తొడల = తొడల; పైన్ = మీద; ఉండనీక = ఉండనీయక; గొబ్బునన్ = వేగముగా; దిగన్ = దిగిపోవునట్లు; ద్రొబ్బి = పడదోసి; నిబ్బరంబు = మిక్కుటము; అగు = అయిన; కోపంబు = కోపము; దీపింపన్ = జ్వలించుచుండగ; వేడి = వేడి; చూపులన్ = చూపు లమ్మట; మింటన్ = ఆకాశమున; మంటలు = మంటలు; ఎగయన్ = చెలరేగ; మంత్రులన్ = మంత్రులను; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పలుకుతున్న పుత్రుడిని ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు గదిమాడు. ఒక్కసారిగా పుత్ర ప్రేమ పోయింది. ఒళ్ళో కూర్చోబెట్టుకున్న కన్న కొడుకును ఒక్క తోపు తోసేశాడు. తీవ్రమైన కోపంతో కళ్ళల్లోంచి నిప్పులు రాలుతుండగా, మంత్రులతో ఇలా అన్నాడు.

తెభా-7-185-శా.
"క్రోడంబై పినతండ్రిఁ జంపె నని తాఁ గ్రోధించి చిత్తంబులో
వీడం జేయఁడు బంటుభంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుఁడై
యోడం డక్కట! ప్రాణవాయువులు వీఁ డొప్పించుచున్నాఁడు నా
తోడన్ వైరముపట్టె నిట్టి జనకద్రోహిన్ మహిం గంటిరే."

టీక:- క్రోడంబు = వరహావతారుడు; ఐ = అయ్యి; పినతండ్రిన్ = చిన్నాన్నను; చంపెను = చంపి వేసెను; అని = అని; తాన్ = తను; క్రోధించి = కోపము పెంచుకొని; చిత్తంబు = మనసు; లోన్ = లోనుండి; వీడన్ = దూరము; చేయడు = చేయడు; బంటు = సేవకుని; భంగిన్ = వలె; హరి = నారాయణుని; కిన్ = కి; విద్వేషి = విరోధి; కిన్ = కి; భక్తుడు = భక్తుడు; ఐ = అయ్యి; ఓడండు = సిగ్గుపడడు; అక్కట = అయ్యో; ప్రాణవాయువులు = ప్రాణవాయువులకు; వీడు = ఇతడు; ఒప్పించుచున్నాడు = అధీనము చేయుచున్నాడు; నా = నా; తోడన్ = తోటి; వైరము = పగ; పట్టెన్ = పట్టెను; ఇట్టి = ఇలాంటి; జనక = తండ్రికి; ద్రోహిన్ = ద్రోహము చేయువానిని; మహిన్ = నేలపైన; కంటిరే = ఎక్కడైనా చూసేరా.
భావము:- “విష్ణువు మాయా వరాహ రూపంలో వచ్చి సాక్షాత్తు తన పినతండ్రిని చంపేశాడని బాధ లేకుండా, సిగ్గు లేని వీడు మన వంశ విరోధికి బంటు లాగ భజన చేస్తాడా! పైగా నా తోటే విరోధానికి సిద్ధపడతాడా! అమ్మో! వీడు తన ప్రాణాలను సైతం అప్పజెప్పేస్తున్నాడు! ఇలా కన్న తండ్రికే ద్రోహం తలపెట్టే కొడుకును లోకంలో ఎక్కడైనా చూసారా?”