పోతన తెలుగు భాగవతము/సప్తమ స్కంధము/ప్రహ్లాదుని జన్మంబు

వికీసోర్స్ నుండి

ప్రహ్లాదుని జన్మంబు


తెభా-7-223-శా.
"క్షీణోగ్ర తపంబు మందరముపై ర్థించి మా తండ్రి శు
ద్ధక్షాంతిం జని యుండఁ జీమగమిచేతన్ భోగి చందంబునన్
క్షింపంబడెఁ బూర్వపాపములచేఁ బాపాత్మకుం డంచు మున్
క్షస్సంఘముమీఁద నిర్జరులు సంరంభించి యుద్ధార్థులై.

టీక:- అక్షీణ = గొప్ప; ఉగ్ర = భయంకరమైన; తపంబున్ = తపస్సును; మందరము = మందర పర్వతము; పై = మీద; అర్థించి = కోరి; మా = మా యొక్క; తండ్రి = తండ్రి; శుద్ధ = పరమ; క్షాంతిని = శాంతితో; చని = వెళ్ళి; ఉండన్ = ఉండగా; చీమ = చీమల; గమి = బారు; చేతన్ = వలన; భోగి = పాము; చందంబునన్ = వలె; భక్షింపన్ = తినబడెను, నశించెను; పూర్వ = పూర్వజన్మలలో సంపాదించుకొన్న; పాపముల = పాపముల; చేన్ = వలన; పాపాత్మకుండు = పాప స్వరూపి; అంచున్ = అనుచు; మున్ = ఇంతకు పూర్వము; రక్షస్ = రాక్షసుల; సంఘమున్ = సమూహము; మీదన్ = పైన; నిర్జరుల్ = దేవతలు; సంరంభించి = ఉత్సాహించి; యుద్ధ = యుద్ధమును; అర్థులు = చేయగోరువారు; ఐ = అయ్యి.
భావము:- “పూర్వం మా తండ్రి ఘోరమైన తపస్సు చేయటానికి మందరపర్వతము మీదికి ప్రశాంత చిత్తంతో వెళ్ళాడు. చాలాకాలం రాకుండా అక్కడే ఉన్నాడు. దేవత లందఱు “ఇక హిరణ్యకశిపుడు చీమల బారిన పడిన పాము లాగ తన పాపాలచే తానే నాశన మయ్యాడు.” అని అందరు కలిసి రాక్షసులపైకి యుద్ధానికి సంసిద్ధులు అయి బయలుదేరారు.I4510

తెభా-7-224-శా.
ప్రస్థానోచిత భేరిభాంకృతులతోఁ బాకారియుం దారు శౌ
ర్యస్థైర్యంబుల నేగుదెంచినఁ దదీయాటోప విభ్రాంతులై
స్వస్థేమల్ దిగనాడి పుత్ర ధన యోషా మిత్ర సంపత్కళా
ప్రస్థానంబులు డించి పాఱి రసురుల్ ప్రాణావనోద్యుక్తులై.

టీక:- ప్రస్థాన = ప్రయాణ; ఉచిత = యోగ్యమైన; భేరీ = భేరీల; భాంకృతుల = భాం యనెడి శబ్దములు చేసెడివి; తోన్ = తోటి; పాకారి = ఇంద్రుడు {పాకారి - పాకాసురుని అరి (శత్రువు), ఇంద్రుడు}; తారున్ = తాము (దేవతలు); శౌర్య = పరాక్రమముతోను; స్థైర్యంబులన్ = ధైర్యములతోను; ఏగుదెంచినన్ = రాగా; తదీయ = వారి; ఆటోప = సంరంభమునకు; విభ్రాంతులు = వెరచినవారు; ఐ = అయ్యి; స్వ = తమ; స్థేమల్ = స్థితులను; దిగనాడి = వదలి; పుత్ర = కుమారులు; ధన = ధనము; యోషా = స్త్రీలు; మిత్ర = స్నేహితులు; సంపత్ = సంపదలు; కళా = తేజస్సులు; ప్రస్థానంబులు = కదలికలు; డించి = దిగవిడిచి; పాఱిరి = పారిపోయిరి; అసురుల్ = రాక్షసులు; ప్రాణ = ప్రాణములను; అవన = కాపాడుకొనుటకు; ఉద్యుక్తులు = సిద్ధపడినవారు; ఐ = అయ్యి.
భావము:- జైత్రయాత్రకు తగిన సన్నాహంతో యుద్ధభేరీలు మ్రోగాయి. ఇంద్రుడు దేవతలూ యుద్ధోత్సాహంతో ఆవేశంతో దండు వెడలి వచ్చి పడ్డారు. రాక్షసులు అందరూ ఆ ధాటికి తట్టుకోలేక తమ భార్యాబిడ్డలను, బంధుమిత్రులనూ, ధనధాన్యాలనూ విడిచి అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని పారిపోయారు.

తెభా-7-225-మత్త.
ప్రల్లదంబున వేల్పు లుద్ధతిఁ బాఱి రాజనివాసముం
గొల్లబెట్టి సమస్త విత్తముఁ గ్రూరతం గొని పోవఁగా
నిల్లు చొచ్చి విశంకుఁడై యమరేశ్వరుం డదలించి మా
ల్లిఁ దాఁ జెఱఁబట్టె సిగ్గునఁ ప్తయై విలపింపఁగాన్.

టీక:- ప్రల్లదనంబునన్ = పౌరుషముతో; వేల్పులు = దేవతలు; ఉద్ధతిన్ = అతిశయించి; పాఱి = పరుగెట్టుకు వెళ్ళి; రాజనివాసమున్ = రాచనగరిని; కొల్లబెట్టి = కొల్లగొట్టి; సమస్త = అఖిలమైన; విత్తమున్ = ధనమును; క్రూరతన్ = క్రూరముగా; కొనిపోవగాన్ = తీసుకొనిపోవుచుండగా; ఇల్లున్ = ఇంటి యందు; చొచ్చి = దూరి; విశంకుడు = జంకులేనివాడు; ఐ = అయ్యి; అమరేశ్వరుండు = ఇంద్రుడు; అదలించి = భయపెట్టి; మా = మా యొక్క; తల్లిన్ = తల్లిని; తాన్ = తను; చెఱబట్టె = బంధించెను; సిగ్గున = సిగ్గుతో; తప్త = కాగిపోయినది; ఐ = అయ్యి; విలపింపగాన్ = ఏడుస్తుండగా.
భావము:- దండెత్తి వచ్చిన దేవతలు దౌర్జన్యంతో రాక్షసరాజు నివాస మందిరాన్ని వెంటనే ఆక్రమించారు. సర్వ సంపదలూ, ధనాగారం సమస్తం దోచేశారు. దేవేంద్రుడు సంకోచం లేకుండా అంతఃపురంలోకి చొరబడ్డాడు. మా తల్లిని చెరబట్టాడు. ఆమె సిగ్గుతో విలవిలలాడింది. దేవేంద్రుడు ఆమె ఎంత ఏడ్చినా వినిపించుకోలేదు.

తెభా-7-226-వ.
ఇట్లు సురేంద్రుండు మా తల్లిం జెఱగొని పోవుచుండ న మ్ముగుద కురరి యను పులుఁగు క్రియ మొఱలిడినఁ దెరువున దైవయోగంబున నారదుండు పొడఁగని యిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సురేంద్రుండు = దేవేంద్రుడు; మా = మా యొక్క; తల్లిన్ = తల్లిని; చెఱన్ = బందీగా; కొనిపోవుచుండన్ = తీసుకొనిపోవుచుండగా; ఆ = ఆ; ముగుద = ముగ్ధ; కురరి = ఆడులకుముకి; అను = అనెడి; పులుగు = పిట్ట; క్రియన్ = వలె; మొఱలిడినన్ = ఆర్తధ్వానములు చేయుచుండ; తెరువునన్ = దారిలో; దైవ = దేవుని; యోగంబున = వశముచేత; నారదుండు = నారదుడు; పొడగని = కనుగొని, చూచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా మా తల్లిని చెరబట్టి ఇంద్రుడు తీసుకుపోతుంటే ఆమె ఆడు లకుముకిపిట్ట లాగ రోదించింది. అదృష్టవశాత్తు దైవయోగం కలిసి వచ్చి దారిలో నారదమహర్షి ఇదంతా చూశాడు. అప్పుడు నారదమహర్షి ఇంద్రుడితో ఇలా అన్నాడు.

తెభా-7-227-ఉ.
"స్వర్భువనాధినాథ! సురత్తమ! వేల్పులలోన మిక్కిలిన్
నిర్భరపుణ్యమూర్తివి సునీతివి మానినిఁ బట్ట నేల? యీ
ర్భిణి నాతురన్ విడువు ల్మషమానసురాలు గాదు నీ
దుర్భరరోషమున్ నిలుపు దుర్జయుఁ డైన నిలింపవైరి పై."

టీక:- స్వర్భువనాధినాథ = ఇంద్ర {స్వర్భువనాధినాథుడు - స్వర్భువన (స్వర్గలోకపు) అధినాథుడు (ప్రభువు), ఇంద్రుడు}; సురసత్తమ = ఇంద్ర {సురసత్తముడు - సుర (దేవలలో) సత్తముడు (సామర్థ్యము గలవాడు), ఇంద్రుడు}; వేల్పులు = దేవతల; లోనన్ = అందు; మిక్కిలి = అధికమైన; నిర్భర = గాఢమైన; పుణ్య = పుణ్యముగల; మూర్తివి = స్వరూపము గలవాడవు; సునీతివి = మంచి నీతిమంతుడవు; మానినిన్ = స్త్రీని; పట్టన్ = బంధిచుట; ఏల = ఎందుకు; ఈ = ఈ; గర్భిణిన్ = గర్భవతిని; ఆతురన్ = శోకముచెంది నామెను; విడువు = వదలిపెట్టు; కల్మష = చెడు; మానసురాలు = మనసు గలామె; కాదు = కాదు; నీ = నీ యొక్క; దుర్భర = భరింపరాని; రోషమున్ = క్రోధమును; నిలుపు = ఆపుకొనుము; దుర్జయుడు = జయింపరానివాడు; ఐన = అయిన; నిలింపవైరి = రాక్షసుని {నిలింవైరి - నిలింప (దేవతా) వైరి (శత్రువు), రాక్షసుడు}; పై = మీద.
భావము:- “ఓ దేవేంద్రా! నువ్వేమో దేవతలలో శ్రేష్ఠుడివి; పుణ్యమూర్తివి; నీతిమంతుడవు; స్వర్గ లోకానికే అధిపతివి; ఇలా నువ్వు పరస్త్రీని పట్టుకుని రావటం తప్పు కదా; ఈమె పాపాత్మురాలు కాదు; పైగా ఈమె గర్భవతి; నీ కోపం ఏం ఉన్నా హిరణ్యకశిపుడి మీద చూపించు. అంతేకాని ఈమె పై కాదు. వెంటనే భయార్తురాలు అయిన ఈమెను విడిచిపెట్టు.”

తెభా-7-228-వ.
అనిన వేల్పుఁదపసికి వేయిగన్నులు గల గఱువ యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; వేల్పుదపసి = దేనఋషి; కిన్ = కి; వేయిగన్నులుగలగఱువ = ఇంద్రుడు {వేయిగన్నులుగలగఱువ - వేయి (వెయ్యి, 1000) కన్నులు గల గఱువ (ఘనుడు), ఇంద్రుడు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- దేవర్షి నారదులవారు ఇలా చెప్పగా వేయి కన్నులున్న దేవర ఇలా అన్నాడు.

తెభా-7-229-ఉ.
"అంనిధాన మైన దితిజాధిపువీర్యము దీని కుక్షి న
త్యం సమృద్ధి నొందెడి మహాత్మక! కావునఁ దత్ప్రసూతి ప
ర్యంము బద్ధఁ జేసి జనితార్భకు వజ్రము ధారఁ ద్రుంచి ని
శ్చింతుఁడనై తుదిన్ విడుతు సిద్ధము దానవరాజవల్లభన్."

టీక:- అంత = నాశనమునకు; నిధానము = కారణమైనవాడు; ఐన = అయిన; దితిజాధిపు = రాక్షసరాజు యొక్క; వీర్యము = రేతస్సు; దీని = ఈమె యొక్క; కుక్షిన్ = కడుపులో; సమృద్ధిన్ = మిగులవృద్ధిని; ఒందెడిన్ = పొందుచున్నది; మహాత్మక = గొప్పఆత్మకలవాడ; కావునన్ = అందుచేత; తత్ = ఆ; ప్రసూతి = పురుటి; పర్యంతమున్ = వరకు; బద్ధన్ = బంధీని; చేసి = చేసి; జనిత = పుట్టిన; అర్భకున్ = పిల్లవానిని; వజ్రము = వజ్రాయుధము; ధారన్ = పదునుతో; త్రుంచి = నరికి; నిశ్చింతుడను = దిగులులేనివాడను; ఐ = అయ్యి; తుదిన్ = చివరకు; విడుతున్ = విడిచిపెట్టెదను; సిద్ధము = నిశ్చయముగ; దానవ = రాక్షస; రాజ = రాజు యొక్క; వల్లభన్ = భార్యను.
భావము:- “ఓ మహాత్ముడా! లోకాలకు దుస్సహమైన హిరణ్యకశిపుని రాక్షస వీర్యం ఈమె కడుపులో వృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ఈమె ప్రసవించే వరకు బందీగా ఉంచి, పుట్టిన బిడ్డను పుట్టినట్లే నా వజ్రాయుధంతో సంహరిస్తాను. అప్పుడు నా మనస్సు నిశ్చింతగా ఉంటుంది. ఈ రాక్షసరాజు పత్నిని చివరికి విడిచిపెట్టేస్తాను.”

తెభా-7-230-వ.
అని పలికిన వేల్పులఱేనికిం దపసి యిట్లనియె.
టీక:- అని = అని; పలికిన = పలుకగా; వేల్పులఱేని = ఇంద్రున {వేల్పులఱేడు - వేల్పుల(దేవతల) ఱేడు (ప్రభువు), ఇంద్రుడు}; కిన్ = కు; తపసి = ముని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పలికిన ఆ దేవతల రాజు దేవేంద్రుడితో మహా తపశ్శాలి అయిన నారదుడు ఇలా అన్నాడు.

తెభా-7-231-శా.
"నిర్భీతుండు ప్రశస్త భాగవతుఁడున్ నిర్వైరి జన్మాంతరా
విర్భూతాచ్యుతపాదభక్తి మహిమావిష్టుండు దైత్యాంగనా
ర్భస్థుం డగు బాలకుండు బహుసంగ్రామాద్యుపాయంబులన్
దుర్భావంబునఁ బొంది చావఁడు భవద్దోర్దండ విభ్రాంతుఁ డై."

టీక:- నిర్భీతుండు = భయములేనివాడు; ప్రశస్త = శ్రేష్ఠుడైన; భాగవతుడున్ = భాగవతుడు; నిర్వైరి = శత్రుత్వములేనివాడు; జన్మాంతర = పూర్వజన్మలనుండి; ఆవిర్భూత = పుట్టిన; అచ్యుత = నారయణుని; పాద = పాదములందలి; భక్తి = భక్తి యొక్క; ప్రభావ = ప్రభావముతో; ఆవిష్టుండు = కూడినవాడు; దైత్య = రాక్షసుని; అంగన = భార్య యొక్క; గర్భస్థుడు = కడుపునగలవాడు; అగు = అయిన; బాలకుండు = పిల్లవాడు; బహు = అనేక విధములైన; సంగ్రామ = యుద్ధము; ఆది = మొదలగు; ఉపాయంబులన్ = ఉపాయములచేత; దుర్భావంబున్ = నికృష్టత్వమును; పొంది = పొంది; చావడు = మరణించడు; భవత్ = నీ యొక్క; దోర్దండ = బాహుబలమునకు; విభ్రాంతుడు = తికమకనొందినవాడు; ఐ = అయ్యి.
భావము:- “దానవేంద్రుడు హిరణ్యకశిపుని భార్య కడుపులో పెరుగుతున్న వాడు భయం అన్నది లేని వాడు. మహా భక్తుడు. పరమ భాగవతోత్తముడు. అతనికి ఎవరూ శత్రువులు కారు. అతను జన్మజన్మల నుంచీ హరిభక్తి సంప్రాప్తిస్తూ వస్తున్న మహా మహిమాన్వితుడు. కాబట్టి ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని ఉపాయాలు పన్నినా, నీకు ఎంత బలం ఉన్నా, నీ బాహుపరాక్రమం అతని మీద ఏమాత్రం పనిచేయదు, అతనిని చంపలేవు కనీసం ఏ విధమైన కష్టం కలిగించలేవు.”

తెభా-7-232-వ.
అని దేవముని నిర్దేశించిన నతని వచనంబు మన్నించి తానును హరిభక్తుండు గావున దేవేంద్రుండు భక్తి బాంధవంబున మా యవ్వను విడిచి వలగొని సురలోకంబునకుం జనియె; మునీంద్రుండును మజ్జనని యందుఁ బుత్రికాభావంబు జేసి యూఱడించి; నిజాశ్రమంబునకుం గొనిపోయి "నీవు పతివ్రతవు, నీ యుదరంబునఁ బరమభాగవతుండయిన ప్రాణి యున్నవాఁడు తపోమహత్త్వంబునం గృతార్థుండై నీ పెనిమిటి రాఁగలం; డందాక నీ విక్కడ నుండు"మనిన సమ్మతించి.
టీక:- అని = అని; దేవముని = దేవర్షి; నిర్దేశించినన్ = చెప్పగా; అతని = అతని; వచనంబులు = మాటలు; మన్నించి = గౌరవించి; తానును = తను కూడ; హరి = నారాయణుని; భక్తుండు = భక్తుడు; కావునన్ = కనుక; దేవేంద్రుండు = ఇంద్రుడు; భక్తి = భక్తిమూలకమైన; బాంధవంబునన్ = బంధుత్వముతో; మా = మా యొక్క; అవ్వను = తల్లిని; విడిచి = వదలి; వలగొని = ప్రదక్షిణముచేసి; సురలోకంబున్ = స్వర్గలోకమున; కున్ = కు; చనియె = వెళ్ళెను; ముని = మునులలో; ఇంద్రుండును = శ్రేష్ఠుడు; మత్ = నా యొక్క; జనని = తల్లి; అందు = ఎడల; పుత్రికా = కుమార్తె యనెడి; భావంబున్ = తలంపు; చేసి = చేసి; ఊఱడించి = ఊరుకోబెట్టి; నిజ = తన; ఆశ్రమంబున్ = ఆశ్రమమున; కున్ = కు; కొనిపోయి = తీసుకు వెళ్ళి; నీవు = నీవు; పతివ్రతవు = పతిభక్తిగల యిల్లాలువి; నీ = నీ యొక్క; ఉదరంబునన్ = కడుపులో; పరమ = అతిపవిత్రమైన; భాగవతుండు = భాగవతుడు; అయిన = ఐనట్టి; ప్రాణి = జీవుడు; ఉన్నవాడు = ఉన్నాడు; తపస్ = తపస్సుయొక్క; మహత్వంబునన్ = గొప్పదనముచేత; కృతార్థుండు = నెరవేరినపనిగలవాడు; ఐ = అయ్యి; నీ = నీ యొక్క; పెనిమిటి = భర్త; రాగలండు = వచ్చును; అందాక = అప్పటివరకు; నీవు = నీవు; ఇక్కడ = ఇక్కడ; ఉండుము = ఉండుము; అనినన్ = అనగా; సమ్మతించి = అంగీకరించి.
భావము:- ఇంద్రుడు నారదమహర్షి చెప్పిన ఆ మాటలను ఆమోదించాడు. మా అమ్మకు నమస్కారం చేసి, విడిచిపెట్టాడు. తాను కూడ విష్ణుభక్తుడే కాబట్టి ఆ భక్తి బంధుత్వంతో మా అమ్మకు ప్రదక్షిణ చేసి తన దేవలోకానికి వెళ్ళిపోయాడు. నారదమహర్షి మా తల్లిని కూతురుగా భావించి, ఓదార్చి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. “అమ్మా! నువ్వు పరమ పతివ్రతవు. నీ కడుపులో మహాభక్తుడు అయిన జీవుడు ఒకడు పెరుగుతున్నాడు. నీ భర్త తపస్సు చేసి తప్పక వరాలు పొంది తిరిగి వస్తాడు. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండు” అని నారదుడు ధైర్యం చెప్పాడు. మా అమ్మ అంగీకరించింది.

తెభా-7-233-శా.
యోషారత్నము నాథదైవత విశాలోద్యోగ మా తల్లి ని
ర్వైమ్యంబున నాథురాక మదిలో వాంఛించి నిర్దోష యై
యీద్భీతియు లేక గర్భపరిరక్షేచ్ఛన్ విచారించి శు
శ్రూషల్ చేయుచు నుండె నారదునకున్ సువ్యక్త శీలంబునన్.

టీక:- యొషా = స్త్రీలలో; రత్నము = రత్నమువంటి యామె; నాథదైవత = పతివ్రత {నాథ దైవత - నాథ (భర్తయే) దైవత (భగవంతునిగ గలది), పతివ్రత}; విశాల = విరివి యైన; ఉద్యోగ = సంకల్పము గలామె; మా = మా యొక్క; తల్లి = తల్లి; నిర్వైషమ్యంబునన్ = విషమ భావములు లేకుండగ; నాథు = భర్త యొక్క; రాకన్ = ఆగమనమును; మది = మనసు; లోన్ = అందు; వాంఛించి = కోరి; నిర్దోష = ఏపాపములులేనిది; ఐ = అయ్యి; ఈషత్ = కొంచెము కూడ; భీతియున్ = భయమేమి; లేక = లేకుండ; గర్భ = గర్భమును; పరిరక్ష = కాపాడుకొనెడి; ఇచ్ఛన్ = తలపుతో; విచారించి = ఆలోచించుకొని; శుశ్రూషల్ = సేవలను; చేయుచునుండెన్ = చేయుచుండెను; నారదున్ = నారదుని; కున్ = కి; సువ్యక్త = చక్కగావ్యక్తమగు; శీలంబునన్ = మంచినడవడికతో.
భావము:- మహిళారత్నము, మహా పతివ్రతా, సుసంకల్ప అయిన మా అమ్మ లీలావతి, ఎవ్వరి మీద ద్వేషం పెట్టుకోకుండా, భర్తనే దైవంగా భావిస్తూ, అతని రాక కోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది. తన కడుపులో పెరుగుతున్న కుమారుని క్షేమం కోరుకుంటూ, నారదమహర్షికి సేవలు చేస్తూ, ఏ బెదురు లేకుండా, మేలైన నడతతో ఆశ్రమంలో ఉండిపోయింది.

తెభా-7-234-వ.
ఇట్లు దనకుఁ బరిచర్య జేయుచున్న దైత్యరాజకుటుంబినికి నాశ్రితరక్షావిశారదుం డైన నారదుండు నిజసామర్థ్యంబున నభయం బిచ్చి గర్భస్థుండ నైన నన్ను నుద్దేశించి ధర్మతత్త్వంబును నిర్మలజ్ఞానంబును నుపదేశించిన, నమ్ముద్ధియ దద్ధయుం బెద్దకాలంబునాఁటి వినికి గావున నాడుది యగుటం జేసి పరిపాటి దప్పి సూటి లేక మఱచె; నారదుఁడు నా యెడఁ గృప గల నిమిత్తంబున.
టీక:- ఇట్లు = ఇలా; తన = తన; కున్ = కు; పరిచర్య = సేవ; చేయుచున్న = చేస్తున్న; దైత్య = రాక్షస; రాజ = రాజు యొక్క; కుటుంబిని = భార్య; కిన్ = కి; ఆశ్రిత = ఆశ్రయించినవారిని; రక్షా = కాపాడుటయందు; విశారదుండు = మిక్కిలి నేర్పుగలవాడు; ఐన = అయిన; నారదుండు = నారదుడు; నిజ = స్వంత; సామర్థ్యంబునన్ = శక్తిచేత; అభయంబున్ = అభయమును; ఇచ్చి = ఇచ్చి; గర్భస్థుండన్ = కడుపులో నున్నవాడను; ఐన = అయిన; నన్నున్ = నన్ను; ఉద్దేశించి = గురించి; ధర్మ = ధర్మము యొక్క; తత్త్వంబును = స్వరూపమును; నిర్మల = రాగాది కలుషితము గాని; జ్ఞానంబును = జ్ఞానమును; ఉపదేశించినన్ = బోధింపగా; ఆ = ఆ; ముద్దియ = స్త్రీ; దద్దయున్ = మిక్కిలి; పెద్ద = ఎక్కువ; కాలంబున్ = కాలము; నాటి = పూర్వపు; వినికి = విన్నసంగతి; కావునన్ = కనుక; ఆడుది = ఆడమనిషి; అగుటన్ = అగుట; చేసి = వలన; పరిపాటిన్ = అభ్యాసము; తప్పి = తప్పి; సూటి = గుఱి; లేక = లేకపోవుటచే; మఱచెన్ = మరచిపోయెను; నారదుడు = నారదుడు; నా = నా; ఎడన్ = అందు; కృప = దయ; కల = ఉండుట; నిమిత్తంబునన్ = వలన.
భావము:- ఆశ్రిత జన రక్షకుడు అయిన నారదుడు, మా అమ్మ చేస్తున్న సేవను ఎంతో మెచ్చుకున్నాడు. తన శక్తికొలది కడుపులో పెట్టుకొని కాపాడాడు. నా యందు మిక్కిలి దయగలవాడు కనుక నాకు చెప్పవలెను అనే తలపుతో, మా తల్లికి స్వచ్ఛమైన జ్ఞానాన్ని, ధర్మాన్ని ఉపదేశించాడు. కానీ స్త్రీ కావటం వలన, చాలా కాలం గడిచిపోవడం వలన, అభ్యాసం లేకపోవడం వలన మా అమ్మ ఇప్పుడు అవన్నీ మరచిపోయింది.

తెభా-7-235-క.
వెల్లిగొని నాఁటనుండియు
నుల్లసితం బైన దైవయోగంబున శో
భిల్లెడు మునిమత మంతయు
నుల్లంబున మఱపు పుట్ట దొకనాఁ డైనన్.

టీక:- వెల్లిగొని = బయటకి వచ్చిన; నాటి = దినము; నుండియున్ = నుండి; ఉల్లసితంబు = వికసించినది; ఐన = అయిన; దైవ = అదృష్ట; యోగంబునన్ = సంయోగమువలన; శోభిల్లెడున్ = ప్రకాశించుచున్నది; ముని = ఋషి యొక్క; మతము = తత్త్వార్థము; అంతయున్ = సమస్తమును; ఉల్లంబునన్ = మనసులో; మఱపు = మరచిపోవుట; పుట్టదు = కలుగదు; ఒకనాడు = ఒకమాటు; ఐనన్ = అయినను.
భావము:- నారదమహర్షికి నా మీద ఉన్న దయవలన, దైవయోగం కలిసిరావటంవలన, నాకు మాత్రం వారి యొక్క ఆ ఉపదేశాలు అన్నీ పుట్టిననాటి నుండి నేటి వరకు ఏ ఒక్కరోజు కూడ ఒక్కటి కూడ నేను మర్చిపోలేదు. చక్కగా అన్నీ గుర్తున్నాయి.”

తెభా-7-236-ఆ.
వినుఁడు నాదు పలుకు విశ్వసించితిరేని
తుల కయిన బాల నుల కయినఁ
దెలియ వచ్చు మేలు దేహాద్యహంకార
ళననిపుణ మైన పసిమతము."

టీక:- వినుడు = వినండి; నాదు = నా యొక్క; పలుకు = మాట; విశ్వసించితిరేని = నమ్మినచో; సతుల్ = స్త్రీల; కున్ = కు; అయిన = ఐన; బాల = పిల్ల; జనుల్ = వారి; కిన్ = కి; అయిన = ఐన; తెలియన్ = తెలియను; వచ్చున్ = అగును; మేలు = మంచిది, శ్రేయము; దేహ = దేహము; ఆది = మొదలగు; అహంకార = మమత్వమును; దళన = పోగొట్టునది; ఐన = అయిన; తపసి = ఋషిచే తెలుపబడిన; మతము = తత్వము.
భావము:- శ్రద్దగా వినండి చెప్తాను. నా మాట నమ్మండి. నారద మహర్షి తత్వం తెలుసుకోడానికి స్త్రీలు, బాలలు కూడ అర్హులే. ఈ నారద భక్తి తత్వం తెలుసుకుంటే దేహాభిమానాలు, మమకారాలు తొలగిపోతాయి. ఉత్తమమైన భక్తి ఏర్పడుతుంది.”

తెభా-7-237-వ.
అని నారదోక్త ప్రకారంబున బాలకులకుఁ బ్రహ్లాదుం డిట్లనియె; "ఈశ్వరమూర్తి యైన కాలంబునం జేసి వృక్షంబు గలుగుచుండ ఫలంబునకు జన్మ సంస్థాన వర్ధనాపచయ క్షీణత్వ పరిపాక నాశంబులు ప్రాప్తంబు లయిన తెఱంగున దేహంబులకుం గాని షడ్భావవికారంబు లాత్మకు లేవు; ఆత్మ నిత్యుండు క్షయరహితుండు శుద్ధుండు క్షేత్రజ్ఞుండు గగనాదులకు నాశ్రయుండుఁ గ్రియాశూన్యుండు స్వప్రకాశుండు సృష్టిహేతువు వ్యాపకుండు నిస్సంగుండుఁ బరిపూర్ణుండు నొక్కండు నని వివేకసమర్థంబు లగు "నాత్మలక్షణంబులు పండ్రెండు"నెఱుంగుచు, దేహాదులందు మోహజనకంబు లగు నహంకార మమకారంబులు విడిచి పసిండిగనులు గల నెలవున విభ్రాజమాన కనక లేశంబులైన పాషాణాదులందుఁ బుటంబుపెట్టి వహ్నియోగంబున గరంగ నూది హేమకారకుండు పాటవంబున హాటకంబుఁ బడయు భంగి నాత్మకృత కార్యకారణంబుల నెఱింగెడి నేర్పరి దేహంబునం దాత్మసిద్ధికొఱకు నయిన యుపాయంబునం జేసి బ్రహ్మభావంబుఁ బడయు; మూలప్రకృతియు మహదహంకారంబులును బంచతన్మాత్రంబులు నివి యెనిమిదియుం "బ్రకృతు"లనియును, రజ స్సత్త్వ తమంబులు మూఁడును "బ్రకృతిగుణంబు"లనియుఁ, గర్మేంద్రియంబు లయిన వాక్పాణి పాద పాయూపస్థంబులును జ్ఞానేంద్రియంబు లైన శ్రవణ నయన రసనా త్వగ్ఘ్రాణంబులును మనంబును మహీ సలిల తేజో వాయు గగనంబులును నివి "పదాఱును వికారంబు"లనియును, గపిలాది పూర్వాచార్యులచేతఁ జెప్పబడియె; సాక్షిత్వంబున నీ యిరువదే డింటిని నాత్మగూడి యుండు; పెక్కింటి కూటువ దేహ; మదియు జంగమస్థావరరూపంబుల రెండువిధంబు లయ్యె; మూలప్రకృతి మొదలయిన వర్గంబునకు వేఱై మణిగణంబులఁ జొచ్చి యున్న సూత్రంబు చందంబున నాత్మ యన్నింటి యందునుం జొచ్చి దీపించు; ఆత్మకు జన్మ స్థితి లయంబులు గల వంచు మిథ్యాతత్పరులు గాక వివేకశుద్ధమైన మనంబునం జేసి దేహంబునం దాత్మ వెదకవలయు; ఆత్మకు "నవస్థలు"గలయట్లుండుఁ గాని యవస్థలు లేవు జాగరణ స్వప్న సుషుప్తు లను "వృత్తు"లెవ్వనిచేత నెఱుంగంబడు నతం డాత్మ యండ్రు; కుసుమ ధర్మంబు లయిన గంధంబుల చేత గంధాశ్రయు డయిన వాయువు నెఱింగెడు భంగిం ద్రిగుణాత్మకంబులయి కర్మ జన్యంబు లయిన బుద్ధి భేదంబుల నాత్మ నెఱుంగం దగు"నని చెప్పి.
టీక:- అని = అని; నారద = నారదునిచే; ఉక్త = చెప్పబడిన; ప్రకారంబునన్ = విధముగ; బాలకుల్ = పిల్లవాండ్ర; కున్ = కు; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఈశ్వరుని = భగవంతుని యొక్క; మూర్తి = స్వరూపము; ఐన = అయిన; కాలంబునన్ = కాలము; చేసి = వలన; వృక్షంబులు = చెట్లు; కలుగుచుండన్ = ఉండగా; ఫలంబున్ = పండున; కున్ = కు; జన్మ = పుట్టుట, పిందెకాయుట; సంస్థాన = కాయగుట; వర్ధన = పెరుగుట; అపచయ = ముదురుట; క్షీణత = ఎండిపోవుట; పరిపాక = పండుట; నాశంబులు = నశించిపోవుటలు; ప్రాప్తంబులు = కలిగినవి; అయిన = ఐన; తెఱంగునన్ = విధముగ; దేహంబుల్ = శరీరములకే; కాని = కాని; షడ్వికారంబులు = పరివర్తనలారును {షడ్వికారములు - 1జన్మ(పుట్టుట) 2సంస్థాన (నిలబడుట) 3వర్ధన (పెరుగుట) 4అపక్షయ (బలియుట) 5పరిపాక (పరిక్వమగుట) 6నాశము (నశించుట) అనెడి ఆరు మార్పులు}; ఆత్మ = ఆత్మ; కున్ = కు; లేవు = లేవు; ఆత్మ = ఆత్మ; నిత్యుండు = శాశ్వతమైనవాడు; క్షయ = నాశము; రహితుండు = లేనివాడు; శుద్ధుండు = నిర్మలుడు; క్షేత్రజ్ఞుండు = మాయనెరిగినవాడు, జీవుడు; గగనాదుల్ = పంచభూతముల {పంచభూతములు - 1ఆకాశము 2భూమి 3నీరు 4వాయువు 5తేజము}; కున్ = కు; ఆశ్రయుండు = ఆధారమైనవాడు; క్రియా = కర్మములు; శూన్యుండు = లేనివాడు; స్వప్రకాశుండు = స్వయముగా ప్రకాశించువాడు; సృష్టి = సృష్టికి; హేతువు = కారణమైనవాడు; వ్యాపకుండు = అంతట వ్యాపించువాడు; నిస్సంగుడున్ = తగులములు లేనివాడు; పరిపూర్ణుండున్ = అంతటను నిండినవాడు; ఒక్కండును = ఏకలుడు; అని = అని; వివేక = జ్ఞానమును; సమర్థంబులు = ఈయగలిగినవి; అగు = అయిన; ఆత్మ = ఆత్మ యొక్క; లక్షణంబులు = లక్షణములు {ఆత్మ ద్వాదశ లక్షణములు - 1. శాశ్వతమైనది, 2. నాశనం లేనిది, 3. శుద్ధుడు, 4. క్షేత్రజ్ఞుడు, 5. గగనాదులకు ఆశ్రయుడు, 6. క్రియాశూన్యుడు, 7. స్వయంప్రకాశం, 8. సృష్టికి కారణం, 9. వ్యాపించు స్వభావం కలది, 10. సంగం లేనిది, 11. పరిపూర్ణమైనది, 12. ఏకలుడు}; పండ్రెండును = పన్నిండింటిని; ఎఱుంగుచున్ = తెలిసుండి; దేహాదులు = దేహ గేహ పుత్ర కళ త్రాదులు; అందున్ = ఎడల; మోహ = తగులములను; జనకంబులు = పుట్టించునవి; అగు = అయిన; అహంకార = నేను యనెడి భావము; మమకారంబులు = నాది యనెడి భావములను; విడిచి = వదలిపెట్టి; పసిడి = బంగారు; గనులు = గనులు, పుట్టుచోటులు; కల = కలిగిన; నెలవునన్ = స్థానములను; విభ్రాజమాన = మెరుస్తున్న; కనక = బంగారము; లేశంబులు = కొద్దిపాటిది; ఐన = కలిగిన; పాషాణ = రాళ్ళు; ఆదులు = మొదలగువాని; అందున్ = అందు; పుటంబున్ = పుటములో; పెట్టి = పెట్టి; వహ్ని = అగ్నితో; యోగంబునన్ = కూడించుటద్వారా; కరంగన్ = కరిగిపోవునట్లు; ఊది = ఊది; హేమకారకుండు = స్వర్ణకారుడు; పాటవంబునన్ = నేరుపుతో; హాటకంబున్ = బంగారమును; పడయు = పొందెడి; భంగిన్ = వలె; ఆత్మ = ఆత్మ; కృత = కలిగిన; కార్య = కార్యములు; కారణంబులన్ = హేతువులు; ఎఱింగెడి = తెలియగల; నేర్పరి = ఉపాయశాలి; దేహంబున్ = శరీరము; అందున్ = లోని; ఆత్మ = ఆత్మయొక్క; సిద్ధి = తాదాత్మ్యము పొందుట; కొఱకున్ = కోసము; అయిన = ఐన; ఉపాయంబునన్ = ఉపాయములచేత; చేసి = వలన; బ్రహ్మభావంబున్ = బ్రహ్మత్వమును; పడయున్ = పొందును; మూలప్రకృతియున్ = మాయ; మహత్ = బుద్ధి; అహంకారంబులు = అహంకారములు; తన్మాత్రంబులున్ = పంచతన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1శబ్ద 2స్పర్శ 3రూప 4రస 5గంధములు}; ఇవి = ఇవి; ఎనిమిదియున్ = ఎనిమిది (8); ప్రకృతులు = ప్రకృతులు {ప్రకృతులు - 1మాయ 2మహత్తు 3అహంకారము మరియు పంచతన్మాత్రలు ఐదు (5)}; అనియునున్ = అని; రజః = రజోగుణము; సత్త్వ = సత్త్వగుణము; తమంబులు = తమోగుణము లు; మూడును = మూడింటిని (3); ప్రకృతిగుణంబులు = ప్రకృతిగుణములు; అనియున్ = అని; కర్మేంద్రియంబులు = పనిచేయుట కైన సాధనములు {కర్మేంద్రియములు - 1నోరు 2చేతులు 3కాళ్ళు 4గుదము 5ఉపస్థు}; అయిన = ఐన; వాక్ = నోరు; పాణి = చేతులు; పాద = కాళ్ళు; పాయుః = గుదము; ఉపస్థంబులు = జననేంద్రియములు; జ్ఞానేంద్రియంబులు = తెలిసికొనెడి సాధనములు {జ్ఞానేంద్రియములు - 1చెవులు 2కళ్ళు 3నాలుక 4చర్మము 5ముక్కు}; ఐన = అయిన; శ్రవణ = చేవులు; నయన = కళ్ళు; రసన = నాలుక; త్వక్ = చర్మము; ఘ్రాణంబులును = ముక్కు లు; మనంబును = మనస్సు; మహి = భూమి {భూతపంచకము - 1భూమి 2నీరు 3నిప్పు 4గాలి 5ఆకాశము}; సలిల = నీరు; తేజస్ = నిప్పు; వాయు = గాలి; గగనంబులు = ఆకాశములు; ఇవి = ఇవి; పదాఱును = పదహారు (16); వికారంబులు = వికారములు {వికారములు - కర్మేద్రియములు (5) జ్ఞానేంద్రియములు (5) మనస్సు భూతపంచకము (5) మొత్తము 16 వికారములు}; అనియునున్ = అని; కపిల = కపిలుడు; ఆది = మొదలగు; పూర్వ = పూర్వకాలపు; ఆచార్యుల్ = సిద్ధాంతకర్తల, గురువుల; చేత = చేత; చెప్పబడియెన్ = చెప్పబడినది; సాక్షిత్వంబునన్ = తటస్థలక్షణముచేత; ఈ = ఈ; యిరువదేడింటిని = యిరవైయేడింటిని (27); ఆత్మ = ఆత్మ; కూడి = కలిసి; ఉండున్ = ఉండును; పెక్కింటి = అనేకమైనవాని; కూటువ = కూడినదియైన; దేహము = శరీరము; అదియున్ = అదికూడ; జంగమ = చలనముకలవి, చరములు; స్థావరములు = స్థిరముగనుండునవి; రూపంబులన్ = అనెడ రూపములతో; రెండు = రెండు (2); విధంబులు = రకములు; అయ్యె = అయ్యెను; మూలప్రకృతి = అవిద్య, మాయ; మొదలయిన = మొదలైనవాని; వర్గంబున్ = సమూహమున; కున్ = కు; వేఱై = విలక్షణమై, భిన్నమై; మణి = మణుల; గణంబులన్ = వరుసలలో; చొచ్చి = దూరి; ఉన్న = ఉన్నట్టి; సూత్రంబు = దారము; చందంబునన్ = వలె; ఆత్మ = ఆత్మ; అన్నిటన్ = అన్నిటి; అందున్ = లోను; చొచ్చి = అంతర్లీనమై యుండి; దీపించు = ప్రకాశించును; ఆత్మ = ఆత్మ; కున్ = కు; జన్మ = పుట్టుక; స్థితి = ఉండుట; లయంబులు = నాశనములు; కలవు = ఉన్నవి; అంచున్ = అనుచు; మిథ్యా = అసత్యమున; తత్పరులు = కూడినవారు; కాక = కాకుండ; వివేక = జ్ఞానముచేత; శుద్ధులు = నిర్మలమైనవారు; ఐన = అయిన; మనంబునన్ = మనసు; చేసి = వలన; దేహంబున్ = దేహము; అందున్ = లో; ఆత్మన్ = ఆత్మను; వెదుకవలయున్ = వెతకవలెను; ఆత్మ = ఆత్మ; కున్ = కు; అవస్థలు = అవస్థాత్రయము {అవస్థాత్రయము - స్థితి అభాసములు మూడు, 1జాగరణ(మెలకువ) 2స్వప్న(కల) 3సుషుప్తి (నిద్ర)}; కల = కలిగిన; అట్లు = విధముగ; ఉండున్ = ఉండును; కాని = కాని; అవస్థలు = అవస్థలు; లేవు = లేవు; జాగరణ = మెలకువ; స్వప్న = కల; సుషుప్తులు = నిద్రలు; అను = అనెడి; వృత్తులు = అవస్థలు, వ్యాపారములు; ఎవ్వని = ఎవని; చేతన్ = చేతను; ఎఱుంగబడున్ = తెలిసికొనబడునో; అతండు = అతడు; ఆత్మ = ఆత్మ; అండ్రు = అంటారు; కుసుమ = పూవుల యొక్క; ధర్మంబులు = లక్షణములు; అయిన = ఐన; గంధంబుల్ = వాసనల; చేతన్ = వలన; గంధా = వాసనను; ఆశ్రయుండు = వహించువాడు; అయిన = ఐన; వాయువున్ = గాలిని; ఎఱింగెడు = తెలిసికొను; భంగిన్ = విధముగనే; గుణా = గుణత్రయము {గుణత్రయము - 1సత్త్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; ఆత్మకంబులు = స్వరూపములుగాగలవి; అయి = అయ్యి; కర్మ = కర్మములచేత; జన్యంబులు = పుట్టునవి; అయిన = ఐన; బుద్ధిబేదంబులన్ = చిత్తవృత్తులచేత; ఆత్మన్ = ఆత్మను; ఎఱుంగన్ = తెలిసికొన; తగును = వచ్చును; అని = అని; చెప్పి = చెప్పి.
భావము:- అని నారదమహర్షి బోధించినది అంతా అదే ప్రకారంగా తన సహాధ్యాయులైన దానవ బాలురకు ఇలా తెలియజెప్పాడు. "కాలం భగవంతుని స్వరూపం. కాలక్రమంలో వృక్షం పుట్టి ఫలమిస్తుంది. ఆ ఫలానికి పుట్టటం, వృద్ధి పొందటం, పండటం, ఎండటం, కృశించటం, నశించటం అనే క్రమం తప్పదు. అలాగా షడ్వికారాలు అనబడు ఈ ఆరు (6) విధాలైన భావవికారాలు దేహానికి కూడా ఉంటాయి. అంతేకాని ఆత్మకు మాత్రం ఈ మార్పులు ఏమాత్రం ఉండవు. ఆత్మ శాశ్వతమైనది; నాశనం లేనిది; వికారాలు లేనిది; శుద్ధమైనది; జీవుల ఆత్మ యందుండునది; ఆకాశం మున్నగువానికి ఆశ్రయమైనది; క్రియాశూన్యత్వము; స్వయం ప్రకాశం; సృష్టికి కారణం; వ్యాపించు స్వభావం కలది; సంగం లేనిది; పరిపూర్ణమైనది. ఈ విధంగా ఈ పన్నెండు (12) ఆత్మ లక్షణాలు అని పెద్దలు చెప్తారు.
బంగారం గనులలో బంగారం రేణువులు రాయి రప్పలతో కలిసి ఉంటాయి. ఆ రాళ్ళను స్వర్ణకారులు అగ్నిలో పుటం పెట్టి, కరగబెట్టి, నేర్పుగా వాటిలోంచి బంగారం వెలికి తీస్తారు. అదే విధంగా ఆత్మతత్వం తెలిసినవారు దేహం వంటి వాటిపై భ్రాంతిని కలిగించే అహంకారాలు, మమకారాలు విడిచిపెట్టి దేహాదుల కంటె ఆత్మను భిన్నంగా భావించి తెలివిగా బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందుతారు.
(అ) మూలప్రకృతి, మహత్తు, అహంకారం, శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే ఎనిమిది (8) “ప్రకృతులు” (అష్టప్రకృతులు) అంటారు.
(ఇ) సత్త్వము, రజస్సు, తమస్సు అనే ఈ మూడు (3) “ప్రకృతి గుణాలు”.
(ఉ) నోరు, చెయ్యి, కాలు, గుదం, మర్మావయవం అనే ఈ అయిదు (5) కర్మేంద్రియాలు
; కన్ను, చెవి, చర్మం, ముక్కు, నాలుక అనే ఈ అయిదు (5) జ్ఞానేంద్రియాలు
; నేల, నీరు, ఆకాశం, గాలి, అగ్ని అనే ఈ అయిదు (5) పంచభూతాలు
; మనసు ఒకటి (1)
; మొత్తం ఈ పదహారు (16) వికారాలు అంటారని కపిల మహర్షి వంటి పూర్వాచార్యులు చెప్పారు.
ఈ మొత్తం ఇరవైఏడింటిలోను (27) ఆత్మ సాక్షీభూతంగా ఉంటుంది.
ఈ విధమైన అనేక పదార్థాలతో తయారైనది ఈ దేహం. ఈ దేహాన్ని స్థిరం అని, చరం అని రెండు విధాలుగా భావించవచ్చు. మూలప్రకృతి మొదలైన వాటికన్నా భిన్నమైన ఆత్మ, పూసలలో దారం లాగ, ఇన్నింటిలోనూ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆత్మకు జనన స్థితి మరణాలు ఉన్నాయని మాయలో పడకుండా వివేకంతో ఆలోచించాలి. దేహంలో ఆత్మను అన్వేషించాలి. ఆత్మకు అవస్థలు ఉన్నట్లు అనిపిస్తాయి. కాని నిజానికి ఆత్మకు ఏ అవస్థలు లేవు. జాగృతి, స్వప్నం, సుషుప్తి అనే మనోవృత్తులను ఎవడు తెలుసుకుంటాడో అతడే ఆత్మస్వరూపుడు. పూలకు ఉండే సువాసనల ద్వారా వాయువును తెలుసుకునే విధంగా త్రిగుణాత్మకములు, కర్మజన్యములు అయిన బుద్ధిభేదాల వలన ఆత్మను తెలుసుకోవచ్చు.” అని తెలిపి ఇంకా ఇలా అన్నాడు.

తెభా-7-238-సీ.
"సంసార మిది బుద్ధిసాధ్యము గుణకర్మ-
ణబద్ధ మజ్ఞానకారణంబుఁ
లవంటి దింతియ కాని నిక్కము గాదు-
ర్వార్థములు మనస్సంభవములు
స్వప్న జాగరములు మములు గుణశూన్యుఁ-
గు పరమునికి, గుణాశ్రయమున
వవినాశంబులు వాటిల్లి నట్లుండుఁ-
ట్టి చూచిన లేవు బాలులార!

తెభా-7-238.1-తే.
డఁగి త్రిగుణాత్మకము లైన ర్మములకు
నకమై వచ్చు నజ్ఞాన ముదయమును
నతర జ్ఞానవహ్నిచేఁ గాల్చి పుచ్చి
ర్మవిరహితు లై హరిఁ నుట మేలు.

టీక:- సంసారము = సంసారము; ఇది = ఇది; బుద్ధి = బుద్ధిచేత; సాధ్యము = సాధింప దగినది; గుణ = త్రిగుణమూలము లైన; కర్మ = కర్మముల; గణ = సముదాయముల చేత; బద్ధము = కల్పింపబడినది; అజ్ఞాన = అవిద్యకి; కారణంబున్ = హేతువైనది; కల = స్వప్నము; వంటిది = వంటిది; అంతియె = అంతే; కాని = కాని; నిక్కము = నిజమైనది; కాదు = కాదు; సర్వ = సమస్తమైన; అర్థములున్ = విషయములు; మనస్ = మనస్సులో; సంభవములు = పుట్టినవి; స్వప్న = కల; జాగరములు = మెలకువలు; సమములు = సమానమైనవి; గుణ = గుణములు; శూన్యుడు = లేనివాడు; అగు = అయిన; పరమున్ = సర్వాతీతుని; కిన్ = కి; గుణాశ్రయమునన్ = సత్వాదుల సంగముచేత; భవ = పుట్టుట; నాశంబులు = మరణములు; వాటిల్లిన = కలిగిన; అట్లు = విధముగ; ఉండున్ = అనిపించును; పట్టి = విచారించి; చూచినన్ = చూసిన; లేవు = లేవు; బాలులార = బాలలూ, అజ్ఞానులారా.
కడగి = ప్రయత్నించి, పూనికతో; త్రిగుణ = సత్వరజస్తమోగుణముల; అత్మకములు = స్వరూపములు; ఐన = అయిన; కర్మముల్ = కర్మల; కున్ = కు; జనకము = జన్మకారణము; ఐ = అయ్యి; వచ్చున్ = కలిగెడి; అజ్ఞాన = అవిద్య యొక్క; సముదయమునున్ = సమూహమును; ఘనతర = అతిగొప్ప {ఘనము - ఘనతరము - ఘనతమము}; జ్ఞాన = జ్ఞానము యనెడి; వహ్ని = అగ్ని; చేన్ = చేత; కాల్చిపుచ్చి = కాల్చేసి; కర్మవిరహితులు = కర్మబంధములు లేనివారు; ఐ = అయ్యి; హరిన్ = నారాయణుని; కనుట = తెలియుట, చూచుట; మేలు = ఉత్తమము.
భావము:- “పిల్లలు! ఈ సంసారం కేవలం బుద్ధి వలననే ఏర్పడుతుంది. ఇది సత్త్వ రజస్తమో గుణాత్మకాలు అయిన కర్మలలో బందీ అయి ఉంటుంది; ఈ సంసారం అన్నది కేవలం స్వప్నం లాంటిది. ఎంతమాత్రం యదార్థం కాదు. సకల కాంక్షలు మనస్సులోనే పుడతాయి. స్వప్నం, మెలకువ ఈ రెండింటికి తేడాయే లేదు. పరమాత్మ గుణాలకు అతీతుడు అయినా, గుణాలను ఆశ్రయించి ఆయన కూడ జననం, మరణం పొందుతున్నట్లు అనిపిస్తుంది. కానీ తరచి చూస్తే పరమాత్మకు జనన మరణాలు లేవు. త్రిగుణాలు వలన ఆవిర్భవించే ఆయా కర్మలకు కారణమైన మనలోని అజ్ఞానాన్ని జ్ఞానం అనే అగ్నితో కాల్చివేయాలి. అలా కర్మ బంధాల నుండి విముక్తులై విష్ణుమూర్తిని కనుగొనటం మంచిది.

తెభా-7-239-వ.
అది గావున, గురుశుశ్రూషయు సర్వలాభసమర్పణంబును సాధుజన సంగమంబును నీశ్వర ప్రతిమా సమారాధనంబును హరికథా తత్పరత్వంబును వాసుదేవుని యందలి ప్రేమయు నారాయణ గుణ కర్మ కథా నామకీర్తనంబును వైకుంఠ చరణకమల ధ్యానంబును విశ్వంభరమూర్తి విలోకన పూజనంబును మొదలయిన విజ్ఞానవైరాగ్య లాభసాధనంబు లైన భాగవతధర్మంబులపై రతి గలిగి సర్వభూతంబుల యందు నీశ్వరుండు భగవంతుం డాత్మఁ గలండని సమ్మానంబు జేయుచుఁ గామ క్రోధ లోభ మోహ మద మత్సరంబులం గెలిచి యింద్రియవర్గంబును బంధించి భక్తి చేయుచుండ నీశ్వరుం డయిన విష్ణుదేవుని యందలి రతి సిద్ధించు.
టీక:- అదిగావున = అందుచేత; గురు = గురువును; శుశ్రూషయున్ = సేవించుట; సర్వ = సమస్తమైన; లాభ = ప్రయోజనములను; సమర్పణంబును = ఈశ్వరార్పణ చేయుట; సాధు = సాదువులైన; జన = వారి; సంగమంబునున్ = చేరిక, చెలిమి; ఈశ్వర = భగవంతుని, విష్ణుమూర్తి; ప్రతిమ = విగ్రహమును; సమారాధనంబును = చక్కగా కొలుచుట; హరి = విష్ణు; కథా = కథల యందు; తత్పరత్వంబును = తదేక నిష్ఠ గలిగి యుండుట; వాసుదేవుని = విష్ణుని {వాసుదేవుడు - వ్యు. వాసుదేవః – సర్వత్రాసౌ వసత్యాత్మ రూపేణ, విశంభరత్వాదితి, (ఆంధ్ర వాచస్పతము) ఆత్మ యందు వసించు దేవుడు, విష్ణువు, శ్రీకృష్ణుడు}; అందలి = ఎడల; ప్రేమయున్ = ప్రేమ; నారాయణ = విష్ణుని {నారాయణుడు - వ్యు. నారం విజ్ఞానం తదయనమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయత యితరః రిజ్క్షయే ధాతుః సనభవతీతి నరః అవినాశ్యాత్మాః, నరసమూహమున నివాసముగలవాడు, హరి}; గుణ = గుణములను; కర్మ = వర్తనములను; కథా = కథలను; నామ = నాములను; సంకీర్తనంబును = స్తోత్రము, పాడుట; వైకుంఠ = విష్ణుని {వైకుంఠుడు - వైకుంఠవాసి, వికుంఠ యను నామె పుత్రుడు, హరి}; చరణ = పాదము లనెడి; కమల = పద్మముల; ధ్యానంబును = ధ్యానించుట; విశ్వంభర = విష్ణుని {విశ్వంభరుడు - విశ్వమును భరించువాడు, విష్ణువు}; మూర్తి = స్వరూపమును; విలోకన = చక్కగా గాంచుట; పూజనంబును = భజించుట; మొదలయిన = మున్నగునవి; విజ్ఞాన = ఉత్తమజ్ఞానము; వైరాగ్య = విషయవైముఖ్యము; లాభ = లభింప జేసెడి; సాధనంబులు = సాధనములు; ఐన = అయిన; భాగవత = భాగవత తత్త్వము యొక్క; ధర్మంబుల్ = ధర్మముల; పైన్ = మీద; రతి = మిక్కిలి మక్కువ; కలిగి = ఉండి; సర్వ = సమస్తమైన; భూతంబుల = జీవుల; అందున్ = లోను; ఈశ్వరుండు = హరి {ఈశ్వరుడు - సర్వలోక నియామకుడు, విష్ణువు}; భగవంతుండు = హరి {భగవంతుడు - గుణషట్కములైన 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యములు కలిగి పూజనీయ మైనవాడు, విష్ణువు}; ఆత్మ = తన ఆత్మలో; కలండు = ఉన్నాడు; అని = అని; సమ్మానంబు = గౌరవించుట; చేయుచున్ = చేయుచు; కామ = కోరిక; క్రోధ = కోపము; లోభ = పిసినారితనము; మోహ = అజ్ఞానము; మద = గర్వము; మత్సరంబులన్ = మాత్యర్యములను; గెలిచి = జయించి, స్వాధీనముచేసికొని; ఇంద్రియవర్గంబును = అంతరింద్రియ బాహ్యేంద్రియములను; బంధించి = వాని యిచ్చచొప్పున పోనీయక; భక్తి = భక్తి; చేయుచుండన్ = చేయుచుండగా; ఈశ్వరుండు = నారాయణుని; విష్ణుదేవుని = నారాయణుని; అందలి = అందు; రతి = ప్రీతి; సిద్ధించు = కలుగును.
భావము:- కాబట్టి, 1) గురువులకు సేవ, 2) సమస్తమైన ఫలితాన్ని భగవంతునికి సమర్పణ, 3) సజ్జనులతో స్నేహం, 4) విష్ణుదేవుని విగ్రహారాధన, 5) శ్రీహరి కథల శ్రవణం, 6) వాసుదేవ మనన, 7) నారాయణ సంకీర్తన, 8) విష్ణు పాద ధ్యానం, 9) హరి దర్శనం మరియు 10) పూజ మున్నగునవి భాగవత ధర్మాలు. ఇవి జ్ఞాన వైరాగ్యములను కలిగిస్తాయి. ఈ భాగవత ధర్మాలు మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఈశ్వరుడైన భగవంతుడే ఆత్మ స్వరూపంతో సర్వ ప్రాణికోటిలోను ఉన్నాడని తెలుసుకుని మనం వాటిని ఆచరించాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం (అరిషడ్వర్గాలు) అను వాటిని జయించి, ఇంద్రియ చాపల్యం అరికట్టాలి. ఆ విధంగా భక్తితో పూజిస్తే భగవంతుడైన విష్ణుభక్తి సిద్ధిస్తుంది.

తెభా-7-240-సీ.
నుజారి లీలావతారంబు లందలి-
శౌర్యకర్మంబులు ద్గుణములు
విని భక్తుఁ డగువాఁడు వేడ్కతోఁ బులకించి-
న్నుల హర్షాశ్రుణము లొలుక
ద్గదస్వరముతోఁ మలాక్ష! వైకుంఠ!-
రద! నారాయణ! వాసుదేవ!
నుచు నొత్తిలిపాడు; నాడు; నాక్రోశించు-
గుఁ; జింతనము జేయు; తి యొనర్చు;

తెభా-7-240.1-తే.
రులు కొని యుండుఁ; దనలోన మాటలాడు;
వేల్పు సోఁకిన పురుషుని వృత్తి దిరుగు;
బంధములఁ బాసి యజ్ఞానటలిఁ గాల్చి
విష్ణుఁ బ్రాపించుఁ; దుది భక్తి వివశుఁ డగుచు.

టీక:- దనుజారి = నారాయణుని; లీలా = వేడకకొఱకైన; అవతారంబులు = అవతారముల; అందలి = లోని; శౌర్య = పరాక్రమపు; కర్మంబులు = చేతలు; సద్గుణములు = మంచిగుణములు; విని = విని; భక్తుడు = ప్రపన్నుడు; అగువాడు = అయ్యెడివాడు; వేడ్కన్ = కౌతుకము; తోన్ = తోటి; పులకించి = గగుర్పాటుచెంది; కన్నులన్ = కళ్ళనుండి; హర్ష = ఆనందపు; అశ్రు = కన్నీటి; కణములు = బిందువులు; ఒలుకన్ = జాలువారగా; గద్గద = డగ్గుతిక; స్వరము = గొంతు; తోన్ = తోటి; కమలాక్ష = హరి {కమలాక్షుడు - కమలములవంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; వైకుంఠ = హరి {వైకుంఠుడు - కుంఠము(ఓటమి) లేనివాడు, హరి}; వరద = హరి {వరద - వరములను యిచ్చువాడు, విష్ణువు}; నారాయణ = హరి {నారాయణ - శబ్దములకు ఆధారభూతుడైన వాడు, విష్ణువు (విద్యార్థి కల్పతరువు)}; వాసుదేవ = హరి {వాసుదేవ - ఆత్మలందు వసించు దేవుడు, విష్ణువు}; అనుచున్ = అనుచు; ఒత్తిలి = గట్టిగా; పాడున్ = పాడును; ఆడున్ = నాట్యము చేయును; ఆక్రోశించున్ = వాపోవును; నగున్ = నవ్వును; చింతనము = ధ్యానము; చేయును = చేయును; నతిన్ = మ్రొక్కుట; ఒనర్చున్ = చేయును.
మరులుకొని = మోహము చెంది; ఉండున్ = ఉండును; తనలోన = తనలోతనే; మాటలాడున్ = మాట్లాడుకొనును; వేల్పు = దయ్యము, పూనకము; సోకిన = పట్టిన, వచ్చిన; పురుషుని = మానవుని; వృత్తిన్ = విధముగ; తిరుగున్ = వర్తించును; బంధములన్ = సాంసారిక బంధనములను; పాసి = తొలగించుకొని; అజ్ఞాన = అవిద్యా; పటలిన్ = సమూహమును; కాల్చి = మసిచేసి; విష్ణున్ = విష్ణుమూర్తిని; ప్రాపించున్ = చెందును, లీనమగును; తుదిన్ = చివరకు; భక్తి = భక్తివలన; వివశుడు = మైమరచినవాడు; అగుచు = అయిపోతూ.
భావము:- భగవంతుని లీలావతారాలలోని పరాక్రమ గాథలు విని భక్తుడైనవాడు పొంగిపోతాడు. సుగుణాలు విని పులకరించి పోతాడు. భక్తి పారవశ్యంతో కళ్ళలో ఆనందభాష్పాలు ఒలుకుతుండగా గద్గద కంఠంతో “కమలాక్షా! వైకుంఠా! వరదా! నారాయణా! వాసుదేవా!” అని గొంతెత్తి పాడతాడు. ఆడతాడు. అరుస్తాడు. నవ్వుతాడు. ఇంకా నమస్కరిస్తాడు. ఎప్పుడు ఆ దేవుడిమీద మోహం కలిగి ఉంటాడు. తనలో తానే మాట్లాడుకుంటాడు. అంతే కాదు దయ్యం పట్టినట్లు తిరుగుతాడు. ఇట్లు భక్తి తత్పరుడు అయి ఉండి, చివరకు కర్మబంధాలను విడిచి, అజ్ఞానం తొలగించుకుని, భక్తి వివశుడై, విష్ణువు నందు ఐక్యం అవుతాడు.

తెభా-7-241-వ.
కావున, రాగాదియుక్త మనస్కుం డయిన శరీరికి సంసారచక్రనివర్తకం బయిన హరిచింతనంబు బ్రహ్మమందలి నిర్వాణసుఖం బెట్టిదట్టి దని బుధులు దెలియుదురు; హరిభజనంబు దుర్గమంబుగాదు; హరి సకల ప్రాణిహృదయంబుల యందు నంతర్యామియై యాకాశంబు భంగి నుండు; విషయార్జనంబుల నయ్యెడిది లేదు; నిమిషభంగుర ప్రాణు లయిన మర్త్యులకు మమతాస్పదంబులును జంచలంబులును నైన పుత్ర మిత్ర కళత్ర పశు భృత్య బల బంధు రాజ్య కోశ మణి మందిర మంత్రి మాతంగ మహీ ప్రముఖ విభవంబులు నిరర్థకంబులు; యాగ ప్రముఖ పుణ్యలబ్ధంబు లైన స్వర్గాదిలోక భోగంబులు పుణ్యానుభవక్షీణంబులు గాని నిత్యంబులు గావు; నరుండు విద్వాంసుండ నని యభిమానించి కర్మంబు లాచరించి యమోఘంబు లయిన విపరీత ఫలంబుల నొందు; కర్మంబులు గోరక చేయవలయు; కోరి చేసిన దుఃఖంబులు ప్రాపించు; పురుషుండు దేహంబుకొఱకు భోగంబుల నపేక్షించు; దేహంబు నిత్యంబు కాదు తోడ రాదు; మృతం బైన దేహంబును శునకాదులు భక్షించు; దేహి కర్మంబు లాచరించి కర్మబద్ధుండయి క్రమ్మఱం గర్మానుకూలంబయిన దేహంబుఁ దాల్చు; నజ్ఞానంబునం జేసి పురుషుండు కర్మదేహంబుల విస్తరించు; నజ్ఞాన తంత్రంబులు ధర్మార్థ కామంబులు; జ్ఞాన లభ్యంబు మోక్షంబు; మోక్షప్రదాత యగు హరి సకల భూతంబులకు నాత్మేశ్వరుండు ప్రియుండు; తన చేత నయిన మహాభూతంబులతోడ జీవసంజ్ఞితుండై యుండు; నిష్కాములై హృదయగతుం డయిన హరిని నిజభక్తిని భజింపవలయు.
టీక:- కావునన్ = కనుక; రాగాది = రాగద్వేషాదులతో {రాగద్వేషాదులు - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము}; యుక్త = కూడిన; మనస్కుండు = మనసు గలవాడు; అయిన = ఐన; శరీరి = జీవుని, దేహి; కిన్ = కి; సంసార = సంసార మనెడి; చక్ర = చక్రమునుండి; నివర్తకంబు = మరల జేయునది; అయిన = ఐన; హరి = నారాయణుని; చింతనంబు = ధ్యానము; బ్రహ్మము = పరబ్రహ్మము; అందలి = లోని; నిర్వాణ = మోక్షము యొక్క; సుఖంబున్ = సుఖము; ఎట్టిద = ఎలాంటిదో; అట్టిది = అలాంటిది; అని = అని; బుధులు = జ్ఞానులు; తెలియుదురు = తెలిసి యుందురు; హరి = నారాయణుని {హరి - భక్తుల హృదయములను ఆకర్షించువాడు, విష్ణువు}; భజనంబు = సేవ; దుర్గమంబు = పొందరానిది; కాదు = కాదు; హరి = విష్ణువు; సకల = అఖిలమైన; ప్రాణి = జీవుల; హృదయంబులు = హృదయముల; అందున్ = లోను; అంతర్యామి = లోన వ్యాపించినవాడు; ఐ = అయ్యి; ఆకాశంబు = ఆకాశము; భంగిన్ = వలె; ఉండున్ = ఉండును; విషయ = ఇంద్రియార్థముల, భోగముల; ఆర్జనంబులన్ = సంపాదించుటవలన; అయ్యెడిది = కలిగెడి లాభము; లేదు = లేదు; నిమిష = రెప్పపాటులో; భంగుర = చెడిపోవు; ప్రాణులు = ప్రాణములు గలవారు; అయిన = ఐన; మర్త్యుల్ = మానవుల {మర్త్యులు - మరణించెడి నైజము గలవారు, మనుషులు}; కున్ = కు; మమతా = నాది యనెడి మోహమునకు; ఆస్పదంబులు = స్థానము లైనవి; చంచలంబులు = అస్థిరములు {చంచలములు - మిక్కిలి చలించెడివి, అస్థిరములు}; ఐన = అయిన; పుత్ర = సంతానము; మిత్ర = స్నేహితులు; కళత్ర = భార్యలు; పశు = గొడ్లు; భృత్య = సేవకులు; బల = సైన్యము; బంధు = చుట్టములు; రాజ్య = రాజ్యాధికారము; కోశ = కోశాగారము; మణి = రత్నాదులు; మందిర = భవనములు; మంత్రి = సచివులు; మాతంగ = ఏనుగులు {మాతంగము - మతంగజము, మతంగుడను ఋషివలన పుట్టినది, ఏనుగు}; మహీ = రాజ్యము, భూములు; ప్రముఖ = మొదలగు ముఖ్యమైన; విభవంబులు = వైభవములు; నిరర్థకంబులు = ప్రయోజనము లేనివి; యాగ = యజ్ఞములు; ప్రముఖ = మొదలగు ముఖ్యమైన; పుణ్య = పుణ్యములవలన; లబ్ధంబులు = దొరకునవి; ఐన = అయిన; స్వర్గ = స్వర్గవాసము; ఆది = మొదలగు; భోగంబులు = భోగములు; పుణ్య = పుణ్యములకు; అనుభవ = అనుభవించుటచే; క్షీణంబులు = తగ్గించెడివి; కాని = తప్పించి; నిత్యంబులు = శాశ్వతములు; కావు = కావు; నరుండు = మానవుడు; విద్వాంసుడను = తెలిసినవాడను; అని = అని; అభిమానించి = అహంకరించి; కర్మంబుల్ = కర్మములను; ఆచరించి = చేసి; అమోఘంబులు = వ్యర్థము గానివి; అయిన = ఐన; విపరీత = ప్రతికూలమైన; ఫలంబులన్ = ఫలితములను; ఒందు = పొందును; కర్మంబులున్ = కర్మలను; కోరక = ఫలాపేక్షలేక; చేయవలయున్ = చేయవలయును; కోరి = ఫలమపేక్షించి; చేసినన్ = చేసినట్లయినచో; దుఃఖంబులు = దుఃఖములు; ప్రాపించున్ = పొందును; పురుషుండు = మానవుడు; దేహంబున్ = శరీరము; కొఱకున్ = కోసము; భోగంబులన్ = స్రక్చందనాదులు {భోగాష్టకములు - 1పుష్పమాలిక 2గంధము 3వస్త్రము 4అన్నము 5శయ్య 6తాంబూలము 7స్త్రీ 8గానములు, స్రక్చందనాదులు}; అపేక్షించి = కోరి; అపేక్షించును = కావాలని కోరును; దేహంబున్ = శరీరము; నిత్యంబు = శాశ్వతమైనది; కాదు = కాదు; తోడన్ = మరణించిన జీవుని వెంబడి; రాదు = రాదు; మృతంబు = ప్రాణములుబాసినది; ఐన = అయిన; దేహంబును = దేహమును; శునక = కుక్కలు; ఆదులు = మొదలగునవి; భక్షించున్ = తినును; దేహి = జీవుడు; కర్మంబులు = కర్మలను; ఆచరించి = చేసి, కూడిచరించి; కర్మ = కర్మములకు; బద్ధుండు = కట్టబడినవాడు; అయి = అయ్యి; క్రమ్మఱన్ = మరల; కర్మా = కర్మములు చేయుటకు; అనుకూలంబు = తగినవి; అయిన = ఐన; దేహంబున్ = శరీరమును; తాల్చున్ = ధరించును; అజ్ఞానంబునన్ = తెలియకపోవుట; చేసి = వలన; పురుషుండు = మానవుడు; కర్మ = కర్మములను; దేహంబులన్ = శరీరములను; విస్తరించున్ = పెంచుకొనును; అజ్ఞాన = అజ్ఞానముచేత; తంత్రంబులు = నడపబడునవి; ధర్మార్థకామంబులు = ధర్మార్థకామములు; జ్ఞాన = జ్ఞానముచేత; లభ్యంబు = దొరకునది; మోక్షంబు = ముక్తిపదము; మోక్ష = పరమపదమును; ప్రదాత = ఇచ్చువాడు; అగు = అయిన; హరి = విష్ణువు; సకల = సమస్తమైన; భూతంబుల్ = జీవుల; కున్ = కు; ఆత్మేశ్వరుండు = ఆత్మరూపుడైన ప్రభువు; ప్రియుండు = మిక్కిలి ఇష్టమైనవాడు; తన = తన; చేతన్ = వలన; అయిన = కల్పితములైన; మహాభూతంబుల్ = భూతపంచకంబు {మహాభూతములు - 1భూమి 2నీరు 3వాయువు 4అగ్ని 5 ఆకాశము అనెడి ఐదు భూతములు}; తోడన్ = తోటి; జీవ = జీవుడు యనెడి; సంజ్ఞితుండు = పేరు గలవాడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; నిష్కాములు = కోరికలు లేనివారు; ఐ = అయ్యి; హృదయ = హృదయము నందు; గతుండు = ఉన్నవాడు; అయిన = ఐన; హరిని = విష్ణుని; నిజ = అచ్చపు; భక్తిని = భక్తితో; భజింపవలయున్ = సేవింపవలయును.
భావము:- కాబట్టి, రాగాదులతో బద్ధుడై కోరికల వలలో పడిన మానవుడికి ఈ సంసార చక్రాన్ని ఛేదించాలి అంటే విష్ణు సంకీర్తన ఒక్కటే ఉపాయం. “పరబ్రహ్మంతో ఐక్యం అయితే అనుభవించే ఆనందం ఎంతటిదో, అంతటి ఆనందాన్ని శ్రీహరి ఆరాధన అందిస్తుంది” అని పండితులు చెప్తారు. మాధవుడిని సేవించటం కష్టమైన పని కాదు. విష్ణువు సమస్త ప్రాణుల హృదయాలలో అంతర్యామి అయి ఆకాశం వలె వ్యాపించి ఉంటాడు. సిరి సంపదలు సంపాదించటం వలన ఏమాత్రం సుఖం లేదు. మానవుల జీవితాలు క్షణభంగురాలు. ఇలాంటి మానవులకు మమత, అనుబంధాలు, పెంచే భార్యాపిల్లలు, బంధుమిత్రులు, మడిమాన్యాలు, పాడిపంటలు, రాజ్య కోశాలు, మణిమందిరాలు, మంత్రులు, మత్తేభాలు మొదలైనవి అన్ని అనవసరమైనవి, అస్థిరమైనవి. యజ్ఞ యాగాదుల వలన లభించే స్వర్గ సుఖాలు శాశ్వతాలు కావు, అవి పుణ్యం క్షీణించగానే నశించేవే. తాను ఘనుడను అనుకుని, మానవుడు తనపై తాను అభిమానం పెంచుకుని, వివిధ కర్మలు ఆచరించి విపరీతమైన ఫలితాలు విశేషంగా పొందుతాడు. కోరికలతో చేసే కర్మలన్నీ దుఃఖాలనే కలిగిస్తాయి. కనుక, ఎటువంటి కోరికలు లేకుండా కర్మలు ఆచరించాలి. దేహం ధరించినవాడు దేహి, దేహి తన దేహం కోసం భోగాలు కోరుకుంటాడు. కానీ, దేహం శాశ్వతమైనది కాదు, తనతో వచ్చేదీ కాదు. ప్రాణం పోగానే ఈ శరీరం కుక్కలు, నక్కలు పాలవటానికి పనికి వస్తుంది అంతే. దేహం ధరించిన వ్యక్తి కర్మలను చేసి, ఆ కర్మలకు బద్ధుడు అయిపోతాడు. మరల ఆ చేసిన కర్మలకు అనుకూలమైన దేహం ధరిస్తాడు. అజ్ఞానం వలన కర్మలు అధికంగా చేయటం, మరల మరల దేహాలు ధరిస్తూ ఉండటం. ఇలా కర్మ దేహాలలో పురుషుడు సంచరిస్తూ ఉంటాడు. అజ్ఞానంతో కూడిన కర్మలు ధర్మార్థకామాలను మాత్రమే అందిస్తాయి. జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ మోక్షాన్ని అందించేవాడు విష్ణువు మాత్రమే. సర్వ ప్రాణికోటికి ఆ మోక్షప్రదాత అయిన శ్రీహరే ఆత్మేశ్వరుడు, ప్రియుడు. తన చేత సృష్టించబడిన పంచభూతాలతో కూడిన వాడై ఆ పరమాత్మే “జీవుడు” అనబడతాడు. కాబట్టి, ప్రతి వ్యక్తీ తమ హృదయంలో ఉండే ఆ భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో నిస్వార్థంగా సేవించాలి.

తెభా-7-242-క.
దావ దైత్య భుజంగమ
మావ గంధర్వ సుర సమాజములో ల
క్ష్మీనాథు చరణకమల
ధ్యానంబున నెవ్వఁడయిన న్యత నొందున్.

టీక:- దానవ = దానవులు; దైత్య = దితిజులు; భుజంగమ = నాగులు; మానవ = మానవులు; గంధర్వ = గంధర్వులు; సుర = దేవతల యొక్క; సమాజము = సమూహముల; లోన్ = అందు; లక్ష్మీనాథు = నారాయణుని {లక్ష్మీనాథడు - లక్ష్మీదేవికి భర్త, విష్ణువు}; చరణ = పాదము లనెడి; కమల = పద్మముల; ధ్యానంబునన్ = చింతనముచేత; ఎవ్వడు = ఎవడు; అయినన్ = అయినను; ధన్యతన్ = కృతార్థత్వంబును; ఒందున్ = పొందును.
భావము:- శ్రీహరి పాదపద్మాలను సేవిస్తే చాలు, దానవులు, దైత్యులు, నాగులు, మానవులు, గంధర్వులు, దేవతలు ఎవరైనా సరే, కృతార్థులు అవుతారు.

తెభా-7-243-క.
చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ
జిక్కఁడు దానముల శౌచశీలతపములం
జిక్కఁడు యుక్తిని భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ!

టీక:- చిక్కడు = దొరకడు; వ్రతములన్ = వ్రతములచేత; క్రతువులన్ = యజ్ఞములుచేత; చిక్కడు = దొరకడు; దానములన్ = దానములుచేయుటచేత; శౌచ = శుచి శుభ్రముల; శీల = మంచినడవడికల; తపములన్ = తపస్సులచేత; చిక్కడు = దొరకడు; యుక్తిని = తెలివిచేత; భక్తిని = భక్తివలన; చిక్కిన = దొరకిన; క్రియన్ = వలె; అచ్యుతుండు = హరి {అచ్యుతుడు - చ్యుతము (జారిపోవుట) లేనివాడు, విష్ణువు}; సిద్ధము = సత్యము; సుండీ = సుమా.
భావము:- భగవంతుడు గాఢ మైన భక్తికి వశమై నట్లు; నోములు, యాగాలు, దానాలు, శుచిత్వాలు, మంచి నడవడికలు, తపస్సులు, యుక్తులు లాంటివి వాటికి వేటికీ వశము కాడు. భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందడానికి సాధనం. భక్తి వినా వేరు మార్గం లేనే లేదు.
దిగజారిపోవడమే లేనట్టి ఉన్నతతమ శాశ్వత స్థితిలో ఉండే భగవంతుడు ఇంకే మార్గంలో పట్టుకుందా మన్నా, బిగించే కొద్దీ వేళ్ళ మధ్యనుండి జారిపోయే నీళ్ళలా జారి పోతుంటాడు. భక్తికి అయితేనే భద్రంగా చిక్కుతాడు.
ఈ పద్యం ఎంతో గొప్పది అని చెప్పవచ్చు. భాగవత తత్వార్థాన్ని చిన్న చిన్న పదాల్లో సిద్దాంతీకరించి భక్తాగ్రేసరు డైన రాక్షసబాలుని నోట ఈ పద్యం రూపంలో ఇలా పలికించాడు పోతన గారు. ప్రహ్లాదుడు సహాధ్యాయులు అయిన రాక్షసబాలురకు తన ప్రపత్తిమార్గ మైన నారదోపదిష్ట భాగవతతత్వాన్ని తెలిపి విష్ణుభక్తి విలక్షణత వివరించాడు.

తెభా-7-244-క.
చాదు భూదేవత్వము
చాదు దేవత్వ మధిక శాంతత్వంబుం
జాదు హరి మెప్పింప వి
శాలోద్యములార! భక్తి చాలిన భంగిన్.

టీక:- చాలదు = సరిపడదు; భూదేవత్వమున్ = బ్రాహ్మణత్వము; చాలదు = సరిపడదు; దేవత్వము = దేవత్వము; అధిక = మిక్కిలి; శాంతత్వంబున్ = సాధుస్వభావము; చాలదు = సరిపోదు; హరిన్ = నారాయణుని; మెప్పింపన్ = మెచ్చునట్లు చేయుటకు; విశాల = గొప్ప; ఉద్యములారా = యత్నము కలవారలారా; భక్తి = భక్తి; చాలిన = సరిపడిన; భంగిని = విధముగ.
భావము:- మంచి శ్రద్ధ గల బాలకులారా! విష్ణువును మెప్పించడానికి భక్తి సరిపోయినట్లు, బ్రాహ్మణత్వం సరిపోదు, దైవత్వం సరిపోదు, గొప్ప శాంత స్వభావమూ చాలదు. విష్ణుదేవుని ప్రసన్నం చేసుకోడానికి భక్తి ఒక్కటే ఉత్తమమైన మార్గం,

తెభా-7-245-ఆ.
నుజ భుజగ యక్ష దైత్య మృగాభీర
సుందరీ విహంగ శూద్ర శబరు
లైనఁ బాపజీవు లైన ముక్తికిఁ బోదు
ఖిల జగము విష్ణుఁ నుచుఁ దలఁచి.

టీక:- దనుజ = రాక్షసులు; భుజగ = సర్పములు; యక్ష = యక్షులు; దైత్య = రాక్షసులు; మృగ = జంతువులు; ఆభీర = గొల్లలు; సుందరీ = స్త్రీలు; విహంగ = పక్షులు; శూద్ర = శూద్రులు; శబర = శబరులు, ఎఱుకలు; ఐన = అయిన; పాప = పాపములు చేసినవా రైన; జీవులు = ప్రాణులు; ఐన = అయినను; ముక్తి = పరమపదమున; కిన్ = కి; పోదురు = వెళ్ళెదరు; అఖిల = సమస్తమైన; జగమున్ = విశ్వము; విష్ణుడు = విష్ణుమూర్తి; అనుచున్ = అనుచు; తలచి = భావించి.
భావము:- దనుజులు, రాక్షసులు, నాగులు, యక్షులు, దైత్యులు, జంతువులు, గొల్లలు, స్త్రీలు, శూద్రులు, శబరులు, ఇంకా ఏ జాతి వారైనా సరే, ఏ పాపజీవనులు అయినా సరే “సర్వం విష్ణుమయం జగత్” అని మనసారా తలచినట్లైతే చాలు, ముక్తిని పొందుతారు.

తెభా-7-246-క.
గురువులు దమకును లోఁబడు
తెరువులు చెప్పెదరు విష్ణు దివ్యపదవికిం
దెరువులు చెప్పరు; చీఁకటిఁ
రువులు పెట్టంగ నేల? బాలకులారా!

టీక:- గురువులు = గురువులు; తమ = తమ; కును = కు; లోబడు = తెలిసిన; తెరువులు = జాడలను; చెప్పెదరు = చెప్పెదరు; విష్ణు = విష్ణుమూర్తి యొక్క {విష్ణువు - (విశ్వమున) వ్యాపించి యుండువాడు, హరి}; దివ్య = దివ్యమైన; పదవికిన్ = స్థానమున; కిన్ = కు; తెరువున్ = దారి; చెప్పరు = తెలుపరు; చీకటిన్ = చీకటిలో; పరువులు = పరుగులు; పెట్టంగన్ = దీయుట; ఏలన్ = దేనికి; బాలకులారా = బాలలూ.
భావము:- బాలలూ! మీ అమాయకత్వం వదలండి. మన ఉపాధ్యాయులు వారికి తెలిసిన చదువులే చెప్పగలరు; చెప్తున్నారు. అంతే కాని దివ్యమైన శ్రీహరి సాన్నిధ్యం పొందటానికి అవసరమైన మార్గాలు చెప్పరు. మనం ఈ గుడ్డి చదువులు చదివి వారి వెంట అజ్ఞానం అనే చీకటిలో పరుగెత్తటం దేనికి? చెప్పండి.

తెభా-7-247-క.
తెం డెల్ల పుస్తకంబులు
నిం డాచార్యులకు మరల నేకతమునకున్
రండు విశేషము చెప్పెదఁ
బొం డొల్లనివారు కర్మపుంజము పాలై.

టీక:- తెండు = తీసుకురండి; ఎల్ల = అన్ని; పుస్తకంబులున్ = పుస్తకములను; ఇండు = ఇవ్వండి; ఆచార్యున్ = గురువు; కున్ = కు; మరల = మళ్ళీ; ఏకతమున్ = ఏకాంతమున కూడుటకు; కున్ = కు; రండు = రండి; విశేషమున్ = ప్రత్యేకతగలదానిని; చెప్పెదన్ = తెలిపెదను; పొండు = వెళ్ళిపోండి; ఒల్లని = అంగీకరించని; వారు = వారు; కర్మ = కర్మముల; పుంజము = సమూహమునకు; పాలు = లోబడి; ఐ = పోయి.
భావము:- ఆ పుస్తకాలు అన్నీ తెచ్చి గురువులకు ఇచ్చేసి రండి. మళ్ళీ మనం ఏకాంతంగా కూర్చుందాం. ఇంకా చాలా మంచి విషయాలు చెప్తాను. ఇష్టంలేనివాళ్ళు వెళ్ళండి. మీ కర్మలు మీరు అనుభవించండి.

తెభా-7-248-క.
డుదము మనము హరిరతిఁ
బాడుద మే ప్రొద్దు విష్ణుద్రయశంబుల్
వీడుదము దనుజసంగతిఁ
గూడుదము ముకుందభక్తకోటిన్ సూటిన్.

టీక:- ఆడుదము = ఆడుకొనెదము; మనము = మనము; హరి = విష్ణుని యందలి {హరి - భక్తుల హృదయమును ఆకర్షించువాడు, విష్ణువు}; రతిన్ = ప్రీతిచేత; పాడుదము = పాడుదము; ఏ = అన్ని; ప్రొద్దున్ = వేళ నైనను; విష్ణు = హరి; భద్ర = మంగళకరములైన; యశంబుల్ = కీర్తులు; వీడుదము = వదలివేసెదము; దనుజ = రాక్షసులతోడి; సంగతిన్ = చెలిమిని, సాంగత్యమును; కూడుదము = కలిసెదము ; ముకుంద = విష్ణుని {ముకుందుడు - ముక్తిని యిచ్చువాడు, విష్ణువు}; భక్త = భక్తుల; కోటిన్ = సమూహమును; సూటిన్ = సూటిగా.
భావము:- మనం శ్రీహరి మీది చిత్తముతో ఆడుకుందాం రండి. మాధవుడిని మనసు నిండా నింపుకుని హరిసంకీర్తనలు పాడుకుందాం. మిగిలిన రాక్షసుల స్నేహం విడిచిపెడదాం. నిర్భయంగా విష్ణుభక్తులతో చేరిపోదాం రండి.

తెభా-7-249-క.
విత్తము సంసృతిపటలము
వ్రత్తము కామాదివైరిర్గంబుల నేఁ
డిత్తము చిత్తము హరికిని
జొత్తము నిర్వాణపదము శుభ మగు మనకున్."

టీక:- విత్తము = విదళించెదము; సంసృతి = సంసార; పటలమున్ = కూటమిని; వ్రత్తము = చీల్చెదము; కామాదివైరివర్గంబులన్ = అరిషడ్వర్గములను {అరిషడ్వర్గములు - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు యనెడి ఆరుశత్రువులకూటములు}; నేడు = ఇప్పుడు; ఇత్తము = అప్పజెప్పెదము; చిత్తము = మనస్సును; హరి = విష్ణుని; కిని = కి; చొత్తము = చేరుదము; నిర్వాణపదమును = పరమపదమును; శుభము = క్షేమము; అగున్ = కలుగును; మన = మన; కున్ = కు.
భావము:- ఈ సంసారం అనే మాయా బంధాన్ని తొలగించుకుందాం. అరిషడ్వర్గాలు అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఈ ఆరు శత్రువర్గాలను చీల్చి చెండాడుదాం. చిత్తం శ్రీహరికి సమర్పిద్దాం. కైవల్య పదాన్ని అందుకుందాం. మనకు తప్పక శుభం కలుగుతుంది."

తెభా-7-250-వ.
అని యిట్లు ప్రహ్లాదుండు రహస్యంబున న య్యైవేళల రాక్షస కుమారులకు నపవర్గమార్గం బెఱింగించిన; వారును గురుశిక్షితంబులైన చదువులు చాలించి నారాయణభక్తి చిత్తంబులం గీలించి యుండుటం జూచి వారల యేకాంతభావంబు దెలిసి వెఱచి వచ్చి శుక్రనందనుండు శక్రవైరి కిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు {ప్రహ్లాదుడు - మిక్కిలి హ్లాదము (సంతోషము)గలవాడు, హిరణ్యకశిపుని పుత్రుడు}; రహస్యంబునన్ = ఏకాంతములో; అయ్యై = ఆయా; వేళలన్ = సమయములందు; రాక్షస = రాక్షస; కుమారుల్ = పిల్లల; కున్ = కు; అపవర్గ = మోక్షపు; మార్గంబున్ = మార్గమును; ఎఱింగిచినన్ = తెలుపగా; వారును = వారుకూడ; గురు = గురువుచే; శిక్షితంబులు = నేర్పబడినవి; ఐన = అయిన; చదువులున్ = శాస్త్రాధ్యయనములను; చాలించి = ఆపివేసి; నారాయణ = విష్ణుని; భక్తిన్ = భక్తిని; చిత్తంబులన్ = మనసులలో; కీలించి = నాటుకొనజేసి; ఉండుటన్ = ఉండుటను; చూచి = తెలిసికొని; వారల = వారియొక్క; ఏకాంత = అంతరంగిక; భావంబున్ = ఆలోచనలు; తెలిసి = తెలిసికొని; వెఱచి = బెదిరిపోయి; వచ్చి = దగ్గరకు వచ్చి; శుక్రనందనుండు = శుక్రాచార్యుని కొడుకు; శక్రవైరి = హిరణ్యకశిపున {శక్రవైరి - శక్రుడు (ఇంద్రుడు) యొక్క వైరి (శత్రువు), హిరణ్యకశిపుడు}; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని ఇలా రహస్యంగా ప్రహ్లాదుడు అనేక విధాలుగా, అనేక అనుకూలమైన సమయాలలో రాక్షస కుమారులకు మోక్ష మార్గాన్ని బోధించసాగాడు. అప్పుడు వాళ్ళందరు గురువులు దగ్గర చెప్పే తమ చదువులను ఆపేశారు. తమ హృదయాలను శ్రీమన్నారాయణుని వైపు మళ్లించారు. భక్తి మార్గం పట్టారు. ఇది వాళ్ళ గురువులు గమనించారు, శిష్యుల భావాలు తెలుసుకుని భయపడ్డారు. శుక్రాచార్యుని కొడుకులు చండామార్కులు తమ మహారాజు, ఇంద్రుడి శత్రువు అయిన హిరణ్యకశిపుడి వద్దకు చేరి ఇలా అన్నారు.

తెభా-7-251-శా.
"క్షో బాలుర నెల్ల నీ కొడుకు చేరంజీరి లోలోన నా
శిక్షామార్గము లెల్ల గల్ల లని యాక్షేపించి తా నందఱన్
మోక్షాయత్తులఁ జేసినాఁడు మనకున్ మోసంబు వాటిల్లె; నీ
క్షత్వంబునఁ జక్కఁజేయవలయున్ దైతేయవంశాగ్రణీ!

టీక:- రక్షస్ = రాక్షస; బాలురన్ = బాలలను; ఎల్లన్ = అందరను; నీ = నీ; కొడుకు = పుత్రుడు; చేరన్ = దగ్గరకు; చీరి = పిలిచి; లోలోనన్ = రహస్యముగా; నా = నా యొక్క; శిక్షా = ఉపదేశ; మార్గములు = విధానములు; ఎల్లన్ = అన్నియు; కల్లలు = అసత్యములు; అని = అని; ఆక్షేపించి = దూరి; తాన్ = తను; అందఱన్ = అందరిని; మోక్ష = ముక్తిమార్గమునకు; ఆయత్తులను = ఆసక్తులుగా; చేసినాడు = చేసెను; మన = మన; కున్ = కు; మోసంబు = కీడు; వాటిల్లెన్ = కలిగినది; నీ = నీ యొక్క; దక్షత్వంబునన్ = సామర్థ్యమున; చక్కజేయవలయును = సరిదిద్దవలెను; దైతేయవంశాగ్రణీ = హిరణ్యకశిపుడా {దైతేయవంశాగ్రణి - దైతేయ (దితిజులైన రాక్షస) వంశమునకు అగ్రణి (గొప్పవాడు), హిరణ్యకశిపుడు}.
భావము:- “ఓ దైత్య కుల శిరోమణి! హిరణ్యకశిప మహారాజా! నీ కుమారుడు రాక్షస కుమారులను అందరినీ రహస్య ప్రదేశాలకు తీసుకు వెళ్లి, నేను చెప్పే చదువులు అన్నీ బూటకములు అని ఆక్షేపించాడు. రాక్షస విద్యార్థులకు అందరికి మోక్షమార్గం బోధిస్తున్నాడు. మనకు తీరని ద్రోహం చేస్తున్నాడు. మరి నీవు ఏం చేస్తావో! చూడు. నీ కొడుకు దుడుకుతనం మితిమీరిపోతోంది. పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. ఇక వాడిని చక్కబెట్టటానికి నీ సామర్థ్యం వాడాల్సిందే.

తెభా-7-252-క.
"ఉల్లసిత విష్ణుకథనము
లెల్లప్పుడు మాఁకు జెప్పఁ"డీ గురుఁ డని న
న్నుల్లంఘించి కుమారకు
లొల్లరు చదువంగ దానవోత్తమ! వింటే.

టీక:- ఉల్లసిత = ఉల్లాసవంతమైన; విష్ణు = విష్ణుని; కథనములు = గాథలు; ఎల్లప్పుడున్ = ఎప్పుడును; మా = మా; కున్ = కు; చెప్పడు = చెప్పడు; ఈ = ఈ; గురుడు = గురువు; అని = అని; నన్నున్ = నన్ను; ఉల్లంఘించి = అతిక్రమించి; కుమారకులు = పిల్లలు; ఒల్లరు = ఇష్టపడరు; చదువంగన్ = చదువుటకు; దానవోత్తమ = రాక్షసులలో ఉత్తముడా; వింటే = విన్నావా.
భావము:- ఓ దానవశ్రేష్ఠుడా! వింటున్నావు కదా! శిష్యులు “ఈ గురువు మనకు మనోహరమైన మాధవుని కథలు చెప్పడు” అని అనుకుంటూ, నన్నూ నా మాటలు లెక్కచేయటం మానేశారు. నేను చెప్పే చదువులు చదవటం మానేశారు. ఇదీ పరిస్థితి.

తెభా-7-253-క.
డుగఁడు మధురిపుకథనము
విడివడి జడుపగిదిఁ దిరుగు వికసనమున నే
నొడివిన నొడువులు నొడువఁడు
దుడుకనిఁ జదివింప మాకు దుర్లభ మధిపా!

టీక:- ఉడుగడు = మానడు; మధురిపు = హరి {మధురిపుడు - మధువనెడి రాక్షసునికి రిపుడు (శత్రువు), విష్ణువు}; కథనము = కీర్తనమును; విడివడి = కట్టుబాటునుండి తొలగి; జడున్ = మందుని; పగిదిన్ = వలె; తిరుగు = తిరుగుచుండును; వికసనమున = వికాసముతో; నేన్ = నేను; నొడవిన = చెప్పిన; నొడువులు = చదువులు; నొడువడు = చదవడు; దుడుకనిన్ = దుష్టుని; చదివింపన్ = చదివించుట; మా = మా; కున్ = కు; దుర్లభము = శక్యముకానిది; అధిపా = రాజా.
భావము:- ఓ మహారాజా! నీ కొడుకు ప్రహ్లాదుడు ఎవరు ఎన్ని చెప్పినా మధు దానవుని పాలిటి శత్రువు అయిన ఆ విష్ణువు గురించి చెప్పటం మానడు. ఎప్పుడూ మందమతిలా తిరుగుతూ ఉంటాడు. మనోవికాసం కోసం నేను చెప్పే మంచి మాటలు వినిపించుకోడు. చెప్పిన మాట విననే వినడు. ఇలాంటి దుడుకు వాడిని చదివించటం మా వల్ల కాదు.

తెభా-7-254-క.
చొక్కపు రక్కసికులమున
వెక్కురు జన్మించినాఁడు విష్ణునియందున్
నిక్కపు మక్కువ విడువం
డెక్కడి సుతుఁ గంటి రాక్షసేశ్వర! వెఱ్ఱిన్."

టీక:- చొక్కపు = స్వచ్ఛమైన; రక్కసి = రాక్షస; కులమున = వంశమున; వెక్కురు = వికారము పుట్టిన వాడు; జన్మించినాడు = పుట్టినాడు; విష్ణుని = హరి; అందున్ = ఎడల; నిక్కపు = సత్యమైన; మక్కువ = ప్రీతి; విడువండు = వదలడు; ఎక్కడి = ఎలాంటి; సుతున్ = పుత్రుని; కంటి = పుట్టించితివి; రాక్షసేశ్వరా = రాక్షసరాజా; వెఱ్ఱిన్ = వెఱ్ఱివాడిని.
భావము:- స్వచ్ఛమైన రాక్షస వంశంలో వికృతమైనవాడు పుట్టాడు. ఎంత చెప్పిన విష్ణువుమీద మమత వదలడు. ఎంత చక్కని కొడుకును కన్నావయ్యా హిరణ్యకశిపమహారాజ!

తెభా-7-255-వ.
అని యిట్లు గురుసుతుండు చెప్పినఁ గొడుకువలని విరోధవ్యవహారంబులు గర్ణరంధ్రంబుల ఖడ్గప్రహారంబు లయి సోఁకిన; బిట్టు మిట్టిపడి పాదాహతంబైన భుజంగంబు భంగిఁ బవనప్రేరితంబైన దవానలంబు చందంబున దండతాడితం బయిన కంఠీరవంబుకైవడి భీషణ రోషరసావేశ జాజ్వల్యమాన చిత్తుండును బుత్రసంహారోద్యోగాయత్తుండును గంపమాన గాత్రుండును నరుణీకృత నేత్రుండును నై కొడుకును రప్పించి సమ్మానకృత్యంబులు దప్పించి నిర్దయుండై యశనిసంకాశ భాషణంబుల నదల్చుచు.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; గురుసుతుండు = గురువగు శుక్రుని కొడుకు; చెప్పినన్ = చెప్పగా; కొడుకు = కొడుకు; వలని = మూలమునైన; విరోధ = అయిష్ట; వ్యవహారంబులున్ = వర్తనలు; కర్ణ = చెవుల; రంధ్రంబులన్ = కన్నములను; ఖడ్గ = కత్తి; ప్రహారంబుల్ = వ్రేటులు; అయి = అయ్యి; సోకినన్ = తగులగా; బిట్టు = మిగుల; మిట్టిపడి = అదిరిపడి; పాదా = కాలిచే; ఆహతంబున్ = తన్నబడినది; ఐన = అయిన; భుజంగంబు = పాము; భంగిన్ = వలె; పవన = గాలిచే; ప్రేరితంబు = రగుల్కొల్పబడినది; ఐన = అయిన; దవానలంబు = కార్చిచ్చు; చందంబునన్ = వలె; దండ = కఱ్ఱతో; తాడితంబు = కొట్టబడినది; అయిన = ఐన; కంఠీరవంబు = సింహము; కైవడి = వలె; భీషణ = భయంకరమైన; రోషరస = కోపము; ఆవేశ = ఆవేశించుటచే; జాజ్వల్యమాన = మండుతున్న; చిత్తుండును = మనసు గలవాడును; పుత్ర = కొడుకును; సంహార = చంపెడి; ఉద్యోగ = ప్రయత్నము నందు; ఆయత్తుండును = లగ్నమైన వాడును; కంపమాన = వణకుచున్న; గాత్రుండును = మేనుగలవాడును; అరుణీకృత = ఎఱ్ఱగాచేయబడిన; నేత్రుండును = కన్నులు గలవాడును; ఐ = అయ్యి; కొడుకును = పుత్రుని; రప్పించి = రప్పించి; సమ్మాన = గౌరవింపు; కృత్యంబులున్ = చేతలు; తప్పించి = తప్పించి; నిర్దయుండు = కరుణమాలిన వాడు; ఐ = అయ్యి; అశని = పిడుగుల; సంకాశ = పోలిన; భాషణంబులన్ = మాటలతో; అదల్చుచు = బెదరించుచు.
భావము:- అని శుక్రాచార్యుని కొడుకు, ప్రహ్లాదుడి గురువు అన్నాడు. తన విరోధి విష్ణుమూర్తి మీద భక్తితో కూడిన స్వంత కొడుకు వ్యవహారాల గురించి వింటుంటే హిరణ్యకశిపుడికి చెవులలో కత్తులు గ్రుచ్చినట్లు అనిపించింది; రాక్షసేంద్రుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు; తోకత్రొక్కిన పాములాగా, గాలికి చెలరేగిన కార్చిచ్చులాగా, దెబ్బతిన్న సింహంలాగా భయంకరమైన కోపంతో భగభగమండిపడిపోతూ, కన్నకొడుకును సంహరించాడానికి సిద్ధమయ్యాడు; కోపావేశంతో శరీరం ఊగిపోతోంది; కళ్ళు చింతనిప్పుల్లా ఎఱ్ఱబడుతున్నాయి; వెంటనే కొడుకును రప్పించాడు; వచ్చిన రాజకుమారుడిపై ఆదర ఆప్యాయతలు చూపలేదు; పైగా కఠినాత్ముడైన ఆ హిరణ్యకశిపుడు పలుకులలో పిడుగు కురిపిస్తూ, బెదిరించసాగాడు.

తెభా-7-256-శా.
సూనున్ శాంతగుణ ప్రధాను నతి సంశుద్ధాంచిత జ్ఞాను న
జ్ఞానారణ్య కృశాను నంజలిపుటీ సంభ్రాజమానున్ సదా
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద నా
ధీనున్ ధిక్కరణంబుజేసి పలికెన్ దేవాహితుం డుగ్రతన్.

టీక:- సూనున్ = పుత్రుని; శాంతగుణ = శాంతగుణములు; ప్రధానున్ = ముఖ్యముగాగలవానిని; అతి = మిక్కిలి; సంశుద్ధ = పరిశుద్ధమైన; అంచిత = పూజనీయమైన; జ్ఞానున్ = జ్ఞానముగలవానిని; అజ్ఞాన = అజ్ఞానము యనెడి; అరణ్య = అరణ్యమునకు; కృశానున్ = చిచ్చువంటివానిని; అంజలిపుటీ = ప్రణామాంజలిచే; సంభ్రాజమానున్ = ప్రకాశించువానిని; సదా = ఎల్లప్పుడును; శ్రీనారాయణ = శ్రీహరి యొక్క; పాద = పాదములు యనెడి; పద్మ = పద్మముల; యుగళీ = జంట యెడల; చింతా = ధ్యానము యనెడి; అమృత = అమృతమును; ఆస్వాదన = స్వీకరించుటయందు; అధీనున్ = లోనైనవానిని; ధిక్కరణంబు = తిరస్కారము; చేసి = చేసి; పలికెన్ = పలికెను; దేవాహితుండు = హిరణ్యకశిపుడు {దేవాహితుడు - దేవతలకు అహితుడు (శత్రువు), హిరణ్యకశిపుడు}; ఉగ్రతన్ = క్రూరత్వముతో.
భావము:- ఆ ప్రహ్లాదుడు మహాశాంతమూర్తి, గొప్ప గుణవంతుడూ; బహు పరిశుద్ధమైన జ్ఞానం అనే సంపదకు గనిలాంటి వాడు; అజ్ఞానం అనే అరణ్యానికి అగ్నిలాంటివాడు; నిరంతరం చేతులు జోడించి మనసులో పరంధాముని పాదపద్మాలనే ధ్యానిస్తూ ఉండేవాడు; అటువంటి సకల సద్గుణ సంశీలుడిని కన్న కొడుకును ధిక్కరించి, కోపించి; విబుధవిరోధి యైన హిరణ్యకశిపుడు ఇలా విరుచుకుపడ్డాడు.

తెభా-7-257-సీ.
"స్మదీయం బగు నాదేశమునఁ గాని-
మిక్కిలి రవి మింట మెఱయ వెఱచు;
న్ని కాలములందు నుకూలుఁడై కాని-
విద్వేషి యై గాలి వీవ వెఱచు;
త్ప్రతాపానల మందీకృతార్చి యై-
విచ్చలవిడి నగ్ని వెలుఁగ వెఱచు;
తిశాత యైన నా యాజ్ఞ నుల్లంఘించి-
మనుండు ప్రాణులఁ జంప వెఱచు;

తెభా-7-257.1-తే.
నింద్రుఁ డౌదల నా మ్రోల నెత్త వెఱచు;
మర కిన్నర గంధర్వ క్ష విహగ
నాగ విద్యాధరావళి నాకు వెఱచు;
నేల వెఱువవు పలువ! నీ కేది దిక్కు.

టీక:- అస్మదీయంబు = నాది; అగు = అయిన; ఆదేశమునన్ = ఆజ్ఞచేత; కాని = తప్పించి; మిక్కిలి = అధికముగా; రవి = సూర్యుడు; మింటన్ = ఆకాశమున; మెఱయన్ = ప్రకాశించుటకు; వెఱచున్ = బెదురును; అన్ని = అన్ని; కాలములు = ఋతువుల; అందున్ = లోను; అనుకూలుండు = అనుకూలముగా నుండువాడు; ఐ = అయ్యి; కాని = తప్పించి; విద్వేషి = అహితుడు; ఐ = అయ్యి; గాలి = వాయువు; వీవన్ = వీచుటకు; వెఱచున్ = బెదురును; మత్ = నా యొక్క; ప్రతాప = పరాక్రమము యనెడి; అనల = అగ్నిచే; మందీకృత = మందగింపబడిన వాడు; ఐ = అయ్యి; విచ్చలవిడిన్ = తన యిచ్చానుసారము; అగ్ని = అగ్ని; వెలుగన్ = మండుటకు; వెఱచున్ = బెదరును; అతి = మిక్కిలి; శాత = తీవ్రమైనది; ఐన = అయిన; నా = నా యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; ఉల్లంఘించి = అతిక్రమించి; శమనుండు = యముడు {శమనుండు - పాపములను శమింప చేయువాడు, యముడు}; ప్రాణులన్ = జీవులను; చంపన్ = సంహరించుటకు; వెఱచున్ = బెదరును; ఇంద్రుడు = ఇంద్రుడు; ఔదల = తలను.
నా = నా యొక్క; మ్రోలన్ = ఎదుట; ఎత్తన్ = ఎత్తుటకు; వెఱచున్ = బెదరును; అమర = దేవతల; కిన్నర = కిన్నరల; గంధర్వ = గంధర్వుల; యక్ష = యక్షుల; విహగ = పక్షుల; నాగ = సర్పముల; విద్యాధరా = విద్యాధరుల; ఆవళి = సమూహములు; వెఱచున్ = బెదరును; ఏల = ఎందుకు; వేఱవవు = బెదరవు; పలువ = దుర్జనుడా; నీ = నీ; కున్ = కు; ఏది = ఎక్కడ ఉన్నది; దిక్కు = రక్షించెడి ప్రాపు.
భావము:- "ఓ దుష్టుడా! నా ఆజ్ఞ లేకుండా ఆకాశంలో ఆదిత్యుడు కూడా గట్టిగా ప్రకాశించడానికి బెదురుతాడు; వాయువు కూడా అన్ని కాలాలలోనూ అనుకూలంగానే వీస్తాడు తప్పించి అహితుడుగా వీచటానికి భయపడతాడు; అగ్నిహోత్రుడు కూడా దేదీప్యమానమైన నా ప్రతాపం ముందు మందంగా వెలుగుతాడు తప్పించి, ఇష్టానుసారం చెలరేగి మండటానికి భయపడతాడు; పాపులను శిక్షించే యముడు కూడా బహు తీక్షణమైన నా ఆజ్ఞను కాదని ప్రాణుల ప్రాణాలు తీయటానికి వెరుస్తాడు; ఇంద్రుడికి కూడా నా ముందు తల యెత్తే ధైర్యం లేదు; దేవతలైనా, కిన్నరులైనా, యక్షులైనా, పక్షులైనా, నాగులైనా, గంధర్వులైనా, విద్యాధరులైనా, నేనంటే భయపడి పారిపోవలసిందే; అలాంటిది నువ్వు ఇంత కూడా లేవు. నేనంటే నీకు భయం ఎందుకు లేదు? ఇక్కడ నీకు దిక్కు ఎవరు? ఎవరి అండ చూసుకుని ఇంత మిడిసిపడి పోతున్నావు?

తెభా-7-258-శా.
ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంద్ధ్వేషు లయ్యున్ మదీ
యాజ్ఞాభంగము చేయ నోడుదురు రోషాపాంగదృష్టిన్ వివే
జ్ఞానచ్యుత మై జగత్త్రితయముం గంపించు నీ విట్టిచో
నాజ్ఞోల్లంఘన మెట్లు చేసితివి? సాహంకారతన్ దుర్మతీ!

టీక:- ప్రజ్ఞావంతులు = శక్తియుక్తులు గలిగిన; లోకపాలకులు = ఇంద్రుడు మొదలగువారు; శుంభత్ = వృద్ధినొందుతున్న; ద్వేషులు = పగ గలవారు; అయ్యున్ = అయినప్పటికిని; మదీయ = నా యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; భంగము = దాటుట; చేయన్ = చేయుటకు; ఓడుదురు = బెదరెదరు; రోష = రోషముతో; అపాంగ = కడకంటి; దృష్టిన్ = చూపువలన; వివేక = మంచి చెడ్డల నెరిగెడి; జ్ఞాన = తెలివి; చ్యుతము = జారినది; ఐ = అయ్యి; జగత్త్రితయమున్ = ముల్లోకములు {ముల్లోకములు - భూలోకము స్వర్గలోకము పాతాళలోకము}; కంపించున్ = వణకిపోవును; నీవు = నీవు; ఇట్టిచోన్ = ఇలాంటి పరిస్థితిలో; ఆజ్ఞన్ = ఆజ్ఞను; ఉల్లంఘనమున్ = దాటుట; ఎట్లు = ఎలా; చేసితివి = చేసితివి; సాహంకారతన్ = పొగరుబోతుతనముతో; దుర్మతీ = చెడ్డబుద్ధి గలవాడా.
భావము:- దుర్బుద్ధీ! మహా ప్రతాపవంతులు అయిన దిక్పాలకులు, నా మీద ఎంత ద్వేషం పెంచుకుంటున్నా కూడా, నా మాట జవదాటటానికి బెదురుతారు; నేను కోపంతో కడకంట చూసానంటే చాలు, ముల్లోకాలూ వివేక, విజ్ఞానాలు కోల్పోయి అల్లకల్లోలం అవుతాయి; అలాంటిది, అహంకారంతో నువ్వు నా ఆజ్ఞను ఎలా ధిక్కరిస్తున్నావు?

తెభా-7-259-శా.
కంక్షోభము గాఁగ నొత్తిలి మహాగాఢంబుగా డింభ! వై
కుంఠుం జెప్పెదు దుర్జయుం డనుచు వైకుంఠుండు వీరవ్రతో
త్కంఠాబంధురుఁ డేని నే నమరులన్ ఖండింప దండింపఁగా
గుంఠీభూతుఁడు గాక రావలదె మద్ఘోరాహవక్షోణికిన్.

టీక:- కంఠ = గొంతు; క్షోభము = నొప్పిపెట్టినది; కాగన్ = అయ్యేలా; ఒత్తిలి = గట్టిగా; మహా = మిక్కిలి; గాఢంబుగా = తీవ్రముగా; డింభ = కుఱ్ఱవాడా; వైకుంఠున్ = విష్ణుని; చెప్పెదు = చెప్పెదవు; దుర్జయుండు = జయింపరానివాడు; అనుచున్ = అనుచు; వైకుంఠుండు = విష్ణువు {వైకుంఠుడు - కుంఠము (ఓటమి) లేనివాడు, విష్ణువు}; వీరవ్రత = యుద్ధము నందలి; ఉత్కంఠా = వేడుక; ఆబంధురుడు = దట్టముగా గలవాడు; ఏని = అయినచో; నేన్ = నేను; అమరులన్ = దేవతలను {అమరులు - మరణము లేనివారు, దేవతలు}; ఖండింపన్ = నరకుచుండగా; దండింపగాన్ = శిక్షించుచుండగా; కుంఠీభూతుడు = వెనకకి తగ్గువాడు; కాక = కాకుండగ; రా = రా; వలదె = వద్దా; మత్ = నా యొక్క; ఘోర = భయంకరమైన; ఆహవ = యుద్ధ; క్షోణికిన్ = రంగమునకు.
భావము:- అర్భకా! వైకుంఠనాథుడైన విష్ణువుపై విజయం వీలుకాదు అంటూ గొంతు చించుకుని గట్టిగా తెగ అరుస్తున్నావు కానీ, అతనికే పౌరుషం వీరత్వం ఉంటే, నేను యుద్ధరంగంలో దేవతలను ఖండించేటప్పుడూ, దండించేటప్పుడూ భయపడకుండా వాళ్ళను రక్షించడానికి, నా ముందుకు రావాలి కదా?

తెభా-7-260-శా.
చార్యోక్తము గాక బాలురకు మోక్షాసక్తిఁ బుట్టించి నీ
వాచాలత్వముఁ జూపి విష్ణు నహితున్ ర్ణించి మ ద్దైత్య వం
శాచారంబులు నీఱు చేసితివి మూఢాత్ముం గులద్రోహి నిన్
నీచుం జంపుట మేలు చంపి కులమున్ నిర్దోషముం జేసెదన్.

టీక:- ఆచార్య = గురువుచేత; ఉక్తము = చెప్పబడినది; కాక = కాకుండగ; బాలుర = పిల్లల; కున్ = కు; మోక్ష = ముక్తిపదమందు; ఆసక్తిన్ = ఆసక్తిని; పుట్టించి = కలిగించి; నీ = నీ యొక్క; వాచాలత్వమున్ = వాగుడును; చూపి = చూపించి; విష్ణున్ = హరిని; అహితున్ = శత్రువును; వర్ణించి = పొగడి; మత్ = నా; దైత్య = రాక్షస; వంశ = కులపు; ఆచారంబులున్ = ఆచారములను; నీఱు = బూడిద; చేసితివి = చేసితివి; మూఢాత్మున్ = మూర్ఖుడను; కుల = వంశమునకు; ద్రోహిన్ = ద్రోహము చేయువాడను; నిన్ = నిన్ను; నీచున్ = నీచుడను; చంపుట = సంహరించుట; మేలు = మంచిది, ఉత్తమము; చంపి = సంహరించి; కులమున్ = వంశమును; నిర్దోషమున్ = దోషములేనిదిగా; చేసెదన్ = చేసెదను.
భావము:- ఆచార్యులు చెప్పింది నువ్వు వినటంలేదు. పైగా నీ తోటి విద్యార్థులకు కైవల్యం మీద కాంక్ష పుట్టిస్తున్నావు; నీ వాచాలత్వం చూపించి మన విరోధి విష్ణువును విపరీతంగా పిచ్చిమాటలతో పొగడుతున్నావు; మన రాక్షస వంశ సంప్రదాయాలు అన్నీ బూడిదపాలు చేశావు; నువ్వు కులద్రోహివి; మూఢుడివి; నీచుడివి; నీవంటి వాడిని చంపడమే మంచిపని. నిన్ను చంపి నా వంశానికి మచ్చరాకుండా చేస్తాను.

తెభా-7-261-క.
దిక్కులు గెలిచితి నన్నియు
దిక్కెవ్వఁడు? రోరి! నీకు దేవేంద్రాదుల్
దిక్కుల రాజులు వేఱొక
దిక్కెఱుఁగక కొలుతు రితఁడె దిక్కని నన్నున్."

టీక:- దిక్కులు = దిక్కుల చివర వరకు; గెలిచితిన్ = జయించితి; అన్నియున్ = సర్వమును; దిక్కు = శరణు; ఎవ్వడు = ఎవడు; ఓరి = ఓరి; నీ = నీ; కున్ = కు; దేవేంద్ర = ఇంద్రుడు; ఆదుల్ = మొదలగువారు; దిక్కులరాజులు = దిక్పాలకులు {దిక్పాలకులు - 1ఇంద్రుడు (తూర్పు) 2అగ్నిదేవుడు (ఆగ్నేయము) 3యముడు (దక్షిణము) 4నిరృతి (నైరృతి) 5పడమర (వరుణుడు) 6వాయువు (వాయవ్యము) 7ఉత్తరము (కుబేరుడు) 8ఈశాన్యము (ఈశానుడు)}; వేఱొక = మరింకొక; దిక్కు = ప్రాపు, శరణు; ఎఱుగక = తెలియక; కొలుతురు = సేవింతురు; ఇతడె = ఇతడు మాత్రమే; దిక్కు = శరణు; అని = అని; నన్నున్ = నన్ను.
భావము:- ఓరీ! అన్ని దిక్కుల చివర్ల వరకూ ఉన్న రాజ్యాలన్నీ గెలిచాను. దేవేంద్రాది దిక్పాలుకులు అందరూ ఏ దిక్కూలేక ఇప్పుడు నన్నే దిక్కని తలచి మ్రొక్కుతున్నారు. ఇక నన్ను కాదని నీకు రక్షగా వచ్చేవాడు ఎవడూ లేడని తెలుసుకో.

తెభా-7-262-క.
వంతుఁడ నే జగముల
ములతోఁ జనక వీరభావమున మహా
లుల జయించితి నెవ్వని
మున నాడెదవు నాకుఁ బ్రతివీరుఁడ వై."

టీక:- బలవంతుడ = శక్తిశాలిని; నేన్ = నేను; జగములన్ = లోకములను; బలముల = సైన్యముల; తోన్ = తోటి; చనక = వెళ్ళక; వీరభావమునన్ = శూరత్వముతో; మహా = మిగుల; బలులన్ = బలవంతులను; జయించితిన్ = నెగ్గితిని; ఎవ్వని = ఎవని; బలమునన్ = దన్నుతో; ఆడెదవు = పలికెదవు; నా = నా; కున్ = కు; ప్రతివీరుడవు = ఎదిరించెడి శూరుడవు; ఐ = అయ్యి.
భావము:- బాలకా! ప్రహ్లాద! లోకా లన్నిటిలో నేనే అందరి కన్నా బలవంతుణ్ణి; సేనా సహాయం ఏం లేకుండానే ఒంటరిగా వెళ్ళి ఎందరో బలశాలుల్ని గెలిచిన శూరుణ్ణి; అలాంటి నాకు సాటి రాగల వీరుడిలా, ఎవరి అండ చూసుకొని, ఎదురు తిరుగుతున్నావు."

తెభా-7-263-వ.
అనినఁ దండ్రికి మెల్లన వినయంబునఁ గొడు కిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; తండ్రి = తండ్రి; కిన్ = కి; మెల్లన = మెల్లిగా; వినయంబునన్ = అణకువతో; కొడుకు = పుత్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా కోపంగా పలికిన తండ్రితో కొడుకు ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.

తెభా-7-264-క.
"బయుతులకు దుర్భలులకు
మెవ్వఁడు? నీకు నాకు బ్రహ్మాదులకున్
మెవ్వఁడు ప్రాణులకును
మెవ్వం డట్టి విభుఁడు ల మసురేంద్రా!

టీక:- బలయుతుల్ = బలముగలవారల; కున్ = కు; దుర్బలుల్ = బలములేనివారల; కున్ = కు; బలము = అండ; ఎవ్వడు = ఎవరో; నీ = నీ; కున్ = కు; నా = నా; కున్ = కు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదుల్ = మొదలగువారు; కున్ = కు; బలము = ప్రాపు, శరణు; ఎవ్వడు = ఎవరో; ప్రాణుల్ = జీవుల; కున్ = కు; బలము = అండ; ఎవ్వండు = ఎవరో; అట్టి = అటువంటి; విభుడు = ప్రభువు; బలము = అండ; అసురేంద్రా = రాక్షసరాజా.
భావము:- హిరణ్యకశిప రాక్షసరాజ! బలవంతులకు, బలహీనులకు, నీకు, నాకు, బ్రహ్మ మున్నగు వారికి, సృష్ణిలోని సర్వ ప్రాణులకు అందరికి శరణు అయిన వాడు ఎవరో ఆ పరాత్పరుడే నాకు అండగా ఉన్నాడు.
అందానికి పెట్టిందిపేరు ఈ పద్యం. ప్రహ్లాదుడు సరిగా చదువుకోటంలేదని హిరణ్యకశిపుడు దండిస్తుంటే బెదరటం లేదు. నా దండన నుంచి నిన్ను కాపాడగలిగే దిక్కెవరు అన్న తండ్రికి కొడుకు వినయంగా సమాధానం చెప్తున్నాడు. పంచాబ్దముల వాని పంచదార పలుకులతో సహజత్వం ఉట్టిపడేలా కళ్ళకు కట్టినట్లు ఎంతో చక్కగా నాటకీయత పండించారు మన సహజ కవి పోతనులవారు.

తెభా-7-265-క.
దిక్కులు కాలముతో నే
దిక్కున లేకుండుఁ గలుగుఁ దిక్కుల మొదలై
దిక్కుగల లేని వారికి
దిక్కయ్యెడు వాఁడు నాకు దిక్కు మహాత్మా!

టీక:- దిక్కులు = దిక్కులన్నియు; కాలము = కాలము; తోన్ = తోపాటు; ఏ = ఎట్టి; దిక్కునన్ = ఎక్కడాకూడ; లేకుండున్ = లేకుండపోవునో; కలుగు = ఉన్నట్టి; దిక్కుల = గతులన్నిటికిని; మొదలు = మూలము; ఐ = అయ్యి; దిక్కు = ప్రాపు, అండ; కల = కలిగిన; లేని = లేనట్టి; వారి = వారి; కిన్ = కి; దిక్కు = అండ; అయ్యెడు = అగునట్టి; వాడు = అతడు; నా = నా; కున్ = కు; దిక్కు = రక్షకుడు; మహాత్మా = గొప్పవాడ.
భావము:- ఓ మహనీయుడైన తండ్రి గారు! ఈ దేశకాలాదుల ఎల్లలు అవధులు సమస్తము ఆ స్వామి యందే లీనమై పోతుంటాయి. అతని యందే పుట్టుతూ ఉంటాయి. అతని యందే వీటన్నిటికి ఆధారం కలుగుతూ ఉంటుంది. అండదండలు గలవారికి లేనివారికి అందరికి అతని యందే రక్షణ లభించుతు ఉంటుంది. ఆ స్వామే నయ్యా నాకు రక్షకుడు.
అన్ని దిక్కులలోను తిరుగులేని నన్ను కాదని నీకు దిక్కు అయ్యేవాడు ఎవడురా అని తర్జిస్తున్న తండ్రి హిరణ్యకశిపునకు, భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు సమాధానం చెప్తూ సృష్టితత్వాన్ని సూచిస్తున్నాడు. ప్రాస, ప్రాసపూర్వస్థానం నాలుగు పాదాలకు, యతి దాని తరువాతి స్థానాలు రెంటికి అక్షరసామ్యం వాడిన పద్యం నడక సందర్భోచితంగా ఉంది. నాలుగు దిక్కుల ఆధారం స్థిరత్వం సూచిస్తోంది. దిక్కును ఆరు సార్లు వాడుట నల్దిక్కులు పైన కింద సూచిస్తు అంతటా ధ్వనిపం జేస్తోంది. దిక్కుకి ఎల్ల లేదా అవధి, చోటు, తూర్పాది దిక్కులు, ఆధారం, అండ రక్షణ అనే అర్థాలు ధ్వనింపజేసిన తీరు అద్భుతం. ఒక్క దిక్కుకి, ఆరు దిక్కులతో వినయంగా సమాధానం చెప్పటంలో ప్రహ్లాదుని వ్యక్తిత్వ విశిష్ఠత వ్యక్తం అవుతోంది.

తెభా-7-266-సీ.
కాలరూపంబులఁ గ్రమ విశేషంబుల-
లఘు గుణాశ్రయుం యిన విభుఁడు
త్త్వబలేంద్రియ హజ ప్రభావాత్ముఁ-
డై వినోదంబున ఖిలజగముఁ
ల్పించు రక్షించు ఖండించు నవ్యయుం-
న్ని రూపము లందు తఁడు గలఁడు
చిత్తంబు సమముగాఁ జేయుము మార్గంబుఁ-
ప్పి వర్తించు చిత్తంబుకంటె

తెభా-7-266.1-తే.
వైరు లెవ్వరు చిత్తంబు వైరి గాఁక?
చిత్తమును నీకు వశముగాఁ జేయవయ్య!
దయుతాసురభావంబు మానవయ్య!
య్య! నీ మ్రోల మేలాడయ్య! జనులు.

టీక:- కాల = కాలము నందు; రూపంబులన్ = రూపము లందు; క్రమ = పద్ధతు లందు; విశేషంబులన్ = ప్రత్యేకత లందు; అలఘు = గొప్ప; గుణ = గుణములకు; ఆశ్రయుండు = కారణము; అయిన = ఐన; విభుడు = ప్రభువు; సత్త్వ = పృథివ్యాది ద్రవ్యము {పృథివ్యాది - సత్త్వములు, 1పృథివి 2అప్పు 3తేజము 4వాయువు 5ఆకాశము 6కాలము 7దిక్కు 8ఆత్మ 9మనస్సు}; బల = శక్తి; ఇంద్రియ = సాధనసంపత్తి; సహజ = నైజమైన; ప్రభావము = మహిమ; ఆత్ముడు = కలిగినవాడు; ఐ = అయ్యి; వినోదంబునన్ = క్రీడవలె; అఖిల = సమస్తమైన; జగమున్ = విశ్వమును; కల్పించున్ = సృష్టించును; రక్షించును = కాపాడును; ఖండించున్ = నాశనము చేయును; అవ్యయుండు = నాశము లేనివాడు; అన్ని = సర్వ; రూపముల్ = రూపముల, బింబముల; అందున్ = లోను; అతడు = అతడు; కలడు = ఉన్నాడు; చిత్తంబున్ = మనసును; సమము = సమానముగా నున్నది; కాన్ = అగునట్లు; చేయుము = చేయుము; మార్గంబున్ = మంచిత్రోవను; తప్పి = తొలగి; వర్తించు = తిరిగెడు; చిత్తంబున్ = మనసు; కంటెన్ = కంటె.
వైరులు = శత్రువులు; ఎవ్వరు = ఎవ రుంటారు; చిత్తంబున్ = మనసు; వైరి = శత్రువు; కాక = కాకుండగ; చిత్తమును = మనసును; నీ = నీ; కున్ = కు; వశము = లొంగియుండునది; కాన్ = అగునట్లు; చేయవు = చేయుము; అయ్య = తండ్రి; మద = గర్వముతో; యుత = కూడిన; అసుర = రాక్షస; భావంబున్ = తలపులను; మానవు = మునివేయుము; అయ్య = తండ్రి; అయ్య = తండ్రి; నీ = నీ; మ్రోలన్ = ఎదుట; మేలు = మంచి; ఆడరు = చెప్పరు; అయ్య = తండ్రి; జనులు = ప్రజలు.
భావము:- నాన్నగారూ! ఆ జనార్దనుడు జగత్పతి కాలానుగుణంగా వివిధ రూపాలతో వివిధ పద్ధతులతో ఆ ప్రభువు విష్ణుమూర్తి విరాజిల్లుతూ ఉంటాడు. అతడు సుగుణాలకు నిధి. తన సత్తువ, బలం, పరాక్రమాల ప్రభావంతో వినోదంగా విశ్వాన్నిసృష్టిస్తూ, పోషిస్తూ, లయం చేస్తూ ఉంటాడు. ఆయన అవ్యయుడు. అన్ని రూపాలలోనూ అతడు ఉంటాడు. తండ్రీ! మనస్సుకు సమదృష్టి అలవరచుకో. ధర్మమార్గం తప్పిన మనస్సు కంటె పరమ శత్రువు మరొకరు లేరు. మనస్సును విరోధం చేసుకొనక వశం చేసుకో అంతేకాని నువ్వే చిత్తానికి “చిత్తం, చిత్తం” అంటూ దాస్యం చేయకూడదు. మదోన్మత్తమైన రాక్షస భావాన్ని విడిచిపెట్టు. నీకు భయపడి ఎవరూ నీ ఎదుట హితం చెప్పటం లేదు. అందరూ నీ మనస్సుకు నచ్చేవే చెప్తున్నారు తప్ప హితమైనది చెప్పటం లేదు.

తెభా-7-267-ఉ.
లోము లన్నియున్ గడియలోన జయించినవాఁడ వింద్రియా
నీముఁ జిత్తమున్ గెలువ నేరవు నిన్ను నిబద్ధుఁ జేయు నీ
భీర శత్రు లార్వురఁ బ్రభిన్నులఁ జేయుము ప్రాణికోటిలో
నీకు విరోధి లేఁ డొకఁడు నేర్పునఁ జూడుము దానవేశ్వరా!

టీక:- లోకముల్ = లోములను; అన్నియున్ = అన్నిటిని; గడియ = కొద్దికాలము; లోనన్ = లోనే; జయించినవాడవు = నెగ్గినాడవు; ఇంద్రియ = ఇంద్రియముల; అనీకము = సమూహము; చిత్తమున్ = మనసు; గెలువన్ = నెగ్గుట; నేరవు = చేయలేవు; నిన్నున్ = నిన్ను; నిబద్ధున్ = బంధనముల జిక్కుకొనిన వానిగ; చేయున్ = చేయును; నీ = నీ యొక్క; భీకర = భయంకరమైన; శత్రులార్వులన్ = అరిషడ్వర్గములను; ప్రభిన్నులన్ = ఓడినవారినిగా; చేయుము = చేయుము; ప్రాణి = జీవ; కోటి = జాలము; లోన్ = అందు; నీ = నీ; కున్ = కు; విరోధి = శత్రువు; లేడు = లేడు; ఒకడు = మరియొకడు; నేర్పునన్ = వివేకముతో; చూడుము = ఆలోచించుము; దానవేశ్వరా = రాక్షసరాజా.
భావము:- నువ్వేమో, రాక్షసరాజా! లోకాలు అన్నింటినీ క్షణంలో జయించావు; కానీ నీ లోని మనస్సునూ, ఇంద్రియాలనూ గెలువలేకపోయావు; వాటి ముందు నువ్వు ఓడిపోయావు; కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులు నిన్ను బందీ చేశారు; ఆ భయంకరమైన శత్రువులను అరిషడ్వర్గాలు అంటారు; వాటిని జయించి నశింపజేసావంటే జీవకోటి సర్వంలోనూ నీకు విరోధి ఎవ్వరూ ఉండడు. నా విన్నపం మన్నించు.

తెభా-7-268-క.
పాలింపుము శేముషి ను
న్మూలింపుము కర్మబంధముల సమదృష్టిం
జాలింపుము సంసారముఁ
గీలింపుము హృదయ మందుఁ గేశవభక్తిన్."

టీక:- పాలింపుము = నియమించుము; శేముషిన్ = బుద్ధిని; ఉన్మూలింపుము = తెంచివేయుము; కర్మ = కర్మములనెడి; బంధములన్ = కట్టుతాళ్ళను; సమదృష్టిన్ = సమత్వభావముతో; చాలింపుము = చాలింపుము; సంసారమున్ = సంసారమును; కీలింపుము = నాటుకొనజేయుము; హృదయము = హృదయము; అందున్ = లో; కేశవ = విష్ణు {కేశవుడు - బ్రహ్మరుద్రాదులును తన స్వరూపముగాగలవాడు, విష్ణువు}; భక్తిన్ = భక్తిని.
భావము:- మంచి మనస్సుతో మరొకసారి ఆలోచించు; కర్మ బంధాలను త్రెంచివెయ్యి; భేదభావం లేకుండా చక్కని సమదృష్టి అలవరచుకో; నిరంతంరం మనసంతా మాధవునిపై లగ్నం చెయ్యి.”

తెభా-7-269-వ.
అనినఁ బరమభాగవతశేఖరునకు దోషాచరశేఖరుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; పరమ = అత్యుత్తములైన; భాగవత = భాగవతులలో; శేఖరున్ = శిఖరమువలె మేలైనవాని; కున్ = కి; దోషాచర = రాక్షసులలో {దోషాచరుడు - దోష (రాత్రులందు) చరుడు (తిరుగువాడు), రాక్షసుడు}; శేఖరుండు = గొప్పవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని పలికాడు పరమ భక్తశిఖామణి ప్రహ్లాదుడు. విన్న దోషమార్గానువర్తి అయిన ఆ రాక్షస శిఖామణి హిరణ్యకశిపుడు ఇలా హుంకరించాడు.

తెభా-7-270-క.
"చంపినఁ జచ్చెద ననుచును
గంపింపక యోరి! పలువ! ఠినోక్తుల నన్
గుంపించెదు చావునకుం
దెంరి యై వదరువాని తెఱఁగునఁ గుమతీ!

టీక:- చంపినన్ = చంపితే; చచ్చెదను = చచ్చిపోతాను; అనుచునున్ = అని తలచుకొని; కంపింపకన్ = బెదరక; ఓరి = ఓరి; పలువ = తులువా; కఠిన = గడుసు; ఉక్తులన్ = మాటలతో; నన్ = నన్ను; కుంపించెదు = బాధించెదవు, అతిక్రమించెదవు; చావు = మరణమున; కున్ = కు; తెంపరి = తెగించినవాడవు; ఐ = అయ్యి; వదరు = ప్రేలెడి; వానిన్ = వాని; తెఱగునన్ = విధముగ; కుమతి = చెడ్డబుద్ధిగలవాడా.
భావము:- “దుర్మతీ! చావుకు తెగించావు. చంపుతారని కానీ, చచ్చిపోతానని కానీ నీకు భయం లేకుండా పోయింది. దుర్మార్గుడా కర్ణకఠోరమైన మాటలనే ఈటెలను నా మీదకే విసురుతున్నావు. చావును కూడా లెక్కచేయకుండా మితిమీరి మాట్లాడుతున్నావు.

తెభా-7-271-శా.
నాతోడం బ్రతిభాష లాడెదు జగన్నాథుండ నా కంటె నీ
భూశ్రేణికి రాజు లేఁ డొకఁడు; సంపూర్ణ ప్రభావుండు మ
ద్భ్రాతం జంపిన మున్ను నే వెదకితిం ల్మాఱు నారాయణుం
డే ద్విశ్వములోన లేఁడు; మఱి వాఁ డెందుండురా? దుర్మతీ!

టీక:- నా = నా; తోడన్ = తోటే; ప్రతిభాషలు = ఎదురుతిరిగివాదనలు; ఆడెదవు = చేసెదవు; జగత్ = లోకములకే; నాథుండన్ = ప్రభువును; నా = నా; కంటెన్ = కంటె; ఈ = ఈ; భూత = జీవముల; శ్రేణి = సమూహముల; కిన్ = కు; రాజు = ప్రభువు; లేడు = లేడు; ఒకడు = ఇంకొకడు; సంపూర్ణ = పూర్తి, మిక్కిలి; ప్రభావుండు = మహిమగలవాడు; మత్ = నా యొక్క; భ్రాతన్ = సోదరుని; చంపినన్ = చంపగా; మున్ను = ఇంతకు పూర్వము; నేన్ = నేను; వెదకితిన్ = అన్వేషించితిని; పలు = అనేక; మాఱు = మార్లు, పర్యాయములు; నారాయణుండు = విష్ణువు {నారాయణుడు - నరసంబంధ దేహముతో యవతారములను పొందువాడు, విష్ణువు}; ఏతత్ = ఈ; విశ్వము = జగత్తు; లోనన్ = అందు; లేడు = లేడు; మఱి = ఇంక; వాడు = అతడు; ఎందు = ఎక్కడ; ఉండురా = ఉంటాడురా; దుర్మతీ = చెడ్డబుద్ధిగలవాడా.
భావము:- ఓ దుర్భుద్ధీ! నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు. ఈ జగత్తు అంతటికి అధిపతిని నేనే. నేను తప్ప ఈ జీవజాలం సమస్తానికి నాకంటే సంపూర్ణ శక్తిమంతుడైన మరొక రాజు లేడు. నేనే జగన్నాథుడిని. నా సోదరుడైన హిరణ్యాక్షుడిని చంపినప్పుడు హరి కోసం అనేక పర్యాయాలు వెతికాను. విశ్వం అంతా గాలించాను. కానీ ఆ విష్ణువు విశ్వం మొత్తంలో ఎక్కడా లేడు. మరి ఆ పిరికివాడు ఇంకెక్కడ ఉంటాడు.

తెభా-7-272-క.
క్కడఁ గలఁ డే క్రియ నే
క్కటి వర్తించు నెట్టి జాడను వచ్చుం
క్కడఁతు నిన్ను విష్ణునిఁ
బెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని పగిదిన్."

టీక:- ఎక్కడ = ఎక్కడ; కలడు = ఉన్నాడు; ఏ = ఎట్టి; క్రియన్ = విధముగ; ఏ = ఏ; చక్కటిన్ = స్థలమునందు; వర్తించున్ = తిరుగుచుండును; ఎట్టి = ఎలాంటి; జాడనున్ = దారిలో; వచ్చున్ = వచ్చును; చక్కడతున్ = సంహరించెదను; నిన్నున్ = నిన్నును; విష్ణునిన్ = విష్ణువును; పెక్కులున్ = అధికముగా; ప్రేలెదవు = వదరెదవు; వాని = అతని; భృత్యుని = సేవకుని, బంటు; పగిదిన్ = వలె.
భావము:- విష్ణువును సేవకుడిలా తెగపొగడుతున్నావు. అసలు ఎక్కడ ఉంటాడు? ఏ విధంగా ఉంటాడు? ఏ రీతిగా తిరుగుతు ఉంటాడు? ఏ పద్ధతిలో వస్తుంటాడు? ఊఁ చెప్పు. లేకపోతే నిన్నూ, నీ హరిని సంహరిస్తాను. ముందు సమాధానం చెప్పు”

తెభా-7-273-వ.
అనిన హరికింకరుండు శంకింపక హర్షపులకాకుంర సంకలిత విగ్రహుండై యాగ్రహంబు లేక హృదయంబున హరిం దలంచి నమస్కరించి బాలవర్తనంబున నర్తనంబు జేయుచు నిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; హరి = విష్ణు; కింకరుండు = దాసుడు; శంకింపక = జంకక; హర్ష = సంతోషమువలన; పులకాంకుర = గగుర్పాటు; సంకలిత = కలిగిన; విగ్రహుండు = రూపముగలవాడు; ఐ = అయ్యి; ఆగ్రహంబు = కోపము; లేక = లేకుండగ; హృదయమున = హృదయమందు; హరిన్ = విష్ణుని; తలంచి = స్మరించి; నమస్కరించి = నమస్కారముచేసి; బాల = చిన్నపిల్లవాని; వర్తనంబునన్ = నడవడికతో; నర్తనంబు = నాట్యము; చేయుచున్ = చేయుచు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా తండ్రి గద్దిస్తున్నప్పటికి పరమ హరిభక్తుడు అయిన ప్రహ్లాదుడు ఏ మాత్రం జంకలేదు. పైగా అమితమైన ఆనందంతో నిలువెల్లా పులకించిపోయాడు. ఆవగింజంత ఆగ్రహం కూడా లేకుండా, హృదయం నిండా హృషీకేశుడిని తలచుకుని నమస్కారాలు చేసాడు. ఆనందంగా ఉన్న బాలురకు సహజమైనట్లుగానే తన సంతోషంలో తాను అత్యంత విశ్వాసంతో నృత్యం చేస్తూ ఇలా పలికాడు.

తెభా-7-274-మ.
"లఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
లఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ద్యోత చంద్రాత్మలం
లఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింవ్యక్తులం దంతటం
లఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.

టీక:- కలడు = ఉన్నాడు; అంభోధిన్ = సముద్రములలోను; కలండు = ఉన్నాడు; గాలిన్ = గాలిలోను; కలడు = ఉన్నాడు; ఆకాశంబునన్ = ఆకాశములోను; కుంభినిన్ = భూమియందును; కలడు = ఉన్నాడు; అగ్నిన్ = నిప్పులోను; దిశలన్ = దిక్కులన్నిటియందును; పగళ్ళన్ = దినములందును; నిశలన్ = రాత్రులయందును; ఖద్యోత = సూర్యుని {ఖద్యోతము - ఖత్ (ఆకాశమున) జ్యోతము (ప్రకాశించునది), సూర్యుడు}; చంద్ర = చంద్రుని; ఆత్మలన్ = ఆత్మలందు; కలడు = ఉన్నాడు; ఓంకారమునన్ = ఓంకారమునందును; త్రిమూర్తులన్ = త్రిమూర్తులందును {త్రిమూర్తులు - 1బ్రహ్మ 2 విష్ణు 3మహేశ్వరులు}; త్రిలింగ = స్త్రీ పురుష నపుంసక {త్రిలింగములు - 1స్త్రీలింగము 2పుల్లింగము 3నపుంసకలింగము}; వ్యక్తులన్ = జాతులవారి; అందున్ = అందు; అంతటన్ = అంతటను; కలడు = ఉన్నాడు; ఈశుండు = భగవంతుడు {ఈశుడు - నైజముచేతనే ఐశ్వర్యములుగలవాడు, విష్ణువు}; కలండు = ఉన్నాడు; తండ్రి = తండ్రీ; వెదుకంగన్ = అన్వేషించుట; ఏల = ఎందుకు; ఈయాయెడన్ = ఇక్కడా అక్కడా.
భావము:- నాయనా! భగవంతుడు అయిన శ్రీమహావిష్ణువు లేని చోటు విశ్వములో ఎక్కడ లేదు. అంతట వ్యాపించియే ఉన్నాడు. నీటిలో, గాలిలో, ఆకాశంలో ఉన్నాడు. భూమిమీద ఉన్నాడు. అగ్నిలోను ఉన్నాడు. సర్వదిక్కులలోను ఆయన ఉన్నాడు. పగలు రాత్రి సమయాలలో ఉన్నాడు. సూర్యుడు , చంద్రుడు, ఆత్మ, ఓంకారం, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్త్రీ పురుష నపుంసక అనే త్రిలింగ వ్యక్తులు అందరు ఇలా బ్రహ్మాది పిపీలక పర్యంతమందు ఆయన ఉన్నాడు. అట్టి సర్వ పూర్ణుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు కోసం ఎక్కడెక్కడో వెదకాల్సిన పనిలేదు. సర్వే, సర్వకాల సర్వావస్థలలోను ఉన్నడయ్యా!

తెభా-7-275-క.
ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి ర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."

టీక:- ఇందు = దీనిలో, ఇక్కడ; కలడు = ఉన్నాడు; అందు = దానిలో, అక్కడ; లేడు = లేడు; అని = అని; సందేహము = అనుమానము; వలదు = వద్దు; చక్రి = విష్ణువు {చక్రి - చక్రము ఆయుధముగాగలవాడు, విష్ణువు}; సర్వ = అన్నిటియందు; ఉపగతుండు = ఉండువాడు; ఎందెందు = ఎక్కడెక్కడ; వెదకి = వెదకి; చూచినన్ = చూసినచో; అందందే = అక్కడెల్లను; కలడు = ఉన్నాడు; దానవాగ్రణి = రాక్షసరాజా; వింటే = వింటివా.
భావము:- ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు; అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా. రాక్షసరాజా!
ఇది అతిమధురమైన పద్యం. పోతనగారిది ప్రహ్లాద చరిత్రలోది. పదౌచిత్యం, సందర్భౌచిత్యం, పాత్రౌచిత్యం అందంగా అమరిన పద్యం. బాలుర నోట సున్నాముందున్న దకారం అందంగా పలుకుతుంది కదా (పద్యంలో చిక్కగా బొద్దుగా ఉన్నాయి). ప్రతి పదంలో రెండవ అక్షరాలకి సామ్యం ఉండాలన్నది అందమైన ప్రాస నియమం కదా. ఈ రెంటిన చక్కగా సమన్వయం చేసిన తీరు అద్భుతం. చిన్నపిల్లలు చేతులు కాళ్ళు కదుపుతు చెప్తున్నట్లు చెప్తారు కదా. అది పద్యం నడకలోనే స్ఫురిస్తున్న తీరు ఇంకా బావుంది. తనకే ఎదురు చెప్తాడా అన్న ఆగ్రహంతో ఊగిపోతున్నాడు తండ్రి హిరణ్యకశిపుడు. అంచేత ‘హరి హరి అంటున్నావు ఎక్కడున్నాడ్రా చూపగలవా?’ అంటు బెదిరిస్తున్నాడు తండ్రి. కొడుకు ప్రహ్లాదుడు నదురు బెదురులేని అయిదేళ్ళ పిల్లాడు. తన బాల్యానికి తగినట్లు అలా చిరునవ్వులతో నటనలు చేస్తూ ‘సర్వోపగతుడు శ్రీహరి’ అని సమాధానం చెప్పాడు. ఆ సందర్భానికి తగినట్లు పద్యం నడక సాగింది. పలుకుతున్న బాలకుడి పాత్రకు గంభీరమైన సున్నితమైన పదాలు ‘ఎందెందు’, ‘అందందు’ చక్కగా తగి ఉన్నాయి. మరి అప్పుడు ఆ పరమభక్తుని మాట బోటుపోనివ్వని నారాయణుడు నరసింహరూపంలో విశ్వమంతా వ్యాపించి సిద్ధంగానే ఉన్నాడట.

తెభా-7-276-వ.
అని యి వ్విధంబున.
టీక:- అని = అని; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
భావము:- అలా ఈ విధంగా

తెభా-7-277-మ.
"రి సర్వాకృతులం గలం"డనుచుఁ బ్రహ్లాదుండు భాషింప స
త్వరుఁడై "యెందును లేఁడు లేఁ"డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
సింహాకృతి నుండె నచ్యుతుఁడు నానా జంగమస్థావరో
త్క గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్.

టీక:- హరి = నారాయణుడు; సర్వ = ఎల్ల; ఆకృతులన్ = రూపములందును; కలండు = ఉన్నాడు; అనుచున్ = అనుచు; ప్రహ్లాదుడు = ప్రహ్లాదుడు; భాషింపన్ = పలుకగా; సత్వరుడు = తొందరగలవాడు; ఐ = అయ్యి; ఎందును = ఎక్కడను; లేడు = లేడు; లేడు = లేడు; అని = అని; సుతున్ = పుత్రుని; దైత్యుండు = రాక్షసుడు; తర్జింపన్ = బెదిరించగా; శ్రీ = శోభనయుక్తమైన; నరసింహ = నరసింహ; ఆకృతిన్ = రూపముతో; ఉండెన్ = ఉండెను; అచ్యుతుడు = నారాయణుడు; నానా = పలురకముల; జంగమస్థావర = చరాచర; ఉత్కర = సమూహముల; గర్భంబులన్ = అంతర్భాగములలో; అన్ని = సమస్తమైన; దేశములన్ = చోటులందును; ఉద్దండ = గొప్ప; ప్రభావంబునన్ = మహిమతో.
భావము:- ఈ విధంగా ప్రహ్లాదుడు "భగవంతుడు సర్వ నామ రూపధారులందు అంతట ఉన్నాడు."అని చెప్తుంటే, హిరణ్యకశిపుడు "ఎక్కడా లేడు"అంటూ బెదిరిస్తున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి మహా మహిమాన్వితమైన నరసింహ రూపంతో సర్వ చరాచరము లన్నిటి యందు ఆవేశించి ఉన్నాడు.
భక్తాగ్రేసర కృషీవలుడు అందించిన మధుర మైన పంటలలో ముఖ్యమైనది ప్రహ్లాద చరిత్ర. భక్తుల సామర్థ్యాలు ఎలా ఉంటాయో, భక్తుల ప్రపత్తికి అతను ఎంత బలంగా స్పందిస్తాడో, అతని సర్వ వ్యాపకతా శీలం, అచ్యుత శీలం ఎలాంటివో నిరూపించే ప్రహ్లాద చరిత్రలో కథ చాలా బలమైంది, కవిత్వం మిక్కిలి ఉన్నత మైంది, సాహిత్యం ఉత్కృష్ట మైంది, విలువలు అపార మైనవి. కథానాయకుడు కొడుకు ప్రహ్లాదుడు {ప్రహ్లాదుడు – ప్ర (విశిష్ట మైన) హ్లాదుడు (ఆనందము కల వాడు), విష్ణుభక్తుడు} పరమ భక్తుడు సాత్వికుడు ఓర్పు శ్రద్ధలకు మారు పేరు. ప్రతినాయకుడు తండ్రి హిరణ్యకశిపుడు {హిరణ్యకశిపుడు – హిరణ్యము (బంగారము, అగ్నిదేవుని సప్త జిహ్వలలో ఒకటి) కశిపుడు (పరపు, విరివి కల వాడు), దానవుడు} పరమ బలాఢ్యు డైన రాక్షసుడు తమోగుణ పరాకాష్ఠ. మరి కథలో బలానికి లోటే ముంటుంది. చదివించిరి, దిక్కులు గెలిచితి, కల డంభోధి, ఇందు గల డందు లాంటి పద్యాలలోని కవిత్వ సాహిత్య సౌరభాలే కదా వాటిని పండిత జనసామాన్య నాలుకలపై నానేలా చేసినవి. ఎన్ని కష్టా లెదురైనా చెక్కు చెదరని భక్తుల ప్రపత్తి నిబద్ధతతో కూడిన భక్తుల విలువలు. నారసింహ తత్వపు భక్తుని ఎడ భగవంతుడు చూపే అత్యద్భుత మైన వాత్యల్య విలువలు తిరుగు లేనివి. ఎంతటి భయంకర మైన పరిస్థితులలో ఉన్నా ఈ పద్యం మననం చేస్తు ఉంటే ఎట్టి పరిస్థితులలో మేలే తప్ప కీడు జరగదు అన్నది జగద్వితమే.
ఓం నరసింహ వషట్కారాయః నమః

తెభా-7-278-వ.
అయ్యవసరంబున నద్దానవేంద్రుండు.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; ఆ = ఆ; దానవేంద్రుండు = రాక్షసరాజు.
భావము:- ఇలా భగవంతుడు సర్వవ్యాపి అని కొడుకు ప్రహ్లాదుడు చెప్పగా, తండ్రి హిరణ్యకశిపుడు ఇలా అంటున్నాడు.

తెభా-7-279-క.
"డింక సర్వస్థలముల
నంభోరుహనేత్రుఁ డుండు నుచు మిగుల సం
రంభంబునఁ బలికెద వీ
స్తంభంబునఁ జూపఁ గలవె క్రిన్ గిక్రిన్.

టీక:- డింభక = కుఱ్ఱవాడా; సర్వ = ఎల్ల; స్థలములన్ = ప్రదేశములందును; అంభోరుహనేత్రుఁడు = హరి {అంభోరుహనేత్రుడు - అంభోరుహ (పద్మముల) వంటి నేత్రుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; ఉండున్ = ఉంటాడు; అనుచున్ = అనుచు; మిగులన్ = మిక్కిలి; సంరంభంబునన్ = ఆటోపముతో; పలికెదవు = చెప్పెదవు; ఈ = ఈ; స్తంభంబునన్ = స్తంభమునందు; చూపగలవె = చూపించగలవా; చక్రిన్ = విష్ణుని; గిక్రిన్ = గిక్రిని (చక్రికి ఎగతాళిరూపము).
భావము:- ఓరి డింభకా! పద్మాక్షుడు విష్ణుమూర్తి సర్వవ్యాపి అన్నిట ఉంటాడని ఇంత గట్టిగా చెప్తున్నావు. అయితే మరి ఈ స్తంభంలో చూపించగలవా ఆ చక్రం గిక్రం పట్టుకు తిరిగేవాణ్ణి.

తెభా-7-280-క.
స్తంమునఁ జూపవేనిం
గుంభిని నీ శిరముఁ ద్రుంచి కూల్పఁగ రక్షా
రంమున వచ్చి హరి వి
స్రంభంబున నడ్డపడఁగ క్తుం డగునే."

టీక:- స్తంభమునన్ = స్తంభమునందు; చూపవేనిన్ = చూపకున్నచో; కుంభినిన్ = నేలపైన; నీ = నీ యొక్క; శిరమున్ = తలను; త్రుంచి = నరకి; కూల్పగన్ = పడవేయుచుండగ; రక్షా = కాపాడెడి; ఆరంభమునన్ = ప్రయత్నములో; వచ్చి = వచ్చి; హరి = విష్ణువు; విస్రంభంబునన్ = నమ్మకముగా; అడ్డపడగన్ = అడ్డుపడుటకు; శక్తుండు = చాలినవాడు; అగునా = కాగలడా.
భావము:- నువ్వు చెప్పినట్లు ఈ స్తంభంలో చక్రిని చూపకపోతే, ఎలాగూ నీ తల త్రెంచి నేల మీద పడేస్తాను కదా. అప్పుడు నిన్ను కాపాడటానికి విష్ణువు రాగలడా? అడ్డు పడగలడా?”

తెభా-7-281-వ.
అనిన భక్తవత్సలుని భటుం డి ట్లనియె.
టీక:- అనినన్ = అనగా; భక్తవత్సలుని = విష్ణుని {భక్తవత్సలుడు - భక్తులయెడ వాత్యల్యము గలవాడు, విష్ణువు}; భటుండు = దాసుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా తండ్రి పెద్దగా గద్దించాడు. భక్తవత్సలుని పరమ భక్తుడైన ఆ ప్రహ్లాదుడు ఇలా పలికాడు.

తెభా-7-282-శా.
"అంభోజాసనుఁ డాదిగాఁగ దృణపర్యంతంబు విశ్వాత్ముఁడై
సంభావంబున నుండు ప్రోడ విపులస్తంభంబునం దుండడే?
స్తంభాంతర్గతుఁ డయ్యు నుండుటకు నే సందేహమున్ లేదు ని
ర్దంత్వంబున నేఁడు గానఁబడు బ్రత్యక్షస్వరూపంబునన్."

టీక:- అంభోజాసనుడు = బ్రహ్మదేవుడు {అంభోజాసనుడు - అంభోజ (పద్మము) ఆసనుడు (ఆసనముగగలవాడు), బ్రహ్మదేవుడు}; ఆదిగా = మొదలుపెట్టి; తృణ = గడ్డిపరక; పర్యంతంబున్ = వరకు; విశ్వాత్ముడు = విశ్వమం దంతటను గలవాడు; ఐ = అయ్యి; సంభావంబునన్ = ఆదరముతో; ఉండు = ఉండెడి; ప్రోడ = నేరుపుకాడు; విపుల = పెద్ద; స్తంభంబున్ = స్తంభము; అందున్ = లో; ఉండడే = ఉండడా ఏమి, తప్పకఉండును; స్తంభ = స్తంభము; అంతర్గతుండు = లోనుండువాడు; అయ్యున్ = అయ్యి; ఉండుట = ఉండుట; కున్ = కు; ఏ = ఏమాత్రము; సందేహము = అనుమానము; లేదు = లేదు; నిర్దంభత్వంబునన్ = నిష్కపటముగ; నేడున్ = ఇప్పుడు; కానబడున్ = కనబడును; ప్రత్యక్ష = కన్నులకగుపడు; స్వరూపంబునన్ = నిజరూపముతో.
భావము:- “ఆ విశ్వాత్ముడు విష్ణువు బ్రహ్మ దగ్గర నుండి గడ్డిపరక దాకా సమస్త ప్రపంచంలోనూ నిండి ఉన్నాడు. అటువంటప్పుడు, ఇంత పెద్ద స్తంభంలో ఎందుకు ఉండడు? ఈ స్తంభంలో పరంధాముడు ఉన్నాడు అనటంలో ఎటువంటి అనుమానమూ లేదు. నిస్సందేహంగా ఉన్నాడు. కావాలంటే ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడా”

తెభా-7-283-వ.
అనిన విని కరాళించి గ్రద్దన లేచి గద్దియ డిగ్గనుఱికి యొఱఁబెట్టిన ఖడ్గంబు పెఱికి కేల నమర్చి జళిపించుచు మహాభాగవతశిఖామణి యైన ప్రహ్లాదుని ధిక్కరించుచు.
టీక:- అనినన్ = అనగా; విని = విని; కరాళించి = బొబ్బరిల్లి; గ్రద్దనన్ = చటుక్కున; లేచి = లేచి; గద్దియన్ = సింహాసనమును; డిగ్గనుఱికి = దిగదుమికి; ఒఱన్ = ఒరలో; పెట్టిన = పెట్టిన; ఖడ్గంబున్ = కత్తిని; పెఱికి = బయటకుతీసి, దూసి; కేలన్ = చేతిలో; అమర్చి = పట్టుకొని; జళిపించుచు = ఆడించుచు; మహా = గొప్ప; భాగవత = భాగవతులలో; శిఖామణి = ఉత్తముడు; ఐన = అయిన; ప్రహ్లాదుని = ప్రహ్లాదుని; ధిక్కరించుచు = తిరస్కరించుచు.
భావము:- అలా అనే సరికి హిరణ్యకశిపుడు ఒక్కసారిగా వికటాట్టహాసం చేసాడు. చివాలున లేచి సింహాసనం మీంచి క్రిందికి ఉరికి వచ్చాడు. ఒరలో ఉన్న ఖడ్గాన్ని లాగి ఝళిపించి భక్తాగ్రేసరుడైన ప్రహ్లాడుడిని భయపెడుతూ ధిక్కరించి ఇలా గర్జించాడు.

తెభా-7-284-మ.
"విరా డింభక! మూఢచిత్త! గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుం
ని భాషించెద; వైన నిందుఁ గలఁడే" యంచున్ మదోద్రేకియై
నుజేంద్రుం డరచేత వ్రేసెను మహోగ్ర ప్రభా శుంభమున్
దృగ్భీషణదంభమున్ హరిజనుస్సంరంభమున్ స్తంభమున్.

టీక:- వినరా = వినుము; డింభక = పిల్లవాడా; మూఢ = మూర్ఖపు; చిత్త = బుద్ధిగలవాడ; గరిమన్ = గొప్పగ, గట్టిగ; విష్ణుండు = హరి; విశ్వాత్మకుండు = విశ్వమందంతటనుగలవాడు; అని = అని; భాషించెదవు = అనుచున్నావుకదా; ఐనన్ = అయినచో; ఇందున్ = దీనిలో; కలడే = ఉన్నాడా; అంచున్ = అనుచు; మద = మదముచేత; ఉద్రేకి = అతిశయముచెందినవాడు; ఐ = అయ్యి; దనుజ = రాక్షసులలో; ఇంద్రుండు = ఇంద్రునివంటివాడు; అరచేతన్ = అరచేతితో; వ్రేసెను = దెబ్బకొట్టెను; మహ = గొప్ప; ఉదగ్ర = పొడవైన, భయంకరమైన; ప్రభా = కాంతులచే; శుంభమున్ = ప్రకాశించుచున్నదానిని; జన = ప్రజల; దృక్ = చూపులకు; భీషణ = భయముగలుపు; దంభమున్ = డంబముగలదానిని; హరి = విష్ణుని (నరసింహుని); జనుస్ = ఆవిర్భావము యొక్క; సంరంభమున్ = ఆటోపముగలదానిని; స్తంభమున్ = స్తంభమును.
భావము:- “ఒరే! వినరా! మూర్ఖా! అర్భకా! ఎంతో గొప్పగా విష్ణువు విశ్వాత్మకుడు అంటున్నావు. అయితే దీంట్లో ఉన్నాడా?” అంటూ మదోన్మత్తుడు అయి; ఆవేశంతో ఆ రాక్షస రాజు హిరణ్యకశిపుడు అరచేతితో; జీవకోటి చూడ శక్యం కాకుండా ఉన్నట్టి,భయంకరమైన కాంతులు వెదజల్లుతున్నట్టి, శ్రీ నరసింహస్వామి వారి ఆవిర్భావానికి సంరంభ పడుతున్నట్టి; ఆ స్తంభాన్ని బలంగా చరిచాడు.