పోతన తెలుగు భాగవతము/సప్తమ స్కంధము/పూర్ణి

వికీసోర్స్ నుండి

పూర్ణి

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/సప్తమ స్కంధము/పూర్ణి)
రచయిత: పోతన



తెభా-7-480-క.
రాజీవసదృశలోచన!
రాజీవభవాది దేవరాజి వినుత! వి
బ్రాజితకీర్తిలతావృత
రాజీవభవాండ భాండ! ఘుకులతిలకా!

టీక:- రాజీవసదృశలోచన = శ్రీరామా {రాజీవ సదృశ లోచనుడు - రాజీవ (తామరల) సదృశ(వంటి) లోచనుడు, కన్నులుగలవాడు, రాముడు}; రాజీవభవాదిదేవరాజివినుత = శ్రీరామా {రాజీవభవాది దేవరాజి వినుతుడు - రాజీవభవ (బ్రహ్మదేవుడు) ఆది (మున్నగు) దేవ (దేవతల) రాజి (సమూహములచే) నుత (స్తుతింపబడినవాడు), రాముడు}; విబ్రాజితకీర్తిలతావృతరాజీవభవాండభాండ = శ్రీరామా {విబ్రాజిత కీర్తిలతావృత రాజీవభవాండ భాండుడు - విభ్రాజిత(మిక్కిలి మెరయుచున్న) కీర్తి (కీర్తి యనెడి) లతా (తీగలచే) ఆవృత (చుట్టబడిన) రాజీవభవాండ (బ్రహ్మాండము అనెడి) భాండుడు (భాండము గలవాడు), రాముడు}; రఘుకులతిలకా = శ్రీరామా {రఘుకుల తిలకుడు - రఘుకుల (రఘువంశమునకు) తిలకుడు (వన్నె తెచ్చినవాడు), రాముడు}.
భావము:- శ్రీరామచంద్ర ప్రభు! నీవు కలువల వంటి కన్నులు ఉన్న అందగాడవు; నిన్ను బ్రహ్మదేవుడు మున్నగు సకల దేవతలు సదా స్తుతిస్తు ఉంటారు; నీ కీర్తి సమస్త బ్రహ్మాండాల సమూహం అంతటా వ్యాపించి తళతళలాడుతూ ఉంటుంది; నీవు రఘువంశానికి వన్నె తెచ్చిన వాడవయ్యా! రామయ్య!

తెభా-7-481-మాలి.
ణిదుహితృరంతా! ర్మమార్గానుగంతా!
నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా!
గురుబుధసుఖకర్తా! కుంభినీచక్రభర్తా!
సుభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా!

టీక:- ధరణిదుహితృరంతా = శ్రీరామా {ధరణిదుహితృరంతుడు - ధరణీ (భూదేవి) దుహితృ (కుమార్తె) యైన సీతతో రంతుడు (క్రీడించువాడు), రాముడు}; ధర్మమార్గానుగంతా = శ్రీరామా {ధర్మమార్గానుగంతుడు - ధర్మమార్గ (ధర్మమార్గమును) అనుగంతుడు (అనుసరించువాడు), రాముడు}; నిరుపమనయవంతా = శ్రీరామా {నిరుపమనయవంతుడు - నిరుపమ (సాటిలేని) నయవంతుడు (నీతిగలవాడు), రాముడు}; నిర్జరారాతిహంతా = శ్రీరామా {నిర్జరారాతిహంత - నిర్జరారాతి (దేవతలశత్రువులగు రాక్షసులను) హంత(చంపినవాడు), రాముడు}; గురుబుధసుఖకర్తా = శ్రీరామా {గురుబుధసుఖకర్త - గురు (గురువులకు) బుధ (జ్ఞానులకు) సుఖ (సౌఖ్యమును) కర్త (ఏర్పరచినవాడు), రాముడు}; కుంభినీచక్రభర్తా = శ్రీరామా {కుంభినీచక్రభర్త - కుంభినీ (భూ) చక్ర (మండలమునకు) భర్త (నాథుడు), రాముడు}; సురభయపరిహర్తా = శ్రీరామా {సురభయపరిహర్త - సుర (దేవతల) భయ (భయమును) పరిహర్త (పోగొట్టినవాడు), రాముడు}; సూరిచేతోవిహర్తా = శ్రీరామా {సూరిచేతోవిహర్త - సూరి (జ్ఞానుల) చేతః (చిత్తములలో) విహర్త (క్రీడించువాడు), రాముడు}.
భావము:- భూదేవి పుత్రిక సీతాదేవితో క్రీడించువాడా! ధర్మమార్గమునందే చరించువాడా! సాటిలేని నీతిగలవాడా! దేవతలకు శత్రువులైన రాక్షసుల సంహరించినవాడా! గురువులకు పెద్దలకు జ్ఞానులకు సాధువులకు సుఖసౌఖ్యములను సమకూర్చువాడా! భూమండలమును ఏలిన చక్రవర్తి! దేవతల భీతిని తొలగించువాడా! పరమ జ్ఞానుల చిత్తములలో విహరించువాడా! శ్రీరామచంద్ర ప్రభో! కరుణించుము.

తెభా-7-482-చ.
పటుచాపఖండన! మహాద్భుతవిక్రమశౌర్యభండనా!
నిధిగర్వభంజన! రసాతనయాహృదయాబ్జరంజనా!
రుచరసైన్యపాలన! సుధాంధసమౌనిమనోజ్ఞఖేలనా!
సిజగర్భసన్నుత! నిశాచరసంహర! త్రైజగన్నుతా!

టీక:- హరపటుచాపఖండన = శ్రీరామా {హరపటుచాపఖండనుడు - హర (శివుని) పటు (గట్టి) చాప (విల్లును) ఖండనుడు (విరిచినవాడు), రాముడు}; మహాద్భుతవిక్రమశౌర్యభండనా = శ్రీరామా {మహాద్భుతవిక్రమశౌర్యభండనుడు - మహా(గొప్ప) అద్భుత(అద్భుతమైన) విక్రమ(పరాక్రమము) శౌర్య (వీరత్వము)లతో భండనుడు (యుద్ధముచేయువాడు), రాముడు}; శరనిధిగర్వభంజన = శ్రీరామా {శరనిధిగర్వభంజనుడు - శరనిధి (సముద్రుని) గర్వ (గర్వమును) భంజనుడు (పోగొట్టినవాడు), రాముడు}; రసాతనయాహృదయాబ్జరంజనా = శ్రీరామా {రసాతనయాహృదయాబ్జరంజనుడు - రసాతనయ (సముద్రునికూతురైన లక్ష్మీదేవి) యొక్క హృదయ (హృదయముయనెడి) అబ్జ (పద్మమును) రంజనుడు (రంజింపజేయువాడు), రాముడు}; తరుచరసైన్యపాలన = శ్రీరామా {తరుచరసైన్యపాలన - తరుచర (వానర) సైన్య (సేనలను) పాలన (పరిపాలించువాడు), రాముడు}; సుధాంధసమౌనిమనోజ్ఞఖేలనా = శ్రీరామా {సుధాంధసమౌనిమనోజ్ఞఖేలన - సుంధాంధస (దేవతల) మౌని (మునుల)కు మనోజ్ఞ (ప్రియముగ) ఖేలన (క్రీడించువాడు), రాముడు)}; సరసిజగర్భసన్నుత = శ్రీరామా {సరసిజగర్భసన్నుత - సరసిజగర్భ (బ్రహ్మదేవునిచే) సన్నుత (కీర్తింపబడు వాడు), రాముడు}; నిశాచరసంహర = శ్రీరామా {నిశాచరసంహరుడు - నిశాచర (రాక్షసులను) సంహరుడు (చంపినవాడు), రాముడు}; త్రైజగన్నుతా = శ్రీరామా {త్రైజగన్నుతుడు - త్రైజగత్ (ముల్లోకముల)చేత సన్నుతుడు (స్తుతింపబడువాడు), రాముడు}.
భావము:- బలమైన శివధనుస్సును విరిచిన వాడా! మహాద్భుత పరాక్రమంతో, శౌర్యంతో యుద్ధం చేసేవాడా! సముద్రుని గర్వం సర్వం అణచినవాడా! సాక్షాత్తు లక్ష్మీదేవి అవతరామైన సీతాదేవి హృదయాన్ని రంజింపజేయు వాడా! వానర సైన్యాన్ని పరిపాలించిన వాడా! దేవతలకు, మునులకు ప్రియముగా క్రీడించువాడా! బ్రహ్మదేవునిచేతనూ స్తుతింపబడువాడా! రాక్షసులను సంహరించు వాడా! ముల్లోకములచేత కీర్తింపబడువాడా! శ్రీరామచంద్ర ప్రభూ! వందనములు.

తెభా-7-483-గ.
ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీ మహాభాగవతం బను మహాపురాణంబు నందు ధర్మనందనునకు నారదుండు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల పూర్వజన్మ వృత్తాంతంబు చెప్పుటయు, హిరణ్యకశిపు దితి సంవాదంబును, సుయజ్ఞోపాఖ్యానంబును, ప్రేతబంధు యమ సల్లాపంబును, బ్రహ్మవర లాభ గర్వితుండైన హిరణ్యకశిపు చరిత్రంబును, బ్రహ్లాద విద్యాభ్యాస కథయును, బ్రహ్లాద హిరణ్యకశిపు సంవాదంబును, బ్రహ్లాదవచనంబు ప్రతిష్ఠింప హరి నరసింహ రూపంబున నావిర్భవించి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదునకు నభయం బిచ్చి నిఖిలదేవతానివహ ప్రహ్లాదాది స్తూయమానుండై తిరోహితుం డగుటయుఁ, ద్రిపురాసుర వృత్తాంతంబును, నీశ్వరుండు త్రిపురంబుల దహించుటయు, వర్ణాశ్రమధర్మ వివరణంబును, బ్రహ్లాదాజగర సంవాదంబును, స్వధర్మ ప్రవర్తకుఁ డగు గృహస్థుండు ముక్తుం డగు మార్గంబు నారదుండు ధర్మరాజునకుఁ దెలుపుటయు, నారదుని పూర్వజన్మ వృత్తాంతంబును, నను కథలు గల సప్తమస్కంధము సంపూర్ణము.
టీక:- ఇది = ఇది; శ్రీ = శుభకరమైన; పరమేశ్వర = పరమశివుని; కరుణా = కృపవలన; కలిత = పుట్టిన; కేసనమంత్రి = కేసనమంత్రి యొక్క; పుత్ర = కుమారుడైన; సహజ = సహజసిద్ధమైన; పాండిత్య = పండితప్రజ్ఞగల; పోతన = పోతన యనెడి; అమాత్య = శ్రేష్ఠునిచేత; ప్రణీతంబు = సంస్కరింపబడినది; అయిన = ఐన; శ్రీ = శ్రీ; మహాభాగవతంబు = మహాభాగవతము; అను = అనెడి; మహా = గొప్ప; పురాణంబున్ = పురాణము; అందున్ = లో; ధర్మనందనున్ = ధర్మరాజున; కున్ = కు; నారదుండు = నారదుడు; హిరణ్యాక్ష = హిరణ్యాక్షుడు; హిరణ్యకశిపుల = హిరణ్యకశిపుల యొక్క; పూర్వ = కడచిన; జన్మ = పుట్టుక; వృత్తాంతంబు = గాథ; చెప్పుటయున్ = చెప్పుట; హిరణ్యకశిపు = హిరణ్యకశిపుడు; దితి = దితిల; సంవాదంబును = సంభాషణము; సుయజ్ఞ = సుయజ్ఞుని; ఉపాఖ్యానంబును = ఇతిహాసము; యమ = యముడు; సల్లాపంబును = మంచిమాటలు చెప్పుట; బ్రహ్మ = బ్రహ్మదేవునిచే ఇవ్వబడిన; వర = వరములు; లాభ = లభించుటచేత; గర్వితుండు = గర్వముగలవాడు; ఐన = అయిన; హిరణ్యకశిపు = హిరణ్యకశిపుని; చరిత్రంబును = కథ; ప్రహ్లాద = ప్రహ్లాదుని యొక్క; విద్యాభ్యాస = చదువుకొనుట; కథయును = వృత్తాంతము; ప్రహ్లాద = ప్రహ్లాదుడు; హిరణ్యకశిపు = హిరణ్యకశిపుల యొక్క; సంవాదంబును = సంభాషణము; ప్రహ్లాద = ప్రహ్లాదుని యొక్క; వచనంబు = మాట; ప్రతిష్ఠింపన్ = నిలబెట్టుటకు; హరి = విష్ణుమూర్తి; నరసింహ = నరసింహుని; రూపంబునన్ = రూపముతో; ఆవిర్భవించి = అవతరించి; హిరణ్యకశిపుని = హిరణ్యకశిపుని; సంహరించి = చంపి; ప్రహ్లాదున్ = ప్రహ్లాదున; కున్ = కు; అభయంబు = అభయమును; ఇచ్చి = ఇచ్చి; నిఖిల = సమస్తమైన; దేవతా = దేవతల; నివహ = సమూహము; ప్రహ్లాద = ప్రహ్లాదుడు; ఆది = మొదలగువారిచేత; స్తూయమానుండు = స్తుతింపబడినవాడు; ఐ = అయ్యి; తిరోహితుండు = అంతార్ధనమైనవాడు; అగుటయున్ = అగుట; త్రిపుర = త్రిపురములందలి; అసుర = రాక్షసుల; వృత్తాంతంబునున్ = గాథ; ఈశ్వరుండు = పరమశివుడు; త్రిపురంబులన్ = త్రిపురములను; దహించుటయున్ = కాల్చివేయుట; వర్ణా = చాతుర్వర్ణముల; ఆశ్రమ = చతురాశ్రమముల; వివరణంబును = వివరించుట; ప్రహ్లాద = ప్రహ్లాదుడు; అజగర = అజగరుల; సంవాదంబును = సంభాషణము; స్వ = తన; ధర్మ = ధర్మమునందు; ప్రవర్తకుండు = నడచెడివాడు; అగు = అయిన; గృహస్థుండు = గృహస్థుడు; ముక్తుండు = మోక్షముపొందినవాడు; అగు = అయ్యెడి; మార్గంబున్ = త్రోవను, విధానమును; నారదుండు = నారదుడు; ధర్మరాజున్ = ధర్మరాజున; కున్ = కు; తెలుపుటయున్ = చెప్పుట; నారదుని = నారదుని; పూర్వ = కడచిన; జన్మ = పుట్టుక యొక్క; వృత్తాంతంబున్ = గాథ; అను = అనెడి; కథలు = వృత్తాంతములు; కల = కలిగిన; సప్తమ = ఏడవ (7); స్కంధము = స్కంధము; సంపూర్ణము = సమాప్తము.
భావము:- ఇది శుభకరమైన పరమశివుని కృపవలన పుట్టిన కేసనమంత్రి యొక్క కుమారుడైన సహజసిద్ధమైన పండితప్రజ్ఞగల పోతన యనెడి శ్రేష్ఠునిచేత సంస్కరింపబడినది ఐన శ్రీ మహాభాగవతము అనెడి గొప్ప పురాణములో ధర్మరాజునకు నారదుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుల యొక్క కడచిన పుట్టుక గాథ చెప్పుట; హిరణ్యకశిపుడు దితిల సంభాషణము; సుయజ్ఞుని ఇతిహాసము; యముడు మంచిమాటులు చెప్పుట; బ్రహ్మదేవునిచే ఇవ్వబడిన వరములు లభించుటచేత గర్వము గలవాడు అయిన హిరణ్యకశిపుని కథ; ప్రహ్లాదుని యొక్క చదువుకొనుట వృత్తాంతము; ప్రహ్లాదుడు హిరణ్యకశిపుల యొక్క సంభాషణము; ప్రహ్లాదుని యొక్క మాట నిలబెట్టుటకు విష్ణుమూర్తి నరసింహుని రూపముతో అవతరించి; హిరణ్యకశిపుని చంపి; ప్రహ్లాదునకు అభయమును ఇచ్చి; సమస్తమైన దేవతల సమూహముచేత స్తుతింపబడుట; ప్రహ్లాదుడుచేత స్తుతింపబడి అంతార్ధనమైనవాడు అగుట; త్రిపురము లందలి రాక్షసుల గాథ; పరమశివుడు త్రిపురములను కాల్చివేయుట; చాతుర్వర్ణముల చతురాశ్రమముల వివరించుట; ప్రహ్లాదుడు అజగరుల సంభాషణము; తన ధర్మమునందు నడచెడి గృహస్థు మోక్షము పొందు త్రోవను, విధానమును నారదుడు ధర్మరాజునకు చెప్పుట; నారదుని కడచిన పుట్టుక యొక్క గాథ అనెడి వృత్తాంతములు కలిగిన ఏడవ (7) స్కంధము సమాప్తము.


ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!