Jump to content

పోతన తెలుగు భాగవతము/సప్తమ స్కంధము/ఆశ్రమాదుల ధర్మములు

వికీసోర్స్ నుండి

ఆశ్రమాదుల ధర్మములు


తెభా-7-445-వ.
అనిన నారదుం డిట్లనియె "గృహస్థుం డయినవాఁడు వాసుదేవార్పణంబుగా గృహోచితక్రియ లనుసంధించుచు మహామునుల సేవించి వారల వలన నారాయణ దివ్యావతార కథాకర్ణనంబు చేయుచు నయ్యైవిహితకాలంబుల శాంతజనులం గూడి మెలంగుచు బుత్రమిత్ర కళత్రాది సంగంబులు గలల వంటి వని యెఱుంగుచు లోపల నాసక్తి లేక సక్తునికైవడి వెలుపలఁ బురుషకారంబు లొనర్చుచుఁ దగులంబు లేక విత్తంబు లిచ్చి జనక సుత సోదర సఖ జ్ఞాతిజనుల చిత్తంబులు సమ్మదాయత్తంబులు గావించుచు ధనధాన్య విధాన దైవ లబ్ధంబులవలన నభిమానంబు మాని యనుభవించుచు గృహక్షేత్రంబులఁ జొచ్చి యుదరపూరణమాత్రంబు దొంగిలినవాని దండింపక భుజగ మృగ మూషిక మర్కట మక్షికా ఖరోష్ట్రంబుల హింసింపక పుత్రుల భంగి నీక్షించుచు దేశకాలదైవంబుల కొలందిని ధర్మార్థ కామంబులఁ బ్రవర్తించుచు శునక పతిత చండాలాదులకైన భోజ్య పదార్థంబులు దగిన భంగి నిచ్చుచు నిజవృత్తిలబ్ధంబు లగు నశనాదులచేత దేవ ఋషి పితృ భూత మానవుల సంతర్పించుచుఁ బంచ మహాయజ్ఞావశేషంబుల నంతర్యామి పురుష యజనంబును నాత్మ జీవనోపాయంబును సమర్థించుచు నుండవలయు.
టీక:- అనినన్ = అనగా; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; గృహస్థుండు = గృహస్థాశ్రమ మందున్నవాడు; అయిన = ఐన; వాడు = వాడు; వాసుదేవ = శ్రీకృష్ణపరమాత్మకు; అర్పణంబు = అర్పించబడినది; కాన్ = అగునట్లు; గృహ = ఇంటికి; ఉచిత = అవసరమైన; క్రియలను = ఎల్లపనులను; సంధించుచున్ = చేయుచు; మహా = గొప్ప; మునులన్ = మునులను; సేవించి = కొలిచి; వారల = వారి; వలన = నుండి; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; దివ్య = దివ్యమైన; అవతార = అవతారముల; కథ = గాథలను; ఆకర్ణనంబు = వినుట; చేయుచున్ = చేయుచు; అయ్యై = ఆయా; విహిత = తగిన; కాలంబులన్ = సమయములలో; శాంత = సాధు; జనులన్ = జనులను; కూడి = కలిసి; మెలంగుచున్ = తిరుగుచు; పుత్ర = కుమారులు; మిత్ర = స్నేహితులు; కళత్ర = భార్యలు; ఆది = మొదలగు; సంగంబులన్ = తగులములను; కలలు = స్వప్నముల; వంటివి = లాంటివి; అని = అని; ఎఱుంగుచున్ = తెలిసికొనుచు; లోపలన్ = మనసునందు; ఆసక్తి = మక్కువ; లేక = లేకుండగ; సక్తుని = మక్కువగలవాని; కైవడిన్ = వలె; వెలుపల = బయటికి; పురుషకారంబులు = పురుషుడు చేయదగినవి; ఒనర్చుచున్ = చేయుచు; తగులంబు = తగులములు; లేక = లేకుండగ; విత్తంబులు = ధనములు; ఇచ్చి = ఇచ్చి; జనక = తండ్రి; సుత = పుత్రులు; సోదర = అన్నదమ్ములు; సఖ = మిత్రులు; జ్ఞాతి = దాయాదులైన; జనులన్ = వారిని; చిత్తంబులు = మనసులు; సమ్మద = సంతోషముతో; ఆయత్తంబులు = కూడినవి; కావించుచున్ = చేయిచున్; ధన = ధనములు; ధాన్య = ధాన్యములు; నిధాన = సంపదలు; దైవ = దేవుని వశమున; లబ్ధంబులు = లభించినవాని; వలనన్ = ఎడల; అభిమానంబున్ = గర్వమును; మాని = విడిచిపెట్టి; అనుభవించుచున్ = అనుభవించుచు; గృహ = ఇంటియందు; క్షేత్రంబులన్ = పొలములలో; చొచ్చి = దూరి; ఉదర = కడుపు; పూరణ = నింపుకొనుట; మాత్రంబున్ = మాత్రమే; దొంగిలిన = దొంగతనముచేసిన; వానిన్ = వానిని; దండింపక = శిక్షింపక; భుజగ = పాములు; మృగ = క్రూరజంతువులు; మూషిక = ఎలుకలు; మర్కట = కోతులు; మక్షికా = ఈగలు; ఖర = గాడిదలు; ఉష్ట్రంబులన్ = ఒంటెలను; హింసింపక = బాధించకుండగ; పుత్రుల = కొడుకుల; భంగిన్ = వలె; ఈక్షించుచున్ = చూచుచు; దేశ = (ఉన్న) దేశము; కాల = కాలము; దైవంబుల = దేవతల; కొలందిని = తగినట్లు; ధర్మార్థకామంబులన్ = పురుషార్థములయందు {పురుషార్థములు - 1ధర్మము 2అర్థము 3కామము}; ప్రవర్తించుచున్ = మెలగుచు; శునక = కుక్కలు; పతిత = భ్రష్టులు; చండాల = శూద్రవర్ణస్థులు; ఆదుల = మున్నగువాని; కైనన్ = కి అయినను; భోజ్య = తినదగిన; పదార్థంబులున్ = పదార్థములను; తగిన = ఉచితమగు; భంగిన్ = విధముగ; ఇచ్చుచున్ = ఇచ్చుచు; నిజ = తన; వృత్తి = జీవికల వలన; లబ్ధంబులు = లభించినవి; అగున్ = అయిన; అశన = ఆహారము; ఆదులన్ = మున్నగువాని; చేతన్ = చేత; దేవ = దేవతలు; ఋషి = ఋషులు; పితృ = పితృదేవతలు; భూత = జంతువులు; మానవుల = మానవులను; సంతర్పించుచున్ = సంతర్పణ చేయుచు; పంచ = ఐదు (5); మహా = గొప్ప; యజ్ఞ = యజ్ఞములందు; అవశేషంబులన్ = మిగిలినవానిని; అంతర్యామి = పరమాత్మయైన; పురుష = మహాపురుషుని; యజనంబును = తృప్తిపరచుట; ఆత్మ = తన; జీవనోపాయంబును = జీవికను; సమర్థించుచున్ = నిర్వహించుకొనుచు; ఉండవలయు = ఉండవలెను.
భావము:- ఇలా జిజ్ఞాసతో అడిగిన ధర్మజునికి నారదమహర్షి ఇలా చెప్పసాగేడు. “గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మోక్షపదవిని అందుకొనవచ్చును. గృహస్థు తన సర్వ గృహోచిత కర్మలను వాసుదేవార్పణంగా చేయాలి; మునీశ్వరులను పూజించి, వారితో శ్రీమహావిష్ణువు దివ్యవతార గాథలు చెప్పించుకుని వీనుల విందుగా ఆలకించాలి; సజ్జనుల సాంగత్యం కలిగి ఉండాలి; పుత్ర, మిత్ర, కళత్రాదుల కలయికలు కలల వంటివి అని తెలిసి మెలగాలి; అంతరంగంలో ఆసక్తి పెంచుకోకుండా, ఆసక్తి ఉన్నవాడివలె పురుష ప్రయత్నాలు నెరవేర్చాలి; మమకారాలు, బాంధవ్యాలూ పెంచుకోకుండా; అలాగని త్రెంచుకోకుండా నిర్లిప్తుడుగా ఉంటూ తండ్రికీ, పిల్లలకూ, సోదరులకూ, స్నేహితులకూ, జ్ఞాతులకూ, ధనము ఇచ్చిన వారికీ ఆనందం కలిగించాలి; భగవంతుని దయ వలన చేకూరిన సంపదపై అభిమానం పెంచుకోకుండా అనుభవించాలి.
గృహాలలో, పొలాలలో తిండికి మాత్రం దొంగతనం చేసే చిన్న చిన్న దొంగలను దండించరాదు; మృగాలు, పాములు, ఎలుకలు, కోతులు, దోమలు, గాడిదలు, ఒంటెలు మున్నగువానిని హింసింపక కన్నబిడ్డల వలె కనికరంతో చూడాలి; దేశ, కాల, దైవాలకు అనుగుణంగా ధర్మార్థకామ పురుషార్థాలతో ప్రవర్తించాలి; కుక్కలు, పతితులు, చండాలురు మున్నగు వారికి కూడ తగిన విధంగా ఆహారాలు పెడుతూ ఉండాలి; పంచ మహా యజ్ఞాలను ఆచరించాలి; అంటే తన కులవృత్తి వలన ప్రాప్తమైన ఆహార పదార్థాలను దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు సంతర్పణ చేయాలి; ఈ యజ్ఞాలు జరిపిన పిమ్మట పరమాత్ముని అర్చించాలి; తన జీవనోపాయం సమర్థంగా, సంతృప్తికరంగా నెరవేర్చుకోవాలి.

తెభా-7-446-ఆ.
నక గురుల నైనఁ జంపు నర్థమున కై
ప్రాణమైన విడుచు భార్యకొఱకు
ట్టి భార్యఁ బురుషుఁ తిథి శుశ్రూష చే
యించి గెలుచు నజితు నీశు నైన.

టీక:- జనక = తండ్రి; గురువులన్ = గురువులను; ఐనన్ = అయినను; చంపున్ = సంహరించును; అర్థమున్ = ధనములు; కై = కోసము; ప్రాణము = తనప్రాణము; ఐనన్ = అయినప్పటికి; విడుచున్ = వదలిపెట్టును; భార్య = భార్య; కొఱకున్ = కోసము; అట్టి = అటువంటి; భార్యన్ = భార్యను; పురుషుడు = మానవుడు; అతిథి = అతిథుల యొక్క; శుశ్రూష = సేవను; చేయించి = చేయించుటచేత; గెలుచున్ = గెలుచును; అజితున్ = గెలువశక్యముగానివానిని; ఈశున్ = ఈశ్వరుని; ఐనన్ = అయినను;
భావము:- మానవుడు డబ్బులు కోసం తండ్రినైనా, గురువులనైనా సంహరిస్తాడు. ఇది లోక సహజం. కాని భార్యకోసం డబ్బులేమిటి, ప్రాణాలైనా ధారపోస్తాడు. అటువంటి భార్యచేత అతిథులకు శుశ్రూషలు చేయించి, అజితుడు పరమేశ్వరుడు అయిన భగవంతుని అనుగ్రహం సైతం సంపాదించవచ్చును

తెభా-7-447-ఆ.
రముఁ డీశ్వరుండు బ్రాహ్మణముఖమున
నాహరించి తుష్టుఁ యిన భంగి
గ్నిముఖము నందు వ్యరాసులు గొని
యైనఁ దుష్టి నొందఁ నఘచరిత!

టీక:- పరముడు = హరి {పరముడు - సమస్తమునకు పరమైనవాడు, విష్ణువు}; ఈశ్వరుండు = హరి {ఈశ్వరుడు - సర్వనియామకుడు, విష్ణువు}; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; ముఖమునన్ = ద్వారా; ఆహరించి = ఆహారముగ్రహించి, ఆరగించి; తుష్టుడు = తృప్తిచెందినవాడు; అయిన = ఐన; భంగిన్ = వలె; అగ్ని = అగ్ని; ముఖమునందున్ = ద్వారా; హవ్య = హవిస్సులు; రాసులున్ = సర్వమును; కొని = గ్రహించి; ఐనన్ = అయినను; తుష్టి = తృప్తిని; ఒందడు = పొందడు; అనఘ = పాపములేని; చరిత = నడవడికగలవాడ.
భావము:- ఓ ధర్మరాజా! పుణ్యచరిత్రా! పరాత్పరుడు దేవాధిదేవుడు అయిన భగవంతుడు అతిథి అయిన బ్రాహ్మణుని ద్వారా ఆహారం స్వీకరించి, తృప్తి పొంది, ఆనందిస్తాడు. ఇంత ఆనందమూ, తృప్తీ ఆ హవ్యవాహనుడైన అగ్ని ద్వారా సమర్పించిన హవిస్సులు గైకొని కూడా చెందడు.

తెభా-7-448-వ.
కావున గృహస్థుండు బ్రాహ్మణు లందును దేవత లందును మర్త్య పశుప్రముఖ జాతులందును నంతర్యామియు బ్రాహ్మణాననుండును నైన క్షేత్రజ్ఞు నందు నయ్యై కోరికలు సమర్పించి సంతర్పణంబు జేయవలయు భాద్రపదంబునఁ గృష్ణపక్షంబు నందును దక్షిణోత్తరాయణంబు లందును రేయింబగలు సమమైనకాలంబు లందును వ్యతీపాతంబు లందును దినక్షయంబు నందును సూర్యచంద్రగ్రహణంబు లందును శ్రవణ ద్వాదశి యందును వైశాఖ శుక్ల తృతీయ యందును గార్తిక శుక్ల నవమి యందును హేమంత శిశిరంబుల లోను నాలుగష్టక లందును మాఘ శుక్ల సప్తమి యందును మాస నక్షత్రంబులతోడం గూడిన పున్నము లందును ద్వాదశితోడం గూడిన యుత్తరాత్రయ శ్రవణానురాధ లందును నుత్తరాత్రయ సహితంబు లయిన యేకాదశుల యందును జన్మనక్షత్రయుక్త దివసంబు లందును మఱియుఁ బ్రశస్తకాలంబు లందును జననీజనకబంధు జనులకు శ్రాద్ధంబులును జప హోమ స్నాన వ్రతంబులును దేవ బ్రాహ్మణసమారాధనంబులును నాచరింపవలయు భార్యకుఁ బుంసవనాదికంబును నపత్యంబునకు జాతకకర్మాదికంబును దనకు యజ్ఞదీక్షాదికంబును బ్రేతజనులకు దహనాదికంబును మృతదివసంబున సాంవత్సరికంబును జరుపవలయు.
టీక:- కావునన్ = అందుచేత; గృహస్థుండు = గృహస్థుడు; బ్రాహ్మణులు = విప్రుల; అందునున్ = అందు; దేవతలు = దేవతలు; అందునున్ = అందు; మర్త్య = సామాన్యమానవులు; పశు = పశువులు; ప్రముఖ = మొదలగు; జాతులు = ప్రాణులు; అందునున్ = అందు; అంతర్యామియున్ = హరి {అంతర్యామి - సర్వమునందును యామి (వ్యాపించి యుండవాడు), విష్ణువు}; బ్రాహ్మణాననుండును = హరి {బ్రాహ్మణాననుండు - బ్రాహ్మణులే అననుండు(నోరుగా గలవాడు), విష్ణువు}; ఐన = అయిన; క్షేత్రజ్ఞున్ = హరి {క్షేత్రజ్ఞుడు - క్షేత్రములు (దేహముల) యందుండెడివాడు, జీవాత్మ, విష్ణువు}; అందున్ = ఎడల; అయ్యై = ఆయా; కోరికలు = కోరికలను; సమర్పించి = చక్కగా యర్పించి; సంతర్పణంబు = సంతర్పణలు; చేయవలయున్ = చేయవలెను; భాద్రపదంబునన్ = భాద్రపదమాసమునందు; కృష్ణపక్షంబున్ = కృష్ణపక్షము {కృష్ణపక్షము - పౌర్ణమి తరువాత అమావాస్య వరకు గల పదిహేనుదినముల మాస భాగము}; అందునున్ = అందు; దక్షిణ = దక్షిణాయనము; ఉత్తరాయణంబులు = ఉత్తరాయణములు; అందునున్ = అందలి; రేయిన్ = రాత్రులు; పగలు = దినభాగములు; సమమైన = సమానముగా నుండెడి; కాలంబులు = దినములు; అందునున్ = అందు; వ్యతీపాతంబులు = సోమవారము పున్నమిల కూడిక (సూర్యారాయాంధ్ర), అమావాస్య రవివారముల కూడిక (సం. వాచ); అందునున్ = అందు; దినక్షయంబున్ = {దినక్షయము - ఒకదినమున మూడు తిథులు కలుగుట}; అందునున్ = అందు; సూర్య = సూర్యగ్రహణములు; చంద్ర = చంద్రగ్రహణములు; అందునున్ = అందు; శ్రవణద్వాదశి = శ్రవణనక్షత్రముతో కూడిన భాద్రపద శుద్ద ద్వాదశి. (పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య)) అందునున్ = అందు; వైశాఖ = వైశాఖమాసము; శుక్ల = శుక్లపక్షము {శుక్లపక్షము - అమావాస్య తరువాత పౌర్ణమి వరకు గల పదిహేనుదినముల మాస భాగము}; తృతీయ = తదియ; అందునున్ = అందు; కార్తిక = కార్తీకమాసము; శుక్ల = శుక్లపక్షము; నవమి = నవమితిథి; అందునున్ = అందు; హేమంత = హేమంతఋతువు {హేమంతఋతువు - మార్గశిర పుష్యమాసములు}; శిశిరంబుల = శిశిరఋతువుల {శిశిరఋతువు - మాఘ ఫాల్గుణమాసములు}; లోను = అందు; నాలుగు = నాలుగు (4); అష్టకలు = శ్రాద్ధభేదంబులు {నాలుగష్టలు - మార్గశిర పుష్య మాఘ ఫాల్గుణ మాసములందలి కృష్ణపక్షమునందలి అష్టమితిథులు, శ్రాద్ధభేదంబులు}; అందునున్ = అందు; మాఘ = మాఘమాసపు; శుక్ల = శుక్లపక్షపు; సప్తమి = సప్తమి తిథి; అందునున్ = అందు; మాస = ప్రతిమాసపునామముగల; నక్షత్రంబుల = నక్షత్రముల; తోడన్ = తోటి; కూడిన = కూడినట్టి; పున్నములు = పౌర్ణమితిథులు; అందునున్ = అందు; ద్వాదశి = ద్వాదశితిథి; తోడన్ = తోటి; కూడిన = కలసివచ్చిన; ఉత్తరాత్రయ = 1ఉత్తర 2ఉత్తరాషాడ 3ఉత్తరాభాద్ర తిథులు; శ్రవణ = శ్రవణ; అనూరాధలు = అనూరాధనక్షత్రములు; అందునున్ = అందు; ఉత్తరాత్రయ = ఉత్తరాత్రయనక్షత్రములతో; సహితంబులు = కూడినవి; అయిన = ఐన; ఏకాదశుల = ఏకాదశితిథుల; అందునున్ = అందు; జన్మ = పుట్టిన; నక్షత్ర = నక్షత్రముతో; యుక్త = కూడిన; దివసంబులు = దినములు; అందునున్ = అందు; మఱియున్ = ఇంకను; ప్రశస్థ = ముఖ్యమైన; కాలంబులు = సమయముల; అందునున్ = అందు; జననీజనక = తల్లిదండ్రుల; బంధు = బంధువులైన; జనుల = వారి; కున్ = కి; శ్రాద్ధంబులును = శ్రాద్ధములు, తద్దినములు; జప = జపములు; హోమ = హోమములు; స్నాన = స్నానములు; వ్రతంబులు = వ్రతములు; దేవ = దేవతల; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; సమారాధనంబులు = పూజలు; ఆచరింపవలయున్ = చేయవలెను; భార్య = భార్య; కున్ = కు; పుంసవన = సీమంతము; ఆదికంబును = మొదలగునవి; అపత్యంబున్ = బిడ్డ; కున్ = కు; జాతకకర్మ = పురుటిశుద్ది; ఆదికంబును = మున్నగునవి; తన = తన; కున్ = కు; యజ్ఞ = యజ్ఞప్రారంభబునకు; దీక్ష = దీక్షబూనుట; ఆదికంబును = మున్నగునవి; ప్రేత = చనిపోయిన; జనుల = బంధువులైనవారి; కున్ = కి; దహన = దహనము; ఆదికంబును = మున్నగునవి; మృత = చనిపోయిన; దివసంబునన్ = దినమున; సాంవత్సరీకంబును = సాంవత్సరీకమును; జరుపవలయు = చేయవలెను.
భావము:- కాబట్టి, గృహస్థుడు బ్రాహ్మణులు, దేవతలు, మానవులు, పశువులు మున్నగు సర్వ జాతులకు తగిన సంతర్పణలు చేస్తూ ఉండాలి. ఆ సమస్త జాతుల యందు అంతర్యామిగా ఉండే వాడూ, బ్రాహ్మణుడే ముఖముగా కలవాడూ అయిన భగవంతునికి ఆయా అభీష్టాలను సమర్పించి ఆ సంతర్పణలు చేయాలి. భాద్రపద మాసంలో, కృష్ణపక్షాలలో, ఉత్తరాయణ దక్షిణాయణ రెండు విషువులు {విషువు - పగలు రాత్రి సమానముగ నుండు దినములు, (1)మార్చి21న వచ్చెడి ఉత్తరాయణ (వసంత) విషువు మొదటిది, (2)సెప్టంబరు 21న వచ్చెడి దక్షిణాయణ (శరత్) విషువు రెండవది} అందును, గ్రహ యోగ కాలాలలో, దినక్షయ (ఒక అహోరాత్రములో మూడు తిథులు కలిగెడు) దినములలో, సూర్య చంద్ర గ్రహణ సమయాలలో, శ్రవణద్వాదశి అను శ్రవణా నక్షత్ర యుక్త భాద్రపద శుద్ద ద్వాదశిలో, వైశాఖ శుక్ల తదియలలో, కార్తీక శుక్ల నవమిలో మున్నగు పవిత్ర దినాలలో శ్రాద్ధకర్మలూ, జపహోమాదులూ, పుణ్యకర్మలూ జరిపించాలి.
ఇంకా హేమంత శిశిరాలలో, మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాలలో వచ్చే కృష్ణపక్ష అష్టమీ తిథులలోనూ, వాటి ముందు వెనుక సప్తమి, నవమి రోజులలో; ఈ నాలుగు అష్టకాలలోనూ, మాఘ శుక్ల సప్తమిలో, జన్మ నక్షత్రంతో కూడిన ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర తిథు లందు, ఇంకనూ ప్రశస్తమైన కాలాలో, జననీ జనకులకూ బంధువులకూ శ్రాద్ధములూ, జపహోమాలూ, స్నానాలూ, వ్రతాలూ, దేవ బ్రాహ్మణ సమారాధనలూ చేస్తూ ఉండాలి. భార్యకు పుత్రుడు పుట్టాలని చేసే పుంసవనం వంటి వేడుకలూ, బిడ్డలకు జాతకర్మలూ మొదలైనవీ, యజ్ఞదీక్షాదికమూ, మృతిదినమును అనుసరించి సాంవత్సరీకాలూ మున్నగు కర్మలూ గృహస్థు డైనవాడు శ్రద్ధగా ఆచరించాలి.

తెభా-7-449-మ.
విను మే దేశములన్ దయాగుణతపోవిద్యాన్వితం బైన వి
ప్రనికాయంబు వసించు, నే స్థలములన్ భాగీరథీముఖ్య వా
హినులుండున్, హరిపూజ లెయ్యెడల భూయిష్ఠప్రకారంబులం
రున్, భూవర! యట్టి చోటులఁ దగున్ ర్మంబులం జేయఁగన్.

టీక:- వినుము = వినుము; ఏ = ఎట్టి; దేశములన్ = ప్రదేశములందు; దయాగుణ = కరుణ; తపః = తపస్సు; విద్యా = పాండిత్యములతో; అన్వితంబున్ = కూడినవారు; ఐన = అయిన; విప్ర = బ్రాహ్మణుల; నికాయంబు = సమూహములు; వసించున్ = నివసించునో; ఏ = ఏ; స్థలములన్ = ప్రదేశములందు; భాగీరథి = గంగానది; ముఖ్య = మొదలగు; వాహినులు = నదులు; ఉండున్ = ఉండునో; హరి = విష్ణుమూర్తి యొక్క; పూజలు = అర్చనలు; ఎయ్యెడలన్ = ఎక్కడనైతే; భూయిష్ఠ = అధికమైన; ప్రకారంబులన్ = పద్ధతులలో; తనరున్ = పెంపొందునో; భూవర = రాజా; అట్టి = అటువంటి; చోటులన్ = ప్రదేశములందు; తగున్ = చేయతగును; ధర్మంబులన్ = ధర్మకార్యములను; చేయగన్ = చేయుట.
భావము:- ఓ నరోత్తమా! ధర్మరాజా! ఏ దేశంలో దయ, గుణ, శీల, తపో, విద్యానిధులు అయిన విప్రవరేణ్యులు సుఖంగా జీవిస్తూ ఉంటారో, ఏ ప్రదేశంలో భాగీరథి మొదలైన పవిత్ర నదులు ప్రవహిస్తూ ఉంటాయో, ఎక్కడ విష్ణుపూజలూ పుష్కలంగా జరుగుతూ ఉంటాయో, అట్టి ప్రదేశాలలో ధర్మకార్యాలు నిర్వర్తించాలి.

తెభా-7-450-క.
రి యందు జగము లుండును
రిరూపము సాధుపాత్ర మందుండు శివం
మగు పాత్రము గలిగిన
యఁగ నది పుణ్యదేశ నఘచరిత్రా!

టీక:- హరి = విష్ణుమూర్తి; అందున్ = అందు; జగములు = లోకములు; ఉండును = ఉండును; హరి = విష్ణుని; రూపము = స్వరూపము; సాధు = సాధుస్వభావముగల; పాత్రము = దేహము; అందున్ = లో; ఉండు = ఉండును; శివంకరము = శుభముకలిగించునది; అగు = అయిన; పాత్రమున్ = దేహి; కలిగినన్ = ఉన్నచో; అరయగన్ = తరచిచూడగా; అది = అది; పుణ్య = ఉత్తమమైనతీర్థ; దేశము = ప్రదేశము; అనఘ = పావనమైన; చరిత్రా = నడవడికగలవాడ.
భావము:- పుణ్యాత్ముడవైన ధర్మరాజా! లోకాలు అన్నీ విష్ణుమూర్తి యందే ఉంటాయి. అట్టి విష్ణువు సాధు పురుషులలో ఉంటాడు. అటువంటి పుణ్య పురుషుడు లభించు చోటు ఏదైతే ఉందో అది పుణ్యస్థలము

తెభా-7-451-వ.
మఱియు గురుక్షేత్రంబును, గయాశీర్షంబును, బ్రయాగంబును, బులహాశ్రమంబును, నైమిశంబును, ఫాల్గుణంబును, సేతువును, బ్రభాసంబును, గుశస్థలియును, వారణాసియు, మధురాపురియును, బంపా బిందు సరోవరంబులును, నారాయణాశ్రమంబును, సీతారామాశ్రమంబును, మహేంద్ర మలయాదులయిన కులాచలంబులును, హరిప్రతిమార్చన ప్రదేశంబులును, హరిసేవాపరులయిన పరమభాగవతులు వసించెడి పుణ్యక్షేత్రంబులును శుభకాముండైనవాఁడు సేవింపవలయు.
టీక:- మఱియున్ = ఇంకను; కురుక్షేత్రంబును = కురుక్షేత్రము {కురుక్షేత్రము - కౌరవ పాండవులు యుద్ధము చేసిన చోటు}; గయాశీర్షంబును = గయ {గయాశీర్షము - గయాసురుని శిరస్సుగల పుణ్యప్రదేశము, గయ}; ప్రయాగంబును = ప్రయాగ {ప్రయాగ - త్రివేణీసంగమముగల చోటు}; పులహ = పులహమహామునియొక్క; ఆశ్రమంబును = ఆశ్రమముగల చోటు; నైమిశంబును = నైమిశారణ్యము; ఫాల్గుణంబును = ఫల్గుణీనదీ తీరము; సేతువు = రామసేతువు,రామేశ్వరము; ప్రభాసంబును = ప్రభాసతీర్థమును; కుశస్థలియును = కుశస్థలి; వారణాసియున్ = కాశీనగరము; మధురాపురి = మధురాపట్టణము; పంపా = పంపా; బిందు = బిందు; సరోవరంబులును = సరస్సులు; నారాయణాశ్రమంబును = నారాయణాశ్రమము {నారాయణాశ్రమము - నరనారాయ ణులు తపముచేసిన ప్రదేశము}; సీతారామాశ్రమంబును = పంచవటి {సీతారామాశ్రమము - సీతరాములు కొన్నాళ్ళు కాపురమున్న పంచవటిలోని ఒక ప్రదేశము}; మహేంద్ర = మహేంద్రపర్వతము; మలయ = మలయప్రవతము; ఆదులు = మున్నగునవి; అయిన = ఐన; కులాచలంబులును = కులపర్వతములును {కులపర్వతములు - 1మహేంద్రము 2మలయము 3సహ్యము 4మాల్యవంతము 5ఋక్షము 6వింధ్యము 7 పారియాత్రము}; హరి = విష్ణుని; ప్రతిమ = విగ్రహములను; అర్చన = పూజించెడి; ప్రదేశంబులును = ప్రదేశములు; హరి = విష్ణుని; సేవా = కొలచుటయందు; పరులు = లగ్నమైనవారు; అయిన = ఐన; పరమ = అత్యుత్తమమైన; భాగవతులు = విష్ణుభక్తులు; వసించెడి = నివసించెడి; పుణ్య = పావనమైన; క్షేత్రంబులును = స్థలములు; శుభ = మంగళప్రదమును; కాముండు = కోరెడివాడు; ఐన = అయిన; వాడు = వాడు; సేవింపవలయు = కొలువవలెను.
భావము:- ఇంకా, కురుక్షేత్రము {కౌరవ పాండవులు యుద్ధము చేసిన చోటు}; గయ {గయాసురుని శిరోస్థానమైన పుణ్యప్రదేశము}; ప్రయాగ {గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణీసంగమ స్థానము}; పులహ మహాముని యొక్క ఆశ్రమము; నైమిశారణ్యము; ఫల్గుణీనదీ తీరము; రామేశ్వరము {శ్రీరాముడు సమద్రంపై సేతువు కట్టిన స్థానము}; ప్రభాసతీర్థము; కుశస్థలి; కాశీనగరము; మధురాపట్టణము; పంపా, బిందు సరోవరములు; నారాయణాశ్రమము {నర నారాయణులు తపము చేసిన ప్రదేశము}; పంచవటి {సీతరాములు కొన్నాళ్ళు కాపురమున్న పంచవటిలోని ఒక ప్రదేశము}; కులపర్వతములు {1మహేంద్రము 2మలయము 3సహ్యము 4మాల్యవంతము 5ఋక్షము 6వింధ్యము 7పారియాత్రము}; వైష్ణవాలమాలు; మరియు పరమ భాగవతులూ, వైష్ణవ భక్తులు నివసించే ప్రదేశములు ఇవన్నీ పరమ పుణ్యక్షేత్రాలు. శుభాలను కోరేవారు వాటిని తప్పక సేవించాలి.

తెభా-7-452-ఆ.
భూవరేంద్ర! యిట్టి పుణ్యప్రదేశంబు
లందు నరుడు చేయు ట్టి ధర్మ
ల్పమైన నది సస్రగుణాధిక
లము నిచ్చు హరికృపావశమున.

టీక:- భూవరేంద్ర = మహారాజా {భూవరేంద్ర - భూవరుల (రాజుల)లో ఇంద్రుడు (శ్రేష్ఠుడు), మహారాజు}; ఇట్టి = ఇటువంటి; పుణ్యప్రదేశంబులు = పుణ్యక్షేత్రముల; అందున్ = లో; నరుడు = మానవుడు; చేయునట్టి = చేసెడి; ధర్మము = పుణ్యకార్యము; అల్పము = కొంచెము; అయినన్ = అయినను; అది = అది; సహస్ర = వేయి; గుణ = రెట్లుకంటెను; అధిక = ఎక్కువ; ఫలమున్ = ఫలితమును; ఇచ్చున్ = ఇచ్చును; హరి = విష్ణుని; కృపా = దయ; వశమున = వలన.
భావము:- యుధిష్ఠర మహారాజా! ఇటువంటి పుణ్యక్షేత్రాలలో చేసిన ధర్మకార్యం, శ్రీహరి దయావిశేషం వలన, వెయ్యి రెట్లు అధికమైన ఫలమును ప్రసాదిస్తుంది.

తెభా-7-453-వ.
వినుము; చరాచరంబయిన విశ్వమంతయు విష్ణుమయం బగుటఁ జేసి పాత్ర నిర్ణయ నిపుణులైన విద్వాంసులు నారాయణుండు ముఖ్యపాత్రంబని పలుకుదురు; దేవఋషులును బ్రహ్మపుత్రులైన సనకాదులును నుండ భవదీయ రాజసూయంబున నగ్రపూజకు హరి సమ్మతుం డయ్యె; ననేక జంతు సంఘాత సంకీర్ణంబైన బ్రహ్మాండ పాదపంబునకు నారాయణుండు మూలంబు; తన్నిమిత్తంబు నారాయణ సంతర్పణంబు సకల జంతు సంతర్పణం బని యెఱుంగుము; ఋషి నర తిర్య గమర శరీరంబులు పురంబులు వాని యందుఁ దారతమ్యంబులతోడ జీవరూపంబున భగవంతుడయిన హరి వర్తించుటం జేసి పురుషుండనఁ బ్రసిద్ధుఁ డయ్యె; నందుఁ దిర్యగ్జాతుల కంటె నధికత్వంబు పురుషుని యందు విలసిల్లుటం జేసి పురుషుండు పాత్రంబు; పురుషులలోన హరి తనువైన వేదంబును ధరించుచు సంతోషవిద్యాతపోగరిష్ఠుండైన బ్రాహ్మణుండు పాత్రంబు; బ్రాహ్మణులలోన నాత్మజ్ఞాన పరిపూర్ణుండయిన యోగి ముఖ్యపాత్రం బని పలుకుదురు; పరస్పర పాత్రంబులకు సహింపని మనుష్యులకుఁ బూజనార్థంబుగాఁ ద్రేతాయుగంబు నందు హరి ప్రతిమలు గల్పింప బడియె; కొందఱు ప్రతిమార్చనంబు చేయుదురు; పాత్రపురుషద్వేషు లైనవారలకు నట్టి ప్రతిమార్చనంబు ముఖ్యార్థప్రదంబు గాదు; మందాధికారులకుఁ బ్రతిమార్చనంబు పురుషార్థప్రదం బగును.
టీక:- వినుము = వినుము; చర = చరింపగలవి; అచరంబు = చరింపలేనివి; అయిన = ఐన; విశ్వము = జగత్తు; అంతయున్ = అఖిలము; విష్ణు = విష్ణుమూర్తి; మయంబు = నిండినది; అగుటన్ = అగుట; చేసి = వలన; పాత్ర = అర్హతను, యోగ్యతను; నిర్ణయ = నిర్ణయించుటయందు; నిపుణులు = నేర్పుగలవారు; ఐన = అయిన; విద్వాంసులు = పండితులు; నారాయణుండు = శ్రీమహావిష్ణువు; ముఖ్య = అత్యుత్తమమైన; పాత్రంబు = యోగ్యతగలవాడు; అని = అని; పలుకుదురు = చెప్పెదరు; దేవఋషులును = దేవర్షులు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; పుత్రులు = కుమారులు; ఐన = అయిన; సనకాదులును = సనకాదులు {సనకాదులు - 1సనకుడు 2సనందనుడు 3సనత్కుమారుడు 4సనత్సుజాతుడు అనెడి దేవర్షులు}; ఉండన్ = ఉండగా; భవదీయ = నీ యొక్క; రాజసూయంబునన్ = రాజసూయ యాగమున; అగ్ర = అందరికన్న పెద్దవారికి చేసెడి; పూజ = అర్చించుట; కున్ = కు; హరి = శ్రీకృష్ణుడు; సమ్మతుండు = అంగీకరించినవాడు; అయ్యెన్ = అయ్యెను; అనేక = పెక్కు; జంతు = జీవుల; సంఘాత = సమూహములచేత; సంకీర్ణంబు = కిక్కిరిసినది; ఐన = అయిన; బ్రహ్మాండ = బ్రహ్మాండము యనెడి; పాదపంబున్ = చెట్టున; కున్ = కు; నారాయణుండు = శ్రీమహావిష్ణువు; మూలంబు = వేరు, మూలము; తత్ = ఆ; నిమిత్తంబు = కారణముచేత; నారాయణ = విష్ణుమూర్తిని; సంతర్పణంబు = తృప్తిపరచుట; సకల = సమస్తమైన; జంతు = జీవుల; సంతర్పణంబు = సంతృప్తిపరచుట; అని = అని; ఎఱుంగుము = తెలిసికొనుము; ఋషి = ఋషుల; నర = నరుల; తిర్యక్ = జంతువుల; అమర = దేవతల; శరీరంబులు = దేహములు; పురంబులు = పురములు; వాని = వాటి; అందున్ = లో; తారతమ్యంబుల = తరతమభేదముల, ఎక్కువతక్కువల; తోడన్ = తోటి; జీవ = జీవుని; రూపంబునన్ = స్వరూపముతో; భగవంతుడు = నారాయణుడు {భగవంతుడు - షడ్గుణైశ్వర్యసంపన్నుడు, విష్ణువు}; అయిన = ఐన; హరి = నారాయణుడు; వర్తించుటన్ = ఉండుట; చేసి = వలన; పురుషుండు = పురుషుడు {పురుషుడు - పురములోనుండువాడు}; అనన్ = అనగా; ప్రసిద్ధుడు = పేరుపొందినవాడు; అయ్యెన్ = అయ్యెను; అందున్ = వానిలో; తిర్యక్ = జంతువుల; జాతుల = జాతులన్నిటి; కంటెన్ = కంటెను; అధికత్వంబు = గొప్పదనము; పురుషుని = మానవుని; అందున్ = అందు; విలసిల్లుటన్ = ప్రకాశించుట; చేసి = వలన; పురుషుండు = మానవుడు; పాత్రంబు = అధికయోగ్యుడు; పురుషుల = మానవుల; లోనన్ = అందు; హరి = నారాయణుని; తనువు = దేహము; ఐన = అయిన; వేదంబును = వేదములను; ధరించుచున్ = కలిగియుండి; సంతోష = నిత్యతృప్తి; విద్యా = చదువు; తపస్ = తపస్సులందు; గరిష్ఠుండు = అధికుడు; ఐన = అయిన; బ్రాహ్మణుండు = విప్రుడు; పాత్రంబు = అధిక యోగ్యుడు; బ్రాహ్మణుల = విప్రుల; లోనన్ = అందు; ఆత్మజ్ఞాన = బ్రహ్మవిద్యయందు; పరిపూర్ణుండు = నిండుగాగలవాడు; అయిన = ఐన; యోగి = యోగి {యోగి - చిత్తనిరోధముగలవాడు}; ముఖ్య = ఉత్తమోత్తమ; పాత్రంబు = యోగ్యతగలవాడు; అని = అని; పలుకుదురు = చెప్పెదరు; పరస్పర = అన్యోన్య; పాత్రంబుల్ = యోగ్యతలగౌరవాదులను; సహింపని = ఓర్వలేని; మనుష్యుల్ = మానవుల; కున్ = కు; పూజనంబు = పూజించుకొనుటకు; కాన్ = కొరకు; త్రేతాయుగంబున్ = త్రేతాయుగము; అందున్ = లో; హరి = నారాయణుని; ప్రతిమలు = విగ్రహములు, బొమ్మలు; కల్పింపబడియెన్ = ఏర్పరచబడినవి; కొందఱు = కొంతమంది; ప్రతిమార్చనంబు = విగ్రహారాధన; చేయుదురు = చేసెదరు; పాత్రపురుష = పురుషుల యోగ్యతా భేదభావమందు; ద్వేషులు = వ్యతిరేకులు; ఐనట్టి = అయిన; వారల = వారి; కున్ = కి; ప్రతిమ = విగ్రహమును; అర్చనంబు = ఆరాధించుట; ముఖ్యార్థ = అధికఫల; ప్రదంబున్ = ఇచిచునది; కాదు = కాదు; మంద = మందమైన, కొంచమైన; అధికారుల్ = యోగ్యతగలవారి; కున్ = రి; ప్రతిమ = విగ్రహమును; అర్చనంబు = ఆరాధించుట; పురుషార్థ = ధర్మార్థకామమములను; ప్రదంబున్ = ఇచ్చునది; అగును = అగును.
భావము:- ఈ చరాచర విశ్వం సమస్తం విష్ణుమయం; అందుకనే అర్హతను గమనించి నిర్ణయించే నైపుణ్యంగల విద్వాంసులు విష్ణువునే ముఖ్యమైన సత్పాత్రముగా నిశ్చయించారు. ఈ రోజున ఈ రాజసూయ మహాయాజ్ఞ వేదికపై దేవతలూ, ఋషులూ, బ్రహ్మ మానసపుత్రులైన సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మున్నగువారు ఎందరో ఉండగా, అగ్రపూజకు శ్రీహరినే ఎన్నుకున్నారు; అందుకు ఆయన సమ్మతించాడు; కారణం ఇదే. అనేకమైన జంతు సమూహాలతో నిండి నిబిడీకృతమైన ఈ బ్రహ్మాండం అనే మహా వృక్షానికి మూలం శ్రీమన్నారాయణుడే. ఆ కారణం చేతనే శ్రీహరికి తృప్తిగా నివేదిస్తే, సకల ప్రాణికోటికీ సంతర్పణ చేసినట్లే. దేవతలు, ఋషి, మానవ, పశు పక్ష్యాది శరీరాలు అన్నీ పురములు; తరతమ భేదాలను అనుసరించి జీవరూపంలో ఆ పురములు అన్నింటి యందు భగవంతుడైన శ్రీమహావిష్ణువు వర్తిస్తూ ఉంటాడు. అందుకనే శ్రీహరిని “పురుషుడు” “పరమ పురుషుడు” అంటారు. ఇందులో కూడా అడ్డముగా నడిచే తిర్యక్కులు కంటే ఎక్కువగా నిలువుగా నడిచే మానవులు హరి విలసిల్లుతాడు. కావున మనిషి పాత్రుడు. మరల విష్ణుస్వరూపమైన వేదములను నిత్యం పఠిస్తూ, వల్లిస్తూ, ఉద్ధరిస్తూ ఉంటాడు కనుక మనుషులలో బ్రాహ్మణుడు పాత్రుడు. ఇంకా బ్రాహ్మణులలో కూడా ఆత్మజ్ఞానం పూర్తిగా పొందిన యోగి ప్రధాన పాత్రుడు అని పెద్దలు చెప్తారు. పరస్పర అర్హతలను గౌరవాదరాలను సహింపలేని మానవులు పూజచేసుకోవటం కోసం త్రేతాయుగంలో విష్ణుప్రతిమలు కల్పించబడ్డాయి. కొందరు విగ్రహారాధనలు చేస్తారు. కానీ పాత్రత భేదాలకు అతీతంగా సర్వం భగవతుంని స్వరూపమే అని భావించే వారికి విగ్రహారాధన ఫలప్రదం కాదు. సామాన్యులకు మాత్రం విగ్రహారాధన సర్వ ఫలప్రదంగా ఉంటుంది.

తెభా-7-454-ఆ.
ఖిలలోకములకు రి దైవతము చూడ
రికి దైవతము ధరాధినాథ!
దపరాగలేశ పంక్తిచేఁ ద్రైలోక్య
పావనంబు జేయు బ్రాహ్మణుండు.

టీక:- అఖిల = సర్వ; లోకముల్ = లొకముల; కున్ = కు; హరి = నారాయణుడు; దైవతము = అత్యుత్తమదేవుడు {దైవము - దైవతర - దైవతము}; చూడన్ = విచారించగా; హరి = నారాయణుని; కిన్ = కి; దైవతము = ఉత్తమదేవుడు; ధరాధినాథ = రాజా {ధరాధినాథుడు - ధర (భూమిక్) అధినాథుడు (పైఅధికారి), రాజు}; పద = పాదముల; పరాగ = దుమ్మునందలి; లేశ = కొంచపు; పంక్తి = రేణువుల; చేన్ = వలన; త్రైలోక్య = ముల్లోకముల; పావనంబు = పవిత్రము; చేయు = చేసెడి; బ్రాహ్మణుండు = విప్రుడు.
భావము:- పృథివీపతీ! ధర్మరాజా! సమస్తమైన లోకాలకు విష్ణువే అధిదేవుడు. ఆ శ్రీమన్నారాయణునికి దైవము తన పాద పరాగ లేశము వలన ముల్లోకాలనూ పావనం చేసే బ్రాహ్మణుడు.

తెభా-7-455-వ.
అట్టి బ్రాహ్మణజను లందుఁ గర్మనిష్ఠులుఁ దపోనిష్ఠులు వేదశాస్త్రనిష్ఠులు జ్ఞానయోగనిష్ఠులు నై కొందఱు వర్తింతు; రందు జ్ఞాననిష్ఠునికి ననంతఫలకామి యైన గృహస్థుండు పితృజనుల నుద్దేశించి కవ్యంబులును దేవతల నుద్దేశించి హవ్యంబులును బెట్టుట ముఖ్యంబు; దైవకార్యంబునకు నిరువుర నైన నొకరి నైన బిత్రుకార్యంబునకు మువ్వురి నైన నొకరినైన భోజనంబు చేయింప వలయు; ధనవంతున కైనను శ్రాద్ధవిస్తారంబు కర్తవ్యంబు గాదు; దేశకాలప్రాప్త కందమూలఫలాదికం బయిన హరి నైవేద్యంబున విధిచోదిత ప్రకారంబుగా శ్రద్ధతోడఁ బాత్రంబు నందుఁ బెట్టిన యన్నంబు గామదుహంబయి యక్షయ ఫలకారి యగు; ధర్మతత్త్వవేది యైనవాఁడు శ్రాద్ధంబులందు మాంస ప్రదానంబు జేయక భక్షింపక చరింపవలయు; కంద మూలాది దానంబున నయ్యెడి ఫలంబు పశుహింసనంబున సంభవింపదు; ప్రాణహింస చేయక వర్తించుట కంటె మిక్కిలి ధర్మంబు లేదు; యజ్ఞవిదు లైన ప్రోడలు నిష్కాములై బాహ్యకర్మంబులు విడిచి యాత్మ జ్ఞాన దీపంబులందుఁ గర్మమయంబు లయిన యజ్ఞంబుల నాచరింతురు.
టీక:- అట్టి = అటువంటి; బ్రాహ్మణ = విప్రులైన; జనులు = వారి; అందున్ = లో; కర్మనిష్ఠులు = యాగాదికర్మలు చేయువారు; వేదశాస్త్రనిష్ఠులు = వేదములు శాస్త్రములులో నిపుణులు; జ్ఞానయోగనిష్ఠులు = తత్త్వ జ్ఞానయోగము గలవారు; ఐ = అయ్యి; కొందఱు = కొంతమంది; వర్తింతురు = మెలగుదురు; అందున్ = వారిలో; జ్ఞాననిష్ఠుని = జ్ఞాని; కిన్ = కి; అనంత = అనంతమైన; ఫల = ఫలములను; కామి = కోరెడివాడు; ఐన = అయిన; గృహస్థుండు = కాపురస్థుడు; పితృ = పితృదేవతలుయైన; జనులను = వారిని; ఉద్దేశించి = గురించి; కవ్యంబులునున్ = కవ్యములను {కవ్యములు - పితృదేవతలకు యీయదగిన యన్నములు}; దేవతల్ = దేవతలను; ఉద్దేశించి = గురించి; హవ్యంబులును = హవ్యములను {హవ్యములు - దేవతలకీయదగిన యిగిర్చిన యన్నము మొదలగునవి}; పెట్టుట = ఇచ్చుట; ముఖ్యంబు = అవశ్యకములు; దైవ = దేవసంబంధ; కార్యంబున్ = పూజలకు; ఇరువురన్ = ఇద్దరిని (2); ఐనన్ = అయిన; ఒకరిన్ = ఒకరిని; ఐనన్ = అయిన; పితృ = తండ్రితాతలకు చెందిన; కార్యంబున్ = కార్యక్రమముల; కున్ = కు; మువ్వురిన్ = ముగ్గురుని; ఐనన్ = అయిన; ఒకరిన్ = ఒకరిని; ఐనన్ = అయిన; భోజనంబు = భోక్తగా భోజనము; చేయింపవలయు = పెట్టవలెను; ధనవంతున్ = ఎంతసంపదగలవాని; కైననన్ = కి అయినను; శ్రాద్ధ = తద్దినము విషయములో; విస్తారంబు = ఎక్కువ భోక్తలను పెట్టుట; కర్తవ్యంబు = చేయదగినపని; కాదు = కాదు; దేశ = ఉన్నప్రదేశము; కాల = కాలములందు; ప్రాప్త = లభించెడి; కందమూల = దుంపలు; ఫల = పండ్లు; ఆదికంబున్ = మున్నగునవి; అయిన = ఐన; హరి = నారాయణుని; నైవేద్యంబునన్ = నివేదింపబడినవిగా; విధిచోదితప్రకారంబునన్ = శాస్త్రోక్తంబుగా; శ్రద్ధ = శ్రద్ధ; పాత్రంబున్ = పళ్ళెము; అందున్ = లో; పెట్టిన = పెట్టినట్టి; అన్నంబు = అన్నము; కామ = కోరికలు; దుహంబు = ఒసగునది; అయి = అయ్యి; అక్షయ = అనంతమైన; ఫల = ఫలములను; కారి = కలిగించెడిది; అగున్ = అగును; ధర్మ = ధర్మము; తత్త్వ = తత్త్వజ్ఞానము; వేది = తెలిసినవాడు; ఐనవాడు = అయినవాడు; శ్రాద్ధంబుల్ = తద్దినముల; అందున్ = లో; మాంస = మాంసమును; ప్రదానంబు = పెట్టుట; చేయక = చేయకుండ; భక్షింపక = తినకుండ; చరింపవలయున్ = నడవవలెను; కందమూల = కందదుంప; ఆది = మున్నగువాని; దానంబునన్ = దానముచేయుటవలన; అయ్యెడి = కలిగెడి; ఫలంబున్ = ఫలితము; పశు = పశువులను; హింసనంబునన్ = చంపుటవలన; సంభవింపదు = కలుగదు; ప్రాణహింస = జీవహింస; చేయక = చేయకుండ; వర్తించుట = మెలగుట; కంటెన్ = కంటె; మిక్కిలి = అధికమైన; ధర్మంబు = ధర్మము; లేదు = లేదు; యజ్ఞ = యాగముల యొక్క; విదులు = విధానములుతెలిసినవారు; ఐన = అయిన; ప్రోడలు = వివేకులు, నేర్పరులు; నిష్కాములు = కోరికలులేనివారు; ఐ = అయ్యి; బాహ్య = వ్యక్తమగు; కర్మంబులు = కర్మలు; విడిచి = వదలివేసి; ఆత్మజ్ఞాన = ఆత్మజ్ఞానము యనెడి; దీపంబుల్ = దీపకాంతుల; అందున్ = అందు; కర్మ = (మానసిక) కర్మలతో; మయంబులు = నిండినవి; అయిన = ఐన; యజ్ఞంబులన్ = దీక్షలను; ఆచరింతురు = చేయుదురు.
భావము:- అటువంటి బ్రాహ్మణులలో కర్మనిష్ఠులూ, తపోధనులు, వేద వేదాంగ వేత్తలు, జ్ఞాన యోగులూ కొందరు ప్రకాండులు అయి మహాత్ములుగా ప్రకాశిస్తారు. జ్ఞానిష్ఠాగరిష్ఠుడైన వానికి అనంత ఫలాలను కాంక్షించే గృహస్థుడు తన పితృజనులకు ఉద్దేశించిన కవ్యమునూ, దేవతలకు ఉద్దేశించిన హవ్యమునూ సమర్పించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయము. దేవకార్యాలకు ఇద్దరికీ, పితృకార్యాలకు ముగ్గరికీ లేదా ఒక్కరికీ భోజనం పెట్టాలి. కానీ ఎంత ధనవంతుడైన శ్రాద్ధవిధికి అధికంగా చేయకూడదు. ఆ ప్రాంతంలో, ఆ కాలంలో లభించిన కందమూల, ఫలాదికములు మరియు అన్నం విధి ప్రకారం శ్రద్ధగా బ్రాహ్మణులకు సమర్పించాలి. ఆ సంతర్పణ గృహస్థుని వాంఛలు నెరవేర్చే అక్షయ ఫలములను ప్రసాదిస్తుంది. ధర్మశాస్త్రం తెలిసిన గృహస్థుడు శ్రాద్ధ కాలంలో మాంసం వడ్డించ కూడదు. తాను భుజించనూ కూడదు. కందమూలాదులు దానం చేస్తే వచ్చే పుణ్యఫలం జంతుహింసవలన ఎప్పుడూ లభించదు. ప్రాణిహింస చేయకుండా ఉండటం కంటే గొప్పధర్మం మరొకటి లేదు. అహింసయే పరమధర్మం. యజ్ఞతత్వం తెలిసిన పెద్దలు నిష్కాములై బాహ్యకర్మలు విడిచిపెట్టి ఆత్మజ్ఞాన దీప్తితోనే కర్మమయా లైన యజ్ఞాలు నిర్వహిస్తారు.

తెభా-7-456-క.
శువులఁ బొరిగొని మఖములు
విదములుగఁ జేయు బుధుని వీక్షించి తమున్
విసనము చేయునో యని
క్రశిమన్ బెగడొందు భూతణము నరేంద్రా!

టీక:- పశువులన్ = పశువులను; పొరిగొని = వధించి; మఖములున్ = యజ్ఞములను; విశదములుగన్ = విస్తారముగ; చేయు = చేసెడి; బుధుని = జ్ఞానిని; వీక్షించి = చూసి; తమున్ = తమను; విశసనము = వధించుట; చేయునో = చేయును ఏమో; అని = అని; క్రశిమన్ = కుందుటచేత; బెగడొందున్ = బెంగపడును; భూత = జంతు; గణము = జాలము; నరేంద్ర = రాజా.
భావము:- ధర్మజ మాననాథా! యజ్ఞాలలో పశుహింస చేసే పండితులను చూసి వీరు ఎప్పుడు తమ ప్రాణాలు తీసి చంపేస్తారో అనే భయంతో మిగతా జంతువులు కూడా కృశించిపోతాయి.

తెభా-7-457-వ.
అదిగావున; ధర్మవేది యయినవాఁడు దైవప్రాప్తంబు లయిన కంద మూలాదికంబులచేత నిత్యనైమిత్తికక్రియలఁ జేయవలయు; నిజధర్మబాధకం బయిన ధర్మంబును, బరథర్మప్రేరితంబయిన ధర్మంబును, నాభాసధర్మంబును, బాషండధర్మంబును, గపటధర్మంబును ధర్మజ్ఞుండయినవాఁడు మానవలయు; నైసర్గికధర్మంబు దురితశాంతి సమర్థం బగు; నిర్ధనుండు ధర్మార్థంబు యాత్ర జేయుచు నైన ధనంబు గోరవలదు జీవనోపాయంబునకు నిట్టట్టుఁ దిరుగక కార్పణ్యంబు లేక జీవించుచు మహాసర్పంబు తెఱంగున సంతోషంబున నాత్మారాముండై యెద్ధియుం గోరక బ్రదికెడి సుగుణునికిం గల సుఖంబు గామ లోభంబుల దశదిశలం బరిధావనంబు చేయువానికి సిద్ధింపదు; పాదరక్షలు గలవానికి శర్కరాకంటకాదుల వలన భయంబు లేక మెలంగ నలవడు భంగిఁ గామంబులవలన నివృత్తి గలవానికి నెల్లకాలంబును భద్రంబగు; ఉపస్థమునకును జిహ్వాదైన్యంబునకును బురుషుండు గృహపాలకశునకంబుకైవడి సంచరించుచు సంతుష్టి లేక చెడు; సంతోషిగాని విప్రుని విద్యా తపో విభవ యశంబులు నిరర్థకంబు లగు; ఇంద్రియలోలత్వంబున జ్ఞానంబు నశించు; సకల భూలోక భోగంబులు భోగించియు దిగ్విజయంబు చేసియు బుభుక్షా పిపాసలవలనఁ గామపారంబును హింసవలనఁ గ్రోధపారంబును జేరుట దుర్లభంబు; సంకల్పవర్జనంబునం గామంబును, గామవర్జనంబునఁ గ్రోధంబును, నర్థానర్థదర్శనంబున లోభంబును, నద్వైతాను సంధానంబున భయంబును, నాత్మానాత్మ వివేకంబున శోకమోహంబులును, సాత్వికసేవనంబున దంభంబును, మౌనంబున యోగాంతరాయంబును, శరీర వాంఛ లేమిని హింసయు, హితాచరణంబున భూతజంబయిన దుఃఖంబును, సమాధిబలంబున దైవికవ్యధయు, బ్రాణాయామాదికంబున మన్మథవ్యధయు, సాత్త్వికాహారంబుల నిద్రయు, సత్త్వగుణంబున రజస్తమంబులును, నుపశమంబున సత్త్వంబును గురుభజన కుశలుఁడై శీలంబున జయింపవలయు.
టీక:- అదిగావున = అందుచేత; ధర్మ = ధర్మమును; వేది = తెలిసినవాడు; అయినవాడు = ఐనవాడు; దైవ = దేవునివశమున; ప్రాప్తంబులు = దొరికినవి; అయిన = ఐన; కందమూల = కందదుంపలు; ఆదికంబుల = మున్నగునవాని; చేత = చేత; నిత్య = ప్రతిదినము చేయవలసిన; నైమిత్తిక = సందర్భానుసారమైన; క్రియలన్ = పూజాది కార్యక్రమములను; చేయవలయున్ = చేయవలెను; నిజ = తన; ధర్మ = ధర్మమునకు; బాధకంబు = చెరచెడిది; అయిన = ఐన; ధర్మంబును = ధర్మమును; పర = ఇతర; ధర్మ = ధర్మములచే, మతములచే; ప్రేరితంబు = ప్రేరేపించబడినది; అయిన = ఐన; ధర్మంబు = ధర్మము; ఆభాస = నిజమైనదనిపించెడి అబద్ధ; ధర్మంబును = ధర్మము; పాషాండ = వేదవిరుద్ధ; ధర్మంబును = ధర్మము; కపట = మోసపూరిత; ధర్మంబును = ధర్మమును; ధర్మజ్ఞుండు = ధర్మము తెలిసినవాడు; అయినవాడు = ఐనవాడు; మానవలయున్ = విడిచిపెట్టవలెను; నైసర్గిక = స్వభావసిద్ధ; ధర్మంబు = ధర్మము; దురిత = పాపములను; శాంతి = అణచుటకు; సమర్థంబు = శక్తిగలది; అగున్ = అగును; నిర్ధనుండు = బీదవాడు; ధర్మ = ధర్మము; అర్థంబున్ = కోసము; యాత్ర = పుణ్యక్షేత్రములకు పోవుట; చేయుచున్ = చేయుచును; ఐనన్ = అయినను; ధనంబున్ = ధనమును; కోరవలదు = అడుగరాదు; జీవనోపాయంబున్ = బ్రతుకుతెరువు; కున్ = కు; ఇట్టట్టు = ఇటునటు; తిరుగక = పోకుండగ; కార్పణ్యంబు = దైన్యము; లేక = లేకుండగ; జీవించుచున్ = బ్రతుకుతు; మహాసర్పంబు = కొండచిలువ; తెఱంగున = వలె; సంతోషంబునన్ = సంతృప్తితో; ఆత్మారాముండు = తనలోతాను క్రీడించువాడు; ఐ = అయ్యి; ఎద్దియున్ = దేనిని; కోరక = కోరకుండగ; బ్రతికెడి = జీవించెడి; సుగుణున్ = మంచిగుణములు గలవాని; కిన్ = కి; కల = కలిగిన; సుఖంబున్ = సుఖము; కామ = కోరికల; లోభంబుల = పేరాశలచేత; దశదిశలన్ = పదిదిక్కులను; పరిధావనంబు = పరిగెత్తుట; చేయు = చేసెడి; వాని = వాని; కిన్ = కి; సిద్ధింపదు = కలుగదు; పాదరక్షలు = చెప్పులు; కల = ఉన్న; వాని = వాని; కిన్ = కి; శర్కరా = గులకరాళ్ళు; కంటక = ముండ్లు; ఆదుల = మున్నగువాని; వలన = వలన; భయంబు = భయము; లేక = ఉండకుండ; మెలంగన్ = నడచుట; అలవడున్ = అలవాటగు; భంగిన్ = వలె; కామంబుల = కోరికల; వలన = వలన; నివృత్తి = మరలుపాటు; కల = కలిగిన; వాని = వాని; కిన్ = కి; ఎల్లకాలంబును = ఎల్లప్పుడు; భద్రంబు = కుశలము; అగున్ = కలుగును; ఉపస్థమున్ = సురత చాపల్యమున; కును = కు; జిహ్వాదైన్యంబున్ = నోటి వాపిరిగొట్టు తనమున; కును = కు; పురుషుండు = పురుషుడు; గృహ = ఇంటికి; పాలక = కాపలా యుండెడి; శునకంబున్ = కుక్క; కైవడి = వలె; సంచరించుచున్ = తిరుగుచు; సంతుష్టి = సంతృప్తి; లేక = లేకుండగ; చెడును = చెడిపోవును; సంతోషి = సంతోషము; కాని = లేనట్టి; విప్రుని = బ్రాహ్మణుని; విద్యా = చదువులు; తపస్ = తపస్సులు; విభవ = వైభవములు; యశంబులు = కీర్తులు; నిరర్థకంబులు = కొరమాలినవి, వ్యర్థములు; అగున్ = అగును; ఇంద్రియ = ఇంద్రియార్థము లందలి; లోలత్వంబునన్ = చాపల్యమున; జ్ఞానంబు = జ్ఞానము; నశించున్ = నశించిపోవును; సకల = సమస్తమైన; భూలోక = భూలోకపు; భోగంబులు = భోగములను; భోగించియు = అనుభవించియు; దిగ్విజయంబు = సర్వదిక్కులు జయించుట; చేసియు = చేసినను; బుభుక్ష = ఆకలి; పిపాసల = దప్పికల; వలన = వలన; కామ = కోరికల; పారంబును = తుదను; హింస = జీవులను సంహరించుట; వలనన్ = వలన; క్రోధ = కోపము; పారంబును = అంతును; చేరుట = చేరుట; దుర్లభంబు = పొంద శక్యము గానిది; సంకల్ప = మనోవ్యాపారములను; వర్జనంబునన్ = వీడుటవలన; కామంబునున్ = కోరికలు; కామ = కోరికలను; వర్జనంబునన్ = వీడుటవలన; క్రోధంబునున్ = కోపము; అర్థానర్థ = నిత్యానిత్య, ప్రయోజనత్వక; దర్శనంబునన్ = వస్తువివేకమువలన; లోభంబునున్ = పేరాశను; అద్వైతానుసంధానంబునన్ = ఆత్మపరమాత్మల యేకత్వభావము వలన; భయంబును = భయము; ఆత్మానాత్మ = ఆత్మ అనాత్మల; వివేకంబునన్ = విచారించుకొనెడి తెలివివలన; శోక = దుఃఖము; మోహంబులును = అజ్ఞానములు; సాత్వికసేవనంబునన్ = సాధుసాంగత్యమువలన; దంభంబునున్ = డాంబికము; మౌనంబునన్ = మౌనమువలన; యోగ = యోగసాధనయొక్క; అంతరాయంబును = విఘ్నము; శరీర = దేహముపై; వాంఛ = మిక్కిలిప్రేమ; లేమిని = లేకపోవుటచేత; హింసయున్ = జీవహింస; హిత = మేలు; ఆచరణంబునన్ = చేయుట; భూత = జీవులవలన; జంబు = కలిగెడిది; అయిన = ఐన; దుఃఖంబును = దుఃఖము; సమాధి = సమాధియొక్క; బలంబునన్ = ప్రభావముచేత; దైవిక = యదృచ్ఛాప్రాప్తమగు; వ్యధ = బాధ; ప్రాణాయామ = ప్రాణాయామము; ఆదికంబునన్ = మున్నగువానివలన; మన్మథవ్యధయు = కామవికారము; సాత్త్విక = సత్త్వగుణ; ఆహారంబులన్ = ఆహారపదార్థములవలన; నిద్రయున్ = నిద్ర; సత్త్వగుణంబునన్ = సత్త్వగుణమువలన; రజస్ = రజోగుణము; తమంబులును = తమోగుణముల; ఉపశమంబును = అణగుటవలన; సత్త్వంబును = బలోద్రేకములను; గురు = పెద్ధలను; భజన = సేవించెడి; కుశలుడు = నేర్పుగలవాడు; ఐ = అయ్యి; శీలంబునన్ = మంచినడవడికలతో; జయింపవలయు = నిగ్రహించవలెను.
భావము:- అందుచేత, నిత్యనైమిత్తిక క్రియలను దైవప్రాప్తమైన కందమూలాదుల తోనే ధర్మవేత్త అయిన వాడు చేస్తూ ఉండాలి. ధర్మజ్ఞుడు తన వృత్తి ధర్మాన్ని చెడగొట్టేది అయిన ధర్మాన్నీ, పరథర్మం చేత ప్రేరితమైనదీ పైకి మాత్రం ధర్మంలా కనబడేదానిని అనుసరించ రాదు. పాషండ ధర్మమునూ, కపట ధర్మమునూ నిర్వర్తించకూడదు. ప్రకృతి సిద్ధమైన సహజధర్మం పాపాలను పరిహరిస్తుంది. బీదవాడు ధర్మం కోసం సంచారం చేస్తూ కూడా పర ధనం కోరుకోకూడదు.
బీదవాడు జీవనోపాధికి అటూ ఇటూ తిరుగకుండా, దైన్యం చెందకుండా జీవించే కొండచిలువ లాగా సంతోషంగా ఆత్మారాముడిని ఆరాధిస్తూ నిష్కాముడై బ్రతకాలి. అటువంటి సుగుణశీలి పొందే గొప్ప సుఖం, కామ లోభాదులతో పదిదిక్కులకూ పరుగెత్తేవాడికి ఎప్పుడూ లభించదు. పాదరక్షలు కల వాడు రాళ్ళల్లో, ముళ్ళల్లో ఏ భయం లేకుండా ఎలా తిరుగుతాడో, అలా కామముల నుండి నివృత్తి పొందినవాడు ఎల్ల కాలం సుఖంగా ఉంటాడు.
స్త్రీ వ్యసనము వలననూ, జిహ్వాచాపల్యం వలననూ మానవుడు పెంపుడు కుక్కలాగా తిరుగుతూ సంతృప్తిలేక చెడిపోతాడు. సంతుష్టి లేని విప్రునికి గల విద్య, తపస్సు, యశస్సు, వైభవం మున్నగునవి నిరర్థరములు. ఇంద్రియ లోలత్వము వలన మహనీయమైన జ్ఞానం నశిస్తుంది. సకల భూలోక భోగాలూ అనుభవించినా; దిగ్విజయాలు సాధించినా; ఆకలి దుప్పుల వలన కామాన్నీ, హింస వలన క్రోధాన్ని అంతమొందించటం దుర్లభం. సంకల్ప వర్జనంతో కామాన్నీ, కామ వర్జనంతో క్రోధాన్నీ, అర్థానర్థ దర్శనంతో లోభాన్నీ, అద్వైతానుసంధానంతో భయాన్నీ, ఆత్మానాత్మ వివేకంతో శోకమోహాలనూ జయించాలి. సాత్త్వికుల సేవతో కపటాన్నీ, మౌనంతో యోగ విఘ్నాన్నీ, శరీరవాంఛలు లేకుండా ఉండటం వలన హింసనూ నిర్మూలించాలి. సమాధి బలంతో దైవికబాధనూ, ప్రాణాయామంతో మన్మథ వాంఛనూ, సాత్త్వికాహారంతో నిద్రనూ, సత్త్వగుణంతో రజస్తమోగుణాలనూ పోగొట్టుకోవాలి. వినయంతో బలోద్రేకమును జయించాలి. ఈ విధంగా మానవుడు బుధవిధేయుడై, సుగుణశీలుడై కృతార్థుడు కావాలి.

తెభా-7-458-క.
రిమహిమ దనకుఁ జెప్పిన
గురువున్ నరుఁ డనుచుఁ దలఁచి కుంఠితభక్తిం
దిరుగు పురుషు శ్రమ మెల్లను
రిశౌచము క్రియ నిరర్థకం బగు నధిపా!

టీక:- హరి = విష్ణుని; మహిమన్ = ప్రభావము, గొప్పదనము; తన = తన; కున్ = కు; చెప్పిన = చెప్పినట్టి, ఉపదేశించిన; గురువును = దేశికుని; నరుడు = సామాన్యమానవుడు; అనుచున్ = అని; తలచి = భావించి; కుంఠిత = భంగపడిన, కుంటి; భక్తిన్ = భక్తితో; తిరుగు = వర్తించెడి; పురుషు = మానవుని; శ్రమము = కష్టము; ఎల్లను = అంతా; కరి = గజ; శౌచము = శుచిత్వము; క్రియన్ = వలె; నిరర్థకంబు = వ్యర్థమైనది; అగున్ = అగును; అధిపా = రాజా.
భావము:- మహారాజా! శ్రీమహావిష్ణువు మహిమను తనకు తెలియజెప్పిన గురువును సామాన్యమానవుడు అని భావిస్తు కుంటి భక్తితో వర్తించెడి వాని జీవితం గజస్నానము వలె వ్యర్థమైనది.

తెభా-7-459-ఉ.
నజాతనేత్రుఁ బరమేశు మహాత్ముఁ బ్రధానపూరుషున్
దేశరణ్యు సజ్జనవిధేయు ననంతుఁ బురాణయోగ సం
సేవితపాదపద్ముఁ దమ చిత్తమునన్ నరుఁ డంచు లోకు లి
చ్ఛావిధిఁ జూచుచుండుదురు; న్మతి లేక నరేంద్రచంద్రమా!

టీక:- ఈ = ఈ; వనజాతనేత్రున్ = శ్రీకృష్ణుని {వనజాతనేత్రుడు - వనజాతము (పద్మము వంటి) నేత్రుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; పరమేశున్ = శ్రీకృష్ణుని {పరమేశుడు - పరమ (అత్యున్నత మైన) ఈశుడు (ప్రభువు), విష్ణువు}; మహాత్మున్ = శ్రీకృష్ణుని {మహాత్ముడు - మహా (గొప్ప) ఆత్ముడు (ఆత్మ గలవాడు, విష్ణువు}; ప్రధానపూరుషున్ = శ్రీకృష్ణుని {ప్రధానపూరుషుడు - ప్రధాన (ముఖ్య మైన) పూరుషుడు (పురములను దేహములలో ఉండువాడు), కూటస్థుడు, విష్ణువు}; దేవశరణ్యున్ = శ్రీకృష్ణుని {దేవశరణ్యుడు - దేవ (దేవతలకు) శరణ్యుడు (కాపుదల యైనవాడు), విష్ణువు}; సజ్జనవిధేయున్ = శ్రీకృష్ణుని {సజ్జనవిధేయుడు - సత్ (మంచి) జన (వారికి) విధేయుడు (వశమైనవాడు), విష్ణువు}; పురాణయోగిసంసేవితపాదపద్మున్ = శ్రీకృష్ణుని {పురాణయోగిసంసేవితపాదపద్ముడు - పురాణ (పూర్వపు) యోగి (యోగులచే) సంసేవిత (చక్కగాసేవింపబడిన) పాద (పాదములు యనెడి) పద్ముడు (పద్మములు గలవాడు), విష్ణువు}; తమ = తమ యొక్క; చిత్తమునన్ = మనసునందు; నరుడు = సామాన్య మానవుడు; అంచున్ = అని; లోకులు = ప్రజలు; ఇచ్ఛావిధిన్ = తమయిష్టంవచ్ఛినట్లు; చూచుచుందురు = చూచెదరు; సన్మతి = మంచి యెరుక; లేక = లేకపోవుటచేత; నరేంద్రచంద్రమా = మహారాజా {నరేంద్రచంద్రముడు - నరేంద్రు (రాజు)లలో చంద్రునివంటివాడు, మహారాజు}.
భావము:- ధర్మరాజ మహారాజా! ఈ పద్మనేత్రుడు విష్ణుమూర్తి అపరావతారం దేవదేవుడు మహాత్ముడు ప్రధానపూరుషుడు సురశరణ్యుడు సజ్జనవిధేయుడు పురాణ యోగులచే పూజింపబడే పాదపద్మాలు కలవాడు అయిన శ్రీకృష్ణమూర్తిని కొందరు అజ్ఞానులు బుద్ధిహీనులై కోవలం ఒకసామాన్య వ్యక్తిగా భావిస్తారు.

తెభా-7-460-వ.
వినుము; షడింద్రియంబులలోన నొకటియందుఁ దత్పరులై యిచ్ఛాపూరణ విధానంబులఁ జరితార్థుల మైతి మనువారలు ధారణాభ్యాస సమాధియోగంబుల సాధింప లేరు; కృషిప్రముఖంబులు సంసారసాధనంబులు గాని మోక్ష సాధనంబులు గావు; కుటుంబ సంగంబునఁ జిత్తవిక్షేపం బగు; చిత్తవిజయ ప్రయత్నంబున సన్న్యసించి సంగంబు వర్జించి మితంబయిన భిక్షాన్నంబు భక్షించుచు శుద్ధవివిక్త సమప్రదేశంబున నొక్కరుండు నాసీనుండై సుస్థిరత్వంబున బ్రణవోచ్ఛారణంబు చేయుచు రేచకపూరకకుంభకంబులఁ బ్రాణాపానంబుల నిరోధించి కామహతం బయిన చిత్తంబున బరిభ్రమణంబు మాని కామవిసర్జనంబు చేసి మరలు నంతకు నిజా నాసాగ్ర నిరీక్షణంబు చేయుచు నివ్విధంబున యోగాభ్యాసంబు చేయువాని చిత్తంబు కాష్ఠరహితంబయిన వహ్ని తెఱంగున శాంతిం జెందు కామాదుల చేత వేధింపఁబడక ప్రశాంత సమస్తవృత్తంబయిన చిత్తంబు బ్రహ్మసుఖ సమ్మర్శనంబున లీనంబై మఱియు నెగయ నేరదు.
టీక:- వినుము = వినుము; షడింద్రియంబుల్ = ఇంద్రియము లారింటి {షడింద్రియములు - 1కన్ను 2ముక్కు 3చెవి 4నాలుక 5 చర్మము 6మనస్సు}; లోనన్ = అందు; ఒకటి = ముఖ్యమైనది, మనస్సు; అందున్ = ఎడల; తత్పరులు = దానియందే లగ్నమైనవారు; ఐ = అయ్యి; యిచ్ఛా = కోరికలను; పూరణ = తీర్చుకొను; విధానంబులన్ = పద్ధతులచేత; చరితార్థులము = కృతకృత్యులము; ఐతిమి = అయిపోతిమి; అను = అనెడి; వారలు = వారు; ధారణ = ధరించుట; అభ్యాస = అధ్యయనము; సమాధి = సమాధి; యోగంబులన్ = యోగములను; సాధింపన్ = పొంద; లేరు = శక్యముగాదు; కృషి = వ్యవసాయము; ప్రముఖంబులున్ = మున్నగునని; సంసార = సంసారము సాగించుట కైన; సాధనంబులున్ = పరికరములు; కాని = అంతేకాని; మోక్ష = ముక్తిసాధనకైన; సాధనంబులున్ = పరికరములు; కావు = కావు; కుటుంబ = కుటుంబముతోని; సంగంబునన్ = తగులమువలన; చిత్త = మనసునందు; విక్షేపంబు = కలత; అగున్ = కలుగును; చిత్త = మనసును; జయ = జయించు; ప్రయత్నంబునన్ = పూనికతో; సన్యసించి = సన్యాసము స్వీకరించి {సన్యాసము - సర్వసంగపరిత్యాగము కలగిన ఆశ్రమము}; సంగంబున్ = సర్వతగులములను; వర్జించి = విడిచిపెట్టి; మితంబు = పరిమితికి లోబడినది; అయిన = ఐన; భిక్షాన్నంబు = యాచనచేసిన ఆహారము; భక్షించుచున్ = తినుచు; శుద్ధ = నిర్మలమైన; వివిక్త = ఏకాంతమైన; సమ = చదునైన; ప్రదేశంబునన్ = చోటునందు; ఒక్కరుండు = ఒక్కడు; ఆసీనుండు = కూర్చున్నవాడు; ఐ = అయ్యి; సుస్థిరత్వంబునన్ = మిక్కిలి నిలకడగా; ప్రణవ = ఓంకారము; ఉచ్చారణంబు = పలుకుట; చేయుచున్ = చేయుచు; రేచక = ఊపిరి వదలుట; పూరక = ఊపిరి పీల్చుట; కుంభకంబులన్ = ఊపిరి బంధించుటలవలన; ప్రాణ = ప్రాణవాయువును; పానంబులన్ = తీసుకొనుటను; నిరోధించి = నియమించి, యామముచేసి; కామ = మనోరథముల; హతంబున్ = అణచబడినవి; అయిన = కాగా; చిత్తంబునన్ = మనసునందు; పరిభ్రమణంబు = ఏకాగ్రతనష్టమగుటను; మాని = వదలి; కామ = కోరికలను; విసర్జనంబు = విడిచిపెట్టుట; చేసి = చేసి; మరలు = వెనుదిరుగు; అంతకున్ = అంతవరకు; నిజ = తన; నాస = ముక్కు; అగ్ర = కొనయందు; నిరీక్షణంబు = దృష్టిని కేంద్రీకరించుట; చేయుచున్ = చేయుచు; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; యోగ = యోగమును; అభ్యాసంబున్ = అభ్యసించుట; చేయు = చేసెడి; వాని = వాని; చిత్తంబు = మనసు; కాష్ఠ = కఱ్ఱలు; రహితంబు = లేనిది; అయిన = ఐన; వహ్ని = అగ్ని; తెఱంగునన్ = వలె; శాంతిన్ = శమించుటను; చెందున్ = పొందును; కామాదుల్ = అరిషడ్వర్గము {కామాదులు - 1కామము 2క్రోధము 3లోభము 4మోహము 5మదము 6మాత్యర్యములు, అరిషడ్వర్గము}; చేత = వలన; వేధింపబడక = చీకాకుపెట్టబడక; ప్రశాంత = నెమ్మదిగల; సమస్త = సమనసచెందిన, కూడుకొన్న; వృత్తంబు = వర్తనకలది; అయిన = ఐన; చిత్తంబు = మనసు; బ్రహ్మసుఖ = బ్రహ్మానంద; సమ్మర్శనంబునన్ = అనుభవమునందు; లీనంబు = మునిగినది, కలిసినది; ఐ = అయ్యి; మఱియున్ = ఇంక; ఎగయన్ = చెలరేగుట; నేరదు = చేయలేదు.
భావము:- ఓ ధర్మజా! శ్రద్ధగా విను. కొందరు 1కన్ను 2ముక్కు 3చెవి 4నాలుక 5 చర్మము 6మనస్సు అనే షడింద్రియాలలో ఏ ఒక్కదాని యందో తత్పరులై, ఏవో కొన్ని కోరికలు తీర్చుకునే పద్ధతులతో తమ జన్మ ధన్యం అయిందని భావిస్తారు. అటువంటి వాళ్ళు ధారణ, అభ్యాస, సమాధి యోగాలు సాధింప లేరు. కృషి మొదలైన వృత్తులు సంసార సాధనాలు కానీ, మోక్ష సాధనాలు కావు. కుటుంబ జంజాటం వలన చిత్త చాంచల్యం వస్తుంది. చిత్తాన్ని జయించాలి అంటే సన్న్యసించాలి. అన్య సాంగత్యాలన్నీ విడిచిపెట్టాలి. మితంగా భిక్షాన్నం భుజించాలి. పరిశుభ్రమైన, సమతలమైన ఏకాంత ప్రదేశంలో కూర్చుని సుస్థిరంగా ప్రణవం ఉచ్ఛరించాలి. రేచక, పూరక, కుంభకాలతో ప్రాణాపానాలను నిరోధించాలి. కామోపహతమై చిత్తం పరిభ్రమించటం మాని పూర్తిగా కామ విసర్జనం చేస్తుంది. పిమ్మట ప్రవృత్తి మార్గం నుంచి మరలే దాకా నాసాగ్రంపై దృష్టిని నిలిపి ఉంచాలి. ఇలా యోగాభ్యాసం చేసేవాని చిత్తం కట్టెలు లేని అగ్ని వలె శాంతిస్తుంది. కామాదులతో బాధింబడని మనస్సు ప్రశాంతమై బ్రహ్మసుఖానుభవంలో లీనమై పోతుంది. ఇక చిత్తం మరల పేట్రేగిపోదు.

తెభా-7-461-మ.
ణీదేవుఁడు సన్న్యసించి యతియై ర్మార్థకామంబులం
రివర్జించి పునర్విలంబమునఁ దత్ప్రారంభి యౌనేని లో
తిం గ్రక్కిన కూడు మంచి దనుచున్ క్షించి జీవించు దు
ర్నరు చందంబున హాస్యజీవనుఁ డగున్ నానాప్రకారంబులన్.

టీక:- ధరణీదేవుడు = బ్రాహ్మణుడు {ధరణీదేవుడు - ధరణీ (భూమికి) దేవుడు, విప్రుడు}; సన్యసించి = సర్వసంగపరిత్యాగము జేసి; యతి = యోగి; ఐ = అయ్యి; ధర్మార్థకామంబులన్ = పురుషార్థములను {పురుషార్థములు - 1ధర్మ 2అర్థ 3కామములు యైన పురుషప్రయోజనములు}; పరివర్జించి = పూర్తిగావదలివేసి; పునః = మరల; విలంబమునన్ = కొంతకాలము తరువాత; తత్ = వాటిని (ధర్మాదులను); ప్రారంభి = మరల పూనినవాడు; ఔనేని = అయినచో; లోభ = లోభపు; రతిన్ = మిక్కిలి యాశచేత; కక్కిన = వాంతిచేసుకొన్న; కూడున్ = అన్నమును; మంచిది = మంచిది; అనుచున్ = అనుచు; భక్షించి = తిని; జీవించు = బ్రతికెడి; దుర్ = నీచపు; నరున్ = మానవుని; చందంబునన్ = వలె; హాస్య = పరిహసింపదగిన; జీవనుండు = బ్రతుకుగలవాడు; అగున్ = అగును; నానా = పలు; ప్రకారంబులన్ = తెఱంగుల.
భావము:- విప్రుడు సన్న్యసం స్వీకరించి, ధర్మార్థ కామాలను విసర్జించి యోగిగాగౌరవం పొందుతాడు. కాని, పిమ్మట యతి ధర్మాలు సరిగా నిర్వర్తించక మరల వెనుకకు సంసార చక్రంలోకి వస్తే అపుడు అతడు, లోభంతో కక్కిన కూడు తిని సంతుష్టి పొందే అధముడి లాగా రకరకాలుగా పరిహాసపాత్రుడు అవుతాడు

తెభా-7-462-క.
మునఁ గ్రిమియును బడు క్రియ
నిబడు నొడ లాత్మ గాదు హేయం బనుచుం
లఁతురు తద్జ్ఞులు పొగడుదు
సత నొడ లాత్మ యనుచు జ్ఞు లిలేశా!

టీక:- మలమునన్ = అశుద్ధమునందు; క్రిమియునున్ = పురుగు; పడు = పుట్టెడి; క్రియన్ = విధముగనే; ఇలన్ = నేలపైన; పడు = పడెడి; ఒడలు = దేహము; ఆత్మ = తాను; కాదు = కాదు; హేయంబున్ = అసహ్యమైనది; అనుచున్ = అని; తలతురు = భావించెదరు; తద్జ్ఞులు = వస్తుతత్వముతెలిసినవారు; పొగడుదురు = మెచ్చుకొనెదరు; అలసతన్ = మందబుద్ధిచేత; ఒడలు = దేహమే; ఆత్మ = తాను; అనుచున్ = అని; అజ్ఞులు = తెలియనివారు; ఇలేశా = రాజా {ఇలేశుడు -ఇల(భూమికి) ఈశుడు, రాజు};
భావము:- ఓ ధరాధిపా! ధర్మరాజా! మలంలో పురుగులు పడ్డట్లు, మానవదేహంతో లోకంలో పడి ఉండే ఈ దేహం నీవు కాదు; నీవు ఆత్మవు; కనుక, బ్రహ్మజ్ఞానులు ఆ హేయమైన దేహము విడువ తగినది అంటారు; కానీ, అజ్ఞానులు ఆ దేహామే ఆత్మ అనుకొని, ఆ దేహాన్ని నమ్ముకుని మాయలో పడిపోతుంటారు.

తెభా-7-463-ఆ.
వ్రతము మానఁదగదు డుగు గుఱ్ఱనికిని
గ్రియలు మానఁదగదు గృహగతునికి
పసి కూర నుండగదు సన్న్యాసికిఁ
రుణితోడి పొత్తు గదు తగదు.

టీక:- వ్రతమున్ = దీక్షను; మానన్ = మానివేయుట; తగదు = తగినదికాదు; వడుగు = బ్రహ్మచారి; కుఱ్ఱని = బాలుని; కిని = కి; క్రియలు = నిత్యనైమిత్తికాది క్రియలు; మానన్ = మానివేయుట; తగదు = తగినదికాదు; గృహగతుని = గృహస్థుని; కిన్ = కి; తపసి = వానప్రస్థుని; కిన్ = కి; ఊరన్ = గ్రామమందు; ఉండన్ = ఉండుట; తగదు = తగినదికాదు; సన్యాసి = సన్యసించిన యతి; కిన్ = కి; తరుణి = స్త్రీ; తోడి = తోటి; పొత్తు = సాంగత్యము; తగదుతగదు = తగినది కాదేకాదు.
భావము:- బ్రహ్మచారి తన ఆశ్రమ నియమాలు దీక్షలు మానరాదు; గృహస్థు నిత్యనైమిత్త కాది క్రియలు విడువ కూడదు; వానప్రస్థుడు తపస్సు చేసుకోవాలి గాని ఊరిలో ఉండరాదు; సన్న్యాసికి స్త్రీసాంగత్యం ఏమాత్రం పనికిరాదు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసం అనే చతురాశ్రమాలకు చెప్పబడిన ధర్మాలను ఆయా ఆశ్రమంలో ఉన్నవారు అతిక్రమించ రాదు.

తెభా-7-464-సీ.
థము మేనెల్ల, సాథి బుద్ధి, యింద్రియ;-
ణము గుఱ్ఱములు, పగ్గములు మనము,
ప్రాణాది దశవిధ వనంబు లిరుసు, ధ;-
ర్మాధర్మగతులు రథాంగకములు,
హుళతరంబైన బంధంబు చిత్తంబు,-
బ్దాదికములు సంచారభూము,
భిమాన సంయుతుం యిన జీవుఁడు రథి,-
నతరప్రణవంబు కార్ముకంబు,

తెభా-7-464.1-తే.
శుద్ధజీవుండు బాణంబు, శుభదమైన
బ్రహ్మ మంచిత లక్ష్యంబు, రులు రాగ
య మదద్వేష శోక లోప్రమోహ
మాన మత్సర ముఖములు మానవేంద్ర!

టీక:- రథము = బండి; మేను = దేహము; ఎల్లన్ = అంతయు; సారథి = బండినడిపేవాడు; బుద్ధి = బుద్ధి; ఇంద్రియ = ఇంద్రియముల; గణము = సమూహము; గుఱ్ఱములు = గుఱ్ఱములు; పగ్గములు = నియంత్రించెడితాళ్ళు; మనము = మనస్సు; ప్రాణాది = ప్రాణము మున్నగు; దశవిధపవనంబు = పదిప్రాణవాయువులు {దశవిధపవనములు - పంచవాయువులు (1ప్రాణము 2అపానము 3ఉదానము 4వ్యానము 5సమానము) మరియు పంచోపవాయువులు (1నాగము 2కూర్మము 4కృకరము 4దేవదత్తము 5ధనంజయము)}; ఇరుసు = చక్రములకు ఆధారకడ్డీ; ధర్మ = ధర్మము; అధర్మ = అధర్మములయొక్క; గతులు = వర్తనములు; రథాంగకములు = బండిచక్రములు; బహుళతరంబు = చాలాయెక్కువరకములది {బహుళము - బహుళతరము - బహుళతమము}; ఐన = అయిన; బంధంబు = కట్టుతాళ్ళు; చిత్తంబు = చిత్తము; శబ్దాదికములు = ఇంద్రియ విషయములు {శబ్దాది - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంథములు, ఇంద్రియవిషయములు}; సంచారభూములు = బండితిరిగెడితావులు; అభిమాన = అహంకార మమకారములతో {అభిమానము - నేను నాది యనెడి భావములైన అహంకార మమకారములు}; సంయుతుండు = కూడినవాడు; అయిన = ఐన; జీవుండు = జీవుడు, ఆత్మ; రథి = బండిలోనుండెడి ప్రధానపురుషుడు; ఘనతర = బహుగొప్పదైన {ఘన - ఘనతర - ఘనతమము}; ప్రణవంబు = ఓంకారము; కార్ముకంబు = విల్లు.
శుద్ధజీవుండు = నిర్మలమైన జీవాత్మ; బాణంబు = బాణము; శుభదము = శుభము(ముక్తి)నిచ్చునది; ఐన = అయిన; బ్రహ్మము = బ్రహ్మము; అంచిత = ఒప్పిదమైన; లక్ష్యంబు = గురి; పరులు = శత్రువులు; రాగ = తగులము; భయ = భయము; మద = పొగరు; ద్వేష = పగ; శోక = దుఃఖము; లోభ = లోభము; మోహ = మోహము; మాన = అభిమానము; మత్సర = మాత్యర్యము; ముఖములు = మున్నగునవి; మానవేంద్ర = రాజా {మానవేంద్రుడు - మానవులకు ఇంద్రునివంటివాడు, రాజు}.
భావము:- ఓ యుధిష్ఠర నరేంద్రా! తత్వశాస్త్రం అవగాహన చేసికో. ఈ దేహమే రథం; బుద్ధి సారథి; ఇంద్రియాలు గుఱ్ఱములు; మనస్సు కళ్ళెం; ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయము లనే దశ విధ వాయువులులోని (పంచ ప్రాణవాయువులు పంచ ఉపవాయువులు రెండూ) ఇరుసులు; ధర్మం, అధర్మం రథచక్రాలు; చిత్తం కఠినమైన బంధం; శబ్ద, రస, రూప, స్పర్శ, గంధం అనే ఇంద్రియ విషయములు సంచార భూములు; అహంకార సమేతుడైన జీవుడు రథం అధిరోహించిన రథికుడు; ఘనమైన ప్రణవం ధనుస్సు; శుద్ధ జీవుడు బాణం; బ్రహ్మమే పరమ లక్ష్యం; రాగం, భయం, మదం, ద్వేషం, శోకం, లోభం, మోహం, అహంకారం, మాత్సర్యం మొదలగునవి అడ్డుపడే బద్ధ శత్రువులు

తెభా-7-465-వ.
ఇట్లు మనుష్య శరీరరూపం బయిన రథంబు దన వశంబు చేసికొని మహాభాగవత చరణకమల సేవా నిశితం బయిన విజ్ఞానఖడ్గంబు ధరియించి శ్రీమన్నారాయణ కరుణావలోకన బలంబున రాగాదిశత్రు నిర్మూలనంబు గావించి ప్రణవబాణాసనంబున శుద్ధజీవశరంబును సంధించి బ్రహ్మ మనియెడి గుఱి యందుఁ బడవేసి యహంకారరథికుండు రథికత్వంబు మాని నిజానందంబున నుండవలయు; నట్టి విశేషంబు సంభవింపని సమయంబున బహిర్ముఖంబు లయిన యింద్రియఘోటకంబులు బుద్ధిసారథి సహితంబులై స్వాభిమాన రథికుని ప్రమత్తత్త్వంబుం దెలిసి ప్రవృత్తిమార్గంబు నొందించి విషయశత్రు మధ్యంబునం గూల్చిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; మనుష్య = మానవ; శరీర = దేహము యొక్క; రూపంబు = రూపముకలది; అయిన = ఐన; రథంబున్ = బండిని; తన = తన యొక్క; వశంబున్ = ఆధీనములో; చేసికొని = పెట్టుకొని; మహా = గొప్ప; భాగవత = విష్ణుభక్తుల; చరణ = పాదములనెడి; కమల = పద్మముల; సేవా = సేవచేత; నిశితంబు = వాడితేరినది; ఐన = అయిన; విజ్ఞాన = విజ్ఞానము యనెడి; ఖడ్గంబున్ = కత్తిని; ధరియించి = ధరించి; శ్రీమత్ = శ్రీవంతమైన; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; కరుణా = దయతోకూడిన; అవలోకన = చూపులు యనెడి; బలంబునన్ = శక్తితో; రాగాది = రాగద్వేషాదులు {రాగద్వేషాదులు - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారములు}; శత్రు = శత్రువుల; నిర్మూలనంబు = సర్వనాశనము; కావించి = చేసి; ప్రణవ = ఓకారము యనెడి; బాణాసనంబున = విల్లునందు; శుద్ధజీవ = శుద్ధజీవుడు యనెడి; శరంబును = బాణమును; సంధించి = ఎక్కుపెట్టి; బ్రహ్మము = బ్రహ్మము; అనియెడి = అనెడి; గుఱిన్ = లక్ష్యము; అందున్ = అందు; పడవేసి = పడునట్లువేసి; అహంకార = అహంకారయుక్తుడైన జీవుడు యనెడి; రథికుండు = బండియందుండెడివాడు; రథికత్వంబున్ = రథికుడు యౌట; మాని = మానివేసి; నిజ = సత్యమైన; ఆనందంబునన్ = ఆనందములో; ఉండవలయును = ఉండవలెను; అట్టి = అటువంటి; విశేషంబు = విశిష్టత, భాగ్యము; సంభవింపని = కలుగని; సమయంబునన్ = అప్పుడు; బహిర్ముఖంబులు = వెలికి యురుకుచున్నవి; అయిన = ఐన; ఇంద్రియ = ఇంద్రియములు యనెడి; ఘోటకంబులు = గుఱ్ఱములు; బుద్ధి = బుద్ధి యనెడి; సారథి = సారథితో; సహితంబులు = కూడినవి; ఐ = అయ్యి; స్వాభిమాన = తమ యహంకారముగల; రథికుని = జీవుడు యనెడి రథికుని; ప్రమత్తత్త్వంబున్ = ఏమరపాటును; తెలిసి = తెలిసికొని; ప్రవృత్తి = కర్మముల; మార్గంబున్ = త్రోవను; ఒందించి = పొందించి; విషయ = ఇంద్రియార్థములనెడి; శత్రు = శత్రువుల; మధ్యంబునన్ = నడుమ; కూల్చిన = పడవేయగా.
భావము:- ఇటువంటి దేహరూప రథమును మానవుడు తన వశంలో ఉంచుకోవాలి. పరమ భాగవతుల పాదసేవతో సానబెట్టిన, జ్ఞానం అనే నిశితమైన ఖడ్గం ధరించాలి. శ్రీహరి కృప అనే బలంతో రాగము మొదలగు శత్రువులను నిర్మూలించాలి. ప్రణవం అనే ధనుస్సునకు శుద్ధ జీవం అనే బాణాన్ని సంధించి, బ్రహ్మముపై గురి పెట్టి ప్రయోగించాలి. అహంకారి అయిన రథి తన రథికత్వం మానుకుని ఆత్మానందంతో ఉండాలి. మనిషి ఇలాంటి విశేషతత్త్వం అందుకోడంలో ఏమాత్రం ప్రమత్తుడైనా; బహిర్ముఖు లైన ఇంద్రియాలనే గుఱ్ఱాలు, అహంకారి స్వాభిమాని అయిన రథికుని అప్రమత్తత పసిగట్టి, బుద్ధి అనే సారథితో సహా రథమును ప్రవృత్తి మార్గంలోకి లాగి, విషయ శత్రు వ్యూహం మధ్యలో పడవేస్తాయి.

తెభా-7-466-ఆ.
విషయ శత్రు లెల్ల విక్రాంతితోడ సా
థిసమేతుఁ డయిన థికుఁ బట్టి
యుగ్ర తిమిరమృత్యు యుత మగు సంసార
కూపమధ్య మందుఁ గూల్తు రధిప!

టీక:- విషయ = ఇంద్రియార్థములనెడి; శత్రులు = శత్రువులు; ఎల్లన్ = అందరును; విక్రాంతి = పరాక్రమము; తోడన్ = తోటి; సారథి = (బుద్ధి) సారథితో; సమేతుండు = కూడినవాడు; అయిన = ఐన; రథికున్ = (జీవుని) రథికుని; పట్టి = పట్టికొని; ఉగ్ర = భయంకరమైన; తిమిర = కారుచీకటి యనెడి; మృత్యు = చావుతో; యుతము = కూడినది; అగు = అయిన; సంసార = సంసారము యనెడి; కూప = బావి; మధ్యము = నడిమి; అందున్ = అందు; కూల్తురు = కూల్చివేయుదురు; అధిపా = రాజా.
భావము:- ఆ విషయాలనే శత్రువులు అన్నీ విజృంభించి సారథి సమేతంగా రథికుడిని పట్టుకుని, భీకరమైనదీ అంధకారావృతమైనదీ మృత్యుగహ్వరమూ అయిన సంసార కూపంలో కూల్చివేస్తాయి.

తెభా-7-467-వ.
వినుము; వైదికకర్మంబు ప్రవృత్తంబును నివృత్తంబును నన రెండు దెఱంగు లయ్యె; నందు బ్రవృత్తంబునఁ బునరావర్తనంబును నివృత్తంబున మోక్షంబును సిద్ధించు; ప్రవృత్త కర్మంబులోన నిష్ఠాపూర్తంబులన రెండుమార్గంబులు గల; వందు హింసాద్రవ్యమయ కామ్యరూపంబు లయిన దర్శ పూర్ణమాస పశు సోమయాగ వైశ్వదేవ బలిహరణ ప్రముఖంబు లయిన యాగాదికంబు లిష్టంబులు; దేవతాలయ వన కూప తటాక ప్రముఖంబులు పూర్తంబులు; ప్రవృత్త కర్మంబున దేహంబు విడిచి దేహాంతరారంభంబు నొందు దేహి హృదయాగ్రంబు వెలుంగు వానితోడ నింద్రియంబులం గూడి భూతసూక్ష్మయుక్తుం డై ధూమదక్షిణాయన కృష్ణపక్ష రాత్రిదర్శంబుల వలన సోమలోకంబుఁ జేరి భోగావసానంబున విలీనదేహుండై వృష్టి ద్వారంబునఁ గ్రమంబున నోషధి లతాన్న శుక్ల రూపంబులం బ్రాపించి భూమి యందు జన్మించు; నిది పునర్భవరూపం బయిన పితృమార్గంబు; నివృత్తకర్మ నిష్ఠుం డయినవాఁడు జ్ఞానదీప్తంబు లయిన యింద్రియంబు లందుఁ గ్రియాయజ్ఞంబులు యజించి యింద్రియంబుల దర్శనాది సంకల్ప మూలంబయిన మనంబునందు; వికారయుక్తంబయిన మనంబును వాక్కు నందు; విద్యా విలక్షణ యయిన వాక్కును వర్ణ సముదా యము నందు; వర్ణ సముదాయంబును అకారాది సర్వత్రయాత్మకం బయిన యోంకారంబు నందు; నోంకారంబును బిందు వందు; బిందువును నాదంబు నందు; నాదంబును బ్రాణంబు నందు; బ్రాణంబును బ్రహ్మ మందు నిలుపవలయును; దేవమార్గంబయిన యుత్తరాయణ శుక్లపక్ష దివాప్రాహ్ణపూర్ణిమా రాకలవలన సూర్యద్వారంబున బ్రహ్మలోకంబు నందుఁ జేరి; భోగావసానంబున స్థూలోపాధియైన విశ్వుండై స్థూలంబును సూక్ష్మంబు నందు లయించి; సూక్ష్మోపాధి యైన తైజసుండై సూక్ష్మంబును గారణంబు నందు లయించి; కారణోపాధి యైన ప్రాజ్ఞుండై కారణంబును సాక్షిస్వరూపంబు నందు లయించి; తుర్యుండై సూక్ష్మలయంబునందు శుద్ధాత్ముండై యివ్విధంబున ముక్తుం డగును.
టీక:- వినుము = వినుము; వైదిక = వేదోక్తమైన; కర్మంబు = కర్మములను చేయుట; ప్రవృత్తంబును = ప్రవృత్తులు, కర్మావలంబనలు; నివృత్తంబునున్ = నివృత్తులు, మోక్షావలంబనలు; అనన్ = అనెడి; రెండు = రెండు (2); తెఱంగులు = విధములు; అయ్యెన్ = అయినవి; అందున్ = వానిలో; ప్రవృత్తంబునన్ = ప్రవృత్తులవలన; పునరావర్తనంబును = పునర్జన్మలు, మరలపుట్టుట; నివృత్తంబునన్ = నివృత్తులవలన; మోక్షంబును = ముక్తి, సంసారవిచ్ఛిత్తి; సిద్ధించు = లభించును; ప్రవృత్త = ఆరబ్ధ; కర్మంబు = కర్మల; లోనన్ = అందు; ఇష్టా = ఇష్టులు, యజ్ఞములు; పూర్తంబులు = పూర్తములు, పుణ్యకార్యములు; అనన్ = అనెడి; రెండు = రెండు (2); మార్గంబులు = త్రోవలు, సత్కార్యములు; కలవు = ఉన్నవి; అందున్ = వానిలో; హింసా = హింసారూపములు; ద్రవ్యమయ = ద్రవ్యములుగలరూపములు; కామ్యరూపంబులు = కోరదగినవైన రూపములు, అగ్నిహోత్రాది; అయిన = ఐన; దర్శ = అమావాస్యనాడు చేయదగ్గవి; పూర్ణమాస = పౌర్ణమినాడు చేయదగ్గవి; పశు = పశుబలితో చేయదగ్గవి; సోమ = సోమపానము చేయదగ్గవి; వైశ్వదేవ = పాకము(వంట) చేయదగ్గవి; బలిహరణము = బలిహరణము చేయదగ్గవి; ప్రముఖంబులు = మున్నగునవి; అయిన = ఐన; యాగ = యజ్ఞములు; ఆదికంబులు = మొదలగునవి; ఇష్టంబులు = ఇష్టులు, యజ్ఞములు; దేవతాలయ = దేవాలయములు కట్టించుట; వన = తోటలు వేయించుట; కూప = బావులు తవ్వించుట; తటాక = చెరువులు తవ్వించుట; ప్రముఖంబులు = మున్నగునవి; పూర్తంబులు = పూర్తములు, పుణ్యకార్యములు; ప్రవృత్తకర్మంబునన్ = ప్రవృత్తకర్మలను చేయుటచేత; దేహంబు = దేహము; విడిచి = వదలి; దేహ = దేహము; అంతర = ఇతరము, ఇంకొకటి; ఆరంభంబున్ = తాల్చుటను; ఒందున్ = పొందును; దేహి = జీవుడు; హృదయ = హృదయముయొక్క; అగ్రంబున్ = ఆకాశమునందు; వెలుంగ = ప్రకాశించు; వాని = వాటి; తోడన్ = తోటి; ఇంద్రియంబులన్ = ఇంద్రియములతో; కూడి = కలిసి; భూత = దేహము {భూత - భూతములతో కూడినది, దేహము}; సూక్ష్మ = సూక్ష్మమైనదానితో; యుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; ధూమ = పొగతోడి దారి; దక్షిణాయన = దక్షిణాయనము; కృష్ణపక్ష = కృష్ణపక్షము; రాత్రి = రాత్రిసమయము; దర్శంబులన్ = అమావాస్యలవలన; సోమలోకంబున్ = చంద్రలోకమును; చేరి = చేరి; భోగ = పుణ్యఫలములనుభవించిన; అవసానంబున = పిదప; విలీన = (జీవునిలో) కలిసిపోయిన; దేహుండు = దేహముగలవాడు; ఐ = అయ్యి; వృష్టి = వర్షపు; ద్వారంబునన్ = మార్గమున; క్రమంబునన్ = వరుసగా; ఓషధి = ఓషధులు {ఓషధులు - ఫలించినతోడనే నశించునవి (అరటి వరి మున్నగునవి)}; లత = తీగలు; అన్న = ఆహారము; శుక్ల = శుక్లశోణితముల; రూపంబులన్ = రూపములను; ప్రాపించి = పొంది; భూమిఅందు = నేలపైన; జన్మించున్ = పుట్టును; ఇది = ఇది; పునర్భవ = పునర్జన్మ, మరలపుట్టుట; రూపంబు = రూపముకలది; అయిన = ఐన; పితృ = పితృదేవతల; మార్గంబు = త్రోవ; నివృత్త = నివృత్త; కర్మ = కర్మములందు; నిష్ఠుండు = నియమించుకొనినవాడు; అయిన = ఐన; వాడు = వాడు; జ్ఞాన = జ్ఞానముచే; దీప్తంబులు = వెలిగెడివి; అయిన = ఐన; ఇంద్రియంబుల = ఇంద్రియముల; అందున్ = అందు; క్రియా = క్రియారూపములైన; యజ్ఞంబులు = యజ్ఞములు,యత్నములు; యజించి = యజ్ఞము(ప్రయత్నము)చేసి; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; దర్శనాది = పంచ తన్మాత్రల {పంచతన్మాత్రలు - 1దర్శన 2శ్రవణ 3గ్రహణ 4రసన 5స్పర్శనములు}; సంకల్ప = సంకల్పముల; మూలంబు = రూపముకలది; ఐన = అయిన; మనంబున్ = మనసు; అందున్ = లో; వికార = నానా విధ మార్పులతో; యుక్తంబు = కూడినది; అయిన = ఐన; మనంబునున్ = మనస్సును; వాక్కు = మాట; అందున్ = అందు; విద్యా = విద్యచేత; విలక్షణ = సంస్కరింపబడినది; అయిన = ఐన; వాక్కును = మాటను; వర్ణ = అక్షరముల; సముదాయంబున్ = సమూహము; అందున్ = అందు; వర్ణ = అక్షరముల; సముదాయంబున్ = సమూహమును; అకారాది = అకారముతో మొదలై; సర్వ = సమస్తమైన; త్రయాత్మకంబు = అకార ఉకార బిందువులుకలది; అయిన = ఐన; ఓంకారంబున్ = ఓంకారము; అందున్ = అందు; ఓంకారంబున్ = ఓంకారమును; బిందువు = పూర్ణానుస్వారము {బిందువు - ఓం లోని ఓ తరువాతి 0}; అందున్ = అందు; బిందువును = బిందువును; నాదంబున్ = స్వరము {నాదము - ఓంకారము ఉచ్చారణలో బిందువు తరువాత పలికెడి అనునాదరూపము నాదము}; అందున్ = అందు; నాదంబునున్ = స్వరమును; ప్రాణంబున్ = ప్రాణము {ప్రాణము - ఓంకారము ఉచ్ఛారణ తరువాతి మౌనరూపము}; అందున్ = అందు; ప్రాణంబునున్ = ప్రాణమును; బ్రహ్మము = బ్రహ్మము, ఆత్మ; అందున్ = అందు; నిలుపవలయును = నిలుపవలెను; దేవ = వెలుగు; మార్గంబు = త్రోవ; అయిన = ఐన; ఉత్తరాయణ = ఉత్తరాయణకాలము; శుక్లపక్ష = శుక్లపక్షము; దివస = పగలు; ప్రాహ్ణ = పూర్వభాగము; పూర్ణిమా = పున్నమి; రాకల = సంపూర్ణ చంద్రుడు గల పౌర్ణమి; వలన = వలన; సూర్య = సూర్యమండలము; ద్వారంబునన్ = ద్వారా; బ్రహ్మలోకంబున్ = బ్రహ్మలోకము; అందున్ = లో; చేరి = చేరి; భోగ = కర్మానుభవము; అవసానంబునన్ = పిదప; స్థూలోపాధి = స్థూలకారణుండు; ఐన = అయిన; విశ్వుండు = విరాడ్రూపముగలవాడు; ఐ = అయ్యి; స్థూలంబునున్ = స్థూలత్వమును; సూక్ష్మంబున్ = సూక్ష్మము; అందున్ = లో; లయించి = లీనముచేసి; సూక్ష్మోపాధి = సూక్ష్మకారణుండు; ఐన = అయిన; తైజసుండు = తేజోరూపము గలవాడు; ఐ = అయ్యి; సూక్ష్మంబున్ = సూక్ష్మరూపమును; కారణంబున్ = కారణము; అందున్ = అందు; లయించి = లీనముచేసి; కారణోపాధి = మూలకారణము; ఐన = అయిన; ప్రాజ్ఞుండు = ప్రజ్ఞగలవాడు; ఐ = అయ్యి; కారణంబును = కారణమును; సాక్షి = సర్వసాక్షియైన, కూటస్థుని; స్వరూపంబున్ = స్వరూపము; అందున్ = అందు; లయించి = ఇమిడ్చి; తుర్యుండు = పరిశుద్దమైన ఆత్మ (అవస్థాత్రయమును దాటి తురీయము అనగా నాలుగవ అవస్థను చేరిన వాడు); ఐ = అయ్యి; సూక్ష్మ = సూక్ష్మత్వంబు; లయంబున్ = పోవుట; అందున్ = చెందుటవలన; శుద్ధ = పరిశుద్ధమైన; ఆత్ముండు = ఆత్మయైనవాడు; ఐ = అయ్యి; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; ముక్తుండు = మోక్షము పొందినవాడు; అగును = అగును.
భావము:- వినవయ్యా, ధర్మరాజా! వేదాలు చెప్పిన కర్మకాండ అంతా రెండు విభాగాలు. ఒకటి ప్రవృత్తి మార్గము. రెండు నివృత్తి మార్గము. ప్రవృత్తి మార్గం వలన పునర్జన్మలు కలుగుతుంటాయి. నివృత్తి మార్గం మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
ప్రవృత్తిలో మళ్ళీ ఇష్టా పూర్తాలు అని రెండు రకాలు. హింసా ద్రవ్య మయములై కామ్యరూపాలైన దర్శపూర్ణమాస క్రతువు, పుత్రకామేష్టి, వైశ్వేదేవం, బలిహరణం మొదలగు ప్రముఖ యాగాలు ఇష్టాలు. దేవలయ ప్రతిష్ఠ, తటాక, కూపాది నిర్మాణం మొదలగు ప్రముఖ కార్యాలు పూర్తాలు. ప్రవృత్తి కర్మ వలన దేహి దేహాంతర ప్రాప్తిలో హృదయగ్రహంపై ప్రకాశిస్తాడు. ఇంద్రియాలతో కూడా సూక్ష్మదేహం ధరించి ధూమ, దక్షిణాయన, కృష్ణపక్ష రాత్రి అమావాస్యల ద్వారా సోమలోకం చేరుకుంటాడు. అక్కడనుండి పుణ్యఫలం పూర్తికాగానే, భోగావసానంలో దేహం విలీనం కాగా వర్షం ద్వారా క్రమంగా ఓషధులు, లతలు, అన్నం, శుక్లం రూపాలు పొంది భూమిపై మరల జన్మిస్తాడు. పునర్జన్మ రూపమైన పితృమార్గం, ఇదే ప్రవృత్తి మార్గం.
ఇక నివృత్తిమార్గంలో సాధకుడు జ్ఞానదీప్తములైన ఇంద్రియాల యందు క్రియాయజ్ఞాలు చేస్తాడు. అలా చేసి, ఇంద్రియాలను దర్శనాది సంకల్పమూలము లైన మనస్సులోనూ, వికారతత్వం గల మనస్సును వాక్కులోనూ, విద్యాదిలక్షణ మైన వాక్కును వర్ణమాలలోనూ, వర్ణమాలను అకార, ఉకార, మకార సంయుక్తమైన ఓంకారంలోనూ, ఓంకారమును బిందువులోనూ, బిందువును నాదంలోనూ, నాదమును ప్రాణంలోనూ, ప్రాణమును బ్రహ్మములోనూ నిలుపుకుంటూ ముందుకు సాగుతాడు. పుణ్యాత్ముడు దేవమార్గాలైన ఉత్తరాయణం, శుక్లపక్షం, పగలు, ప్రాతఃకాలం, రాకా పూర్ణిమలలో, సూర్యమండలం ద్వారా బ్రహ్మలోకం చేరుకుంటాడు. పుణ్యకాలం పూర్తి కాగానే భోగావసాన దశలో స్థూల ఉపాధి అయిన విశ్వం అయిపోతాడు. స్థూలమును సూక్షంలో లయం చేస్తాడు. సూక్ష్మ ఉపాధితో తేజస్వి అవుతాడు. సూక్ష్మాన్ని కారణంతో లయం చేసి కారణ ఉపాధి అయిన ప్రాజ్ఞుడు అవుతాడు. కారణమును సాక్షిస్వరూపంలో లీనంచేసి బ్రహ్మరూపుడు అవుతాడు. ఇలా సూక్ష్మరూపంలో విలీనమై శుద్ధాత్ముడై యోగి ముక్తుడు అవుతాడు.

తెభా-7-468-ఆ.
మరనిర్మితంబు లై యొప్పు పితృదేవ
రణు లెవ్వఁ డెఱుఁగు శాస్త్రదృష్టి
ట్టివాఁడు దేహి యై మోహమున నొందఁ
తిశయించు బుద్ధి వనినాథ!

టీక:- అమర = దేవతలచేత; నిర్మితంబులు = ఏర్పరుపబడినవి; ఐ = అయ్యి; ఒప్పు = వెలయు; పితృ = పితృయానము, ప్రవృత్తి; దేవ = దేవయానము, నివృత్తి; సరణులు = మార్గములు; ఎవ్వడు = ఎవరైతే; ఎఱుగున్ = తెలియునో; శాస్త్ర = తత్త్వ; దృష్టిన్ = విచారముచేత; అట్టి = అటువంటి; వాడు = వాడు; దేహి = శరీరధారి; ఐ = అయినను; మోహమున్ = మాయను; ఒందడు = చెందడు; అతిశయించున్ = వృద్ధినొందును; బుద్ధిన్ = తెలివితో; అవనినాథ = రాజా {అవనినాథుడు - అవని (భూమి)కి నాథుడు, రాజు}.
భావము:- యుధిష్టర మహారాజా! దేవతలచే ఏర్పరుబడిన పితృమార్గము అనే ప్రవృత్తి మార్గమునూ, దేవమార్గము అనే నివృత్తి మార్గమునూ ఎవడైతే శాస్త్రదృష్ఠితో కూలంకషంగా తెలుసుకుంటాడో, అటువంటి వాడు దేహము ధరించి ఉండి కూడా తన బుద్ధిబలంచేత మోహానికి లోను కాకుండా విలసిల్లుతాడు.

తెభా-7-469-వ.
వినుము; దేహాదులకుఁ గారణత్వంబున నాదియందును నవధిత్వంబు ననంతమందును గలుగుచు బహిరంగంబున భోగ్యంబును, నంతరంగంబున భోక్తయు, బరంబునఁ నపరంబును, జ్ఞానంబున జ్ఞేయంబును, వచనంబున వాచ్యంబును, నప్రకాశంబున బ్రకాశంబును నైన వస్తువునకు వేఱొండు లేదు; ప్రతిబింబాదికంబు వస్తుత్వంబునం జేసి వికల్పితంబై తలంపంబడు భంగి నైంద్రియకంబైన సర్వంబును నర్థత్వంబున వికల్పితం బయి తోఁచుం గాని పరమార్థంబు గాదు; దేహాదికంబులు మిథ్యాత్మకంబులు; వానికి హేతువు లయిన క్షితిప్రముఖంబులకును మిథ్యాత్వం బగుట సిద్ధంబు; పరమాత్మకు నవిద్యచేత నెంతదడవు వికల్పంబుదోఁచు; నంతదడవును భ్రమంబునుం దోఁచు; అవిద్యానివృత్తి యైన సర్వంబును మిథ్య యని శాస్త్రవిధినిషేధంబులు కలలోపల మేలుగన్న తెఱంగగు; భావాద్వైత క్రియాద్వైత ద్రవ్యాద్వైతంబులు మూఁడు గల; వందుఁ బట తంతు న్యాయంబునఁ గార్యకారణంబు లందు వస్త్వైకత్వాలోచనంబు చేసి వికల్పంబు లేదని భావించుట భావాద్వైతంబు; మనోవాక్కాయ కృతంబు లైన సర్వ కర్మంబులను ఫల భేదంబు జేయక పరబ్రహ్మార్పణంబు జేయుట క్రియాద్వైతంబు; పుత్ర మిత్ర కళత్రాది సర్వ ప్రాణులకుం దనకును దేహంబునకుం బంచభూతాత్మకత్వంబున భోక్త యొక్కం డను పరమార్థత్వంబున నర్థకామంబుల యెడ నైక్యదృష్టిఁ జేయుట ద్రవ్యాద్వైతంబు; నేర్పున నాత్మతత్త్వానుభవంబున నద్వైతత్రయంబును విలోకించి వస్తుభేదబుద్ధియుఁ గర్మభేదబుద్ధియు స్వకీయపరకీయబుద్ధియు స్వప్నంబులుగాఁ దలంచి ముని యైనవాఁడు మానవలయు.
టీక:- వినుము = వినుము; దేహాదుల = శరీరము మున్నగువాని; కున్ = కి; కారణత్వంబునన్ = ఉత్పత్తికారణ మగుటచేత; ఆదియందును = మొదటను; అవధిత్వంబునన్ = కాలపరిమాణము నిర్ణయించుటచేత; అంతమందును = చివరను; కలుగుచు = ఉండి; బహిరంగంబునన్ = బాహ్య ప్రపంచము నందు; భోగ్యంబును = అనుభవింపదగిన వస్తువును; అంతరంగంబునన్ = లోపల; భోక్తయున్ = అనుభవించెడి వాడును; పరంబునన్ = ఇతరమైనవాని యందు; అపరంబును = ఇతరము కానిదియు; జ్ఞానంబునన్ = తెలిసికొనదగినది యందు; జ్ఞేయంబును = తెలిసికొనునది; వచనంబునన్ = మాటయందు; వాచ్యంబునున్ = పలుకబడినది; అప్రకాశంబునన్ = వెలుగులేనిచోట; ప్రకాశంబునున్ = వెలుగు; ఐన = అయిన; వస్తువున్ = పదార్థము, పరమాత్మ; కున్ = కు; వేఱు = భిన్నమైనది; ఒండు = మరియొకటి; లేదు = లేదు; ప్రతిబింబ = ప్రతిబింబము; ఆదికంబున్ = మున్నగు; వస్తుత్వంబునన్ = వస్తువుతత్వము; చేసి = వలన; వికల్పితంబు = భేదముగా భావింపబడునది; ఐ = అయ్యి; తలంపంబడు = నమ్మబడుచుండెడి; భంగిన్ = విధముగా; ఐంద్రియకంబు = ఇంద్రియవికారము; ఐన = అయిన; సర్వంబునున్ = సమస్తమును; అర్థత్వంబునన్ = వస్తువులనెడి భావముతో; వికల్పితంబు = భేదముగా భావింపబడినది; అయి = అయ్యి; తోచున్ = తట్టును; కాని = తప్పించి; పరమార్థంబు = సత్యము; కాదు = కాదు; దేహా = దేహము; ఆదికంబులున్ = మున్నగునవి; మిథ్యాత్మకంబులు = అబద్ధము లైనవి; వానికిన్ = వాటికి; హేతువులు = కారణభూతములు; అయిన = ఐన; క్షితి = భూమి; ప్రముఖంబుల = మున్నగువాని; కును = కి; మిథ్యాత్వంబు = అసత్యరూపము లైనవి; అగుట = అయ్యి యుండుట; సిద్ధంబు = రూఢియైనది; పరమాత్మ = పరమాత్మ; కున్ = కు; అవిద్య = అజ్ఞానము; చేతన్ = వలన; ఎంత = ఎంత; తడవు = సమయము; వికల్పంబున్ = భేదము; తోచున్ = తోచునో; అంత = అంత; తడవును = సమయము; భ్రమంబునున్ = భ్రాంతికూడ; తోచున్ = తోచును; అవిద్యా = అజ్ఞానము; నివృత్తి = నాశము; ఐనన్ = కాగానే; సర్వంబున్ = సమస్తము; మిథ్య = అసత్యమైనది; అని = అని; శాస్త్ర = శాస్త్రమునందు; విధి = పాటింప నిర్ణయించినవి; నిషేధంబులు = మానవలెనని నిర్ణయించినవి; కల = స్వప్నము; లోపల = అందు; మేలున్ = మంచిని; కన్న = చూచిన; తెఱంగు = విధము; అగు = అగును; భావాద్వైత = భావాద్వైతము; క్రియాద్వైత = క్రియాద్వైతము; ద్రవ్యాద్వైతంబులు = ద్రవ్యాద్వైతములు; మూడున్ = మూడు (3); కలవు = ఉన్నవి; అందున్ = వానిలో; పట = వస్త్రము; తంతు = దారము; న్యాయంబునన్ = పద్ధతిలో; కార్య = కార్యమైన వస్త్రము; కారణంబులు = కారణమైన దారములు; అందున్ = ఎడల; వస్త్వైకత్వ = ఒకటేవస్తువు యనెడి; ఆలోచనంబు = తలంపు; చేసి = చేసి; వికల్పంబున్ = భేదము; లేదు = లేదు; అని = అని; భావించుట = తలచుట; భావాద్వైతంబు = భావాద్వైతము; మనః = మనస్సు; వాక్కు = మాట; కాయ = దేహములచే; కృతంబులు = చేయబడినవి; ఐన = అయిన; సర్వ = సమస్తమైన; కర్మంబులును = పనులు; ఫల = ఫలితముల; భేదంబున్ = తారతమ్యములు; చేయక = చూడక; పరబ్రహ్మ = పరబ్రహ్మమునకు; అర్పణంబుచేయుట = సమర్పించుట; క్రియాద్వైతంబు = క్రియాద్వైతము; పుత్ర = సంతానము; మిత్ర = స్నేహితులు; కళత్ర = భార్యలు; ఆది = మున్నగు; సర్వ = సమస్తమైన; ప్రాణుల్ = జీవుల; కున్ = కు; తన = తన; కును = కు; దేహంబున్ = శరీరమున; కున్ = కు; పంచభూతాత్మకత్వంబున = పంచభూత స్వరూపు డగుట {పంచభూతములు - 1పృథివి 2అప్పు 3తేజము 4వాయువు 5ఆకాశములు}; భోక్త = అనుభవించువాడు; ఒక్కండు = ఒకడే; అను = అనెడి; పరమార్థత్వంబునన్ = సత్యమైనతత్వముచేత; అర్థ = ద్రవ్యము; కామంబుల = కోరికల; ఎడన్ = అందు; ఐక్య = ఒకటే యనెడి; దృష్టిన్ = భావన; చేయుట = చేయుట; ద్రవ్యాద్వైతంబు = ద్రవ్యాద్వైతము; నేర్పునన్ = చాతుర్యముతో; ఆత్మత్తత్త్వ = బ్రహ్మతత్త్వముయొక్క; అనుభవంబునన్ = సాక్షాత్కారమువలన; అద్వైతత్రయంబును = అద్వైతములుమూటిని {అద్వైతత్రయము - భావ ద్రవ్య క్రియాద్వైతములు}; విలోకించి = వివేకించి; వస్తు = పదార్థములు; భేదబుద్ధి = అనేక రకము లను భావన; కర్మ = పనులలో; భేదబుద్ధి = పుణ్యపాపకర్మ లనెడి భావము; స్వకీయ = తనది; పరకీయ = ఇతరునిది; బుద్ధియు = అనెడిభావనలను; స్వప్నంబులు = కలలు, మిథ్యలు; కాన్ = అయినట్లు; తలంచి = భావించి; ముని = ముని; ఐన = అయిన; వాడు = వాడు; మానవలయు = విడువవలెను.
భావము:- శ్రద్ధగా విను ధర్మజా! ఈ దేహాదులు సమస్తానికి కారణరూపమైన; సృష్టి, స్థితి, లయములలోనూ తానే ఉండిన; బహిరంగంగా భోగ్యమూ, అంతరంగికంగా భోగించే భోక్తా; తన కంటె ఇంతరమైనది, ఇతరం కానిదీ; జ్ఞానమూ, జ్ఞేయమూ; మాటలు, పలుకబడినది; చీకటి, వెలుగు తనే అయిన మూల వస్తువు ఒక్కటే. అది కానిది మరొకటి లేదు. వస్తు తత్వంలో ప్రతిబింబం బింబం కంటే వేరైనదిగా అనిపిస్తుందే తప్ప అది యదార్థం కాదు; అలాగే, ఇంద్రియ సంబంధమైన సర్వమూ వికల్పాన్ని పొంది అలా అనిపిస్తాయి తప్ప అవి ఏవీ యదార్థం కాదు; దేహం మొదలైన సర్వం భ్రాంతి మూలకాలే, అవి అవశ్యం నశించేవే; వానికి కారణ రూపా లైన పృథ్వి మొదలైనవి కూడా నశించేవే, కానీ శాశ్వతాలు కావు; అజ్ఞానం వలన పరమాత్మఎంత వరకూ వికల్పంగా అనిపిస్తాడో, అంతవరకూ భ్రమ ఉన్నట్లే; ఆ అజ్ఞానం తొలగి పోగానే అంతా మిథ్య అయి, శాస్త్ర విధి నిషేధాలు సమస్తంపోయికలలో నుంచి మేలుకున్నట్లు అవుతుంది.
అద్వైతం మూడు రకాలు; అవి భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం. “వస్త్రము, దారములు ఒకటే వస్తువు అయినట్లుగా; కార్యకారణాలలో కూడా వస్తువు ఒకటే; విశ్వానికి మూలం ఒకటే అని ఏకైకరూపమైన ఆలోచన చేసి వికల్పం లేదని భావించటం” భావాద్వైతం. “మనస్సు, వాక్కు, కాయములచే నెరవేర్చబడే సర్వకర్మలూ ఫలభేదం లేకుండా; కర్తృత్వం తనమీద పెట్టుకోకుండా; తాను నిమిత్తమాత్రంగా భావించి; కర్మఫలాలను బ్రహ్మార్పణం చేయటం” క్రియాద్వైతం. “పుత్ర మిత్ర కళత్రాది సర్వప్రాణులకూ, తనకూ, దేహానికీ పంచభూతాత్మకంగా భోక్త ఒకడే అను పరమార్థ తత్వంతో అర్థకామాల పట్ల ఐక్యదృష్టి నిలపటం” ద్రవ్యాద్వైతం. ముని నేర్పుగా ఆత్మతత్వానుభావంతో ముందు చెప్పిన అద్వైతత్రయమును ఆకళింపు చేసుకుని వస్తు భేద బుద్ధి; స్వకీయ పరకీయ బుద్ధి; స్వప్నాలుగా భావించి జీవనం సాగించాలి.

తెభా-7-470-క.
వాములు వేయు నేటికి
వేదోక్త విధిం జరించు విబుధుఁడు గృహమం
దారమున నారాయణ
పాదంబులు గొలిచి ముక్తిదమున కేగున్.

టీక:- వాదములు = తర్కవితర్కములు; వేయున్ = అనేకము; ఏటికి = ఎందుకు; వేదోక్త = వేదములందుచెప్పినట్లుగా; విధిన్ = విధానములో; చరించు = నడచుకొను; విబుధుడు = జ్ఞాని; గృహము = గృహస్థాశ్రమమునందు; ఆదరమునన్ = భక్తితో; నారాయణ = విష్ణుని; పాదంబులున్ = పాదములను; కొలిచి = సేవించి; ముక్తి = మోక్ష; పదమున్ = స్థానమున; కున్ = కు; ఏగున్ = వెళ్ళును.
భావము:- ఈ వాదాలన్నీ ఎందుకు కానీ, వేదోక్త ప్రకారంగా నడచే విద్వాంసుడు, గృహంలో ఉండి కూడా శ్రీహరి పాదపద్మాలను అర్చించుకుంటూ తేలికగా ముక్తి పొందుతాడు.

తెభా-7-471-శా.
భూపాలోత్తమ! మీరు భక్తిగరిమస్ఫూర్తిన్ సరోజేక్షణ
శ్రీ పాదాంబుజయుగ్మమున్ నియతులై సేవించి కాదే మహో
గ్రాత్సంఘములోనఁ జిక్కక సమస్తాశాంత నిర్జేతలై
యేపారంగ మఖంబు చేసితిరి దేవేంద్రప్రభావంబునన్.

టీక:- భూపాలోత్తమ = మహారాజా {భూపాలోత్తముడు - భూపాలు (రాజు)లలో ఉత్తముడు, మహారాజు}; మీరు = మీరు (పాండవులు); భక్తి = భక్తి; గరిమ = అధికముగా; స్ఫూర్తిన్ = కలుగుటచేత; సరోజేక్షణ = విష్ణుని; శ్రీ = శుభకరములైన; పాద = పాదములను; అంబుజ = పద్మముల; యుగ్మమున్ = జంట యందు; నియతులు = నియమముగలవారు; ఐ = అయ్యి; సేవించి = కొలిచి; కాదే = కాదాయేమి, కదా; మహా = గొప్ప; ఉగ్ర = భయంకరమైన; ఆపత్ = ఇక్కట్ల; సంఘము = సమూహము; లోనన్ = అందు; చిక్కక = చిక్కుకొనక; సమస్త = ఎల్ల; ఆశాంత = దిగంతములను; నిర్జేతలు = గెలిచినవారు; ఐ = అయ్యి; ఏపారంగన్ = అతిశయించగా; మఖంబున్ = (అశ్వమేధ)యాగము; చేసితిరి = చేసితిరి; దేవేంద్ర = ఇంద్రుని; ప్రభావంబునన్ = మహిమకుసాటివచ్చునట్లు.
భావము:- భూపతీ! ధర్మజా! మీరు శ్రీకృష్ణుని పాదపద్మాలను నిష్ఠగా పరమ భక్తితో పూజించుట చేతనే కదా, భయంకరమైన కష్టాలలో చిక్కుపడిపోకుండా అపూర్వంగా దిగ్విజయం సాధించి దేవేంద్ర వైభవంగా రాజసూయ యాగం చేయగలిగారు.