Jump to content

పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/శుకుని మోక్షోపాయం బడుగట

వికీసోర్స్ నుండి


తెభా-1-526-సీ.
వ్యక్తమార్గుండవైన నీ దర్శన-
మాఱడి పోనేర; భిమతార్థ
సిద్ధి గావించుట సిద్ధంబు; నే డెల్లి-
దేహంబు వర్జించు దేహధారి
కేమి చింతించిన? నేమి జపించిన?-
నేమి గావించిన? నేమి వినిన?
నేమి సేవించిన? నెన్నఁడు సంసార-
ద్ధతిఁ బాసిన దవి గలుగు,

తెభా-1-526.1-తే.
నుండు మనరాదు; గురుఁడవు, యోగివిభుఁడ,
వావుఁ బిదికిన తడ వెంత యంత సేపు
గాని యొక దెస నుండవు, రుణతోడఁ
జెప్పవే తండ్రి! ముక్తికిఁ జేరు తెరువు."

టీక:- అవ్యక్త = తెలియుటకు కష్టమైన; మార్గుండవు = మార్గము కలవాడవు; ఐన = అయినట్టి; నీ = నీ; దర్శనము = దర్శనము; ఆఱడిన్ = వ్యర్థము; పోన్ = అయిపోవుట; నేరదు = జరగదు; అభిమత = కోరిన; అర్థ = ప్రయోజనము; సిద్ధిన్ = సిద్ధించునట్లుగా; కావించుట = చేయుట; సిద్ధంబు = తప్పదు; నేడు = ఇవేళో; ఎల్లి = రేపో; దేహంబున్ = శరీరమును; వర్జించు = విడవబోవుచున్న; దేహ = శరీరమును; ధారి = ధరించినవాని; కిన్ = కి; ఏమి = ఏమి; చింతించినన్ = ధ్యానము చేసిన; ఏమి = ఏమి; జపించిన = జపమును చేసిన; ఏమి = ఏమి; కావించిన = చేయించిన; ఏమి = ఏమి; వినినన్ = విన్న; ఏమి = ఏమి; సేవించినన్ = పూజించిన; ఎన్నఁడున్ = ఎప్పుడును; సంసార = సంసారము వలన; పద్ధతిన్ = మార్గము (పునర్జన్మల దారి); పాసిన = తొలగిన; పదవి = పరిస్థితి - ముక్తి; కలుగున్ = దొరుకును; ఉండుము = ఉండుము; అనరాదు = అనకూడదు;
గురుఁడవు = గురుదేవుడవు; యోగి = యోగులలో; విభుఁడవు = శ్రేష్ఠుడవు; ఆవున్ = ఆవుకు; పిదికిన = పాలు పితుకుటకు పట్టు; తడవు = సమయము; ఎంత = ఎంతో; అంత = అంత; సేపు = సమయము; కాని = తప్ప; ఒక = ఒకే; దెసన్ = స్థలములో; ఉండవు = ఉండవు; కరుణ = దయ; తోడన్ = కలిగి; చెప్పవే = చెప్పుము; తండ్రి = తండ్రీ; ముక్తి = ముక్తి; కిన్ = కి; చేరు = చేరుటకు; తెరువు = దారి – పద్దతి.
భావము:- అవధూతలతో అగ్రగణ్యుడవు. అవ్యక్తమైన గమనంకలవాడవు. నీ సందర్శనం వ్యర్థం కాదు, నా వాంఛితార్థం ముమ్మూటికి సిద్ధిస్తుంది. ఈనాడో రేపో దేహాన్నే త్యజించబోయే జీవికి సంసారబంధాలు సమసిపోయి మోక్షం ప్రాప్తించే నిమిత్తం చింతింపవలసిందీ, జపించవలసిందీ, చేయవలసిందీ, వినవలసిందీ, సేవలందించవలసిందీ ఏమిటో దయచేసి విశదీకరించమని వేడుకొంటున్నాను. నీవు జగద్గురుడవు. నీకు తెలియంది ఏమి లేదు. ఆవు నుండి పాలను పిదికినంత సేపటి కంటే ఎక్కువ సేవు ఎక్కడా ఉండవు. నిన్ను ఉండమని అనరాదు. అయినా, ఓ దయగల తండ్రీ! మోక్ష మార్గాన్ని నాకు తెలియజెప్పు అని అడుగుతున్నాను."

తెభా-1-527-వ.
అని పరీక్షిన్నరేంద్రుండు బాదరాయణి నడిగె"నని చెప్పి.
టీక:- అని = అని; పరీక్షిత్ = పరీక్షత్తు అను; నర = నరులకు; ఇంద్రుండు = ప్రభువు – మహారాజు; బాదరాయణిన్ = బాదరాయణుని కుమారుని - శుకుని; అడిగెన్ = అడిగెను; అని = అని; చెప్పి = చెప్పి.
భావము:- అని పరీక్షిన్నరేంద్రుడు వ్యాసపుత్రుడైన శుకబ్రహ్మను అడిగెను"అని చెప్పి