పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/నారదుని గాల సూచనంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-1-328-మత్త.
ఎం కాలము గృష్ణుఁ డీశ్వరుఁ డిద్ధరిత్రిఁ జరించు మీ
రం కాలము నుండుఁ డందఱుఁ వ్వలం బనిలేదు, వి
భ్రాంతి మానుము కాలముం గడవంగ నెవ్వరు నోప రీ
చిం యేల నరేంద్రసత్తమ! చెప్పెదన్ విను మంతయున్.

టీక:- ఎంత = ఎంత; కాలమున్ = కాలము; కృష్ణుఁడు = భగవంతుడు; ఈశ్వరుఁడు = భగవంతుడు; ఈ = ఈ; ధరిత్రిన్ = భూమి మీద; చరించున్ = విహరిస్తాడో; మీరు = మీరు కూడ; అంత కాలమున్ = అంత వరకు; ఉండుఁడు = ఉండండి; అందఱున్ = మీరు అందరును; అవ్వలన్ = ఆపైన; పని లేదు = అవసరము లేదు; విభ్రాంతి = మిక్కట మైన భ్రమను; మానుము = వదులుము; కాలమున్ = కాలమును; కడవంగన్ = దాటుటకు; ఎవ్వరున్ = ఎవరూ కూడా; ఓపరు = సమర్థులు కాలేరు; ఈ = ఈ; చింత = వగపు; ఏల = ఎందులకు; నరేంద్ర = రాజులలో; సత్తమ = ఉత్తముడా (ధర్మరాజ); చెప్పెదన్ = చెప్తాను; వినుము = వినుము; అంతయున్ = జరిగింది అంతా.
భావము:- (నారదుడు ధృతరాష్ట్రాదుల గురించి కలత చెందిన ధర్మరాజుకి కాలసూచన చేస్తున్నాడు.)
“మహారాజా! కలవరపాటు వదలిపెట్టు. శ్రీకృష్ణ భగవానుడు ఎంత వరకు ఈ భూమ్మీద ఉంటాడో, అప్పటి దాకా మీ పాండవులు అందరు కూడ ఉండండి. ఆయన అవతారం చాలించిన పిమ్మట మీరు ఉండనక్కర్లేదు; ఎంతటి వారైనా సరే కాల ప్రభావానికి తలవంచాల్సిందే. ధృతరాష్ట్రాదులకు ఏం జరిగిందో అంతా వివరంగా చెప్తా. విను; ఇంకా దుఃఖించటం అనవసరం.

తెభా-1-329-వ.
ధృతరాష్ట్రుండు గాంధారీ విదుర సహితుండై హిమవత్పర్వత దక్షిణ భాగంబున నొక్క ముని వనంబునకుం జని, తొల్లి సప్తర్షులకు సంతోషంబు సేయుకొఱకు నాకాశగంగ యేడు ప్రవాహంబులయి, పాఱిన పుణ్యతీర్థంబునం గృతస్నానుం డై యథావిధి హోమం బొనరించి, జలభక్షణంబు గావించి, సకల కర్మంబులు విసర్జించి విఘ్నంబులం జెందక నిరాహారుండయి, యుపశాంతాత్ముండయి పుత్రార్థదారైషణంబులు వర్జించి, విన్య స్తాసనుండై ప్రాణంబుల నియమించి, మనస్సహితంబు లైన చక్షురాదీంద్రియంబుల నాఱింటిని విషయంబులం బ్రవర్తింపనీక నివర్తించి, హరిభావనారూపం బగు ధారణాయోగంబుచే రజస్సత్త్వతమో రూపంబు లగు మలంబుల మూఁటిని హరించి, మనంబు నహంకారాస్పదం బైన స్థూలదేహంబువలనం బాపి బుద్ధి యందు నేకీకరణంబు సేసి, యట్టి విజ్ఞా నాత్మను దృశ్యాంశంబువలన వియోగించి, క్షేత్రజ్ఞుని యందుఁ బొందించి దృష్టం బైన యీశ్వరునివలన క్షేత్రజ్ఞునిం బాపి, మహాకాశంబుతోడ ఘటాకాశముం గలుపు కైవడి నాధారభూతంబైన బ్రహ్మ మందుఁ గలిపి, లోపలి గుణక్షోభంబును వెలుపలి యింద్రియ విక్షోపంబును లేక నిర్మూలిత మాయా గుణ వాసనుం డగుచు, నిరుద్ధంబు లగు మన శ్చక్షురాదీంద్రియంబులు గలిగి, యఖిలాహారంబులను వర్జించి, కొఱడు చందంబున.
టీక:- ధృతరాష్ట్రుండు = ధృతరాష్ట్రుండు; గాంధారీ = గాంధారితోను; విదుర = విదురునితోను; సహితుండు = కూడినవాడు; ఐ = అయి; హిమవత్పర్వత = హిమాలయములకు; దక్షిణ = దక్షిణ; భాగంబున = దిగ్భాగమున; ఒక్క = ఒక; ముని = ముని యొక్క; వనంబు = ఆశ్రమము; కున్ = కు; చని = వెళ్ళి; తొల్లి = పూర్వము; సప్తర్షులు = సప్తర్షులు; కున్ = కు; సంతోషంబున్ = ఆనందమును; చేయు = కలుగ జేయుట; కొఱకున్ = కోసము; ఆకాశగంగ = ఆకాశగంగ; ఏడు = ఏడు (7); ప్రవాహంబులు = పాయలు; అయి = అయి; పాఱిన = ప్రవహించిన; పుణ్య = పుణ్యమును ఒసగు; తీర్థంబునన్ = రేవులో; కృత = చేసిన; స్నానుండు = స్నానము కలవాడు; ఐ = అయి; యథావిధి = పద్దతి ప్రకారము; హోమంబు = హోమము; ఒనరించి = పూర్తిచేసి; జలభక్షణంబు = నీటిని ఆహారముగ తీసుకొనుట; కావించి = చేసి; సకల = సమస్త; కర్మంబులున్ = కర్మలు; విసర్జించి = విడిచిపెట్టి; విఘ్నంబులన్ = (నియమలకు) భంగములు; చెందక = కలుగకుండ; నిరాహారుండు = ఆహారము తీసుకొనని వాడు; అయి = అయి; ఉపశాంతి = ప్రశాంతి పొందిన; ఆత్ముండు = ఆత్మకలవాడు; అయి = అయి; పుత్ర = పుత్రులు; అర్థ = ధనము; దార = భార్యలు వలన; ఈషణంబులున్ = ఈషణములను (భావశేషములు); వర్జించి = విడిచిపెట్టి; విన్యస్త = చక్కగావేసిన; ఆసనుండు = ఆసనములో ఉన్నవాడు; ఐ = అయి; ప్రాణంబులన్ = ప్రాణములను; నియమించి = సంయమనముచేసి, ప్రాణాయామములు చేసి; మనస్సహితంబు = మనస్సుతో పాటువి; ఐన = అయినట్టి; చక్షుః = కన్నులు; ఆది = మొదలగు; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; ఆఱింటిని = ఆరింటిని {ఇంద్రియములు 6 - మనస్సు, పంచేంద్రియములు}; విషయంబులన్ = విషయముల వెనుక {విషయములు - ఇంద్రియార్థములు}; ప్రవర్తింపనీక = నడవనీయక (చిత్తవృత్తిని నిరోధించి); నివర్తించి = మరల్చి; హరిభావన = భగవంతుని ధ్యానించుట అనే; రూపంబు = స్వభావము; అగు = కలిగిన; ధారణా = చిత్తమునందు ధరించు; యోగంబు = యోగాభ్యాసము; చేన్ = చేత; రజస్ = రజోగుణ; స్సత్త్వ = సత్త్వగుణ; తమో = తమోగుణ; రూపంబులు = స్వభావములు; అగు = కలిగిన; మలంబులన్ = మలములను; మూఁటిని = మూడింటిని; హరించి = నాశనముచేసి; మనంబున్ = మనసును; అహంకార = అహంకారమునందు; ఆస్పదంబు = నివాసము ఏర్పరుచుకొన్నది; ఐన = అయినట్టి; స్థూల = స్థూల; దేహంబు = దేహము; వలనన్ = వలన; పాపి = దూరముచేసి; బుద్ధి = బుద్ధి; అందున్ = లో; ఏకీకరణంబు = ఐక్యము; చేసి = చేసి; అట్టి = అటువంటి; విజ్ఞాన = విజ్ఞానరూప; ఆత్మను = ఆత్మను; దృశ్య = కంటికి; అంశంబు = కనిపించునది (జగత్తు); వలనన్ = నుండి; వియోగించి = విడదీసి; క్షేత్రజ్ఞుని = ఆత్మ; అందున్ = లో; పొందించి = చక్కగా కలిపి; దృష్టంబు = చూడబడినది; ఐన = అయినట్టి; ఈశ్వరుని = భగవంతుని; వలనన్ = వలన; క్షేత్రజ్ఞునిన్ = ఆత్మను; పాపి = దూరముచేసి; మహాకాశంబు = పైన అంతట ఉన్న ఆకాశము; తోడన్ = తో; ఘటాకాశమున్ = కుండలోని ఆకాశమును; కలుపు = కలుపు; కైవడిన్ = విధముగ; ఆధారభూతంబు = ఆధారభూతము, కారణాంశము; ఐన = అయినట్టి; బ్రహ్మము = బ్రహ్మము; అందున్ = లో; కలిపి = కలిపి; లోపలి = లోపలఉండే; గుణ = గుణములయొక్క; క్షోభంబును = ఘర్షణమును; వెలుపలి = వెలుపల ఉండే; ఇంద్రియ = ఇంద్రియముల; విక్షేపంబును = చాంచల్యమును; లేక = లేకుండగ; నిర్మూలిత = నిర్మూలింపబడిన; మాయా = మాయయు; గుణ = గుణముల యొక్కయు; వాసనుండు = సంస్కారము కలవాడు; అగుచున్ = అవుతూ; నిరుద్ధంబులు = నిరోధింపబడినవి; అగు = అయిన; మనస్ = మనసు; చక్షుః = కన్నులు; ఆది = మొదలగు; ఇంద్రియంబులు = ఇంద్రియములు; కలిగి = కలిగి; అఖిల = సమస్తమైన; ఆహారంబులను = ఆహారములను; వర్జించి = విడిచిపెట్టి; కొఱడు = కొయ్య; చందంబున = వలె.
భావము:- మీ పెత్తండ్రి ధృతరాష్ణ్రుడు గాంధారీ విదురులతో కలిసి హిమవత్పర్వతానికి దక్షిణంగా ఉన్న మునుల తపోవనానికి వెళ్లాడు. అక్కడ పూర్వం సప్తమహర్షుల సంతోషం కోసం ఆకాశగంగ ఏడు పాయలుగా ప్రవహించింది. సప్తశ్రోత మనే ఆ వుణ్యతీర్థంలో మీ తండ్రిగారు మూడు వేళలా స్నానం చేస్తూ, యథావిధిగా అగ్నికార్యం ఆచరిస్తూ, నిరాహారుడై కేవలం జలం మాత్రమే స్వీకరిస్తూ, సకలకర్మలూ పరిత్యజించి నిరాటంకంగా ప్రశాంతచిత్తుడై, ఈషణత్రయాన్ని విసర్జించి దర్భాసనాసీనుడై, జితేంద్రియుడై, సత్వరజస్తమో గుణాల మాలిన్యాన్ని పోకార్చి, తదేకధ్యానంతో శ్రీహరిని చింతిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన తన మనస్సును అహంకారానికి ఆలవాలమైన స్థూల దేహంనుంచి సమైక్యంచేసాడు. అట్టి విజ్ఞానాత్మకమైన బుద్ధిని విషయాలనుండి బుద్ధియందు మళ్లించి ఆత్మయందు సంలగ్నం చేసాడు. అట్టి ఆత్మను మహాకాశంలో ఘటాకాశాన్ని కలిపినట్టు సమస్త జగత్తుకు ఆధారభూతుడైన పరమాత్మలో సంలీనం చేసాడు, ఇప్పుడు మీ తండ్రి అంతరింద్రియ బాహ్యేంద్రియాల సంక్షోభం లేకుండా మాయను నిరోధించి, వాంఛలను నిర్మూలించి స్థాణువువలె పర్ణశాల లోపల ఉన్న వేదికపై నిశ్చలంగా ఆసీనుడై ఉన్నాడు.

తెభా-1-330-మ.
జాంతస్థ్సలవేదికిన్ నియతుఁడై యున్నాఁడు నే డాదిగా
నిపై నేనవనాఁడు మేన్ విడువఁగా నిత్యాగ్ని యోగాగ్ని త
త్పటుదేహంబు దహింపఁ జూచి, నియమప్రఖ్యాత గాంధారి యి
ట్టటు వో నొల్లక ప్రాణవల్లభునితో గ్నిం బడున్ భూవరా!

టీక:- ఉటజ = పర్ణశాల; అంతః = లోపలి; స్థల = స్థలమున; వేదికిన్ = గట్టుమీద; నియతుఁడు = నియమముకలవాడు; ఐ = అయి; ఉన్నాఁడు = ఉన్నాడు; నేడు = ఈ రోజు; ఆదిగాన్ = మొదలుకొని; ఇటపైన్ = ఇంకనుంచి; ఏనవనాఁడు = ఐదవ దినమున; మేన్ = శరీరము; విడువఁగా = విడిచిపెట్టగ; నిత్య = నిత్యము చేయు హోమమునందలి; అగ్ని = అగ్ని; యోగ = యోగము వలని; అగ్ని = అగ్ని; తత్ = ఆ; పటు = బలిష్టమైన; దేహంబున్ = దేహమును; దహింపన్ = కాల్చివేయగ; చూచి = చూసినదై; నియమ = నియమ పాలనలో; ప్రఖ్యాత = పేరుపొందిన; గాంధారి = గాంధారి; ఇట్టట్టు = ఎటూ; ఓన్ = పోవుటకు; ఓల్లక = ఒప్పుకొనక; ప్రాణవల్లభు = ప్రాణములకు ప్రభువు, భర్త; తోన్ = తో; అగ్నిన్ = అగ్నిలో; పడున్ = పడును; భూవరా = భూమికి భర్తా.
భావము:- మహారాజా! మీ తండ్రి ధృతరాష్ట్రుడు నేటికి ఐదవనాడు యోగాగ్నిలో దేహత్యాగం చేయటానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఆ విధంగా ఆయన యోగాగ్నిలో దగ్ధం కావటం చూసి మహాపతివ్రత అయిన గాంధారి నిస్సంకోచంగా తన ప్రాణేశ్వరునితోపాటు ఆ పావక జ్వాలల్లో పడి భస్మమై పోతుంది.

తెభా-1-331-క.
అంట వారల మరణము
విం యగుచుఁ జూడఁబడిన విదురుఁడు చింతా
సంతాప మొదవఁ బ్రీత
స్వాంతుండై తీర్థములకుఁ నియెడు నధిపా!”

టీక:- అంతట = అప్పుడు; వారల = వారియొక్క; మరణమున్ = మరణములు; వింత = విచిత్రము; అగుచున్ = అవుతూ; చూడఁబడిన = చూసిన; విదురుఁడు = విదురుడు; చింతా = దుఃఖము వలన; సంతాపము = బాధ; ఒదవన్ = కలుగగా; ప్రీత = వదులైన; స్వాంతుండు = స్వాంతము కలవాడు; ఐ = అయి; తీర్థములు = పుణ్యక్షేత్రములు; కున్ = కు; చనియెడున్ = వెళ్ళును; అధిపా = గొప్పవాడా.
భావము:- అప్పుడు ఆ మహారాజ దంపతుల ఆత్మత్యాగానికి ఆశ్చర్యచకితుడైన విదురుడు చింతా సంతాపాలు పెనగొనిన హృదయంతో పుణ్యతీర్థాలకు వెళ్లిపోతాడు."

తెభా-1-332-వ.
అని విదురాదుల వృత్తాంతం బంతయు ధర్మనందనుని కెఱిగించి తుంబుర సహితుం డయిన నారదుండు స్వర్గంబునకు నిర్గమించిన వెనుక ధర్మజుండు భీమునిం జూచి యిట్లనియె.
టీక:- అని = అని; విదుర = విదురుడు; ఆదుల = మొదలగువారి; వృత్తాంతంబున్ = సమాచారము; అంతయున్ = సమస్తమును; ధర్మనందనుని = ధర్మరాజున; కిన్ = కు; ఎఱిగించి = తెలియజేసి; తుంబుర = తుంబురునితో; సహితుండు = కూడినవాడు; అయిన = అయిన; నారదుండు = నారదుడు; స్వర్గంబున = స్వర్గమున; కున్ = కు; నిర్గమించిన = వెడలిన; వెనుక = తరువాత; ధర్మజుండు = ధర్మరాజు {ధర్మజుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; భీమునిన్ = భీముని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఈ విధంగా విదుర, గాంధారీ, ధృతరాష్ట్రుల వృత్తాంతాన్ని ధర్మరాజుకు సంపూర్ణంగా వివరించిన నారదుడు తుంబురునితో కూడా స్వర్గలోకానికి సాగిపోయాడు. అనంతరం అజాతశత్రువు భీమసేనుణ్ణి చూసి ఇలా అన్నాడు....

తెభా-1-333-సీ.
"క కాలమునఁ బండు నోషధిచయము వే-
ఱొక కాలమునఁ బండకుండు నండ్రు;
క్రోధంబు లోభంబుఁ గ్రూరత బొంకును-
దీపింప నరులు వర్తింతు రండ్రు;
వ్యవహారములు మహావ్యాజయుక్తము లండ్రు-
ఖ్యంబు వంచనా హిత మండ్రు;
గలతో నిల్లాండ్రు చ్చరించెద రండ్రు-
సుతులు దండ్రులఁ దెగఁ జూతు రండ్రు;

తెభా-1-333.1-తే.
గురుల శిష్యులు దూషించి కూడ రండ్రు;
శాస్త్రమార్గము లెవ్వియుఁ రుగ వండ్రు;
న్యాయపద్ధతి బుధులైన డవ రండ్రు;
కాలగతి నింతయై వచ్చెఁ గంటె నేఁడు.

టీక:- ఒక = ఒక; కాలమునన్ = కాలములో; పండు = పండునట్టి; ఓషధి = ధాన్యముల; చయము = సమూహము; వేఱొక = మరియొక; కాలమునన్ = కాలములో; పండకుండున్ = పండవు; అండ్రు = అందురు; క్రోధంబు = క్రోధము; లోభంబు = లోభము; క్రూరత = క్రూరత్వము; బొంకును = అసత్యము; దీపింపన్ = చెలరేగగ, ఎక్కువకాగా; నరులు = మానవులు; వర్తింతురు = ఉండుదురు; అండ్రు = అందురు; వ్యవహారములు = తగవులు, పరిష్కారములు; మహా = మిక్కిలి; వ్యాజ = మిషలతో; యుక్తములు = కూడుకొన్నవి; అండ్రు = అందురు; సఖ్యంబు = స్నేహములు; వంచనా = వంచనతో; సహితము = కూడినవి; అండ్రు = అందురు; మగలు = భర్తలు; తోన్ = తో; ఇల్లాండ్రు = భార్యలు; మచ్చరించెదరు = స్పర్దిస్తారు, ద్వేషిస్తారు; అండ్రు = అందురు; సుతులు = సంతానము; తండ్రులన్ = తండ్రులను; తెగన్ = దిక్కరించ వలనని; చూతురు = చూచెదరు; అండ్రు = అందురు;
గురుల = గురువులను; శిష్యులు = శిష్యులు; దూషించి = నిందించి; కూడరు = కలిసిరారు; అండ్రు = అందురు; శాస్త్ర = శాస్త్రీయ; మార్గములు = విధానములు; ఎవ్వియున్ = ఏవికూడా; జరుగవు = నడవవు, సాగవు; అండ్రు = అందురు; న్యాయ = న్యాయమైన; పద్ధతి = పద్ధతిలో; బుధులు = బుద్ధిమంతులు; ఐన = అయినను, కూడా; నడవరు = నడువరు; అండ్రు = అందురు; కాల = కాలానుగుణ; గతి = విధానములు; ఇంత = ఈ విధముగ; ఐ = అయ్యి; వచ్చెన్ = వచ్చెను; కంటె = చూచితివా; నేఁడు = ఈవేళ.
భావము:- తమ్ముడూ చూశావు కదా కాలగమనంలో ఎంత మార్పు వచ్చిందో పంటలు సకాలానికి పండటం లేదు. క్రోధం, లోభం క్రౌర్యం, అసత్యం మితిమీరి ప్రజలు ప్రవర్తిస్తున్నారు. వ్యాపారాలలో మోసం చోటు చేసుకొంటున్నది. స్నేహంలో ద్రోహం కనిపిస్తూ ఉంది. భార్యలు భర్తలతో స్పర్దిస్తున్నారు. కొడుకులు కన్నతండ్రులపై కాలుదువ్వుతున్నారు. శిష్యులు గురువులను దూషిస్తున్నారు. శాస్త్రవిధులు కుంటుబడ్డాయి. విజ్ఞులు సైతం న్యాయ మార్గాన్ని విడిచిపెట్టారు. కాలగమనం ఎంతగా వింతగా మారిపోయింది.

తెభా-1-334-మ.
రిఁ జూడన్ నరుఁ డేగినాడు నెల లే య్యెం గదా రారు కా
రు లెవ్వారును; యాదవుల్ సమద లోస్వాంతు లీవేళ సు
స్థిరులై యుండుదురా? మురారి సుఖియై సేమంబుతో నుండునా?
యెవై యున్నది చిత్త మీశ్వరకృతం బెట్లో కదే! మారుతీ!

టీక:- హరిన్ = కృష్ణుని; చూడన్ = చూచుటకు; నరుఁడు = అర్జునుడు; ఏగినాడు = వెళ్ళినాడు; నెలలు = నెలలు; ఏడు = ఏడు (7); అయ్యెన్ = ఆయెను; కదా = కదా; రారు = వచ్చుటలేదు; కాలరులు = వార్తాహరులు; ఎవ్వారును = ఎవరును; యాదవుల్ = యాదవులు; సమతన్ = సమత్వము చెందిన; లోల = చాంచల్యముతో కూడిన; స్వాంతులు = మనసు కలవారు; ఈ = ఈ; వేళ = సమయములో; సుస్థిరులు = నిలకడకలవారు; ఐ = అయి; ఉండుదురా = ఉండే ఉంటారా; మురారి = కృష్ణుడు {మురారి - మురాసురుని శత్రువు, కృష్ణుడు}; సుఖి = సుఖము కల వాడు; ఐ = అయి; సేమంబు = క్షేమము; తోన్ = గా; ఉండునా = ఉండే ఉండునా; ఎరవు = వికలము; ఐ = అయి; ఉన్నది = ఉన్నది; చిత్తము = మనసు; ఈశ్వర = భగవంతునిచే; కృతంబు = చేయబడునది (దైవ నిర్ణయము); ఎట్లో = ఎలా ఉంటుందో; కదే = ఏమో; మారుతీ = భీమసేనా {మారుతీ - వాయుదేవుని పుత్రుడు, భీముడు}.
భావము:- మరున్నందనా! భీమా! మాధవుని చూచుటకు మన అర్జునుడు కూడా ద్వారకానగరానికి వెళ్ళాడు గదా. ఇప్పటికి ఏడు మాసాలు గడిచి పోయాయి. ఇంతవరకూ తిరిగిరాలేదు. మళ్లీ మనకు వారిక్షేమం తెలియలేదు. చారులు కూడా ఎవరూ రాలేదు. యాదవులు కొంచెము ఉద్ధత స్వాభావులు. వారిది వేడిరక్తం. వారు ప్రశాంతచిత్తులై ఉండి ఉంటారు గదా? వాసుదేవుడు కుశలంగానే ఉంటాడు కదా? మనస్సంతా చికాకుగా ఉంది. ఈశ్వర సంకల్పం ఎలా ఉందో ఏమో?

తెభా-1-335-క.
మాసము గలఁగుచున్నది
మావు బహుదుర్నిమిత్త ర్యాదలు; స
న్మావదేహక్రీడలు
మా విచారింప నోపు మాధవుఁ డనుజా!

టీక:- మానసమున్ = మనస్సు; కలఁగుచున్ = కలతపడుతు; ఉన్నది = ఉన్నది; మానవు = మానుటలేదు; బహు = అనేకమైన; దుర్ = చెడు; నిమిత్త = సూచించు; మర్యాదలు = శకునములు; సత్ = మంచి; మానవ = మనుష్య; దేహ = దేహముతో; క్రీడలు = క్రీడించుటలు; మానన్ = మానవలెనని; విచారింపన్ = ఆలోచించుచు; ఓపున్ = ఉండవచ్చును; మాధవుఁడు = కృష్ణుడు; అనుజా = సోదరుడా.
భావము:- భీమసేనా! నా మనస్సంతా వ్యాకులంగా ఉంది. అన్నీ దుశ్శకునాలే తోస్తున్నాయి. వాసుదేవుడు లీలామానుష దేహాన్ని చాలించాలని ఆలోచిస్తున్నాడేమో.

తెభా-1-336-క.
వులు సెప్పక ముందఱ
దార ప్రాణ రాజ్య మానశ్రీలన్
నుపుదు నని మాధవుఁ డిట
మునఁ దలపోసి మనిచె నలం గరుణన్.

టీక:- మనవులు = విన్నపములు; చెప్పక = విన్నవించుకోక; ముందఱ = ముందరనే; మన = మన యొక్క; దార = భార్యలు; ప్రాణ = ప్రాణములు; రాజ్య = రాజ్యములు; మాన = మానములు అనే; శ్రీలన్ = సంపదలను; మనుపుదును = రక్షింతును; అని = అని; మాధవుఁడు = హరి {మాధవుడు - మాధవి (లక్ష్మి) ధవుడు (భర్త), భగవంతుడు}; ఇట = ఇక్కడ; మనమునన్ = మనసులో; తలపోసి = అనుకొని; మనిచెన్ = మనజేసెను, బ్రతికించెను; మనలన్ = మనలను; కరుణన్ = కరుణతో.
భావము:- ఆ మధుసూదనుడు మనం విన్నవించుకొనక ముందే మన కష్టాలన్నీ గుర్తించి మన ధర్మపత్నినీ, ప్రాణాలనూ, రాజ్యాన్నీ, మర్యాదనూ, సిరిసంపదలనూ కంటికి రెప్పలా కాపాడాడు.

తెభా-1-337-క.
నాదుఁ డాడిన కైవడిఁ,
గ్రూపుఁ గాలంబు వచ్చెఁ గుంభిని మీఁదన్
ఘోములగు నుత్పాతము
లాభటిం జూడఁబడియె నిలజ! కంటే.

టీక:- నారదుఁడు = నారదుడు; ఆడిన = పలుకిన; కైవడిన్ = విధముగ; క్రూరపున్ = క్రూరమైన; కాలంబు = కాలము; వచ్చున్ = వచ్చును; కుంభిని = భూమి; మీఁదన్ = మీద; ఘోరములు = భయంకరములు; అగు = అయినట్టివి; ఉత్పాతము = ఆపదలు; ఆరభటిన్ = మ్రోతమ్రోగుతూ; చూడఁబడియెన్ = కనబడుతున్నవి; అనిలజ = వాయు పుత్రుడా; కంటే = చూచితివా.
భావము:- నాయనా! భీమా! ఈ భూమిమీద భయంకరములైన ఉపద్రవాలు కనిపిస్తున్నాయి. చూశావు కదా! నారదుడు చెప్పినట్లుగా క్రూరమైన కాలం వస్తుంది.

తెభా-1-338-సీ.
డక ముందట నొక సారమేయంబు-
మొఱగుచు నున్నది మోర యెత్తి;
యాదిత్యుఁ డుదయింప భిముఖంబై నక్క-
వాపోయె మంటలు వాతఁ గలుగ;
మిక్కిలుచున్నవి మెఱసి గృధ్రాదులు-
ర్దభాదులు దీర్చి క్రందుకొనియె;
నుత్తమాశ్వంబుల కుదయించెఁ గన్నీరు-
త్తగజంబుల దము లుడిగె;

తెభా-1-338.1-ఆ.
గాలు దూతభంగిఁ దిసెఁ గపోతము;
మండ దగ్ని హోమ మందిరములఁ;
జుట్టుఁ బొగలు దిశల సొరిది నాచ్ఛాదించెఁ;
రణి మాసెఁ; జూడు రణి గదలె.

టీక:- ఓడక = జంకక; ముందటన్ = ముందర; ఒక = ఒక; సారమేయంబు = కుక్క; మొఱగుచున్ = మొఱగుచును (కుక్కఅరుపు); ఉన్నది = ఉన్నది; మోర = మెడ; ఎత్తి = పైకెత్తి; ఆదిత్యుఁడు = సూర్యుడు; ఉదయింప = ఉదయిస్తుంటే; అభిముఖంబు = ఎదురు; ఐ = అయ్యి; నక్క = నక్క; వాపోయె = ఏడుస్తున్నట్టు అరుచుచున్నది; మంటలు = మంటలు; వాతన్ = వాంతి; కలుగ = చేసు కుంటుండగ; మిక్కిలుచున్నవి = గుంపులు కడుతున్నవి; మెఱసి = బయల్పడుచు; గృధ = గద్ధలు; ఆదులు = మొదలగునవి; గర్దభ = గాడిదలు; ఆదులు = మొదలగునవి; తీర్చి = బారులు తీరి; క్రందుకొనియె = మూగుతున్నవి; ఉత్తమ = ఉత్తమ జాతి; అశ్వంబుల = గుఱ్ఱముల; కున్ = కు; ఉదయించెన్ = కనిపిస్తున్నది; కన్నీరు = కన్నీరు; మత్త = మదపు; గజంబుల = ఏనుగుల యొక్క; మదము = మదములు; ఉడిగె = ఎండిపోవు తున్నది; కాలు = యముని; దూత = భటుని; భంగిన్ = వలె; కదిసెన్ = మీదకి వచ్చింది; కపోతము = పావురము;
మండదు = మంటలు రావడంలేదు (రాజేస్తున్నా); అగ్ని = నిప్పునుంచి (హోమగుండాలలో); హోమ = హోమాలు చేయు; మందిరములన్ = శాలలో; చుట్టున్ = చుట్టూ; పొగలు = పొగలు; దిశల = దిశలువెంట; సొరిది = క్రమముగా; ఆచ్ఛాదించెన్ = క్రమ్మినవి; తరణి = సూర్యుడు; మాసెన్ = మసకబారెను; చూడు = చూడుము; ధరణి = భూమి; కదలె = కంపించెను.
భావము:- అదుగో మన ముందుగా ఒక్క కుక్క ముఖం పై కెత్తి మొరుగుతున్నది. నక్క ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడి నోటి వెంట నిప్పులు గ్రక్కుతూ ఏడుస్తున్నది. గ్రద్దలు మొదలైన పక్షులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. గాడిదలు మొదలైన జంతువులు బారులు తీర్చినాయి. మేలిజాతి గుఱ్ఱాలు కన్నీరు కారుస్తున్నాయి. మదపుటేనుగులు నీరుగారి పోతున్నాయి. కపోతాలు యమదూతల్లాగా పైపైకి వస్తున్నాయి. హోమకుండాల్లో అగ్నిహోత్రాలు మండటంలేదు. దట్టమైన పొగలు దిక్కు లంతటా చుట్టుముట్టాయి. సూర్యబింబం మసక వేసినట్లుగా ఉంది. భూమి కంపించుతూ ఉంది.

తెభా-1-339-క.
వాములు విసరె; రేణు
వ్రాము లాకసముఁ గప్పె; డి సుడిగొని ని
ర్ఘాములు వడియె; ఘన సం
ఘాతంబులు రక్తవర్ష లితము లయ్యెన్.

టీక:- వాతములు = పెనుగాలులు; విసరె = వీస్తున్నవి; రేణు = ధూళి, దుమ్ము; వ్రాతములు = తెరలు; ఆకసమున్ = ఆకాశమును; కప్పె = కప్పివేసినవి; వడిన్ = మిక్కిలి వేగముగా; సుడిగొని = సుడులు తిరుగుతూ; నిర్ఘాతములు = పిడుగులు; వడియెన్ = పడినవి; ఘన = మబ్బుల యొక్క; సంఘాతంబులు = గుంపులు; రక్త = రక్తపు; వర్ష = వాన; కలితములు = కలిగించునవి; అయ్యెన్ = అయ్యెను.
భావము:- విపరీతమైన వాయువులు వీచాయి. ఆకాశం ధూళి ధూసరితమైంది. పైనుండి పిడుగులు పడుతున్నాయి. మేఘాలు రక్తవర్షాన్ని కురుస్తున్నాయి.

తెభా-1-340-క.
గ్రములు పోరాడెడి నా
గ్రముల వినఁ బడియె; భూత లకలములు దు
స్సములగుచు శిఖికీలా
ముల క్రియఁ దోచె; గగన సుధాంతరముల్.

టీక:- గ్రహములు = గ్రహములు; పోరాడెడిన్ = పోరాడుతున్నవి; ఆగ్రహముల = కోపములతో; వినఁబడియెన్ = వినబడుతున్నవి; భూత = జీవులు యొక్క; కలకలములు = కలకలారావములు; దుస్సహములు = సహించుటకు మిక్కిలి కష్టమగునవి; అగుచున్ = అవుతూ; శిఖి = అగ్ని; కీలా = కీలలు; ఆవహముల = ఆవహించిన; క్రియన్ = వలె; దోచెన్ = అనిపిస్తున్నవి; గగన = ఆకాశము; వసుధ = భూమి; అంతరముల్ = కలిసిన చోట్లు, దిఙ్మండల రేఖలు.
భావము:- గ్రహాలు ఆగ్రహంతో పోరాడుకొంటున్నాయి. ఎటు చూసినా భూతాల కలకలాలు వినబడుతున్నాయి. మన్నూ మిన్నూ ఏకమై భగ భగ మండిపోతున్నట్లు తోస్తున్నది.

తెభా-1-341-క.
దూలు గుడువవు చన్నులు;
దూలకున్ గోవు లీవు దుగ్ధము; లొడలం
బీలు మానవు; పశువులఁ
గూవు వృషభములు తఱపి కుఱ్ఱల నెక్కున్.

టీక:- దూడలున్ = దూడలు {దూడలు - ఆవుల పిల్లలు}; కుడువవు = పాలు తాగుట లేదు; చన్నులున్ = చన్నుల నుండి; దూడల = దూడల; కున్ = కి; గోవులు = ఆవులు; ఈవు = ఇయ్యవు; దుగ్ధములు = పాలు; ఒడలన్ = దేహములకు; పీడలు = బాధలు, వ్యాధులు; మానవు = మానుటలేదు; పశువులన్ = పశువులను; కూడవు = కలియవు; వృషభములు = ఎద్దులు; తఱపి = లేగ; కుఱ్ఱలన్ = దూడలను; ఎక్కున్ = ఎక్కును.
భావము:- దూడలు పాలు తాగటం లేదు. ఆవులు దూడలకు పాలీయటం లేదు. దేశమంతటా వ్యాధులు వ్యాపించాయి. ఎద్దులు ఆవులను వదలి దూడల మీద ఎక్కుతున్నాయి.

తెభా-1-342-క.
లెడు వేల్పుల రూపులు,
లెడుఁ గన్నీరు, వానిలనం జెమటల్
వొలెడిఁ, బ్రతిమలు వెలిఁ జని
మెలెడి నొక్కక్క గుడిని మేదిని యందున్.

టీక:- కదలెడున్ = కదలుచున్నవి; వేల్పుల = దేవతల; రూపులు = విగ్రహములు; వదలెడున్ = కార్చుతున్నవి; కన్నీరు = కన్నీరు; వాని = వాటి; వలనన్ = నుండి; చెమటల్ = స్వేదములు; ఒదలెడిన్ = చమరించుచున్నవి; ప్రతిమలు = విగ్రహములు; వెలిన్ = బయటకు; చని = వెళ్ళి; మెదలెడిన్ = సంచరించుచున్నవి; ఒక్కక్క = ఒక్కొక్క; గుడిని = గుడియందు; మేదిని = భూమి; అందున్ = మీద.
భావము:- దేవమందిరాలలో దేవతావిగ్రహాలు కదులుతున్నాయి. కన్నీరు వదులుతున్నాయి. గుడిలోని ప్రతిమలు ఉక్క తాళలేకనేమో వెలుపలకు వెళ్ళిపోతున్నాయి.

తెభా-1-343-క.
కాకంబులు వాపోయెడి;
ఘూకంబులు నగరఁ బగలు గుండ్రలు గొలిపెన్;
లోకంబులు విభ్రష్ట
శ్రీకంబుల గతి నశించి శిథలము లయ్యెన్.

టీక:- కాకంబులు = కాకులు; వాపోయెడిన్ = గుంపులు కట్టి అరుస్తున్నవి; ఘూకంబులు = గుడ్లగూబలు; నగరన్ = నగరములో; పగలు = పగటి పూట; గుండ్రలున్ = గుండ్రలును (గుడ్లగూబ కూత); కొలిపెన్ = చేసెను, కూసెను; లోకంబులు = లోకములు; విభ్రష్ట = భ్రష్టమైన, నష్టపోయిన; శ్రీకంబులు = కళలు కలిగినవాని; గతిన్ = వలె; నశించి = నాశనమగుచు; శిథలములు = పాడుబడినవి; అయ్యెన్ = అయిపోయినవి.
భావము:- కాకులు కేకలు వేస్తున్నాయి. గుడ్లగూడలు పట్టపగలే కూస్తున్నాయి. లోకాలు శోభను కోల్పోయి చీకాకుల పాలైనాయి.

తెభా-1-344-మ.
వ, పద్మాంకుశ, చాప, చక్ర, ఝష రేఖాలంకృతంబైన మా
వు పాదద్వయ మింక మెట్టెడు పవిత్రత్వంబు నేఁ డాదిగా
నీకాంతకు లేదు పో? మఱి మదీయాంగంబు వామాక్షి బా
హువు లాకంపము నొందుచుండు నిల కే యుగ్రస్థితుల్ వచ్చునో?

టీక:- యవ = యవలు వంటి (ధాన్యంగింజ వంటి); పద్మ = పద్మముల వంటి; అంకుశ = అంకుశము వంటి {అంకుశము - ఏనుగు కుంభ స్థలమును పొడచుటకు వాడు ఆయుధము}; చాప = ధనుస్సు వంటి; చక్ర = చక్రము వంటి; ఝష = చేప వంటి; రేఖా = రేఖలతో; అలంకృతంబు = అలంకరింపబడినది; ఐన = అయినట్టి; మాధవు = కృష్ణుని {మాధవుడు – మాధవి భర్త, హరి }; పాద = పాదముల; ద్వయము = జంట; ఇంకన్ = ఇంక; మెట్టెడు = త్రొక్కుట వలని; పవిత్రత్వంబున్ = పవిత్రత కలుగుటలు; నేఁడు = ఈ దినము; ఆదిగాన్ = మొదలు పెట్టి; అవనీకాంత = భూదేవి; కున్ = కి; లేదు పోమఱి = లేదేమో మరి; మదీయ = నా యొక్క; అంగంబున్ = అవయవములును; వామ = ఎడమ ప్రక్క; అక్షి = కన్నును; బాహువులు = బాహువును; ఆకంపము = అదురుట; ఒందుచుండున్ = కలుగుచున్నది; ఇల = భూమి; కున్ = కి; ఏ = ఏ; ఉగ్ర = భయంకరమైన; స్థితుల్ = పరిస్థితులు; వచ్చునో = వచ్చునో.
భావము:- నాయనా! భీమసేనా! యవగింజ, చక్ర, చాప, పద్మ, అంకుశాది శుభరేఖలతో అలంకృత మైన వాసుదేవుని పాదపద్మాల ముద్రలతో పావనమయ్యే అదృష్టం ఇకపైన ఈ భూదేవికి లేదేమో? నా అవయవాలు ఎడం కన్నూ, ఎడం భుజం మాటిమాటికీ అదురుతున్నాయి. ఈ లోకానికి ఇంకా ఎలాంటి భీకర పరిస్థితులు రానున్నాయో కదా.

తెభా-1-345-వ.
మఱియు మహోత్పాదంబులు పెక్కులు పుట్టుచున్నయవి; మురాంతకుని వృత్తాంతంబు వినరా"దని, కుంతీసుతాగ్రజుండు భీమునితో విచారించు సమయంబున.
టీక:- మఱియున్ = ఇంకనూ; మహ = భయంకరమైన; ఉత్పాదంబులు = ప్రకృతి వైపరీత్యములు; పెక్కులు = ఎన్నో; పుట్టుచు = కలుగుతూ; ఉన్నయవి = ఉన్నవి; మురాంతకుని = కృష్ణుని {మురాంతకుడు - ముర అను రాక్షసుని సంహరించిన వాడు, కృష్ణుడు}; వృత్తాంతంబున్ = సమాచారములు, వార్తలు; వినరాదు = వినబడుట లేదు; అని = అని; కుంతీసుతాగ్రజుండు = ధర్మరాజు { కుంతీసుతాగ్రజుడు - కుంతీ (కుంతి యొక్క) సుత (పుత్రులలో) అగ్రజుండు (పెద్దవాడు), ధర్మరాజు}; భీముని = భీమసేనునితో; తోన్ = కలిసి; విచారించు = బాధపడుతున్న; సమయంబున = సమయములో.
భావము:- ఇంకా ఎన్నో ఉత్పాతాలు పుట్టుకొస్తున్నాయి. అక్కడ ద్వారకలో మన బావ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో ఏమో? ఆయన క్షేమవృత్తాంతం ఇంతవరకూ తెలియరాలేదు” అని ధర్మరాజు విషణ్ణహృదయంతో భీమసేనునితో మాటాడుతున్నాడు. ఇంతలో....