Jump to content

పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/పురుక్సుతుని వృత్తాంతము

వికీసోర్స్ నుండి

పురుక్సుతుని వృత్తాంతము

తెభా-9-191-వ.
అంత మాంధాత పెద్దకొడుకగు నంబరీషునిం దత్పితామహుండగుటంజేసి యువనాశ్వుండు దనకుఁ బుత్రుండు గావలయునని కోరి పుచ్చుకొనియె; నయ్యంబరీషునకు యౌవనాశ్వుం, డతనికి హారితుండు జనియించి రది కారణంబుగా నంబరీష యౌవనాశ్వ హారితులు మాంధాతృ గోత్రంబునకు ప్రవరు లయిరి; మాంధాత రెండవ కొడుకు పురుకుత్సుఁ; డతని నురగలోకంబునకుఁ గొనిపోయి నాగకుమారులు దమ చెల్లెలు నర్మదయను కన్యకను వివాహంబు చేసిరి; పురుకుత్సుండు నక్కడ ననేక గంధర్వ నాథుల వధించి తన నాగ లోకసంచరణంబు దలంచువారికి నురగభయము లేకుండ వరంబు పడసి తిరిగి వచ్చె; నా పురుకుత్సునకుఁ ద్రసదస్యుండుఁ, ద్రసదస్యునకు ననరణ్యుండు, నా యనరణ్యునకు హర్యశ్వుండు, హర్యశ్వునకు నరుణుండును, యరుణునకుఁ ద్రిబంధనుండుఁ, ద్రిబంధనునకు సత్యవ్రతుండును జన్మించి రా సత్యవ్రతుండ త్రిశంకుం డనం బరగె; నతండు.
టీక:- అంతన్ = అప్పుడు; మాంధాత = మాంధాత; పెద్ద = పెద్దవాడైన (పుత్రులలో); కొడుకు = పుత్రుడు; అగు = ఐన; అంబరీషునిన్ = అంబరీషుని; తత్ = అతనికి; పితామహుండు = తాత; అగుటన్ = ఐ ఉండుట; చేన్ = వలన; యువనాశ్వుండు = యువనాశ్వుడు; తన = తన; కున్ = కు; పుత్రుండు = కొడుకుగా; కావలయున్ = కావలెను; అని = అని; కోరి = అడిగి; పుచ్చుకొనియెన్ = తీసుకొనెను; ఆ = ఆ; అంబరీషున్ = అంబరీషుని; కున్ = కి; యౌవనాశ్వుండు = యౌవనాశ్వుడు; అతని = అతని; కిన్ = కి; హారితుండు = హారితుడు; జనియించిరి = పుట్టిరి; అది = ఆ; కారణంబుగానన్ = కారణముచేత; అంబరీష = అంబరీషుడు; యౌవనాశ్వ = యౌవనాశ్వుడు; హారితులు = హారితుడు; మాంధాతృ = మాంధాతయొక్క; గోత్రంబున్ = గోత్రమున; కున్ = కు; ప్రవరులు = ముఖ్యపురుషులు; అయిరి = అయ్యారు; మాంధాత = మాధాత; రెండవ = రెండవ (2); కొడుకు = పుత్రుడు; పురుక్సుతుడు = పురుక్సుతుడు; అతనిన్ = అతనిని; ఉరగలోకంబున్ = నాగలోకమున; కున్ = కు; కొనిపోయి = తీసుకెళ్ళి; నాగకుమారులు = నాగులుయువకులు; తమ = తమయొక్క; చెల్లెలిన్ = సహోదరిని; నర్మద = నర్మద; అను = అనెడి; కన్యకనున్ = పడతిని; వివాహంబున్ = పెండ్లి; చేసిరి = చేసిరి; పురుక్సుతుండున్ = పురుక్సుతుడు; అక్కడ = అక్కడ; అనేక = చాలామందిని; గంధర్వ = గంధర్వ; నాథులన్ = ప్రభువులను; వధించి = సంహరించి; తన = తనయొక్క; నాగలోక = నాగలోకమున; సంచరణంబున్ = సంచరించుటలను; తలంచు = మననముచేసెడి; వారు = వారల; కున్ = కి; ఉరగ = సర్ప; భయమున్ = భయము; లేకుండగ = లేకుండునట్లు; వరంబున్ = వరమును; పడసి = పొంది; తిరిగి = వెనుకకు; వచ్చెన్ = వచ్చెను; ఆ = ఆ; పురుక్సుతున్ = పురుక్సుతుని; కున్ = కి; త్రసదస్యుండు = త్రసదస్యుడు; త్రసదస్యున్ = త్రసదస్యుని; కున్ = కి; అనరణ్యుండు = అనరణ్యుడు; ఆ = ఆ; అనరణ్యున్ = అనరణ్యుని; కున్ = కి; హర్యశ్వుండు = హర్యశ్వుడు; హర్యశ్వున్ = హర్యశ్వుని; కున్ = కి; అరుణుండును = అరుణుడు; అరుణున్ = అరుణుని; కున్ = కి; త్రిబంధనుండు = త్రిబంధనుడు; త్రిబంధనున్ = త్రిబమధనుని; కున్ = కి; సత్యవ్రతుండునున్ = సత్యవ్రతుడు; జన్మించిరి = పుట్టిరి; ఆ = ఆ; సత్యవ్రతుండ = సత్యవ్రతుడే; త్రిశంకుండు = త్రిశంకుడు; అనన్ = అని; పరగెన్ = ప్రసిద్ధుడయ్యెను; అతండు = అతడు.
భావము:- అప్పుడు మాంధాత పెద్దకొడుకు అంబరీషుని తాత యువనాశ్వుడు తన కొడుకుగా కోరి స్వీకరించాడు. అంబరీషునికి యౌవనాశ్వుడు. అతనికి హారితుడు పుట్టిరి. అందుచేతనే అంబరీష యౌవనాశ్వ హారితులు మాంధాత గోత్రానికి ముఖ్యపురుషులు అయ్యారు. మాంధాత రెండవ (2) పుత్రుడు పురుక్సుతుడు అతనిని నాగలోకమునకు తీసుకు వెళ్ళి నాగయువకులు తమ సోదరి నర్మదను ఇచ్చి పెండ్లి చేసారు. పురుక్సుతుడు అక్కడ చాలామంది గంధర్వులను సంహరించి, తన నాగలోకసంచారం మననం చేసేవారికి సర్ప భయం లేకుండేలా వరం పొందాడు. పిమ్మట వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ పురుక్సుతునికి త్రసదస్యుడు. త్రసదస్యునికి అనరణ్యుడు. ఆ అనరణ్యునికి హర్యశ్వుడు. హర్యశ్వునికి అరుణుడు. అరుణునికి త్రిబంధనుడు. త్రిబంధనునికి సత్యవ్రతుడు. పుట్టారు. ఆ సత్యవ్రతుడే త్రిశంకుడు అని ప్రసిద్ధుడయ్యేడు అతడు.