పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/శ్రీహరి ప్రధానకర్త
తెభా-2-223-సీ.
"భూపాలకోత్తమ భూతహితుండు సు-
జ్ఞానస్వరూపకుఁ డైనయట్టి
ప్రాణికి దేహసంబంధ మెట్లగు నన్న-
మహి నొప్పు నీశ్వరమాయ లేక
కలుగదు; నిద్రలోఁ గలలోనఁ దోఁచిన-
దేహబంధంబుల తెఱఁగువలెను
హరియోగ మాయా మహత్త్వంబునం బాంచ-
భౌతిక దేహసంబంధుఁ డగుచు
తెభా-2-223.1-తే.
నట్టి మాయాగుణంబుల నాత్మ యోలి
బాల్య కౌమార యౌవన భావములను
నర సుపర్వాది మూర్తులఁ బొరసి యేను
నాయదిది యను సంసారమాయఁ దగిలి.
టీక:- భూ = భూమి; పాలక = పాలించు వారిలో; ఉత్తమ = ఉత్తముడ; భూత = జీవుల; హితుండున్ = మేలు కోరేవాడును; సుజ్ఞాన = మంచి జ్ఞానమే; స్వరూపకుఁడు = తన రూపముగ కలవాడు; ఐన = అయిన; అట్టి = అట్టి; ప్రాణి = జీవి; కిన్ = కి; దేహ = శరీర; సంబంధము = సంబంధము; ఎట్లు = ఏ విధముగ; అగున్ = అగును; అన్నన్ = అంటే; మహిన్ = ప్రపంచమంతా; ఒప్పున్ = ఉండు; ఈశ్వర = ఈశ్వరుని; మాయన్ = మాయ; లేకన్ = లేకుండగ; కలుగదు = కలుగదు; నిద్ర = నిద్ర; లోనన్ = లో; కలన్ = కల; లోనన్ = లో; తోఁచినన్ = తోచిన; దేహ = దేహములతో; బంధంబులన్ = బంధంబుల; తెఱఁగున్ = విధానము; వలెను = వలెననె; హరి = విష్ణుని; యోగ = యోగ {యోగమాయ - యోగింపగల మాయ}; మాయా = మాయ యొక్క; మహత్త్వంబునన్ = ప్రభావము వలన; పాంచ = ఐదు {పాంచభౌతికము - శరీరము - దేహము - పంచ భూతములైన నీరు గాలి నిప్పు మన్ను ఆకాశము లనుండి తయారైనది.}; భౌతిక = భూతములదైన; దేహ = శరీరము; సంబంధుఁడు = సంబంధము కలవాడు; అగుచున్ = అగుచుండును; అట్టి = అట్టి;
మాయా = మాయ తోకూడిన; గుణంబులన్ = గుణముల వలన; ఆత్మ = తాను; యోలిన్ = వరుసగ; బాల్య = బాల్యము; కౌమార = కౌమారము; యౌవన = యౌవనము అను; భావములనున్ = భావములను; నర = మానవ; సుపర్వ = దేవత {సుపర్వులు - మంచి పుణ్యులు, దేవతలు}; ఆది = మొదలగు; మూర్తులఁన్ = ఆకారములను; బొరసిన్ = పొందును; ఏను = నేను; నాయది = నాది; ఇదిన్ = ఇది; అను = అనే; సంసార = సంసారము యొక్క; మాయఁన్ = మాయలో; తగిలి = తగుల్కొని, పడి.
భావము:- “ఓ రాజశ్రేష్ఠుడ! జీవుడు భూతాలకెల్ల మేలు చేకూర్చేవాడు, జ్ఞానమే స్వరూపంగా కలవాడు, అలాంటి వానికి శరీరంతో సంబంధం ఎలా కలిగింది అంటావా జగతీతల మంతా వ్యాపించివున్న ఈశ్వరుని మాయ అనేది లేకపోతే జీవునికి దేహంతో సంబంధం కలుగదు. నిద్రించే వేళ స్వప్నంలో దేహాలతో సంబంధం గోచరిస్తుదికదా, అలాగే నారాయణుని యోగమాయా ప్రభావంవల్ల జీవుడు పంచభూతాలతో కూడిన దేహంతో సంబంధం కలవాడవుతాడు. ఆ మాయాగుణాలవల్లనే క్రమంగా బాల్యం, కౌమారం, యౌవనం అనే దశలు పొందుతాడు. మనుష్య, దేవతాది ఆకారాలను గూడ స్వీకరిస్తాడు. నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని పెంచుకొంటాడు. సంసారమాయలో బద్దుడవుతాడు.
తెభా-2-224-వ.
వర్తించుచు నిట్లున్న జీవునికి భగవద్భక్తియోగంబున ముక్తి సంభవించుట యెట్లన్న నెప్పుడేని జీవుండు ప్రకృతి పురుషాతీతం బయిన బ్రహ్మస్వరూపంబు నందు మహితధ్యాన నిష్ఠుండగు నప్పుడు విగతమోహుండై యహంకార మమకారాత్మకం బయిన సంసరణంబు దొఱంగి ముక్తుండయి యుండు; మఱియు జీవేశ్వరులకు దేహ సంబంధంబులు గానంబడుచుండు; నట్టి దేహధారి యైన భగవంతు నందలి భక్తిం జేసి జీవునకు ముక్తి యెత్తెఱంగునం గలుగు నని యడిగితివి; జీవుం డవిద్యా మహిమం జేసి కర్మానుగతం బయిన మిథ్యారూపదేహ సంబంధుండు; భగవంతుండు నిజ యోగ మాయా మహిమంబునంజేసి స్వేచ్ఛాపరికల్పిత చిద్ఘన లీలావిగ్రహుండు; కావున భగవంతుండైన యీశ్వరుండు స్వభజనంబు ముక్తిసాధన జ్ఞానార్థంబు కల్పితం"బని చతుర్ముఖునకు దదీయ నిష్కపట తపశ్చర్యాది సేవితుండయి నిజజ్ఞానానందఘనం బయిన స్వరూపంబు సూపుచు నానతిచ్చె; నదిగావున జీవునికి భగవద్భక్తి మోక్షప్రదాయకంబగు; నిందులకు నొక్క యితిహాసంబు గల దెఱింగింతు నాకర్ణింపుము; దాన భవదీయ సంశయనివృత్తి యయ్యెడు"నని శుకయోగీంద్రుండు రాజేంద్రున కిట్లనియె.
టీక:- వర్తించుచున్ = తిరుగుచు; ఇట్లు = ఈ విధముగ; ఉన్న = ఉన్న; జీవునిన్ = జీవుని; భగవత్ = భగవంతుని; భక్తి = భక్తి; యోగంబునన్ = యోగమువలనన్; ముక్తి = ముక్తి; సంభవించుట = కలుగుట; ఎట్లు = ఏ విధముగ; అన్నన్ = అనగ; ఎప్పుడు = ఎప్పుడ; ఏనిన్ = అయినను; జీవుండు = జీవుడు; ప్రకృతి = ప్రకృతి; పురుష = పురుషులకు; అతీతంబు = అతీతము, దాటినది, పైది; అయిన = అయినట్టి; బ్రహ్మ = బ్రహ్మ; స్వరూపంబున్ = స్వరూపము; అందున్ = అందు; మహిత = గొప్ప; ధ్యాన = ధ్యానమున; నిష్ఠుండు = నిష్ఠ కలవాడ; అగున్ = అగునో; అప్పుడు = అప్పుడు; విగత = తొలగిన; మోహుండు = మోహము కలవాడు; ఐ = అయి; అహంకార = నేను అను భావము; మమకార = నాది అను భావము; ఆత్మకంబున్ = లక్షణంబులు; అయిన = కలిగిన; సంసరణంబున్ = సంసారమును; తొఱంగి = తొలగి; ముక్తుండు = ముక్తిని పొందిన వాడు; అయి = అయి; ఉండున్ = ఉండును; మఱియున్ = ఇంకా; జీవ = జీవులకు; ఈశ్వరులన్ = భగవంతుని; కున్ = కి; దేహ = దేహము వలన; సంబంధంబులున్ = సంబంధములు; కానంబడుచున్ = కనపడుచు; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; దేహధారి = దేహము ధరించిన వాడు; ఐన = అయిన; భగవంతున్ = భగవంతుని; అందలి = అందు కల; భక్తిన్ = భక్తి; చేసి = వలన; జీవున్ = జీవుని; కున్ = కి; ముక్తి = ముక్తి; ఏ = ఏ; తెఱంగునన్ = విధముగ; కలుగున్ = కలుగును; అని = అని; అడిగితివి = అడిగావు; జీవుండున్ = జీవుడు; అవిద్యా = అవిద్య యొక్క; మహిమన్ = ప్రభావము; చేసిన్ = వలన; కర్మ = కర్మములను; అనుగతంబున్ = అనుసరించునది; అయిన = అయినట్టి; మిథ్యా = మిథ్య {మిథ్య - అభాస - భ్రాంతి - లేనిది ఉన్నట్లు అనిపించుట}; రూప = రూపమున (అవతరించి); దేహ = దేహముతో; సంబంధుండు = సంబంధము ఉన్నవాడు; భగవంతుడు = భగవంతుడు; నిజ = తన; యోగమాయా = యోగమాయ యొక్క; మహిమంబునన్ = మహిమలు; చేసి = వలన; స్వేచ్ఛా = తన ఇష్టానుసారము; పరికల్పిత = కల్పింపబడిన; చిత్ = చిత్ (చైతన్యము) తో; ఘన = అతిశయించిన, నిండిన; లీలా = లీల అయిన; విగ్రహుండు = రూపము కలవాడు; కావునన్ = అందుచేత; భగవంతుండున్ = భగవంతుడు {భగవంతుడు - మహిమాన్వితుడు, వీర్యవంతుడు, శ్రీమంతుడు}; ఐన = అయిన; ఈశ్వరుండు = పరమ ప్రభువు; స్వ = తన యందలి; భజనంబున్ = భక్తి; ముక్తి = ముక్తి ని; సాధన = సాధించు; జ్ఞాన = జ్ఞానము; అర్థంబున్ = కొరకై; కల్పితంబున్ = కల్పింప బడినది; అని = అని; చతుర్ముఖున్ = చతుర్ముఖ బ్రహ్మ; కున్ = కు; తదీయ = అతని; నిష్కపట = కపట రహితమైన; తపస్ = తపస్సును; చర్య = ఆచరించుట; ఆది = మొదలగు వానిచే; సేవితుండు = సేవింప బడిన వాడు; అయి = అయి; నిజ = తన గురించిన; జ్ఞాన = జ్ఞానము వలని; ఆనంద = ఆనందము; ఘనంబున్ = అతిశయించినది; అయిన = అయిన; స్వ = తన యొక్క; రూపంబున్ = రూపమును; చూపుచున్ = చూపిస్తూ; ఆనతి = ఉపదేశము; ఇచ్చెన్ = చేసెను; అదిన్ = అందు; కావునన్ = చేత; జీవునిన్ = జీవుని; కిన్ = కి; భగవత్ = భగవంతుని యందలి; భక్తిన్ = భక్తి; మోక్ష = మోక్షమును; ప్రదాయకంబున్ = కలుగజేయునది; అగున్ = అగును; ఇందులన్ = దీని; కున్ = కోసము; ఒక్క = ఒక; ఇతిహాసంబున్ = ఇతిహాసము (భౌతికముగ జరిగినది); కలదు = ఉన్నది; ఎఱింగింతున్ = తెలుపుతాను; ఆకర్ణింపుము = వినుము; దానన్ = దాని వలన; భవదీయ = నీ యొక్క; సంశయ = అనుమానములు; నివృత్తి = పటాపంచలు; అయ్యెడున్ = అగును; అని = అని; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; రాజ = రాజులలో; ఇంద్రుడున్ = శ్రేష్ఠుని; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = అనియెను.
భావము:- ఈ విధంగా బద్ధుడై వర్తించే జీవుడికి భగవంతునిమీది భక్తితో ముక్తి ఎలా కలుగుతుంది అంటావా, అది చెబుతాను విను. ప్రకృతికి, పురుషుడికి అతీతమైన బ్రహ్మస్వరూపాన్ని ఎప్పుడు జీవుడు తీవ్రంగా ధ్యానిస్తాడో, అప్పుడు మోహంనుండి విడివడుతాడు. అహంకార మమకార మయమైన సంసారంనుండి విముక్తుడై ముక్తి పొందుతాడు. అంతేకాదు. జీవుడికి, ఈశ్వరుడికి, శరీరాలతో సంబంధాలు కనిపిస్తున్నాయి. భగవంతుడుకూడ శరీరం ధరించే ఉన్నాడు. అట్టి భగవంతుడి మీద భక్తి గలిగి ఉంటే జీవుడి కెలా ముక్తి సిద్ధిస్తుంది అని అడిగావు. అవిద్యకు లోనైనవాడు జీవుడు. అవిద్య ప్రభావంవల్ల అతడు కర్మ ననుసరించి సంప్రాప్తించిన శరీరాన్ని ధరిస్తాడు. ఆ దేహం మిథ్యారూప మైనది. భగవంతుడు యోగమాయతో గూడినవాడు. ఆయన తన యోగమాయాప్రభావం వల్ల తన ఇష్టానుసారం జ్ఞానమయమైన లీలాశరీరం కల్పించుకొంటాడు. అందువల్ల “మోక్షానికి సాధనమైన జ్ఞానానికై తన సేవ కల్పించబడిం” దని భగవంతుడైన ఈశ్వరుడు బ్రహ్మతో చెప్పాడు. బ్రహ్మ నిష్కపటంగా తపస్సుచేసి పరమేశ్వరుని ఆరాధించాడు. అప్పుడు తన జ్ఞానానందఘనమైన స్వరూపం బ్రహ్మకు చూపిస్తు ఈశ్వరుడు పై విధంగా తెలిపాడు. అందువల్ల జీవుడికి భగవద్భక్తి తప్పక మోక్ష మిస్తుంది. ఈ విషయం నిరూపించే ఇతిహాసం ఒకటి వుంది. అది వివరిస్తాను, విను. దానివల్ల నీకు కల్గిన సందేహం తొలగిపోతుంది” అని చెప్పి యోగిశ్రేష్ఠుడైన శుకుడు రాజశ్రేష్ఠుడైన పరీక్షిత్తుతో పరీక్షిత్తుతో ఇలా అన్నాడు.
తెభా-2-225-సీ.
"హరిపాదభక్తి రహస్యోపదేష్టయు-
నఖిల దేవతలకు నధివిభుండు
నైన విధాత గల్పాదియందును నిజా-
శ్రయ పద్మమున కధిష్ఠాన మరయ
నర్థించి జలముల నన్వేషణము సేసి-
నలినంబు మొదలు గానంగలేక
విసివి క్రమ్మఱను దద్బిసరుహాసీనుఁడై-
సృష్టినిర్మాణేచ్ఛఁ జిత్తమందుఁ
తెభా-2-225.1-తే.
జాల నూహించి తత్పరిజ్ఞానమహిమ
సరణి మనమునఁ దోపఁక జడనుపడుచు
లోకజాలంబుఁ బుట్టింపలేక మోహి
తాత్ముఁడై చింత నొందు నయ్యవసరమున.
టీక:- హరి = విష్ణుని {హరి - భవబంధనములు హరించు వాడు, భగవంతుడు}; పాద = పాదముల అందలి; భక్తి = భక్తి యొక్క; రహస్య = రహస్యములను, ధృఢత్వమును; ఉపదేష్టయున్ = ఉపదేశించిన వాడును; అఖిల = సమస్తమైన; దేవతలన్ = దేవతల; కున్ = కు; అధి = పై; విభుండునున్ = ప్రభువును; ఐనన్ = అయిన; విధాత = బ్రహ్మదేవుడు {విధాత - సమస్త సృష్టికి విధిని నిర్ణయించు వాడు, బ్రహ్మదేవుడు}; కల్ప = కల్పము; ఆదినిన్ = ప్రారంభము; అందున్ = లో; నిజ = తన యొక్క; ఆశ్రయ = నివాసమైన; పద్మమునన్ = పద్మమునకు; అధిష్ఠానమున్ = అధారభూతమును; అరయన్ = తెలిసికొన; అర్థించి = కోరి; జలములన్ = నీటిలో; అన్వేషణమున్ = వెతకుట; చేసి = చేసి; నలినంబున్ = పద్మమునకు; మొదలు = మొదలు, ఆధారమును; కానంగన్ = చూడ; లేక = లేక; విసివి = విసిగిపోయి; క్రమ్మఱన్ = మళ్ళీ; తత్ = ఆ; బిసరుహ = పద్మమున; ఆసీనుఁడు = కూర్చున్న వాడు; ఐ = అయ్యి; సృష్టిన్ = సృష్టిని; నిర్మాణ = నిర్మింపవలె నను; ఇచ్చఁన్ = కోరిక; చిత్తము = మనస్సు; అందున్ = లో; చాలన్ = మిక్కిలి; ఊహించి = ప్రయత్నించి;
తత్ = ఆ; పరిజ్ఞానము = నేర్పు; మహిమ = ప్రభావకర; సరణి = విధానము; మనమునన్ = మనసులో; తోపఁకన్ = తట్టక; జడను = జడత్వమున; పడుచున్ = పొందుతు; లోక = లోకముల; జాలంబున్ = సమూహములను; పుట్టింపన్ = పుట్టించ; లేకన్ = లేక; మోహిత = మోహములో పడిన; ఆత్ముడు = వాడు; ఐ = అయ్యి; చింతన్ = దుఃఖమును; ఒందు = పొందుతున్న; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమున.
భావము:- “దేవాదిదేవుని పాదాలమీద భక్తి గల్గివుండడంలోని పరమ రహస్యాన్ని ఉపదేశించినవాడు, దేవతల కందరికి అధినేత అయిన విధాత కల్పారంభంలో తనకు నెలవైన పద్మానికి మూల మేమిటో పరిశీలించాలనుకొన్నాడు. నీళ్లలో వెదకడం ప్రారంభించాడు. ఎంత వెదకినా ఆ పద్మానికి మొద లెక్కడ వుందో తెలుసుకోలేకపోయాడు. చివరికి విసిగి వేసారి మరలివచ్చి ఆ పద్మంలోనే ఆసీను డయ్యడు. జగత్తును సృష్టించాలనే సంకల్పం ఆయన హృదయంలో ఉదయించింది. ఎంతో ఆలోచించాడు. కాని సృష్టికి సంబంధించిన పరిజ్ఞానం ఆయన మనస్సుకు అందక క్రిందుమీదయ్యాడు. అలసత్వం ఆవహించింది. లోకాలను సృష్టించలేక పోయాడు. అతని చిత్తం మోహాయత్త మయింది. చింతాక్రాంతు డయాడు.
తెభా-2-226-వ.
జలమధ్యంబుననుండి యక్షర సమామ్నాయంబున స్పర్శంబు లందు షోడశాక్షరంబును మఱియు నేకవింశాక్షరంబును నైన యియ్యక్షర ద్వయంబు వలన నగుచు మహామునిజనధనం బయిన "తప"యను శబ్దం బినుమాఱుచ్చరింపంబడి వినంబడిన నట్టి శబ్దంబు వలికిన యప్పురుషుని వీక్షింప గోరి నలుదిక్కులకుం జని వెదకి యెందునుం గానక మరలివచ్చి నిజస్థానంబైన పద్మంబునం దాసీనుండై యొక్కింత చింతించి; యట్టి శబ్దంబు దన్నుఁ దపంబు సేయుమని నియమించుటగాఁ దలంచి ప్రాణాయామ పరాయణుండై జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబుల జయించి యేకాగ్రచిత్తుండై, సకలలోక సంతాపహేతువగు తపంబు వేయి దివ్యవత్సరంబులు గావింప, నీశ్వరుండు ప్రసన్నుండై పొడసూపిన నక్కమలసంభవుండు తత్క్షణంబ రాజసతామసమిశ్రసత్త్వ గుణాతీతంబును, శుద్ధ సత్త్వగుణావాసంబును, నకాలవిక్రమంబును, సర్వలోకోన్నతంబును, సకల సురగణ స్తుత్యంబును, లోభ మోహభయ విరహితంబును, నపునరావృత్తి మార్గంబును, ననంత తేజోవిరాజితంబు నైన వైకుంఠపురంబుం బొడగని; యందు.
టీక:- జల = నీటి; మధ్యంబునన్ = మధ్యలో; నుండి = నుండి; అక్షర = అక్షరముల; సమ = మొత్తము; ఆమ్నాయంబునన్ = అక్షరమాలలో; స్పర్శంబులు = హల్లులు; అందున్ = లో; షోడశ = పదహారవ (16) (త); అక్షరంబునున్ = అక్షరము; మఱియున్ = మరియు; ఏకవింశ = ఇరవై ఒకటవ (21) (ప); అక్షరంబునున్ = అక్షరము; ఐన = అయిన; ఈ = ఈ; అక్షర = అక్షర; ద్వయంబున్ = ద్వయము; వలనన్ = వలన; అగుచున్ = అగుచు; మహా = గొప్ప; ముని = మునుల; జన = సమూహములకు; ధనంబున్ = సంపద; అయిన = అయిన; తప = తప; అను = అను; శబ్దంబున్ = శబ్దము; ఇను = రెండు; మాఱు = మార్లు; ఉచ్చరింపంబడి = పలుకబడి; వినంబడిన = వినబడిన; అట్టి = అటువంటి; శబ్దంబున్ = శబ్దమును; పలికిన = పలికిన; ఆ = ఆ; పురుషునిన్ = మహాత్ముని; వీక్షింపన్ = చూడవలెనను; కోరి = కోరికతో; నలు = నాలుగు; దిక్కులన్ = దిక్కుల; కున్ = కు; చని = వెళ్ళి; వెదకి = వెతికి; ఎందునున్ = ఎక్కడను; కానకన్ = కనబడక పోవుటచే; మరలి = వెనుకకు; వచ్చి = వచ్చి; నిజ = తన యొక్క; స్థానంబున్ = నివాసస్థానము; ఐన = అయిన; పద్మంబునన్ = పద్మములో; ఆసీనుండు = కూర్చున్న వాడు; ఐ = అయి; ఒక్కింత = కొంచము; చింతించి = బాధపడి; అట్టి = అటువంటి; శబ్దంబున్ = శబ్దము; తన్నుఁన్ = తనను; తపంబున్ = తపస్సు; చేయుము = చేయుము; అని = అని; నియమించుటగాన్ = ఆజ్ఞాపించుటగా; తలంచి = అనుకొని; ప్రాణాయామ = ప్రాణాయామము నందు; పరాయణుండు = నిష్ఠలో ఉన్నవాడు; ఐ = అయి; జ్ఞానేంద్రియ = జ్ఞానేంద్రియములను; కర్మేంద్రియములన్ = కర్మేంద్రియములను; జయించి = జయించి; ఏకాగ్ర = ఏకాగ్ర మైన {ఏకాగ్ర - ఒకే తావున నిలిపిన}; చిత్తుండు = మనసు కలవాడు; ఐ = అయి; సకల = సమస్త; లోక = లోకములు; సంతాప = తపించుటకు; హేతువు = కారణము; అగున్ = అగు; తపంబున్ = తపస్సును; వేయి = వెయ్యి (1000); దివ్య = దేవతల; వత్సరంబులున్ = సంవత్సరములు; కావింపన్ = చేయగా; ఈశ్వరుండున్ = విష్ణువు {ఈశ్వరుడు - ప్రభుత్వము కలవాడు}; ప్రసన్నుండు = ప్రసన్నుడు; ఐ = అయి; పొడసూపినన్ = ప్రత్యక్షము కాగా; ఆ = ఆ; కమలసంభవుండు = బ్రహ్మదేవుడు {కమలసంభవుడు - పద్మము నందు పుట్టిన వాడు, బ్రహ్మ}; తత్క్షణంబ = వెంటనే; రాజస = రజోగుణ; తామస = తమోగుణములతో; మిశ్ర = కలసిన; సత్వ = సత్త్వ; గుణ = గుణములకు; అతీతంబున్ = అతీతమైన; శుద్ధ = పరిశుద్దమైన; సత్త్వ = సత్త్వ; గుణ = గుణములకు; ఆవాసంబున్ = నివాసస్థానమును; అకాల = కాలాతీతమైన; విక్రమంబునున్ = ప్రభావము కలదియు; సర్వ = సమస్త; లోక = లోకముల కంటె; ఉన్నతంబునున్ = ఉన్నతమైనదియును; సకల = సమస్త; సుర = దేవతలచే; గుణ = తన గుణములను; స్తుత్యంబునున్ = స్తోత్రము చేయబడు నదియును; లోభ = లోభము; మోహ = మోహము; భయ = భయములును; విరహితంబునున్ = లేనిది యును; అపునరావృత్తి = తిరిగిరాని; మార్గంబునున్ = దారి కలదియును; అనంత = అనంతమైన; తేజస్ = తేజస్సుతో; విరాజితంబునున్ = ప్రకాశించు నదియును; ఐన = అయినట్టి; వైకుంఠ = వైకుంఠ; పురంబున్ = పురమును; పొడగని = చూసి; అందు = అందులో.
భావము:- ఆ సమయంలో నీటిలో నుండి ఒక శబ్దం వినిపించింది. క మొదలు మ వరకూ ఉండే స్పర్శాక్షరాలలో పదువారవదీ ఇరవై యొకటవదీ అయిన “తప” అనే రెండు అక్షరాలవల్ల ఆ శబ్దం ఏర్పడింది. “తప” అనే ఆ పదం మహర్షులకు అమూల్యమైన ధనం. ఆ మాట రెండుసార్లు “తప తప” అని ఉచ్చిరింపబడింది. బ్రహ్మ దాన్ని విన్నాడు. ఆ శబ్దాన్ని ఉచ్చరించిన పురుషుణ్ణి చూడాలనుకొన్నాడు. నాలుగు దిక్కులకు వెళ్లి వెతికాడు. ఎక్కడా ఆ పురుషుడు గోచరించలేదు. తిరిగివచ్చి తన నివాసమైన పద్మంలోనే కూర్చున్నాడు. కొంత సేపు ఆలోచించాడు. తన్ను తపస్సు చేయమని హేచ్చరించటానికే ఆ శబ్దం వినపించింది అనుకొన్నాడు. ప్రాణాయామం ప్రారంభించాడు. జ్ఞానేంద్రియాలనూ, కర్మేంద్రియాలనూ స్వాధీనం చేసుకొన్నాడు. మనస్సును ఏకాగ్రం చేసుకొని వెయ్యి దివ్య సంవత్సరాలు అలా తపస్సు చేసాడు. ఆ దారుణ తపస్సుకు లోకాలన్ని తపించిపోయాయి. అప్పుడు శ్రీహరి ప్రసన్నుడై బ్రహ్మకు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే బ్రహ్మ వైకుంఠపురాన్ని దర్శించాడు. ఆ పురం రాజసగుణానికి, తామసగుణానికి ఆ గుణాలతో మిశ్రమైన సత్త్వగుణానికి అతీత మయినది. కేవల సత్త్వగుణానికి నివాస మయింది. కాలానికి అక్కడ ప్రాబల్యం లేదు. ఆది అన్ని లోకాలకంటే అత్యున్నత మైనది. సమస్త దేవతలకు ప్రస్తుతింప దగినది. అక్కడ లోభం, మోహం, భయం అనేవి లేవు. అక్కడికి పోయినవారు మళ్లీ తిరిగి రావడమంటూ జరగదు. తుది లేని తేజస్సుతో అది ప్రకాశిస్తు ఉన్నది. అలాంటి వైకుంఠపురాన్ని సరోజ సంభవుడు సందర్శించాడు.