పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/సూర్యోదయ వర్ణన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-10.1-1306-సీ.
పౌలోమి తన బాలు పాన్పుపైఁ గనుపట్టఁ-
న్నిన పవడంపు బంతి యనఁగ
నాయురర్థముల వ్యయంబు లొత్తులి చాటు-
కాలశాంఖికు చేతి ఘంట యనఁగ
నజంతుజీవితకాలరాసుల విధి-
గొల్వనెత్తిన హేమకుంభ మనఁగఁ
శ్చిమదిక్కాంత రఁగఁ గైసేయుచో-
ముందట నిడుకొన్న ముకుర మనఁగఁ

తెభా-10.1-1306.1-తే.
గోకతాపోపశమదివ్యఘుటిక యనఁగఁ
ద్మినీకాంత నోములల మనంగ
మూడుమూర్తుల సారంపు ముద్ద యనఁగ
మిహిరమండల ముదయాద్రిమీఁద నొప్పె.

టీక:- పౌలోమి = శచీదేవి {పౌలోమి - పులోముని కుమార్తె, శచీదేవి}; తన = ఆమె యొక్క; బాలు = పిల్లవాని; పాన్పు = పక్క, మంచము; పైన్ = మీద; కనుపట్టన్ = కనబడునట్లుగా; పన్నిన = ఏర్పరచిన; పవడంపు = పగడపు; బంతి = చెండు; అనగన్ = అన్నట్లుగ; ఆయుస్ = ఆయుష్షు అనెడి; అర్థముల = సంపదల; వ్యయంబులు = తరుగుదలలను, క్షయములను; ఒత్తిలి = నొక్కి; చాటు = చెప్పెడి; కాలశాంఖికు = సమయసూచకుని {కాలశాంఖికుడు - సమయము తెలుపుటకై చాటింపు వేయువాడు, సమయసూచకుడు}; చేతి = చేతిలోని; ఘంట = గంట; అనగన్ = అన్నట్లుగ; ఘన = అనేకమైన; జంతు = జంతువుల యొక్క; జీవితకాల = ఆయుష్షుల; రాసుల = సమూహములను; విధి = బ్రహ్మదేవుడు; కొల్వ = కొలచుటకు; ఎత్తిన = ఏర్చచిన; హేమ = బంగారపు; కుంభము = కుండ; అనగన్ = అన్నట్లుగ; పశ్చిమ = పడమటి; దిక్కు = దిక్కు అనెడి; కాంత = స్త్రీ; పరగన్ = చక్కగా; కైసేయుచోన్ = అలంకరించుకొనుచు; ముందటన్ = ఎదురుగా; ఇడుకొన్న = ఉంచుకొన్న; ముకురము = అద్దము; అనగన్ = అన్నట్లుగ;
కోక = చక్రవాకముల; తాప = తాపమును; ఉపశమ = తగ్గించెడి. దివ్య = మహత్తరమైన; ఘుటిక = మాత్ర, గుళిక; అనగన్ = అన్నట్లుగ; పద్మినీ = తామరతీగ అనెడి; కాంత = స్త్రీల యొక్క; నోముల = నోములు నోచుటవలన; ఫలము = కలిగిన ఫలితము; అనంగన్ = అన్నట్లుగా; మూడుమూర్తుల = త్రిమూర్తుల {త్రిమూర్తులు - 1బ్రహ్మ 2విష్ణు 3మహేశ్వరుడు}; సారంపు = సత్తచే చేయబడిన; ముద్ద = ముద్ద; అనగన్ = అన్నట్లుగ; మిహిర = సూర్య; మండలము = గోళము, బింబము; ఉదయ = తూర్పు; అద్రి = కొండ; మీదన్ = పైన; ఒప్పెన్ = చక్కగనుండెను.
భావము:- సూర్యబింబం తూర్పుకొండ మీద ఉదయించింది. అది శచీదేవి తన పిల్లవాడికి కనబడేలా పానుపు మీద చిలుకల పందిరికి అమర్చిన పగడాల బంతా అన్నట్లుంది; ఆయుస్సు అనే ధనం వ్యయమై పోతున్నది అని గట్టిగా చాటుతున్న కాలమనే వార్తాహరుని చేతిలోని గంటా అన్నట్లుంది; బ్రహ్మదేవుడు ప్రాణుల జీవితకాలమనే ధాన్యరాసులను కొలవడానికి ఎత్తిన బంగరు కుంచమా అన్నట్లుంది; పడమటిదిక్కు అనే అంగన అలంకరించుకునే టప్పుడు ముందుంచుకున్న అద్దమా అన్నట్లుంది; చక్రవాక పక్షుల పరితాపం మాన్చే దివ్యమైన మందుగుళికా అన్నట్లుంది; పద్మిని అనే నాయిక వ్రతఫలమా అన్నట్లుంది; ముమ్మూర్తుల వెలుగు ముద్దా అన్నట్లుంది.

తెభా-10.1-1307-క.
చ్చెం జల్లని గాడ్పులు
విచ్చెం గమలములు; దమము విరిసి బిలంబుల్
చొచ్చెం; బద్మమరందము
మెచ్చెం దుమ్మెదలు గ్రోలి మిహిరుఁడు పొడమన్.

టీక:- వచ్చెన్ = వచ్చినవి; చల్లని = చల్లటి; గాడ్పులు = గాలులు; విచ్చెన్ = వికసించినవి; కమలములు = తామరలు; తమము = చీకట్లు; విరిసి = విడిపోయి; బిలంబుల్ = గుహలలో; చొచ్చెన్ = దూరినవి; పద్మ = తామరల; మరందమున్ = మకరందమును; మెచ్చెన్ = బాగుందనగా, సంతోషించెను; తుమ్మెదలు = తుమ్మెదలు; క్రోలి = తాగి; మిహిరుడు = సూర్యుడు; పొడమన్ = ఉదయించగా.
భావము:- సూర్యోదయ సమయంలో చల్లటి గాలులు వీచాయి. పద్మాలు పూచాయి; చీకట్లు పటాపంచలై గుహలలో దూరాయి; తుమ్మెదలు తామరపూల మకరందం త్రాగి ఆనందించాయి.

తెభా-10.1-1308-క.
సంకాశితోదయాచల
పంజసఖ కిరణరాగ రిపూర్ణంబై
పంకేరుహగర్భాండము
కుంకుమ సలిలంపుఁ గ్రోవి కొమరున నొప్పెన్.

టీక:- సంకాశిత = చక్కగా ప్రకాశించెడి; ఉదయా = తూర్పు; అచల = కొండ యందలి; పంకజసఖ = సూర్యుని {పంకజ సఖుడు - పంకజ (పద్మముల) సఖుడు (స్నేహితుడు), సూర్యుడు}; కిరణ = కిరణముల యొక్క; రాగ = ఎరుపు చేత; పరిపూర్ణంబు = బాగా నిండినది; ఐ = అయ్యి; పంకేరుహగర్భాండము = బ్రహ్మాండము {పంకేరుహగర్భాండము - పంకేరుహగర్భ (పద్మమునందు పుట్టినవాని, బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కుంకుమ = కుంకుమ కలిపిన; సలిలంబు = నీళ్ళ; క్రోవి = బుడ్డి; కొమరునన్ = వలె; ఒప్పెన్ = అందముగా ఉండెను.
భావము:- తూరుపు కొండ మీద ఉదయించిన సూర్యుడి కిరణాల ఎరుపు రంగుతో నిండినదై బ్రహ్మాండము కుంకుమ నీటితో కూడిన బుడ్డి వలె అందగించింది.

తెభా-10.1-1309-వ.
తదనంతరంబ.
టీక:- తదనంతరంబ = ఆ తరువాత.
భావము:- అటుపిమ్మట. . .