పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/సుదాముని మాలలు గైకొనుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-10.1-1267-వ.
అంత నా రామకృష్ణులు సుదాముం డను మాలాకారు గృహంబునకుం జనిన; నతండు గని లేచి గ్రక్కున మ్రొక్కి చక్కన నర్ఘ్య పాద్యాదికంబు లాచరించి; సానుచరు లయిన వారలకుఁ దాంబూల కుసుమ గంధంబు లొసంగి యిట్లనియె.
టీక:- అంతన్ = తరువాత; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడులు; సుదాముండు = సుదాముడు {సుదాముడు - సు (మంచి) దామములు (దండలు) వాడు, మాలాకారుడు}; అను = అనెడి; మాలాకారు = పువ్వులు కట్టువాని; గృహంబున్ = నివాసమున; కున్ = కు; చనిన = వెళ్ళగా; అతండు = అతను; కని = చూసి; లేచి = లేచి నిలబడి; గ్రక్కున = చటుక్కున; మ్రొక్కి = నమస్కరించి; చక్కనన్ = వెంటనే; అర్ఘ్య = అర్ఘ్యమిచ్చుట {అర్ఘ్యము - పూజకొఱకైనది, అష్టార్ఘ్యములు (1పెరుగు 2తేనె 3నెయ్యి 4అక్షతలు 5గఱిక 6నువ్వులు 7దర్భ 8పుష్పము)}; పాద్య = పాద్య మిచ్చుట {పాద్యము - పాదముల కొఱకైనది, జలాదులు}; ఆది = మున్నగునవి; ఆచరించి = చేసి; సానుచరులు = అనుచరులతో కూడినవారు; అయిన = ఐన; వారలు = వారి; కున్ = కి; తాంబూల = తాంబూలము; కుసుమ = పూలు; గంధంబులు = మంచిగంధములు; ఒసంగి = ఇచ్చి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఆ తరువాత, రామకృష్ణులు పూలదండలు కట్టే సుదాముడి ఇంటికి వెళ్ళారు. అతడు వారిని చూసి వెంటనే లేచి నమస్కరించాడు. చక్కగా ఆర్ఘ్యము, పాద్యము, మొదలైన విధులతో సత్కరించాడు. రామకృష్ణులకూ, వారి వెంట వచ్చినవారికీ తాంబూలములు, పూలు, గంధములు ఇచ్చి ఇలా అన్నాడు,

తెభా-10.1-1268-ఉ.
"పాన మయ్యె నా కులము; పండెఁ దపంబు; గృహంబు లక్ష్మికిన్
సేవిత మయ్యె; నిష్ఠములు సేకుఱె; విశ్వనిదానమూర్తులై
భూలయంబుఁ గావ నిటు పుట్టిన మీరలు రాకఁ జేసి నే
నే విధ మాచరింతుఁ? బను లెయ్యెవి? బంట; నెఱుంగఁ జెప్పరే."

టీక:- పావనము = పరిశుద్ధమైనది; అయ్యెన్ = అయినది; నా = నా యొక్క; కులము = వంశము; పండెన్ = ఫలించినది; తపంబున్ = తపస్సు; గృహంబున్ = నివాసము కూడ; లక్ష్మి = లక్ష్మీదేవి; కిన్ = కి; సేవితము = ఆశ్రయించదగినది; అయ్యెన్ = అయినది; ఇష్టములు = కోరికలు; చేకుఱెన్ = సిద్ధించెను; విశ్వ = జగత్తునకు; నిదాన = మూలకారణమైన; మూర్తులు = వారలు; ఐ = అయ్యి; భూవలయంబున్ = భూమండలమును; కావన్ = కాపాడుటకు; ఇటు = ఈ విధముగ; పుట్టిన = అవతరించిన; మీరలున్ = మీరు; రాకన్ = వచ్చుట; చేసి = వలన; నేన్ = నేను; ఏ = ఎట్టి; విధము = ప్రకారము; ఆచరింతున్ = చేయవలెను; పనులు = నెరవేర్చవలసినపనులు; ఎయ్యవి = ఏవి; బంటన్ = బంటును, సేవకుడను; ఎఱుంగన్ = తెలియునట్లు; చెప్పరే = చెప్పండి.
భావము:- “జగత్తుకు ఆదికారణమూర్తులైన మీరు భూలోకాన్ని సంరక్షించడం కోసం ఇలా అవతరించారు. అటువంటి మీరాక వలన మా వంశం పవిత్రమయింది. నా తపస్సు ఫలించింది. నా ఇల్లు సిరిసంపదలతో నిండింది. నా కోరికలు ఈడేరాయి. నేను ఏ విధంగా నడచుకోవాలి? ఏం పనులు చెయ్యాలి? నేను మీ బంటును. సెలవియ్యండి.”

తెభా-10.1-1269-వ.
అని పలికి.
టీక:- అని = అని; పలికి = చెప్పి.
భావము:- ఇలా అని ఆ మాలాకారుడు. . .

తెభా-10.1-1270-క.
దామోదర రాముల కు
ద్దా యశోహసిత తుహినధాములకు వధూ
కాములకుఁ దెచ్చి యిచ్చె సు
దాముఁడు ఘనసురభి కుసుమదామము లధిపా!

టీక:- దామోదర = కృష్ణుడు; రాముల్ = బలరాముల; కున్ = కు; ఉద్దామ = అధికమైన; యశః = కీర్తిచేత; హసిత = ఎగతాళి చేయబడిన; తుహినధాముల్ = చంద్రులు కలవారికి; కున్ = కి; వధూ = స్త్రీలకు; కాముల్ = మన్మథులవంటి వారల; కున్ = కి; తెచ్చి = తీసుకుక వచ్చి; ఇచ్చెన్ = ఇచ్చెను; సుదాముడు = సుదాముడు; ఘన = గొప్ప; సురభి = పరిమళము కల, సంపెంగ; కుసుమ = పూల; దామము = దండలను; అధిపా = రాజా.
భావము:- చంద్రుడిని సైతం అపహసించగల అతిశయించిన కీర్తి గలవారూ, మగువల పాలిటి మన్మథాకారులూ అయిన ఆ రామకృష్ణులకు సుదాముడు గొప్ప పరిమళములు గల పూలమాలలు సమర్పించాడు.

తెభా-10.1-1271-క.
వారును మాలికుఁ డిచ్చిన
భూరి కుసుమ దామములను భూషితులై నీ
కోరిన వరమిచ్చెద మని
కారుణ్యము సేయ నతఁడు ని యిట్లనియెన్.

టీక:- వారునున్ = వారు కూడ; మాలికుడు = మాలాకారుడు; ఇచ్చిన = ఇచ్చినట్టి; భూరి = బాగా పెద్ద; కుసుమ = పూల; దామములను = దండలచే; భూషితులు = అలంకరింపబడినవారు; ఐ = అయ్యి; నీ = నీవు; కోరిన = కోరుకున్న; వరమున్ = వరమును; ఇచ్చెదము = ఇస్తాము; అని = అని; కారుణ్యము = దయ; చేయన్ = చూపగా; అతడు = అతను; కని = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- సుదాముడు ఇచ్చిన ఆ పెద్ద పెద్ద దండలను రామకృష్ణులు అలంకరించుకుని “నీవు కోరిన వరమిస్తాము. ఏమి వరం కావాలో కోరుకో” అని దయతో అనుగ్రహించారు. అతడు అది గ్రహించి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.

తెభా-10.1-1272-క.
"నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయునుఁ
దాసమందార! నాకు యచేయఁ గదే!"

టీక:- నీ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; కమల = పద్మముల యందు; సేవయున్ = భక్తి; నీ = నీ యొక్క; పాద = పాదముల; అర్చకుల = భక్తుల; తోడి = తోటి; నెయ్యమును = స్నేహము; నితాంత = విస్తారమైన; అపార = అంతులేని; భూత = జీవుల యెడ; దయయును = దయ కలిగి యుండుట; తాపసమందార = కృష్ణ {తాపస మందారుడు - తపస్సు చేయువారికి కల్పవృక్షము వంటివాడు, విష్ణువు}; నా = నా; కున్ = కు; దయచేయగదే = అనుగ్రహింపుము.
భావము:- తాపసులకు కల్పవృక్షం వంటివాడా! శ్రీకృష్ణా! కమలముల వంటి నీ పాదాల పరిచర్యను, నీ పాదాలు పూజించే భక్తులతో చెలిమినీ, సర్వ ప్రాణులమీద అపరిమితమైన దయనూ నాకు ప్రసాదించు.

తెభా-10.1-1273-వ.
అని వేఁడికొనిన నిచ్చి మఱియు మాధవుం డమ్మాలికునకు బలాయుః కాంతి కీర్తి సంపద లొసంగి వాని గృహంబు వెడలి రాజవీధిం జనిచని.
టీక:- అని = అని; వేడికొనినన్ = అర్థించగా; ఇచ్చి = ప్రసాదించి; మఱియున్ = ఇంకను; మాధవుండు = కృష్ణుడు; ఆ = ఆ యొక్క; మాలికున్ = మాలాకారుని; కున్ = కి; బలా = బలము, శారీరకశక్తి; ఆయుః = ఆయుస్సు, జీవితకాలం; కాంతి = తేజస్సు; కీర్తి = యశస్సు; సంపదలు = ధనాదులు; ఒసంగి = కూర్చి; వాని = అతని; గృహంబున్ = నివాసమును; వెడలి = బయటకు వచ్చి; రాజవీధిన్ = ముఖ్య రహదారి; చనిచని = చాలా దూరము వెళ్ళి;
భావము:- సుదాముడికి అలా వేడుకున్నవన్నీ శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు. ఆ పైన బలము, ఆయుష్షు, తేజస్సు, యశస్సు, సిరిసంపదలు కరుణించి వాడి ఇంటి నుండి బలరాముడుతో కలిసి బయలుదేరి రాజవీధమ్మట వెళ్తూ వెళ్తూ. . .