Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/రుక్మి యనువాని భంగంబు

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1763-వ.
అని యిట్లు జరాసంధుండు నతని యొద్ది రాజులును శిశుపాలుని పరితాపంబు నివారించి, తమతమ భూములకుం జనిరి; శిశుపాలుండు ననుచర సేనాసమేతుండయి తన నగరంబునకుం జనియె నంత రుక్మి యనువాఁడు కృష్ణుండు రాక్షసవివాహంబునం దన చెలియలిం గొనిపోవుటకు సహింపక, యేకాక్షౌహిణీబలంబుతోడ సమరసన్నాహంబునం గృష్ణుని వెనుదగిలి పోవుచుఁ దన సారథితో యిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; జరాసంధుండున్ = జరాసంధుడు; అతని = అతని; ఒద్ది = దగ్గరున్న; రాజులును = రాజులు; శిశుపాలుని = శిశుపాలుడు యొక్క; పరితాపంబున్ = విచారమును; నివారించి = పోగొట్టి; తమతమ = వారివారి; భూముల్ = రాజ్యముల; కున్ = కు; చనిరి = వెళ్ళిపోయిరి; శిశుపాలుండున్ = శిశుపాలుండు కూడ; అనుచర = అనుసరించుతున్న; సేనా = సైన్యముతో; సమేతుండు = కూడినవాడు; అయి = ఐ; తన = తన యొక్క; నగరంబున్ = పట్టణమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; అంత = అటుపిమ్మట; రుక్మి = రుక్మి; అనువాడు = అనెడివాడు; కృష్ణుండు = కృష్ణుడు; రాక్షసవివాహంబున = రాక్షస పెండ్లి పద్దతిలో; తన = అతని; చెలియలిన్ = చెల్లెలును; కొనిపోవుట = తీసుకుపోవుట; కున్ = కు; సహింపకన్ = ఓర్చుకొలేక; ఏక = ఒక; అక్షౌహీణీ = అక్షౌహిణుల; బలంబు = సేనల; తోడన్ = తోటి; సమర = యుద్ధ; సన్నాహంబునన్ = ప్రయత్నముతో; కృష్ణుని = కృష్ణుని; వెనుదగిలి = వెంబడించి; పోవుచున్ = వెళ్తూ; తన = తన యొక్క; సారథి = రథసారథి; తోన్ = తోటి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా చెప్పి శిశుపాలుడి మనోవేదన పోగొట్టి జరాసంధుడు అక్కడి రాజులు తమతమ దేశాలకి వెళ్ళిపోయారు. శిశుపాలుడు తన సేనతో తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇంతలో రుక్మిణీదేవి అన్న రుక్మి అనువాడు, కృష్ణుడు తన చెల్లెలిని తీసుకుపోవడం సహించక, యుద్ధానికి సిద్ధమై ఒక అక్షౌహిణి సేనతో చక్రి వెంటబడి సారథితో ఇలా అన్నాడు.

తెభా-10.1-1764-ఉ.
"ల్లిదు, నన్ను భీష్మజనపాల కుమారకుఁ జిన్నచేసి నా
చెల్లెలి రుక్మిణిం గొనుచుఁ జిక్కని నిక్కపు బంటుబోలె నీ
గొల్లఁడు పోయెడిన్; రథము గూడఁగఁ దోలుము; తేజితోల్లస
ద్భల్ల పరంపరన్ మదముఁ బాపెదఁ జూపెద నా ప్రతాపమున్."

టీక:- బల్లిదున్ = బలవంతుడను; నన్నున్ = నన్ను; భీష్మ = భీష్మక; జనపాల = రాజు యొక్క; కుమారకున్ = పుత్రుని; చిన్నచేసి = చిన్నబుచ్చి; నా = నా యొక్క; చెల్లెలిన్ = సోదరిని; రుక్మిణిన్ = రుక్మిణిని; కొనుచున్ = తీసుకుపోవుచు; చిక్కని = పటుత్వముగల; నిక్కపు = నిజమైన; బంటు = శూరుని; బోలెన్ = వలె; ఈ = ఈ యొక్క; గొల్లడు = యాదవుడు; పోయెడిన్ = వెళ్ళిపోతున్నాడు; రథమున్ = తేరును; కూడగన్ = చేరునట్లు; తోలుము = వేగముగ నడుపుము; తేజిత = వాడిగా చేయబడిన; ఉల్లసత్ = ప్రకాశించుచున్న; భల్ల = బాణముల; పరంపరన్ = వరుసలచే; మదమున్ = గర్వమును; పాపెదన్ = పోగొట్టెదను; చూపెదన్ = చూపించెదను; నా = నా యొక్క; ప్రతాపమున్ = పరాక్రమమును.
భావము:- “బలవంతుడను. భీష్మకమహారాజు కొడుకుని. రుక్మిని, నన్ను చిన్నబుచ్చి ఈ గొల్లవాడు కృష్ణుడు తానేదో మహా శూరుడిని అనుకుంటు నా చెల్లెలు రుక్మిణిని పట్టుకు పోతున్నాడు. సారథి! వాని వెంటనంటి రథం తోలు. నా ప్రతాపం చూపిస్తా. పదునైన బాణాలతో వాని మదం తీస్తా.”

తెభా-10.1-1765-వ.
అని యిట్లు రుక్మి హరి కొలంది యెఱుంగక సారథి నదలించి రథంబుఁ గూడం దోలించి "గోపాలక! వెన్నమ్రుచ్చ! నిమిషమాత్రంబు నిలు నిలు” మని ధిక్కరించి, బలువింట నారి యెక్కించి మూడు వాఁడి తూపుల హరి నొప్పించి యిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; రుక్మి = రుక్మి; హరి = కృష్ణుని; కొలంది = సామర్థ్యము; ఎఱుంగక = తెలియకపోవుటచేత; సారథిన్ = సారథిని; అదలించి = హెచ్చరించి; రథంబున్ = రథమును; కూడన్ = చేరునట్లు; తోలించి = వేగముగా నడిపింపజేసి; గోపాలక = గొల్లవాడా; వెన్నమ్రుచ్చ = వెన్నదొంగ; నిమిషమాత్రంబు = ఒక నిమిషముపాటు; నిలునిలుము = ఆగిపొమ్ము; అని = అని; ధిక్కరించి = తిరస్కారముగా మాట్లాడి; బలు = బలమైన; వింటన్ = విల్లునందు; నారిన్ = అల్లెతాడును; ఎక్కించి = ఎక్కుపెట్టి; మూడు = మూడు (3); వాడి = వాడి యైన; తూపులన్ = బాణములచేత; హరిన్ = కృష్ణుని; నొప్పించి = కొట్టి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పలికి. రుక్మి మాధవుని మహిమ తెలియక రథం మీద వెనుదగిలి పోయి “ఓ గొల్లవాడా! వెన్న దొంగ! ఒక్క నిమిషం ఆగు” అని అదలించాడు. పెద్ద వింటిని సంధించి మూడు వాడి తూపులతో చక్రిని కొట్టాడు.

తెభా-10.1-1766-సీ.
"మా సరివాఁడవా మా పాపఁ గొనిపోవ?-
నేపాటి గలవాడ? వేది వంశ?
మెందు జన్మించితి? వెక్కడఁ బెరిగితి?-
వెయ్యది నడవడి? యెవ్వఁ డెఱుఁగు?
మానహీనుఁడ వీవు; ర్యాదయును లేదు-
మాయఁ గైకొని కాని లయ రావు;
నిజరూపమున శత్రునివహంబుపైఁ బోవు-
సుధీశుఁడవు గావు వావి లేదు;

తెభా-10.1-1766.1-ఆ.
కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు
విడువు; విడువవేని విలయకాల
శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల
ర్వ మెల్లఁ గొందుఁ లహమందు."

టీక:- మా = మాతో; సరివాడవా = సమానుడవా; మా = మా యొక్క; పాపన్ = బాలికను; కొనిపోవన్ = తీసుకుపోవుటకు; ఏపాటి = ఏమాత్రము; కలవాడవు = అర్హతలు కలవాడవు; ఏది = ఏది; వంశము = నీ వంశము; ఎందున్ = ఎక్కడ; జన్మించితివి = పుట్టితివి; ఎక్కడ = ఎక్కడ; పెరిగితివి = పెద్దవాడవైతివి; ఎయ్యది = ఎలాంటి; నడవడిన్ = నడవడికలవాడవు; ఎవ్వడు = ఎవరు; ఎఱుగున్ = తెలియును; మాన = శీలము; హీనుడవు = లేనివాడవు; ఈవు = నీవు; మర్యాదయును = గౌరవముకూడ; లేదు = లేనివాడవు; మాయన్ = మాయమార్గములు; కైకొని = చేపట్టి; కాని = తప్పించి; మలయన్ = సంచరింప; రావు = చాలవు; నిజ = స్వ; రూపమునన్ = స్వరూపముతో; శత్రు = శత్రువుల; నివహంబు = సమూహము; పైన్ = మీదికి; పోవు = యుద్ధమునకు వెళ్ళవు; వసుధీశుడవు = రాజువు; కావు = కావు; వావి = బంధుత్వము, పద్ధతి; లేదు = లేదు.
కొమ్మన్ = ఇంతిని; ఇమ్ము = ఇచ్చివేయుము; నీవు = నీవు; గుణ = సుగుణములు; రహితుండవు = లేనివాడవు; విడువు = వదలిపెట్టుము; విడువవేని = వదలిపెట్టనిచో; విలయకాల = ప్రళయకాలపు; శిఖి = అగ్ని; శిఖా = మంటలకు; సమాన = సమానమైన; శిత = తీక్ష్ణమైన; శిలీముఖములన్ = బాణములచేత {శిలీముఖము - ఉక్కుముఖములు కల బాణము}; గర్వమున్ = మదము; ఎల్లన్ = సర్వమును; కొందు = అపహరింతును; కలహము = యుద్ధము; అందున్ = లో.
భావము:- నువ్వు మాతో సమానుడవా ఏమిటి (భగవంతుడు కదా మాకన్న అధికుడవు). ఎంత మాత్రం వాడివి (మేరకందని వాడవు). వంశ మేదైనా ఉందా (స్వయంభువుడవు). ఎక్కడ పుట్టావు (పుట్టు కన్నది లేని శాశ్వతుడవు). ఎక్కడ పెరిగావు (వికారరహితుడవు కనుక వృద్ధిక్షయాలు లేనివాడవు). ప్రవర్తన ఎలాంటిదో ఎవరికి తెలుసు (అంతుపట్టని నడవడిక కలవాడవు). అభిమానం లేదు (సాటివారు లేరుకనుక మానాభిమానాలు లేని వాడవు). హద్దు పద్దు లేదు (కొలతలకు అందని హద్దులు లేని వాడవు). మాయ చేయకుండ మెలగవు (మాయ స్వీకరించి అవతారాలు ఎత్తుతావు). స్వస్వరూపాన్ని పగవారికి చూపవు (నిర్గుణ నిరాకారుడవు). క్షత్రియుడవు కావు (జాతి మతాలకు అతీతుడవు). వావివరసలు లేవు (అద్వితీయుడవు ఏకోనారాయణుడవు). అసలు నీకు గుణాలే లేవు (త్రిగుణాతీతుడవు). అలాంటి నీకు ఆడపిల్ల ఎందుకు. మా పిల్లని మాకు ఇచ్చెయ్యి. విడిచిపెట్టు. విడువకపోతే యుద్ధంలో ప్రళయకాల అగ్ని కీలల వంటి వాడి బాణాలతో నీ పీచమణుస్తా.”

తెభా-10.1-1767-వ.
అని పలికిన నగధరుండు నగి, యొక్క బాణంబున వాని కోదండంబు ఖండించి, యాఱు శరంబుల శరీరంబు దూఱనేసి, యెనిమిది విశిఖంబుల రథ్యంబులం గూల్చి, రెండమ్ముల సారథింజంపి, మూడువాఁడి తూపులం గేతనంబుఁ ద్రుంచి మఱియు నొక్క విల్లందినం ద్రుంచి, వెండియు నొక్క ధనువు పట్టిన విదళించి క్రమంబునఁ బరిఘ పట్టిస శూల చర్మాసి శక్తి తోమరంబులు ధరియించినం దునుకలు సేసి క్రమ్మఱ నాయుధంబు లెన్ని యెత్తిన నన్నియు శకలంబులు గావించె; నంతటం దనివిజనక వాఁడు రథంబు డిగ్గి ఖడ్గహస్తుండై దవానలంబుపైఁ బడు మిడుత చందంబునం గదిసిన ఖడ్గ కవచంబులు చూర్ణంబులు చేసి, సహింపక మెఱుంగులు చెదర నడిదంబు పెఱికి జళిపించి వాని శిరంబు తెగవ్రేయుదు నని గమకించి, నడచుచున్న నడ్డంబు వచ్చి రుక్మిణీదేవి హరిచరణారవిందంబులు పట్టుకొని యిట్లనియె.
టీక:- అని = అని; పలికినన్ = పలుకగా; నగధరుండు = కృష్ణుడు {నగధరుడు - (గోవర్థన)నగమును ధరించినవాడు, కృష్ణుడు}; నగి = నవ్వి; ఒక్క = ఒక; బాణంబునన్ = బాణముతో; వాని = అతని; కోదండంబున్ = ధనుస్సును; ఖండించి = ముక్కలుచేసి; ఆఱు = ఆరు (6); శరంబులన్ = బాణములతో; శరీరంబున్ = దేహమునందు; దూరన్ = దూరునట్లుగా; ఏసి = వేసి; ఎనిమిది = ఎనిమిది (8); విశిఖంబులన్ = బాణములచేత {విశిఖము - ముల్లులేని బాణము}; రథ్యంబులన్ = రథగుఱ్ఱములను; కూల్చి = పడగొట్టి; రెండు = రెండు (2); అమ్ములన్ = బాణములచేత; సారథిన్ = రథసారథిని; చంపి = చంపి; మూడు = మూడు (3); వాడి = వాడి యైన; తూపులన్ = బాణములచేత; కేతనంబు = జండా; త్రుంచి = తెంచివేసి; మఱియున్ = ఇంక; ఒక్క = ఒక; విల్లున్ = ధనుస్సును; అందినన్ = అందుకొనగా; త్రుంచి = తునకలుచేసి; వెండియున్ = మరల; ఒక్క = ఒక; ధనువున్ = వింటిని; పట్టినన్ = పూనగా; విదళించి = చీల్చేసి; క్రమంబునన్ = వరుసగా; పరిఘ = ఇనపకట్లగుదియ; పట్టిస = అడ్డకత్తి; శూల = శూలము; చర్మ = డాలు; అసి = ఖడ్గము; శక్తి = శక్తి; తోమరంబులు = చర్నాకోలలు; ధరియించినన్ = చేపట్టగా; తునుకలు = ముక్కలు; చేసి = చేసి; క్రమ్మఱన్ = మరల; ఆయుధంబులున్ = ఆయుధములను; ఎన్ని = ఎన్ని; ఎత్తినన్ = చేపట్టినను; అన్నియును = అన్నిటిని; శకలంబులు = ముక్కలుగా; కావించెన్ = చేసెను; అంతట = అటుపిమ్మట; తనివి = తృప్తి; చనక = తీరక; వాడు = అతడు; రథంబున్ = రథమును; డిగ్గి = దిగి; ఖడ్గ = కత్తిని; హస్తుండు = చేతపట్టుకొన్నవాడు; ఐ = అయ్యి; దవానలంబు = కార్చిచ్చు; పైన్ = మీద; పడు = పడెడి; మిడుత = మిడుత; చందంబునన్ = వలె; కదిసినన్ = దగ్గరకురాగా; ఖడ్గ = కత్తిని; కవచంబులున్ = కవచములను; చూర్ణంబులు = పొడిపొడిగా; చేసి = చేసి; సహింపక = ఓరిమిపట్టలేక; మెఱుంగులు = కాంతులు, నిప్పురవ్వలు; చెదరన్ = వ్యాపించగా; అడిదంబు = కత్తిని; పెఱికి = ఒరనుండిబైటికితీసి; జళిపించి = చలింపజేసి; వాని = అతని; శిరంబున్ = తలను; తెగవ్రేయుదును = నరికెదను; అని = అని; గమకించి = సిద్ధపడి; నడచుచున్న = వెళ్ళుతుండగా; అడ్డంబు = అడ్డముగా; వచ్చి = వచ్చి; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి; హరి = కృష్ణుని; చరణ = పాదములు అనెడి; అరవిందంబులున్ = పద్మములను; పట్టుకొని = పట్టుకొని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా రుక్మిప్రగల్భాలు పలుకుతుంటే, గోవర్దనగిరిధారి కృష్ణుడు నవ్వి, ఒక బాణంతో వాని విల్లు విరిచాడు. ఆరు బాణాలు శరీరంలో దిగేసాడు. ఎనిమిది బాణాలతో రథాశ్వాలని కూల్చేసాడు. రెండింటితో సారథిని చంపాడు. మూడు బాణాలతో జండాకఱ్ఱ విరిచాడు. ఇంకొక విల్లు తీసుకొంటే దానిని విరిచాడు. అలా వరసగా పట్టిన ఇంకో ధనుస్సు, పరిఘ, అడ్డకత్తి, శూలం, కత్తి, డాలు, శక్తి, తోమరం అన్నిటిని ముక్కలు చేసాడు. రుక్మి అంతటితో పారిపోక కార్చిచ్చు పై వచ్చి పడే మిడతలా, రథం దిగి కత్తి పట్టి రాగా కత్తి, కవచం పిండిపిండి చేసేసాడు. ఒరలోని కత్తి దూసి నిప్పురవ్వలు రాల్తుండగా జళిపించి వాని తల నరకబోగా, రుక్మిణి పరమపురుషుని పాదాలు పట్టుకొని ఇలా వేడుకొంది.

తెభా-10.1-1768-మత్త.
"నిన్నునీశ్వరు దేవదేవుని నిర్ణయింపఁగ లేక యో
న్నుతామలకీర్తిశోభిత! ర్వలోకశరణ్య! మా
న్న యీతఁడు నేడు చేసె మహాపరాధము నీ యెడన్
న్ను మన్నన చేసి కావు మనాథనాథ! దయానిథీ!

టీక:- నిన్నున్ = నిన్ను; ఈశ్వరున్ = సర్వనియామకుని; దేవదేవుని = బ్రహ్మాది దేవతలకు దేవుని; నిర్ణయింపగన్ = నిర్ధారించుకొనగ; లేక = లేక; ఓ = ఓయి; సన్నుత = కొనియాడబడిన; అమల = నిర్మలమైన; కీర్తి = యశస్సుచేత; శోభిత = శోభిల్లువాడ; సర్వ = సమస్తమైన; లోక = భువనములకు; శరణ్య = రక్షణనిచ్చువాడ; మా = మా యొక్క; అన్న = సోదరుడు; ఈతడు = ఇతను; నేడు = ఇవాళ; చేసెన్ = చేసెను; మహా = పెద్ద; అపరాధమున్ = తప్పును; నీ = నీ; యెడన్ = అందు; నన్నున్ = నన్ను; మన్నన = మన్నించుట; చేసి = చేసి; కావుము = కాపాడుము; అనాథ = దిక్కులేనివారికి; నాథ = దిక్కయినవాడ; దయానిథీ = దయకు ఉనికి పట్టైనవాడ.
భావము:- "ఓ సత్పురుషులచే కీర్తింపబడేవాడ! సకల లోకాలని కాపాడేవాడా! దిక్కులేని వారికి దిక్కైనవాడ! దయామయా! శ్రీకృష్ణ! వీడు రుక్మి మా అన్న. నిన్ను ఈశ్వరునిగా దేవదేవునిగా గుర్తించలేక చాలా పెద్ద తప్పు చేసాడు. నన్ను మన్నించి వీనిని క్షమించు"అంటు రుక్మిణీదేవి ఇంకా ఇలా విన్నవించసాగింది.

తెభా-10.1-1769-మత్త.
ల్ల లేదని విన్నవించుట గాదు వల్లభ! యీతనిన్
బ్రల్లదుం దెగఁజూచితేనియు భాగ్యవంతుల మైతి మే
ల్లుఁ డయ్యె ముకుందుఁ డీశ్వరుఁ డంచు మోదితు లైన మా
ల్లిదండ్రులు పుత్ర శోకముఁ దాల్చి చిక్కుదు రీశ్వరా!"

టీక:- కల్ల = తప్పు; లేదు = చేయలేదు; అని = అని; విన్నవించుట = చెప్పుట; కాదు = లేదు; వల్లభ = ప్రియమైనవాడ; ఈతనిన్ = అతనిని; ప్రల్లదున్ = దుష్టుని; తెగజూచితేనియున్ = చంపబోయితివేని; భాగ్యవంతులము = అదృష్టవంతులము; ఐతిమి = అయ్యాము; మేము = మేము; అల్లుండు = అల్లుడు {అల్లుడు - కూతురు భర్త}; అయ్యెన్ = అయ్యెను; ముకుందుడు = మోక్షము నిచ్చువాడు; ఈశ్వరుడు = ఐశ్వర్యవంతుడు, కృష్ణుడు; అంచున్ = అని; మోదితుల = సంతోషించినవారు; ఐన = అయిన; మా = మా యొక్క; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; పుత్ర = కొడుకు మరణించిన; శోకమున్ = దుఃఖమును; తాల్చి = పొంది; చిక్కుదురు = కృశింతురు; ఈశ్వరా = స్వామీ.
భావము:- ప్రభూ! మా అన్న రుక్మి యందు దోషం లేదని మనవిచేయటం లేదు. నిజమే యితను చేసినది నేరమే. కాని మోక్షమునిచ్చేవాడు జగన్నాయకుడు హరి మాకు అల్లుడు అయ్యా డని, మేము అదృష్టవంతుల మైనామని సంతోషిస్తున్న మా తల్లిదండ్రులు, ఇతగాడు దుష్టుడు కదా అని సంహరించే వంటే, పుత్రశోకంతో పొగిలిపోతారు నాథా!"

తెభా-10.1-1770-మ.
ని డగ్గుత్తికతో మహాభయముతో నాకంపితాంగంబుతో
విత శ్రాంత ముఖంబుతో శ్రుతిచలద్వేణీ కలాపంబుతోఁ
నుదోయిన్ జడిగొన్న బాష్పములతోఁ న్యాలలామంబు మ్రొ
క్కి రుక్మిం దెగ వ్రేయఁబోక మగిడెన్ గృష్ణుండు రోచిష్ణుఁడై.

టీక:- అని = అని; డగ్గుతిక = బొంగురుగొంతుక; తోన్ = తోటి; మహా = మిక్కిలి; భయము = భయము; తోన్ = తోటి; ఆకంపిత = మిక్కిలి వణుకుతున్న; అంగంబు = శరీరము; తోన్ = తోటి; వినత = వంచిన; శ్రాంత = బడలిన; ముఖంబు = ముఖము; తోన్ = తోటి; శ్రుతిన్ = చెవిమీద; చలత్ = చలించుతున్న; వేణీ = జడ, జడపాయ అను; కలాపంబు = అలంకారము; తోన్ = తోటి; కను = కళ్ళ; దోయిన్ = జంటనుండి; జడిగొన్న = ధారగాకారుతున్న; బాష్పముల్ = కన్నీటి; తోన్ = తోటి; మ్రొక్కినిన్ = నమస్కరించగా; రుక్మిన్ = రుక్మిని; తెగవ్రేయబోక = నరకబోవక; మగిడెన్ = మానెను; కృష్ణుండు = కృష్ణుడు; రోచిష్ణుడు = ప్రకాశము కలవాడు; ఐ = అయ్యి.
భావము:- ఇలా రుక్మిణి గద్గదస్వరంతో మిక్కిలి భయ కంపితురాలై వేడుకొంది. అప్పుడు ఆమె దేహం వణుకుతోంది. వంచిన వదనం వడలింది. చెవుల మీదకి శిరోజాలు వాలాయి. కన్నీటి జడికి గుండెలు తడిసాయి. అప్పుడు కృష్ణుడు రుక్మిని చంపక వెనుదిరిగేడు.

తెభా-10.1-1771-వ.
ఇట్లు చంపక "బావా! ర"మ్మని చిఱునగవు నగుచు వానిం, బట్టి బంధించి, గడ్డంబును మీసంబునుం దలయును నొక కత్తివాతి యమ్మున రేవులువాఱఁ గొఱిగి విరూపిం జేసె; నంతట యదువీరులు పరసైన్యంబులం బాఱఁదోలి, తత్సమీపంబునకు వచ్చి; రప్పుడు హతప్రాణుండై కట్టుబడి యున్న రుక్మిం జూచి కరుణజేసి, కామపాలుండు వాని బంధంబులు విడిచి హరి డగ్గఱి యిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; చంపక = సంహరింపకుండ; బావా = బావా; రమ్ము = ఇటు రావలసినది; అని = అని పిలిచి; చిఱునగవు = చిరునవ్వు; నగుచున్ = నవ్వుతు; వానిన్ = అతనిని; పట్టి = పట్టుకొని; బంధించి = కట్టివేసి; గడ్డంబును = గడ్డము; మీసంబును = మీసము; తలయున్ = తలమీదిజుట్టు; ఒక = ఒక; కత్తివాతియమ్మునన్ = అర్ధచంద్రబాణముతో (ఆంధ్రవాచస్పతము) { కత్తివాతియమ్ము = కత్తివంటి; వాతి (పదునుగల) అమ్ము (బాణము), అర్ధచంద్రబాణముతో }; రేవులు = చారలు; పాఱన్ = ఏర్పడునట్లు; గొఱిగి = గీసి; విరూపిన్ = వికారరూపునిగా; చేసెన్ = చేసెను; అంతట = అటుపిమ్మట; యదు = యాదవ; వీరులు = యోధులు; పర = శత్రువుల; సైన్యంబులన్ = సేనలను; పాఱదోలి = తరిమి వేసి; తత్ = వారి; సమీపంబున = దగ్గర; కున్ = కు; వచ్చిరి = వచ్చిరి; అప్పుడు = అప్పుడు; హతప్రాయుండు = సగము చచ్చినవాడు; ఐ = అయ్యి; కట్టుబడి = బంధింపబడి; ఉన్న = ఉన్నట్టి; రుక్మిన్ = రుక్మిని; చూచి = చూసి; కరుణజేసి = దయచూపి; కామపాలుండు = బలరాముడు; వాని = అతని; బంధంబులున్ = కట్టు; విడిచి = విప్పదీసి; హరిన్ = కృష్ణుని; డగ్గఱి = చేరి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా చంపడం మాని, శ్రీకృష్ణుడు వానిని “బావా! రా” అని పిలుస్తూ చిరునవ్వులు నవ్వుతు పట్టి బంధించాడు. ఓ అర్థచంద్రాకారబాణంతో అతని గడ్డం మీసాలు తలకట్టు చారలు చారలుగా గీసి వికృతరూపిని చేసాడు. అంతలో యాదవ సైన్యాలు శత్రువులను తరిమి వేసి అక్కడకి వచ్చాయి. అప్పుడు బలరాముడు బంధించబడి దీనావస్థలో ఉన్న రుక్మిని చూసి జాలిపడి విడిపించాడు. మాధవునితో ఇలా అన్నాడు.

తెభా-10.1-1772-క.
"త మనక భీష్మనందనుఁ
యును మూతియును గొఱుగఁ గవే? బంధుం
యును మూతియు గొఱుగుట
తఱుఁగుటకంటెఁ దుచ్ఛరము మహాత్మా!

టీక:- తలము = తప్పుకొనుము; అనక = అనకుండ; భీష్మ = భీష్మకుని; నందనున్ = కొడుకు యొక్క; తలయును = శిరోజములు; మూతియున్ = మూతిమీది మీసములు; గొఱుగన్ = తీసివేయుట; తగవే = ధర్మమా, కాదు; బంధున్ = బంధువు యొక్క; తలయును = శిరోజములు; మూతియున్ = మూతిమీదిమీసములు; గొఱుగుట = తీసివేయుట; తలన్ = శిరస్సును; తఱుగుట = నరుకుట; కంటెన్ = కంటెను; తుచ్ఛతరము = మిక్కిలినీచము {తుచ్ఛము - తుచ్ఛతరము - తుచ్ఛతమము}; మహాత్మా = గొప్పవాడా.
భావము:- "కృష్ణా! మహాత్మా! రుక్మిని తప్పుకోమనకుండ ఇలా తల మూతి గుండు చేయటం తగిన పని కాదు కదా. బావమరిదికి ఇలా గుండు గీసి అవమానించుట చంపుటకంటె తుచ్ఛమైన పని."అని బలరాముడు చెప్పసాగాడు

తెభా-10.1-1773-క.
కొంఱు రిపు లని కీడును;
గొంఱు హితు లనుచు మేలుఁ గూర్పవు; నిజ మీ
వంఱి యందును సముఁడవు;
పొందఁగ నేలయ్య విషమబుద్ధి? ననంతా!"

టీక:- కొందఱున్ = కొంతమంది; రిపులు = శత్రువులు; అని = అని; కీడును = చెడును; కొందఱున్ = కొంతమంది; హితులు = ఇష్ఠులు; అనుచున్ = అని; మేలున్ = మంచిని; కూర్పవు = కలిగింపవు; నిజము = సత్యము ఇది; ఈవు = నీవు; అందఱి = అందరి; అందును = ఎడల; సముడవు = సమభావము కలవాడవు; పొందగన్ = పొందుట; ఏలన్ = ఎందుకు; అయ్య = తండ్రీ; విషమ = భేద; బుద్ధిన్ = బుద్ధిని; అనంతా = కృష్ణా {అనంతుడు - దేశ కాల వస్తువులచేత మేరలేని వాడు, విష్ణువు}.
భావము:- శాశ్వతుడవైన దేవా! నిజానికి నీవు సర్వ సముడవు. ఎవరిని శత్రువులుగా చూసి కీడు చేయవు. ఎవరిని కావలసినవారుగా చూసి మేలు చేయవు. అలాంటి నీకు ఎందుకయ్య ఇలాంటి భేదబుద్ధి."- రుక్మి శిరోజములు తొలగించిన కృష్ణునితో బలరాముడు ఇలా అన్నాడు.

తెభా-10.1-1774-వ.
అని వితర్కించి పలికి రుక్మిణీదేవి నుపలక్షించి యిట్లనియె.
టీక:- అని = అని; వితర్కించి = ఆక్షేపించి; పలికి = చెప్పి; రుక్మిణీదేవిన్ = రుక్మిణిని; ఉపలక్షించి = ఉద్దేశించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా కృష్ణుని విమర్శించిన బలరాముడు, రుక్మిణితో ఇలా అన్నాడు

తెభా-10.1-1775-శా.
"తోడంబుట్టినవాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణు నె
గ్గాడం జూడకు మమ్మ! పూర్వభవ కర్మాధీనమై ప్రాణులం
గీడున్ మేలునుఁ జెందు; లేఁ డొకఁడు శిక్షింపంగ రక్షింప నీ
తోడంబుట్టువు కర్మశేష పరిభూతుం డయ్యె నే డీ యెడన్."

టీక:- తోడంబుట్టినవానిన్ = సోదరుని; భంగమున్ = అవమానమున; కున్ = కు; దుఃఖించి = విచారించి; మా = మా యొక్క; కృష్ణున్ = కృష్ణుని; ఎగ్గాడన్ = నిందింప; చూడకుము = భావింపకుము; అమ్మ = తల్లీ; పూర్వ = మునుపటి; భవ = జన్మములందు జేసిన; కర్మ = కర్మములకు; అధీనము = అనుసరించునది; ఐ = అయ్యి; ప్రాణులన్ = జీవులకు; కీడున్ = ఆపద; మేలున్ = మంచి; చెందున్ = కలుగును; లేడు = లేడు; ఒకడు = వేరొకడు; శిక్షింపంగన్ = శిక్షించుటకు; రక్షింపన్ = కాపాడుటకు; నీ = నీ యొక్క; తోడంబుట్టువు = అన్న; కర్మ = పూర్వజన్మకర్మఫలముల; శేష = మిగిలినదానిచేత; పరిభూతుండు = అవమానింపబడినవాడు; అయ్యెన్ = అయ్యెను; నేడు = ఇవాళ; ఈ = ఈ యొక్క; ఎడన్ = చోటునందు.
భావము:- “అన్నకు జరిగిన అవమానానికి దుఃఖించకు. మా కృష్ణుడిని నిందించబోకు తల్లీ! పూర్వజన్మలలోని కర్మానుసారం జీవులకు మంచిచెడులు సంభవిస్తాయి. శిక్షించడానికి కాని రక్షించడానికి కాని కర్త ఎవరు లేరు. నీ అన్న అనుభవించ వలసిన శేష కర్మఫలం వలన ఇప్పుడు ఈ పరాభవం పొందాడు.

తెభా-10.1-1776-క.
"చంపెడి దోషము గలిగినఁ
జంపఁ జనదు బంధుజనులఁ ను విడువంగాఁ
జంపిన దోషము సిద్ధము
చంపఁగ మఱి యేల మున్న చ్చిన వానిన్.

టీక:- చంపెడి = చంపదగిన; దోషము = తప్పు; కలిగినన్ = జరిగినను; చంపన్ = చంపివేయుట; చనదు = ధర్మముకాదు; బంధు = బంధువులైన; జనులన్ = వారిని; చనున్ = తగినపని; విడువంగాన్ = విడిచిపెట్టుట; చంపినన్ = చంపివేసినచో; దోషము = పాపము; సిద్ధము = తప్పకుండా కలుగును; చంపగన్ = చంపుట; మఱి = ఇంకా; ఏలన్ = ఎందుకు; మున్ను = ముందుగనే; చచ్చిన = (అవమాన భారంతో) చచ్చిపోయిన; వానిన్ = వాడిని.
భావము:- చంపదగ్గ తప్పు చేసినా సరే బంధువులను చంపరాదు. వదిలెయ్యాలి. అలాకాక చంపితే పాపం, తప్పదు. అసలే అవమాన భారంతో ముందే చచ్చినవాడిని వేరే చంపటం దేనికి.

తెభా-10.1-1777-ఆ.
బ్రహ్మచేత భూమితుల కీ ధర్మంబు
ల్పితంబు రాజ్యకాంక్షఁ జేసి
తోడిచూలు నైనఁదోడఁ బుట్టినవాఁడు
చంపుచుండుఁ గ్రూర రితుఁ డగుచు.

టీక:- బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేత = వలన; భూమిపతుల్ = రాజుల; కున్ = కు; ఈ = ఇలాంటి; ధర్మంబు = ఆచారము; కల్పితంబు = ఏర్పరచబడినది; రాజ్య = రాజ్యాధికారమునందలి; కాంక్షన్ = గట్టికోరిక; చేసి = వలన; తోడిచూలున్ = తోడబుట్టినవారిని; ఐనన్ = అయినప్పటికి; తోడబుట్టినవాడు = సోదరుడు; చంపుచున్ = చంపేస్తూ; ఉండున్ = ఉండును; క్రూర = క్రూరమైన; చరితుడు = నడవడిక కలవాడు; అగుచున్ = అగుచు.
భావము:- రాజ్యకాంక్షతో తోబుట్టినవానిని అయినాసరే, తోడబుట్టిన వాడు క్రూరంగా చంపేస్తాడు. ఇది బ్రహ్మచేత క్షత్రియులకు కల్పించబడిన ధర్మం.

తెభా-10.1-1778-క.
భూమికి ధన ధాన్యములకు
భాలకును మానములకుఁ బ్రాభవములకుం
గామించి మీఁదుఁ గానరు
శ్రీ దమున మానధనులు చెనఁకుదు రొరులన్.

టీక:- భూమి = రాజ్యము; కిన్ = కోసము; ధన = సిరి; ధాన్యముల్ = సంపదల; కున్ = కోసము; భామల్ = స్త్రీల; కును = కోసము; మానముల్ = గౌరవముల; కున్ = కోసము; ప్రాభవముల = వైభవముల; కున్ = కోసము; కామించి = కోరి; మీదున్ = రాబోవు నరకాదులను; కానరు = విచారింపరు; శ్రీ = సంపద; మదమునన్ = గర్వముచేత; మానధనులు = మానమే ధనంగా కలవారు; చెనకుదురు = హింసించెదరు; ఒరులన్ = ఇతరులను.
భావము:- మానవంతులు ధనమదాంధులు అయ్యి, రాజ్యం కోసం ధనధాన్యాల కోసం, స్త్రీల కోసం, పరువు కోసం, అధికారాల కోసం అఱ్ఱులు చాచి కిందు మీదు కానరు. ఇతరులను హింసిస్తారు.

తెభా-10.1-1779-వ.
వినుము, దైవమాయం జేసి దేహాభిమానులైన మానవులకుం బగవాఁడు బంధుండు దాసీనుండు నను భేదంబు మోహంబున సిద్ధం బయి యుండు జలాదుల యందుఁ జంద్రసూర్యాదులును ఘటాదులందు గగనంబును బెక్కులై కానంబడు భంగి దేహధారుల కందఱకు నాత్మ యొక్కండయ్యును బెక్కండ్రై తోఁచు; నాద్యంతంబులు గల యీ దేహంబు ద్రవ్య ప్రాణ గుణాత్మకంబై, యాత్మ యందు నవిద్య చేతఁ గల్పితంబై, దేహిని సంసారంబునం ద్రిప్పు సూర్యుండు తటస్థుండై యుండం బ్రకాశమానంబులైన దృష్టి రూపంబులుంబోలె నాత్మ తటస్థుండై యుండ దేహేంద్రియంబులు ప్రకాశమానంబు లగు నాత్మకు వేఱొక్కటితోడ సంయోగవియోగంబులు లేవు వృద్ధి క్షయంబులు చంద్రకళలకుంగాని చంద్రునికి లేని కైవడి జన్మనాశంబులు దేహంబునకుంగాని యాత్మకుఁ గలుగనేరవు; నిద్రబోయినవాఁ డాత్మను విషయఫలానుభవంబులు చేయించు తెఱంగున నెఱుక లేని వాఁడు నిజము గాని యర్థంబు లందు ననుభవము నొందుచుండుఁ; గావున.
టీక:- వినుము = శ్రద్ధగా వినుము; దైవమాయన్ = వైష్ణవమాయ {మాయ - భ్రమకారకము}; చేసి = వలన; దేహాభిమానులు = శరీరాభిమానులు {దేహాభిమానులు - దేహమే తానను అభిమానము కలవారు}; ఐన = అయిన; మానవుల్ = మనుషుల; కున్ = కు; పగవాడు = శత్రువు; బంధుండు = మిత్రుడు; ఉదాసీనుడు = సంబంధములేనివాడు; అను = అనెడి; భేదంబు = తేడా; మోహంబునన్ = మాయామోహమువలన; సిద్ధంబు = తప్పక కలుగునవి; అయి = ఐ; ఉండున్ = ఉండును; జల = నీళ్ళు (అద్దము); ఆదుల = మున్నగువాని; అందున్ = లో; చంద్ర = చంద్రబింబము; సూర్య = సూర్యబింబము; ఆదులున్ = మున్నగునవి; ఘటా = కుండ; ఆదులున్ = మున్నగువాని; అందున్ = లో; గగనంబును = ఆకాశము; పెక్కులు = అనేకములు; ఐ = అయి; కానంబడు = కనబడెడు; భంగిన్ = విధముగ; దేహధారుల్ = సకలజీవుల {దేహధారులు - శరీరముధరించి ఉండువారు, జీవులు}; కున్ = కు; అందఱ = అందరి; కున్ = కి; ఆత్మ = పరమాత్మ {పరమాత్మ - ఏకమేవాద్వితీయంబ్రహ్మ (శ్రుతి), ఏకము కనుక సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనిది అద్వితీయము కనుక ఇతరము (తనుకానిది) లేనిది పరమాత్మ}; ఒక్కండు = ఒక్కడే; అయ్యున్ = అయినప్పటికి; పెక్కండ్రు = అనేకులు; ఐ = అయినట్లు; తోచున్ = అనిపించును; ఆద్యంతంబులు = జన్మనాశనములు; కల = ఉన్నట్టి; ఈ = ఈ యొక్క; దేహంబు = శరీరము; ద్రవ్య = నవద్రవ్యములు {నవద్రవ్యములు - పృథ్వ్యాది, 1పృథివి 2అప్పు 3తేజము 4వాయువు 5ఆకాశము 6కాలము 7దిక్కు 8ఆత్మ 9మనస్సు}; ప్రాణ = పంచప్రాణములును {పంచప్రాణములు - 1ప్రాణము 2అపానము 3సమానము 4ఉదానము 5వ్యానము}; గుణ = పంచభూతగుణములు {పంచభూతగుణములు - శబ్దాది, 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంధము}; ఆత్మకంబు = స్వరూపమునకలది; ఐ = అయ్యి; ఆత్మ = పరమాత్మ; అందున్ = అందు; అవిద్య = అజ్ఞానము; చేతన్ = వలన; కల్పితంబు = లేనివి కలుగజేయబడినవి; ఐ = అయ్యి; దేహిని = జీవుని; సంసారంబునన్ = సంసారమునందు; త్రిప్పున్ = తిప్పుచుండును; సూర్యుండు = సూర్యుడు; తటస్థుండు = సాక్షి {తటస్థుడు - కార్యకారణముల ప్రభావము తనపై లేనివాడు, సాక్షి}; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; ప్రకాశమానంబులు = కనబడునవి; ఐన = అయినట్టి; దృష్టి = నేత్రములు; రూపంబులున్ = ఆకృతులను; బోలెన్ = వలె; ఆత్మ = పరమాత్మ; తటస్థుండు = సాక్షీభూతుడు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; దేహ = దేహములు {దేహములు - స్థూల సూక్ష్మ కారణ దేహములు}; ఇంద్రియంబులు = చతుర్దశేంద్రియములు {చతుర్దశేంద్రియములు - జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు మరియు అంతఃకరణ చతుష్టయము (1మనస్సు 2బుద్ధి 3చిత్తము 4అహంకారము) నాలుగు}; ప్రకాశమానంబులు = తెలియబడునవి; అగున్ = అగును; ఆత్మ = పరమాత్మ; కున్ = కు; వేఱొక్కటి = మరియొక దాని; తోడన్ = తోటి; సంయోగ = కూడుట; వియోగంబులు = ఎడబాయుటలు; లేవు = కలుగవు; వృద్ధి = పెరుగుట; క్షయంబులున్ = తరుగుటలు; చంద్రకళలు = షోడశచంద్రకళల {షోడశచంద్రకళలు - 1అమృత 2మానద 3పూష 4తుష్టి 5సృష్టి 6రతి 7ధృతి 8శశిని 9చంద్రిక 10కాంతి 11జ్యోత్స్న 12శ్రీ 13ప్రీతి 14అంగద 15పూర్ణ 16పూర్ణామృత}; కున్ = కు; కాని = తప్పించి; చంద్రుని = చంద్రుని; కిన్ = కి; లేని = లేనట్టి; కైవడిన్ = విధముగ; జన్మ = ఆది; నాశంబులు = అంతములు; దేహంబున్ = శరీరమున; కున్ = కు; కాని = తప్పించి; ఆత్మ = పరమాత్మ; కలుగన్ = కలుగ; నేరవు = చాలవు; నిద్రపోయినవాడు = నిద్రించినవాడు; ఆత్మను = తనయందు; విషయ = ఇంద్రియార్థముల; ఫల = మేలుకీడుల; అనుభవంబులున్ = భోగములను; చేయించు = కలిగించు; తెఱంగునన్ = విధముగ; ఎఱుక = ఆత్మజ్ఞానము; లేనివాడు = లేనివాడు; నిజము = సత్యము; కాని = కానట్టి; అర్థంబుల్ = విషయముల; అందున్ = లో; అనుభవమున్ = అనుభవమును; ఒందుచుండున్ = పొందుచుండును; కావున = కనుక.
భావము:- రుక్మిణీ! శ్రద్దగా విను. దేహాభిమానం కల మానవులకు దైవమాయ వలన మోహం జనిస్తుంది. దానితో శత్రువు మిత్రుడు ఉదాసీనుడు అనే భేదబుద్ధి కలుగుతుంది. జలం మొదలైన వానిలో సూర్యచంద్రులు, కుండలు మొదలైనవానిలో ఆకాశం అనేకములుగా అనిపిస్తాయి. అలాగే దేహధారు లందరికి ఆత్మ ఒక్కటే అయినా అనేకము అయినట్లు కనిపిస్తుంది. పుట్టుక చావులు కల ఈ దేహం పంచభూతాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే ద్రవ్యములతో ఏర్పడి, పంచ ప్రాణాలైన ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే ప్రాణము పోసుకొని, త్రిగుణా లైన సత్త్వగుణం, రజోగుణం, తమోగుణం అనే గుణాలుతో కూడినదై, అవిద్య అనే అజ్ఞానం వలన ఆత్మయందు కల్పించబడింది. ఈ దేహం దేహిని సంసారచక్రంలో తిప్పుతుంది. సూర్యుడు ఏ సంబంధం లేకుండా తటస్థంగా ఉండగా గోచర మయ్యే దృష్టి, రూపం అనే వాని వలె ఆత్మ ఉదాసీనుడై ఉండగా దేహము దశేంద్రియాలు ప్రకాశమనమౌతాయి. ఆత్మకు మరొక దానితో కూడిక కాని ఎడబాటు కాని లేదు. పెరగటం తగ్గటం చంద్రకళలకే కాని చంద్రుడుకి ఉండవు. అలాగే చావుపుట్టుకలు దేహనికే కాని ఆత్మకు కలగవు. నిద్రించినవాడు విషయాల వలని సుఖదుఃఖాలు ఆత్మను అనుభవింపజేస్తాడు. అలానే అజ్ఞాని సత్యంకాని విషయార్థాలలో అనుభవం కలిగించు కొంటాడు. అందుచేత.

తెభా-10.1-1780-క.
జ్ఞానజ మగు శోకము
విజ్ఞానవిలోకనమున విడువుము నీకుం
బ్రజ్ఞావతికిం దగునే
జ్ఞానుల భంగి వగవ, నంభోజముఖీ!"

టీక:- అజ్ఞాన = అజ్ఞానమువలన; జము = కలుగునది, పుట్టునది; అగు = ఐన; శోకము = దుఃఖమును; విజ్ఞాన = ఆత్మజ్ఞానము అనెడి; విలోకనమునన్ = దృష్టిచేత; విడువుము = వదలివేయుము; నీ = నీ; కున్ = కు; ప్రజ్ఞావతి = సమర్థురాలు; కిన్ = కి; తగునే = తగినదా, కాదు; అజ్ఞానుల = అజ్ఞానుల; భంగిన్ = వలె; వగవన్ = దుఃఖించుట; అంభోజముఖీ = పద్మాక్షి, రుక్మిణీ.
భావము:- పద్మం లాంటి ముఖము కలదానా! రుక్మిణీ! అజ్ఞానము వలన కలిగే దుఃఖాన్ని విజ్ఞానదృష్టితో విడిచిపెట్టు. నీ లాంటి సుజ్ఞానికి అజ్ఞానులలాగ దుఃఖించుట తగదు. అంటు బలరాముడు రుక్మిణిని సముదాయించసాగాడు.
– బహు కఠినమైన జ్ఞకార ప్రాసతో, అది అచ్చు ఆ కూడ ప్రాసగా సమానంగా ఉంచి, అజ్ఞాన విజ్ఞాన, ప్రజ్ఞానాలతో ఇలా అమృత గుళికను అందించిన పోతనగారికి ప్రణామములు.

తెభా-10.1-1781-వ.
ఇట్లు బలభద్రునిఁచేతఁ దెలుపంబడి రుక్మిణీదేవి దుఃఖంబు మాని యుండె; నట రుక్మి యనువాఁడు ప్రాణావశిష్టుండై, విడువంబడి తన విరూపభావంబునకు నెరియుచు "హరిం గెలిచికాని కుండినపురంబుఁ జొర"నని ప్రతిజ్ఞ చేసి, తత్సమీపంబున నుండె; నివ్విధంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; బలభద్రుని = బలరాముని; చేతన్ = చేత; తెలుపంబడి = జ్ఞానము కలుగజేయబడి; రుక్మిణీదేవి = రుక్మిణి; దుఃఖంబున్ = దుఃఖమును; మాని = విడిచి; ఉండెన్ = ఉండెను; అట = అక్కడ; రుక్మి = రుక్మి; అనువాడు = అనెడివాడు; ప్రాణ = ప్రాణములు మాత్రము; అవశిష్టుండు = మిగిలినవాడు; ఐ = అయ్యి; విడువంబడి = బంధవిముక్తుడై; తన = అతని; విరూపభావంబున్ = రూపవికారత్వమున; కున్ = కు; ఎరియుచున్ = తపించుచు; హరిన్ = కృష్ణుని; గెలిచి = జయించి; కాని = కాని; కుండినపురంబున్ = కుండిననగరమును; చొరను = ప్రవేశించను; అని = అని; ప్రతిజ్ఞ = శపథము; చేసి = చేసి; తత్ = దాని; సమీపంబునన్ = దగ్గరలో; ఉండెన్ = ఉండెను; ఇవ్విధంబునన్ = ఈ విధముగ.
భావము:- ఇలా బలరామునిచేత ప్రబోధింపబడి, రుక్మిణి దుఃఖము విడిచిపెట్టింది. అక్కడ రుక్మి ప్రాణాలతో విడువబడి, అవమానంతో తన వికృత రూపానికి చింతిస్తూ “కృష్ణుని గెలచి కాని కుండినపురం ప్రవేశించ” నని ప్రతిజ్ఞ చేసి, పట్టణం బయటే ఉన్నాడు.