Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/రుక్మిణి సందేశము పంపుట

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1698-ఉ.
న్న తలంపు తా నెఱిఁగి, న్నవనీరజగంధి లోన నా
న్నత నొంది, యాప్తుఁడగు బ్రాహ్మణు నొక్కనిఁ జీరి "గర్వ సం
న్నుఁడు రుక్మి నేడు ననుఁ జైద్యున కిచ్చెద నంచు నున్నవాఁ,
డెన్నివిధంబులం జని బుధేశ్వర! చక్రికి విన్నవింపవే.

టీక:- అన్న = సోదరుని; తలంపున్ = ఆలోచనలను; తాన్ = ఆమె; ఎఱిగి = తెలిసి; ఆ = ఆ యొక్క; నవనీరజగంధి = రుక్మిణి {నవనీరజగంధి - తాజా పద్మముల వంటి సువాసనలు ఉన్నామె, పద్మినీ జాతి సుందరి, రుక్మిణి}; లోనన్ = మనసులోపల; ఆపన్నతన్ = ప్రమాదస్థితిని; ఒంది = పొంది; ఆప్తుడు = కావలసినవాడు; అగు = ఐన; బ్రాహ్మణున్ = బ్రాహ్మణుడను; ఒక్కనిన్ = ఒకతనిని; చీరి = పిలిచి; గర్వ = గర్వముచేత; సంఛన్నుడు = కప్పబడినవాడు; రుక్మి = రుక్మి; నేడు = ఇప్పుడు; ననున్ = నన్ను; చైద్యున్ = శిశుపాలుని {చైద్యుడు - చేది దేశపువాడు, శిశుపాలుడు}; కిన్ = కి; ఇచ్చెదను = వివాహమున ఇచ్చెదను; అంచున్ = అనుచు; ఉన్నవాడు = ఉన్నాడు; ఎన్నివిధంబులన్ = ఏవిధముగానైన; చని = పోయి; బుధ = పండితులలో; ఈశ్వరా = ఉత్తముడా; చక్రి = కృష్ణుని; కిన్ = కి; విన్నవింపవే = మనవిచేయుము.
భావము:- పరీక్షిన్మహారాజా! తన అన్న ఆలోచన తెలిసి, క్రొందామరల సుగంధాలు వెదజల్లే దేహం కలిగిన (పద్మినీజాతి సుందరి యైన) రుక్మిణి, మేలుకోరేవాడు అయిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని పిలిచి ఇలా చెప్పింది “బుద్ధిమంతుడా! గర్వంతో కన్నులుగానక మా అన్న రుక్మి నాకు చేదిదేశపువాడైన శిశుపాలుడితో ఎలాగైనా పెళ్ళి చేసేస్తా నంటున్నాడు. ఏ విధాగానైనా చక్రాయుధుడు శ్రీకృష్ణుడి దగ్గరకి వెళ్ళి పరిస్థితి తెలియ జెప్పుము.

తెభా-10.1-1699-క.
య్యా! కొడుకు విచారము
య్యయు వారింపఁ జాలఁ టు గాకుండన్
నెయ్య మెఱిఁగించి చీరుము
య్యన నిజసేవకానుసారిన్ శౌరిన్."

టీక:- అయ్యా = నాయనా, పూజ్యుడా; కొడుకు = పుత్రుని యొక్క; విచారముల్ = ఆలోచనలను; అయ్యయున్ = తండ్రికూడ; వారింపన్ = నిలువరింప; చాలడు = నేరడు; అటు = ఆ విధముగ; కాకుండన్ = జరుగనీయకుండుటకు; నెయ్యమున్ = నా స్నేహమును, నా ప్రేమ; ఎఱిగించి = తెలిపి; చీరుము = పిలువుము; చయ్యనన్ = శీఘ్రముగా; నిజ = తన యొక్క; సేవక = భక్తులును; అనుసారిన్ = అనుసరించువానిని; శౌరిన్ = కృష్ణుని.
భావము:- ఓ బ్రాహ్మణోత్తమా! కొడుకుమాట మా నాన్న కూడ కాదనలేడు. అలా కాకూడదు. కనుక, నాప్రేమ తెలియజేసి భక్తుల వెంట నుండు వాడు, శూరుని మనుమడు అయిన శ్రీకృష్ణుణ్ణి వెంటనే రమ్మని పిలు.”

తెభా-10.1-1700-వ.
అని కొన్ని రహస్యవచనంబులు చెప్పిన విని బ్రాహ్మణుండు ద్వారకా నగరంబునకుం జని, ప్రతిహారుల వలనఁ దనరాక యెఱింగించి య న్నగధరుం డున్న నగరు ప్రవేశించి, యందుఁ గనకాసనాసీనుండయి యున్న పురుషోత్తముం గాంచి “పెండ్లికొడుకవు గ” మ్మని దీవించిన ముసిముసి నగవులు నగుచు బ్రహ్మణ్యదేవుండైన హరి తన గద్దియ దిగ్గన డిగ్గి, బ్రాహ్మణుం గూర్చుండ నియోగించి, తనకు దేవతలు చేయు చందంబునం బూజలు చేసి, సరసపదార్థ సంపన్నంబైన యన్నంబుఁ బెట్టించి, రెట్టించిన ప్రియంబున నయంబున భాసురుండైన భూసురుం జేరి లోకరక్షణ ప్రశస్తంబైన హస్తంబున నతని యడుగులు పుడుకుచు మెల్లన నతని కిట్లనియె.
టీక:- అని = అని; కొన్ని = కొన్ని, సరిపడెడి; రహస్య = రహస్యమైన; వచనంబులున్ = మాటలు; చెప్పినన్ = చెప్పగా; విని = విని; బ్రాహ్మణుండున్ = బ్రాహ్మణుడు; ద్వారకానగరంబున్ = ద్వారకాపట్టణమున; కున్ = కు; చని = వెళ్ళి; ప్రతిహారుల = ద్వారపాలకుల; వలనన్ = ద్వారా; ఎఱింగించి = తెలిపి; ఆ = ఆ ప్రసిద్ధుడైన; నగధరుండు = కృష్ణుడు {నగధరుడు - నగ (గోవర్ధన పర్వతమును) ధరుడు (ధరించినవాడు), కృష్ణుడు}; ఉన్న = ఉన్నట్టి; నగరు = అంతఃపురము; ప్రవేశించి = లోనికివెళ్ళి; అందున్ = దానిలో; కనక = బంగారు; ఆసనా = ఆసనముపై; ఆసీనుండు = కూర్చున్నవాడు; అయి = ఐ; ఉన్న = ఉన్నట్టి; పురుషోత్తమున్ = కృష్ణుని; కాంచి = చూసి; పెండ్లికొడుకవు = పెండ్లికొడుకువైనవాడవు; కమ్ము = అగుము; అని = అని; దీవించినన్ = ఆశీర్వదించగా; ముసిముసినగవులు = చిరునవ్వులు; నగుచున్ = నవ్వుతు; బ్రహ్మణ్య = వైదికకర్మలందు; దేవుండు = పూజ్యుడైనవాడు; ఐన = అయినట్టి; హరి = కృష్ణుడు; తన = అతని యొక్క; గద్దియన్ = ఆసనమును, పీఠమును; దిగ్గనన్ = చటుక్కున; డిగ్గి = దిగి; బ్రాహ్మణున్ = విప్రుని; కూర్చుండన్ = కూర్చుండుము అని; నియోగించి = చెప్పి; తన = అతని; కున్ = కి; దేవతలు = దేవతలు; చేయు = చేయునట్టి; చందంబునన్ = విధముగ; పూజలున్ = మర్యాదలుచేయుట; చేసి = చేసి; సరస = రసవంతములైన; పదార్థ = వస్తువులు; సంపన్నంబు = సమృద్ధిగా కలవి; ఐన = అయిన; అన్నంబున్ = భోజనము; పెట్టించి = పెట్టించి; రెట్టించిన = దిగ్విణీకృతంబైన; ప్రియంబునన్ = ప్రేమతో; నయంబునన్ = నమ్రతతో; భాసురుండు = తేజస్సు కలవాడు; ఐన = అయిన; భూసురున్ = విప్రుని {భూసురుడు - భూమిపైని దేవుడు, బ్రాహ్మణుడు}; చేరి = దగ్గరకు వెళ్ళి; లోక = సర్వలోకములను; రక్షణ = కాపాడుటలో; ప్రశస్తంబు = శ్లాఘింపదగినది; ఐన = అగు; హస్తంబునన్ = చేతితో; అతని = అతని యొక్క; అడుగులు = పాదములను; పుడుకుచున్ = వత్తుతు; మెల్లనన్ = మెల్లిగా; అతని = అతని; కిన్ = ఉద్దేశించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా చెప్పి కొన్ని రహస్య సంకేతాలు చెప్పి పంపింది. ఆ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళాడు. ప్రతీహారుల ద్వారా తన రాక తెలిపాడు. అంతఃపురంలో బంగారు ఆసనం మీద ముసిముసి నవ్వుతూ ఉన్న కృష్ణుణ్ణి దర్శించి “కల్యణ ప్రాప్తిరస్తు” అని దీవించాడు. సంతోషించిన కృష్ణుడు గద్దె దిగి, ఆసీనుణ్ణి చేసి, భక్తిగా పూజించి, మంచి రుచికరమైన భోజనం పెట్టించేడు. ద్విగుణీకృతమైన ప్రేమతో తేజోరాశిలా ఉన్న బ్రాహ్మణుని దరిజేరి లోకాల్ని కాపాడే తన చేత్తో కాళ్ళొత్తుతూ, కృష్ణుడు మెల్లగా ఇలా అన్నాడు.

తెభా-10.1-1701-సీ.
"గతీసురేశ్వర! సంతోషచిత్తుండ-
వై యున్న నీ ధర్మ తిసులభము
వృద్ధసమ్మత మిది విత్త మెయ్యది యైనఁ-
బ్రాపింప హర్షించు బ్రాహ్మణుండు
న ధర్మమున నుండుఁ రలఁ డా ధర్మంబు-
గోరిక లతనికిఁ గురియుచుండు
సంతోషిగాఁ డేని క్రుఁడైన నశించు-
నిర్ధనుండైనను నింద్రుఁ బోఁలు

తెభా-10.1-1701.1-ఆ.
సంతసించెనేని, ర్వభూతసుహృత్త
ములకుఁ బ్రాప్తలాభ ముదిత మాన
సులకు శాంతులకును సుజనులకును గర్వ
హీనులకును వినతు లే నొనర్తు.

టీక:- జగతీసుర = విప్రులలో {జగతీసురుడు - భూలోకమునకు దేవుడు, బ్రాహ్మణుడు}; ఈశ్వరా = శ్రేష్ఠుడా; సంతోష = సంతోషముతోకూడిన; చిత్తుండవు = మనసు కలవాడవు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; నీ = నీ యొక్క; ధర్మము = స్వభావము; అతి = మిక్కిలి; సులభము = ఆమోదయోగ్యమైనది; వృద్ధ = పెద్దలచే; సమ్మతము = అంగీకరింపబడినది; ఇది = ఇది; విత్తము = ధనము; ఎయ్యది = ఏది; ఐనన్ = అయినప్పటికి; ప్రాప్తింపన్ = లభించినచో; హర్షించున్ = సంతోషించును; బ్రాహ్మణుండున్ = విప్రుడు; తన = అతని యొక్క, స్వ; ధర్మమునన్ = ధర్మమునందే; ఉండున్ = నిలుకడగా ఉండును; తరలడు = తప్పుకొనడు; ధర్మంబున్ = స్వధర్మమును; కోరికలు = కోరినవి; అతని = అతని; కిన్ = కి; కురియుచున్ = సమృద్ధిగా దొరకుచు; ఉండున్ = ఉండును; సంతోషి = సంతోషించినవాడు; కాడేని = కానిపక్షమున; శక్రుడు = ఇంద్రుడు; ఐనన్ = అయినను; నశించున్ = నశించిపోవును; నిర్దనుండు = మిక్కిలి బీదవాడు; ఐననున్ = అయినను; ఇంద్రుబోలు = దేవేంద్రుని వలె భోగము లనుభవించును;
సంతసించెనేని = సంతోషించినచో; సర్వ = సమస్తమైన; భూత = ప్రాణులకు; సుహృత్తముల్ = మేలు కోరువారల; కున్ = కు; ప్రాప్త = పొందబడిన; లాభ = లాభములచేతనే; ముదిత = సంతోషించునట్టి; మానసుల్ = మనసులు కలవారి; కున్ = కు; శాంతుల్ = శాంతస్వభావము కలవారి; కును = కి; సుజనుల్ = మంచివారి; కును = కి; గర్వ = గర్వము; హీనుల్ = లేనివారి; కును = కి; వినతులు = నమస్కారములు; ఏన్ = నేను; ఒనర్తు = చేయుదును.
భావము:- “ఓ బ్రాహ్మణుడా! లోకులందరిచే గౌరవింపబడువాడ! నీ పద్దతి చక్కటిది, తీరైనది, పెద్దలు అంగీకరించేది. బ్రాహ్మణుడు దొరికిన ధనంతోనే తృప్తిపడతాడు. తన దర్మాన్ని వదలిపెట్టడు. ఆ ధర్మమే అతనికి కావలసినవన్నీ సమకూరుస్తుంది. విప్రుడు తృప్తి చెందకపోతే ఇంద్రుడైనా నాశనమైపోతాడు. తృప్తి చెందాడా, దరిద్రుడు కూడ దేవేంద్రుని వలె భోగాలను అనుభవిస్తాడు. నేను సకల జీవులకు ఆప్తులు, దొరికిన దానితోనే తృప్తిచెందే వారు, శాంతస్వభావులు, మంచివారు, గర్వహీనులు అయిన విప్రులకి నమస్కరిస్తాను.

తెభా-10.1-1702-ఉ.
వ్వని దేశమం దునికి; యెవ్వనిచేఁ గుశలంబు గల్గు మీ
కెవ్వని రాజ్యమందుఁ బ్రజలెల్ల సుఖింతురు వాఁడు మత్ప్రియుం
డివ్వనరాశి దుర్గమున కెట్లరుదెంచితి రయ్య! మీరు? లే
వ్వులుగావు; నీ తలఁపునం గల మే లొనరింతు ధీమణీ!"

టీక:- ఎవ్వని = ఎవరి; దేశము = రాజ్యము; అందున్ = లో; ఉనికి = ఉండుట; ఎవ్వని = ఎవరి; చేన్ = వలన; కుశలంబున్ = క్షేమము; కల్గున్ = కలుగును; మీ = మీ; కున్ = కు; ఎవ్వని = ఎవరి; రాజ్యము = రాజ్యము; అందున్ = లో; ప్రజలు = జనులు; ఎల్లన్ = అందరు; సుఖింతురు = సుఖించెదరు; వాడు = అతడు; మత్ = నా యొక్క; ప్రియుండు = ఇష్టుడు; ఈ = ఈ; వనరాశి = సముద్రపు; దుర్గమున్ = కోటకు; కున్ = కు; ఏల = ఎట్లు; అరుదెంచితిరి = వచ్చిరి; అయ్య = తండ్రి; మీరున్ = మీరు; లే = లేత; నవ్వులు = నవ్వులకు; కావు = చెప్పినవికావు; నీ = నీ యొక్క; తలపునన్ = మనసునందు; కల = ఉన్న; మేలున్ = మంచివాటిని; ఒనరింతున్ = చేసెదను; ధీమణీ = విజ్ఞులలో ఉత్తముడా.
భావము:- బుద్ధిశాలీ! మీరే దేశంలో ఉంటారు. ఎవని రాజ్యంలో నైతే మీరు కులాసాగా ఉంటారో, ప్రజలంతా సుఖంగా ఉంటారో వాడు మాకు ఇష్టుడు. సముద్రంలో ఉన్న ఈ కోట లోకి రావటం అంత సుళువైనపని కాదు. మీరెలా వచ్చేరు. మీరు కోరిన మేలు తప్పక చేకూరుస్తాను.” అని శ్రీకృష్ణుడు సందేశం పట్టుకొని వచ్చిన విప్రుని పలకరించాడు.

తెభా-10.1-1703-వ.
అని యిట్లు లీలాగృహీతశరీరుండైన య ప్పరమేశ్వరుం డడిగిన ధరణీసురవరుం డతనికి సవినయంబుగ నిట్లనియె “దేవా! విదర్భదేశాధీశ్వరుండైన భీష్మకుండను రాజుగలం; డా రాజుకూఁతురు రుక్మిణి యను కన్యకామణి; గల ద య్యిందువదన నీకుం గైంకర్యంబు జేయం గోరి వివాహమంగళ ప్రశస్తంబయిన యొక్క సందేశంబు విన్నవింపు మని పుత్తెంచె నవదరింపుము.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; లీలా = విలాసముగా; గృహీత = గ్రహించిన; శరీరుండు = దేహము కలవాడు; ఐన = అయిన; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పరమేశ్వరుండు = శ్రీకృష్ణుడు; అడిగినన్ = అడుగగా; ధరణీసుర = విప్ర; వరుండు = ఉత్తముడు; అతని = అతని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; దేవా = స్వామీ; విదర్భదేశ = విదర్భదేశమునకు; అధీశ్వరుండు = ప్రభువు; అయిన = ఐన; భీష్మకుండు = భీష్మకుడు; అను = అనెడి; రాజు = రాజు; కలండు = ఉన్నాడు; ఆ = ఆ; రాజు = రాజు యొక్క; కూతురు = కుమార్తె; రుక్మిణి = రుక్మిణి; అను = అనెడి; కన్యక = కన్యకలలో; మణి = శ్రేష్ఠురాలు; కలదు = ఉన్నది; ఆ = ఆ యొక్క; ఇందువదన = చంద్రముఖి, రుక్మిణి; నీ = నీ; కున్ = కు; కైంకర్యంబున్ = సేవించుట; చేయన్ = చేయవలెనని; కోరి = కోరుకొని; వివాహ = పెండ్లికి సంబంధించిన; మంగళ = శుభకరము; ప్రశస్తంబు = శ్లాఘింపదగినది; అయిన = ఐన; ఒక్క = ఒకానొక; సందేశంబున్ = సమాచారమును; విన్నవింపుము = మనవిచేయుము; అని = అని; పుత్తెంచెను = పంపించినది; అవధరింపుము = వినుము.
భావము:- ఇలా ఆ లీలామానవదేహధారి అయిన శ్రీకృష్ణపరమాత్మ అడుగగా, రుక్మిణీదేవి సందేశం తెచ్చిన ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు “భగవాన్! విదర్భ దేశానికి రాజు భీష్మకుడు. ఆ రాజు కూతురు రుక్మిణి. ఆ అందమైన కన్య ఒక వివాహ మంగళంబైన గొప్ప సందేశం నీకు విన్నవించమని పంపింది. సావధానంగా విను.

తెభా-10.1-1704-సీ.
నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక-
దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల-
ఖిలార్థలాభంబు లుగుచుండు
నే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన-
భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ-
డవిన బంధసంతులు వాయు

తెభా-10.1-1704.1-తే.
ట్టి నీ యందు నా చిత్త నవరతము
చ్చి యున్నది నీ యాన నాన లేదు,
రుణఁ జూడుము కంసారి! లవిదారి!
శ్రీయుతాకార! మానినీచిత్తచోర!

టీక:- ఏ = ఎట్టి; నీ = నీ యొక్క; గుణములున్ = గొప్పగుణములు {భగవంతుని గుణములు - 1సర్వజ్ఞత్వము 2సర్వేశ్వరత్వము 3సర్వభోక్తృత్వము 4సర్వనియంతృత్వము 5సర్వాంతర్యామిత్వము 6సర్వసృష్టత్వము 7సర్వపాలకత్వము 8సర్వసంహారకత్వము మొదలగునవి}; కర్ణేంద్రియంబులు = చెవులను; సోకన్ = తాకినంతనే; దేహ = శారీరక; తాపంబులు = బాధలు, తాపత్రయములు {తాపత్రయము - 1 ఆధ్యాత్మికము 2ఆదిదైవికము 3ఆదిభౌతికము అనెడి మూడు ఇడుములు}; తీఱిపోవున్ = నశించిపోవునో; ఏ = ఎట్టి; నీ = నీ యొక్క; శుభ = శోభనకరమైన; ఆకారమున్ = స్వరూపమును; ఈక్షింపన్ = చూచినచో; కన్నుల్ = కళ్ళ; కున్ = కు; అఖిల = సమస్తమైన; అర్థ = ప్రయోజనములు; లాభంబు = లభించుట; కలుగుచుండున్ = పొందుతుండునో; ఏ = ఎట్టి; నీ = నీ యొక్క; చరణ = పాదములను; సేవన్ = కొలచుటచే; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడు; చేసినన్ = చేసినచో; భువన = లోకమునందు; ఉన్నతత్వంబు = అధిక్యము; పొందగలుగు = లభించునో; ఏ = ఎట్టి; నీ = నీ యొక్క; లసత్ = మంచి; నామమున్ = పేరులను; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడు; భక్తి = భక్తి; తోన్ = తోటి; తడవినన్ = తలచిన ఎడల; బంధ = సంసారబంధముల {సంసారబంధములు - అష్టబంధములు, 1దయ 2జుగుప్స 3మోహము 4భయము 6సంశయము 7కులము 8శీలము}; సంతతులు = సమూహములన్ని; వాయున్ = తొలగునో; అట్టి = అటువంటి.
నీ = నీ; అందున్ = ఎడల; నా = నా యొక్క; చిత్తము = మనస్సు; అనవరతము = ఎల్లప్పుడు; నచ్చి = ఇష్టపడి; ఉన్నది = ఉన్నది; నీ = నీ మీద; ఆన = ఒట్టు; నాన = సిగ్గుపడుట; లేదు = లేదు; కరుణన్ = దయతో; చూడుము = చూడు; కంసారి = శ్రీకృష్ణా {కంసారి - కంసుని సంహరించినవాడు, కృష్ణుడు}; ఖలవిదారి = శ్రీకృష్ణా {ఖల విదారి - దుర్జనులను సంహరించువాడు, కృష్ణుడు}; శ్రీయుతాకార = శ్రీకృష్ణా {శ్రీయుతాకారుడు - సౌందర్య సంపదలతో కూడి ఉన్న వాడు, కృష్ణుడు}; మానినీచిత్తచోర = శ్రీకృష్ణా {మానినీచిత్తచోరుడు - స్త్రీల మనసులను అపహరించు వాడు, కృష్ణుడు}.
భావము:- శ్రీకృష్ణప్రభూ! కంసాది ఖలులను సంహరించినవాడ! మంగళాకారా! మనస్వినిల మనసులు దోచేవాడా! నీ గురించి చెవులలో పడితే చాలు దేహతాపాలన్నీ తీరిపోతాయి. నీ శుభాకారం చూస్తే చాలు సకలార్థ లాభాలు కలుగుతాయి. నీ పాదసేవ చేసుకొంటే చాలు లోకోన్నతి దక్కుతుంది. భక్తిగా నీ నామస్మరణ ఎడతెగకుండా చేస్తే చాలు భవబంధాలన్నీ పటాపంచ లౌతాయి. అలాంటి నీ మీద మనసు పడ్డాను. నీ మీదొట్టు. సమయం లేదు. దయతో చిత్తగించు.

తెభా-10.1-1705-శా.
న్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ
న్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
న్యల్గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
న్యానేకపసింహ! నా వలననే న్మించెనే మోహముల్?

టీక:- ధన్యున్ = కృతార్థుండు; లోక = లోకుల; మనః = మనసులను; అభిరామున్ = నచ్చువాడు; కుల = వంశముచేత; విద్యా = విజ్ఞానముచేత; రూప = సౌందర్యముచేత; తారుణ్య = యౌవనశోభచేత; సౌజన్య = మంచితనముచేత; శ్రీ = సంపదలచేత; బల = శక్తిచేత; దాన = ఈవిచేత; శౌర్య = వీరత్వముచేత; కరుణా = దయచేత; సంశోభితున్ = మిక్కిలి ప్రకాశవంతుడు; నిన్నున్ = నిన్ను; ఏ = ఏ; కన్యల్ = కన్యలు మాత్రము; కోరరు = కావలనుకొనరు; కోరదే = వరించలేదా; మును = పూర్వము; రమా = లక్ష్మీదేవి యనెడి; కాంతాలలామంబు = శ్రేష్ఠురాలు; రాజ = రాజులలో; అన్య = శత్రువు లనెడి; అనేకప = ఏనుగులకు; సింహ = సింహమువంటివాడ; నా = నా ఒక్కర్తె; వలననే = యందే; జన్మించెనే = పుట్టినవా, పుట్టలేదు; మోహముల్ = మోహించుటలు.
భావము:- ముకుందా! రాజులనే మత్తేభాల పాలిటి సింహమా! నీవు ధన్యుడవు. అందరి మనసులు అలరించే వాడవు. కులం, రూపం, యౌవనం, సౌజన్యం, శ్రీ, బలం, దాన, పరాక్రమం, కరుణాది సకల సుగుణ సంశోభితుడవు. అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారు. మోహించకుండా ఉంటారు. పూర్వం కాంతామణి లక్ష్మీదేవి నిన్ను వరించ లేదా. అయినా లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదాని వలననే మోహం అనేది పుట్టిందా ఏమిటి.

తెభా-10.1-1706-ఉ.
శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున త్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ
డా ధమాధముం డెఱుఁగఁ ద్భుతమైన భవత్ప్రతాపమున్

టీక:- శ్రీ = లక్ష్మీదేవితో, సంపదలతో; యుత = కూడియున్న; మూర్తి = స్వరూపుడా; ఓ = ఓయీ; పురుష = పురుషులలో; సింహమా = శ్రేష్ఠుడా; సింహము = సింహమునకు; పాలి = చెందిన; సొమ్మున్ = పశువును; గోమాయువున్ = నక్క; కోరు = ఆశించెడి; చందమునన్ = విధముగ; మత్తుడు = మిక్కిలి గర్వము కలవాడు; చైద్యుడు = శిశుపాలుడు {చైద్యుడు - చేది దేశపువాడు, శిశుపాలుడు}; నీ = నీ యొక్క; పద = పాదము లనెడి; అంబుజ = పద్మము లందు; ధ్యాయిని = ధ్యానించుదానను; ఐన = అయిన; నన్నున్ = నన్ను; వడిన్ = వేగముగా, తీవ్రముగా; తాన్ = అతను; కొనిపోయెదను = తీసుకుపోయెదను; అంచున్ = అని; ఉన్నవాడు = ఉన్నాడు; ఆ = ఆ యొక్క; అధమ = నీచులలో; అధముండు = నీచుడు; ఎఱుగడు = ఎరుగడు; అద్భుతము = దివ్యము; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; ప్రతాపమున్ = పరాక్రమమును.
భావము:- ఓ శుభాకారా! పురుషోత్తమ! శ్రీకృష్ణా! సింహానికి చెందవలసిన దానిని నక్క కోరినట్లు, గర్విష్ఠి ఐన శిశుపాలుడు నీ పదభక్తురాలు ఐన రుక్మిణిని, నన్ను తీసుకుపోతాను అంటున్నాడు. అద్భుతమైన నీ మహిమ తెలియని పరమనీచుడు వాడు.

తెభా-10.1-1707-మ.
వ్రముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దానధర్మాదులున్
జన్మంబుల నీశ్వరున్ హరి జగత్కళ్యాణుఁ గాంక్షించి చే
సితి నేనిన్ వసుదేవ నందనుఁడు నా చిత్తేశుఁ డౌఁ గాక ని
ర్జితు లై పోదురుగాక సంగరములోఁ జేదీశ ముఖ్యాధముల్.

టీక:- వ్రతముల్ = నోములు; దేవ = దేవతలను; గురు = పెద్దలను; ద్విజన్మ = విప్రులను; బుధ = జ్ఞానులను; సేవల్ = కొలచుటలు; దాన = దానము లిచ్చుటలు; ధర్మ = దర్మాచరణములు; ఆదులున్ = మున్నగువానిని; గత = పూర్వ; జన్మంబులన్ = జన్మములలో; ఈశ్వరున్ = సర్వము ఏలువాడిని; హరిన్ = విష్ణుమూర్తిని; జగత్ = లోకమునకు; కల్యాణున్ = మేలు చేయువానిని; కాంక్షించి = కావాలని, కోరి; చేసితినేనిన్ = చేసినచో; వసుదేవనందనుడు = కృష్ణుడు {వసుదేవ నందనుడు - వసుదేవుని కొడుకు, కృష్ణుడు}; నా = నా యొక్క; చిత్తేశుడు = భర్త {చిత్తేశుడు - మనసునకు ప్రభువు, భర్త}; ఔగాక = అగును గాక; నిర్జితులు = ఓడిపోయినవారు; ఐపోదురుగాక = అయ్యెదరుగాక; సంగరము = యుద్ధము; లోన్ = అందు; చేదీశ = శిశుపాలుడు {చేదీశుడు - చేది దేశపు ప్రభువు, శిశుపాలుడు}; ముఖ్య = మొదలగు; అధముల్ = నీచులు.
భావము:- రుక్మిణీదేవి అను నేను కనక గత జన్మలలో భగవంతుడు లోకకల్యాణుడు ఐన నారాయణుని కోరి వ్రతాలు చేసి ఉన్నట్లైతే; దేవతల, గురువుల, విప్రోత్తముల సేవ చేసి ఉన్నట్లైతే; దాన ధర్మాలు మొదలైనవి చేసి ఉన్నట్లైతే; వసుదేవుని కొడుకైన కృష్ణుడు నాకు భర్త ఔగాక! యుద్ధంలో శిశుపాలాది అధములు ఓడిపోవుదురు గాక!

తెభా-10.1-1708-ఉ.
అంకిలి జెప్పలేదు; చతురంగబలంబులతోడ నెల్లి యో!
పంజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయశౌర్యమే
యుంకువ చేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్.

టీక:- అంకిలి = అడ్డు; చెప్పన్ = చెప్పుటకు; లేదు = లేదు; చతురంగబలంబుల్ = చతురంగసైన్యము {చతురంగబలము - 1రథములు 2ఏనుగులు 3గుఱ్ఱములు 4పదాతిదళము అనెడి నాలుగు అంగములు (విభగములు) కల సేన}; తోడన్ = తోటి; ఎల్లి = రేపు; ఓ = ఓయీ; పంకజనాభ = కృష్ణా {పంకజనాభుడు - పద్మము నాభి యందుగలవాడు, విష్ణువు}; నీవు = నీవు; శిశుపాల = శిశుపాలుడు; జరాసుతులన్ = జరాసంధులను; జయించి = గెలిచి; నా = నా; వంక = వైపు, సహాయపడుట; కున్ = కు; వచ్చి = వచ్చి; రాక్షస = రాక్షసము పద్ధతి; వివాహమునన్ = వివాహమునందు; భవదీయ = నీ యొక్క; శౌర్యమున్ = పరాక్రమమును; ఉంకువ = ఓలిగా {ఉంకువ - అల్లుడు కన్యకార్థముగా మామ కిచ్చెడి ద్రవ్యము, శుల్కము}; చేసి = చేసి; కృష్ణ = కృష్ణ; పురుష = పురుషులలో; ఉత్తమ = శ్రేష్ఠుడా; చేకొనిపొమ్ము = తీసుకుని వెళ్ళుము; వచ్చెదన్ = నేను వస్తాను.
భావము:- ఓ పద్మనాభ! కృష్ణ! మహాత్మ! అడ్డుచెప్పడానికి లేదు; నీ పరాక్రమం చూపి, రేపు నీవు చతురంగ బలాలతో సహా వచ్చి, శిశుపాలుడు జరాసంధులను జయించి, నా దగ్గరకు వచ్చి, నన్ను (రుక్మిణిని) రాక్షస వివాహమున తీసుకుకొని వెళ్ళవయ్య! నేను సంతోషంగా నీతో వచ్చేస్తాను.

తెభా-10.1-1709-సీ.
"లోపలి సౌధంబులోన వర్తింపంగఁ-
దేవచ్చునే నిన్నుఁ దెత్తునేని
గావలివారలఁ ల బంధువులఁ జంపి-
కాని తేరా"దని మలనయన!
భావించెదేని యుపాయంబు చెప్పెద-
నాలింపు కులదేవయాత్రఁ జేసి
గరంబు వెలువడి గజాతకును మ్రొక్కఁ-
బెండ్లికి మునుపడఁ బెండ్లికూఁతుఁ

తెభా-10.1-1709.1-తే.
నెలమి మావారు పంపుదు రేను నట్లు
పురము వెలువడి యేతెంచి భూతనాథు
తికి మ్రొక్కంగ నీవు నా మయమందు
చ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత!

టీక:- లోపలి = లోపలికి ఉన్న; సౌధంబు = అంతఃపురము; లోనన్ = అందు; వర్తింపంగా = తిరుగుచుండగా; తేవచ్చునే = తీసుకురాగలమా; నిన్నున్ = నిన్ను; తెత్తునేని = తీసుకొని వచ్చినను; కావలివారలన్ = కాపలాదారులను; కల = అక్కడున్న; బంధువులన్ = చుట్టములను; చంపి = సంహరించి; కాని = కాని; తేరాదు = తీసుకురాలేము; అని = అని; కమలనయన = పద్మాక్షుడా, కృష్ణా; భావించెదేని = తలచెడి పక్షమున; ఉపాయంబు = సుళువుమార్గమును; చెప్పెదన్ = తెలిపెదను; ఆలింపు = వినుము; కులదేవ = ఇలవేల్పుని కొలుచుట కైన; యాత్ర = ప్రయాణము; చేసి = అయ్యి; నగరంబు = అంతఃపురము; వెలువడి = బయలుదేరి; నగజాత = పార్వతీదేవి; కును = కి; మ్రొక్కన్ = పూజించుటకు; పెండ్లి = వివాహమున; కిన్ = కు; మునుపడన్ = ముందుగా; పెండ్లికూతున్ = పెళ్ళికూతురును; ఎలమి = ప్రీతితో.
మావారు = మావాళ్ళు; పంపుదురు = పంపించెదరు; ఏనున్ = నేను కూడ; అట్లు = ఆ విధముగనే; పురము = అంతఃపురము; వెలువడి = బయలుదేరి; ఏతెంచి = వచ్చి; భూతనాథుసతి = పార్వతీదేవి {భూతనాథు సతి - భూతనాథు (శివు)ని సతి, పార్వతి}; కిన్ = కి; మ్రొక్కగన్ = పూజించుచుండగా; నీవున్ = నీవు; ఆ = ఆ యొక్క; సమయము = సమయము; అందున్ = అందు; వచ్చి = చేరవచ్చి; కొనిపొమ్ము = తీసుకొనివెళ్ళు; నన్నున్ = నన్ను; అవార్యచరిత = నివారింపరానివాడా.
భావము:- ఓ కమలాల వంటి కన్నులున్న కన్నయ్యా! “నీవు కన్యాంతఃపురంలో ఉంటావు కదా రుక్మిణీ ! నిన్ను ఎలా తీసుకుపోవాలి. అలా తీసుకెళ్ళాలంటే కాపలావాళ్ళను, అప్పు డక్కడ ఉన్న మీ బంధుజనాలను చంపాల్సివస్తుంది కదా” అని నీవు అనుకుంటే, దీనికి ఒక ఉపాయం మనవిచేస్తాను. చిత్తగించు. పెళ్ళికి ముందు మా వారు పెళ్ళికూతురును మా ఇలవేల్పు మంగళగౌరిని మొక్కడానికి పంపిస్తారు. నేను కూడ అలాగే నగరి వెలువడి మొక్కుచెల్లించడానికి ఊరి వెలుపల ఉన్న దుర్గగుడికి బయలుదేరి వస్తాను. అడ్డగింపరాని నడవడిక కలవాడా! కృష్ణా! ఆ సమయానికి దారికి అడ్డంగా వచ్చి నన్ను నిరాటంకంగా తీసుకొనిపో!

తెభా-10.1-1710-మ.
ను లాత్మీయ తమోనివృత్తికొఱకై గౌరీశుమర్యాద నె
వ్వని పాదాంబుజతోయమందు మునుఁగన్ వాంఛింతు రే నట్టి నీ
నుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూఱుజన్మంబులున్
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు, ప్రాణేశ్వరా!

టీక:- ఘనులు = గొప్పవారు; ఆత్మీయ = తమ యొక్క; తమః = అజ్ఞానమును; నివృత్తి = తొలగించుకొనెడి; వృత్తిన్ = ఉపాయము; కొఱకు = కోసము; ఐ = అయ్యి; గౌరీశు = శివుని {గౌరీశుడు - గౌరి యొక్క ప్రభువు, శివుడు}; మర్యాదన్ = వలెనే; ఎవ్వని = ఎవరి యొక్క; పాద = పాదములనెడి; అంబుజ = పద్మముల; తోయము = తీర్థము; అందున్ = అందు; మునుగన్ = స్నానము చేయవలె నని; వాంఛింతురు = కోరుదురో; ఏనున్ = నేను కూడ; అట్టి = అటువంటి; నీ = నీ యొక్క; అనుకంపన్ = దయచేత; విలసింపనేని = ప్రకాశింపకపోతే, క్రీడింపకపోతే; వ్రత = వ్రతదీక్ష; చర్యన్ = వంటి కార్యముగా; నూఱు = వంద (100); జన్మంబులున్ = రాబోవు జన్మములులో; నినున్ = నిన్ను; చింతించుచున్ = తలచుచు; ప్రాణముల్ విడిచెదన్ = చనిపోయెదను; నిక్కంబు = ఇది తథ్యము; ప్రాణేశ్వరా = నా పాణమునకు ప్రభువా.
భావము:- జీవితేశ్వరా! నాథా! పార్వతీపతి పరాత్పరుని పాదపద్మాల యందు ప్రభవించిన పవిత్ర గంగాజలాలలో ఓలలాడుతుంటాడు. మహాత్ములు అజ్ఞానరాహిత్యం కోరి, శంకరుని వలెనే, ఆ పరాత్పరుని పదజనిత గంగాజలాలలో ఓలలాడాలని కోరుతుంటారు. అటువంటి తీర్థపాదుడ వైన నీ అనుగ్రహాన్ని అందుకొని మనలేని ఎడల, బ్రహ్మచర్యదీక్షా వ్రతనిష్ఠ వహించి వంద జన్మలు కలిగినా సరే, నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ, తప్పక నా ప్రాణాలు నీకే అర్పిస్తాను సుమా!
రుక్మిణీ సందేశంలోని సుమథురమైన పద్యరాజం యిది. భాగవతమే మహా మహిమాన్వితం, అందులో రుక్మిణీ కల్యాణం మహత్వం ఎవరికైనా చెప్పతరమా. – ఆత్మేశ్వరా! పరమాత్మా! ఆత్మజ్ఞాన సంపన్నులు కూడ తమ హృదయాలలోని అవశిష్ఠ అజ్ఞానాంధకార నివారణ కోసం సాత్వికగుణం అభివృద్ధి చేసి తమోగుణం గ్రసించే బ్రహ్మవేత్త లాగ ఏ పరబ్రహ్మ అనే పవిత్ర జ్ఞాన గంగలో లయం కావాలని కోరతారో అట్టి పరబ్రహ్మతో ఈ జన్మలో ఉపరతి జెందలేనిచో ఎన్ని జన్మ లైనా పట్టుబట్టి విడువ కుండా మళ్ళీ మళ్ళీ మరణించే దాకా తపిస్తూనే ఉంటాను అంటున్నది రుక్మిణి అనే జీవాత్మ.

తెభా-10.1-1711-సీ.
ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని-
ర్ణరంధ్రంబుల లిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని-
నులతవలని సౌంర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని-
క్షురింద్రియముల త్వ మేల?
యిత! నీ యధరామృతం బానఁగా లేని-
జిహ్వకు ఫలరససిద్ధి యేల?

తెభా-10.1-1711.1-ఆ.
నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణ మేల?
న్యచరిత! నీకు దాస్యంబు జేయని
న్మ మేల? యెన్ని న్మములకు."

టీక:- ప్రాణేశా = నా పాణమునకు ప్రభువా; నీ = నీ యొక్క; మంజు = మృదువైన; భాషలున్ = మాటలు; వినలేని = వినజాలని; కర్ణరంధ్రంబుల = చెవులు అనెడివి; కలిమి = ఉండి; ఏలన్ = ఎందుకు; పురుష = పురుషులలో; రత్నమ = శ్రేష్ఠుడా; నీవున్ = నీవు; భోగింపగా = రమించుట; లేని = లేనట్టి; తను = దేహమనెడి; లత = తీగ; వలని = అందలి; సౌందర్యము = అందము; ఏలన్ = ఎందుకు; భువన = ఎల్లలోకములను; మోహన = మోహింపజేయువాడ; నిన్నున్ = నిన్ను; పొడగానగాలేని = చూడజాలని; చక్షురింద్రియముల = కళ్ళకున్; సత్వము = పటుత్వము; ఏలన్ = ఎందుకు; దయిత = ప్రియా; నీ = నీ యొక్క; అధరామృతంబు = పెదవుల తీయదనమును; ఆనగాలేని = ఆస్వాదించజాలని; జిహ్వ = నాలుక; కున్ = కు; ఫల = పండ్లను; రస = రుచిచూచుట; సిద్ధి = లభించుట; ఏలన్ = ఎందుకు.
నీరజాతనయన = పద్మాక్షుడా, కృష్ణా; నీ = నీ యొక్క; వనమాలికా = పూల చిగుళ్ళ మాల యొక్క; గంధము = సువాసన; అబ్బలేని = లభింపజాలని; ఘ్రాణము = ముక్కు; ఏలన్ = ఎందుకు; ధన్య = కృతార్థమైన; చరిత = నడవడి కలవాడా; నీ = నీ; కున్ = కు; దాస్యంబు = సేవ; చేయని = చేయజాలని; జన్మము = జీవించుట; ఏలన్ = ఎందుకు; ఎన్ని = ఎన్ని; జన్మములకు = జన్మలెత్తినను {జన్మలెత్తు - పునర్జన్మలు పొందుట}.
భావము:- శ్రీకృష్ణ! నీ మనోజ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు దండగ; పురుషోత్తమ! నీవు భోగించని వంటికి అంద మెందుకు దండగ; ప్రాణేశా! నిన్ను చూడలేని కళ్ళకి చూపెందుకు దండగ; ప్రభూ! నీ అధరామృతం అందని నాలుకకు రుచెందుకు దండుగ; పద్మాక్షా! నీ మెడలోని పూలహారం వాసన చూడలేని ముక్కు ఎందుకు దండగ; మహాత్మా! కృష్ణభగవాన్! ఎన్నిజన్మలకైనా నీ సేవచేయలేని దండగమారి జన్మ ఎందుకు; నాకు వద్దయ్యా!”

తెభా-10.1-1712-వ.
అని యిట్లు రుక్మిణీదేవి పుత్తెంచిన సందేశంబును, రూప సౌంద ర్యాది విశేషంబులును బ్రాహ్మణుండు హరికి విన్నవించి “కర్తవ్యం బెద్ది చేయ నవధరింపు” మని సవర్ణనంబుగా మఱియు నిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి; పుత్తెంచిన = చెప్పి పంపించిన; సందేశంబులున్ = వృత్తాంతములు; రూప = రూపము నందలి; సౌందర్య = అందము; ఆది = మున్నగు; విశేషంబులున్ = ప్రత్యేకతలను; బ్రాహ్మణుండు = విప్రుడు; హరి = కృష్ణుని; కిన్ = కి; విన్నవించి = చెప్పి; కర్తవ్యంబు = చేయదగ్గపని; ఎద్ది = ఏదైతే అది; చేయన్ = చేయవలెనని; అవధరింపుము = నిశ్చయించుకొనుము; అని = అని; సవర్ణనంబుగాన్ = రుక్మిణి సౌందర్య వర్ణనల సహితముగా; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా శ్రీకృష్ణునికి బ్రాహ్మణుడు రుక్మిణీదేవి పంపిన సందేశం, ఆమె అందచందాది విశేషాలు వివరంగా చెప్పి “ఏం చేయాలో చూడు” అని విన్నవించి, కుండిన పుత్రిని వర్ణిస్తూ ఇంకా ఇలా చెప్పాడు . .

తెభా-10.1-1713-సీ.
"ల్లవ వైభవాస్పదములు పదములు-
నకరంభాతిరస్కారు లూరు;
రుణప్రభామనోరములు గరములు-
కంబు సౌందర్య మంళము గళము;
హిత భావాభావ ధ్యంబు మధ్యంబు-
క్షురుత్సవదాయి న్నుదోయి;
రిహసితార్ధేందు టలంబు నిటలంబు-
జితమత్త మధుకరశ్రేణి వేణి;

తెభా-10.1-1713.1-ఆ.
భావజాశుగముల ప్రాపులు చూపులు;
కుసుమశరుని వింటికొమలు బొమలు;
చిత్తతోషణములు చెలువ భాషణములు;
లజనయన ముఖము చంద్రసఖము.

టీక:- పల్లవ = చిగురాకుల యొక్క; వైభవ = గొప్పదనములకు; ఆస్పదములు = ఉనికిపట్లు; పదములున్ = పాదములు; కనక = బంగారపు; రంభా = అరటిబోదెలను; తిరస్కారులు = తిరస్కరించునవి; ఊరులు = తొడలు; అరుణ = ఎఱ్ఱనైన; ప్రభా = కాంతులతో; మనోహరములు = అందమైనవి; కరములు = చేతులు; కంబు = శంఖము వంటి; సౌందర్య = చక్కదనముచేత; మంగళము = శుభప్రదమైనది; గళము = కంఠము; మహిత = గొప్ప; భావాభావమధ్యంబు = బహుసన్ననిది {భావాభావమధ్యంబు - భావ(ఉందో) అభావ (లేనిది) మధ్యంబు (సందేహాస్పదమైనది), ఉందో లేదో తెలియనిది}; మధ్యంబు = నడుము; చక్షుః = కన్నులకు; ఉత్సవ = సంతోషమును; దాయి = ఇచ్చునవి; చన్ను = స్తనముల; దోయి = ద్వయము; పరిహసిత = ఎగతాళి చేయబడిన; అర్ధేందు = అర్ధచంద్రుల యొక్క; పటలంబు = సమూహము కలది; నిటలంబు = నుదురు; జిత = గెలువబడిన; మధుకర = తుమ్మెదల; శ్రేణి = సమూహములు వంటిది; వేణి = జడ
భావజ = మన్మథుని {భావజుడు - సంకల్పము చేత పుట్టువాడు, మన్మథుడు}; ఆశుగముల = బాణముల యొక్క; ప్రాపులు = ఉనికిపట్లు; చూపులు = దృష్టులు; కుసుమశరుని = మన్మథుని {కుసుమశరుడు - పుష్ప భాణములు కలవాడు, మన్మథుడు}; వింటి = ధనుస్సు యొక్క; కొమలు = భాగములు; బొమలు = కనుబొమ్మలు; చిత్త = మనస్సును; తోషణములు = సంతోషింపజేయునవి; చెలువ = అందగత్తె; భాషణములు = మాటలు; జలజనయన = పద్మాక్షి; ముఖము = ముఖము; చంద్ర = చంద్రబింబమునకు; సఖము = మిత్రము, వంటిది.
భావము:- “ఆ పద్మాక్షి రుక్మిణీదేవి పాదాలు చిగురాకుల వంటివి. తొడలు బంగారు అరటిబోదెల కన్న చక్కటివి. చేతులు ఎఱ్ఱటి కాంతులతో మనోహరమైనవి. అందమైన కంఠం శుభకరమైన శంఖం లాంటిది. నడుము ఉందా లేదా అనిపించేంత సన్నటిది. స్తనాల జంట కనువిందు చేస్తుంది. నుదురు అర్థచంద్రుడి కంటె అందమైనది. జడ మత్తెక్కిన తుమ్మెదల బారు లాంటిది. చూపులు మన్మథ బాణాలకి సాటైనవి. కనుబొమలు మన్మథుని వింటి కొమ్ములు. ఆ సుందరి పలుకులు మనసును సంతోషపెట్టేవి. ఆమె మోము చంద్రబింబం లాంటిది.

తెభా-10.1-1714-ఉ.
యెలనాగ నీకుఁ దగు; నంగనకుం దగు దీవు మా యుపా
ధ్యాయుల యాన పెండ్లి యగుఁ; ప్పదు జాడ్యములేల? నీవు నీ
తోమువారిఁ గూడుకొని తోయరుహాననఁ దెత్తుగాని వి
చ్చేయుము; శత్రులన్ నుఱుముజేయుము; చేయుము శోభనం బిలన్."

టీక:- ఆ = ఆ యొక్క; ఎలనాగ = యువతి {ఎలనాగ - లేత వయస్కురాలు, వనిత}; నీకున్ = నీకు; తగున్ = సరిపడును; అంగన = వనిత {అంగన - మంచి అంగములు కలామె, స్త్రీ}; కున్ = కు; తగుదువు = సరిపడుదువు; ఈవు = నీవు; మా = మా యొక్క; ఉపాధ్యాయుల = గురువుల మీద; ఆన = ఒట్టు; పెండ్లి = వివాహము; అగున్ = జరుగును; తప్పదు = తథ్యమిది; జాడ్యములు = ఆలసించుటలు; ఏలన్ = ఎందుకు; నీవున్ = నీవు; నీ = నీ యొక్క; తోయమువారిన్ = సేనతో; కూడుకొని = కలిసి; తోయరుహాననన్ = పద్మాక్షిని; తెత్తుగాని = తీసుకువచ్చెదవుగాని; విచ్చేయుము = రమ్ము; శత్రులన్ = విరోధులను; నుఱుము = పొడిగా, మర్ధించుట; చేయుము = చేయుము; చేయుము = చేయుము; శోభనంబు = శుభములను; ఇలన్ = లోకమునకు.
భావము:- ఆ యువతి రుక్మణీదేవి నీకు తగినది. ఆమెకు వాసుదేవ! నీవు తగిన వాడవు. మా గురువులము ఇస్తున్న ఆనతి ఇది. మీ పెళ్ళి జరిగి తీరుతుంది. ఇంక ఆలస్యం ఎందుకు. నువ్వు నీ సేనతో కలిసి కన్యను తీసుకొచ్చెదవుగాని రమ్ము. శత్రువుల్ని నుగ్గునుగ్గుచేయుము. లోకానికి శుభాలు కలిగించుము.”