పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/ముచికుందుడు స్తుతించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-10.1-1655-క.
"నీ మాయఁ జిక్కి పురుష
స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు; వి
త్తాయ గృహగతమై సుఖ
తాసమై కామవంచితంబై యీశా!

టీక:- నీ = నీ యొక్క; మాయన్ = మాయ యందు; చిక్కి = చిక్కుకొని; పురుష = మగవారు; స్త్రీ = ఆడవారు అను; మూర్తిక = ఆకృతులు కలవారైన; జనము = జనసమూహము; నిన్నున్ = నిన్ను; సేవింపదు = కొలువదు; విత్త = ధనము అనెడి; ఆమయ = తెగులు కల; గృహ = నివాసములను; ఆగతము = పొందినది; ఐ = అయ్యి; సుఖ = సుఖము లనెడి; తామసము = చీకట్లు కలది; ఐ = అయ్యి; కామ = విషయాభిలాషలచే {కామము - ఇంద్రియ విషయములైన ఆహార నిద్రా భయ సంగమ పుష్ప చందనాదుల యెడ లాలస, విషయాసక్తి}; వంచితంబు = వంచింపబడినది; ఐ = అయ్యి; ఈశా = సర్వనియమకస్వామీ.
భావము:- “సర్వేశ్వరా! నీ మాయచేత మోహితులై సుఖలేశం తోపించు విత్తము, గృహాదులు మీద తగులం పొంది వారు వంచితులు అవుతూ, స్త్రీలును పురుషులును నిన్ను భజింపరు.

తెభా-10.1-1656-ఉ.
పూని యనేకజన్మములఁ బొంది తుదిం దన పుణ్యకర్మ సం
తాము పేర్మిఁ గర్మ వసుధాస్థలిఁ బుట్టి ప్రపూర్ణదేహుఁడై
మావుఁడై గృహేచ్ఛఁబడు మందుఁ డజంబు తృణాభిలాషి యై
కాక పోయి నూతఁబడు కైవడి నీ పదభక్తిహీనుఁడై.

టీక:- పూని = యత్నించి; అనేక = అసంఖ్యాకములైన; జన్మములన్ = పుట్టుకలను {అనేక జన్మములు - పునరపి జననం పునరపి మరణం పునరపి జననీజఠరే శయనం (ఆచార్యోక్తి) అను విధముగ అసంఖ్యాక జన్మలెత్తుట}; పొంది = పొంది; తుదిన్ = చివరకు; తన = తన యొక్క; పుణ్య = మంచి; కర్మ = కర్మముల; సంతానము = ఫలితములు; పేర్మిన్ = కూడుటచేత; కర్మవసుధా = కర్మభూమి భరతఖండంలో {కర్మవసుధ (కర్మభూమి) - శ్లో. గాయంతి దేవాషు కిలగీతకాని ధన్యాస్తు యే భారతభూమిభాగే, స్వర్గాపవర్గాస్య ఫలార్జనాయ భవంతి భూయః పురుషాస్సురాత్వాత్. అను ప్రమాణముచేత కర్మభూమి అంటే భారతభూమి, భరతఖండము}; ప్రపూర్ణ = మంచి నిండైన; దేహుడు = దేహము కలవాడు; ఐ = అయ్యి; మానవుడు = మానవునిగా; ఐ = జన్మించినవాడు అయ్యి; గృహేచ్ఛన్ = సాంసారిక వాంఛ లందు; పడు = తగులము పొందు; మందుడు = తెలివితక్కువవాడు; అజంబు = గొఱ్ఱె; తృణ = గడ్డిని; అభిలాషి = కోరునది; ఐ = అయ్యి; కానక = చూసుకోకుండ; పోయి = వెళ్ళివెళ్ళి; నూతన్ = నూతిలో; పడు = పడిపోయెడి; కైవడిన్ = విధమున; నీ = నీ యొక్క; పద = పాదము లందు; భక్తి = భక్తి; హీనుడు = లేనివాడు; ఐ = అయ్యి.
భావము:- జీవి పలు జన్మములు ఎత్తియెత్తి తుదకు తన పుణ్యకార్యముల ఫలంగా కర్మక్షేత్రమైన దేశంలో పూర్ణ దేహంతో మానవుడుగా పుడతాడు. పుట్టి కూడా మూఢత వలన నీ పదభక్తి లేనివాడై మేక గడ్డి మీది ఆశతో కనులు కానక వెళ్ళివెళ్ళి నూతిలో పడినట్లు గృహాదులు అందలి వాంఛలకు వశుడై చెడుతున్నాడు.

తెభా-10.1-1657-క.
రుణీ పుత్ర ధనాదుల
రిగి మహారాజ్యవిభవ దమత్తుఁడనై
తను లుబ్ధుఁడ నగు నా
యఁగ బహుకాల మీశ! యాఱడుఁబోయెన్.

టీక:- తరుణీ = స్త్రీలు; పుత్ర = కుమారులు; ధనా = ధనము; ఆదులన్ = మున్నగువాని యందు; మరిగి = వ్యసనము చెంది; మహా = గొప్ప; రాజ్య = ప్రభుత్వము వలని; విభవ = వైభముల; మద = మదముచేత; మత్తుడను = ఒడలు తెలియనివాడను; ఐ = అయ్యి; నర = మానవ; తను = శరీరము నందు; లుబ్ధుడను = లాలస కలవాడను; అగు = ఐన; నా = నా; కున్ = కు; అరయగన్ = విచారించి చూసినచో; బహు = చాలా; కాలము = కాలము; ఈశ = భగవంతుడా; ఆఱడిపోయెన్ = వ్యర్ధమైపోయెను.
భావము:- పరమేశ్వరా! ఆలుబిడ్డలు, డబ్బు, మొదలైన వాటి మీద తగులము పొంది, మహారాజ్య సంపత్తితో మదించిన మనసు కలవాడనై ఈ మానవ శరీరము మీది పేరాస కల వాడను అయిన నాకు వ్యర్థముగా చాలాకాలం గడచిపోయింది.

తెభా-10.1-1658-క.
కుడ్య సన్నిభం బగు
టుల కళేబరముఁ జొచ్చి నపతి నంచుం
టు చతురంగంబులతో
నిటునటుఁ దిరుగుదును నిన్ను నెఱుఁగమి నీశా!

టీక:- ఘట = మట్టికుండతోను; కుడ్య = గోడతోను; సన్నిభంబు = పోల్చదగినది; అగు = ఐన; చటుల = చంచలమైన; కళేబరము = అత్మ వినా దేహము; చొచ్చి = ప్రవేశించి; జనపతిన్ = నేను రాజును; అంచున్ = అని; పటు = దిట్టమైన; చతురంగంబుల = చతురంగబలముల {చతురంగంబులు - దేహమురీత్యా 1పంచభూతములు 2జ్ఞానేంద్రియములు 3కర్మేంద్రియములు 4అంతరంగచతుష్కము అనెడి నాలుగు అంగములు కలది (ఇంకొక విధముగ) యుద్ధ సేన రీత్యా 1గజ 2తురగ 3రథ 4పదాతులను నాలుగు విభాగములు కల సేన}; తోన్ = తోటి; ఇటునటు = అటునిటు; తిరుగుదును = సంచరింతును; నిన్నున్ = నిన్ను; ఎఱుగమిన్ = తెలియకపోవుటచేత; ఈశా = భగవంతుడా.
భావము:- ప్రభూ! నిన్ను తెలుసుకోకపోవడంతో; కుండ గోడ వలె జడమైన చంచలమైన దేహంలో ప్రవేశించి, నేను రాజు నంటూ రథ, గజ, తురగ, పదాతులతో విఱ్ఱవీగుతూ, భూమి మీద అటునిటు తిరుగుతున్నాను.

తెభా-10.1-1659-ఆ.
వివిధ కామ లోభ విషయ లాలసు మత్తు
ప్రమత్తవృత్తి నంతకుండ
వైన నీవు వేళ రసి త్రుంతువు సర్ప
మొదిఁగి మూషకంబు నొడియు నట్లు.

టీక:- వివిధ = అనేక రకము లైన; కామ = కోరికలు {కామము - వస్తువులు ధనము స్త్రీలాదులు కావాలనెడి చిత్తవృత్తి}; లోభ = పిసినారితనములు {లోభము - వస్తువులు ధనాదులందు అపరిమితంగా సంపాదించుట విడువలేకపోవుట అనెడి చిత్తవృత్తి, పిసినారితనము}; విషయ = ఇంద్రియార్థము లందు; లాలసున్ = అధికేచ్ఛ కలవాడని; మత్తున్ = ఏమరినవాడని; అప్రమత్తక = ఏమరిపాటులేని; వృత్తిన్ = వ్యాపారములతో; అంతకుండవు = యముడుగా ఐనవాడవు; ఐన = అయిన; నీవు = నీవు; వేళ = తగిన సమయము; అరసి = తెలిసి; త్రుంతువు = చంపెదవు; సర్పము = పాము; ఒదిగి = పొంచి ఉండి; మూషకంబున్ = ఎలుకను; ఒడియున్ = ఒడిసిపట్టు; అట్లు = విధముగా.
భావము:- అంతులేని కోరికలతో శబ్దాది విషయము లందు ఆశ వహించి ఏమఱి ఉండగా. నీవు మాత్రం ఏమరుపాటు చెందక అంతక స్వరూపుడవై, పాము కనిపెట్టి ఉండి తటాలున ఎలుకను పట్టినట్లు, సమయం రాగానే పట్టి విషయలాలసులను హరిస్తావు.

తెభా-10.1-1660-క.
వరసంజ్ఞితమై రథ
రిసేవితమైన యొడలు కాలగతిన్ భీ
మృగభక్షితమై దు
స్తవిట్క్రిమిభస్త్రిసంగతం బగు నీశా!

టీక:- నరవర = రాజు అని; సంజ్ఞితము = పిలువబడునది; ఐ = అయ్యి; రథ = రథములచేత; కరి = ఏనుగులచేత; సేవితము = కొలువబడునది; ఐన = అయిన; ఒడలు = దేహము; కాల = కాలము; గతిన్ = గడుచుటచేత; భీకర = భయంకరమైన; మృగ = జంతువులచేత; భక్షితము = తినబడునది; ఐ = అయ్యి; దుస్తర = దాటరాని; విట్ = మలము; క్రిమి = పురుగులు కల; భస్త్రి = తోలుతిత్తి; సంగతంబు = కూడినది; అగున్ = అగును; ఈశా = ఈశ్వరుడా.
భావము:- మాధవా! రాజును అని పేరు వహించి రథాల మీద, ఏనుగుల మీద ఎక్కి తిరిగిన ఈ శరీరం కాలవశమై భయంకరము లైన జంతువులచే భక్షింపబడటం వలన పురీషమనీ, మురిగిపోతే పురుగులనీ, కాలిపోతే బూడిద అనీ వ్యవహరింపబడుతోంది.

తెభా-10.1-1661-ఆ.
కల దిశలు గెలిచి ములు వర్ణింపంగఁ
జారుపీఠ మెక్కి సార్వభౌముఁ
డైన సతులగృహము లందుఁ గ్రీడాసక్తి
వృత్తినుండు; నిన్ను వెదకలేఁడు.

టీక:- సకల = సమస్తమైన, అన్ని; దిశలు = దిక్కుల, వైపుల రాజ్యములను; గెలిచి = జయించి; సములు = సాటివారు; వర్ణింపంగ = శ్లాఘించుచుండగా; చారు = అందమైన; పీఠము = సింహాసనమును; ఎక్కి = అభిషిక్తుడై; సార్వభౌముడు = చక్రవర్తి {సార్వభౌముడు - సర్వభూమికి ప్రభువు, చక్రవర్తి}; ఐనన్ = అయినప్పటికి; సతుల = భార్యల యొక్క; గృహములు = నివాసములు; అందున్ = లో; క్రీడన్ = రమించుటందు; ఆసక్తి = అభిలాష కల; వృత్తిన్ = నడవడిక కలిగి; ఉండున్ = ఉండును; నిన్నున్ = నిన్ను; వెదకలేడు = విచారింపజాలడు.
భావము:- అన్ని దిక్కులనూ జయించి సాటివారు కీర్తిస్తుంటే ఉన్నత పీఠం అధిష్ఠించిన చక్రవర్తి అయినప్పటికీ ఆడవారి మందిరాలలో కామసుఖాలు అనుభవిస్తాడే తప్ప నిన్ను అన్వేషించ లేడు.

తెభా-10.1-1662-ఆ.
మానసంబు గట్టి హితభోగంబులు
మాని యింద్రియముల దము లడఁచి
పము చేసి యింద్రయ గోరుఁ గాని నీ
మృత పదముఁ గోరఁ జ్ఞుఁ డీశ!

టీక:- మానసంబున్ = మనస్సును; కట్టి = స్వాధీనముచేసికొని {మనసుకట్టి - మనసును ఇంద్రియ వ్యాపారములందు ప్రవర్తింపనీయక నిలిపికొనుట, మనసును స్వాధీనమున ఉంచుకొనుట}; మహిత = అధికమైన; భోగంబులున్ = భోగములను; మాని = విడిచిపెట్టి; ఇంద్రియముల = ఇంద్రియముల యొక్క; మదములు = గర్వమును, విజృంభణ; అడచి = అణిచివేసి; తపమున్ = తపస్సు; చేసి = చేసి; ఇంద్రియతయ = ఇంద్రపదవి; కోరున్ = అపేక్షించును; కాని = తప్పించి; నీ = నీ యొక్క; అమృతపదమున్ = మోక్షస్థానమును; కోరడు = కోరుకొనడు; అజ్ఞుడు = తెలివిమాలినవాడు; ఈశ = పరమేశ్వరుడా.
భావము:- పరమేశా! జ్ఞానహీనుడు మనస్సును బంధించి, గొప్ప భోగములను విడనాడి, ఇంద్రియాటోపమును అణచివేసి, తపస్సుచేసి; ఇంద్రపదవి అభిలషిస్తాడే కాని నీ అమృత స్థానమును కోరుకోడు.

తెభా-10.1-1663-సీ.
సంసారి యై యున్న నునకు నీశ్వర!-
నీ కృప యెప్పుడు నెఱయఁ గల్గు
ప్పుడ బంధంబు న్నియుఁ దెగిపోవు-
బంధమోక్షంబైనఁ బ్రాప్త మగును
త్సంగమంబు; సత్సంగమంబున నీదు-
క్తి సిద్ధించు; నీ క్తివలన
న్ముక్తి యగు; నాకు త్సంగమునకంటె-
మును రాజ్యబంధ నిర్మూలనంబు

తెభా-10.1-1663.1-తే.
లిగినది దేవ! నీ యనుగ్రహము గాదె?
కృష్ణ! నీ సేవగాని తక్కినవి వలదు;
ముక్తి సంధాయి వగు నిన్ను ముట్టఁ గొలిచి
యాత్మబంధంబు గోరునే యార్యుఁ డెందు?

టీక:- సంసారి = కుటుంబీకుడు, గృహస్తు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; జనున్ = వాని; కున్ = కి; ఈశ్వర = భగవంతుడా; నీ = నీ యొక్క; కృప = దయ; ఎప్పుడున్ = ఎప్పుడైతే; నెఱయన్ = పూర్ణముగా; కల్గున్ = లభించునో; అప్పుడ = అప్పుడే; బంధంబులు = సంసారబంధములు; అన్నియున్ = అన్నీ; తెగిపోవున్ = తెగిపోవును; బంధ = తగులములనుండి; మోక్షంబు = విముక్తి; ఐనన్ = జరిగినచో; ప్రాప్తము = లభించుట; అగును = జరుగును; సత్సంగమంబు = సత్పురుషులతో కూడిక; సత్సంగమంబునన్ = సత్పురుషసహవాసంతో; నీదు = నీమీది; భక్తి = భక్తి; సిద్ధించున్ = కలుగును; నీ = నీమీది; భక్తి = భక్తి; వలన = వలన; సత్ = సత్యమైనట్టి {సన్ముక్తి - మోక్షము, శ్లో. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః....భజగోవిందం... (ఆదిశంకరాచార్యులవారు)}; ముక్తి = మోక్షము; అగున్ = కలుగును; నా = నా; కున్ = కు; సత్సంగమున్ = సత్పురుషసాంగత్యము; కంటెన్ = కంటె; మును = ముందుగా; రాజ్య = రాజ్యాధికార; బంధ = తగులము యొక్క; నిర్మూలనంబు = మూలమునుండిపోవుట; కలిగినది = కలుగుట.
దేవ = భగవంతుడా; నీ = నీ యొక్క; అనుగ్రహము = దయచూపుటచేత; కాదె = కాదా, అవును; కృష్ణ = కృష్ణ; నీ = నీ యొక్క; సేవ = భక్తి; కాని = తప్పించి; తక్కినవి = మిగిలినవి ఏవి; వలదు = వద్దు; ముక్తి = మోక్షమును; సంధాయి = కలుగజేయువాడవు; అగు = ఐన; నిన్నున్ = నిన్ను; ముట్టను = చేరునట్లు; కొలిచి = సేవించి; ఆత్మ = తనను; బంధంబున్ = సంసారబంధంలోపడుట; కోరునే = వాంఛించునా, వాంఛింపడు; ఆర్యుడు = జ్ఞాని; ఎందున్ = ఎన్నడైనను.
భావము:- అచ్యుతా! నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే సంసారమందు పరిభ్రమిస్తున్న పురుషుడికి ఆ సంసారబంధాలు సడలిపోతాయి. సంసార నివృత్తి కలిగినప్పుడు సత్పురుషులతో సహవాసం లభిస్తుంది. సత్సంగం చేత నీయందు భక్తి సిద్ధిస్తుంది. నీయందు నెలకొన్న భక్తి వలన ముక్తి చేకూరుతుంది. నాకు భాగవతోత్తముల సాంగత్యమునకు పూర్వమే రాజ్యపాశ నిర్మూలనం జరిగింది. ఇదంతా నీకృప కృష్ణా! నాకు నీ పాదసేవనం తప్ప తక్కినవేమీ వద్దు. విజ్ఞుడైనవాడు ముక్తిదాయకుడ వైన నిన్నుసేవించి తనకు ప్రతిబంధకా లైన శబ్దాది విషయభోగాలను కోరుకోడు కదా!

తెభా-10.1-1664-వ.
కావున రజస్తమస్సత్వగుణంబుల ననుబంధంబు లగు నైశ్వర్య శత్రు మరణ ధర్మాది విశేషంబులు విడిచి యీశ్వరుండును విజ్ఞాన ఘనుండును, నిరంజనుండును, నిర్గుణుండును, నద్వయుండును నైన పరమపురుషుని ని న్నాశ్రయించెదఁ; జిరకాలంబు కర్మఫలంబులచేత నార్తుండనై క్రమ్మఱం దద్వాసనల సంతుష్టుండనై తృష్ణం బాయక శత్రువులైన యింద్రియంబు లాఱింటిని గెలువలేని నాకు శాంతి యెక్కడిది? విపన్నుండ నైన నన్ను నిర్భయుం జేసి రక్షింపు” మనిన ముచికుందునికి హరి యిట్లనియె.
టీక:- కావున = కనుక; రజః = రజోగుణము; తమః = తమోగుణము; సత్త్వ = సాత్వికగుణము అనెడి; గుణంబులన్ = గుణములచేత; అనుబంధంబులు = సంబంధించి కలుగునవి; అగు = ఐన; ఐశ్వర్య = సంపదలు; శత్రు = పగవాని; మరణ = చావు; ధర్మ = పుణ్యము; ఆది = మున్నగు; విశేషంబులును = భేదములు; విడిచి = వదలిపెట్టి; ఈశ్వరుండును = సర్వకర్తృత్వము కలవాడు; విజ్ఞాన = అపరోక్షజ్ఞానముచేత; ఘనుండును = గొప్పవాడు; నిరంజనుండును = దోదృష్టిలేనివాడు; నిర్గుణుండును = త్రిగుణాతీతుడు; అద్వయుండును = ఏకత్వ మైనవాడు; ఐన = అయినట్టి; పరమపురుషుని = ఉత్కృష్టమైన పురుషుని; నిన్నున్ = నిన్ను; ఆశ్రయించెదన్ = ఆశ్రయించెదను; కర్మ = త్రివిధకర్మల {త్రివిధ కర్మములు - పుణ్య పాప మిశ్ర కర్మలు}; ఫలంబుల్ = ఫలానుభవముల; చేతన = చేత; ఆర్తుండను = పీడింపబడినవాడను; ఐ = అయ్యి; క్రమ్మఱన్ = మరల; తత్ = వాని యందలి; వాసనలన్ = శేషావశిష్టానుభూతులచే; సంతుష్టుండను = సంతోషించినవాడను; ఐ = అయ్యి; తృష్ణన్ = లాలసలను; పాయక = విడువలేక; శత్రువులు = విరోధులు {అరిషడ్వర్గములు - 1కామ 2క్రోధ 3లోభ 4మద 5మోహ 6మాత్సర్యములు}; ఐన = అయినట్టి {ఇంద్రియషట్కము - 1శ్రోత్రము 2త్వక్కు 3చక్షుః 4జిహ్వ 5ఘాణము వీనిచేరికగల 6మనస్సు}; ఇంద్రియంబులు = యింద్రియార్థములు; ఆఱింటిని = ఆరింటిని (6); గెలువలేని = స్వాధీనముచేసికొనలేని; నా = నా; కున్ = కు; శాంతి = శాంతి; ఎక్కడిది = ఎక్కడున్నది, లేదు; విపన్నుండను = విపత్తు పొందినవాడను {విపన్నుడు - తాపత్రయములచేత విపత్తు పొందినవాడు}; ఐన = అయిన {తాపత్రయములు - 1ఆధ్యాత్మిక 2అధిభౌతిక 3ఆదిదైవికమైన తాపములు}; నన్నున్ = నన్ను; నిర్భయున్ = భయము లేనివానిగా; చేసి = చేసి; రక్షింపుము = కాపాడుము; అనినన్ = అనగా; ముచికుందుని = ముచికుందుడి; కిన్ = కి; హరి = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- కాబట్టి. సత్త్వము రజస్సు తమస్సు అను త్రిగుణాలను అనువర్తించు నట్టి ఐశ్వర్యము; శత్రు మరణము, ధర్మము ఇత్యాది విశేషములు అన్నింటినీ వదలి; నేను ఈశ్వరుడూ, విజ్ఞానఘనుడూ, మాయాకార్యము లైన రాగాదులు లేనివాడూ; త్రిగుణాలతో సంబంధము లేనివాడూ; తనంత తానే ఐన వాడూ; తన కంటే అధికుడు కలుగనివాడూ; పురుషులలో ఉత్తముడూ అయిన నిన్ను శరణు కోరుతున్నాను. బహుకాలం ప్రారబ్ధకర్మ ఫలము అనుభవిస్తూ దుఃఖితుడనై ఇంకా పూర్వజన్మ వాసనలచే సంతోషాన్ని పొందుతూ ఆశ వదలక శత్రువు లైన కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక, మనస్సు అనే ఆరు జ్ఞానేంద్రియాలను జయించలేని నాకు శాంతి ఎలా లభిస్తుంది? ఆపన్నుడ నైన నన్ను మన్నించి భయరహితుడిని కావించి కాపాడుము” అంటూ వేడుకొన్న ముచుకుందుడితో మాధవుడు ఇలా అన్నాడు

తెభా-10.1-1665-ఉ.
"మంచిది నీదు బుద్ధి నృపమండన! నీవు పరార్థ్య మెట్లు వ
ర్తించిన నైనఁ గోరికల దిక్కునఁ జిక్కవు మేలు నిర్మలో
దంచితవృత్తి నన్ గొలుచు న్యు లబద్ధులు నెట్లు నీకు ని
శ్చంలభక్తి గల్గెడిని ర్వము నేలుము మాననేటికిన్.

టీక:- మంచిది = యోగ్యమైనది; నీదు = నీ యొక్క; బుద్ధి = ప్రజ్ఞ; నృపమండన = రాజశ్రేష్ఠుడా; నీవు = నీవు; పర = ముక్తి; అర్థ్యము = కోసము; ఎట్లు = ఏవిధముగ; వర్తించిన = మెలగుట; ఐనన్ = చేసినను; కోరికలన్ = కోరికలందు; దిక్కునన్ = వైపునకు; చిక్కవు = తగుల్కొనవు; మేలు = మంచిది; నిర్మల = నిర్మలమైన; ఉదంచిత్ = చక్కనైన; వృత్తిన్ = నడవడికతో; నన్ = నన్ను; కొలుచు = సేవించు; ధన్యులు = కృతార్థులు; అబద్ధులు = బద్ధులు కానివారు, ముక్తులు; ఎట్లున్ = ఎలాగైనా సరే; నీ = నీ; కున్ = కు; నిశ్చంచల = చలించని; భక్తి = భక్తి; కల్గెడిని = కలుగును; సర్వమున్ = ఎల్లలోకములను; ఏలుము = పాలింపుము; మానన్ = మానివేయుట; ఏటికిన్ = ఎందుకు.
భావము:- రాజులకు అలంకార మైనవాడా! నీ బుద్ధి మంచిది నీవు ఇతరుల కోసము ఎలా ప్రవర్తించినప్పటికీ, కోరికలకు ప్రలోభం చెందలేదు. నిర్మల మనస్సుతో నన్ను సేవించువారు ధన్యాత్ములు. వారు సంసారబద్ధులు కానేరరు. నీకు నా మీద దృఢమైన భక్తిని అనుగ్రహిస్తున్నాను, నీవు ఏదీ మానవలసిన పని లేదు, నా యందు మనసుంచి సమస్తం పరిపాలించు.

తెభా-10.1-1666-వ.
నరేంద్రా! నీవు తొల్లి క్షత్రధర్మంబున నిలిచి, మృగయావినోదంబుల జంతువుల వధియించినాఁడవు; తపంబునఁ దత్కర్మ విముక్తుండవై తర్వాతి జన్మంబున సర్వభూత సఖిత్వంబు గలిగి, బ్రాహ్మణ శ్రేష్ఠుండవై నన్నుఁ జేరెద” వని వీడ్కొలిపిన హరికిఁ బ్రదక్షింబు వచ్చి నమస్కరించి గుహ వెడలి సూక్ష్మప్రమాణ దేహంబులతో నున్న మనుష్య పశు వృక్షలతాదులం గని కలియుగంబు ప్రాప్తం బగు నని తలంచి యుత్తరాభిముఖుండై తపోనిష్ఠుం డగుచు సంశయంబులు విడిచి, సంగంబులు పరిహరించి విష్ణుని యందుఁ జిత్తంబు చేర్చి గంధమాదనంబు ప్రవేశించి మఱియు నరనారాయణ నివాసంబైన బదరికాశ్రమంబు చేరి, శాంతుండై హరి నారాధించుచుండె, నిట్లు ముచికుందుని వీడ్కొని.
టీక:- నరేంద్రా = రాజా; నీవు = నీవు; తొల్లి = పూర్వము; క్షత్రధర్మంబున = రాజధర్మమునందు; నిలిచి = ఉండి; మృగయావినోదంబుల = వేట లందు; జంతువులన్ = అనేక జంతువులను; వధియించినాడవు = చంపితివి; తపంబునన్ = తపస్సు చేయుట ద్వారా; తత్ = ఆయా; కర్మ = కర్మములనుండి; విముక్తుండవు = విడువబడినవాడవు; ఐ = అయ్యి; తర్వాతి = తరువాత; జన్మంబునన్ = పుట్టుక యందు; సర్వ = ఎల్ల; భూత = జీవుల యందలి; సఖిత్వంబు = మైత్రి; కలిగి = ఉండి; బ్రాహ్మణ = విప్ర; శ్రేష్ఠుండవు = ఉత్తముడవు; ఐ = అయ్యి; నన్నున్ = నన్ను; చేరెదవు = పొందగలవు; అని = అని; వీడ్కొలిపిన = పోవ ననుమతివ్వగా; హరి = కృష్ణుని; కిన్ = కి; ప్రదక్షిణంబు = ప్రదక్షిణలు; వచ్చి = చేసి; నమస్కరించి = నమస్కారము చేసి; గుహన్ = కొండగుహనుండి; వెడలి = బయటకు వచ్చి; సూక్ష్మ = కురచ, పొట్టి; ప్రమాణ = కొలతలు గల; దేహంబుల = దేహముల; తోన్ = తో; ఉన్న = ఉన్నట్టి; మనుష్య = మానవులు; పశు = జంతువులు; వృక్ష = చెట్లు; లత = లతలు; ఆదులన్ = మున్నగువానిని; కని = చూసి; కలియుగంబు = కలియుగము; ప్రాప్తంబగును = వచ్చి ఉండును; అని = అని; తలంచి = ఎంచుకొని; ఉత్తరా = ఉత్తర దిక్కు వైపునకు; అభిముఖుండు = పోవువాడు; ఐ = అయ్యి; తపః = తపస్సు నందు; నిష్ఠుండు = నిష్ఠ కలవాడు; అగుచు = అగుచు; సంశయంబులు = సందేహములు; విడిచి = వదలిపెట్టి; సంగంబులు = బంధాలు; పరిహరించి = తొలగించి; విష్ణుని = విష్ణుమూర్తి; అందున్ = ఎడల; చిత్తంబున్ = మనసును; చేర్చి = లగ్నముచేసి; గంధమాదనంబున్ = గంధమాదనపర్వతము; ప్రవేశించి = ప్రవేశించి; మఱియున్ = తరువాత; నరనారాయణ = నరుడు నారాయణ మునుల; నివాసంబు = ఉనికిపట్టు; ఐన = అయిన; బదరికాశ్రమంబున్ = బదరికాశ్రమమును; చేరి = చేరి; శాంతుడు = శాంతివహించినవాడు; ఐ = అయ్యి; హరిన్ = విష్ణుమూర్తిని; ఆరాధించుచున్ = పూజించుతు; ఉండెన్ = ఉండెను; ఇట్లు = ఈ విధముగ; ముచికుందుని = ముచికుందుని; వీడ్కొని = పంపించి.
భావము:- ఓ రాజోత్తమా! పూర్వం నీవు క్షాత్రధర్మం అవలంబించి వేటమొదలైన వేడుకలతో జంతువులను చంపావు. కనుక, తపస్సు చేసి ఆ పాపం బాపుకో. మరుసటి జన్మలో బ్రాహ్మణుడవై ప్రాణులందు మైత్రి కలిగి నన్ను పొందగలవు.” అని శ్రీహరి అతనికి సెలవు ఇచ్చాడు. ముచుకుందుడు మురవైరికి ప్రదక్షిణంచేసి, ప్రణమిల్లి, గుహనుంచి వెలుపలికి వచ్చాడు. అతడు మనుష్యులు పశువులు చెట్లు తీగలు అల్పపరిమాణాలై ఉండడం చూసాడు. కలియుగం రాబోతున్నదని తెలిసికొని, ఉత్తరదిక్కుకు బయలుదేరి వెళ్ళాడు. ఆయన తపోదీక్ష వహించి అనుమానాలు వదలిపెట్టి అన్నిటి యందు ఆసక్తి మాని శ్రీహరి మీద మనసు లగ్నంచేసి గంధమాదన పర్వతాన్ని ప్రవేశించాడు. అక్కడ నుండి నరనారాయణులకు నెలవైన బదరికాశ్రమాన్ని చేరి శాంతుడై విష్ణుమూర్తిని ఆరాధించసాగాడు.

తెభా-10.1-1667-శా.
చ్ఛిద్రప్రకట ప్రతాపరవిచే నాశాంతరాళంబులంన్
బ్రచ్ఛాదించుచుఁ గ్రమ్మఱన్ మథురకుం ద్మాక్షుఁ డేతెంచి వీ
డాచ్ఛాదించి మహానిరోధముగఁ జక్రాకారమై యున్న యా
మ్లేచ్ఛవ్రాతము నెల్లఁ ద్రుంచె రణభూమిం బెంపు సొంపారఁగన్.

టీక:- అచ్ఛిద్ర = ఎడతెగని; ప్రకట = ప్రసిద్ధమైన; ప్రతాప = తేజస్సు అనెడి; రవి = సూర్యునిచే; చేన్ = చేత; ఆశా = దిక్కుల; అంతరాళంబులన్ = అంతములవరకు; ప్రచ్ఛాదించుచున్ = చక్కగా కప్పుచు; క్రమ్మఱన్ = మరల; మథుర = మథురాపట్టణమున; కున్ = కు; పద్మాక్షుడు = కృష్ణుడు; ఏతెంచి = వచ్చి; వీడున్ = పట్టణమును; ఆచ్ఛాదించి = కమ్ముకొని; మహా = మిక్కిలి; నిరోధము = నిర్బంధము; కన్ = అగునట్లు; చక్రాకారము = చక్రవ్యూహముగా; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; ఆ = ఆ యొక్క; మ్లేచ్ఛ = తురుష్కుల; వ్రాతమున్ = సమూహమును; ఎల్లన్ = అంతటిని; త్రుంచెన్ = సంహరించెను; రణభూమిన్ = యుద్ధక్షేత్రము నందు; పెంపు = గొప్పదనము; సోంపారగన్ = చక్కగా కనబడునట్లుగా.
భావము:- అలా ముచుకుందుడిని పంపిన, పద్మముల వంటి కన్నులు కల శ్రీకృష్ణుడు లోపం లేని ప్రతాపమనే భానుతేజంతో దిగంతరాలను కప్పివేస్తూ మరల మథురానగరానికి విచ్చేసాడు. అతడు పట్టణము అంతటినీ చక్రాకారంతో ఆవరించి ముట్టడించి ఉన్న యవనులు అందరినీ యుద్ధభూమిలో గొప్పదనం అతిశయించేలా నిర్మూలించాడు.