Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/బ్రహ్మ తర్కించుకొనుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-530-శా.
మందం గల్గిన వత్సబాలకులు నా మాయా గుహాసుప్తులై
యెందుం బోవరు; లేవ రిప్పుడును; వేఱే చేయ నా కన్యు లొం
డెందున్ లేరు; విధాతలుం బరులు; వీ రెవ్వార లెట్లైరొకో?
యెం దేతెంచిరొ కృష్ణుతో మెలఁగువా? రేఁడయ్యెడిన్ నేఁటికిన్.

టీక:- మందన్ = గుంపుగా; కల్గిన = ఉన్నట్టి; వత్స = దూడలు; బాలకులు = పిల్లలు; నా = నా యొక్క; మాయా = మాయ అనెడి; గుహా = గుహ యందుల; సుప్తులు = మునిగినవారు; ఐ = అయ్యి; ఎందున్ = ఎక్కడికిని; పోవరు = వెళ్ళలేరు; లేవరు = మేలుకొనలేరు; ఇప్పుడును = ఇప్పటికి కూడ; వేఱే = ఇంకొకలా; చేయన్ = చేయుటకు; నా = నా; కున్ = కు; అన్యులు = సాటివారు; ఒండు = ఇంకొకరు; ఎందున్ = ఎక్కడను; లేరు = లేరు; విధాతలున్ = సృష్టికర్తలు; పరులు = అన్యులు; వీరు = వీరు; ఎవ్వారు = ఎవరు; ఎట్లు = ఎలా; ఐరి = కలిగిరో, పుట్టిరో; ఒకో = ఏమో; ఎందున్ = ఎక్కడనుండి; ఏతెంచిరొ = వచ్చితిరో ఏమో; కృష్ణు = కృష్ణుని; తోన్ = తోపాటు; మెలగు = వర్తించెడి; వారు = వాళ్ళు; ఏడయ్యెడిన్ = ఎలా కలిగారు, ఏడాది అయిపోయింది; నేటికిన్ = ఇవాళ్టికి.
భావము:- ఈ గోకులంలో ఉండే బాలకులు దూడలూ అందరూ నా మాయా గుహలో ఇప్పటికీ అక్కడే నిద్రపోతున్నారు. ఎక్కడకీ పోలేదు. మళ్లీ ఎవరైనా సృష్టి చేసారు అనుకుందాం అంటే; నేను తప్ప సృష్టికర్తలు అయిన బ్రహ్మలు ఇంక ఎవరూ లేరు కదా. మరి వీరెవరు? ఎలా వచ్చారో? నేటికి భూలోకంలో ఏడాది గడిచింది. మరి ఈ కృష్ణుడితో విహరిస్తున్న వీళ్ళంతా ఎక్కడ నుంచి వచ్చారో?

తెభా-10.1-531-మత్త.
బ్రహ్మపంపునఁ గాని పుట్టదు ప్రాణిసంతతి యెప్పుడున్
బ్రహ్మ నొక్కఁడ గాని వేఱొక బ్రహ్మ లేఁడు సృజింపఁగా
బ్రహ్మ నేను సృజింప నొండొక బాలవత్సకదంబ మే
బ్రహ్మమందు జనించె? నొక్కట బ్రహ్మమౌ నది చూడఁగాన్.”

టీక:- బ్రహ్మ = బ్రహ్మదేవుని; పంపునన్ = అనుజ్ఞ ప్రకారము; కాని = తప్పించి; పుట్టదు = జనించదు; ప్రాణి = జీవ; సంతతి = జాలము; ఎప్పుడును = ఏ కాలము నందు; బ్రహ్మన్ = సృష్టికర్తను; ఒక్కడన్ = నే నొక్కడనే; కాని = తప్పించి; వేఱొక = మరొక; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; లేడు = లేడు; సృజింపగాన్ = సృష్టించుటకు; బ్రహ్మన్ = బ్రహ్మదేవుడను; నేను = నేను; సృజింపన్ = సృష్టిస్తుండగా; ఒండొక = మరింకొక, ప్రతిసృష్టి; బాల = పిల్లల; వత్స = దూడల; కదంబము = సమూహము; ఏ = ఏ యొక్క; బ్రహ్మ = బ్రహ్మదేవుని; అందున్ = వలన; జనించెన్ = పుట్టెను; ఒక్కటన్ = ఏక కాలమున; బహ్మము = మహాద్భుతము; ఔన్ = అయి ఉన్నది; అది = అది; చూడగాన్ = తరచి చూసినచో.
భావము:- బ్రహ్మదేవుడు సృష్టిస్తే గాని ఈ జీవరాసు లేవీ పుట్టవు కదా. సృష్టి చేసే బ్రహ్మదేవుడు అంటే నేనొక్కడినే గాని మరింకొకడు లేడు కదా. బ్రహ్మదేవుడుగా నేను సృష్టించిన గొల్లపిల్లలు దూడలు కాక వేరేవి ఎలా వచ్చాయి? వీటిని ఏ బ్రహ్మదేవుడు సృష్టించాడు? అందరిలోనూ ఒక్కటిగా ఉండే పరబ్రహ్మ కాదు కదా వీటి సృష్టికర్త?”

తెభా-10.1-532-వ.
అని యిట్లు సకలంబును సుకరంబుగ నెఱింగెడి నెఱవాది ముదుక యెఱుకగలప్రోడ వెఱంగుపడి గ్రద్దనఁ బెద్దప్రొద్దు తద్దయుం దలపోసి కర్జంబు మందల యెఱుంగక కొందలపడుచు నాందోళనంబున.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; సకలంబును = సమస్తమును; సుకరంబుగన్ = సుళువుగా, తేలికగా; ఎఱింగెడి = తెలిసికొనగల; నెఱవాది = చతురుడు; ముదుక = పరిణతి చెందినవాడు; ఎఱుక = జ్ఞానము; కల = కలిగిన; ప్రోడ = వివేకి, నేర్పరి; వెఱంగుపడి = ఆశ్చర్యపోయి; గ్రద్దన = శీఘ్రముగా; పెద్ద = చాలా; ప్రొద్దు = సేపు; తద్దయున్ = మిక్కిలిగా; తలపోసి = ఆలోచించి; కర్జంబు = చేయవలసిన పని; మందలన్ = మేరలను; ఎఱుంగక = తెలిసికొనలేక; కొందలపడుచున్ = కంగారుపడుతు; ఆందోళనంబునన్ = చలించిన మనసుతో;
భావము:- ఇలా ఈ గొల్లపిల్లలు దూడలు గురించి అలోచించుకుంటూ, సర్వస్వాన్ని తేలికగా తెలుసుకోవడంలో నేర్పరి అయిన అ పితామహుడు, ఆ జ్ఞానవృద్ధుడు, ఆ బ్రహ్మదేవుడు నివ్వెరపోయాడు. కంగారుపడి తనలోతాను అలోచించుకున్నా ఏం చేయాలో తెలియ లేదు. బిక్కమొగం వేసి, ఆందోళన పడసాగాడు.

తెభా-10.1-533-క.
మోము లేక జగంబుల
మోహింపఁగఁ జేయ నేర్చి మొనసిన విష్ణున్
మోహింపించెద ననియెడు
మోమున విధాత తాన మోహితుఁ డయ్యెన్.

టీక:- మోహము = భ్రమపడుటన్నది; లేక = లేకుండ; జగంబులన్ = లోకములను; మోహింపగన్ = మాయలో పడునట్లు; చేయన్ = చేయుటను; నేర్చిన = తెలిసినవాడై; మొనసిన = అతిశయించిన; విష్ణున్ = శ్రీమహావిష్ణువును; మోహింపించెదన్ = మోసము చేసెదను; అనియెడు = అనెడి; మోహమున = అజ్ఞానముచేత; విధాత = బ్రహ్మదేవుడు; తాన = అతనే; మోహితుడు = మోసపోయినవాడు; అయ్యెన్ = అయిపోయెను.
భావము:- శ్రీహరి మోహం అంటని వాడు. కానీ తాను సర్వ జగత్తులను మోహింపచేయ గల నేర్పరి. అటువంటి విష్ణువునే మోహింప చేద్దాం అనుకొని మోహపడిన బ్రహ్మదేవుడు తానే మోహంలో పడ్డవాడు అయిపోయాడు.

తెభా-10.1-534-తే.
గలు ఖద్యోతరుచి చెడుగిది రాత్రి
మంచు చీఁకటి లీనమై మాయుమాడ్కి
విష్ణుపై నన్యమాయలు విశద మగునె?
చెడి నిజేశుల గరిమంబుఁ జెఱుచుఁ గాక.

టీక:- పగలు = సూర్యుడు ఉండు నప్పుడు; ఖద్యోత = మిణుగురుపురుగుల; రుచి = కాంతి; చెడు = అణగిపోవు; పగిదిన్ = విధముగ; రాత్రి = రాత్రికాలము నందు; మంచు = మంచుతెరలు; చీకటిన్ = చీకట్లో; లీనము = కలిసిపోయినవి; ఐ = అయ్యి; మాయు = మాయ మగు; మాడ్కిన్ = విధముగ; విష్ణు = విష్ణుమూర్తి; పైన్ = మీద; అన్య = ఇతరుల; మాయలు = మాయలు; విశదమగునె = స్పష్టమగునా, పనిచేయునా, చేయవు; చెడి = నశించి; నిజ = తమని; ఈశులన్ = ప్రయోగించినవారల; గరిమంబున్ = యశస్సును, గొప్పదనం; చెఱుచున్ = పాడుచేయును; కాక = తప్పించి.
భావము:- పగటివేళ సూర్యుడి ముందు మిణుగురు పురుగుల కాంతి తేలిపోతుంది. రాత్రివేళ మంచు చీకటిలో లీనమై మాయమై పోతుంది. అలాగే మాయకే పుట్టినిల్లు అయిన విష్ణుమూర్తి మీద ఇతరుల మాయలు పనిచేస్తాయా? ఆ మాయలు సర్వం వస చెడి విడిపోతాయి. తమను ప్రయోగించిన వారి గౌరవాన్ని కూడా చెడగొట్టేస్తాయి తప్ప.

తెభా-10.1-535-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- అంతట...

తెభా-10.1-536-క.
"పుట్టితి; బుద్ధి యెఱింగితిఁ;
బుట్టించితి జగము; సగము పోయెను బ్రాయం;
బిట్టివి నూతన సృష్టులు
పుట్టుట లే; దౌర! యిట్టి బూమెలు భూమిన్."

టీక:- పుట్టితిన్ = జన్మించితిని; బుద్ధి = వివేకమును, జ్ఞానము; ఎఱింగితి = తెలుసుకొంటి; పుట్టించితిన్ = సృష్టించితిని; జగమున్ = లోకములను; సగము = అర్థభాగము; పోయెను = గడచిపోయినది; ప్రాయంబు = వయసు; ఇట్టివి = ఇలాంటి; నూతన = సరికొత్త; సృష్టులు = సృష్టింపబడుటలు; పుట్టుట = కలుగుట; లేదు = జరుగలేదు; ఔరా = అయ్యో; ఇట్టి = ఇలాంటి; బూమెలు = మాయలు; భూమిన్ = భూలోకమున.
భావము:- “ఏనాడో పుట్టాను. పుట్టిన తరువాత బుద్ధి తెలిసింది ఈ జగత్తు అంతటినీ పుట్టించాను. వయస్సు సగం గడచిపోయింది. ఇంతవరకూ ఇలా క్రొత్త సృష్టులు పుట్టడం ఎప్పుడూ ఎరుగను. ఔరా! నేను పుట్టించిన ఈ భూమి మీద నాకు అందని ఇన్ని మాయలా?”

తెభా-10.1-537-వ.
అని యిట్లు తలవాకిట వాణి గల పోఁడిమిచే వాఁడిమి కెక్కిన నలుమొగంబుల తక్కరిగొంటు పెనుదంట పలువెంటలైన తన మనంబున వితర్కించి, విచారించు నెడ, నతండు కనుగొనుచుండ నబ్బాలకులు మేఘశ్యాములును, హార కుండల కిరీట వనమాలికాభిరాములును, శ్రీవత్స మంగళాంగద నూపుర కనక కటక కంకణ కటిఘటిత కాంచీగుణోద్దాములును, నాపాదమస్తక తులసీదళదాములును, విలస దంగుళీయకస్తోములును, శంఖ చక్ర గదా కమల హస్తులును, జతుర్భుజప్రశస్తులును పీతకౌశేయవాసులును, చంద్రికాధవళహాసులును, కరుణాకటాక్షవీక్షణ విలాసులును, రవికోటిభాసులును, ననంత సచ్చిదానందరూప మహితులును, యణిమాదిగుణోపేతులును, విజాతీయభేదరహితులును, శ్రీమన్నారాయణ ప్రతిమాన విగ్రహస్వరూపులునై తమకుఁ బరతంత్రులగుచు నృత్తగీతాది సేవావిశేషంబులకుం జొచ్చి మెలంగుచు మూర్తిమంతంబు లయిన బ్రహ్మాదిచరాచరంబులును, నణిమాదిసిద్ధులును, మాయాప్రముఖంబులయిన శక్తులును, మహదాది చతుర్వింశతి తత్వంబులును, గుణక్షోభకాలపరిణామ హేతుసంస్కారకామ కర్మగుణంబులును సేవింప వేదాంతవిదులకయిన నెఱుంగరాని తెఱంగున మెఱయుచుఁ గానబడిన వారలం గనుంగొని.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; తలవాకిట = నోటియందు {తలవాకిలి - తల (ముఖము)నకు వాకిలి (ముందుగుమ్మము), నోరు}; వాణి = సరస్వతీదేవి; కల = కలిగిన; పోడిమి = చక్కదనమున; చేన్ = వలన; వాడిమికెక్కిన = ప్రసిద్ధినొందిన; నలుమొగముల = చతుర్ముఖముల; తక్కరి = టక్కరి; గొంటు =దిట్ట; పెను = గొప్ప; తంట = మాయగాడు; పలువెంటలు = చెదిరినది; ఐన = అయినట్టి; తన = తన యొక్క; మనంబునన్ = మనసు నందు; వితర్కించి = తరచిచూసుకొని; విచారించున్ = ఆలోచించుకొనెడి; ఎడన్ = సమయము నందు; అతండు = అతను; కనుగొనుచుండన్ = చూస్తుండగానే; ఆ = ఆ యొక్క; బాలకులు = పిల్లలు; మేఘ = మేఘములవలె; శ్యాములును = నల్లనివారు; హార = మెడలో హారములు; కుండల = చెవికుండలములు; కిరీట = కిరీటములు; వనమాలికా = పూల ఆకులు కల మాలలచే; అభిరాములును = మనోజ్ఞమైనవారు; శ్రీవత్స = శ్రీవత్స మనెడి మచ్చలతో; మంగళ = శుభప్రదమైన; అంగద = భుజకీర్తులు; నూపుర = కాలిఅందెలు; కనక = బంగారపు; కటక = కడియములు, గాజులు; కంకణ = మురుగులు; కటి = మొలకు; ఘటిత = కట్టిన; కాంచీగణ = మొలనూలులచేతను; ఉద్దాములునున్ = అధికులు; ఆపాదమస్తక = తలనుండి పాదాలవరకు గల; తులసీదళ = తులసీదళములు కూర్చిన; దాములును = దండలు కలవారు; విలసత్ = మెరిసిపోతున్న; అంగుళీయక = ఉంగరముల; స్తోములును = సమూహము కలవారు; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; కమల = కమలపువ్వు; హస్తులును = చేతు లందు కల వారును; చతుః = నాలుగు; భుజ = చేతులతో; ప్రశస్తులును = ప్రసిద్ధినొందిన వారును; పీత = పచ్చని; కౌశేయవాసులును = పట్టుబట్టలు ధరించినవారు; చంద్రికా = వెన్నెలవంటి; ధవళ = స్వచ్ఛమైన; హాసులును = నవ్వులు కలవారు; కరుణా = కృపాతోకూడిన; కటాక్ష = కడకంటి; వీక్షణ = చూపులతో; విలాసులును = విలసిల్లువారు; రవికోటి = కోటిసూర్యుల; భాసులునున్ = తేజస్సు కలవారు; అనంత = శాశ్వతమైన {అనంతము - దేశ కాల వస్తువులచేత భాగింపరానిది}; సచ్చిదానంద = సచ్చిదానందము యొక్క {సత్ - అవస్థాత్రయమున (జాగ్రత్స్వప్న సుషుప్తులందు) చెడని}; రూప = స్వరూపముతో {చిత్ - తత్వజ్ఞానపరితమైన}; మహితులును = గొప్పవారు; అణిమాదిగుణ = అష్టవిభూతులతో {అణిమాది, అష్టవిభూతులు, అష్టైశ్వర్యములు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6 ప్రాకామ్యము 7ఈశత్వము 8వశిత్వము }; ఉపేతులును = కూడినవారు; విజాతీయ = ఇతరజాతి; భేద = తేడాలు; రహితులును = లేనివారు; శ్రీమన్నారాయణ = శ్రీమహావిష్ణువుతో; ప్రతిమాన = సమానమైన; విగ్రహ = ఆకృతే; స్వ = తమ; రూపులున్ = ఆకృతికా కలవారు; ఐ = అయ్యి; తమ = వారల; కున్ = కు; పరతంత్రులు = పరవశము పొందినవారు; అగుచు = ఔతూ; నృత్త = నాట్యము లాడుట; గీత = పాటలు పాడుట; ఆది = మున్నగు; సేవా = కొలుచుట యందలి; విశేషంబులు = విశిష్టతలు; కున్ = అందు; చొచ్చి = లగ్నమై; మెలంగుచున్ = వర్తించుచు; మూర్తిమంతంబులు = ఆకృతి వహించినవి; అయిన = ఐన; బ్రహ్మ = బ్రహ్మదేవునితో; ఆది = మొదలుపెట్టి; చర = చరించ గలిగిన జీవులు; అచరంబులున్ = చరించ లేని జీవులు; అణిమాదిసిద్ధులును = అష్టైశ్వర్యములు; మాయా = పరాశక్తి {మయాదిశక్తులు - 1పరాశక్తి 2ఆదిశక్తి 3జ్ఞానశక్తి 4ఇచ్చాశక్తి 5క్రియాశక్తి, పంచవిధశక్తులు}; ప్రముఖంబులు = మున్నగునవి; అయిన = ఐన; శక్తులును = శక్తులు; మహత్ = మహత్తు, అవ్యక్తము; ఆది = మొదలైన; చతుర్వింశతి = ఇరవైనాలుగు (24) {చతుర్వింశతి తత్వముల టిప్పణికి }; తత్వంబులును = తత్వములు; గుణక్షోభ = అవ్యక్తచలనస్థితి {గుణక్షోభము - స్వభావము యొక్క కలతపాటు, త్రిగుణసమతావస్థ యైన అవ్యక్త చలన స్థితి}; కాల = ప్రజ్ఞాచైతన్యస్థితి {గుణక్షోభము - స్వభావము యొక్క కలతపాటు, త్రిగుణసమతావస్థ యైన అవ్యక్త చలన స్థితి}; పరిణామ = పరిణామస్థితి {పరిణామ - కాలస్థితి మాఱి ప్రపంచ వృత్తితో కూడి అహంకార రూపముగా పరిణమించునట్టి స్థితి}; హేతు = పంచభూతస్థితి {హేతు - ఆ అహంకార వృత్తియే జననకారణముగా గల అపంచీకృత పంచమహాభూత రూపముగా నుండుట}; సంస్కార = విషయస్థితి {సంస్కార - ఆ పంచభూతముల విషయములైన శబ్ద స్పర్శాదులుగా నుండుట}; కామ = అభిలాషస్థితి {కామ - ఆ శబ్దాదు లందు గల రాగద్వేష రూపములైన అభిలాషలు కలిగి ఉండుట}; కర్మ = నడవడి {కర్మ - ఆ అభిలాషలకు తగిన నడవడులు}; గుణంబులు = స్వభావస్థితి {గుణంబులు - ఆ నడవడులకు తగిన స్వభావములు కలిగి ఉండుట}; సేవింపన్ = కొలచుచుండగా; వేదాంతవిదులు = బ్రహ్మజ్ఞానులు {వేదవిదులు - వేదాంతార్థములు తెలిసిన బ్రహ్మవేత్తలు}; కైనన్ = కి అయినను; ఎఱుంగరాని = తెలియబడని; తెఱంగున = విధముగ; మెఱయుచున్ = ప్రకాశించుచు; కానబడిన = కనపడుతున్న; వారలన్ = వారిని; కనుంగొని = చూసి.
భావము:- అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. అతను తన తలవాకిట సరస్వతి ఉన్నదనే అభిమానం వలన కొంత గర్వపడుతూండే వాడు. నాలుగు మొగాలున్న ఆ మహా మాయగాడు జంకి వెనుకకు తగ్గుతూ, తన మనస్సులో ఎన్నోరకాలుగా ఆలోచించి చూసాడు. ఒకసారి బాలుర వంక చూసాడు. అందరూ మేఘశ్యామల మూర్తులూ, హారాలు కుండలాలు కిరీటాలు వైజయంతీమాలికలూ ధరించి చాలా అందంగా ఉన్నారు; వక్షస్థలం పైన శ్రీవత్సం అనే పుట్టుమచ్చ, శుభకరాలైన బాహుపురుషులు, కాలిగజ్జెలు, బంగారు కడియాలు, నడుములకు కాంచీకలాపాలతో కనిపిస్తూ బ్రహ్మదేవుడిని బెదరగొట్టారు; పాదాలనుండి శిరస్సులవరకూ తులసీ దళాల మాలలు ధరించారు; వ్రేళ్ళకు రవ్వల ఉంగరాలు మెరుస్తున్నాయి; అందరికీ నాలుగేసి బాహువులు ఉన్నాయి; నాలుగు చేతులలో శంఖం, గద, చక్రం, పద్మం ధరించి ఉన్నారు; బంగారు పట్టువస్త్రాలు ధరించి ఉన్నారు; వెన్నెలవంటి చల్లని తెల్లని చిరునవ్వులు వెదజల్లుతున్నారు; కన్నుల నుండి కరుణాకటాక్షాలు వెలువడుతున్నాయి; కోటిసూర్యుల కాంతితో వెలిగిపోతున్నారు; సచ్ చిత్ ఆనందాలు తామే అయిన అనంత రూపాలతో విలసిల్లుతున్నారు; అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము అనబడే ఎనిమిది అష్టసిద్ధుల గుణాలూ తమలోనే ధరించి ఉన్నారు; అందరూ అంతర్యామి స్వరూపులే కనుక, ఇది పరాయిది అనే భేదం వారికి లేదు; లక్ష్మీదేవితో కూడిన నారాయణుని ప్రతిబింబా లైన రూపాలతో విలసిల్లుతున్నారు; సృష్టిలో ఉన్న బ్రహ్మ దగ్గర నుండి చరాచర జీవరాశులు; అణిమ మొదలైన సిద్ధులు, మాయ, అహంకారము, బుద్ధి, మనస్సు, పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు మొదలైన ఇరవైనాలుగు తత్వాలు; మూడు గుణముల కలయిక, కాలము, మార్పు, కారణము, సంస్కారము, కామము, కర్మము, వాని గుణాలు ఇవన్నీ రూపాలు ధరించి నృత్యాలు గానాలు మొదలైనవి చేస్తూ ఈ నారాయణ స్వరూపు లైన బాలకులకు లోబడి సేవిస్తూ ఉన్నాయి; వేదాంత మంతా తెలిసినవారికి ఐనా ఈ విశ్వరూపాలు తెలియవు. ఈవిధంగా దేదీప్య మానంగా ప్రకాశిస్తూన్న బాలురను బ్రహ్మదేవుడు చూసాడు. చూసి ఇలా అనుకున్నాడు.

తెభా-10.1-538-ఉ.
"బాలురఁ గంటి నాచెయిది బాసినవారిని మున్ను వారి నేఁ
బోలఁగఁ జూచునంతటన భూరినిరర్గళదుర్గమప్రభా
జాముతోడఁ జూపులకుఁ జాలమిఁ దెచ్చుచు నున్నవార; లే
మూమొ మార్గమెయ్యదియొ? మోసము వచ్చెఁగదే విధాతకున్."

టీక:- బాలురన్ = చిన్నపిల్లలను; కంటిన్ = చూసితిని; నా = నా యొక్క; చెయిది = కృత్యమున; కిన్ = కు; పాసిన = మీరిన; వారిని = వారిని; మున్ను = ఇంతకుముందు; వారిన్ = వాళ్ళను; నేన్ = నేను; పోలగన్ = సరిగా, పోల్చుకొన; చూచున్ = చూసెడి; అంతన = అప్పటికి, సరికి; భూరి = అత్యధికమైన; నిరర్గళ = అడ్డములేని; దుర్గమ = పొందరాని; ప్రభా = కాంతుల; జాలము = సమూహముల; తోడన్ = తోటి; చూపుల్ = చూచుటకు; చాలమి = అశక్తతను; తెచ్చుచున్న = కలిగించుచున్నట్టి; వారలు = వారు; ఏ = ఏమిటి; మూలమొ = కారణమో ఏమో; మార్గము = దారితెన్ను, చేయదగ్గది; ఎయ్యదియొ = ఏదో ఏమిటో; మోసమువచ్చెన్ = మోసము వచ్చినది; కదే = కదా; విధాతకున్ = బ్రహ్మత్వమునకు.
భావము:- “నా చేష్టకు లోబడక తప్పించుకున్న బాలురను ముందు నుంచీ చూస్తూనే ఉన్నాను. వారు చూడగా చూడగా గొప్ప తేజస్సుతో కనపడుతున్నారు. ఆ తేజస్సు మహా ప్రవాహం లాగ చూపులతో నైనా సమీపించడానికి వీలుకాకుండా ఉంది. వారి వర్చస్సు చూడడానికి నా చూపులకు శక్తి చాలటం లేదు. దీనికి అంతటికి మూలకారణం ఏమిటి? ఇప్పుడు నేనేమిటి చేయడం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడను నాకే మోసం వచ్చింది కదా.”

తెభా-10.1-539-వ.
అని సకలేంద్రియంబులకు వెక్కసంబైన స్రుక్కి.
టీక:- అని = అని; సకల = సమస్తమైన (మనసాది) {మనసాది, ఏకదశేంద్రియములు - 1మనస్సు 5జ్ఞానేంద్రియములు 5కర్మేంద్రియములు.}; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; కున్ = కు; వెక్కసంబు = సహింపరానిది; ఐన = కాగా; స్రుక్కి = సంతాపముపొంది.
భావము:- ఆ బాలుర రూపాలు బ్రహ్మదేవుని ఇంద్రియాల అన్నిటికీ భరించరానివి అయిపోయాయి. చూసి చూసి అతడు చేష్టలు దక్కి డస్సి పోయాడు.

తెభా-10.1-540-ఉ.
రమేశు తేజమున నీ సచరాచరమైన లోక ము
ద్ధీపిత మయ్యె నట్టి విభుతేజముఁ గన్నులఁ జక్కఁ జూడఁగా
నోక పారవశ్యమును నొందుచు సంస్తిమితాఖిలేంద్రియుం
డై రమేష్టి మైమఱచె ప్పుడు చిత్రపురూపుకైవడిన్.

టీక:- ఏ = ఏ ఒక్క; పరమ = సర్వోత్కృష్టమైన; ఈశు = దేవుని; తేజమునన్ = తేజస్సుచేత; ఈ = ఈ; సచరాచర = స్థావర జంగ మాత్మక మైన; లోకము = లోకము; ఉద్దీపితము = ప్రకాశింప జేయబడినది; అయ్యెన్ = అయినదో; అట్టి = అటువంటి; విభున్ = ప్రభువు యొక్క {విభుడు - శ్రుతి. నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం, నేమా విద్యుతోభాంతి కుతోయమగ్నిః, తమేవ భాంతిమనుభాతి సర్వం, తస్య సర్వమిదం విభాతి.}; తేజమున్ = తేజస్సును; కన్నులన్ = కళ్ళతో; చక్కన్ = చక్కగా; చూడగాన్ = చూచుటకు; ఓపక = శక్యముగాక; పారవశ్యమును = పరవశత్వమును; ఒందుచున్ = పొందుతు; సంస్తిమిత = పనిచేయలేని {సంస్తిమిత - శబ్దస్పర్శాదివ్యాపారశూన్యములైన, వాటిపని అవి చేయలేని}; అఖిల = సమస్తమైన (మనసాది); ఇంద్రియుండు = ఇంద్రియములు కలవాడు; ఐ = అయ్యి; పరమేష్ఠి = బ్రహ్మదేవుడు {పరమేష్ఠి - శ్రేష్ఠమైన స్థానమగు సత్యలోకమున ఉండువాడు, పరమ (శ్రేష్ఠమైన) ఇష్ఠి (యజ్ఞముచేయువాడు),బ్రహ్మ}; మైమఱచెన్ = స్మృతి తప్పిన వాడయ్యెను; అప్పుడు = ఆ సమయము నందు; చిత్రపు = చిత్తరువు నందలి; రూపు = ఆకృతి, బొమ్మ; కైవడిన్ = వలె.
భావము:- ఈసృష్టి అంతటికి పరముడైన ఈశ్వరుడు విష్ణుమూర్తి. తేజస్సు అనేది అతని నుండే పుట్టినది. దానివలన చరాచరమైన ఈ సృష్టి అంతా రూపొంది కాంతిమంతమై కళ్ళకు కనపడుతోంది. ఆ తేజస్సులో బ్రహ్మదేవుడు ఒక భాగం మాత్రమే కనుక ఆ తేజస్సును బ్రహ్మదేవుడు కన్నులారా చూడలేకపోయాడు. అతడు పరవశించి పోయాడు. అన్ని ఇంద్రియాలూ వ్యాపార శూన్యములు అయిపోయాయి. అప్పుడు బ్రహ్మదేవుడు బొమ్మగీసినట్లు ఒడలు తెలియక నిశ్చేష్టుడయి నిలబడిపోయాడు.

తెభా-10.1-541-వ.
ఇట్లు మాయాతీతుండును, వేదాంత విజ్ఞాన దుర్లభుండును, స్వప్రకాశానందుండునునైన తన బాహుళ్యంబుఁ జూచి నివ్వెఱ పడిన బ్రహ్మంగని యీశ్వరుండు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; మాయా = అవ్యక్తమును {మాయ - అనృత జడ దుఃఖ అనిత్య మలినములే రూపములుగా కలిగిన స్వస్వరూప విస్మృతికి కారణమైన అవ్యక్తము}; అతీతుండును = అతిక్రమించినవాడు; వేదాంత = ఉపనిషదర్థము లందలి; విజ్ఞాన = విశిష్ఠ జ్ఞానము చేతనైనను; దుర్లభుండును = పొందరానివాడు; స్వప్రకాశ = తనంతటతనే వెలిగెడి {స్వప్రకాశుడు - సాధనాంతరము లేక స్వయముగా ప్రకాశించువాడు}; ఆనందుడును = నిరతిశయానందము కలవాడు; ఐన = అయినట్టి; తన = తన యొక్క; బాహుళ్యంబున్ = అతిశయము, విరాడ్రూపము; చూచి = కనుగొని; నివ్వెఱపడిన = నిశ్చేష్టుడైన; బ్రహ్మన్ = బ్రహ్మదేవుని; కని = ఉద్దేశించి; ఈశ్వరుండు = భగవంతుడు, శ్రీకృష్ణుడు.
భావము:- ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడిని చూసాడు. మాయకు అతీతుడు వేదాంతాలు చదివినంత మాత్రాన దొరకని వాడు, తన ప్రకాశములో తాను ఆనందమై ఉన్నవాడు, అయిన పరబ్రహ్మ విశ్వరూపాన్ని చూసి బ్రహ్మదేవుడు నివ్వెరపోవడం గమనించాడు. గమనించి. . .

తెభా-10.1-542-శా.
బాలుండై చతురాననుండు తన యీ బ్రహ్మాభిమానంబునన్
లోలుండై మతిదప్పి నా మహిమ నాలోకింప నేతెంచెఁ దా
నాలోకింపఁగ నెంతవాఁ? డనుచు మాయాజాలమున్ విప్పి త
ల్లీలా రూపము లెల్ల డాఁచె నటఁ గేళీచాతురీధుర్యుఁడై.

టీక:- బాలుండు = తెలివి తక్కువగా కలవాడు; ఐ = అయ్యి; చతురాననుండు = బ్రహ్మదేవుడు {చతురాననుడు - నాలుగు ముఖములు కలవాడు, చతుర్ముఖబ్రహ్మ}; తన = అతనిదై నటువంటి; ఈ = ఈ యొక్క; బ్రహ్మా = బ్రహ్మను అనెడి; అభిమానంబునన్ = అహంకారమునకు; లోలుండు = లొంగిపోయినవాడు; ఐ = అయ్యి; మతి = బుద్ధి; తప్పి = చెడి; నా = నా యొక్క; మహిమన్ = మహాత్మ్యమును; ఆలోకింపన్ = చూచుటకు; ఏతెంచెన్ = వచ్చెను; తాన్ = అతను; ఆలోకింపన్ = చూచుటకు, తెలిసికొనుటకు; ఎంతవాడు = ఎంతటివాడు, అశక్తుడు; అనుచున్ = అని; మాయా = మాయ యొక్క; జాలమున్ = ప్రభావమును (వల); విప్పి = తొలగించి; తత్ = ఆయా; లీలా = మాయ; రూపములు = స్వరూపములు; ఎల్లన్ = అన్నిటిని; డాచెన్ = అణచివేసెను; అటన్ = అక్కడ, అప్పుడు; కేళీ = క్రీడించుట యందు; చాతురీ = నేర్పును; ధుర్యుడు = ధరించినవాడు; ఐ = అయ్యి.
భావము:- “ఈ బ్రహ్మదేవుడు తనకు నాలుగు తలలు ఉన్నాయి అనుకుంటున్నాడు. బాలభావంతో తన ఈ బ్రహ్మపదవిని చూచుకుని అహంకారంలో మునిగిపోయాడు. అజ్ఞానంలో నిమగ్నమైపోయి నా మహిమ ఎంతటిదో చూడాలని వచ్చాడు. ఇంతటి మహామహిమ చూడడానికి అతడు ఎంతో చిన్నవాడు కదా.” అని జాలిపడి భగవంతుడైన బాలకృష్ణుడు తన మాయాజాలాన్ని విప్పివేసాడు. తాను సృష్టించిన లీలారూపాలు అన్నింటినీ అక్కడికక్కడే దాచేసాడు, మాయంచేసేసాడు. ఆటలాడడంలో గానీ ఆడించడంలో గాని ఆయన చాతుర్యం ఊహించరానిది.

తెభా-10.1-543-వ.
అంతలోన నజీవుండు సజీవుండైన తెఱంగున నెనిమిది కన్నులు గల వేల్పుగమికాఁడు తేఱి తెప్పఱి కాలుఁ గేలుఁ గదలించి చెచ్చెరం గన్నులు విచ్చిచూడ సమర్థుండై ముందటఁ గని వెనుకఁ జూచి, దివి విలోకించి దిక్కులు వీక్షించి, యెల్లయెడలం గలయ దర్శించి తన పురోభాగంబున హరి సంచరించుటం జేసి జాతివైరంబు లేని నర పక్షి మృగాదులకు నాటపట్టయి సిరి గలిగి కామ క్రోధాది రహితులకు జీవనంబైన బృందావనంబుఁ బొడగాంచి; యందు.
టీక:- అంతలోనన్ = అంతటితో; అజీవుండు = ప్రాణములు పోయినవాడు; సజీవుండు = బతికున్నవాడు; ఐన = అయిన; తెఱంగునన్ = విధముగ; ఎనిమిది = ఎనిమిది (8); కన్నులు = కళ్ళు; కల = కలిగిన; వేల్పుగమికాడు = బ్రహ్మదేవుడు {వేల్పు గమికాడు - వేల్పు (దేవత)లకు గమికాడు (నాయకుడు), బ్రహ్మ}; తేఱి = తేరుకొని; తెప్పఱి = సంభాళించుకొని; కాలున్ = కాళ్ళు; కేలున్ = చేతులు; కదలించి = ఆడించి; చెచ్చెరన్ = శీఘ్రముగా; కన్నులు = కళ్ళు; విచ్చి = తెరుచుకొని; చూడన్ = చూచుట; సమర్థుండు = చేయగలవాడు; ఐ = అయ్యి; ముందటన్ = ఎదురుగా; కని = చూసి; వెనుకన్ = వెనుకవైపు; చూచి = చూసి; దివిన్ = పైకి; విలోకించి = చూసి; దిక్కులున్ = అన్ని దిక్కులకు; వీక్షించి = చూసి; ఎల్లఎడలన్ = అన్ని వైపులా; కలయన్ = తరచి; దర్శించి = చక్కగా చూసి; తన = అతని; పురోభాగంబున = ఎదుట; హరి = శ్రీకృష్ణుడు {హరి - ప్రళయకాలమున రుద్రరూపముతో సకలజీవులను లయింపజేయువాడు, విష్ణువు}; సంచరించుటన్ = మెలగుట; చేసి = వలన; జాతి = జాతుల మధ్య ఉండు; వైరంబు = శత్రుత్వములు; లేని = లేనట్టి; నర = మానవులు; పక్షి = పక్షులు; మృగ = జంతువుల; కున్ = కు; ఆటపట్టు = నివాసము; అయి = ఐ; సిరి = శాంతి యనెడి సంపద; కలిగి = కలిగి; కామక్రోధాది = అరిషడ్వర్గములు {అరిషడ్వర్గములు - 1కామము 2క్రోధము 3లోభము 4మోహము 5మదము 6మాత్సర్యము}; రహితుల్ = లేనివారల; కున్ = కు; జీవనంబు = జీవనాధారము; ఐన = అయినట్టి; బృందావనంబున్ = బృందావనమును; పొడగాంచి = చూచి; అందు = దానిలో.
భావము:- ఇంతలో అంతటి ఎనిమిది కన్నులున్న దేవతల పెద్ద బ్రహ్మదేవుడూ, మృతిచెందినవాడు బ్రతికి వచ్చినట్లు, తేరుకుని తెప్పరిల్లాడు. కాళ్లు చేతులు కదలించి చూసుకున్నాడు. తరువాత కళ్ళు విప్పి చూడడానికి శక్తి వచ్చింది. ముందు వైపు వెనుక వైపు చూసుకున్నాడు. తలపైకెత్తి చూసుకున్నాడు. అన్ని దిక్కులకూ చూసాడు. అప్పుడు అన్ని చోట్ల పరిశీలనగా చూసాడు. ఎదుట బృందావనం కనిపించింది. కృష్ణుడు ఉండడం వలన నరులు, పక్షులు, జంతువులు, తమ తమ జాతి సహజమైన శత్రుత్వాలను మరచి తిరుగుతూ ఉండడం గమనించాడు. ఆ బృందావనంలో సిరి సంపదలు ఉన్నాయి. అందులో ఉన్న వారెవరికి కామక్రోధాలు లేవు. ఆ బృందావనం చూసాడు బ్రహ్మదేవుడు.

తెభా-10.1-544-సీ.
న కన్యములు లేక నరారి ముమ్మూల-
విభుడయ్యుఁ గ్రేపుల వెదకువాని
ఖిలజ్ఞుఁడై యొక్కఁయ్యు నజ్ఞాకృతిఁ-
జెలికాండ్రఁ బెక్కండ్రఁ జీరువాని
హిరంతరాద్యంత భావశూన్యుండయ్యు-
నంతంత నడుగు చొప్పరయువాని
గురుగభీరుండయ్యుఁ గురువులు వాఱుచు-
ట్టిట్టు పాతరలాడువాని

తెభా-10.1-544.1-ఆ.
జాతిరహితుఁ డయ్యుఁ తుర గోపార్భక
భావ మెల్ల నచ్చుడిన మేటి
చెలువువాని హస్త శీతాన్నకబళంబు
వానిఁ గాంచె నపుడు వాణిమగఁడు.

టీక:- తన = అతని; కిన్ = కి; అన్యములు = ఇతరములు; లేక = ఏవియులేక; తనరారి = ఒప్పి; ముమ్మూల = ఆదిమూలకారణుడైన; విభుడు = ప్రభువు; అయ్యున్ = అయినప్పటికి; క్రేపులన్ = దూడలను; వెదకు = అన్వేషించెడి; వానిన్ = అతనిని; అఖిల = సమస్తము; జ్ఞుడు = తెలిసినవాడు; ఐ = అయ్యి; ఒక్కడు = అద్వితీయుడు; అయ్యున్ = అయినప్పటికి; అజ్ఞాకృతిన్ = తెలివిలేనివానివలె; చెలికాండ్రన్ = స్నేహితులను; పెక్కండ్రన్ = అనేకమందిని; చీరు = పిలిచెడి; వానిన్ = వానిని; బహిర్ = వెలుపల; అంతర = లోపల; ఆది = మొదలు; అంత = చివర, తుద అనెడి; భావ = భావమునకుకూడ; శూన్యుండు = లేనివాడు; అయ్యున్ = అయినప్పటికి; అంతంతన్ = అక్కడక్కడ; అడుగు = అడుగుల; చొప్పు = జాడను; అరయు = వెదకెడి; వానిన్ = అతనిని; గురు = మిక్కిలి; గభీరుండు = గాంభీర్యము కలవాడు; అయ్యున్ = అయినప్పటికి; గురువులువాఱుచున్ = వేగముగా పరుగెడుతు; అట్టిట్టు = అటునిటు; పాతరలాడు = నటించెడి; వానిన్ = వానిని.
జాతి = జాతిభేదములు; రహితుడు = లేనివాడు; అయ్యున్ = అయినప్పటికి; చతుర = నేర్పుగల; గోప = యాదవ; అర్భక = పిల్లల; భావము = స్వభావము; ఎల్లన్ = అంతటిని; అచ్చుపడిన = ప్రతిరూపుగా పొందిన; మేటి = అధికుడైన; చెలువు = దేహసౌందర్యము కల; వానిన్ = వానిని; హస్త = చేతి యందు; శీత = చద్ది; అన్న = అన్నపు; కబళంబు = ముద్ద కలిగిన; వానిన్ = వానిని; కాంచెను = చూసెను; అపుడు = ఆ సమయము నందు; వాణిమగడు = బ్రహ్మదేవుడు.
భావము:- పిమ్మట, సృష్టికి మూలము లైన త్రిగుణాలకూ ఆధారమూ, ప్రభువూ అయినవాడు; తనకు తాను ఒక్కడే అయినా, లేగల కోసం చూస్తూ వెతుకుతున్నాడు కృష్ణుడు. సర్వం తెలిసినవాడు తాను ఒక్కడే అయి సత్యం తానే అయినవా డైనా, ఎందరో స్నేహితులు ఉన్నట్లు పిలుస్తూ ఉన్నాడు. బయట లోపల మొదలు తుద అనే భావాలేవీ లేనివా డైనా, అక్కడక్కడా దూడల జాడలు వెదుకుతూ ఉన్నాడు, ఎంతో లోతైనవాడైనా, పరుగులు తీస్తూ ఇటూ అటూ చూస్తూ అడుగులు వేస్తున్నాడు, అతనికి జాతి అనేది లేదు అయినా, నేర్పరి అయిన గోపబాలుని లక్షణాలన్నీ చక్కగా అచ్చుపోసినట్లు ఉన్న శరీరంతో అందంగా వెలుగొందుతూ ఉన్నాడు. చేతిలో చల్ది అన్నపు ముద్ద పట్టుకుని ఉన్నాడు. ఇలా సర్వ లక్షణాలు మేళవించిన కృష్ణుని కేవలం వాక్కుకు మాత్రమే అధిపతియైన బ్రహ్మదేవుడు చూసాడు.

తెభా-10.1-545-వ.
కని సంభ్రమించి విరించి రాయంచ డిగ్గనుఱికి కనకదండ సుకుమారంబైన శరీరముతోడ నేలఁ జాగిలంబడి మణిగణ సుప్రకాశంబు లైన తన కిరీటశిఖరప్రదేశంబు లా కుమారుని పాదపద్మంబులు మోవ మ్రొక్కి తోరంబులగు నానందబాష్పజల పూరంబుల నతని యడుగులు గడిగి మఱియును.
టీక:- కని = చూసి; సంభ్రమించి = హుషారుచెంది; విరించి = బ్రహ్మదేవుడు; రాయంచన్ = హంస వాహనమునుండి; డిగ్గనుఱికి = దుమికి దిగి; కనక = బంగారపు; దండ = కడ్డీవలె మెరిసెడి; సుకుమారంబు = కోమలము; ఐన = అయినట్టి; శరీరము = దేహము; తోడన్ = తోటి; నేలన్ = భూమిపైన; సాగిలపడి = సాష్టాంగనమస్కారము చేసి; మణి = రత్నాల; గణ = సమూహములచే; సు = మంచి; ప్రకాశంబులు = మెరిసిపోయెడివి; ఐన = అయిన; తన = అతని యొక్క; కిరీట = కిరీటముల; శిఖర = పైవైపుకొనల; ప్రదేశంబులు = భాగములు; ఆ = ఆ యొక్క; కుమారుని = బాలుని; పాద = పాదములు అనెడి; పద్మంబులు = పద్మములు; మోవన్ = తాకునట్లుగ; మ్రొక్కి = నమస్కరించి; తోరంబులు = అధికములు; అగు = ఐన; ఆనంద = ఆనందమువలన కలిగిన; బాష్పజల = కన్నీటి; పూరంబులన్ = ప్రవాహములచే; అతని = అతని; అడుగులు = అడుగులను; కడిగి = కడిగి; మఱియును = ఇంకను.
భావము:- కృష్ణుడిని చూసి చూడగానే బ్రహ్మదేవుడు తత్తరపాటుతో హంసవాహనం నుండి దభాలున క్రిందికి దూకాడు. బంగారు శలాకు వలె రంగులీనుతూ ఉండి సుకుమారంగా ఉన్న తన శరీరంతో నేలపై సాగిలపడ్డాడు. ఎన్నోమణులతో వెలుగుతున్న తన కిరీటాలు కృష్ణుని పాదపద్మాలకు తాకేలాగ మ్రొక్కేడు. ఆనందబాష్పాలు ధారలుగా కారుతూ ఉండగా అతని పాదాలు కడిగాడు. ఆపైన. . .

తెభా-10.1-546-క.
డుగులపైఁ బడు లేచున్
డుఁ గ్రమ్మఱఁ లేచు, నిట్లు క్తిన్ మును దాఁ
బొగనిన పెంపుఁ దలఁచుచు
దుడుకని మహిమాబ్ధి నజుఁడు దుడు కడఁచె నృపా!

టీక:- అడుగుల = పాదముల; పైన్ = మీద; పడున్ = వాలిపడును; లేచున్ = పైకిలేచును; పడున్ = వాలిపడును; క్రమ్మఱన్ = మరల; లేచున్ = పైకిలేచును; ఇట్లు = ఈ విధముగ; భక్తిన్ = భక్తితో; మునున్ = ఇంతకుముందు; తాన్ = అతను; పొడగనిన = చూసినట్టి; పెంపున్ = అతిశయమును; తలచుచున్ = గుర్తుచేసుకొనుచు; దుడుకని = ఉధృతికలవాని (కృష్ణుని); మహిమ = ప్రభావము అనెడి; అబ్ధిన్ = సముద్రము నందు; అజుడు = బ్రహ్మదేవుడు; దుడుకు = ఉధృతిని (తన); అడచెన్ = అణచివేసెను; నృపా = రాజా.
భావము:- పరవశత్వంతో బ్రహ్మదేవుడు కృష్ణుడి పాదాలపై అనేక సార్లు పడుతూ లేస్తూ ప్రణమిల్లాడు. భక్తిపరవశుడై ఇంతకు ముందు తాను చూసిన విశ్వరూపం తలచుకుని ఆ బాలుని మహిమ అనే మహాసముద్రంలో మునిగిపోయాడు.

తెభా-10.1-547-వ.
అంత నల్లనల్లన లేచి నిలుచుండి నయనారవిందంబులు దెఱచి, గోవిందుని సందర్శించి చతుర్ముఖుండు ముఖంబులు వంచి కృతాంజలియై దిగ్గన డగ్గుత్తిక యిడుచు నేకచిత్తంబున జతుర్ముఖంబుల నిట్లని స్తుతియించె.
టీక:- అంతన్ = అప్పుడు; అల్లనల్లనన్ = మెల్లగా; లేచి = పైకిలేచి; నిలుచుండి = నిలబడి; నయన = కన్నులు అనెడి; అరవిందంబులున్ = పద్మములను; తెఱచి = తెరచుకొని; గోవిందునిన్ = శ్రీకృష్ణుని; సందర్శించి = చక్కగా చూసి; చతుర్ముఖుండు = బ్రహ్మదేవుడు {చతుర్ముఖుడు - నాలుగు ముఖములవాడు, బ్రహ్మ}; ముఖంబులున్ = మోములను; వంచి = వాల్చి; కృత = చేయబడిన; అంజలి = ముడిచిన చేతులు కలవాడు; ఐ = అయ్యి; దిగ్గనన్ = తటాలున; డగ్గుతిక = గద్గదస్వరము; ఇడికొనుచు = పెట్టుకొని; ఏక = అచంచలమైన; చిత్తంబునన్ = మనసుతో; చతః = నాలుగు; ముఖంబులన్ = మోములతోను; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతియించె = స్తోత్రములు చేసెను.
భావము:- తరువాత, బ్రహ్మదేవుడు నెమ్మదిగా లేచి నిలబడి కళ్ళు తెరచి గోవులను కాస్తున్న గోవిందుని దర్శనం చేసుకున్నాడు. తన ముఖాలు నాలుగూ వంచి చేతులు జోడించి డగ్గుత్తిక పడిన గొంతుతో ఏకాగ్రమైన మనస్సుతో నాలుగు నోరులారా ఇలా స్తుతించాడు.