పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/బృందావనము బోవ తలచుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెభా-10.1-423-ఉ.
"క్కడ నుందురే మనుజు? లీ మన కృష్ణున కెగ్గు చేయఁగా
క్కసురాలు చ న్నొసఁగె; ఱాలపయిన్ సుడిగాలి వీచెఁ; బై
గ్రిక్కిఱియం దరుల్ వడియెఁ; గేశవు సత్కృపఁ దప్పెఁ; జాలు నేఁ
డెక్కడి కైనఁ బోవలయు నిం కిట గోపకులార! వింటిరే?

టీక:- ఇక్కడన్ = ఇలాంటిచోట; ఉందురే = ఉంటారా; మనుజులు = మానవులు ఎవరైనా; ఈ = ఈ; మన = మన యొక్క; కృష్ణున్ = బాలకృష్ణుని; కిన్ = కి; ఎగ్గు = కీడు; చేయగాన్ = చేయుటకు; రక్కసురాలు = రాక్షసి; చన్ను = చనుబాలు; ఒసగెన్ = ఇచ్చెను; ఱాల = బండరాళ్ళ; పయిన్ = మీద; సుడిగాలి = సుడిగాలి; వీచెన్ = వీచినది; పైన్ = అంతేకాక; కిక్కిరియన్ = మిక్కిలి దగ్గరగా, ఇరుకుగా; తరుల్ = చెట్లు; పడియెన్ = పడిపోయినవి; కేశవున్ = నారాయణుని; సత్కృపన్ = మిక్కిలి దయ వలన, చక్కటి కరుణ వలన; తప్పెన్ = తప్పినవి; చాలున్ = చాలును ఇంక; నేడు = ఇప్పుడు; ఎక్కడ = మరింకొక ప్రాంతమున; కిన్ = కు; పోవలయున్ = వెళ్ళిపోవాలి; ఇంకన్ = ఇంక; ఇట = ఇక్కడనుంచి; గోపకులార = గొల్లలలారా; వింటిరే = విన్నారా (నా మాట).
భావము:- “మనుష్యులు ఉండే ప్రదేశమా ఇది. మన ఈ చిన్నికృష్ణుడికి అపకారం చేద్దామని ఒక రాక్షసి చనుబాలు ఇచ్చింది; కొండరాళ్ళ మీదకి సుడిగాలి వీచింది; దట్టమైన చెట్లు వాడి మీద పడిపోయాయి. అన్ని అపాయాలూ శ్రీహరి దయవలన తప్పిపోయాయి. ఇంక చాలు ఇప్పటికైనా మరో క్షేమకరమైన ప్రదేశానికి వెళ్ళిపోవడం మంచిది. వింటున్నారా!

తెభా-10.1-424-క.
వు గల దిరవు పసులకు
దద్రి నదీ మహీజ తికావళిఁ బెం
పెసఁగును, గాపురమునకును
బొసఁగును బృందావనంబు పొదఁ డచ్చటికిన్."

టీక:- కసవు = గడ్డి; కలది = ఉన్నట్టి; ఇరవు = చోటు; పసులకు = పశువులకు; లసత్ = చక్కటి, ప్రకాశవంతమైన; అద్రి = కొండలు; నదీ = నదులు; మహీజ = వృక్షములు; లతికా = తీగల; ఆవళిన్ = సమూహములతో; పెంపు = సమృద్ధితో; ఎసగున్ = అతిశయించును; కాపురమున్ = సంసారములు చేయుట; కును = కు; పొసగును = తగి ఉండును; బృందావనంబు = బృందావనము; పొదడు = పదండి పోదాము; అచ్చటి = అక్కడ; కిన్ = కు.
భావము:- అక్కడ బృందావనం అనే ప్రదేశం ఉంది. అక్కడ పశువులకు మేత పుష్కలంగా లభిస్తుంది. అక్కడ విహరించడానికి చక్కని పర్వతాలు నదులూ చెట్లు తీగెలు కలిగి ఎంతో అందంగా ఉంటుంది. అక్కడకి వెళ్ళిపోదాం పదండి.”